వేలి కొసలమీద ఎత్తెత్తి అడుగులు మోపుతూ
నడిచి వెళ్లిపోతుంది
నిశ్శబ్దం లాగే, రాత్రిలాగే
స్వరం కోల్పోయిన భాష.
మన్నుతిన్న పాములా ఓపక్కన ఒరిగి
చిక్కటి చీకటిని స్వప్నాల్లో ఊరేగిస్తూ
తుంపరలు తుంపరలుగా రోదిస్తూ
దిగాలుపడి దిక్కులు చూస్తుంది.
వెనకాల వీప్మీద మోస్తున్న గతం తనదో
సాగి వచ్చిన ఆధునిక తరం నాలుకల మీద
మొలుస్తున్న ముళ్ళపొదలు తనవో
బేరీజు వేసుకోలేక
దారితప్పిన సంస్కారం ఊబిలో ఇరుక్కుపోయి
బిక్కు బిక్కు మంటూ
వెక్కిళ్ళు పెడుతుంది భాష.
కర్కశత్వం ఘనీభవించి
నడినెత్తిన మంచు పర్వతంలా వేళ్ళాడుతున్నట్టు
పాతాళం అట్టడుగున కూరుకు పోయిన అస్థిత్వం
పెగుల్చుకు రాలేక కృంగిపోనూ లేక
బూతా సురుల యుద్ధం మధ్యన
గాయపడుతూ రక్తపు నదులవుతూ
శరణంటూ సాగిల పడుతోంది భాష
అవమానం పదునైఅన కత్తి తోలు ఒలిచేసిన మొహంతో
తొక్క తీసిన బీట్రూట్ దుంపలా
ఆత్మగౌరవం స్రవిస్తున్న రక్తపు ముద్దలా
ఎర్రెర్రని రూపంలో మెలికలు తిరుగుతూ అక్షరాలు.
బూతు జెండాలు ఎగరేస్తూ నగ్నంగా రోడ్లమీద
ధర్నాలు జరుపుతున్న అభ్యుదయం
పిడికిట్లో గిజగిజలాడుతూ కోడి పిల్ల మెడలా భాష
అహం లావాలా ఎగిసి సంస్కారానికి చితిపేర్చి
ఎవర్ని వారు దహించుకున్నాక
నిస్త్రాణగా నాలుకతో పెదవులు తడి చేసుకుంటూ
మిగిలిన చేయూత కోసం అంగలారుస్తుంది భాష.
*
Nice write up
అహం లావాలా ఎగిసి సంస్కారానికి చితిపేర్చి
ఎవర్ని వారు దహించుకున్నాక……..
Excellent lines!