బ్రహ్మీ లోకాలు

పొద్దెక్కడాన్ని బట్టి చూస్తే లోకానికి తెల్లారి చాలా సేపే అయింది గానీ అప్పటికి బ్రహ్మీకి ఇంకా తెల్లారే టైమ్ కాలేదు. టైమ్ కాలేదని తెలుసుకోవాలే తప్ప ‘బ్రహ్మీకి ఎన్ని గంటలకు తెల్లారుతాది?’ అని అడక్కూడదు. ఎందుకంటే ఏరోజుకారోజు క్లైంటు కాల్ ఉందా లేదా? ఉంటే ఎన్ని గంటలకుందనేదాన్ని బట్టి తెల్లారుతాది.

గతజన్మలో (అంటే కరోనా భయం లేకుండా, రోజూ మామూలుగా ఆఫీసుకు పోతూ ఉండిన రోజుల్లో) దాదాపు టీమ్ అంతా ఒకేచోటి నుంచి పని చేసేవాళ్ళు కాబట్టి అవసరమున్నప్పుడు ఆఫీసు ఫ్లోర్లో, లేదంటే తీరుబాటుగా బ్రేక్ టైమ్‌లో ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడుకునే వీలుండేది.

కరోనా ప్రభావంతో నెలల తరబడి ఇంటి నుంచి పని చేస్తూండడం వల్ల టీమ్‌మేట్ల మధ్య కంటికి కనబడని ఇనుప తెరలు ఏర్పడినట్లు అనిపిస్తూంటాది ఒక్కొక్కసారి. సంవత్సరం నుంచీ ఒకే టీములో పనిచేస్తూ, టీమ్ కాల్స్‌లో రోజూ మాట్లాడుకుంటున్నా నేరుగా ఎదురుపడితే ఒకరినొకరు గుర్తుపట్టలేని విచిత్ర పరిస్థితి.

అందుకే కాబోలు “ఇంటి నుంచి పని” చెయ్యడాన్ని ఈ మధ్య క్లుప్తంగా ఇ.ను.ప. అంటున్నారు. కాల్స్‌లో కెమెరాలు తప్పని సరిగా ఆన్ చెయ్యాలని మేనేజర్లు, ఎచ్చార్ వాళ్ళు చెప్పినా, ఇంట్లో బ్యాక్‌గ్రౌండ్ బాగాలేదని కొందరు, బ్యాండ్‌విడ్త్ సరిపోలేదని ఇంకొందరు తప్పించుకున్నారు. అది చూసి, మొదట్లో సిన్సియర్‌గా ఆన్ చేసిన ఒకరిద్దరు కూడా మానేశారు.

ఏదైనా పెద్ద టీమ్‌లోకి కొత్తగా మారినప్పుడు, తన టీములోనే ఎవరెక్కడ ఏ టైమ్ జోన్లో ఉన్నారో గుర్తుండక, కంప్యూటర్ తెరలే ఇనుప తెరలుగా పరిణమించిన ఈ రోజుల్లో తన కింద ఉండే జూనియర్లు, తనతో ఉండే తోటి బ్రహ్మీలు, తనకన్నా సీనియర్లు, ఆపైనుండే లీడ్లు, డామేజర్లు వీళ్ళలో ఎవడికెప్పుడు తెల్లారితే అప్పుడు తనకు అవసరమనిపించిన ఒకరిద్దరితో కాల్ పెడతాడు. తీరా కాల్ మొదలయ్యాక ఆ అవసరాలు కరోనా వైరస్ లాగ ఒకడి నుంచి ఒకడికి విస్తరిస్తూ వస్తాయి. వాళ్ళందరినీ కాల్‌లోకి చేరుస్తూ పోతారు.

అలాంటి ఆపద్ధర్మపు కాల్స్‌లో మర్యాదస్థులు ఉండరని కాదు. వాళ్ళు “ఆ టైమ్ జోన్లో వాళ్ళను ఈ టైమ్‌లో డిస్టర్బ్ చెయ్యడం బాగుండదేమో” అని మర్యాదగా నసుగుతారు. మిగతావాళ్లలో పెద్దనోళ్ళున్నవాళ్ళు (ప్రతి కాల్‌లో ఇలాంటివాళ్ళు తప్పక ఉంటారు) ఆ అభ్యంతరాన్ని వీటో చేసేస్తారు. మర్యాదస్థులేమో గట్టిగా అభ్యంతరపెట్టడం కూడా మర్యాద కాదని ఊరుకుంటారు. అట్లా అందరూ చేరాక, మధ్యలో జారిపోయినవాళ్ళు పోగా చివరికి కాల్ మొదలుపెట్టినవాణ్ణి వదిలేసి మిగతావాళ్ళు వాదులాడుకుంటారు. ఆ గుంపులో ఎవడికి ఎప్పుడు తెల్లారిందనేది మనకిప్పుడు అంత అవసరమా చెప్పండి?

* * *

బ్రహ్మీ బిర్రుగా ముసుగుతన్ని తురీయావస్థలో విహరిస్తున్న ఒక శుభోదయాన ఈ విశాల భూప్రపంచంలోని ఖండాంతరాల్లో ఎక్కడినుంచో ఎవడో టీమ్ కాల్‌లో బ్రహ్మీని చేర్చగా మనవాడి మొబైల్లోని ఎమ్మెస్ టీమ్స్ యాప్ తన చెవుల రింగుమని మారుమోగింది. కళ్ళు తెరవకుండానే అసంకల్పితంగా దుప్పటి కింది నుంచి చెయ్యి బయటికి చాచి ఫోన్ ఎత్తాడు.

కొంపలంటుకున్నప్పుడు ఫైర్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడే టోనులో ఎవరెవరో ఏదో అంటున్నారు. ఆ గోలకు మెలకువ వచ్చేసింది గానీ లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇలాంటి ఆర్తనాదాలకు ఒక మాదిరిగా అలవాటుపడ్డ బ్రహ్మీ ‘రోజూ కాలే కొంపలకు కంగారెందుక’న్నట్లు తాపీగా “లాగినై చూస్తానుండు” అని వినేవాళ్లకు అర్థమయ్యీ అవనట్లు గొణిగి, మొబైల్ పక్కన పారేసి “ఇంత పొద్దున్నే ఎవడ్రా కాల్(కాల) బెట్టింది?” అని తిట్టుకుంటూ, తూలుకుంటూ వెళ్లి ల్యాప్‌టాప్ అందుకున్నాడు.

తెల్లవారుఝాము నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ల్యాప్‌టాప్ చల్లగా చేతికి తగిలింది. కాసేపటికల్లా అది వేడి సెగలుగక్కుతూ ఉంటాది. ల్యాప్‌టాప్ తెరచుకోవడానికి వేలి ముద్దరేసి, అది తెరుచుకున్నాక వీడీఐకి కనెక్టవడానికి బ్రౌజర్లో లింకు తెరిచి యూజరైడీ, పాస్‌వర్డ్ కొట్టాడు. నెట్‌వర్క్ సమస్య ఉన్నట్లుంది. నిదానంగా లోడౌతూ ఉంది.

తను వాడుతున్నది కంపెనీ వాళ్లిచ్చిన ల్యాప్టాపే అయినప్పటికీ దాంట్లో నేరుగా క్లైంట్ అప్లికేషన్ను రన్ చెయ్యడం అటుంచి క్లైంట్ నెట్వర్కుకు కనెక్టవడానికి కూడా లేదు. ముందు ఇక్కడి నుంచి తమ కంపెనీ తనకు క్లౌడ్’లో కేటాయించిన కంప్యూటర్లోకి కనెక్టవాలి. అక్కడెక్కడో అల వైకుంఠపురంబులో, నగరిలో, ఆ మూల సౌధంబు దాపల దుర్భేద్యమైన రక్షణ వలయంలో ఉన్న(దని నమ్ముతున్న) కంప్యూటర్ స్క్రీన్ను ఇక్కడ తనకెదురుగా ఉన్న లాప్టాపులోకి తెచ్చుకుని, దాన్ని చూస్తూ ఆపరేట్ చెయ్యాలి. కాబట్టి దాన్ని మిథ్యా కంప్యూటర్ (వర్చ్యువల్ మెషీన్) అని, దానిచేత పనిచేయించే ఏర్పాటును వర్చ్యువల్ డెస్క్‌టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (వీడీఐ) అని అంటారు. అంటే జానపదకథల్లో ఉండే మాయాదర్పణం లాంటిదన్నమాట.

తన కంపెనీ వీడీఐ నుంచి అదే పద్ధతిలో క్లైంట్ వీడీఐకి కనెక్టవాలి. ఈ రెండంచెల వీడీఐని తలచుకుంటేనే చిరాకు. ఆ క్లైంట్ వీడీఐలో మాత్రమే ప్రాజెక్టుకు సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సమస్యేమిటో చూడాలి ఇప్పుడు. తను పని చేస్తున్నది బ్యాంకింగ్ ప్రాజెక్టులో కాబట్టేమో కంపెనీ వాళ్లు అలివిగాని భద్రత అమలు చేస్తున్నారు. దానివల్ల  క్లైంట్ వీడీఐకి కనెక్టవడమే ఒక పెద్ద తతంగంలా ఉంటాది. హ్యాకర్ల మాటేమో గానీ పనిచెయ్యాల్సినవాళ్ళకే లోపలికి పోవడానికి అవరోధాలు జాస్తి అన్నట్లు తయారైంది.

కాసేపటికి మొదటి వీడీఐ కనెక్ట్ అయింది. దాంట్లో సెట్టింగులేవో మార్చినట్లున్నారు. దాంతో క్లైంట్ వీడీఐకి కనెక్టవడానికి అనువుగా మార్చుకున్న బ్రౌజర్ సెట్టింగులు, సేవ్ చేసుకున్న లింకులు, క్యాషె మొత్తం ఊడ్చుకొని పోయినాయి. ఇప్పుడు కూర్చుని సెట్టింగులు సరిచేసుకుని, లింకులు వెతుక్కుని సెట్ చేసుకోవాలి. ఇదొక పెద్ద సమస్యైపోయింది. రెండ్రోజులకొకసారి సెక్యూరిటీ అప్డేట్లనీ, అదనీ, ఇదనీ ఏదో ఒకటి చెప్పాపెట్టకుండా మారుస్తూనే ఉంటారు. అంతా సరిచేసుకున్నాక క్లయింట్ వీడీఐ లింకు ఓపెన్ చేశాడు. అది లోడవడానికి ఇంకింత టైమ్ పడతాది.

టైమ్… ప్రతి దశలోనూ టైమ్ పడతాది. అదీ రోజుకొక సారైతే సరిపెట్టుకోవచ్చు. ఒకసారి వీడీఐ కనెక్ట్ అయిన తర్వాత ఐదు నిమిషాలు దాన్ని తాకలేదంటే సెషన్ టైమ్ ఔట్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయి మళ్లా మొదటికొస్తాది. మిగతా ప్రాజెక్టులవాళ్లకు ఎట్లుందో గానీ తన ప్రాజెక్టులో ఉండేవాళ్లందరూ ‘టైమంతా వీడీఐకి కనెక్టవడానికే సరిపోతోంద’ని గోలపెడతానే ఉన్నారు. దీనికంటే పాత రోజుల్లో ఆఫీసుకు పోయి పని చేసుకోవడమే సుఖంగా ఉండేదేమో. రయ్ మని అర్ధగంటలో ఆఫీసులో పోయి పడేవాడు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో క్లైంట్ మెషీనుకు కనెక్టవడానికి ఎటు తిరిగీ అంత కంటే ఎక్కువే పడతా ఉంది.

అక్కడ ఇరుకు రోడ్లు, ఇక్కడ ఇరుకైన బ్యాండ్ విడ్త్. అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్కు, ఇక్కడ నెట్వర్క్ ట్రాఫిక్కు. దానికి తోడు ఇక్కడ ఎప్పుడే అవాంతరమొచ్చి డిస్కనెక్ట్ అవుతుందో తెలియని అనిశ్చితి వల్ల కలిగే టెన్షన్ ఎక్కువ. నెట్వర్క్ సమస్యే ఎదురైతే మాత్రం వైకుంఠపాళీలో పాము నోట్లో పడినట్టు మళ్ళా మొదటి గడి నుంచి ప్రారంభించాల్సిందే. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామైనా ఆగినచోటి నుంచే ముందుకు కదులుతాం తప్ప మళ్ళా ఇంటి దగ్గర్నుంచి బయలుదేరం.

వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైన మొదటి రోజుల్లో పది నిమిషాల్లో కనెక్ట్ అవ్వొచ్చనుకుని కాల్ టైముకు 10-15 నిమిషాలకు ముందు ల్యాప్‌టాప్ ముందు కూర్చునేవాడు. పది నిమిషాలనుకునేది అర్ధగంటైనా కనెక్టయ్యేది కాదు. ఈలోపు కాల్ మొదలై, ముగిసిపోవడం కూడా అయిపోయేది. అందువల్ల అది కనెక్టవుతున్నసేపూ టెన్షనుగానే ఉండేది. తను ఊరికే టెన్షన్ పడడం వల్ల ఉపయోగం లేదని జ్ఞానోదయమయ్యాక, టెన్షన్ పడ్డం ప్రయత్నపూర్వకంగా తగ్గించుకున్నాడు.

* * *

ఇంతలో రెండో మాయాదర్పణాన్ని అందుకోక ముందే కరెంటు పోయింది. దాంతో బాటే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా. ఈ ఏడు మరీ ఎండాకాలం మొదలవక ముందునుంచే పవర్ కట్లకు వేళాపాళా లేకుండా పోయింది. ఏ టైములో ఎక్కువ లోడు ఉంటాదో ఆ టైములో ఎడా పెడా కోసిపారేస్తున్నారు. తిరిగి కరెంటొచ్చేవరకు ఇక బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ పనిచెయ్యదు. ఇదొక అదనపు సమస్య. మొబైల్ హాట్ స్పాట్ ఆన్ చేశాడు. దాంట్లో నెట్‌వర్క్ స్పీడు చాలా తక్కువగా ఉంది. వాకిళ్లన్నీ బిగించుకొని కూర్చుంటే వచ్చే సిగ్నల్ స్పీడు రెండంచెల మాయాదర్పణాలను దాటడానికి సరిపోదు. మామూలుగా ఐతే ఈవేళప్పుడు బ్రహ్మీ రూమ్ వాకిలి తెరుచుకునే అవకాశమే లేదు. ఐతే ఈరోజు సిగ్నల్ కోసం వాకిలి బార్లా తెరిచాడు.

దాంతో ఇంటర్నెట్ సిగ్నల్ తో బాటు ఇంటి ఓనర్ వాళ్ల మాటలు కూడా బిగ్గరగా లోపలికి జొరబడ్డాయి. రోజూ తను తురీయావస్థలో తేలియాడే ఆ టైములో బయట సాధారణ జనం అంత బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారని ఏ మాత్రం ఊహించి ఉండని బ్రహ్మీ ఒక్క క్షణం కలవరపడ్డాడు. తనకు ఇయర్ ఫోన్స్ వాడే అలవాటు లేదు. అవెక్కడున్నాయో ఇప్పుడు వెతికినా కనబడతాయనే నమ్మకమూ లేదు. ఇంత రణగొణధ్వనుల మధ్య కాల్ అటెండ్ కావడమెట్లా? ఆఫీసులో అయితే సౌండ్ ప్రూఫ్ మీటింగు రూములుండేవి. ఇక్కడ ఒక్క కిటికీ తెరిస్తే  ప్రపంచమే వచ్చి మీటింగ్ రూములో తన చుట్టూ సెటిలైనట్టు గోల.

తను ఇక్కడ చేరి ఎక్కువ రోజులు కాలేదు. కరోనా తొలినాళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే రూమ్ ఖాళీ చేసి ల్యాప్‌టాప్ చంకనబెట్టుకుని ఎగురుకుంటా ఊరు చేరాడు. త్వరలోనే తత్వం బోధపడింది. కరెంటు గానీ, ఇంటర్నెట్ కనెక్షన్ గానీ స్థిరంగా లేకపోవడం, తరచూ వీడీఐ కనెక్ట్ కాకపోవడం వల్ల పని చెడడమేగాక కాల్స్‌లో మాట్లాడేటప్పుడు బయటి శబ్దాలతో ముఖ్యమైన మాటలు వినబడక పోవడం లాంటి సమస్యలతో వేగలేక, వెంటనే నగరానికి తిరుగుటపాలో వచ్చేసి, చవకలో దొరికిన ఈ రూంలో చేరాడు.

మామూలుగా ఐతే తను లాగిన్ అయ్యే టైమ్ కూడా ఇది కాదు. కాబట్టి రోజూ ఈ టైమ్‌లో ఓనర్ వాళ్లింట్లో నుంచి ఏ రకమైన శబ్దాలు వచ్చేవో కూడా తనకు అసలు తెలియదు. అంటే రెగ్యులర్ లాగిన్ టైమ్ అంటూ ఒకటేడ్చిందని కాదు. డెడ్ లైన్లను బట్టి, ఏరోజుకారోజు తలెత్తే ఇష్యూలను బట్టి ల్యాప్‌టాప్ మూసే టైము, దాన్నిబట్టి మరుసటిరోజు ల్యాప్‌టాప్ తెరిచే టైము మారుతూ ఉంటాయి. రూముల్లో ఉండే బ్రహ్మీలు టైమ్ కాని టైమ్‌లో చుట్టుపక్కల ఉండే సంసారులను డిస్టర్బ్ చెయ్యాల్సిందే తప్ప తలుపులేసుకుని ఎవడి పనిలో వాడు మునిగిపోయే నిశాచర బ్రహ్మీలను డిస్టర్బ్ చేసేవాళ్ళెవరూ ఉండరు.

మరి ఇప్పుడు డిస్టర్బ్ చేసిందెవరు? ఇంట్లో రిటైరైన ఓనరు, ఆయన భార్య మాత్రమే ఉంటారు. వాళ్ల పిల్లలిదరూ విదేశాల్లోనే ఒకరు తూర్పు దేశంలో, ఇంకొకరు పడమటి దేశంలో ఉంటారు. తను ఇక్కడ చేరిన రోజుల్లోనే ఓనర్ దంపతులు పడమటనున్న డాలస్ వెళ్లి ఈమధ్యే వచ్చారు. అది కూడా ఒక కారణం తనకు ఇన్నాళ్ళూ వాళ్ళ ఉనికి, వాళ్ళ గోలా తెలియకపోవడానికి. అక్కడ ఉన్నప్పుడు ఓనర్ తన మనవడికి డెయిలీ సీరియల్ లాగ రోజూ కొంత కొంత చెప్పడం మొదలుపెట్టిన బెడ్ టైమ్ స్టోరీ ఏదో వీళ్ళు తిరుగుప్రయాణమై వచ్చేటప్పటికి మధ్యలో ఆగిపోయిందట. కథాశ్రవణం రుచిమరిగిన మనవడు ‘తర్వాతేమైంది?’ అని అదే పనిగా పోరు పెడుతూంటే దాన్నే ఇప్పుడు ఫోన్లో కొనసాగిస్తున్నాడు.

ఇండియాలో టైమ్ దాదాపు 9 ఏఎమ్. డాలస్లో రాత్రి ఏ పదిన్నరో అయి వుంటాది. అక్కడివాళ్లకు అది బెడ్ టైమూ, బెడ్ స్టోరీల టైమేగానీ ఇండియాలో బ్రహ్మచారులకు అది బెడ్ కాఫీ టైమూ, ఇంకొందరికి  బ్రేక్ ఫాస్ట్ టైమూ. ఖండాంతరాల మధ్య దూర, కాలాల భేదాలను చెరిపేసింది టెక్నాలజీయే అయినా ఏదో ఎడ్వర్టైజ్‌మెంట్‌లో చూపినట్లు దాన్ని కథాశ్రవణానికి వాడుకునే వీలు ఈ ఇంటి ఓనర్ మనవళ్లలాగ లాగ అందరికీ ఉండదు.

ఇంటి ఓనరు కథలో డైలాగు “ఏడేడు పద్నాలుగు లోకాలు గాలించినా నీకు ఆ నిధి రహస్యం దొరకదు” అని ఘంటాపథంగా చెప్తున్నాడు. అటు వైపు నుంచి మనవడు “ఆ పద్నాలుగు లోకాలేవి?” అడిగినట్లున్నాడు. “భూమి కింద ఉండే అధోలోకాలు ఏడు: అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం…”. ఆ పేర్లలోని లయ శ్రోతకు గిలిగింతలు పెట్టినట్లనిపించిందేమో ఊర్ధ్వ లోకాలను ఉట్టెక్కించి ఆ పేర్లే మళ్లా మళ్లా చెప్పించుకుని, తానూ పలుకుతూ సంబరపడ్డాడు కాసేపు.

తర్వాత ఏ లోకంలో ఏముంటాయో చెప్పమని పట్టాడు. శ్రోతలు (లేదా కథకులు) చిన్నపిల్లలైనప్పుడు కథ సూటిగా సాగడం కుదరదు. వాళ్ళు కుక్కపిల్లను చెవి పట్టుకుని లాగినట్లు దాన్ని ఎక్కడెక్కడికో లాక్కుపోతారు. కొన్నిసార్లు గుర్తుతెలియని ప్రాంతంలో దాని ఖర్మానికి దాన్ని వదిలేసి అక్కడ్నుంచి మాయమౌతారు.

బ్రహ్మీ కళ్ళు ప్రధానంగా ఫోన్లో మెసేజులను, మధ్యే మధ్యే ల్యాప్‌టాప్ స్క్రీన్ను చూస్తున్నాయి. చెవులు ‘కథ తక్కువ, కబుర్లు ఎక్కువ’ అన్నట్టుండే ఇంటి ఓనరు మాటలను వింటున్నాయి. కళ్ళు, చెవులు తమ తమ సిగ్నళ్ళను నిరంతరాయంగా మెదడుకు పంపుతున్నాయి. రెండూ ఒకదానికొకటి సంబంధం లేనివి కావడం వల్ల మెదడు ఆ రెండింటి సమాచారాన్ని కలిపి తీసుకోలేక మార్చి మార్చి తీసుకుంటోంది.

ఒక ల్యాప్టాపు, రెండు వీడీఐలు కలుపుకుని మొత్తం మూడంచెలుగా తయారైన వ్యవస్థ వల్ల తన పని కూడా ఇప్పుడు భూలోకం దిగువన ఎక్కడో పాతాళంలో దాక్కున్న కంప్యూటరును చేరుకోవడంలా అనిపించింది బ్రహ్మీకి.

తన ల్యాప్టాపు భూమికి దిగువన ఉన్న మొదటి లోకం అతలం, తన కంపెనీ వీడీఐ దాని తర్వాతొచ్చే వితలం అనుకుంటే క్లైంట్ వీడీఐ ఆ తర్వాతొచ్చే సుతల లోకం అనుకుని నవ్వుకున్నాడు.

క్లైంట్ నెట్వర్క్ కనెక్టయ్యే వరకూ వేచిచూడడం తప్ప చేసేదేమీ లేకపోవడం వల్ల వీలైనంత వరకూ ఓనరు మాటలు వినకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆఫీస్ మెయిల్స్ తెరిచాడు. ప్రాజెక్టుకు సంబంధించిన సెటప్ అంతా ఉండేది క్లైంట్ నెట్వర్కులోనే కాబట్టి ఇక్కడ అంత ముఖ్యమైన మెయిల్స్ ఏవీ ఉండవు. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులో తనను ఇంకో ఆరు నెలలు పొడిగిస్తునట్లు ఒక రొటీన్ మెయిల్, గతవారపు టైమ్ షీట్స్ నింపలేదని రిమైండర్ మెయిళ్ళు, ఇంకొన్ని బ్రాడ్ కాస్టింగ్ మెయిళ్లు మాత్రం ఉన్నాయి.

అవి చూస్తూండగా చెప్పా పెట్టకుండా ల్యాప్టాపు రీస్టార్ట్ అయింది. ఇంటర్నెట్ కనెక్షన్ రీసెట్టై వీడీఐ కనెక్షన్ తెగిపోయింది. ఇట్లా మధ్యలో కనెక్షన్ పోయినప్పుడల్లా ఏ అంతరిక్షంలో నుంచో దబ్బున నేలమీదికొచ్చి పడిన ఫీలింగొస్తాది బ్రహ్మీకి. ఈసారి దాంతోపాటు జ్ఞానోదయం కూడా కలిగినట్లై, ‘అబ్బే, ఈ వీడీఐలు రెండూ పరలోకాలే కానీ అధోలోకాలు కానేకావు. భూమికి పైనున్న ఊర్ధ్వలోకాలే’ అని తీర్మానించుకున్నాడు. ఇక చేసేది లేక మళ్లా మొదటినుంచి ఒక్కొక్క మెట్టూ దాటనారంభించాడు.

యాదృచ్ఛికంగా అప్పటికి ఇంటి ఓనర్ కూడా అధోలోకయాత్ర ముగించి ఊర్ధ్వలోకాలు మొదలుపెట్టాడు: “అధోలోకాలకు పైనున్న ఊర్ధ్వ లోకాలు భూమితో కలిపి ఏడు: భూః, భువః, స్వః, మహః, జన, తపః, సత్య లోకాలు…”

ఇక్కడ బ్రహ్మీ ‘ఇప్పుడు నా పని కూడా మాయ తివాచీ ఎక్కి మళ్ళా మొదటి నుంచి ఊర్ధ్వలోకయాత్ర మొదలుపెడుతున్నట్లే ఉంది’ అనుకుంటూ పాస్ వర్డ్ కొట్టి, లాగిన్ స్క్రీన్లో రింగులు తిరుగుతూండగా ‘భూలోకానికి పైనున్న లోకం పేరేమిటబ్బా?’ అని సందేహంలో పడ్డాడు. దానికి సమాధానంగానా అన్నట్లు “గాయత్రీ మంత్రంలో వస్తుంది గదా? అదే… భువర్లోకం.” అని హౌస్ ఓనర్ గొంతు వినబడింది.

భువర్లోకం: మన ప్రవర చెప్పుకుని వినయంగా “అహంభో అభివాదయే” అని సబ్మిట్ ఐతే, మన వినయవిధేయతలు దానికి నచ్చితే ఎక్కనిస్తాది భువర్లోకపు లంకిణి. ఇక్కడ ప్రవర అంటే పాన్ కార్డూ, ఆధార్ కార్డూ వివరాలు కాదు. యూజర్ నేమ్ & పాస్ వర్డ్. ప్రస్తుతం బ్రహ్మీ తన ఆఫీసు ల్యాప్‌టాప్ అనబడే భువర్లోక ప్రవేశద్వారం తెరుచుకుని లోపలికి ప్రవేశించి, పై లోకాలకు పోయే ద్వారాలు ఇంకా తెరుచుకోకపోవడం వల్ల అక్కడక్కడే తచ్చాడుతున్నాడు.

మెసెంజర్, కంపెనీ పోర్టల్ లాంటివన్నీ ఉండేది ఇక్కడే. గతంలో ఐతే భువర్లోకంలో పెద్ద తనిఖీలేవీ ఉండేవి కావు.  ఐతే ఈమధ్యే భువర్లోకం మీద ఒక దానవసేన దాడి (సైబర్ అటాక్) చెయ్యడం వల్ల ‘ఒక గేటు, ఒక మెయిన్ డోరు’గా ఉన్న సాధారణ భద్రతా ఏర్పాట్లకు అదనంగా అప్పటికే మూడో రక్షణవలయం ఏర్పాటై ఉంది. ఇప్పుడు ఈ మూడు రకాల అగ్నులతో (త్రేతాగ్నులంటే ఇవే కాబోలు!) పరివేష్టితమై ఉన్న ఆ ప్రాంతాల్లో అడుగు పెట్టాలంటే కొత్తగా ఏర్పాటైన రూల్స్ అన్నీ చచ్చినట్లు పాటించితీరాలి.

వాటిలో ఒకటి: పక్కనే మంత్రదండం సిద్ధంగా పెట్టుకుని మరీ భువర్లోకంలో ప్రవేశించాల్సిన కవాటాల ముంగిట మళ్ళా ప్రవర చెప్పుకోవాలి. ఆ మంత్రదండం ఆధునిక రూపమే మొబైల్ ఫోన్. యూజర్ నేమ్, పాస్ వర్డులకు అదనంగా మల్టి ఫాక్టర్ ఆథెంటికేషన్లో మన ఫోనుకు సకాలంలో ఓటీపీ వచ్చి, కాలాతీతం కాకముందే దాన్ని మనం ఎంటర్ చేస్తేనో, లేదంటే వెరిఫికేషన్ ఫోన్ కాల్ కలిస్తేనో మాత్రమే సువర్లోకానికి ఫ్రీ పాస్ దొరికినట్లు.

ఫోన్ లేకపోతే భువర్లోకంలో అడుగు కూడా కదపలేమన్నమాట. అందుకే మొబైల్ ఫోన్ ఆధునిక కాలానికి మంత్రదండం లాంటిది. త్రేతాగ్ని వలయంలో మూడో అగ్నిని ఆర్పే మంత్రదండం. గతంలో మాంత్రికుల దగ్గర మాత్రమే మంత్రదండాలు ఉండేవి. ప్రస్తుతం పొత్తిళ్ళలో పాపాయిల దగ్గర కూడా ఈ మంత్రదండాలుంటున్నాయి. (చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగును ఇలాంటి త్రేతాగ్నుల మధ్యే ఉంచుతున్నాయి కాబట్టి దీని ప్రభావం చాలామందికి అనుభవమే.)

ప్రాజెక్టు పనికి కంపెనీ పోర్టల్తో ఏ సంబంధమూ ఉండదనుకోండి, అయినా టైమ్ షీట్ నింపడానికి, సవాలక్ష ఇతర పనులకు భువర్లోక పర్యటన చేయక తప్పదు. ఏరోజైనా టైమ్ షీట్ నింపకపోతే ఆరోజు పనిచెయ్యనట్లుగానే భావించి సెలవు పడిపోతాది. ఇక్కడి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కు, వర్క్ ఫ్రమ్ ఆఫీసుకు పెద్ద తేడా ఉండదు.

దీని తర్వాత ఎక్కవలసినది, ఇంతకు ముందే ఎక్కి దిగిన మెట్టు పేరేమిటి?

“అది కూడా గాయత్రి లోనే ఉంది స్వర్లోకం అని” హౌస్ ఓనర్ గొంతు తెలిపింది.

సువర్లోకం అనబడే స్వర్లోకం: భువర్లోకం నుంచి ముందుకు పోతే పైనుండేది సువర్లోకం. వాడుక భాషలో దాన్నే వి.డి.ఐ. అంటారు. అంటే మన కళ్ళ ముందు కాకుండా ఎక్కడో ఉండే కంప్యూటర్ స్క్రీన్ మన కళ్లెదుట కనబడడం. అంటే వీడియో కాల్ లాంటిదనుకోవద్దు. వీడియో కాల్ కు, దీనికి రెండు ముఖ్యమైన తేడాలున్నాయి: విడిఐలో ఎక్కడో ఉండే అవతలి కంప్యూటర్ స్క్రీన్ మనక్కనబడతాదిగానీ ఆ కంప్యూటరుకు మనం కనబడం.

అంతకంటే ముఖ్యమైనది: అవతలి మనిషిని మొత్తాలనుకున్నా, ముక్కు పిండాలనుకున్నా వీడియో కాల్లో అది సాధ్యం కాదు గదా! కానీ విడిఐలో అవతలి కంప్యూటరును మన మౌసుతో మొత్తొచ్చు, కీబోర్డుతో మనం చెప్పినట్లు ఆడించొచ్చు కాబట్టి విడిఐ అనేది ఒకవిధంగా మాయాదర్పణంలో మహాసంకలిని అనుకోవచ్చు.

ఈ మాయాదర్పణం చుట్టూ కూడా త్రేతాగ్నివలయం ఉంటాది. దాంట్లో మూడో వలయాన్ని ఛేదించాలంటే మనచేతిలో మంత్రదండముండాలి. ఆ మంత్రదండంలో వచ్చే ఓటీపీయే మాయాదర్పణానికి ప్రవేశ మంత్రం. భువర్లోకంలో ఉన్నట్టు ఫోన్ కాల్ ద్వారా వెరిఫై చేసుకునే సౌలభ్యం కూడా లేదు. సకాలంలో ఓటీపీ రాకపోతే ఇంతే సంగతులు. అదొచ్చేవరకు మళ్ళా మళ్ళా ప్రయత్నించడం తప్ప వేరే మార్గం లేదు.

లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కొట్టాక కట్టెదుట మూడో అగ్నిగుండం కనబడగానే బ్రహ్మీ మంత్రదండం కోసం తడుముకున్నాడు. దాన్ని తన చేత్తోనే ఎక్కడో విసిరేసినట్లు కాసేపటికి నిద్రమత్తు వీడాక జ్ఞాపకం వచ్చింది. భారంగా లేచివెళ్లి వెతికి తెచ్చుకుని ఓటీపీని ఆ అగ్నిగుండంలో వ్రేల్చాడు.

వాస్తవంగా ఈ స్వర్లోకం (మాయాదర్పణంలో కనబడే కంప్యూటర్) కంపెనీ ఆధీనంలోని మేఘాల్లో (క్లౌడ్ కంప్యూటర్) శత్రు దుర్భేద్యమైన ఫైర్ వాల్ మధ్య ఉంటాది. స్వర్లోకంలో ఏవో ఒకటీ అరా అప్లికేషన్లు తప్ప ఏమీ ఉండవు. ఇక్కడి నుంచి వైట్ లిస్ట్ చేసిన ఏవో కొన్ని వెబ్సైట్లు తప్ప మిగతా వేటినైనా తెరవడానికి ప్రయత్నిస్తే కొరడాలు, ముళ్ళగదలు పట్టుకుని కింకరులు ప్రత్యక్షమౌతారు. ఇక్కడ బ్రహ్మీలకు పెద్దగా పనేముండదు గానీ మహర్లోకానికి స్వర్లోకం ద్వారానే తప్ప మరో దారి లేదు. కాబట్టి తప్పనిసరిగా స్వర్లోకాన్ని త్రేతాగ్నులతో సహా దాటుకునే వెళ్ళాలి. ఈ స్వర్లోకంలో మనం పక్కదార్లు పట్టకుండా ఉండేందుకు మరింత శుద్ధిచేయబడుతాం.

“ఇక్కడి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క” అన్నమాట. ఇక్కడి నుంచి ముందుకుపోతే “ఎంటర్ ద డ్రాగన్” అంటూ మొదలౌతాది అసలు పండగ. దరిద్రం ఏమిటంటే ఇక్కడి నుంచి గాయత్రి కూడా దారి చూపదు. “పెను చీకటాయె లోకం…” అని పాడుకుంటూ తడుముకుంటూ ముందుకు పోవలసిందే. ప్రస్తుతానికి స్వర్లోకంలో మన బ్రహ్మీకి పనేమీ లేకపోవడమేగాక అవతల పై లోకాల్లో కొంపలంటుకుపోయే పని ఉండడం వల్ల మహర్లోకానికేసి సాగాడు.

పోతూ పోతూ మధ్య దారిలో మళ్ళొకసారి అలోచించాడు బ్రహ్మీ: అసలెవరబ్బా ఈ టైమ్‌లో అందర్నీ కాల్’లో కలేసింది? టీములో కొత్తగా చేరిన ఫ్రెషర్లెవరన్నా అయివుంటారా? వాళ్ళకు ఫంక్షనాలిటీ ఎన్నిసార్లు వివరించి చెప్పినా మళ్ళా మళ్ళా డౌట్లొస్తూనే ఉంటాయి. అవి చాలవన్నట్లు టెక్నికల్ డౌట్లు కూడా. ఏం చెయ్యాలో క్లారిటీ ఉండదు, ఎట్లా చెయ్యాలో తెలిసి చావదు. తెలిసి తెలిసీ ఇలాంటివాళ్ళను ప్రాజెక్టులో ఎందుకు పెట్టుకుంటారో తెలీదు. కాకపోతే ఎంకి పెళ్లి సుబ్బి చావుకే వస్తాది. తాను విన్నప్పుడు కాల్’లో అప్పటికే చాలా గొంతులు వినబడ్డాయి. పిల్ల కాకులు అవసరమైతే ముందుగా తనకే కాల్ చేసి ఉండేవాళ్ళు. పైగా వాళ్ళ కోసమైతే అంత పెద్ద గద్దల గుంపు, అదీ ఇంత పొద్దున్నే, పోగై ఉండదు.

అంటే ఎక్కడో ఏదో పెద్ద చిక్కే వచ్చినట్లుంది. “టీమ్లో ‘పనిచేసేవాళ్ళలో’ ఎవడైనా చెప్పాపెట్టకుండా చెక్కేశాడా? ఒక పక్క డెడ్ లైన్ తరుముకొస్తుంటే పని అసలే నత్తనడక నడుస్తోంది. పనిని ఎంత పరిగెత్తిద్దామని చూస్తున్నా క్లైంటు దగ్గర్నుంచి కావలసిన సహకారం పూర్తిగా అందడం లేదు. ‘పని  మీకు అప్పజెప్పాం కదా? అవన్నీ ఇక మీ తలనొప్పులు’ అన్నట్లు తాపీగా ఉన్నారు. ఇప్పట్లో ఎవడైనా చెయ్యిచ్చాడంటే అంతే సంగతులు” అనుకుంటూ మహర్లోకపు మహాద్వారం చేరాడు.

మహర్లోకం: ఈ మహర్లోకం క్లయింటుకు చెందిన విడిఐ. అంటే భువర్లోకంలోని మాయాదర్పణంలో స్వర్లోకం కనబడితే స్వర్లోకపు  మాయాదర్పణంలో మహర్లోకం కనబడతాదన్నమాట. ఇది “మాయాదర్పణంలో మాయాదర్పణం” కాబట్టి మనలోకాల్లో మామూలుగా పనిచేసే చిట్కాలు, మాయలు, మంత్రాలే కాదు మంత్రదండాలు, రక్షరేకులేవీ కూడా పనిచెయ్యవ్. అంతేకాదు, మనమీద  మహర్లోకవాసిని మనువాడ్డానికి వచ్చినవాళ్ళ మీద జరపదగ్గ రకరకాల స్వచ్ఛతా, శీల పరీక్షలు జరుగుతాయి. ఇక్కడ పునీతులమయ్యాకే జనలోకానికి ప్రవేశార్హత దొరికేది. రకరకాల భద్రతాపరమైన అప్లికేషన్ల ద్వారా మన పవిత్రతను నిరూపించుకుని మహర్లోకవాసుల మనసులు గెల్చిన తర్వాత వచ్చేది జనలోకం.

బ్రహ్మీకి తను మొట్టమొదటిసారి మహర్లోకానికి వచ్చిన సందర్భం జ్ఞప్తికి వచ్చింది. ఈ లోకంలో ప్రవేశించడానికి వైతరణిని దాటుకొచ్చిన బ్రహ్మీకి అనుమతి ప్రసాదించిన క్లైంటు బ్రహ్మీ చేతిలో మంత్రదండం ఒకటి పెట్టి, బొడ్డుకోసినట్లు ఒకటికి రెండు కొత్త పేర్లు (బ్రహ్మీకి ఒకటి, అతడికి కేటాయించిన మంత్రదండానికి ఒకటి) పెట్టి, ఈ లోకానికి ప్రవేశం కల్పించే మంత్రాలు తనకు నచ్చిన కిలికిలి భాషలో ఉపదేశించాడు. ఇవన్నీ కలిపి జంత్రమేస్తేగానీ జనలోకానికి ఎంట్రీ పాస్ దొరకదని గట్టిగా హెచ్చరించాడు కూడా.

ఈ తతంగమంతా ముగిశాక వాడు హాపీ బర్త్ డే చెప్పి మహర్లోకపు పాస్ బ్రహ్మీ చేతిలో పెట్టి “సాహసం శాయరా డింభకా” అని ఆశీర్వదించి, భుజం తట్టి పంపాడు. ఈ అదనపు కష్టాలకు బ్రహ్మీకి భవిష్యత్తు కళ్ళముందు కనబడి, భర్తృహరి వైరాగ్య శతకంలోని శ్లోకాలు తన్నుకొచ్చాయి. తమాయించుకుని, వాటిని బలవంతంగా అదిమిపట్టి “జజ్జనకరి జనారే, జనలోకానికి జానా రే” అని క్లయింటుకు కనబడేలా రెండు స్టెప్పులేసి, ముందుకు పడ్డాడు.

* * *

జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చి, తనను కాల్ లోకి పిలిచిన కారణమేమా, అసలేమయ్యుంటాదా అని జనలోకానికి పోయే దారిలో మళ్ళా ఆలోచనలో పడ్డాడు. తన కోడులో హై సివియారిటీ బగ్ ఏమైనా వచ్చిందా? దానివల్ల కొంపలేమీ మునగవు. టెస్టర్లు టెస్టు చేసేదే బగ్గులను చూపడానికి. రిలీజుకు పోనంతవరకు పురుగు(బగ్)లేరడం వాళ్ల వంతు, వాటిని వేటాడి చంపడం తమ వంతు. మరైతే… మొన్న ఇచ్చిన రిలీజులో ఏమైనా ఇష్యూ వచ్చిందా? అనుకోగానే గుండె గుభేలుమంది.

ఆ కంగారులో తానెక్కడున్నదీ మర్చిపోయి, అలవాటైన పద్ధతిలో “వాకిలి తెరవండి నువ్వులూ (Open sesame)” అనే స్టాండర్డ్ మంత్రం వాడేశాడు బ్రహ్మీ. పనిచెయ్యలేదు. నువ్వులకు బదులు బఠాణీలూ, నవధాన్యాలూ, ఆగ్రహించక అనుగ్రహించే నవగ్రహధాన్యాలూ, పుట్టగొడుగులూ మార్చి మార్చి వాడినా ఫలితముండదు. పైగా మంత్రప్రయోగంలో మూడు సార్లకు మించి తప్పులు దొర్లితే తలుపులు శాశ్వతంగా మూసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. “కిమ్ కర్తవ్యం?” అని మనసులోనే అనుకుని, సంస్కృతంలోనైనా సరే, కొరియా వాడిని తలచుకున్నందుకు భయపడ్డాడు బ్రహ్మీ.

తమాయించుకుని, దీనికి నేపాళ మాంత్రికులు చాలు అనుకుని పూర్తి మెలకువ తెచ్చుకుని క్లైంటు నేర్పిన మంత్రం శ్రద్ధగా పొల్లుపోకుండా పఠించి ఒక ద్వారం దాటాడు. ఇక్కడేమీ ఉండదు. ముందుకుపోయే దారిలో ఇదొక అంచె మాత్రమే. రెండో ద్వారం దగ్గర క్లైంటువాడిచ్చిన నేపాళ మంత్రదండం అవసరమౌతాది. దాన్ని RSA టోకెన్ అంటారు. అది ఒక రకమైన ఓటీపీ జనరేటర్ లాంటిది. కాకపోతే దాంట్లో కనిపించే ఓటీపీ కోడ్ మనం లాగిన్ అవుతున్నామా లేదా అన్నదాంతో సంబంధం లేకుండా నిరంతరాయంగా ప్రతి పది క్షణాలకొకసారి మారిపోతూ ఉంటాది.

 వాడు తనకు పెట్టిన రెండో పేరు గుర్తుకుతెచ్చుకుని క్లైంటు ప్రసాదిత మంత్రదండం బయటికి తీశాడు. క్లైంటు తనకు చెవిలో ఉపదేశించిన రెండో మంత్రంలోనించి ఒక లైను, ఈ దండంలో ఆ క్షణంలో కనబడే మంత్రం కలిపి కాలాతీతం కాకముందే పఠిస్తే దారి తెరుచుకుంటాది. మంత్రం మారిపోక ముందే ఎంటర్ కొట్టడానికి తొందర పడాల్సింది మనమే. ఆ మాయాదర్పణాలకు ఏ తొందరా లేదు. స్టార్ట్ కావడానికి తాపీగా పది నిమిషాల దాకా తీసుకుంటాయి.

జనలోకం: ఎదురుచూపులు ఫలించి సరిగ్గా జనలోకం తలుపులు తెరుచుకుని, లోపలికి అడుగుపెట్టబోయేంతలో ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడో డిస్టర్బ్ అయి, మంత్రలోకపు కవాటాలు ఒక్కసారిగా మూసుకుపోయి, కళ్ళ ముందు చిమ్మచీకటి కమ్ముకున్నట్లై డింకీలు కొట్టి నేరుగా భువర్లోకంలోకి వచ్చి పడ్డాడు బ్రహ్మీ. స్వర్లోకంలో, లేదా దానికి పైన ఏ లోకంలో ఉన్నప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ అణుమాత్రం అటూ ఇటైందంటే మాత్రం, కళ్ళు మూసేలోపు భువర్లోకంలోకి పడిపోతాం.

 అదే డెస్క్ టాపైతే మన టైమ్ బాగుండక కరెంటు కూడా పోతేనో లేదంటే కరెంటు పోవడం వల్లే బ్రాడ్ బాండ్ కనెక్షన్ పోతేనో, నేరుగా భూలోకానికి దిగివస్తామన్నమాట. మన సంచిత, ప్రారబ్ద కర్మలననుసరించి మళ్ళా కాళ్లీడ్చుకుంటూ, ఓపిక నశించినచోట పాక్కుంటూ, దేక్కుంటూ, ఒక్కొక్క లోకం దాటుకుంటూ దశలవారీగా పైకి చేరుకోవలసిందే తప్ప గత్యంతరం లేదు.

ఇంటర్నెట్ కనెక్టైన తర్వాత పై వలయమంతా పూర్తిచేసి జనలోకానికి రావడానికి మళ్ళా పది నిమిషాల పైనే పట్టింది బ్రహ్మీకి. ల్యాప్‌టాప్ తెరిచినప్పటినుంచి రెండుసార్లు ఇలా పైకీ కిందికీ తిరగడానికి దాదాపు అరగంట. తీరా ఇక్కడిదాకా వచ్చి టీమ్స్ లో చూస్తే నడుస్తున్న కాల్స్ ఏవీ కనిపించలేదు. అంటే మనవాడు సప్తలోకాల మధ్య పైకీ కిందికీ రౌండ్లు వేస్తున్న సమయంలో బ్రహ్మీని పిలిచిన విషయం కూడా మర్చిపోయి కాల్ ముగించేశారు కాల్’లో కాట్లాడుకుంటున్నవాళ్ళు. కాల్స్ లేనప్పుడు ఇక్కడిదాకా వచ్చాక అలవాటు ప్రకారం చేసే పని నేరుగా తపోలోకంలోకి వెళ్లిపోవడం. అసలిక్కడిదాకా రావడమే తపోలోకంలోకి పోయి పని చూసుకోవడానికి.

* * *

తపోలోకం: ఈ తపోలోకం వాడుక పేరు వర్క్ ఎన్విరాన్మెంట్. ఇక్కడి నుంచి బాహ్యప్రపంచంతో సంబంధాలుండవు కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి క్వారంటైనో ఐసొలేషన్ వార్డో అన్నా తప్పులేదు. ఇక్కడ ఎవరెవరి ప్రాజెక్టుకు సంబంధించిన మంత్ర కవాటాలు వాళ్ళకు మాత్రమే తెరుచుకుంటాయి. మాటవరసకు – రంభకు కస్టమర్ కేర్ డ్యూటీ పడిన టైమ్‌లో ఆ జోన్లోకి చీటికి మాటికి నలకూబరుడొచ్చి తాను డిస్టర్బయి, రంభను డిస్ట్రాక్ట్ చెయ్యకుండా అన్నమాట :P. సత్యలోకం నుంచి దించుకున్న ప్రోగ్రామింగ్ కోడ్‌ను జనలోకంలోని సెటప్’తో కలిపి కాక్ టెయిల్ చేసి తెర మీద ప్రసారం చేసే చోటు ఈ తపోలోకం.

సత్యలోకం: ఇది కోడ్ రిపాజిటరీ. కోడింగుతో పనిలేనివాళ్ళకు గిట్’బాటయ్యే స్థానం కాదు. ఈ వింతలోకంలో ప్రోగ్రామింగ్ భాషలకు మాత్రమే ప్రవేశం. అక్కడ జావా భాషలోని వాక్యాలు కూడా స్ప్రింగ్ బూట్’లేసుకుని నాట్యమాడుతూ ఉంటాయి. భూలోకం నుంచి ఎవరికివాళ్ళు సొంతంగా రోడ్లేసుకుని ఇక్కడికి నేరుగా కూడా రావచ్చు. అట్లా వచ్చే వాళ్లు చిన్న చిన్న సొంతకుంపట్లు పెట్టుకుని ఉంటారు. వాళ్ల పరిధి ఆ కుంపట్లకే పరిమితం.

పుణ్యాలు చేస్తేనే స్వర్గలోక ప్రవేశం, యజ్ఞాలు చేస్తే స్వర్గలోకాధిపత్యం అన్నట్లు ఇక్కడ కూడా సప్తలోకాల దారిలో వచ్చేవాళ్ళకు మాత్రమే ఈ ప్రోగ్రాములను తపోలోకంలోకి రప్పించి సర్కస్సాడించే రింగ్ మాస్టర్ హోదా వస్తాది.

కానీ ఇంత పొద్దున్నే సగం నిద్రలో లేచి పని మొదలుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతకూ పొద్దు పొద్దున్నే అంత గొడవవడానికి కారణమేమిటో తెలియలేదు. ఇప్పుడెవర్నైనా అడిగితే కందిరీగల తుట్టెను మళ్ళా కదిలించినట్లే అవుతాదేమో, ఎందుకొచ్చిన గొడవ? తర్వాత నిదానంగా కనుక్కుంటే పోయె అనుకుంటూ ల్యాప్‌టాప్ మూసేసి, మళ్ళా ముసుగుతన్ని పడుకున్నాడు బ్రహ్మీ.

*

త్రివిక్రమ్

2 comments

Leave a Reply to M GIRIDHAR Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విధినిర్వహణాచర్యలో ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చుంటే యెదురయ్యే అనుభవాలను అధో ఊర్ధ్వ
    లోకాలకు ముడిపెట్టి హాస్యధోరణిలో లాఘవంగా నడిపిన కథ. రచయితకున్న భాషాపటుత్వం తోడై పచ్చి హాస్యం పక్వానపడింది. రచయితకు అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు