బ్రాహ్మణ మానవుడు

కుల దృక్పధాన్ని, భావజాలాన్ని ఆధిపత్యాన్ని చూపించని వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళమీద గౌరవం ఏర్పడుతుంది అనుకుంటాను.

మనుషులు మనుషుల్లా జీవించటానికి కులం ఏ రకంగాను ఉపయోగపడదు అనే సత్యం తెలిసినవాళ్ళు అగ్రకులాల్లో చాలా అరుదు.చూపు మాట వైఖరి భాష చాలామటుకు కుల పైత్యాన్ని తెలియపరుస్తాయి. పుట్టుకతో అనువంశికంగా కులం రావటమే తప్ప,తాను బ్రాహ్మణ కులంలో పుట్టాననీ,వేదాలు ఉపనిషత్తులు చదివాననీ,రామాయణ మహాభారతాలు అవపోసన పట్టాననీ,నరసింహ శతకాన్ని వల్లిస్తున్నాననీ, ఒంటిమీద జంజం ఉందనీ,తన కులo ఆచార వ్యవహారాల స్తoభంపై నిలబడిందనీ,అసలేమాత్రమూ పట్టింపులేకుండా,కుటుంబం హెచ్చరిస్తున్నా ఖతారు చేయకుండా బతికి జీవించాడు మాఊరి మహామనిషి శ్రీ రామాచార్యులు వారు. వాళ్ళ తాతగారు ఎక్కడినుండో మావూరికి వలసవొచ్చారని ఊరి వాళ్ళు అప్పుడప్పుడు చెప్పుకుంటారు. రామాచార్యుల వారిని అందరూ అబ్బాయిగారు అంటుండేవారు. అబ్బాయిగారి తండ్రిగారు మొదట్లో పూజలు పెళ్లిళ్లు చేసి కుటుంబాన్ని వెళ్లదీసేవారు.

ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారని ఇరుగుపొరుగు చెప్పుకుంటారు.ఈ బ్రాహ్మణ కుటుంబం మా ఊరు వొచ్చిన చాలా ఏళ్లకుగాని దేవుడు మాన్యంపై హక్కుదారుల్ని చేయలేకపోయారు ఊరివాళ్లు .దేవుడి మాన్యం చేతికొచ్చాక ఆర్థికంగా కుటుంబం బలపడింది. దానితోపాటు వీరి పురోహిత్య డాంబికం, మేమే జ్ఞానవంతులమనే వంశపారపరమైన ఆధిపత్యం కూడా బాగా పెరిగింది రామాచార్యులు తండ్రికి.ముగ్గురు కొడుకుల్లో రామాచార్యులు ఒక్కరే తండ్రి భావజాలాన్ని వ్యతిరేకిచ్చేది. తన బాట తనదే.బ్రామ్మలు కుటుంబీకులతో తప్ప మిగతా కులపోల్లతో ఎటువంటి సంబoదాల్ని పెట్టుకోవడానికి అతను ఇష్టపడేవాడు కాదు.ఇతరులంటే ఒకరకంగా అసహ్యం తనకి.ముక్కుకు గుడ్డఅడ్డుపెట్టుకొని మాట్లాడేవాడు.గడప దాటానిచ్చేవాడు కాదు ఎవర్ని.దేవుడి పలహారాన్ని కూడా దోసిలి పట్టుకోవాలి.
అబ్బాయిగారు మాత్రం దీనికి భిన్నం. కారణo అతని చదువు అయుండొచ్చు.యాబయిల్లోనే పిజి చదివి ప్రభుత్వ పాఠశాలకు లెక్కలు మాస్టారు అయ్యారు.జీవితపు పరమార్ధాన్ని గ్రహించినట్టు తెలుస్తుంటుంది వారితో మాట్లాడితే. ఉదయం నుండి సాయంత్రం వరకు బడిలో సేవలు చేసి విద్యపట్ల అవగాహన కలిగించేవారు.సాయంత్రం తరువాత వైద్య సేవలు చేస్తూ ఊరి జనానికి ఉపయోగ పడుతుండేవారు.”చదవాలి…బాబు,అందరూ బాగా చదవాలి” అనే వారు.

చిన్నపిల్లల్ని పనికి పంపడం చూసి దుఃఖపడేవారు.చొక్కా గుడ్డలు లాగులు,పలక బలపాలు ఇచ్చేవారు.అబ్బాయిగారు చెప్తే వినేదశ నుండి విన్నదాన్ని ఆచరించే స్థాయికి వొచ్చారు చాలామంది జనం.అబ్బాయిగారు చెప్పారంటే అదే ఫైనల్.దగ్గుతోనో జ్వరంతోనో విరోచనాలతోనో ఎవరు ఆరోగ్యం బాగలేక తన గుమ్మం తొక్కినా విసుగు లేకుండా వైద్యాన్ని అందిస్తూ ఉచితంగా మందుల్ని ఇచ్చేవారు.ఇవ్వడానికి తనదగ్గర కూడా అందుబాటులో లేని మందులు కొనుక్కోవడానికి కావలిసిన డబ్బుసాయం కూడా చేసేవారు.

మానాయనమ్మ పేరు లక్ష్మి. పుట్టుకతో తనకి ఉబ్బసం అనే జబ్బు ఉండేది.దాని మూలంగా నాయనమ్మ ఏనాడూ మనశ్శాంతిగా బతికిందిలేదు.మబ్బులు పడితే ఇక ఆరాత్రి అంతే.. మబ్బులన్ని ఆకాశానికి కాకుండా తన ఊపిరి తిత్తులకు పట్టినట్టుండేది.

అంతగాలిలో కనీసం ముక్కుకు సరిపడా గాలి ఊపిరిగా మారకపోవటమే విషాదం.ఊపిరి ఆడదు.ఊపిరి
తీసుకోవడానికి వీలుండదు. నరకం. ఉబ్బసం.

ఉబ్బసంలోంచి ఆయాసం.ఆయాసంలోంచి దగ్గు,దుగ్గుతో పాటు నోటినుండి కారే కళ్లె.ఆకళ్లెని ఉమ్మడానికి ఓ రాతెండి బొచ్చే.ప్రతి రెండుమూడు గంటలకు ఒకసారి కళ్లె ఊసిన రాతెండి బొచ్చెను బయట వొoపడానికి ఒక మనిషి.ఆ మనిషి ముఖంలో అయిష్టాన్ని మించిన అసహ్యం.ఇది ఉబ్బసంతో బాధపడే మానాయనమ్మ రోజువారీ ప్రొఫైల్.ఎన్నో మందులు తిన్నది.మరెన్నో ఆకుపసరలు తాగింది.చేప మందు కూడా మింగింది.చేప మందు అంటే బతికి ఉన్న చిన్న చేపలోని మందుపెట్టి ఇస్తారు దాన్ని యధాతదంగా మింగేసి నీళ్లు తాగాలి.చేప మందు ఒకటికాదు రెండుకాదు ఏకంగా ఐదారుసార్లు మింగిన ఏ మార్పు లేదు.ఉబ్బసం ముఖ్యంగా వానాకాలం విజృంభించేది.అర్ధరాత్రో అపరాత్రో కాలంతో సంబంధ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు డాక్టర్ అవసరం ఉండేది.బెటనసాల మందు గోలి వేసుకంటే గాని కాస్త నిద్రపోయేది కాదు.ఒక్కోసారి రెండుమూడు బెటనసాల బిల్లలు మింగినా ఉపయోగం ఉండేది కాదు.

అప్పుడు మాతాత, నేను నాయనమ్మని అబ్బాయిగారి ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం.మా తాతగారి ఇల్లు ఊరికి ఒకవైపు చివరన ఉండేది.అబ్బాయిగారి ఇల్లు ఉరికి మరోపక్క చివరన ఉండేది.తాతగారి ఇంటినుండి అబ్బాయిగారి ఇంటికి కిలోమీటర్ దూరం ఉంటుంది.ఇంటినుండి అబ్బాయిగారి ఇంటికి ఆ కిలో మీటర్ దూరం చేరడానికి కనీసం రెండుగంటలు సమయం పట్టేది.తాతగారి ఇంటిముందు నుండి అబ్బాయిగారి ఇంటిదాకా రోడ్డు రాళ్లరోడ్డు.అడుగు తీసి అడుగు వేస్తే రోడ్డునిండా గతుకులు.వాన కురిసి రోడ్డంతా బురద.రోడ్డుకూడా సమానంగా ఉండదు.రోడ్డుమాధ్యలో ఎత్తుగాను, అటుచివర,ఇటుచివర పల్లంగాను ఉండేది.ఎప్పుడు అబ్బాయిగారి ఇంటికి పోయినా మాతాత పాత సైకిల్ మీద మానాయనమ్మని అతికష్టంగా కూర్చోపెట్టి ముతకబస్తాతో గొంగళి కప్పుకొని,అతిబరువుగా ఉండే నాయనమ్మని తాత వెనకపట్టుకుంటే నేను చాలా బలంగా సైకిల్ హ్యాండిల్ పట్టుకొని మెల్లగా తీసుకెళ్లేవాళ్ళం.ఒక్కోసారి నాబలం సైకిల్ని నడపడానికి సరిపోయేది కాదు.కాళ్ళు జర్రన జారేవి.తేరుకొని మళ్ళీ గట్టిగా హ్యాండిల్ని పట్టుకొని ముందుకు వెళ్ళటం.నెత్తి మీదనుండి వాన ధారాపాతంగా కారేది.ఒకవైపు వాన మెరుపులు,ఇంకోవైపు జారేరోడ్లు,మరో వైపు ఊపిరి అందక నాయనమ్మ అరుపులు.

బిక్కుబిక్కు మంటూ ఒంటిగంటకో రెండింటికో అబ్బాయిగారి ఇంటికి చేరి తలుపు కొడితే వెంటనే స్పందించి కండువా ఒకటి ఇచ్చి తడి ఒంటిని తూడ్చుకొమనేవారు.ఊపిరి అందక అవస్థలు పడే నాయనమ్మకి దైర్యం మాటలు చెప్పి మందులు ఇచ్చేవారు.తగ్గకపోతే బులుకోసు సీసా పెట్టేవారు.తెల్లవారేదాకా గమనిస్తూ నన్ను తాతని పడుకోమని ఈతకు చాపని ఇచ్చేవారు.పీసుపీసు తెల్లవారేదాకా మేల్కొని తగ్గిన తరువాతఇంటికి తీసుకెళ్లమనేవారు.మేమే కాదు.నాయనమ్మే కాదు.ఎవరు ఏ టైంలో వెళ్లినా తన రియాక్షన్ ఇలానే ఉండేది.కుమ్మరివాళ్ళు వెళ్లని,తురకలు వెళ్లని,మాలమాదిగలు వెళ్లని,కమ్మలు కోమటిలు ఎవరు వెళ్లినా తన మాట తన పద్ధతి కొంచంకూడా మారేదీ కాదు.ఇలా ఉన్నందుకు ఇలా బతుకుతున్నందుకు తన తండ్రికి తనకి ఎన్నోసార్లు వాగ్వాదం జరిగినా తాను ఎలా మనుషుల్ని చూడాలనుకున్నారో అలానే చూసారు.అబ్బాయిగారు దేవుడు అంటారు అందరు.అతడి రాకను చూసి పేకాడేవాళ్ళు ముక్కల్ని విడిచి పరుగెత్తి పోయేవారు.

గొడవలు పెట్టుకునేవాళ్ళు సద్దుమణిగేవారు.
మందుబాంబులు కాసేపు సన్యాసం పాటించేవారు.
నిశ్శబ్దం అంతా.ఒకరిని తిట్టరు.ఒకరంటే అసహ్యం ఉండదు.ఎవరిని ద్వేషించరు.ఎవరితోనూ గొడవలు ఉండవు.నిశ్శబ్దంగా జీవించారు.తక్కువ మాట్లాడి ఎక్కువ సాయపడ్డారు.ఏరా.. పెద్దన్న ఎలా ఉన్నావ్..రా కూర్చో అని కూర్చి వేసేవారు.చదవమని చెప్పేవారు.
కవిత్వం రాయమనేవారు. రాసినవి చదివి వినిపించమనేవారు.విన్నవెంటనే నచ్చితే కౌగిలించుకునేవారు.తన దగ్గర అప్పటికి ఏముంటే అది గిఫ్టుగా ఇచ్చేవారు.బ్రామ్మళింట్లో కూర్చొటం, బ్రామ్మళింట్లో తేనీరు తాగటం,బ్రామ్మలు ముందు కవిత్వం చదవటం.బ్రామ్మడు కౌగిలి దక్కించుకోవటం మర్చిపోలేని అరుదైన జ్ఞాపకం.ఇదంతా అతని ఔన్నత్య వ్యక్తిత్వం వల్లనే.ఎప్పుడు ఊరు వొచ్చినా అబ్బాయిగారిని కలిసేవాడిని మాట్లాడేవాడిని.అమ్మని అడిగి తెలుసుకునేవారు..అబ్బాయిని బాగా చదివించమని అమ్మకి ఎన్నోసార్లు చెప్పేవారట.

గొప్పవాడు..గొప్పవాడు..మహామనిషి..మహామనిషి..ఇవి ఊరు తనకి ఇచ్చిన విశేషణాలు.

అంతా హాయిగా సాగుతున్న సమయాన ఒకానొక రోజు అబ్బాయిగారు ఇల్లు చేరారు ఎదో వాహనంలో ఒట్టి దేహంగా.ఊరు ఉండబట్టలేకపోయింది.అందరు నటించకుండా కన్నీరు పెట్టుకుంది అబ్బాయిగారి ఒక్కరి మరణానికేనేమో?ఊరి హృదయం గాజుపెంకులా పగిలిపోయింది.ఊరి గుండెల్ని లబ్డబ్ మనిపించిన తన శతస్కోప్ ఇప్పుడు మూగబోయింది.మందుబిల్లల్ని దానం చేసిన చేతులు కదలకుండా పడుకున్నాయి. ఏ రాత్రి తలుపుకొట్టినా తీసే మానవుడు ఒకరు ఇప్పుడు నిద్రపోతున్నాడు అచేతనంగా.ఊరు విలవిల్లాడింది.
తను లేకపోవటాన్ని భరించలేకపోయింది.తన ప్రతిరూపాన్ని విగ్రహంగా చెక్కుకుంది.ప్రతివాడి హృదయ మైదానం మీద సంతకం ఒకటి చేసుంటుంది దానిపేరే అబ్బాయిగారు. బ్రాహ్మడు చనిపోయాడు అని ఎవరూ అనలేదు.మనిషి చనిపోయాడు అన్నారు.మనిషికి అంతకుమించిన గొప్ప గౌరవం ఏముంటుంది?

ఉబ్బసాన్ని ఎదుర్కోలేక చనిపోయింది నాయనమ్మ. ఉబ్బసం ఇచ్చే కొంతకాలాపు జీవితాన్నయినా ఇవ్వకుండా గుండెపోటు తీసుకుపోయింది అబ్బాయిగారిని..నాయనమ్మ చావుకంటే అబ్బాయిగారి మరణమే నన్ను ఇప్పటికి ఎప్పటికి కదిలిస్తూనే ఉంటుంది..

(డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లో తప్ప బతుకుతున్న జీవితంలో బ్రాహ్మణత్వం అసలు లేని మామ బుజ్జిగాడు ముక్కామల చక్రధర్ గారికి ప్రేమతో ఈవ్యాసం అంకితం)

*

పెద్దన్న

11 comments

Leave a Reply to Peddanna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ ఊరు రామాచార్యులూ ఈదేశంలో మైక్రో మైనార్టిస్ . నాదేశం నిండా ఆచార్యులే

    • అవును…వెలుగు సైజు చిన్నదేన వెలుగు వెలుగే..అరుదైన మనిషి

  • మంచి కథ! మానవత్వానికి కులం లేదని మరోసారి జ్ఙాపకం చేశావు. “జన్మనా జాయతే శూద్రః కర్మనా జాయతే ద్విజః” అన్న ఆర్యోక్తి అక్షరాల ఋజువు చేసి చూపెట్టావు. పుట్టుకతో ప్రతీ వాడు శూద్రుడే, తను చేసే కర్మల వలన ప్రతీ వాడు ద్విజుడే. ద్విజుడు/బ్రాహ్మణుడు అనేది ఒక కులానికి సంసంధించిన మాట కాదని సంస్కృతం/ తెలుగు నిఘంటువులు చెబుతున్నాయి. ఆమాటకు అర్థం జ్ఙాని/పండితుడు అని తెలుసుకోవాలి. ఇప్పుడు వేదాలు అన్ని కులాల వారికి నేర్చుకునే అవకాశం టి.టి.డి. వారు కల్పించారు. రామాచార్యులు నిజమైన మానవతావాది, అసలు సిసలైన ‘జ్ఙాని’ అసలు సిసలైన ‘పండితుడు. వారికి నా హృదయపూర్వక నివాళులు మరియు ఈ రచయితకు అభినందనలు.

  • కుల దృక్పధాన్ని, భావజాలాన్ని ఆధిపత్యాన్ని చూపించని వ్యక్తులు ఎవరైనా సరే గౌరవాన్ని పొందుతారు బాగుంది
    కులపు వాసన లేనివాళ్ళు అరుదు
    గౌరవం కోసం కులపిచ్చి లేనట్టు నటించే వారే ఎక్కువ
    జరిగిన విషయాన్ని ఆత్మీయంగా నిజాయితీగా చెప్తారు మీరు

  • ఇటువంటి మనస్తత్వం నీ అలవాటు చేసుకోవాలి.

  • పెద్దన్నా చాలా బాగుంది. కుల వ్యవస్థ వలన వచ్చిన చెడును మాత్రమే ద్వేషిస్తూ, మనిషిలోని మంచిని మాత్రమే చూసే నీ సంస్కారం
    నాకు నచ్చింది. మన చుట్టూ ఉన్న వ్యవస్థ లలో బాగా లేనివి చాలా ఉన్నాయి. బాగా లేని వ్యవస్థ పై ద్వేషం ఆ కులం మనుషులపై ద్వేషంగా మారనీయవని నా విశ్వాసం
    Kudos. Baagumdi.😀👍.

    • అప్పుడెప్పుడో ఇంటర్ చదువుతున్నప్పుడు…భుజం మీద చెయ్యేసి చదువు చెప్పి,ఇంగ్లీష్ నేర్పి బతుకు దిద్దినది మీరు
      మీరు మరో రామాచార్యులు…

  • Ramacharuli gari goppathanam thana kulam ledani thanu chese sevalone goppathanam undi ani andariki ardam ayyela baga rasav annaya… Nice… (Twaraga andarilo caste feelings povalani korukuntunnanu)

  • రామాచార్యులు గారి గురించి చదువుతుంటే
    చరిత్ర పుస్తకంలో ముగ్గురు నలుగురు మహానుభావుల గురించి ఒకేసారి చదివిన అనుభూతి
    కలిగింది.
    అబ్బాయి గారు నిజంగా దేవుడు.
    రామాచార్యులు గారు మీ ఊరు రావడం నిజంగా మీ ఊరి అదృష్టం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు