1.
విశ్రాంతి
అవసరం అయినప్పుడు
అంతా
చీకటిని ఇష్టపడతాను
అప్పుడే,
ఈ లోకాన్ని మరచి
గాఢనిద్రలో
నాతో నేను గడుపుతాను.
అందుకే పగలు కన్నా
రాత్రిని ఎక్కువ ప్రేమిస్తాను.
2.
ఊహకందని గందరగోళం
వెంపర్లాట
దారి తెలియని రాత్రులు
పాదాల కింద ముక్కలవుతున్న
ఎండుటాకులు
కర్ కర్ మని చప్పుడు
గుండెను కోస్తున్నట్టుగా
వినలేని శబ్దాలు
వణికే ప్రాణం
అకారణంగా వీచే ఈదురుగాలులు
కళ్ళల్లో నలత పడ్డ బాధ
అంత చీకటిలోనూ అప్పుడప్పుడు
మినుక్కుమనే మిణుగురులు
ఆ కాంతిలో అక్కడ ఎవరివో
పాద ముద్రలు కనిపిస్తూ
ఏదో ఆశ తళుక్కుమంటూ మెరుస్తుంది
భరోసా ఏదో దొరికినట్టుగా..
3.
ఆకాశం
బూడిద రంగులో
కనిపిస్తోంది
ఆకుల మీద
మంచు ముత్యాలను లెక్కపెడుతూ నేను,
పాటలు పాడుతూ
కొన్నిపక్షులు
వినడానికి హాయిగా వుంది.
పిల్లలు, కుక్కలు ఆహారం కోసం
ఆసక్తిగా వున్నాయి
గద్దల, గుడ్లగూబల చూపు మాత్రం
తీక్షణంగా వుంది
రాత్రి నక్షత్రాలు మెరుస్తుంటాయి
కానీ
అవి చాలా దూరంగా దూరంలో
వుంటాయి.
సముద్రం ఎప్పటిలా గంభీరంగానే వుంది
అయినా
అలలు ఆహ్లాదంగా కదులుతున్నాయి.
4.
జీవితంలో
పరిచయాలు కూడా
ఋతువులలాంటివే –
ఒకటి వసంతమైతే
మరొకటి శిశిరమవుతుంది అంతే..హాయిగా స్నేహం
దేనితోనైనా చేయవచ్చు
చెట్టుతో, పిట్టతో
కొండాకోనతో (అడవితో)
పుస్తకంతో
వాటికి కులం, మతం, జాతి అనే
వైరాలేవీ వుండవు కాబట్టి.
*
బావుంది
🌹🌹👌👌సూపర్ మేడం 🙏🙏🌹🌹