‘దేవుడమ్మ’ కథని ఈ సంపుటికి శీర్షికగా ఎంచుకున్నారు. ఈ కథ నేపధ్యం గురించి తెలియజేయండి.
నేను రాసిన మొదటి కథ ‘దేవుడమ్మ‘ . ‘సారంగ’ లోనే 2013 లో పబ్లిష్ అయ్యింది. పల్లెటూళ్లలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికే దెయ్యాలు పట్టడం, దేవుడొచ్చి పూనకాలు రావడం చూశాను. వాళ్లను చూసి చాలా భయపడేదాన్ని చిన్నప్పుడు. తర్వాత దాని వెనుకనున్న కారణాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. వారు మానసికంగా బలహీనంగా వుండటమే కారణమవి అర్థం అయ్యింది. విపరీతమైన అణచివేత వల్ల వారి భావాలను బయటకు ప్రకటించడం కోసం ఎంచుకునే మార్గం దెయ్యం పట్టినట్లు లేదా దేవుడొచ్చినట్టు ప్రవర్తించడం. అదొక మానసిక వ్యాధిగా పరివర్తన చెందుతుంది. అత్త వేధింపులు, భర్త నిర్లక్ష్యాన్ని భరించలేని వొక పల్లెటూరి బ్రతుకనేర్చిన కోడలు వాటినుంచి బయటపడటం కోసం తెలివిగా దేవుడమ్మగా అవతారం ఎత్తడం స్థూలంగా దేవుడమ్మ కథ. జీవితం ఎప్పుడూ పోరాటమే. నిన్ను నీవుగా నిలుపుకోవడం కోసం చేసే పోరాటం. దేవుడమ్మ కథలోని థీమ్ అంతర్లీనంగా నేను రాసిన చాలా కథల్లో వుంటుంది. అందుకే అది నా పుస్తకం శీర్షికైంది. చాలామంది జీవితాలపై ప్రభావం చూపిన కథ “దేవుడమ్మ”. ఈ కథ సారంగలో రావడం, అదే పేరుతో నా మొదటి కథా సంపుటి రావడం, ఇప్పుడీ ఇంటర్వ్యూ కూడా మొదటగా సారంగ లోనే రావడం చాలా బావుంది.
మూవ్ – ఆన్ కథలో ‘ప్రవీ’ పాత్ర ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
ఆడవారి జీవితాన్ని తమ అదుపులో వుంచుకోవడానికి పురుష ప్రపంచం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటుంది. ఆడవారి చుట్టూ తిరిగే రాజకీయాలు జాగ్రత్తగా గమనిస్తే వారిని చేతకాని వారిగా, బలహీనులు గా చూపే ప్రయత్నం నిరంతరం జరుగుతుందని అర్థమవుతుంది. ఆధునిక ప్రపంచంలో డేటింగ్ లు, లివిన్ రిలేషన్ షిప్స్ సర్వసాధారణం అయిపోయాయి.  ఈ టెంపరరీ రిలేషన్ షిప్స్ లో కూడా పార్ట్ నర్ చేతుల్లో హింసకు, దోపిడీకి గురవుతూ స్త్రీలు మౌనంగానే వుండిపోతున్నారు. ఈ బంధాల్లోంచి సులభంగా బయటపడే అవకాశం వున్నప్పటికీ సమాజం ఆమోదించదేమో అన్న సంశయంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు మనం చూస్తూనే వున్నాం. ఎవరి జీవితాన్ని వారు స్వేచ్ఛగా అనుభవించే అవకాశం ప్రతి వొక్కరికీ వుండాలి. ఎబ్యూసివ్, నార్సిసిస్టిక్ పర్సనాలిటీల నుంచి తమను తాము కాపాడుకునే ధైర్యం ప్రతి వొక్కరికీ రావాలి.  మన అభిప్రాయాలను గౌరవించని వారితో సమాజం కోసం రాజీపడి బ్రతకాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్లకు బాయ్ ఫ్రెండుతో  బ్రేకప్ అయితే దానికి కారణాలు తెలుసుకోకుండా తిరుగుబోతుగా ముద్ర వేసేయడం సమాజానికి అలవాటు. మూవ్ ఆన్ కథలో ప్రవీ పాత్ర మొదట్లో అందరి ఆడపిల్లల్లాగే చాలా సున్నితంగానే వుంటుంది. ఆమె జీవితంలోకి ప్రవేశించిన వొక్కో పురుషుడు వొక్కోరకంగా ఆమెను వేధింపులకు గురి చేశాక తప్పనిసరై తిరగబడుతుంది. కృంగి పోకుండా ధృఢంగా నిలబడుతుంది. ఒక రిలేషన్ షిప్ నుంచి బయటకొస్తే సమాజం ఆడవాళ్లను చులకనగా చూస్తుంది. అది ప్రేమ కావొచ్చు. పెళ్లి కావొచ్చు. ఒక అబ్యూసివ్ రిలేషన్ షిప్ నుంచి బయటికొచ్చి అలాంటిదే మరో బంధం లో ఇరుక్కుని బయటకు రాలేక విలవిల లాడుతున్న కొందరు మహిళలు నాకు తెలుసు. దాన్నుంచి కూడా బయటకొచ్చేస్తే  అందరూ తమ క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడుతారన్న భయంతో మానసికంగా కృంగి పోతున్న అమ్మాయిలు చాలామంది వున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడమని,  స్వేచ్ఛ , సమానత్వం, గౌరవం లేని చోట మాత్రం ఖచ్చితంగా వుండవద్దని చెప్పడమే నా లక్ష్యం. ఇతరుల వ్యక్తిత్వాన్ని జడ్జ్ చెయ్యకుంటే చాలు కదా! అందరూ హాయిగా బ్రతికేయొచ్చు.
ఒక వైపు ‘ఏకపర్ణిక’ రాశారు. దానితో పాటే ‘నీరు గట్టోడు’, ‘పారడాక్స్’ రాశారు. ఈ విభిన్నమైన కధలను ఎంచుకుని రాయడానికి మీరు చేసిన కృషి, శ్రమ గురించి చెప్పండి.
మూడూ భిన్నమైన కథా నేపథ్యాలు. ‘ఏకపర్ణిక’ వొక చారిత్రక కల్పిత కథ. సాయి పాపినేని గారు నిర్వహించిన ‘కాలయంత్రం’ వర్క్ షాప్ కు వెళ్లొచ్చిన తర్వాత రాసిన కథ. చాలా పరిశోధన, అనేకసార్లు రీరైట్ చేసిన తర్వాత వొక రూపుకొచ్చిన కథ. ‘నీరుగట్టోడు’ వొక అమాయకపు పల్లెటూరి వ్యక్తి వ్యధ. సమాజం తో ఎంతైనా పోరాడటానికి సిద్దపడ్డ నీరుగట్టోడు కుటుంబం దగ్గరకొచ్చేసరికి ఎలా మౌనంగా వుండిపోయాడో తెలిపే కథ. ‘పారడాక్స్’ అర్బన్ లైఫ్ ప్రేమకథ. ప్రతి సంఘటన వెనుక మనం అర్థం చేసుకోలేని ఇంకేదో వాస్తవం వుంటుందని చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఈ కథలు రాయడానికి నన్ను నేరుగా ప్రభావితం చేసిన అంశాలు చాలా వున్నాయి. ముూస పోసినట్టు వొకే రకమైన కథలు రాయడం నాకు ఇష్టం ఉండదు. నేను రాసిన కథలన్నీ వొకేలా వుంటాయనే భావన నా కథలు చదివిన వారికి కలిగించ కూడదని కోరుకుంటాను. అందుకే భిన్నమైన కథలను, భిన్న నేపథ్యాల నుంచి రాస్తున్నాను. జీవితాన్ని అనేక కోణాల్లోఎక్స్ ప్లోర్ చేసే అవకాశం నాకు లభించింది. వొక జర్నలిస్టు గా, ట్రావెల్ ఫోటోగ్రాఫర్ గా అన్నిరకాల జీవితాలను దగ్గర నుంచి చూడటం నా కథల్లో భిన్నత్వానికి కారణం కావొచ్చు. అలాగే కొన్ని కథా సంకలనాల్లో ఎంచుకున్న థీమ్ ను బట్టి వాటికి సరిపోయే కథలు రాయడం వల్ల కూడా దేవుడమ్మ కథా సంపుటి లో భిన్నమైన కథలు వున్నాయి.
మాండలికంవల్ల కొందరు పాఠకులకి రచన అందడం లేదు అనే అంశం మీద మీ అభిప్రాయం?
మాండలికం చాలా సొగసైంది. కొన్ని కథలు మాండలికంలో రాస్తేనే వాటికి న్యాయం చేసిన వారవుతాం. మాండలికంలో రాయడానికి నన్ను ప్రభావితం చేసిన రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు. నామిని కథలు చదవనంత వరకూ ఏదో రాయాలనిపించినా రాయలేక, భాష సరిపోక చాలా మధన పడేదాన్ని. ఒక్కసారి మాండలికం రుచి తెలిశాక ఇక దాన్ని వదలాలని అనిపించలేదు. మాండలికం లో రాసేవారికి భాష సరిగ్గా రాదని, తెలుగు చదివే వారే కరువైపోతుంటే మాండలికంలో రాసి కొత్త జనరేషన్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని చాలా విమర్శలు కూడా వచ్చాయి.
దేవుడమ్మ కథా సంపుటిలో సగం కథలు చిత్తూరు మాండలికంలో రాసినవే వున్నాయి. నా మనసుకు దగ్గరగా వుండే భాష కావడం, కథల నేపథ్యం అలాంటివి. ‘దేవుడమ్మ‘ కధ తర్వాత నేను రాసిన రెండో కథ “సావు” కూడా చిత్తూరు మాండలికం లో రాసిందే. తెలంగాణా పత్రికలో ప్రచురితమైనప్పటికీ చాలా ప్రశంసలు వొచ్చాయి. మంచి కథ రాసినప్పుడు అది మాండలికం లో వుందా? లేదా అందరికీ అర్థమయ్యే రీతిలో తటస్థ భాషలో వుందా అన్నది పట్టింపు కాదని అప్పుడే నాకు అర్థమైంది. సాహిత్యాన్ని ప్రేమించేవారు భాష నేర్చుకునైనా చదువుకుంటారు.
కవితలు, కధలు ప్రక్రియలలో ఏది సులువు? నవలలు రాసే ఆలోచన వుందా?
ఏదీ సులువు కాదు. కథ చెప్పాలన్నా, కవిత్వం రాయాలన్నా భావ వ్యక్తీకరణ, సృజనాత్మకత, తగిన భాష, శిల్పం ఇవన్నీ ముఖ్యం. ఒక స్థాయి వరకు రాయడానికి ఇవేవీ అడ్డంకి కాకపోవచ్చు. కానీ ఉత్తమ సాహిత్యాన్ని అందించాలంటే మాత్రం నిరంతర అధ్యయనం చెయ్యాల్సిందే. మనచుట్టూ వున్న సామాజిక స్థితిగతులను వొక కంట కనిపెడుతూ వుండాలి. సమకాలీన కథ, కవిత్వ పోకడలను పరిశీలించాలి. Practice makes a person perfect అంటారు కదా! కవులు, రచయితలు చదువుతూ, వ్రాస్తూ ఎప్పటికీ నిరంతర విద్యార్థిలా వుండాల్సిందే.
నవల రాయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఐదారేళ్లుగా నవల రాయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించుకుంటున్నాను. ఒక ఒంటరి మహిళ ఇతివృత్తం. నేను ఖచ్చితంగా చెప్పాల్సిన కథ. త్వరలోనే ప్రారంభిస్తాను. అయితే వొకప్పుడు జర్నలిస్టుగా పనిచెయ్యడం వల్ల కథలే ఎక్కువ నిడివితో రాయలేను. ఇక నవల ఎలా రాస్తానో చూడాలి.
*

        		 
        	






Thank you Anil Atluri gaaru and Saranga 🙏🏻🙏🏻💐💐
చాలా సూటిగా ఉన్న పరిచయం.. మాండలీకంలో కథ రాయటం నుంచి, స్త్రీలు ఎదుర్కొనే సమస్యల వరకు అనేక అంశాలను ప్రస్తావించారు రచయిత్రి ఝాన్సీ పపుదేశి.. అలాగే అనిల్ అట్లూరి ఉపోద్ఘాతాలు లేకుండా అడిగారు
Congratulations Jhansi for the success of this amazing book and thank you Anil Garu for this insightful conversation.
ఝాన్సీ గారి కథల్లాగే ఏ శషభిషల్లేకుండా ఇంటర్వ్యూ సూటిగా ఉంది. తను అనుకున్నది మొహమాటం లేకుండా చెప్పారనిపిస్తుంది.
ఈనాడు స్త్రీలు చర్చించాల్సిన విషయాన్ని మరింత variations తో విపులంగా కథా రూపాన్ని ఇవ్వడం , పాత్రలు కేవలం అస్తిపంజరాలుగా కాకుండా రక్త మాంసాలున్న వ్యక్తులుగా అగుపడడం , చదివించే గుణం ఉండటం ముఖ్యం. అదంతా రచయిత్రి కథల్లో ఉంది. ఆవిడ రాసిన నవల కోసం ఎదురుచూస్తాను.
అభినందనలు. – ఎ ఎన్., బెంగుళూరు.
ప్రశ్న అడగడం ఓ కళ
సూటిగా స్పష్టంగా సమాధానం ఇవ్వడం ఓ సాహసం
ఈ రెండూ కనిపించాయి ఇందులో
వెరసి అర్థవంతమైన చర్చ