సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు
సారంగ
సంచిక: 15 నవంబర్ 2018

భిన్న కోణాల దర్పణం కథ 2017

చందు తులసి

కథ-2017 ఆవిష్కరణ సందర్భంగా కథకులకు శుభాకాంక్షలు

       27 సంవత్సరాలుగా వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ల ఆధ్వర్యంలోని “కథా సాహితి” సంస్థ ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉత్తమ కథల సంకలనాలు  వెలువరిస్తున్న సంగతి తెలుగు పాఠకులకు తెలిసిందే. ఇందులో భాగంగా 28 వ సంకలనం, కథ-2017 ఆవిష్కరణ ఈ ఆదివారం (25-11-2018) శ్రీకాకుళంలో జరగనుంది. మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పల్నాయుడు 2017 కథా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర రచయితలు, కవుల వేదిక(ఉరకవే) ఆధ్వర్యంలో నిర్వహణలో, కథాలయం నీడన ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ సందర్భంగా ఈ కథా సంకలనానికి ఎంపికైన రచయితలకు సారంగ అభినందనలు తెలియజేస్తోంది. తమ కథల వెనక నేపథ్యం పంచుకోవాల్సిందిగా కోరగా ఆయా కథకులు తమ “కథల వెనక కథను” సారంగ పాఠకుల కోసం అందించారు.

***

 సత్యవతి   ( కథ- ఇట్లు మీ స్వర్ణ)

ఆ గట్టుకీ ఈ గట్టుకీ మధ్య అఘాతం పెరిగిపోతున్న వేళ ఇవతలి గట్టు మీదున్న యువతుల భవిష్యత్తు మీద బెంగ ఈ కథకి మూలం ..చదువు కొనుక్కోలేని వైద్యం కొనుక్కోలేని” అందం” కొనుక్కోలేని ఈ పదహారు ఇరవై ఏళ్ల మధ్య పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చెయ్యవలసిన దుస్థితి  ఆ కుటుంబాల స్థాయి ఏ మాత్రం పెరగలేని పరిస్థితి  రెండు గట్లకీ మధ్య అఘాతాన్ని పూడ్చలేని పరిస్థితి కళ్ళకి కడుతూ వుంటుంది . ఈ పిల్లలు చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి కుటుంబ ఆర్ధిక పరిస్థితిని ఒక మెట్టు అయినా పెంచలేని పరిస్థితిని కల్పిస్తున్న వ్యవస్థ .

అటు పక్క జీవితపు ధగ ధగలు, మార్కెట్ లోకి వచ్చి పడుతున్న కొత్త వస్తువులు , తండ్రుల తాగుడు, తల్లుల భుజాల మీద మొత్తం కుటుంబ భారం….ఇదంతా చూస్తున్నప్పుడు , ఇటువంటి స్వర్ణలు బట్టల షాపుల్లో సూపర్ మార్కెట్లలో  ఇళ్ళల్లో  హాస్పిటల్స్ లో తక్కువ అర్హతలతో తక్కువ జీతాలతో కళ్ళ ఎదుట కనిపిస్తున్నప్పుడు ఆవేదన తో వ్రాసిన కథ .

చదువు కొనుక్కుని, వైద్యం కొనుక్కుని,  “అందం ” కొనుక్కుని బ్రతికే శక్తి వీళ్ళకి ఎప్పుడు రావాలి ? లేదా అవేవీ అంత ఖరీదు పెట్టి కొనుక్కో వలసిన అవసరం లేని వ్యవస్థ ఒకటి ఎప్పటికైనా వస్తుందని ఆశ పెట్టుకోవచ్చా?  లేదా పూజల మీద భక్తీ మీద ఆధారపడి వచ్చే జన్మ కైనా సాధించ వచ్చా?    అని స్వర్ణ అడుగుతోంది.

 

***

మధురాంతకం నరేంద్ర  (అమర్ కథ )

సాధారణంగా నేను రాసేటపుడు నేను దానిని సహజంగా వదిలేస్తాను. కావాలని పరిమితులు విధించను. అలా నేను రాసిన ఈ కథ నిడివి చాలా పెద్దదయింది. ఈ రోజుల్లో పెద్దకథల ప్రచురణ చాలా కష్టం. నేను  18 వయసులో 72 లో కథలు రాయడం మొదలు పెట్టాను. అప్పుడు చాలా పెద్ద కథలు రాసేవాడిని. అవి అచ్చయ్యేవి.  ఇప్పుడు పెద్దకథలు ఎవరూ వేసుకోవడం లేదు. కథ రాయడం కన్నా కథను పాఠకుల దగ్గరకు చేర్చడం రచయితలకు చాలా కష్టమైపోయింది. అలా అనేక ప్రయత్నాలు చేశాక చివరకు ఈ కథను విశాలాంధ్ర వాళ్లు ప్రచురించారు. అలాగని ఈ కథ అంత పెద్దకథ కూడా కాదు. ఈ కాలానికి పెద్దకథ అంటున్నాం కానీ…ఒకప్పుడు బుచ్చిబాబు రాసిన కథలతో పోలిస్తే వాటిలో పదో వంతు కూడా ఉండదు. బుచ్చిబాబు వంద పేజీల కథలు కూడా రాశాడు. కథలు బోన్సాయ్ వృక్షాలుగా తయారుచేయబడుతున్న కాలంలో నేను ఈ కథ రాశాను.

“అమర్ కథ” అమరనాథ్ గుహ యాత్ర నేపథ్యంలో సాగే కథ. అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ అమర్ నాథ్ వెళ్లే హిందూ యాత్రికుల అనుభవాలే ఈ కథకు ప్రేరణ. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సంఘటనులు నేర్పిన అనుభవాల్లోంచి ఈ కథ పుట్టింది. నేను కూడా మా కుటుంబంతో కలిసి అమర్ నాథ్ యాత్రకు వెళ్లాను. అలాగని నేను యాత్రకు వెళ్లాలనుకున్నపుడు కానీ, వెళ్లినపుడు కానీ  కథ గురించిన ఆలోచనే లేదు. కథ కోసం ఎప్పుడూ నేను వెంటాడలేదు.  కానీ అమర్ నాథ్ యాత్ర నుంచి వచ్చిన తర్వాత ఆ అనుభవాలు వెంటాడి నన్ను కథ రాయించాయి.

అమర్ నాథ్ యాత్రకు వెళ్లడమంటే  ఎంతో సాహసం చేయడమే.  యాత్ర నుంచి ప్రాణాలతో తిరిగి రావడం అదృష్టమే. మేం యాత్రకు వెళ్లిన మరునాడు పెద్ద తుపాను వచ్చి వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఓ వైపు ప్రకృతి భీభత్సం, మరోవైపు నుంచి ఉగ్రవాదులతో ప్రమాదం, ఇలా అనేక ఆటంకాల నడుమ అమర్ నాథ్ యాత్ర పెద్ద సాహసం.

కానీ ఇన్ని కష్టాలు తట్టుకుని అక్కడకు వెళ్లిన తర్వాత….అక్కడి మహా పర్వతాలు, అక్కడి అద్భుతమైమ వాతావరణం, అక్కడి మనుషులు వీటన్నింటిని చూసి,  భయంతోనో, భక్తితోనో యాత్రికులు పొందే అనుభవం జీవితాన్ని కొత్తగా దర్శింప జేస్తుంది.  ఈ యాత్రలో యాత్రికులు పొందే అలౌకిక అనుభూతి, భక్తి పారవశ్యం కన్నా భౌతిక ప్రపంచంతో చేసే  పోరాటాలు, ఆ క్రమంలో నేర్చుకునే పాఠాలు ముఖ్యమైనవి.

వాస్తవానికి అమర్ నాథ్ యాత్ర గురించి స్థానిక ప్రజల్లో  “అమర్ కథ” పేరిట ఒక కథ ప్రచారంలో ఉంది. మహాశివుడు పార్వతి దేవికి సృష్టి రహస్యం గురించిం చెప్పాలనుకుని అది ఎవరూ వినకుండా…ఎవరూ లేని చోట సృష్టిరహస్యం చెప్పాడట. ఐతే వాళ్లు కూచున్న పులి చర్మం కింద పావురాల గుడ్లు ఉన్నాయట. అవి సృష్టి రహస్యం తెలుసుకున్నాయట. ఆ గుడ్లు ఇప్పడికీ అమర్ నాథ్ గుహలో ఉన్నాయని భక్తులు చెపుతుంటారు.

శివుడు పార్వతికి చెప్పిన  ఆ సృష్టి రహస్యం ఏమిటో తెలియకున్నా అది ఒకటి ఉందని మాత్రం భక్తులు నమ్ముతారు. ఆ కథకు మోడ్రన్ వర్షన్ లాంటిదే ఈ కథ

***

అట్టాడ అప్పల్నాయుడు       (శ్రేయోభిలాషి)

రెండేళ్ల కిందట ఓ సభలో ప్రసంగిస్తున్నపుడు అనుకోకుండా ఓ మాట అన్నాను. దేశంలో  శత్రువే శ్రేయోభిలాషిగా కనపడుతున్న దుస్థితి నెలకొందని. యథాలాపంగా ఆ మాట వచ్చింది కానీ…ఆ వాక్యం నన్ను ఆలోచింపచేసింది. అన్ని చోట్లా, అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా మార్కెట్ శక్తులు వ్యాపారం  కోసం, లాభాల కోసం ప్రజలకు చేటు చేసేదాన్ని మంచిగా ప్రచారం చేస్తున్నాయి. శత్రువులు శ్రేయోభిలాషుల రూపంలో వస్తున్నారు.  అవుతున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడి ప్రధాని ఐన తర్వాత శ్రేయోభిలాషి పదం వాడకం విస్తృతంగా పెరిగిపోయింది. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు కారణంగా  చాలామంది చనిపోయారు, మత ఘర్షణలు, ధరల పెరుగుదల, ఆర్థిక రంగం అతలాకుతలం, తన సన్నిహితుల కంపెనీలకు దేశ వనరులు దోచి పెట్టడం…ఇలా ఎన్ని దుర్మార్గాలు చేసినప్పటికీ …ఇప్పటికీ ఆయన మన శ్రేయోభిలాషి అని నమ్మేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇదో దురదృష్టకర పరిస్థితి.

శతృవులు శ్రేయోభిలాషుల అవతారంలో దోచుకోవడానికి వస్తున్నారనే నా మాటలకు నరేంద్రమోడీ, అమిత్ షాల నిర్ణయాలతో ఒక రూపం వచ్చినట్టు అనిపించింది. నా కథకో రూపం వచ్చింది. దేశంలో మతఘర్షణలు రెచ్చగొట్టడం, ముస్లింలను , పాకిస్తాన్, చైనాలను శత్రువులుగా చూపించి తమ దోపిడీ కార్యక్రమం సాగిస్తారు. దోపిడీ దారుడు నిత్యం ఒక శత్రువును మన కళ్లముందు ఉంచి దోపిడీ చేస్తారు. మనకు అసలైన శత్రువు ఎవరో తెలిసే సరికి సర్వం కోల్పోతాం. ఒకప్పుడు విప్లవోద్యమాలకు, ప్రజలకు దోపిడీదారు, శత్రువు ఎవరో కళ్ల ముందు స్పష్టంగా కనిపించేవారు. ఇప్పుడు అదే శత్రువులు శ్రేయోభిలాషి ముసుగులో ప్రజల ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని చర్చించేదే శ్రేయోభిలాషి కథ.

***

 

-వాడ్రేవు చిన వీరభద్రుడు  (అవినిమయం కథ)

 

2017 లో నేను రాసిన ‘అవినిమయం’ అనే కథను కథ-2017 సంకలనంలో చేర్చినందుకు కథ సిరీస్ సంపాదకులకు, ఈ వార్షిక సంకలనం సంపాదకులకు కూడా నా ధన్యవాదాలు.

సాధారణంగా కథకుడు ఒక కథ చెప్పిన తరువాత, ఆ కథనే తన గురించి తాను మాట్లాడుకోవాలి లేదా పాఠకులు మాట్లాడాలి. ఆ కథకుడు తన కథ ద్వారా చెప్పినదానికన్నా అదనంగా మరేమి చెప్పడానికి ప్రయత్నించకూడదనేది నా అభిప్రాయం. అందువల్ల కథలోని అంశాల గురించి కాక, ఈ కథారచనకు నన్ను పురికొల్పిన నేపథ్యం గురించి మాత్రమే ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు షెడ్యూలు ప్రాంతాల్లోనే కాక, మైదాన ప్రాంతాల్లో కూడా ఉన్నారు. అయితే చారిత్రక కారణాల వల్ల ప్రభుత్వం గత అరవై డెభ్భైఏళ్ళుగా షెడ్యూలు ప్రాంతాల గిరిజనుల అభివృద్ధి కోసం, రక్షణ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది. కాని, 2000 తర్వాత మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల సమస్యల తీవ్రత కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన తరువాత, వారి అభివృద్ధి కోసం కూడా ఆలోచన మొదలు పెట్టింది. అందులో భాగంగా, పదేళ్ళ కిందట, మైదాన ప్రాంత గిరిజనుల కోసం కూడా ఒక ఐటి డి ఏ ని ఏర్పాటు చేసింది.

మరి ఆ వార్త విన్నందువల్ల కావచ్చు లేదా తనకు తెలిసిన సమాచారం నాతో పంచుకోవాలని కావచ్చు, వేంపల్లి గంగాధర్ అనే కథారచయిత తాను రాసిన ‘పూణే ప్రయాణం’ అనే పుస్తకాన్ని 2010 లోనో 11 లోనో నాకు పంపించాడు. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని గిరిజన జనవాసాలకు చెందిన నిరుపేద గిరిజన స్త్రీలు పొట్టకూటికోసం ముంబై, పూణే, షోలాపూరు వంటి ప్రాంతాలకు సెక్స్ వర్కర్లుగా తరలిపోతున్నారనేది ఆ పుస్తక సారాంశం. నేనా పుస్తకంలోని విషయాలు అప్పటి మా కమిషనర్ దృష్టికీ, మైదాన ప్రాంత ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి దృష్టికీ తీసుకొచ్చి ఆ కుటుంబాల కోసం, ఆ గ్రామల అభివృద్ధి కోసం సత్వరమే ఏవైనా చర్యలు చేపట్టవలసి ఉటుందని సూచించాను. ఆ దిశగా కొంత ప్రయత్నం కూడా మొదలుపెట్టాం కూడా.

ఈలోగా 2013 లో అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలోని ఒక గిరిజనగ్రామానికి (ఆ గ్రామం పేరు ఇక్కడ చెప్పలేను) చెందిన కొందరు స్త్రీలను అటువంటి వృత్తినుంచి ఒక స్వచ్ఛంద సంస్థ తప్పించి తిరిగి రాష్ట్రానికి తీసుకువచ్చిందనే సమాచారం మా దృష్టికి వచ్చింది. వాళ్ళ పునరావాసానికి సంబంధించిన ప్రతిపాదనలు, ఎటువంటి పథకాలు వారికి అవసరమవుతాయి మొదలైన చర్చల్లోనే ఒక ఏడాది గడిచిపోయింది. సాధారణంగా ప్రభుత్వం అందించే ఆర్థికాభివృద్ధి పథకాల్లో అధికభాగం బ్యాంకు ఋణాల ద్వారా సమకూర్చవలసి ఉంటుంది. కానీ, అటువంటి నిరుపేదలకు, అటువంటి పరిస్థితుల్లో ఋణ సదుపాయం అందించడానికి బాంకులు ముందుకు రావు. అందువల్ల ప్రభుత్వం అందించే సహాయం ఏదైనా సరే నూటికి నూరు శాతం సబ్సిడీ అందించవలసి ఉంటుంది. కాని అందుకు నిబంధనలు అంగీకరించవు. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం వెతకడంలోనే చాలా సమయం గడిచిపోయింది. ఆ సందర్భంగా 2015 ఫిబ్రవరిలో నేనా గ్రామానికి వెళ్ళాను. కదిరిలో ఆ స్త్రీలందరినీ ప్రత్యేకంగా సమావేశపరిస్తే వాళ్ళని కలిసి మాట్లాడేను. ఆ రోజు అక్కడ ఆ నిరుపేద, నిర్భాగ్య గిరిజన మహిళలు చెప్పిన అనుభవాల్లో, ఒక స్త్రీ అనుభవకథనం, యథార్థ కథనం ఈ కథకి ప్రధాన వస్తువు.

నేనక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే, ఆ స్త్రీలకు ఒక్కొక్కరికీ ఒక లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందచేసాం. అందుకోసం అన్ని నిబంధనలనీ సడలించేలా చూడటంలోనూ, వారి అకౌంట్లలోనే ఆ సొమ్ము నేరుగా డిపాజిట్ అయ్యేలా చూడటంలోనూ నా పాత్ర కూడా ఉంది.

కాని, అదంతా నాకు తృప్తినివ్వకపోగా చాలా అసంతృప్తినే మిగిల్చింది. వారిని వెనక్కి తీసుకురావడం,పునరావాసం, ఆర్థిక సహాయం ఇవన్నీ మనం ఎలాగూ చెయ్యకతప్పనివే. కాని, అసలు ఇటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఏ ఆర్థిక-సామాజిక-రాజకీయ చట్రం వల్ల ఆ అభాగ్యస్త్రీలు అటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు? దారుణమైన వాళ్ళ అనుభవాలకు మన బాధ్యత కూడా లేదా? ఈ విషయాల గురించి బయటి సమాజం ఆలోచించాలంటే నేనేం చెయ్యాలి? నేను విన్న అనుభవాల్ని యథాతథంగా రాస్తే అది వార్తాకథనం అవుతుంది. దాని ప్రభావం ఒక్కరోజు. కథగా రాస్తే ఆసక్తి కలగవచ్చుగాని, దాని ప్రభావం మాత్రం ఎంతసేపుంటుంది? అసలు, అటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడటంలో మన ఉద్దేశ్యాలు నిజంగా నిర్మలమైనవేనా? ఆ విషయాల గురించి మాట్లాడటం ద్వారా మనం ఒక సోషల్ డిస్కోర్సు లో మన ప్రభావశీలతను పెంచుకోవాలని చూడటం లేదా? అసలు ఆ అనుభవాల గురించి మాట్లాడవలసింది ఎవరు? ఆ అనుభవాలకు లోనైన వారే కదా. కాని వారు తమ గురించి తాము చెప్పుకోడానికి మన సాహిత్యం ఏ మేరకు అనుకూలంగా ఉంది? అసలట్లా తమ గురించి తాము చెప్పుకోవలసిన అవసరం ఉందని ఆ మహిళలు గుర్తిస్తున్నారా? ఇలాంటివే చాలా ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టాయి.

ఈ ప్రశ్నల ఒత్తిడినుంచి బయటపడటానికి నేనీ కథ రాసాను గాని, ఇది నాకేమీ శాంతినీ, సంతోషాన్నీ ఇవ్వడం లేదు. ఊహించండి, అటువంటి అనుభవం. అది మన అక్కచెల్లెళ్ళల్లో ఎవరికేనా జరిగి ఉంటే మనకెలా ఉంటుంది? అటువంటిది, ఆ అనుభవాన్ని నేనో కథగా రాయడమేమిటి? ఆ కథ రాసినందుకు ఎందుకు సంతోషించాలి? ఆ కథని ఒక వార్షిక కథా సంకలనంలో చేర్చినందుకు నేనెందుకు గర్వించాలి? మనం అంగడికి వెళ్ళి ఒక రూపాయి పెట్టి ఒక సరుకు కొంటే ఆ సరుకు ఆ రూపాయి విలువచేస్తుందా లేదా అని అనుమానిస్తూనే ఉంటాం. అంటే వస్తువులకీ, సొమ్ముకీ మధ్య వినిమయ విలువ ప్రశ్నార్థకంగానే ఉంటున్నది. అటువంటప్పుడు, నాది కాని ఒక అనుభవం పట్ల నేనెంత సహానుభూతి ప్రకటించినా, నా సహానుభూతికీ ఆ అనుభవానికీ మధ్య పూర్తి వినిమయం ఎప్పటికీ సాధ్యం కాదని నేనెందుకు మర్చిపోతున్నాను? కాని కథకులుగా, పాఠకులుగా, విమర్శకులుగా మనం చేస్తున్నదేమిటి? మన తోటి మనుషులు ఆ అనుభవాలకు లోను కాకుండా చూడటమెట్లా అన్నది వదిలిపెట్టి, మన సహానుభూతిని ఒక డిస్కోర్సుగా మారుస్తున్నాం. ఇదే నన్ను చాలా uneasiness కి గురిచేస్తున్న విషయం.

అవినిమయం ప్రధానంగా ఈ నా uneasiness కి సంబంధించిన కథ. ఇంతకన్నా అదనంగా మరేమీ చెప్పలేననుకుంటాను.

***

 

కొట్టం రామకృష్ణారెడ్డి       (ఇగురం గల్లోడు కథ)

ఎదుటి వారిని అర్థం చేసుకోవడం మొదలైతే వారిని తెలీకుండానే ప్రేమిస్తాం.

అలాగే …ఎదుటివారిని ప్రేమించడం ప్రారంభిస్తే అర్థం చేసుకోవడం మొదలు పెడతాం.

ఎదుటి మనిషిని సంపూర్ణంగా ప్రేమిస్తే, వారు పూర్తిగా మన చెప్పు చేతల్లోనే  ఉంటారని భ్రమిస్తాం.

మన చెప్పు చేతల్లో ఉన్నవారు మనల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతాం.

అందరూ మనుషులే..!

నిజంగా మనుషులందరూ మంచివాళ్లే…!!

మంచివాళ్లే మనుషులు…!!!

అటువంటి మంచి మనుషుల కథే ….

ఇగురం గల్లోడు..

***

చిరంజీవి వర్మ –‘ద్వాదశి ‘ కథ వెనుక కథ

 

రచయిత ప్రొఫెషన్ (వృత్తి) ని బట్టి అతను ఎంచుకొనే కథాంశాలుంటాయి. రచయిత తన వృత్తికి సంబంధించిన కథా వస్తువుని ఎన్నుకుంటే… మిగతావారికంటే బాగా చెప్పగలగడంతోపాటూ  అతనికీ  సౌలభ్యంగా వుంటుందని నేననుకుంటాను. దీనితో ఎవరూ ఏకీభవించనక్కర్లేదు.

రచయితలంతా పాత్రికేయులు కాదు.  కానీ పాత్రికేయులంతా రచయితలే అన్నది  నా అభిప్రాయం. వాళ్ళు, కథలూ కవిత్వం రాయకపోవచ్చు. వార్తో, వ్యాసమో ఏదో ఒకటి రాసితీరతారు. ఈ థియరీ ప్రకారం జర్నలిస్ట్ ని కాబట్టి నన్ను నేను రచయితగా ప్రకటించుకోవడం తప్పుకాదు. రచయిత కథ, రచయితే  రాయడంలో సౌలభ్యం వుంటుంది కనుక ‘ద్వాదశి’ ఇతివృత్తాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇలా ఎన్నుకోవడం వెనకో కథ వుంది.

‘ద్వాదశి’ కి ముందు వరకూ నేను రాసిన కథలు అన్నీ నేను చూసినవో, అనుభవించినవో, ఎవరో చెప్పగా విని రాసినవే. అందులో ఏ ఒక్కకథా ఊహించి రాసింది కాదు. ఊహించి రాసిన ‘ద్వాదశి’ కథ వెనక ఉన్న కథ ‘ఏనిమిషానికి… ‘  (సారంగ జనవరి 2017) వచ్చేసరికి, కథ చెబుతూ చెబుతూ రచయితే… కథలోని ప్రధాన పాత్రని చంపెయ్యడానికి బయటకి వచ్చేస్తాడు. మొదట్లో ‘ఏనిమిషానికి… ‘  ఓ ప్రారంభం, ముగింపు అనుకున్నాను. రాయడం మొదలెట్టాకా పాఠకుడికి గగుర్పాటు కలిగించాలంటే  ఎవరో ఒకరిని చంపెయ్యాలని, కథ డిమాండ్ చెయ్యడంమొదలెట్టింది. నాకు కథలో పాత్రలన్నీ ప్రాణప్రదం. వాటిలో ఒకపాత్రని చంపాలంటే నా వ్రేళ్ళెందుకో  నిరాకరించడం మొదలెట్టాయి. కానీ మనస్సుని రాయి చేసుకోవాల్సివచ్చింది. ‘మధ్యతరగతి భార్యాభర్తలు బంగారం తయారు చేయాలని ఆశపడ్డం,  ఆ విద్య వచ్చిన రాజుగారిని… ఆ భర్త ప్రసన్నం చేసుకోవడం స్థూలంగా ఇదీ కథ. నిజానికి కామెడీగా నడిచి, కామెడీగా ముగిసిపోవాలి. కానీ నేను పాఠకుడిగా కామెడీ , క్రైం, సస్పెన్స్ కథలని ఇష్టపడతాను. నా ఇష్టాన్ని పాఠకులమీద రుద్దెయ్యడం సహజమే కదా! అలా నా అత్యుత్సాహానికి,  హాయిగా తోటలో విహరిస్తున్న ఆ రాజుగారు బలయిపోయాడు. ఇదెక్కడి న్యాయం? కథ కాబట్టి సరిపోయింది. నిజ జీవితంలో అయితే ఏం జరుగుతుంది? ఆ క్యారెక్టరే వచ్చి నన్ను ఇదేం ధర్మమని నిలదీస్తే, కథని ఎలా డీల్ చెయ్యాలో చేతకాక, నన్ను చంపేసావా? అని ప్రశ్నిస్తే? ఇలాంటి మానసిక సంచలనంలోంచి పుట్టిందే  ‘ద్వాదశి’. చనిపోయింది, కథలోని ఓ క్యారెక్టరే కావచ్చు. కానీ ఆ పాత్రని సృష్తించిన రచయితకి, దానితో ఓ మానసిక బంధం ఏర్పడిపోతుంది.

కొంత ఉపోద్ఘాతం తర్వాత రైటర్  విఘ్నేష్ శ్రీవాత్సవ్( నేనే) ‘ద్వాదశి ‘  నవల క్లైమాక్స్ కి రాస్తూ వుండడంతో ‘ద్వాదశి ‘  కథ మొదలవుతుంది. నవలలోని రెండు పాత్రలు, అతని ముందు ప్రత్యక్షమవుతాయి. నవలలో హీరోయిన్ గా వున్న పాత్ర నిజజీవితంలో విలన్ గానూ , విలన్ గా వున్న పాత్ర హీరోగానూ ప్రత్యక్షమవడం ఇక్కడ గమనించదగ్గ అంశం. రచయిత పాజిటివ్ అనుకున్నది పాజిటివ్ కాకపోవచ్చు, నెగటివ్ అనుకున్నది కూడా పాజిటివ్ అవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాత్రల క్యారెక్టరైజేషన్ జరిగింది. ఏదైనా రాసేటప్పుడు ఓ రచయిత అనుభవించే మానసిక స్థితిని ఇందులో ఆవిష్కారమయ్యింది.

తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చేసుకోవాలనే తాపత్రయంతో, దేశభద్రతకు సైతం ముప్పు తెచ్చే రచనలు చేసే విఘ్నేష్ శ్రీవాత్సవ్ వంటి రచయిత(త్రు)లకి బాధ్యతని ఎవరు గుర్తు చేయాలి? రచనలోని పాత్రలే ఆ పని చేసి, ఆ రచయిత ఆలోచనల్లో మార్పు తీసుకువస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకి అక్షరరూపమే ‘ద్వాదశి’ కథ.*

***

మోహిత కౌండిన్య       (కాసింత చోటు కథ )

 

కథ రాయాలనిపించడం ఒక అదృష్టం. కథ రాసేశాక చదివేవారి అదృష్టం. ఎక్కువ సార్లు రెండో అదృష్టమే నాదవుతూ ఉంటుంది. మదిలో అల్లుకున్న కథని కాగితంపైన పెట్టాలంటే బద్ధకం, తీరుబడి లేనితనం వంటి చెరలను వదిలించుకోవాలి. లేకపోతే, రచయిత ఇంటి పని చెయ్యని విద్యార్థి లాగ పేరబెట్టే పేరయ్యలు అయిపోతారు. అప్పుడు ఒక ఉత్సాహవంతుడైన ఉపాధ్యాయుడు బెత్తం పుచ్చుకు వెంట పడితే టక్కున పూర్తవుతుంది. ఎక్కాలు పద్యాలు జలపాతంలా నోట్లోంచి వెలుపలికి వస్తాయి.

అలా నేను ఒక పేరమ్మ నైనప్పుడు కథ రాయమని ప్రోత్సహించినవారు వాసిరెడ్డి నవీన్ గారు. వారికి కృతజ్ఞతలు. నాకు ఒక డెడ్ లైన్ పెడితే గాని కథ పూర్తి చేయనని వారికి తెలిసింది కాబోలు, ఫలానా తేదీకి ఒక కథ ఇవ్వాలి అన్నారు. కథ రాసి ఎవరు వేసుకుంటారా అని ఎదురుచూసే కాలంలోంచి రాయమని దాదాపుగా రోజూ ఫోన్ చేసి “ఎంతవరకు వచ్చింది” అని పురోగతిని కనుక్కున్నా, (షిఫ్ట్ డ్యూటీతో నిద్ర తిండికే టైం లేదు, ఇంకా కథ కూడానా అని మనసులో అనుకుని) “అయిపోయిందండీ, చివరి లైన్ రాస్తున్నానండీ, ఇవాళ రేపు” అని దాటవేసే నా క్రమశిక్షణకి, దినచర్యకి నేనే సిగ్గుపడి, చివరికి “రేపొద్దున్న కల్లా నాకు కథ పంపించి తీరాలి” అని నవీన్ గారు అల్టిమేటం (లిటరల్లీ) ఇచ్చినప్పుడు ముందురోజు అర్ధరాత్రి నిద్రమత్తులో కంప్యూటర్ ముందు కూర్చున్నాను. అప్పటికి కథ లేదు. బహుశా నా టెన్షనే ఈ కథలోకి ట్రాన్సలేట్ అయిందేమో. మే బీ, కొంత బాక్గ్రౌండ్ ఆలోచన లేకుండా ఏ కథా ఉండదు. రోజూ ఉండే ట్రాఫిక్ ని తిట్టుకోవడం, ఇవాళ కూడా లేటయిపోయింది, కథ రాసే టైం లేదనుకోవడం – ఇవన్నీ కథలో మరో రూపంలో బహిర్గతం అయ్యాయనుకుంటా. నా కథానాయకుడికి పేరు లేదు. గమ్యం లేదు. అతణ్ణి ఇక్కడనుంచి ఎక్కడకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ఒక్కో పేరా రాస్తూ పోవడమే. ఇంకా అతని ప్రయాణం కథలో లేనిది చాలా నా బుర్రలో ఉంది. చాలామందికి ఒక లక్షణం ఉంటుంది. పాటలు పాడుకుంటూ వెళ్లడం. అయితే, నా కథానాయకుడికి ఒక వింత లక్షణం – ఎంత స్లో పాట పాడుకుంటే అంత వేగంగా వెళ్లడం. ఇది కథలో పెట్టలేదు. అంటే మనం ఏమి అనుకుంటామో చాలాసార్లు దానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది జీవితం. (జీవితం అనే పదం లేకుండా జీవితం గురించి రాయాలి అనుకున్నాను). ఈ లక్షణం తెలిసిపోతూ ఉంది కదా మళ్ళీ ఎందుకులే చెప్పడం అని ఇది రాయలేదు. అలాగే ఇంకొన్ని. సరే, రాస్తుంటే నాకే అనిపించింది, ఇంత సీరియస్ గా ఫిలసాఫికల్ గా అయిపోయింది ఏంటి అని. బాలన్స్ కోసం ఒక చమత్కారమైన ముగింపు కావాలి. పెట్టాను.

కథాసాహితి వారి కథ పరంపరలో ఇలా రెండోసారి నా కథకి ‘చోటు’ దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తూ, కథల్ని కథకుల్ని ప్రోత్సహిస్తున్న వారి స్ఫూర్తికి అచ్చెరువొందుతూ, ఆనందపడుతూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

***

తాడికొండ కే.శివకుమార శర్మ (“స్వల్పజ్ఞుడు” కథ)

ఈ కథకు నేపథ్యం అమెరికాకు వలస వెళ్లిన భారతీయుల జీవితం.

“రోమ్ నగరంలో రోమన్ల లాగా బ్రతకగలగడానికి వలస వచ్చినవాళ్లకి వాళ్ల అస్తిత్వం ఎప్పుడో ఒకప్పుడు అడ్డుపడక తప్పదు. దాన్ని అధిగమించడానికి కొంత ఎరుక అవసరం.”

భారత దేశాన్నుంఛీ వలస వచ్చి అమెరికాలో అమెరికన్లలాగా బ్రతకడం అంటే ఏమిటి? అది పిజ్జాలనీ, బర్గర్లనీ తింటూ, థాంక్స్ గివింగ్ నాడు టర్కీని అవెన్లో బేక్ చేసి తినడమూ, క్రిస్మస్ నాడు ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టి ఆ రోజున గిఫ్టులని పంచుకోవడమూ మాత్రమేనా?  భారత దేశాన్నుంఛీ అమెరికా వచ్చి దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడినవాళ్లల్లో తమ భారతీయతని పూర్తిగా కాపాడుకుంటూ వస్తున్నవాళ్లున్నారు, ప్రవాహంలో కలిసిపోయినవాళ్లూ ఉన్నారు. మొదటివర్గంలో, వాళ్లు తమ పిల్లలని తల్లిదండ్రుల అభిరుచుల మేరకి – అంటే, పిల్లలని డాక్టర్లలాగా, కంప్యూటర్ సైంటిస్టుల లాగా, లేక కనీసం ఇంజనీరింగ్ డిగ్రీలని దొరకపుచ్చుకున్నవాళ్లలాగా  – తయారుచేస్తూ,  వాళ్ల కులగోత్రాలకి సరిపోయేలా సంబంధాలని తెచ్చి పెళ్లిళ్లు చేసేవాళ్లున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రెండింటిలోనూ ఇది సులభమయినది. గీతా వాక్యంలో చెప్పాలంటే, “పర ధర్మో భయావహః” ని జీర్ణించుకుని పాటించడం వంటిది.

రెండవ వర్గంలో – అంటే, అమెరికన్లతో కలిసిపోయినవాళ్లల్లో – కొంత నించీ, ఎంతో కలిసిపోవడందాకా గ్రేడ్లున్నాయి. తెలుగువాడు ఆఫ్రికన్ అమెరికన్ జాతి అమ్మాయిని – అంటే, నల్లమ్మాయిని –  పెళ్లిచేసుకుని పిల్లలని కని సంసారాన్నీదడం కొంచెం ఎక్కువగా కలిసిపోయిన రెండవ వర్గం. ఇంకా కొంత కలిసిపోవడం అంటే, డైవోర్సు దాకా వెళ్లడం. ఎంతో కలిసిపోవడం అంటే, పైన చెప్పినవన్నీ దాటి, పిల్లలని ప్రతి విషయంలోనూ పూర్తిగా వాళ్ల ఇష్టాయిష్టాలకు తగినట్లు ముందుకు సాగనివ్వడం. వీటిల్లో ఎక్కడో అక్కడ ఈ భారతీయుడికి తన ఆశయాలకీ ఆదర్శాలకీ భిన్నంగా జరిగే అవకాశాలు ఎక్కువ.

పిల్లలు సరిగ్గా చదవట్లేదని వాళ్ల భవిష్యత్తు మీది బెంగతోనే అంటూ తండ్రులు మగపిల్లల మీద అరిచి, కొట్టి, ఇంట్లోంచి పారిపోయేలాగా పరిస్థితులని కలగజెయ్యడం ఇండియాలో సాధారణమేమో గానీ, ఇక్కడ మాత్రం కథకుడు బయటికి వెళ్లడానికి తప్పనిసరి అయిన పరిస్థితులని కలగజేశాయి. దానికి అతని అస్తిత్వంలో ఇంకొక భాగం కూడా కారణం.

కాలేజీలో మూడేళ్ల డిగ్రీ చెయ్యడానికి ఇండియాలో పెద్దగా ఖర్చవదు. లెక్కలు, భౌతికశాస్త్రం, సామాజిక శాస్త్రం లాంటి సబ్జెక్టులలో. ఒక ఏడాదిని కలిపి, ఇంజనీరింగ్ డిగ్రీ అనండి, ఖర్చు తారాజువ్వలాగా పైకెళ్లిపోతుంది.

అమెరికాలో యూనివర్సిటీలో ప్రతీ డిగ్రీ కోర్సూ కనీసం నాలుగు సంవత్సరాలే. అక్కడక్కడా ఏదో లాబ్ అన్చెప్పి సైన్సు కోర్సులకి కొద్దిగా ఎక్కువుంటుంది గానీ లేకపోతే ఖర్చు కూడా అన్నింటికీ సమంగానే. అయితే, ఆ డిగ్రీ పట్టుకుని ఉద్యోగాలకోసం వెదికితే అదృష్టం కొద్దీ ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరకవచ్చు. దానికి జీతం ఇంజనీరింగ్ డిగ్రీ ఒనగూర్చే జీతంలో సగమే ఉన్నా గానీ!

చదువు కోసం బాంక్ నించీ తీసుకున్న లోన్ మాత్రం రెండు డిగ్రీలకీ ఏమాత్రం వివక్ష చూపకుండా ఒకే విధంగా పెరుగుతూంటుంది. ఇది ఈ కథకుడికి బాగా తెలుసు. అలాంటి డిగ్రీని చేతపుచ్చుకుని దానితో సంబంధం లేకుండా ఇళ్లని అమ్మిపెడుతోంది అతని భార్య. ఇది కథకుడికి ప్రత్యక్ష అనుభవం. కోటి విద్యలు కూటి కొరకే అన్నది అతని అస్తిత్వం. ఆమేమో, చదువు విజ్ఞాన సముపార్జనకే అన్నట్టుగా ప్రవర్తిస్తోంది! ఇతనేమో తనది హిందూమత మని తెలుసు గానీ దాని గూర్చి పెద్దగా పట్టించుకోని వ్యక్తి. ఆమేమో, తత్త్వశాస్త్రాన్ని వంటబట్టించుకున్న వ్యక్తి.

అమెరికాలో అడుగు పెట్టిన దగ్గర నుంచీ ఎవరయినా నన్ను హిందూ మతం గూర్చిన వివరాలు అడుగుతారేమో ఏమని చెప్పాలా అని భయపడ్డాను. సరేలే, లండన్లో అడుగు పెట్టేదాకా మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి కూడా ఈ విషయం గూర్చి తెలియదులే, అని సరిపెట్టుకున్నాను.  కథకుడు అలా అనుకోలేదు లెండి. ఎన్నో ఏళ్లు ఎంతగా దాటేసినా చివరికి పరిస్థితులవల్ల అతనికి తెలిసింది. ఏమి తెలిసిందో నేను చెప్పకూడదు. అతనికి తనంతట తానుగా తెలుసుకోగల పరిస్థితులని చూపానా లేదా అనేది పాఠకులు చదివి తమకు తాముగా నిర్ణయించుకోవలసిన విషయం.

***

–ఎం.ఎస్.కే కృష్ణజ్యోతి (కాకి గూడు)

కథాసాహితి 2017 సంకలనానికి ఎంపికైన “కాకి గూడు” నా మొదటి కథ.

కథకి పేరా ఎలాగ?  కామా ఎక్కడ?  చుక్క ఎక్కడ? తెలుసుకోవడానికి ఈనాడు ఆదివారం పుస్తకంలో ఒక కథ తీసి చూశాను.  వాక్యం బాగా రాయడం ఎలా అని తెలుసుకోవడానికి కొన్ని వెబ్ సైట్స్ చదివాను.  JK Rowling వాక్యం వ్రాసే విధానం గురించి చదివినది నాకు నచ్చింది.  ఒకరోజులోనే ఈ కథ రాసినట్లు గుర్తు.  వంకర టింకర అక్షరాల రఫ్  స్క్రిప్ట్ స్కాన్ చేసి,  ఖదీర్ బాబు మెయిల్ అడ్రస్ సంపాయించి  మెయిల్ పెట్టి, అయ్యా,  కథ రాశాను,  కాస్త చదివి చూడగలరా అని బెరుకు బెరుగ్గా అడిగాను.

కథ చాలా బాగుంది, నిర్మాణ పరంగా కథ మధ్యలో ఇంకొక సంఘటన చేర్పు కావాలి అని చెప్పారు.   టీచర్ ఉద్యోగం.  పిల్లల మాదిరే. ఎవరైనా ‘good’అంటే ఇంక పట్టశక్యం కాదు.   పెద్ద రైటర్ మన కథ చదవడం,  బాగుందని చెప్పడం. ఆపకుండా మరిన్ని కథలు రాసి ఫైల్ తయారు చేసి పెట్టాను. నేరుగా సాక్షి, తెలుగు వెలుగు లాంటి పెద్ద పత్రికలకే పంపడం.  ప్రతి చోటి నుంచీ ‘మీ కథ ప్రచురణకు ఎంపిక అయినది’అని మెసేజ్.  తెలుగు వెలుగుకి కథ పంపి చాలా కాలం అయ్యింది కానీ, బహుశా వరుస క్రమంలో అచ్చులోకి వచ్చేప్పటికి ఆలస్యం అయ్యింది.

జీవశాస్త్ర బోధకురాలిగా పర్యావరణ కార్యక్రమాల పైన దృష్టి ఎక్కువ ఉండేది. కాబట్టి, జీవ వైవిధ్యం గురించి కథ వ్రాయాలని కాకి గూడు వ్రాసాను.  కానీ, అది ఒక స్త్రీ అస్థిత్వ సంఘర్షణ అన్నారు ఒకరిద్దరు.  కావచ్చునేమో.  కథలో పాత్రలకు పేర్లు ఏం పెట్టాలో తెలీలేదు. అందుకే ఒక్క పాత్రకు కూడా పేరు పెట్టలేదు.  బిడ్డల్ని కన్నాకే అత్తవారింట్లో పూర్తి సభ్యత్వం పొందినట్లు భావించిన కోడలు; ఎంత పెద్దవాడైనా తండ్రికి భయపడే కొడుకు; చెట్లు, పిట్టలతో ఆడుకునే పిల్లలు;  ప్రతి చోటా కనబడే సగటు ఇంటి పెద్దరికం దంపతులు,   ప్రధాన ద్వారం ఎదురుగా వాకిట్లో వేపచెట్టు, దానిపై కాకి జంట కొత్త కాపురం, వాటి గూడు, ఇవ్వన్నీ  చెప్పుకోడానికి  పేర్లతో పనేముంది?

కథా సాహితీ వారు ఈ కథని  వెలికి తీసి సంకలనంలో చోటు ఇచ్చారు.  భలే ఆనందం.  వేపచేట్టుమీద గొడ్డలి పడకుండా కాపాడినప్పుడు  పిచ్చుక, దాని కుటుంబం కోసం మట్టి ముంతలో నీళ్ళు పెట్టి, పిడతలో గింజలు పోసి చూరులో పెట్టినప్పుడు; రంగు రంగుల సీతా కోకని తుంటరి పిల్లల దారపు ఉరి నుండి కాపాడినపుడూ ఇలాగే ఉంటుంది.  మహదానందం.

***

 

శాంతి నారాయణ. ( ముట్టు గుడిసె కథ)

నేను 1972 నుంచి నేను కథలు రాస్తున్నాను. మొదట్లో కొన్ని ప్రేమకథలు రాసినా,  1985 నుంచి సామాజిక స్పృహతో కథలు రాస్తున్నాను. నా కథను 2017 కథా సంకలనానికి ఎంపిక చేసిన సంపాదకులకు ధన్యవాదాలు.

ఈ కథా వస్తువు పదేళ్లుగా నన్ను వెంటాడుతోంది. కర్నాటకతో సరిహద్దు ఉన్న అనంతపురం జిల్లాలోని 20 మండలాల్లోని గొల్ల కులస్తుల జీవితం ఈ కథ. ఆ వర్గానికి చెందిన ప్రజలు గ్రామం నుంచి దూరంగా గొల్లలదొడ్డి పేరిట విడిగా ఉంటూ తమ కులస్తులతో మాత్రమే జీవిస్తారు. వేరే సామాజిక వర్గం ప్రజలకు దూరంగా ఉంటుంటారు. ఇతరులు రాకుండా తమ గొల్లదొడ్డి కోట గోడలాగ కంచె నిర్మించుకుంటారు. విస్తృతమైన పశుసంపద వల్ల ఆర్థికంగా ధనవంతులే ఐనా సామాజిక వెనకబాటు వల్ల అనేక దురాచారాల్లో మగ్గిపోతుంటారు.

వాళ్ల ఇళ్లలోని బాలికలు, స్త్రీలకు బుతుచక్రం వచ్చినపుడో, ప్రసవం ఐనపుడో…ఆ మహిళల్ని అంటరానివారిగా చూస్తుంటారు.  తమ ఇంటి వెనక చిన్న పాక నిర్మించి (గొల్లదొడ్డి అంటారు.) దానిలో ….తమ ఇంట్లోనే అంటరాని వారిగా ఉంచుతారు. ఒకరోజు రెండు రోజులు కాదు. రజస్వల ఐన అమ్మాయిల్ని నెల రోజులు,  ప్రసవించిన మహిళల్ని ఆరునెలలు ఆ పాకలోనే ఉంచుతారు. ఆ మహిళలు తమ దైనందిన జీవిత కార్యక్రమాలు అన్నీ ఆ పాకలోనే చేసుకోవాలి. నా ఉద్యోగరీత్యా ఆ ప్రాంతంలో ఉండాల్సినవచ్చినపుడు అక్కడి పరిస్థితులు, ముఖ్యంగా ఆ మహిళల పాట్లు చూసి చలించిపోయాను. ఈ దురాచారం ఏ ఒక్క ఊరిలోనో కాదు, 30 మండలాల్లో ఉంది. ఆ మహిళల ఆవేదనే నాతో ఈ కథ రాయించింది. ఈ ఒక్క కథే కాదు…నేను రాసిన ఏ కథ ఐనా నా చుట్టూ ఉన్న పరిస్థితులే ప్రభావితం చేసి కథలు రాయిస్తున్నాయి.

***

రిషి శ్రీనివాస్ ( ప్రవాసం కథ. )

సాధారణంగా మన తెలుగువాళ్లం ఉత్తర భారతదేశం వెళితే హిందీ మాట్లాడతాం. ఒక వేళ రాకపోయినా మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తాం. అదే ఉత్తరాది వాళ్లో, ఇతర రాష్ట్రం వాళ్లో మన దగ్గరకి వచ్చినపుడు కూడా వాళ్లు మనభాష మాట్లాడరు. మనమే వాళ్లభాష మాట్లాడ్డానికి ప్రయత్నిస్తాం.

మా ఆఫీసులో నాకో బంగ్లాదేశ్ కి చెందిన ఫ్రెండ్ ఉండేది. తన ద్వారా బంగ్లాదేశ్ గురించి, అక్కడి ప్రజల జీవితం, ఆలోచనలు, మన దేశం గురించి వాళ్ల ఆలోచనలు తెలిశాయి.

మనదేశంలోని కొందరు యువత అమెరికా వెళ్లాలని ఎలాగైతే అనుకుంటారో బంగ్లాదేశ్ లోని యువతకు నుంచి ఇండియా రావాలని అనుకుంటారట. అలా బంగ్లాదేశ్ యువత రకరకాల మార్గాల ద్వారా మనదేశానికి (ఎక్కువగా బెంగాల్ ) చేరుకుంటున్నారు. ఈ పరిణామాలు బెంగాల్ యువతలో అపార్థాలు, అశాంతితో పాటూ అనేక సామాజిక పరిస్థితులకు కారణమవుతున్నాయి.

దేశాలైనా, రాష్ట్రాలైనా ఇద్దరు మనుషులైనా విడిపోవడానికి ప్రేమరాహిత్యమే కారణమన్న పాయింట్ ని ఆధారం చేసుకుని నా ప్రవాసం కథ వ్రాసాను.

 

సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి

అన్ని సౌకర్యాలతో అధునాతనమైన ఇల్లు నిర్మించుకోవడం నాగరికత. ఇంట్లోకి ఊరపిచ్చుక కూడా రాకుండా గేట్లు బిగించుకోవడం అనాగరికత. మంచి సౌండ్ సిస్టంతో టీవీ బిగించుకోవడం నాగరికత. వీధుల్లోని బొమ్మలాట లాంటి జానపద కళల్ని ఇంట్లోని మనుషుల్దాకా రాకుండా దాన్ని అడ్డుంచుకోవడం అనాగరికత. అన్ని అనుకూలనాలతో వంటగదిని ఆధునికీకరించు కోవడం నాగరికత. వీధిలోంచి ఆకలి ఏడుపులు వంటగదిలోకి వినిపించనీక పోవడం అనాగరికత. చాలినంత నీటిని సంపాదించి వినియోగించు కోవడం నాగరికత. ఇంటి గోడ కింద గొంతెండి పడిపోయి దప్పికో అని అరిచే మనిషికి గుక్కెడు నీల్లివ్వకపోవడం అనాగరికత. అవధుల్లేని వ్యక్తిగత స్వార్థమే అనాగరికత.
నా చిన్నతనాన ఇంటింటికి సాకుడు కుక్కలు ఉండేటివి. తిండి తినేటప్పుడు వాకిలి దాకా వచ్చి చూసే వీధికుక్కలకు కూడా ఒక పిడచ విసిరేసే రోజులు అవి. సాకుడుకుక్కలే కాకుండా వీధికుక్కలు కూడా బతికే రోజులు. ఊరి బయట అడవుల్లో పెద్దనక్కలు, తోడేళ్ళు లాంటి క్రూరజంతువులు మనిషి పెంచుకునే గొర్రెల్ని మేకల్ని తిని బతికేవి. క్రూర జంతువుల నుంచి పెంపుడు జంతువుల్ని రక్షించుకునేందుకు మనిషి కుక్కల్ని సాకేవాడు. కాలం మారిపోయింది. క్రూర జంతువుల్ని వాటి నారు కూడా లేకుండా మనిషి నిర్మూలించాడు. ఇప్పుడు కుక్కల సహాయం అవసరం లేకుండా పోయింది. పెంపుడు కుక్కలన్నీ వీధుల పాలయ్యాయి. వీధికుక్కలు ఇంట్లోకి రాకుండా గేట్లు
బిగించుకున్నాడు. ఇప్పుడు ఆకలి తీర్చుకునేందుకు కుక్కలు మనిషి సాకే కోళ్లను గొర్రెపిల్లలను తినడం మొదలు పెట్టాయి. తోడేళ్లు, పెద్దనక్కల స్థానాన్ని కుక్కలు భర్తీ చేస్తున్నాయి. వాటిని చంపేందుకు మనిషి ఉపాయాలు వెతుకుతున్నాడు. అదిగో అలాంటి నేపథ్యంలోనే ఈ కథ పుట్టింది.
కొందరు వ్యక్తుల స్వార్ధం వల్ల సమాజంలో అసమతుల్యత పెరిగింది. పెంపుడు జంతువైనా కావచ్చు పక్కింటి మనిషైనా కావచ్చు – నిజాయితీగా ఆకలి తీర్చుకునేందుకు దారి దొరకనప్పుడు తప్పటడుగులు వేయడం సహజం. అప్పటికీ నిర్బంధం సడలకుంటే తిరుగుబాటుకు సిద్ధమవటం అత్యంత సహజం. ఒళ్ళంతా స్వార్థం తో నిండిన మనిషి వాస్తవాలు తెలుసుకొని తన్ను తాను సవరించుకోవాలి. తన చుట్టూ ఉన్న జీవులకు సహాయం చేయాలి. ఇది తరాలుగా భారతీయ సమాజంలోని ఒక జీవనరీతి. అదే నీతి. తమ ముందు తరం మనుషులు వ్యవహరించిన తీరును అధ్యయనం చేస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. పాతతరం మనిషిలోని మానవీయ కోణాన్ని ఈ తరానికి అందించే ప్రయత్నమే ఈ కథ. ప్రభుత్వం అంటే సమిష్టి నిర్ణయాల కూడలి కాకుండా ఏకవ్యక్తి నిరంకుశాధికారంగా మారిన ఈ వేళ, మనిషికి జంతువుకి మధ్యనుండే సంబంధాలే కాకుండా శిక్షకు ఆదరణకు మధ్య ఉండే సంబంధాన్ని కూడా వ్యక్తీకరించే చిన్న ప్రయత్నమే ఈ కథ. ఆకలి తప్పుదారుల్ని వెతుక్కోవచ్చు. కానీ ఆ మార్గం వంశపారంపర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది.
ఈ కథంతా మా ఊరిలో వాస్తవంగా జరిగిందే.
సెవ్వన్నతో సహా పాత్రలు కూడా వాస్తవమే.

చందు తులసి

View all posts
నీ ‘కాళ్ళ’ కి సాష్టాంగం!
బొడ్డుతాడు వెచ్చదనం కోసం చిన్నిమనసు తడుములాట

2 comments

Leave a Reply to చిరంజీవివర్మ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చిరంజీవివర్మ says:
    November 24, 2018 at 12:24 am

    థన్యవాదాలు, తులసిగారూ.

    Reply
  • కె.కె. రామయ్య says:
    November 26, 2018 at 12:59 am

    “కథా సాహితి” సంస్థ వార్షిక ఉత్తమ కథల సంకలనం కథ-2017 లోని కథల నేపథ్యం గురించి ఆయా కథకులు తెలియజేసిన “కథల వెనక కథ” విశేషాలను అందించినందుకు నెనర్లు చందుతులసి గారూ!

    ఇట్టాంటి సంకలనాలలో మా వంశన్న – చౌరస్తా, జిందగీ, కిమోల డా. వంశీధరరెడ్డి; గజయీతరాలు గొరుసన్న; గొరుసన్న గారి రాజీ – పూడూరి రాజిరెడ్డి; వెలివాడల రోహిత్ వేములకు న్యాయం జరగాలంటూ ఉద్యమించే పింగళి చైతన్య, పచ్చాకు పొగాకును బంగారు రంగులోకి ( గోల్డెన్ టొబాకో లా బారెన్ లో కాల్చి ) చెయ్యటం చాతనవును కాని బతుకులు బాగుచేసుకోవటం చాతకాని బడుగుల వెతలు గురించి రాసే ఇండ్లచంద్రశేఖర్, కడప దేవమాసపల్లె మట్టి వాసనలు వేసే పుట్టా పెంచల్దాస్, నగువూ, ఏడుపు, కోపమూ తాపమూ, కుళ్లు బోత్తనమూ, కనికరమూ… ఇట్ల అడుగుకొక మలుపు మనిసి బతుకులో’ అంటూ జీవన వాస్తవాన్ని, తాత్విక ను ‘ఎదారి బతు కులు’ లో పరిచయం చేసిన ఎండపల్లి భారతి; మళ్ళన్నీ ఊళ్లై పోతే మట్టిని కరుసుకుని మసిలే బతుకులు బీళ్లవ్వాలిసిందే అని ఆక్రోశించిన మట్టిమనుషుల గురించి రాసిన ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి లు ఇంకా ఎందరెందరో కూడా ఇలాంటి వార్షిక కధాసంకలనాలలో వీలుకాకున్నా పాఠకులకు వీజీగా అందుబాటులో ఉండేలా చెయ్యవా?

    కథ-2017 కధల సంకలనం పుస్తకం నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారివద్ద నుండి పొందాము.

    https://www.telugubooks.in/products/katha2017

    Reply

You may also like

థాంక్యూ…తాతా…

పెద్దన్న

భానుమతీరామకృష్ణ, శివరాజు సుబ్బలక్ష్మిల శత జయంతి స్మరణోత్సవాలు!

ఎడిటర్

భానుమతిగారి అత్తలేని కథలగురించి….

నిడదవోలు మాలతి

లైబ్రరీ ఉద్యమం ఇప్పటి చారిత్రక అవసరం!

కాసుల రవికుమార్

Two Poems by Nishi Pulugurtha

Nishi Pulugurtha

శతజయంతుల జీవన పాఠాలు

కల్పనా రెంటాల

కకూన్ బ్రేకర్స్

పాణిని జన్నాభట్ల
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు

  • janamaddi vijaya bhaskar on శతజయంతుల జీవన పాఠాలుvaaastavaalni chakkagaa telipaaru. ayinaa vaaru maararu. Brown sastri gaa...
  • Jandhyala Ravindranath on లైబ్రరీ ఉద్యమం ఇప్పటి చారిత్రక అవసరం!Appreciate you for your article Sir.
  • D.Subrahnanyam on శతజయంతుల జీవన పాఠాలు"చదవకుండానే, రాయకుండానే స్టేజీ లెక్కి మాట్లాడే విమర్శక శిఖామణులు సాహిత్యానికి వచ్చిన...
  • Govind on రక్తమోడిన పాదాలుWriter details cheppandi
  • Dr.Emmadi Srinivas Rao on SujithaThe story 'Sujitha' holds a mirror to many critical...
  • Sreeni on వచ్చెన్ – విట్టెన్ – విచ్చెన్అద్భుతం లలిత గారు. ఇది నేను ఆగస్టు 16 హౌస్టన్ లో...
  • నిడదవోలు మాలతి on భానుమతిగారి అత్తలేని కథలగురించి….పునః ప్రచురించినందుకు ధన్యవాదాలు.
  • D.Subrahmanyam on పేక మేడలులేనిపోని ఆశలు తీర్చుకోడానికి ఎంత అవస్త పడలో బాగా రాసారు
  • D.Subrahmanyam on భానుమతిగారి అత్తలేని కథలగురించి….మంచి పరిచయం
  • Gowri Kirubanandan on భానుమతీరామకృష్ణ, శివరాజు సుబ్బలక్ష్మిల శత జయంతి స్మరణోత్సవాలు!'కొండవీటి కోటేశ్వరమ్మ గారి శత జయంతి' అని వచ్చింది. 'కొండపల్లి కోటేశ్వరమ్మ'...
  • బోనగిరి on లైబ్రరీ ఉద్యమం ఇప్పటి చారిత్రక అవసరం!లైబ్రరీలలో చదవాల్సిన చరిత్రలను సోషల్ మీడియాలో చదివి ప్రజలు, ముఖ్యంగా యువత...
  • Prince Kumar on SujithaSeamless translation from Telugu to English by Prof. Rajeshwar...
  • Vasanth Rao Deshpande on పేక మేడలువాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న కథ. నేటి వలస బతుకుల ఏమాత్రం...
  • Jayasurya Somanchi ( S.J.Surya ) on సినిమా పాటకు చెంగావి చీరధన్యవాదాలు సుధాకర్ గారు
  • Raja Mohan on దుబాయ్ మల్లన్నఅద్భుతమైన కథనంతో వాస్తవానికి దగ్గరగా రాసిన కథ. ఇలాంటి జీవితాలు ఎన్నో...
  • D.Subrahmanyam on ఈ రాత్రి ఇలాగే సాగిపోనీ..ఈ రాత్రి నరాల్లో నెత్తురు సంగీతమై మోగుతోంది. ఆలోచనలన్నీ కవిత్వంగా మారి...
  • Sudhakar Unudurti on సినిమా పాటకు చెంగావి చీరఆరుద్ర బహుముఖ ప్రతిభని మా కళ్లముందు నిలిపారు. మరుగునపడ్డ అనేక అంశాలనూ,...
  • Kalasapudi Srinivasa Rao on సగం కుండశాస్త్రీయ దృక్పథంలో చూస్తే, చెడ్డ ప్రవర్తనకు ఎలాంటి లింగ పక్షపాతం ఉండదని...
  • సిద్ధార్థ on పేక మేడలుకథ మంచిగా ఉందన్నా.. చిన్న ఉద్యోగాలకి వచ్చిన వాళ్లకి గత కథల...
  • Sambaraju Ravi Prakash on శతజయంతుల జీవన పాఠాలువ్యాసం బాగుంది. ఆయా ప్రముఖుల పుస్తకాలు కొని చదవాలన్న సూచన ఇంకా...
  • హుమాయున్ సంఘీర్ on సరితసరిత కథ బాగుంది. మొగుడి అప్పులు తీర్చడానికి ఆమె బలైన తీరు...
  • Padmavathi Peri on ముస్లింల రామాయణం చాలా మంచి information ఇచ్చారు శ్రీధర్ గారు,మేము బాలి వెళ్ళాలి అనుకుంటున్నాము,మీ...
  • Aparna Thota on కకూన్ బ్రేకర్స్Beautiful!
  • Lakshmi Narayana Sarva on అమూల్యానుభవాల సృజనాత్మక ‘వ్యూహం’చాలా బాగుంది
  • Ram sarma on అమూల్యానుభవాల సృజనాత్మక ‘వ్యూహం’Superb analysis on our favourite and respected senior writer...
  • Swapna Dongari on SujithaI have read the story Sujitha in Telugu and...
  • Talari Sathish kumar on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుచాలా సంతోషం మిత్రమా 🥰
  • Talari Sathish kumar on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుమీ పలకరింత బాగుంది. సంతోషం ☺️
  • Talari Sathish kumar on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుThankyou so much sir 🥰
  • Talari Sathish kumar on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుThankyou so much sir ♥️🙏
  • KAMESWARA RAO Konduru on విభిన్న దృశ్యాల మేళవింపు ఒడెస్సాWonderful experiences on board and off board. కళ్ల కు...
  • Ch.A.Rajendra Prasad on SujithaThe translated version of the story, titled, " Sujitha,"...
  • ఆచార్య గిడ్డి వెంకటరమణ on శతజయంతుల జీవన పాఠాలుశతజయంతుల జీవన పాఠాలు వ్యాసం వాస్తవాలకు దగ్గరగా ఉంది. నేటి సాహిత్యం...
  • Prasad Chennuri on విభిన్న దృశ్యాల మేళవింపు ఒడెస్సానేను సుధాకర్ గారి కథలు, వ్యాసాలు చాలానే చదివాను. అవి చదివిన...
  • ramadevi singaraju on ఆ చిత్రాలు మిగిలి వుంటాయి నాలో!చిత్ర కళకి బాపు జీవ రేఖ వంటి వారు అని ఎంత...
  • Firdous Arjuman on SujithaI am honoured to have read Sujitha. It revolves...
  • S. Narayanaswamy on శతజయంతుల జీవన పాఠాలుమంచి వ్యాసం కల్పన గారు. గతించిన సాహిత్య దిగ్గజాలని కనీసం ఇలా...
  • హుమాయున్ సంఘీర్ on పేక మేడలుగల్ఫ్ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా...
  • B V V Prasad on బివివి ప్రసాద్ కవితలు రెండుధన్యవాదాలు 🙏
  • Surender on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుమిత్రమా, నీ కవితలోని ప్రతీ పంక్తి, ప్రతి భావం అద్భుతం! నిజంగా...
  • అత్తలూరి విజయలక్ష్మి on సగం కుండసగం కుండ కథచదివాను. శ్రీనివాసరావు గారు తను స్త్రీ వాదానికి వ్యతిరేకిని...
  • అత్తలూరి విజయలక్ష్మి on సగం కుండసగం కుండ కథచదివాను. శ్రీనివాసరావు గారు తను స్త్రీ వాదానికి వ్యతిరేకిని...
  • sridhar narukurti on కకూన్ బ్రేకర్స్మరి ట్రాన్స్ జెండర్స్ ఎలా బ్రతకాలి ? తనలాంటి వారితో కలిసి...
  • D.Subrahmanyam on పక్షి పేరు ప్రతిఘటన"ఒక రోజు చెట్టు విరిగిపోవచ్చు మనిషి నేలపై పడిపోవచ్చు కానీ గాలి...
  • పాణిని జన్నాభట్ల on ముస్లింల రామాయణం బావుంది శ్రీధర్ గారూ. 'అసలు మతం పేరుతో జరిగే హింస నిజంగా...
  • S. Narayanaswamy on కకూన్ బ్రేకర్స్మీ కథలోని అంశాన్నీ, కథ నడిపిన విధానాన్నీ రెండిటినీ నిర్ద్వంద్వంగా తీవ్రంగా...
  • Venkatesh on తలారి సతీష్ కుమార్ కవితలు రెండుకవి రాసేను తన భవాని ... కలము పట్టి ...తనలోని భధాని...
  • T SAMPATH KUMAR on ఈ రాత్రి ఇలాగే సాగిపోనీ..గొప్ప వాక్యాలు. లోతైనవి. పదేపదే చదవాలనిపించే సమకాలీన జీవిత సత్యాలు. రాత్రుళ్లు,...
  • Balaramulu Chinnala on SujithaProf. Mittapally Rajeshwar deserves sincere appreciation for his extensive...
  • Anil అట్లూరి on విభిన్న దృశ్యాల మేళవింపు ఒడెస్సాబాటిల్‌షిప్ పొటెం‌కిన్, ఆ ఒడెస్సా మెట్లు మరీ ముఖ్యంగా పసిపాప ఆ...

సారంగ సారథులు

అఫ్సర్, కల్పనా రెంటాల, రాజ్ కారంచేడు.

Subscribe with Email

రచయితలకు సూచనలు

రచయితలకు సూచనలు

How to submit English articles

How to Submit

ఆడియో/ వీడియోలకు స్వాగతం!

సారంగ ఛానెల్ కి ఆడియో, వీడియోల్ని ఆహ్వానిస్తున్నాం. అయితే, వాటిని సాధ్యమైనంత శ్రద్ధతో రూపొందించాలని మా విన్నపం. మీరు వీడియో ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సారంగ టీం తో ముందుగా సంప్రదించండి.

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

సారంగ సాహిత్య వార పత్రిక (2013-2017)

Indian Literature in Translation

Indian Literature in Translation

Copyright © Saaranga Books.

  • శీర్షికలు
    • అనువాదాలు
    • కాలమ్స్
    • విమర్శ
    • కవిత్వం
    • కధలు
    • ధారావాహిక
  • కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రత్యేక సంచిక
  • Saaranga YouTube Channel
  • English
  • మీ అభిప్రాయాలు 
  • ఇంకా…
    • మా రచయితలు
    • పాత సంచికలు