బొడ్రాయి

ల్లంపల్లి వూరంతా పెళ్లికి సిద్దమవుతున్న ఆడ పిల్లలా వుంది.

ఇంట్లో కార్యం ఖుషీగా చేయాలని ఆరాట పడే కన్న వాళ్లలా వూరి జనం హడావుడి చేస్తున్నారు.

వారు రోజులుగా యాడ జూసినా, కూసున్నా వొకటే వొడువని ముచ్చట.

బొడ్రాయి పండుగ.

అప్పుడెప్పుడో బొడ్రాయి వేశారట. సుమారు వో వంద యేళ్ల కిందట. ఇప్పుడు వూరు అప్పుడు వున్న తావున లేదు.

వందేళ్ల కిందట వున్న తావునే ఏ వూరైనా ఉంటదా? అటూ యిటూ కదులుతూనే వుంటది. అప్పుడు యిండ్లున్న తావు ఇప్పుడు పొలాలయ్యాయి.

విష్నూరు దొర దేశముఖుగా యేలుతున్న కాలంలో మల్లంపల్లి దొరలకు మాంచి గౌరవం దక్కింది. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. మల్లంపల్లి దొరలు అంత చెడ్డవాళ్లు కారు. ఖూనీ కోర్లూ కారు. కానీ మల్లంపల్లి, వావిలాల, కాట్రపల్లి వూళ్లన్నీ ఆ దొరల కింద వుండేవి. అందుకే మల్లంపల్లి వూళ్లోని సూదరోళ్లు, మాదిగోళ్లు గడీకి దగ్గర వుండే వాళ్లు.

గడికి దక్షిణాన మాదిగల యిండ్లు. ఉత్తరాన కాపోళ్ల యిండ్లు, గౌండ్లోళ్ల యిండ్లు,  సూదరోళ్ల యిండ్లు వుండేవి. పడమట పెరుకోళ్లు, గొల్లోళ్లు, కమ్మరోళ్లు, కుమ్మరోళ్లు యిండ్లు వుండేవి. దొరలకు ఎట్టి చేస్తూ, కాపోళ్లకు జీతాలుంటూ మాదిగలు బతికేవాళ్లు.

దొర గడీకి ఎదురుగా పెద్ద యాప చెట్టు వుంది. దానికి వొక నూట యాభై యేళ్లు వుంటాయి. దాని వొళ్లంతా పెచ్చులు లేసిన బెరళ్లు. ఎవరో గొడ్డలితో కాటు పెట్టినట్టున్నరు. అందులోంచి నల్లగా, ఎర్రగా కారుతున్న బంక.

గడీకి ఎదురుగా కోమట్ల యిండ్లు. వాటి వెనక బైండ్లోళ్లవి. తూర్పుకు అన్న మాట.

ఇలాంటి వూరు ఇప్పుడు మారిపోయింది. రజాకార్ల కాలం పోయి నలభై యేళ్లు దాటింది.

ఎన్టీఆర్ ఏలుతున్నాడు.

బడుగు బలహీన వర్గాలకు యిండ్లు కట్టించాలని ఆయన నిర్ణయించాడు.

యెతిరాజారావు ఎమ్మెల్యే.

మల్లంపల్లిలో కూడా మాదిగలకు, సూదరోళ్లకు ఇండ్లు కట్టివ్వాలని తీర్మానం జరిగింది.

ఎక్కడ కట్టివ్వాలనేది ప్రశ్న. దొర అప్పటికే వూరును పట్టించుకోకుండా హన్మకొండలో ఇల్లు కట్టుకున్నడు.

ఇప్పుడు వూరిలో కొత్తగా తయారైన పెద్దలదే పెత్తనం.

కాబట్టి మాదిగలకు ఉత్తరం వైపున్న కంట పక్కన కాపోళ్ల భూమి కొని ఇండ్ల స్థలాలు కేటాయించారు.

సూదరోళ్లకు పడమటి దిక్కున కాపోళ్లదే జాగ కొని కేటాయించిండ్లు.

అప్పటి దాకా వూరిని ఆనుకొని వున్న మాదిగల యిండ్లు ఇప్పుడు దూరంగా విసిరేసినట్టు ఏర్పడ్డాయి.

బైండ్ల సెంద్రెయ్య, యెంకటయ్య, సోమయ్యలకు కూడా కేటాయించిండ్లు. కానీ వాళ్లు ఉత్తరానికి పోకుండా, నర్సయ్య కట్టిన యింట్లనే వున్నరు.

ఇంకా వూరి సుట్టూ తండాలే. పెద్దతండా, దుబ్బ తండా, కాసోళ్ల గుడిసెలు ఇట్లా అయిదు తండాలు వుంటయి.

ఊరి స్వరూపం మారిపోయింది.

ఏది బొడ్డో, ఏది కాదో తెల్వకుండా వుంది.

వూరన్నంక బొడ్రాయి వుండాలే. లేకపోతే అరిష్టం అన్నడు కోళ్ల నారాయణ.

బైండ్ల యెంకటయ్య ఇప్పుడు పోలీసు పటేలు.

కోళ్ల నారాయణ ఇప్పుడు కారోబారు.

గౌండ్ల సత్తయ్య కుల పెద్ద.

పెద్ద మేతరి సోమయ్య వీళ్లందరి కన్న వయసులో కొద్దిగా పెద్దవాడే.

కుల పెద్దలంతా కూసోని వొక రోజు బొడ్రాయి పెట్టాలని మాట్లాడుకున్నరు. దొర గడీ ముందున్న యాప సెట్టు కింద కూసున్నరు. సాకలి, మంగలి, మాదిగ, బైండ్ల కుల పెద్దలను ప్రత్యేకంగా పిలిచిండ్లు. బొడ్రాయి వెయ్యాలంటే, ఈ కులాలు తప్పకుండా అవసరం.

బైండ్ల యెంకటయ్య పోలీసు పటేలు కాబట్టి కుల పెద్ద కాదు. కులం తరఫున నడిపోళ్ల యెంకటయ్య, బండ్ల సోమయ్య వచ్చిండ్లు.

బైండ్ల సెంద్రెయ్య కూడా వొచ్చి, బుర్రోళ్ల గోడకు ఆనుకొని కూసున్నడు.

ఎట్టా చెయ్యాలో చెప్పాల్సింది బైండ్లోళ్లు అన్నడు సర్పంచి వాసు నాయకుడు.

“వో బావ సెప్పరాదు. పుల్లవట్టుకొని ఒకటే గియ్యబడితివి” అని నడిపోళ్ల యెంకటయ్య కేలి సూత్తా పెద మేతరి సోమయ్య ఎకసెక్కం ఆడిండు.

అందరూ నవ్విండ్లు.

“వో వాయి. యాపాకు చేదుగుంటది. తేనె తియ్యగుంటది. ఏది వున్నా కుల్లంఖుల్లా మాట్లాడుకోవాలె. పండుగంటే నవ్వులాటానోయి. ఇంట్ల యెల్లమ్మ పండుగ చెయ్యాలంటేనే, పెద్ద తతంగం వుంటది. మరి ఇది బొడ్రాయి పండుగ. ఏదో కనవడ్డ రాయిని దెచ్చి నడీవూళ్లో నాటి, ఇది బొడ్రాయి అంటే నడువదు. బొడ్రాయి అంటే శక్తి ప్రతిష్ఠ. దేవాది దేవతలను మెప్పించాలే. వొప్పించాలే. అంత శక్తిమంతుడు రావాలే ఈ పండుగ చెయ్యాలంటే” అని మళ్లా పుల్ల తీసుకొని నేల మీద గీతలు గీస్తూ మాటలు ఆపేసిండు.

” నీకత బానే వున్నది. అవ్వన్నీ చెయ్యడానికే కదా, బైండ్లోళ్లు వున్నది” అని మంగలి సోమయ్య అన్నడు.

సెంద్రెయ్య తన తమ్ముడు సోమయ్య వైపు చూసిండు. సుట్ట చుట్టుకుంటూ మంగలి సోమయ్య వైపు సూత్తా అన్నాడు యిలా. “వో బావ. అన్నీ మేమే చేస్తే నువ్వెందుకు? మైల దియ్య నువ్వు, డప్పుకొట్ట మాదిగ, సక్కగ కార్యం నడువ సాకలాయన, శక్తిని నడిపించ మేము వుంటేనే సాలదు. ప్రతీదానికి వొక వరుస వాయి వుంటది. బొడ్రాయి యెయ్యాలంటే మంత్రం దెలిత్తనే సాలదో వాయి. నీ మొగడు దేశగురువు రావాలె. బొడ్రాయి ప్రతిష్టించ హక్కు ఆయనకు మాత్రమే వున్నది. అన్నీ మనమే చేత్తే తప్పుల పడుతం” అని సుట్ట యెలిగించి పొగ నోటి నిండా పీల్చి వొదిలిండు. అది వుండలు వుండలుగా తిరుగుతూ నల్లని మేఘాలను సృష్టించింది.

” ఇప్పుడు దేశ గురువు కోసం యాడికి పోవాల్నయా యెంకటయ్య? మీ తమ్ముని మాటలు యింటన్నవా వో పోలీసు పటేల్ సాబ్” అని సర్పంచి అన్నాడు.

దొర గడికి ఒక కాలు ఆనించి, వొంటి కాలు మీద నిలబడ్డ యెంకటయ్య అందరి వైపు చూసిండు.

“ఇది అందరికీ తెల్సిన విషయమే. దేశ గురువైతే రావాలె. మొన్ననే కొరిపెల్లిలో బొడ్రాయి పండుగ అయ్యింది. కర్నాటక నుండి దేశ గురువొచ్చి, యింకా ఆన్నే వున్నడు. మనం వో అయిదుగురం పొయ్యి, ఆయనతో మాట్లాడి తీసుకు రావాలె. ఖర్చు ఎంత అంటడో చూడాలే” అన్నడు.

అందరూ సరే అన్నడు. ఆయన పెట్టిందే ముహూర్తం అన్నరు.

కోళ్ల నారాయణ, పోలీసు పటేలు యెంకటయ్య, మంగలి సోమయ్య, సాకలి రాజయ్య, పెదమేతరి సోమయ్య, సర్పంచి వాసు నాయకుడు నాయకత్వంలో కొరిపెల్లికి నడచుకుంటూ వెళ్లారు. అక్కడ దేశ గురువుతో మాట్లాడిండ్లు.

ఆయన కట్నం కింద పుట్టెడు వొడ్లు, రెండు వేల రూపాయలు అడిగిండు. పండుగ కాడ కోళ్లు, మేకలు ఎన్ని చెప్పితే అన్ని తయారుగా వుండాలన్నడు. ఉప్పుతో సహా ముప్పై ఆరు వస్తువులు చెప్పిండు. జాగ్రత్తగా కోళ్ల నారాయణ రాసుకున్నడు.

సరిగ్గా పదోరోజు అంటే శనివారం ముహూర్తం ఖరారు చేసిండు దేశ గురువు.

దేశ గురువు చెప్పిన సంగతులు వూరి జనాలకు తెలియ చేశారు.

పండుగ హడావుడి మొదలైంది. బిడ్డలు అల్లుళ్లను, దగ్గరి బంధువులను పిలుచుకున్నరు. కొత్త బట్టలు కుట్టించుకున్నారు.

ఖర్షులకు డబ్బులు కావాలి. కోమటి కృష్ణమూర్తికి వడ్లు, జొన్నలు కొంతమంది అమ్మిండ్లు. జీతం చేసే మాదిగలు యజమానుల దగ్గర మళ్లా అప్పు చేసిండ్లు. మిగతా వాళ్లు దొరికిన కాడ అప్పు చేసిండ్లు.

పండుగ ఖర్చుల కోసం యింటికి వొంద రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేసిండ్లు. యాటపోతులను గొల్లోళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. వాళ్లు ఉత్సాహంగా ఇరవై యాటలు ఇత్తమన్నరు.

దేశగురువుకు పుట్టెడు వొడ్లు కాపోళ్లు, లంబడోళ్లు కలిసి ఇత్తమన్నరు.

అన్నీ ఏర్పాటు అయ్యాయి.

బైండ్లోళ్లు కూడా ఉత్సాహంగా వున్నారు.

సెంద్రెయ్య బాగా ఆలోచిస్తూ చింత చెట్టు కింద కూసోని తాళ్లు పేనుతున్నాడు. చిన్న సోమలింగయ్య వొచ్చి ఎదురుగా వున్న గడెంచ మీద కూసున్నడు.

వో రెండు నిమిషాల తర్వాత “సెంద్రెన్న, యేందే యిది? బొడ్రాయి పండుగ అంటే మాటలా? మన మూడిల్ల మనుషులు సరిపోతరా? లేకపోతే పక్క వూళ్ల నుండి పిలిపిద్దామా?” అన్నడు.

సోమయ్య జమిడికె పూత్తండు.

“వాణ్ణి అడుగరాదురా. వాడే పెద్ద మనిషాయె” అన్నడు సెంద్రెయ్య. ఆ మాటల్లో వ్యంగ్యం అర్థమయ్యింది సోమయ్యకు.

“నీ మాటలకు నా బారేద్దు. అరే, సోమలింగం. మనం సరిపోము. పాలకుర్తి సోమయ్యను పిలుద్దాం‌. వల్మీడి నుంచి, కోరుకొండపల్లి నుంచి పిలుద్దాం. గావు పట్టాలే, పొలి చల్లాలే. వరుసగా మూడు రోజులు ఇరామ్ లేని పని వుంటది. వాళ్లందరికీ నువ్వే చెప్పి పంపు” అని సోమలింగాన్ని పురమాయించాడు.

వూరు, వాడ అంతా పొట్టకొచ్చిన సేనులా వుంది. వాయి, వరసులతో, సరదాలతో అల్లుకున్న బీరపాదులా వున్నది.

వొచ్చిన సుట్టాలతో నిండు చెరువులా వున్నాయి యిండ్లు.

రాత్రి కాగానే ప్రతి యింటి ముందు ఏదో వొక యక్షగానం లోని పాటలు సొంపుగా వినిపిస్తున్నాయి.

సెంద్రెయ్య అప్పటికే నాలుగు బుడ్ల కల్లు తాగి మాంచి ఊపు మీదున్నడు.

జమిడికె అందుకొని కృష్ణార్జున యుద్ధం బాగోతం లోని పాటలు కాసేపు పాడిండు.

అన్నం తినవా? వొకటే ఆడవడితివి అని భార్య ఎల్లమ్మ విసుక్కుంది.

యెహే పో. బిడ్డ, అల్లుడు వొచ్చిండ్లు. వాళ్లకు పెట్టు. నా జోలికి రాకు అని కసిరిండు. మళ్లా అల్లిరాణి కథలో పాటలు అందుకున్నడు.

కోమటోళ్ల కృష్ణమూర్తి, కోమటోళ్ల రామయ్య భార్యా పిల్లలతో ప్రహారి గోడ అవతల మంచం ఏసుకొని సెంద్రెయ్య పాటలు వింటూ ఆనందిస్తున్నారు.

ఎట్లా తెల్లారిందో తెల్వదు. కోడి కూసింది.

సెంద్రెయ్య తానం చేస్తండు. పోలీసు పటేలు యెంకటయ్య కాగితాలు ముందేసుకొని రిజిస్టర్ లో ఏవో రాసుకుంటున్నాడు.

అబ్రహం ఇంటి ముందు కొచ్చిండు. “ఓ అయ్యా, వున్నవా?” అని పిలిచిండు.

“యేందే. పొద్దుగాలనే వొచ్చినవు” అని యెంకటయ్య ఇంట్లోంచి బయటకి వొచ్చిండు.

ఇంటి ముందు పానాది మీద బాగా పారిన కాకరతీగను చూస్తూ నిలబడ్డడు అబ్రహం. యెంకటయ్యతో “పాలకుర్తి అయ్యగారు వొచ్చిండు. పెద్ద మనుషులంతా గడి ముందట పోగయ్యిండ్లు. బైండ్లోళ్లను అందరినీ రమ్మంటండ్లు అయ్యా” అన్నాడు.

సెంద్రెయ్య దబదబా లుంగీ కట్టి, అంగి దొడిగిండు. యెంకటయ్య వెనకే నడిచిండు.

గడీల యెల్ల గుర్రం కట్టేసి వుంది. అది బాగా ఆరోగ్యంగా బలిష్టంగా వుంది.

గడి ముందు పెద్ద కుర్చీ మీద దేశ గురు కూచున్నడు. తెల్లని పొడవాటి గడ్డం, గిరిజాల జుట్టు భుజాల దాకా వేలాడుతున్నది. తెల్లని వస్త్రాలలో ఎండపొడకు తళతళా మెరిసి పోతున్నాడు.

మొహం మీద యిసుమంత మడుత లేదు. గొప్ప సాధన చేసిన యోగిలాగా వున్నాడు.

నుదుటిలో సింధూరం మణిదీపంలా వెలిగి పోతున్నది.

ఆయనకు రెండు మూడు గజాల దూరంలో పాలకుర్తి అయగారు సీతారమ శర్మ , ఇంకో అయ్యగారు నిలబడి వున్నారు. చుట్టూ వూరి పెద్దలు, జనం కూచున్నరు.

యెంకటయ్యను దేశగురు గుర్తు పట్టిండు. చిరునవ్వుతో పలుకరించిండు. చెయ్యి లేపి నమస్కారం చేసిండు వెంకటయ్య.

సెంద్రెయ్య, సోమయ్య, సోమలింగం, నడిపోళ్ల యెంకటయ్య పాలకుర్తి అయ్యగారు అక్కడ కనిపించడంతో కీడు శంకించారు.

కానీ ఎవరూ ఏమీ మాట్లాడ లే్దు.

అంతా నిశ్శబ్దం. వొక నిమిషం ఎవరూ ఏమీ మాట్లాడ లేదు.

సర్పంచి వాసు నాయకుడు గొంతు సవరించి, నేల మీద ఊసిండు. జలుబు చేసినట్టు కండువాతో ముక్కు తుడిచిండు.

తనే అసలు సంగతి మొదలు పెట్టిండు.

“వూరి పెద్దలు, చిన్నలు అంతా వున్నారు. ఏదైనా ముఖాబులా మీదనే తేలాలి. యిన్నరా బైండ్లోళ్లు. పాలకుర్తి అయ్యగార్లు మీకు తెల్వనోళ్లు గారు. మంచికి చెడుకు వాళ్ల కాడికి పోతూనే వుంటమాయే. మనూళ్లో మంచి పండుగ జరుగుతుంది. నేనూ నా పని చేత్తా అని వొచ్చిండు. మీరేమంటరు?” అని ఆగిండు.

ఎవరూ ఏమీ ఎదురు చెప్పలేదు. కానీ సెంద్రెయ్య, సోమయ్య ఇద్దరూ రగిలి పోతున్నట్టు వాళ్ల మొఖాలు చూస్తే తెలుస్తుంది.

బుర్రి సోమక్క అప్పుడే నిప్పులు దెచ్చి, బయట పారేసింది. అవి ఎర్రగా అగడుతో పొగలు చిమ్ముతున్నాయి.

పోలీసు పటేలు యెంకటయ్యకు మొత్తం అర్థమైంది.

“యింతకు అయ్యగారిని ఎవరన్నా పిలిచిండ్లా? ఆయనే వొచ్చిండా?” అని సర్పంచిని అడిగిండు.

కాపోళ్ల వీరన్న ముందుకొచ్చి నేనే పిలిపించినా అన్నాడు ‌.

అట్టా పిలిపివ్వమని నీకెవ్వడు అధికారం ఇచ్చిండు అని వొకరు గట్టిగా అడిగిండు.

మధ్యలో నీ పెద్దిరికం యేంది అని గౌండ్లోళ్ల వీరస్వామి అంతెత్తున లేసిండు.

గరువందుల సత్తయ్య కూడా నీ బుడ్డిరికం యేంది? అన్నీ సక్కగా జరుగుతున్నయి అనుకుంటే, గాయిదిగుద్ద పంచాయతీ తయారు చేసినావు అని తిట్టిండు.

కాపోళ్ల వీరన్న తగ్గలేదు. అన్నీ మీరే అనుకుంటే సాలా? నన్ను ఏ ముచ్చట కన్నా పిలిచిండ్లా? మీది సాగొత్తంది అనుకుంటండ్లారా? ఉగ్రరూపం ఎత్తాడు.

“ఎవరు పిలిస్తే ఏమైంది? కాపోళ్ల వీరన్న పక్క వూరోడా. మనోడే కదా. ఆయన యింట్లో తనకన్న పెద్దాయన వున్నడు. రాజన్న పెద్ద మనిషిగా అన్ని విషయాలు చూసుకుంటండు. అందుకే వీరన్నకు అన్నీ తెలుసు అనుకున్నం. కులానికో పెద్ద మనిషి కూసొని మాట్లాడిందే కదా. సరే, ఎవరు పిలిచినా మంచిదే. అయగారు మనూరికి వొచ్చిండు. ఆయన సంగతి యేమి చేద్దామో చూడండి” అని కారోబారు కోళ్ల నారాయణ అన్నడు.

దేశగురు గడ్డం సవరిస్తూ అందరినీ గమనిస్తున్నాడు.

సీతారామయ్య అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు చేయి ఎత్తాడు.

“బొడ్రాయి పండుగ పవిత్రమైనది. బ్రాహ్మణులు లేకుండా చేయకూడదు. కాబట్టి మేము పదిమందిమి వస్తాము. వొక్కొక్కరికి పదివేల కట్నం, ఉప్పుతో ముప్పయారు వస్తువులు ఇవ్వాలి. పట్టు వస్త్రాలు సమర్పించి, ఆశీర్వాదం తీసుకోవాలి” అని చెయ్యి దించాడు.

అందరూ మొహాలు చూసుకున్నారు. ఏమీ మాట్లాడ లేదు.

అప్పటిదాకా ముడ్డికింద తువ్వాల యేసుకొని కూచున్న సెంద్రెయ్య లేచి, తువ్వాల దులిపిండు. భుజం మీద యేసుకున్నడు.

“అయ్యగారు, మీరు యీ వూళ్లనే వుండాలే ఇప్పటి నుంచి. జమిడికె యేసుకుంటా మాతో పాటే బతుకాలే. లేదంటే, పాలకుర్తి గుట్టకింద అంజనేయుని గుడికాడ హక్కు వొదులుకోవాలె మీరు. ఆడ మా బైండ్లోళ్లే అర్చకం చేస్తం” అన్నడు.

ఆ మాటలు విన్న అయ్యాగారు బిత్తర పోయిండు. తేరుకొని, “యేమి మాట్లాడుతున్నవురా” అన్నడు కోపంతో.

“ఎవ్వరిని రా అంటన్నవు? లేబట్టి యెత్తేస్తే, గుద్దల పెండ బయట పడాలే” అని మీదికి ఉరికిండు సెంద్రెయ్య.

అంతా గందరగోళం.

నలుగురు కలిసి సెంద్రెయ్యను ఆపిండ్లు.

పద్దతి కాదని మందలిచ్చిండ్లు.

“ఎవరిది పద్ధతి కాదయా? బొడ్రాయి పండుగకు అయ్యగారికి యేంది సంబంధం? బైండ్లోళ్లు, సాకలి, మంగలి, మాదిగ కులాలు, దేశగురు సమచ్చంలో చేసే పండుగ. మధ్యలో ఈ పంతులేంది? శక్తిని ఎత్తుక రావాలి. ఎత్తకుంటడా. ఎత్తేకాడ అమ్మవారి ముందు యాటను బలివ్వాలే. కత్తిపట్టి యాటను తెగ్గోత్తడా? శక్తిని వూరేగింపుగా డప్పు సప్పుళ్లతో తేవాలే. ఎదురైన ఆడోళ్లను మొగోళ్లను అమ్మవారు పూనుతది. శివసత్తులను శాంతింప చేస్తడా? బొడ్రాయికి నెత్తరు నెత్తురు అని యింత నోరు తెరిచి,  ఆ శక్తి స్వరూపిణి కళ్లు పెద్దవి చేసి వూగి పోతూ పిలుస్తూ వుంటది. మేకను గావుపట్టి, నెత్తురు సాకలాయన దెచ్చిన నవధాన్యాల చాటలో పట్టి, మేకపోతు దొబ్బ నోట్లో పెట్టుకొని పొలిమేరలు తిరుగుతూ నెత్తుటి పొలి చల్లాలి. సల్లుతడా? పద్ధతి కాదట పద్ధతి. బైండ్లోళ్లకు పుట్టినోడు మాత్రమే చేసే పనులివి. అయ్యాగారు ఎవలికి పుట్టిండో ఆయనే సెప్పాలే” అని ఆవేశంతో రొప్పుతున్నడు సెంద్రెయ్య.

ఇయ్యాల బొడ్రాయి పండుగకొచ్చినోడు, రేపు ఎల్లమ్మ పండుగ అంటడు. మాదిగిండ్లళ్ల పెళ్లీలంటడు. మా కుల వృత్తి ని మాకు కాకుండా చేస్తరా? అని  బైండ్లోళ్లు లేచి గొడవ చేసిండ్లు.

ఎవరేమి మాట్లాడుతున్నారో తెల్వని అల్లరి.

దేశగురు కోపంగా సర్పంచి వైపు చూసిండు. అందరూ వూకోండ్లి అని గద్దించిండు.

“ఇవన్నీ కాదుగాని దేశగురు ఏం చెప్తే అది చేద్దాం” అని సముదాయించాడు.

యెంకటయ్య, సెంద్రెయ్య దేశగురు అభిప్రాయం కూడా వినాలని చూస్తున్నారు.

దేశగురు కుడికాలు లేపి, ఎడమ కాలు మీద వేసుకున్నడు. చేతిలోకి రుద్రాక్ష దండం తీసుకొన్నాడు.

గంభీరమైన స్వరంతో ఆయనిలా అన్నాడు. “బొడ్రాయి వ్యవహారం చాలా పెద్ద వ్యవహారం. సాత్వికులైన బ్రాహ్మణులు ఈ పని చేయలేరు. మహాశక్తి ప్రతిష్ట ఆషామాషి వ్యవహారం కాదు. శక్తిసాదకులైన బైండ్లోళ్ల సహకారం లేకుండా, నేను కూడా ఏమీ చేయలేను. అంతేకాదు, ఎవరి కుల వృత్తి వాళ్లే చేసుకోవాలని బ్రాహ్మణ ధర్మం చెప్తుంది. ఆ ధర్మాన్ని వాళ్లే కాదంటే ఎట్లా? కాబట్టి, బైండ్లోళ్లు మాత్రమే ఈ పండుగ చేయడానికి అర్హులు. హక్కుదారులు. ఏ రకంగా చూసుకున్నా సరే” అని లేచి వెళ్లిపోయి, తన గుడారంలో కూర్చున్నాడు.

ఇగ పో అయ్యగారు. మా పండుగ మమ్ముల చేసుకోనివ్వండి. రాములవారి కల్యాణానికి మీరే కదా, ఎలాగూ రావాల్సింది అని సర్పంచి నమస్కరించాడు.

సీతారామయ్య అక్కణ్ణించి బయల్దేరుతూ, “నీలాంటి వాణ్ణి నేనెక్కడా చూడలేదు. దేశగురు మీ వైపు వున్నాడు కాబట్టి మీరు నెగ్గారు. లేకపోతేనా..” అన్నాడు.

కోపంతో సెంద్రెయ్య ఏదో అనబోయిండు. యెంకటయ్య వొద్దని వారించి, “దేశగురు న్యాయం మాట్లాడిండు. అన్యాయం మాట్లాడితే అతణ్ణి కూడా వ్యతిరేకిస్తాం అయ్యగారు. మీ రాజకీయం మండలంలో నాకు తెల్వనిది కాదు. కాదూలేదూ అంటే పాలకుర్తిల ఐదుగుళ్ల కాడ పంచాతీ పెడుదాం. మండలంలోని పెద్దలందరినీ పిలిచి మాట్లాడుదాం. సరేనా. పోండి. పోయి పని చూసుకోండి. ఎండ ముదురుతంది” అన్నాడు.

ఆయన చిన్నబోయిన మొహంతో వెళ్లిపోయిండు.

ఆ మర్నాడు బొడ్రాయి పండుగ మొదలైంది. మూడో రోజు బొడ్రాయి ప్రతిష్ఠాపన చేసిండ్లు. దేధగురు సైగ చేయగానే యాటపోతును గావుబట్టిండు సెంద్రెయ్య. దాని పొట్ట చీల్చి దొబ్బ తెంపి నోట్లో పెట్టుకున్నాడు.

డప్పు సప్పుళ్లు మారు మోగుతున్నాయి. సాకలి రాజయ్య పొలి కలిపాడు. మంగలి సోమయ్య పొలిని కడువలో పట్టుకున్నాడు.

జమిడికె మోతలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దొబ్బ నోట్లో పెట్టుకొని పొలిమేరలకు పరిగెత్తాడు. వూరంతా ఆ భీకర దృశ్యం చూసి, దడుసుకున్నది.

ఆ యేడు పొలి చల్లిన నేల నిండా పంటలు దండిగా పండినయి.

*

జిలుకర శ్రీనివాస్

16 comments

Leave a Reply to Jilukara sreenivas Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగుంది మిత్రమా….. ఊళ్ళో బొడ్రాయి పండుగ గురించి…. చాలా చక్కగా తెలంగాణ యాస లో……. ఉంది
    శుభాభినందనలు……

  • అన్న చాలా బాగరాసారు….ఇప్పటికీ ఇలాగే జరుగుతుందా ఏమైనా మార్పులొచ్చాయ?

    • చాలా వొచ్చాయి. కొన్ని చోట్ల బ్రాహ్మణ పూజారులతో చేస్తున్నారు. వూరి పెత్తందార్లు బైండ్లోళ్లను ఆదరించడం లేదు.

  • బాగుంది , జస్ట్ బాగుంది అనుకోవడం కాదు , దళిత నేపథ్యం లో వస్తున్న మూవీస్ చూస్తున్న మా లాంటి వారి experience లో ఆల్మోస్ట్ ఈ కథలో ప్రతి క్యారెక్టర్ ను రైట్ ఇమాజినేషన్ లో చూడగలిగే కెపాసిటీ ని రీడర్ కి ఇచ్చారు. ఇంత చదివాకా మాత్రం ఇంకా కొంచం గ్రీడీ గా ఇవి 80s వాస్తవాలు కాబట్టి , అంతకు ముందు ఒక 20..30 year’s ముందు జరిగిన సినారియో అలాగే ముఖ్యంగా దళిత బహుజన ఉద్యమాల ఏవేర్నేస్ పెరిగిన ఈ కాలం లో అంటే ఈ నెక్ష్ట్ 40 ఏళ్ల లో వచ్చిన మార్పులు కూడా ప్రి టెక్స్ట్ పోస్ట్ టెక్స్ట్ లా ఓన్లీ బొడ్రాయి రాజకీయాల గూర్చి ఇంకా చదివితే బాగుండు అన్న ఫీలింగ్ . అసలు ఇంకో రెండు కథలు తేలిగ్గా పుడతాయి ఇదే ఆలోచన లో . రాయండి సర్. వ్యవస్థ ని క్రిస్టియానిటి లోనో లేదా రిజర్వేషన్ లోనూ ఇంకా తెలిస్తే ఎర్ర జెండా చాయల్లోను గమనించే మా లాంటి చాలా మందికి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    దేశ గురు timely submission towards the whole point is kindaa cunning , just as today’s political scenario, isn’t it .

    నిశీధి !

  • కథ బాగుంది బావ.
    రైట్ బేస్డ్ స్టోరీ.సెంద్రయ్య తమ వృత్తిని కాపాడుకోవడం,అందుకోసం తిరుగుబాటు చేయడం అది ఒక స్పీరిటే. మాదిగల వృత్తి generalize అయ్యాక వాళ్ల బతుకులు ఆగం అయ్యాయి. కానీ సెంద్రయ్య అలా బాపనోళ్ళ వశం కాకుండా చేయడం ఆయన ముందు చుపూకు నిదర్శనం.

    Super. శుభాకాంక్షలు

  • కథాకథనం కథా వస్తువు బాగున్నాయి ….
    బోనాల పండుగను బ్రాహ్మణిజం పెత్తనాన్ని ప్రశ్నించిన బైండ్ల చంద్రయ్య కథ తప్పకుండా అందరూ చదవాల్సిందే…… ఈ కథ నా చిన్నప్పటి బాల్యం నీ కళ్ళకు చూపించింది కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత రెండు గ్రామాల్లో బొడ్రాయి వేస్తుంటే దళితులు చివరగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు వివక్షతతో కూడిన చేయదు నిజాన్ని అనే నిబంధనను కూడా కథలో జోడిస్తే బావుండేది వాస్తవానికి అద్దం పట్టేది

    • దళితులు గ్రామ రాజకీయాలలో యాక్టివ్ రోల్ ప్లే చేసే గ్రామాలలో నువ్వు చెప్పిన దృశ్యం కనిపించదు. దళితులు లేకుండా బొడ్రాయి వేయరాదు. ఆ తంతు మొదలు కాదు, పూర్తి కాదు.

  • గొప్పగా వచ్చిందన్నా కథ!
    భాష సూపర్. కథ ఇంకా అయిపోలేదు కదా.. బొడ్రాయి వేయడం, శక్తి ప్రతిష్ట ఎందుకు రాయలేదు?

  • మనుషుల్నీప్రకృతినీ పట్టించుకున్న సెంద్రయ్య క్వాడ్రిలజీ

    కవి-పండితుడు అనే విభజన ఒకటి సాహిత్య రంగంలో వుంది. కవులు హృదయంతోనూ, పండితులు మెదడుతోనూ రాస్తారనేది ఈ వర్గీకరణకు అర్ధం. అంతమాత్రాన కవులకు మెదడు వుండదనీ, పండితులకు హృదయం వుండదనీ కాదు. వాళ్ళ రచనా వ్యాసాంగంలో ఏది ప్రధానం అనేదే లెఖ్ఖ.

    జిలుకర శ్రీనివాస్ అనగానే ఒక మంచి వ్యాసకర్త గుర్తుకు వస్తాడు. రెండు తెలుగు రాష్రాస్ల్లో అంబేడ్కరిజాన్ని పదిలంగా కాపాడుతున్న నలుగురిలో శ్రీనివాస్ ఒకడు. మిగిలిన ముగ్గురూ ఎవరనే ఆసక్తి ఎవరికైనా కలగడం సహజం. నా దృష్టిలో వున్నది; దుర్గం సుబ్బారావు, గుంటూరు లక్మీగునరసయ్య, పసునూరి రవీందర్.

    లక్మీష్నరసయ్య కవితలు కూడ రాస్తాడు, పసునూరి రవీందర్ కథలు కూడ రాస్తాడు అని తెలుసు. గానీ, జిలుకర శ్రీనివాస్, దుర్గం సుబ్బారావు అచ్చంగా ‘వ్యాసులు’ అనే అభిప్రాయంతో ఇన్నాళ్ళూ వున్నాను. జిలుకర శ్రీనివాస్ రాసిన నాలుగు కథల్ని ఈరోజు చదివాను.

    బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ (సారంగ : 1 నవంబర్ 2020), బైండ్లోళ్ళ కంచె (సారంగ : 1డిసెంబర్ 2020), నర్సయ్య ధ్యానం (సారంగ 1జనవరి 2021), బొడ్రాయి సారంగ (సంచిక: 1 మే 2021).

    ఇది బైండ్ల సెంద్రయ్య నాలుగు కథల సీరిస్ (quadrilogy). ఈ నాలుగు కథల్లో ఆత్మ ఒక్కటే ‘ఆత్మగౌరవం’. ఒకే వస్తువుతో, ఒకే ప్రధాన పాత్రతో నాలుగు కథలు రాయడం ఒక నవల రాసేంత పెద్ద టాస్క్. తెలంగాణ గ్రామాల్లోని మనుషులనేకాక ప్రకృతిని సహితం గమనించడంలో జిలుకర శ్రీనివాస్ కు ఒక ప్రత్యేక కన్ను వున్నదనిపిస్తోంది.

    “గడి ముందున్న యాప సెట్టు అమీను క్రూరత్వాన్ని చూసి వూగిపోతంది. ఆకులు రాలి నేల మీద పడుతున్నయి” వంటి మెటాఫర్లు అనేకం ఈకథల్లో కనిపిస్తాయి.

    ఆయనకు ఇంకో కన్ను కూడ వుంది వ్యసులోవున్న స్రీన్ పాత్రల్ని కూడ గొప్పగ చిత్రిస్తాడు. ‘బైండ్ల సెంద్రయ్య బోనాల పండుగ’ కథలో దామోదర్ రెడ్డి భార్యను, ‘బైండ్లోళ్ళ కంచె’లో ఆరోళ్ల శారదను అలాంటి ప్రత్యేక కన్నుతో వర్ణిస్తాడు.

    నాలుగు కథల్లోనూ సెంద్రయ్య ప్రధాన పాత్ర అయినప్పటికీ, ‘నర్సయ్య ధ్యానం’ కథలో తండ్రి నర్సయ్య అసలు కథానాయకుడు. గొప్ప హృదయమున్న కథ ఇది.

  • బొడ్రా యి పండుగ ఛే యడం లో అన్ని కులాాల వాళ్లు వూరు మంఛిని కోరుకున్నారు,, కా నీ బాపనోడు మాత్రం డబ్బునే చూసిండు,,

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు