బొమ్మా, బొరుసు

బొమ్మ:

“పెళ్ళై నాలుగేళ్ళు అయింది, పిల్లల కోసం రెండేళ్ల నుంచీ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకూ ఏమీ సంతోషమైన వార్త లేదు. ఏం చేయాలో తెలియకుండా ఉంది. మీరు స్పెషలిస్ట్ అని మా డాక్టర్ గారు పంపిస్తే వచ్చాం.”

“నేను రాసిచ్చే ఈ టెస్ట్ లు చేయించండి. ఒక్కోప్పుడు అన్నీ సరిగ్గా ఉన్నా కొంత ఆలస్యం కావచ్చు. దానికెవరూ ఏమీ చేయలేరు. టెస్ట్ లు అయ్యాక మరోసారి రండి. సిగరెట్లు కాల్చే అలవాటు మానుకోండి. రోజూ వేళకి తిండి తిని కంటినిండా నిద్రపోవాలి. సరైన వ్యాయామం చేయండి. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కదా అలా కుదరదు, మా బాసు ఒప్పుకోడు అంటే, మీ ఆరోగ్యం ముందా, ఉద్యోగం ముందా అనేది తేల్చుకోండి.”

“ఇద్దరికీ అని రాసారు టెస్ట్. ఇద్దరం టెస్ట్ చేయించుకోవాలాండీ?”

“మరి కాదా? ఒకరికే టెస్ట్ చేస్తే ఇద్దరికీ కలిపి పిల్లలు పుడతారో లేదో నేనెలా చెప్పగలను; నాచేతిలో ఏమీ మాజిక్ బాల్ లేదు కదా? లోపం ఒకర్లో, ఇద్దర్లోనూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏప్రిల్ నెలలో మళ్ళీ రండి.”

బొరుసు:

“నాలుగైదు వారాలబట్టీ తలనెప్పి, ఒక్కొక్కప్పుడు వాంతి అవుతున్నట్టూ ఉంటోంది. టెలెనాల్ లాంటివి వాడితే నెప్పి తగ్గినా మర్నాటి నుండీ తయారు మళ్ళీ. ఎందుకేనా మంచిదని ఓ బ్లడ్ టెస్ట్ చేయించాను – సుగర్, కొలెస్టెరాల్ లాంటివి ఉన్నాయేమో అని. ఏమీ లేవు అని వచ్చింది. మా డాక్టర్ దగ్గిరకి వెళ్ళాను. తలలో కానీ, నెర్వస్ సిస్టంలో కానీ ఏదైనా ఉందేమో చూడాలి; న్యూరాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళమని మీ పేరు చెప్పారు.”

“నేను మీ బ్లడ్ టెస్ట్ లు చూసాను. ఏమీ తెలియలేదు. ఓ సారి ఎందుకైనా మంచిది బ్రైన్ కి ఓ ఎమ్మారై స్కాన్ తీయించండి. ఇంట్లో ఎవరికైనా మైగ్రేన్ లాంటివి కానీ కేన్సర్ లాంటివి కానీ ఉన్నాయా?”

“మా తాతగారికి పోయేముందు కడుపులో కేన్సర్ ఉంది. నాకు వచ్చిందంటారా?”

“ఈ మందులు వాడి చూడండి స్కాన్ వచ్చేలోపు. మైగ్రేన్ అవ్వొచ్చు. స్కాన్ వచ్చాక దాన్ని బట్టి మిగతా విషయాలు చూద్దాం. అప్పటిదాకా నేనేం చెప్పలేను.”

మే 2020

బొమ్మ:

“మీ ఇద్దరివీ టెస్ట్ లు సరిగ్గానే ఉన్నాయి. మీ స్పెర్మ్ కౌంట్ ఏడాది క్రితం వచ్చిన సారి కంటే పెరిగినా కొంచెం తక్కువగా ఉన్నట్టే లెక్క. అయితే మరీ అంత తక్కువ కాదు. మీ ఆవిడ వంట్లో ఏ నలతా లేదని తెల్సిందికదా, ఆవిడకి అన్నీ బాగున్నాయి. సిగరెట్లు మానేసారా?”

“పూర్తిగా అనికాదు కానీ, రోజుకి పదో పదిహేనో కాల్చేవాణ్ణి ఇప్పుడు భోజనం అయ్యాక సరిగ్గా రోజుకి రెండే కాలుస్తున్నాను. అవీ మానేద్దామని ప్రయత్నం లో ఉన్నా”

“ఈయన అంతేనండి. మీతో అలా చెప్తున్నారు కానీ ఏమీ మానలేదు. మంచం మీదకి వచ్చేసరికే నోరంతా కంపు. నేను ఛస్తున్నాను మధ్యలో. ఆ కంపుపోతే తప్ప మాకు పిల్లలు పుట్టడం అసాధ్యం అనిపిస్తోంది.”

“చూసారుగదా, ఇప్పటికైనా పూర్తిగా మానండి. ఆ సిగరెట్లు అసలు జనం ఎందుకు కాలుస్తారో నాకు అర్ధం కాదు. కనీసం మందుకొట్టే బాబులు నయం. వాళ్ళు కొట్టే మందు కాసేపు కడుపులో ఉంటుంది. ఈ సిగరెట్ల వల్ల లోపలకెళ్ళే నికోటిన్, టార్ లాంటివి మిమ్మల్ని చంపుతాయి, మీరు బయటకి వదిలే గాలి – సెకండ్ హాండ్ స్మోక్ మరింత ప్రమాదమైనది అని చెప్తున్నారు. అది ప్రపంచాన్ని చంపుతుంది. అయినా మీ ఆరోగ్యం మీ ఇష్టం. ప్రయత్నం చేసి చూడండి. మానడం అంత అసాధ్యం కాదు. మరోసారి రండి ఓ నెల పోయాక కావాలిస్తే మరో టెస్ట్ చేద్దాం.”

బొరుసు:

“మందులవల్ల తలనెప్పి తగ్గలేదండి. అలాగే ఉంది. స్కాన్ రిజల్ట్స్ పట్టుకొచ్చాను. ఏమైనా కనిపించిందా చూడండి. ఈ నెప్పితో నిద్రపోలేకుండా ఉన్నాను. అప్పుడప్పుడూ తల తిరుగుతోంది కూడా. ఎందుకైనా మంచిదని ఈ సారి మాకుర్రాడితో కలిసి వచ్చాను మిమ్మల్ని చూడ్డానికి.”

“నేను మిమ్మల్ని చూసి ఏడాది అవుతోందే? ఇంతకాలం స్కాన్ ఎందుకు తీయించలేదు?”

“కుదరలేదండి. ఏవేవో పన్లు, డబ్బులూ అవీ చూసుకోవాలికదా?”

“సరే, మీ స్కాన్ చూసి చెప్తాను. కాసేపు పక్కగదిలో కూర్చోండి.”

“ఒరే అబ్బాయ్, తల తిరుగుతోందిరా మళ్ళీ కాస్త చేయి పట్టుకో లేవడానికి.”

“ఫర్లేదు నాన్నా, నేను ఉన్నానుగా.”

… … … … …

“రండి, మీస్కాన్ చూశాను. బ్రైన్ స్టెమ్ అనేచోట చిన్న కురుపులాగా ఉంది. అది ఎటువంటిదనేది చిన్న ముక్క తీసి టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. బయాప్సీ అనేది చేయకుండా అది మామూలు కురుపా, కేన్సరా అనేది తెలియదు.

“కంతి రోజు రోజుకీ పెరుతోందాండి?”

“ఒక్క స్కాన్ తో ఎలా తెలుస్తుంది? ముందు బయాప్సీ చేసి చూద్దాం. ఆ తర్వాత నెలకో నెలన్నరకో మరోస్కాన్ తీస్తే పెరుగుతోందా తరుగుతోందా తెలుస్తుంది.”

“మ నాన్నగారికి అంత బాగాలేదుకదా బయాప్సీ ఎప్పుడు చేయాలంటారు?”

“ఎంత తొందరగా తీస్తే అంత మంచిది. ముందు ఆ కంతి ఏమిటో తెలుస్తుంది.”

“నెప్పిలేకుండా బయాప్సీ చేయవచ్చా?”

“మత్తుమందు ఇస్తాం బయాప్సీ చేసేటపుడు. మరీ అంత నెప్పి ఉండదు కానీ తర్వాత కొంత నెప్పి ఉన్నా మందులతో సర్దుకుంటుంది.”

జూలై 2020

బొమ్మ:

“హమ్మయ్యా ఈ సిగరెట్లు మానగానే ముందు కంపు వదిలింది. ఈ మంచం మీద దిండ్లు, పరుపు, దుప్పట్లూ అన్నీ చాకలికి వేసి పూర్తిగా ఉతకమని చెప్పాను. ఇంట్లో అక్కడక్కడా ఉన్న వాసనకి ఏదో ఒకటి చేయవచ్చు. ముందు పడుకునే చోట కంపు వదిలితే హాయిగా నిద్ర పడుతుంది.”

“థాంక్ యూ డార్లింగ్. నీ మూలానే మానగలిగాను. ఇంతకాలం అసలెలా వాటిని కాల్చానా అనేది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. మరో సారి సిగరెట్ కాలుద్దామనే కోరిక అప్పుడప్పుడూ ఉంది కానీ కాల్చడం లేదు.”

“నిజమేనా లేకపోతే ఆఫీసులో నాకు తెలియకుండా కాలుస్తూ నాకు చెవిలో పువ్వు పెడదామనా?”

“పువ్వే పెట్టాలంటే అమ్మగారి జడలో మల్లెపూలు పెడతాను గానీ చెవిలోనా? లేదు నిజంగా కాల్చడం లేదు.”

“గుడ్ బాయ్, అలా నేను చెప్పినట్టు వింటూ ఉండండి. తొందర్లో ఇద్దరం ముగ్గురు అవ్వొచ్చు.”

“మరి నేను నీ మాట వింటున్నందుకు నాకేమీ గిఫ్ట్ లేదా?”

“ఎందుకులేదు, తప్పకుండా ఉంది.  ఈ రోజు బయట హొటల్లో డిన్నర్, తర్వాత జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా …”

“ఆ తర్వాత?”

“అదికూడా నేనే చెప్పాలా? బండబ్బాయ్?”

బొరుసు:

“బయాప్సీ అయ్యాక తలనెప్పి ఏమైనా తగ్గిందా? నేనిచ్చిన మందు ఏదైనా పనిచేస్తోందా?”

“లేదండి. నెప్పి ఎక్కువౌతూన్నట్టూ ఉంది. ఈ రోజు ఎక్కువా ఆ రోజు తక్కువా అని చెప్పలేను కానీ నెప్పి మాత్రం ఉంది. ఒక్కోసారి తలమీదకీ ఇంకోసారి భుజాలమీదకీ నడుమ్మీదకీ పాకుతోంది.”

“బయాప్సీలో కంతి కేన్సర్ అని తేలింది. నేను ఈ స్కాన్ ని సర్జన్ కి చూపించి అడిగాను ఏమంటారో. కేన్సర్ కణితి తీయాలంటే ఇది క్లిష్టమైన ఆపరేషన్. కంతి ఉన్నది పుర్తిగా బ్రైన్ లో కాదు. అది కిందన వెన్నుపూసకి కలిసే చోట బ్రైన్ స్టెమ్ అంటారు అక్కడ ఉంది. ఆపరేషన్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తలనించి కిందకి పక్షవాతం రావచ్చు, లేదా పైన బ్రైన్ చెడిపోతే మరీ కష్టం….”

“చావు తప్పదనేగా మీరు చెప్పేది?”

“నేను అలా అనలేదే? దీనికి మంచి సర్జన్ ని చూసుకోవాలి అని చెప్తున్నాను. మరో విషయం ఏమిటంటే సర్జరీ అయ్యాక కూడా కేన్సర్ మరోసారి రావచ్చు. అందువల్ల మంచి ఎక్స్ పీరియన్స్ ఉన్న సర్జన్ మాత్రమే ఏమి చేయాలో చెప్పగలడు.” అదీగాక అది పెరుగుతోందా లేదా అనేది చూడ్డానికి మరో సారి స్కాన్ తీయించండి. ఇదిగో నేను కనుక్కున్న ప్రకారం ఈయన బ్రైన్ సర్జరీ చేస్తారు. రెండు స్కాన్ లూ పట్టుకెళ్ళి ఆయన్ని కలవండి.”

ఆగస్ట్ 2020

బొమ్మ:

“ఈ సారి కూడా టెస్ట్ లు అన్నీ మామూలుగానే ఉన్నాయి. మీ కౌంట్ అలాగే ఉంది. అయినా ఫర్వాలేదు. ఇటువంటి కేసుల్లో సమయం వచ్చేదాకా చూడ్డం తప్ప మరేం చేయలేం. ఓ సారి గైనకాలజిస్ట్ ని కలిసి చూడండి ఆవిడ ఏ టైమ్ లో కలిస్తే మంచిదో అదీ చెప్తారు. దాని ప్రకారం చేయండి. సిగరెట్ల సంగతి ఏమైంది?”

“పూర్తిగా మానిపించానండి. కంపు వదిలింది బెడ్ రూమ్ లో. హాయిగా నిద్రపడుతోంది. అదో అదృష్టం.”

“కంగ్రాట్యులేషన్స్. ఏమీ ఆదుర్దా పడకండి. వీలుంటే ఆహ్లాదానికి ప్రయాణం పెట్టుకోండి ఏదైనా చోటకి వెళ్ళి చూడండి. తప్పకుండా సక్సెస్ కి ఛాన్స్ ఉంది.”

బొరుసు:

“మీ స్కాన్ లు రెండూ చూసాను. కంతి పెరుగుతోంది. మీ న్యూరాలజిస్ట్ చెప్పినట్టూ అది బ్రైన్ స్టెమ్ లో ఉన్నదీ నిజమే. అయితే నాకున్న ఎక్స్ పీరియన్స్ లో రెండు విషయలు మొహమాటం లేకుండా చెప్పాలి. ఇది క్లిష్టమైన సర్జరీ. మూడు విధాలుగా అవ్వొచ్చు. మొదటిది సర్జరీ సక్సెస్ అవడం. రెండోది బ్రైన్ డామేజ్. మూడోది నడుం కింద నుండి పక్షవాతం. నేను ఎంత జాగ్రత్తగా చేసినా ఈ కేన్సర్ మళ్ళీ వస్తుంది.”

“నేను ఎప్పటికైనా మామూలుగా అవగలనా?”

“అది నాలుగో విధం. అవడానికే ప్రయత్నం చేద్దాం.”

“కేన్సర్ కణితిమీద కత్తి పెడితే అది అమాంతంగా పెరుగుతుంది అంటారు కదా అందుకేనా మీరు మానాన్నగారి కి మరో సారి కేన్సర్ వస్తుంది అన్నారు?”

“కేన్సర్ మీద కత్తి పెడితే విజృంభిస్తుందనేది ఆపోహ మాత్రమే. అసలు విషయం ఏమిటంటే మీ నాన్నగారి కేన్సర్ లింఫ్ నోడ్ లలోకి పాకింది. అక్కడనుంచి మిగతా అవయవాల్లోకి వెళ్ళిందేమో కూడా. అది పూర్తిగా చూస్తేనే కానీ చెప్పలేం.”

“సర్జరీ ఎప్పుడు చేయగలరు?”

“వారం రోజులలోపు. ఈ లోపుల ఆలోచించుకుని, చెప్పండి అపాయింట్ పెట్టుకుని చేసేద్దాం.”

అక్టోబర్ 2020

బొమ్మ:

“ఏమిటి, ఎప్పుడూ మెసేజ్ పెట్టేదానివి ఈరోజు ఫోన్ చేసావు? పక్క క్యూబులోనే బాసు గాడు ఉన్నాడు. కోపం వస్తే పని ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి దాకా కూర్చోపెడతాడు.”

“ఈ రోజు దసరా. అమ్మవారికి నైవేద్యం పెట్టాను. సాయంత్రం దుర్గ గుడికి వెళ్ళి వచ్చాక మిగతా విషయాలు చెప్తాను. లేటుగా వస్తాను, కుదరదు అనే కబుర్లు చెప్తే దెబ్బలు తగుల్తాయి.”

“తప్పదా? ఏం చెప్పమంటావ్ వాడితో?”

“అమ్మగారి ఆర్డర్. నేను చెప్పినట్టూ వస్తే ఉద్యోగంలో బాసుతో అక్షింతలు పడతాయి. వెళ్ళక పోతే ఇంట్లో అమ్మగారి అక్షింతలు పడతాయి. ఏదో ఒకటి తేల్చుకోండి. అసలే ఇది అతి ముఖ్యమైన విషయం.”

“అక్షింతలు తప్పవన్నమాట – డామ్డ్ ఇఫ్ ఐ డు, డామ్డ్ ఇఫ్ ఐ డోన్ట్. సరే వాడి చెవిలో పెట్టడానికో పువ్వు సంపాదించలేనా?”

“అదీ దారి. అమ్మగారి ఆర్డర్ అంటే అర్ధమైందా? హ హ్హా”

బొరుసు:

“సర్జరీ అయ్యాక మానాన్న గారికి కాస్త తలనెప్పి తగ్గిందండి కానీ వాంతులూ అవీ తప్పడం లేదు. ఈ సారి కడుపు లో నెప్పి వస్తోంది. కేన్సర్ కానీ విస్తరించిందంటారా?”

“మీ నాన్నగారి స్కాన్ లు మొదటి నుండి ఇప్పటివరకూ చూసానండి. ఇప్పుడు స్కాన్ లో అంతా అంతా క్రిస్ట్ మస్ లైట్స్.”

“అంటే?”

“ఆయనకి కేన్సర్ లేని అవయవం లేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం పాంక్రియాస్ అనేచోట బాగా ఎక్కువగా ఉంది ఈ కేన్సర్. నిజం చెప్పాలంటే …”

“ఆగారేం చెప్పండి.”

“రేడియేషన్ థెరపీ మందులూ వాడుతూ ఉండాలి కానీ అవి ఎంతవరూ పనిచేస్తాయో చెప్పడం కష్టం.”

“మహా అయితే ఎన్నాళ్ళు బతకొచ్చంటారు?”

“ఆరు నుంచి తొమ్మిది నెలలు. సాధారణంగా పాంక్రియాటిక్ కేన్సర్ వచ్చినవాళ్లకి మేమిచ్చే సమయం కొన్ని వారాలలోపే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటారు. మీరు అడిగినదానికి ఇంతా అని సరైన సమాధానం చెప్పడం కష్టం”

జనవరి 2021

బొమ్మ:

“ఏవిరా ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తాను అంటూ దాటవేసేవాడివి, అమ్మాయి నీళ్ళోసుకుందా?”

“దసరా అయ్యాక గైనకాలజిస్ట్ దగ్గిరకి వెళ్ళాం అమ్మా. ఆవిడ కూడ టెస్ట్ చేసి చెప్పారు కానీ ఏదో సందేహం ఉందిట ఆవిడకి అందువల్ల అప్పుడే ఏమీ అనుకోకండి అన్నారు. అందుకే ఇప్పటివరకూ మీకు కూడ చెప్పలేదు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. నాలుగో నెల అని చెప్పారు. పుట్టింటికి వెళ్తావా అంటే ఇంకా ఏమీ తేల్చుకోలేదు అంటోంది. అందువల్ల వాళ్లకి కూడా చెప్పలేదు. నీతో మాట్లాడ్డం అయ్యాక ఫోన్ చేసి చెప్తాను.”

“సరే అమ్మాయికి ఇయ్యి ఫోను, నేను మాట్లాడతాను.”

“ఇదిగో ఇస్తున్నాను.”

“ఇప్పటికి నీ కడుపు పండుతోంది. సంతోషం. పుట్టింటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. లేకపోతే నన్ను వచ్చి సహయం చేయమన్నా సరే. మంచి తిండి తినాలి. మనవడు నీరసంగా ఉంటే ఒప్పుకోను సుమా?”

“అలాగేనండి. మొన్న మొన్నటివరకూ వాంతులు. అసలు మంచినీళ్ళు కూడా తాగలేకపోయేదాన్ని. ఇప్పుడు కాస్త ఫర్వాలేదు కానీ అప్పుడప్పుడూ వికారంగా ఉంటోంది. మా అమ్మ వాళ్ళతో మాట్లాడి చెప్తాను. అక్కడ పల్లెటూర్లో మంచి డాక్టర్ ఉండడు కదా అని సంకోచం. మా అమ్మనే ఇక్కడకి పిలుస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.”

“అవును. వాడి దగ్గిర ఉంటే బాగానే ఉంటుంది. మీ అమ్మగారు వస్తే మంచిదే. ఆవిడకి కుదరకపోతే నన్ను రమ్మన్నా వస్తాను. సరేనా?”

బొరుసు:

“ఈ మధ్యన కనిపించడం లేదేం బాబు, నాన్నగారి వంట్లో కులాసా?”

“లేదండి. హాస్పిటల్ల చుట్టూ తిరుగుతున్నాం. రేడియేషన్ తెరపీ, ఇదీ అదీ అంటూ వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. ఇదెంతకాలం ఉంటుందో అసలు మళ్ళీ లేచి తిరగ్గలరా అనేది తెలియడం లేదు….”

“సర్జరీ చేసిన డాక్టర్ ఏమన్నాడు బాబు?”

“మహా అయితే ఓ ఆర్నెల్లు అన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు లెండి.”

“బాగా నెప్పి అదీ ఉందా? పోనీ నెప్పి తీసేయడానికి మందు ఏదైనా అడగలేకపోయావా?”

“అదీ అయిందండి. ఉన్నంతలో ఎక్కువ డోసులో హైడ్రోకోడోన్ అనే మందురాసారు. అయినా కేన్సర్ వల్ల ఇలా ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది… “

“అవున్లే. ఏమనుకోకపోతే ఓ మాట చెప్దామనుకుంటున్నా”

“తప్పకుండా మీరు మా కుటుంబానికి ఇరవైఐదేళ్లబట్టీ పురోహితులు మీ దగ్గిర దాపరికం దేనికీ?ఈ నెప్పితో విలవిల్లాడే కన్నా నాన్న ఇంక ఎలాగా బతకడని చెప్పేసారు కనక పోనీ ప్రాణం పోయినా నెప్పినుంచి తప్పించుకుంటాడు కదా అనిపిస్తోంది. నేనెంత క్రూరుణ్ణి మీరు అనుకున్నా సరే ఉన్నమాట చెప్తున్నాను.”

“అబ్బే అదేం లేదు. ఓ మాట గుర్తుంచుకో. జాతస్యహి ధ్రువో మృత్ర్యుః అనేది విన్నావు కదా, అంటే అందరం ఏదో ఒకరోజు పోవాల్సినవాళ్లమే. అయితే వెళ్ళిపోయేముందు మరో జన్మలో పుట్టడానికి అవతల సీటు ఖాళీ అవ్వాలి. అది ఖాళీ అయ్యేదాకా మనం ఏమీ చేయలేం. అంచేత నీచేతనైంది నువ్వు చేయి. భగవంతుణ్ణి నమ్ముకో అన్నీ అవే సర్దుకుంటాయి.”

మే 2021

బొమ్మ:

“మరో రెండునెలలు జాగ్రత్తగా ఉంటే చాలు; ఆ తర్వాత పుట్టే కుర్రాడితో ఊపిరి సలపదు. అయినా నీకు ఏది కావాల్సినా వండి పెడతానని చెప్పానుగా, ఏమీ అడగవేం?”

“అయ్యో మా అమ్మకి రావడం కుదరదని చెప్పాక మీరు వచ్చి సహాయం చేయడం, ఏమీ అడగకుండానే చేసి పెడుతూంటే ఇంకా అడిగేదేమిటి? ఈ వారం మరోసారి గైనకాలజిస్ట్ దగ్గిరకి వెళ్తున్నాం. అన్నీ సరిగ్గా ఉన్నాయి, నెప్పులు రాగానే హాస్పిటల్ కి వచ్చేయండి అని చెప్పారు క్రితం సారి. నెప్పులు వచ్చినప్పుడు కొంతమంది భరించలేనంత నెప్పి అంటారు కదా, ఎలా ఉంటుందంటారు?”

“కొంచెం నెప్పి ఉంటుంది కానీ డాక్టర్లు మందులు ఇస్తారు. కుర్రాడు పుట్టగానే వాడి బోసి నవ్వు చూసాక ఇంకే నెప్పి గుర్తు రాదు. ఏమీ ఫర్వాలేదు. నేను కూడా ఉంటాగా?”

“అవుననుకోండి, మొదటి సారి కదా అందుకే కొంచెం టెన్షన్. అదీగాక ఆయన ఆఫీసుకి వెళ్తే రాత్రీ పగలూ తెలియదు. అలా కూర్చుండిపోవడమే”

“నేను చెప్తాను వాడితో. నువ్వేమీ కంగారు పడకు. పిల్లాడికి ఏం పేరు అనుకున్నారు?”

“ఎడతెగని చర్చలండి. ఆయనకి నచ్చింది నాకు నచ్చదు. నాకు నచ్చేది ఆయనకి నచ్చదు.”

“ఓ మాట చెప్తాను విను. తాత, మామ్మ, అమ్మమ్మా, తాతా పేర్లు పెట్టవద్దు. మంచి మోడర్న్ పేరు ఆలోచించండి. మావి మరీ చాదస్థంగా ఉంటాయి పేర్లు.”

“చూద్దాం లెండి మరో నెలో, నెలన్నరో ఉందిగా.”

బొరుసు:

“ఒరే ఈ రోజు నాన్న కాస్త తెరిపిన పడ్డట్టూ ఉన్నాడు కానీ, నిద్రలో కలవరిస్తున్నాడు, ‘నేనూ వచ్చేస్తున్నా, ఆగండి, నేనూ వచ్చేస్తున్నా’ అంటూ.”

“వారం క్రితమే కదా వచ్చి చూసాను. ఇప్పుడెలా ఉంది?”

“నాన్నకి వాళ్ళ అమ్మా నాన్నా కనపడి ‘ఫర్వాలేదు అంతా సర్దుకుంటుంది’ అని చెప్తున్నారుట. నిద్రలోంచి లేచాక అంటున్నాడు. దాని వల్ల నాకు కొంచెం ఆదుర్దాగా ఉంది.”

“ఓ మాట చెప్తాను వినరా అన్నా. నేను క్రితం వారం వచ్చి చూసాక వెనక్కి వచ్చి గూగిల్ లో చూశాను. ఇలా అంటున్నానని ఏమనుకోకు గానీ ఈ నెప్పితో మరో కొన్ని వారాలు బతకడం కన్నా ఇంక ప్రాణం పోవడమే మంచిది. తొందర్లో పోబోయే వారికి అంతకుముందు పోయినవాళ్ళు ఇలా కనబడి, ‘భయం లేదు,’ అని చెప్తారుట. అదే అయి ఉండొచ్చేమో?”

“రాత్రి నిద్రలో కలవరింతలు వింటూంటే నాకూ అదే అనిపించింది అనుకో.”

“అయితే తాతా మామ్మా కనబడి ధైర్యం చెప్తున్నట్టూ అనిపిస్తోందన్నమాట నాన్నకి. వాళ్ళు కనుమరుగౌతూంటే, ‘నేనూ వచ్చేస్తున్నా, ఆగండి, నేనూ వచ్చేస్తున్నా’ అంటూ ఉండవచ్చు.”

జూలై 2021

బొరుసు:

“ఇది మీ ఇంటి పురోహితుడు మాట్లేడేది. మీ నాన్నగారు ఓ అరగంట క్రితం శ్వాస వదిలేసారు. మీరు వెంఠనే చూడడానికి వస్తే బాగుంటుంది.”

“అయ్యో ఎలా జరిగిందండి ఇది? డాక్టర్ వచ్చి చూశారా చివర్లో? చివరి వరకూ మాట్లాడగలిగాడా? అన్నయ్య ఎక్కడున్నాడు, వాడితో మాట్లాడ్డం కుదురుతుందా?”

“అన్నయ్య డాక్టర్తో మాట్లాడుతున్నాడు. మీ నాన్నగారు మీ అన్నయ్య చేతుల్లోనే పోయారు. వెంఠనే డాక్టర్ ని పిలిపించారు చూడ్డానికి. పల్స్ అందలేదుట, మిగతా బ్లడ్ ప్రెషర్ అవీ ఏమీ చూపించడం లేదు. ఒక్క పది నిముషాల క్రితం మీ అన్నతో మాట్లాడారు, ఎలా ఉంది అంటే, ఫర్వాలేదు అన్నారు కూడా. వెంఠనే ఏదో శబ్దం వచ్చింది నోట్లోంచి. అన్న చేతుల్లోనే తలవాల్చేసారు. ఇదిగో మీ అన్నకి ఫోన్ ఇస్తున్నా మాట్లాడండి.”

“ఆన్నా ఏమైంది? పొద్దున్న బాగానే ఉందన్నావుగా?”

“అవున్రా పొద్దున్నవరకూ ఎందుగ్గానీ ఓ అరగంట క్రితం వరకూ బాగానే ఉందన్నాడు. సడన్ గా తలవాల్చేసరికి డాక్టర్ ని పిలవమని చెప్పాను. ఆయనొచ్చేసరికే పోయి ఉండొచ్చు. ఆయన వచ్చి పల్స్ అదీ చూశాడు.”

“నేను వెంఠనే రావడం కుదరదు ఇప్పుడు బయల్దేరితే రెండు మూడు రోజులు పడుతుంది. దూరాభారం కదా?”

“పదో రోజు లోపుల రావచ్చు. ఫర్వాలేదు మిగతావి నేను చూస్తా”

బొమ్మ:

“మీకు మగబిడ్డ పుట్టాడండి. బరువు మూడున్నర కిలోలు. నల్లటి జుట్టు, బాగున్నాడు కుర్రాడు. ఓ గంట ఆగితే పిల్లాడికి స్నానం చేయించి మీ ఆవిడకి ఇస్తాం. మీరు వెళ్ళి చూడవచ్చు.”

“థాంక్ యూ సిస్టర్. మా ఆవిడ వంట్లో బాగానే ఉందా?”

“ఆవిడకి బాగానే ఉంది కానీ కుట్లు పడతాయి. ఓ ఆరువారాల్లో అన్నీ సర్దుకుంటాయి. ఏమీ కంగారు లేదు. డాక్టర్ వచ్చి మిగతా విషయాలు చెప్తారు….”

“ఒరే అబ్బాయ్ నేను మనవణ్ణి చూశా, బాగున్నాడు. మూడు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమీ భయం లేదు. నువ్వు అందరికీ ఫోన్లు చేసి చెప్పు. నవమి నాడు భరణీ నక్షత్రంలో పుట్టాడు. సిద్ధాంతి గార్ని అడిగితే ఏదైనా శాంతి అదీ చేయించాలేమో చెప్తారు.”

“సరే అలాగే చేద్దాం.”

“పేరు ఏమనుకున్నావురా?”

“వీర సత్య వెంకట నాగ సూర్య సాయి రామ కృష్ణ సుబ్రహ్మణ్య వరప్రసాద రావు.”

“కొడుకు పుట్టాడనే సంతోషంలో జోకులు బాగా వేస్తున్నావు కానీ, ఆపు వెధవా. మంచి మోడర్న్ పేరు చూసి ఉంచుకున్నారా? బారసాల వచ్చేసరికి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, అందరూ నవ్వుతారు.”

ఆగష్ట్ 2021

బొరుసు:

“ఇంట్లో పెద్ద దిక్కు పోయిందిరా తమ్ముడూ. ఆ వెలితి తీరేది కాదు.”

“నాన్న పోకముందు ఓ మాట అనుకున్నాం గుర్తుందా? కేన్సర్ నెప్పితో ఎంతకాలం నాన్న అలా బతికుంటే నీకు బాగుండేది? అయినా డాక్టర్ చెప్పాడు కదా ఆరునెలలు మహా అయితే అని? వేరు జన్మలో పుట్టాలంటే అక్కడో సీటు ఖాళీ అవ్వాలని పురోహితుడు చెప్పారు కదా? అలా సీటు ఖాళీ అయ్యేదాకా నాన్న ఇక్కడ ఉండవల్సి వచ్చింది. ఎప్పుడు అటువైపు సీటు ఖాళీ అయిందో వెంఠనే వెళ్ళిపోయాడు.”

“నిజమే కానీ కట్టెదుట ఉండే మనిషి ఇంక కనబడడు అనుకుంటే ఏదోలా ఉంది మనసులో. మొన్నటి వరకూ ఈ ఇంట్లో ఎంతో ముఖ్యం అనుకున్న వస్తువుల్లో ఏ ఒక్కటీ పనికిరానిది గా కనిపిస్తోంది. జీవితం అంటే ఇదేకదా. ఆరడుగుల మనిషి పిడికెడు బూడిద అవడం, పంచభూతాల్లో కలిసిపోవడం. ఆఖరికి మిగిలిన అస్థికలు కూడా గంగలో కలిపేసాక మిగిలేది ఏమీ లేదు.”

“సరే ఈ వేదాంతంలోంచి బయటపడ్డానికి కొంతకాలం తప్పదు. ఇంక వెళ్తాను మళ్ళీ కలుద్దాం.”

“వెళ్ళిరా, వీలున్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు.”

బొమ్మ:

“ఈ మాట విన్నారా అత్తయ్యగారూ, మన ఓంకార్ పుట్టిననాడే మా తాతగారి తమ్ముడు – అంటే మా చిన్నతాతగారు – పోయారుట. ఇప్పుడే తెల్సింది. మా వాళ్లకి ముందే తెలుసుట, కానీ పురుడుకి దగ్గిర్లో ఉంది కదా ఎందుకని నాతో చెప్పలేదుట.”

“మీ చిన్న తాత గారిది మీ ఇంటిపేరేనా?”

“కాదండి మా అమ్మ తరుఫు వాళ్ళు – నాకు ఏమైనా ఉంటుందా?”

“మన ఇంటిపేరు కాకపోతే ఏమీ ఉండదు. కానీ వార్త విన్నాక ఆ సారి స్నానం చేస్తే చాలు. ఇంతకీ ఎలా పోయారు? వయసు ఎంత ఉంటుంది?”

“ఆ మధ్య కేన్సర్ అన్నారు. కోలుకుంటున్నారని చెప్తూ ఉండేవారు. అరవై దాటి ఉండొచ్చేమో.”

“అయ్యో, పోనీలే పాపం. కేన్సర్ వస్తే, అదో కష్టం, వదలదని తెలుసు కదా….. ఏడుపు వినిపిస్తోంది, పిల్లాడు లేచినట్టున్నాడు చూడు, మొదటి మూడు నెలలు వీణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత సులభంగా ఉంటుంది.”

*

ఆర్ శర్మ దంతుర్తి

ఆర్ శర్మ దంతుర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు