మూలం: మర్వాన్ మఖూల్
మర్వాన్ మఖూల్ 1979లో పాలస్తీనాలోని అప్పర్ గెలీలీ ప్రాంతంలోని బోక్వైయా గ్రామంలో పాలస్తీనా తండ్రికీ, లెబనీస్ తల్లికీ పుట్టారు. ప్రస్తుతం మాలోత్ తర్షిహా గ్రామంలో నివసిస్తున్నారు. అల్-ముస్తక్బాల్ కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివి, ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా, డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
మర్వాన్ మఖూల్ మొదటి కవితా పుస్తకం 2007లో అల్-జమాల్ పబ్లిషర్స్ ద్వారా బీరూట్ లోనూ బాగ్దాద్‌లోనూ అచ్చయ్యింది. 2009లో తన మొదటి నాటకానికి ది ఎకర్ థియేటర్ ఫెస్టివల్‌లో ఉత్తమ నాటక రచయిత బహుమతిని గెలుచుకున్నారు. మార్వాన్ కవిత్వం ఇంతవరకు ఇంగ్లీష్, టర్కిష్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్, హిబ్రూ, సెర్బియన్ భాషలలోకి అనువాదమయ్యాయి.
*
నేను అరబ్బును
అని విమానాశ్రయం ముఖద్వారం దగ్గరనుంచే అరిచాను.
నా దగ్గరికి వస్తున్న సైనికురాలి నడక దూరాన్ని తగ్గిస్తూ
ఆమెకు ఎదురు వెళ్లి అన్నాను: నన్ను విచారణ చేయండి! కానీ,
మీరేం అనుకోకపోతే, తొందరగా కానివ్వండి.
విమానం వెళ్లిపోయే వేళ దాటిపోతుందని నా భయం.
ఆమె అడిగింది: నువ్వు ఎక్కడి వాడివి?
నేను జవాబిచ్చాను: గోలాన్ కు చెందిన ఘస్సస్సనియనీ రాజుల శూరత్వానికి వారసుడిని నేను.
జూడా ఆక్రమణ తరువాత మొదటి పుట నుంచి ఇక చరిత్రనంతా ఆక్రమించిన ఒక భూభాగాన్ని
జూడా ఆక్రమించిన ఆ మొదటి రోజున అతడు వెస్ట్ బ్యాంక్ కు తరలిపోతున్న దారిలో
అతడికి కన్నుగీటిన జెరికో వేశ్య రిహాబ్ కు పొరుగింటి వాడిని నేను.
నా జవాబులలో హెబ్రోన్ గ్రానైట్ రాళ్లంత అనుభూతి రాహిత్యం ఉంటుంది:
అణిగిమణిగి ఉన్న ఈ పురాతన భూభాగానికి
నీ కంటే ముందు వచ్చిన మోయబైట్ల కాలంలో పుట్టినవాడిని నేను.
కెన్నాన్ నుంచి మా నాన్న
పాత కాలపు దక్షిణ లెబనాన్ నుంచి మా అమ్మ వచ్చారు,
ఆమె అమ్మ, మా అమ్మను కన్న తల్లి రెండు నెలల క్రితం చనిపోయింది:
తన తల్లి భౌతికకాయానికి చివరి వీడ్కోలు పలకలేక, మా అమ్మ,
రెండు నెలల క్రితం.
ఒక విషాదాంతాన, విధి పర్వతపాదాల నుంచి
మమ్మల్ని చూస్తున్న బుఖయా
ఆ దయనీయ వేదన నుంచి ఆమెను ఓదారుస్తాడనే ఆశతో
నేను ఆమెను గుండెలకు హత్తుకుని దుఃఖించాను:
లెబనాన్, అసాధ్యమైన సోదరి, నేనూ,
ఉత్తరాన మా ఒంటరి అమ్మమ్మా!
ఆమె అడిగింది: నీ ప్రయాణానికి సంచి ఎవరు సర్ది పెట్టారు?
నేను అన్నాను: ఒసామా బిన్ లాడెన్! ఉండుండు, తొందరపడొద్దు,
ఈ మాటను పట్టించుకోవద్దు. బాగోలేదు గాని ఇది ఉట్టి చమత్కారం,
నాలాంటి వాస్తవికవాదులు పోరాటం కోసం వృత్తిరీత్యా వాడే పరిహాసం.
అరవై ఏళ్లుగా శాంతి గురించిన మాటలతోనే పోరాడుతున్నాను.
నీ మాదిరిగా గాజాతో గిల్లి కజ్జా పెట్టుకోడానికి
ఒక సైనిక టాంకు కూడా నా దగ్గర లేదు.
అపాచీ హెలికాప్టర్లనుండి బాంబులేసిన పని అనుభవం నా ఉద్యోగ పత్రాల్లో లేదు.
ఆ పనులు నాకు చేతకావని కాదు.
ఏమంటే, సందర్భశుద్ది లేని అహింసాత్మక విప్లవం, మంచి ప్రవర్తనల
గాలి బుడగలనే నేను ఆకాశంలో చూస్తున్నాను
ఇక్కడికి వచ్చే దారిలో ఎవరైనా నీకు ఏమైనా ఇచ్చారా?: ఆమె అడిగింది
నేను అన్నాను: నయ్రబ్ శరణార్థుల క్యాంపులో కాందిశీకులొకరు
తన జ్ఞాపకాల్ని ఇచ్చారు.
వాటితోపాటు, గాథలుగా మిగిలిన కాలంలోని ఒక ఇంటి తాళంచెవి కూడా ఇచ్చారు.
ఆ తాళంచెవి మీది తుప్పు నాకు ఆదుర్దా కలిగించింది, కానీ నేను
తుప్పుపట్టని ఉక్కులాంటి వాడిని, గడిచిపోయిన కాలంలోకి నా మనసు లాగితే నన్ను నేను సంభాలించుకోగలను.
ఎందుకంటే, కాందిశీకుల మూలుగులు
సరిహద్దుల మీదుగా ఎదురుచూపుల రెక్కలు విప్పుతాయి.
ఒక్క గార్డు కాదు కదా, వేల మంది కూడా దాన్ని ఆపలేరు,
నువ్వైతే అసలే ఆపలేవు.
ఆమె అడిగింది: నీ దగ్గర పదునైన వస్తువులేవైనా ఉన్నాయా?
నేను అన్నాను: నా ఆవేశం,
నా చర్మం, నా ఆలివ్ ఛాయ,
విధివశాత్తు ఇక్కడి అమాయకత్వంలో పుట్టిన నా ఉనికి.
డెబ్బైలలో నేను నిరాశ-ఆశావాదిని,
ఇప్పుడు గిల్బోవా జైలులో నీమీదికి ఉరుకుతున్న అవిధేయతా కేకలు నాకు ఆశ కలిగిస్తున్నాయి.
నేనొక విషాదభరిత చారిత్రక నవలల్లోంచి వచ్చాను,
ఒక కథాంతం నుంచి
గతం యొక్క శవయాత్ర లోంచి, సమీప దూరంలో ఆశా గృహంలో పెండ్లి సందడి లోంచి వచ్చాను.
జోర్డన్ లోయలో ఒక ఎండుద్రాక్ష నన్ను పెంచింది,
నాకు మాటలు నేర్పింది.
ఓ యుక్రైన్ సుపుత్రికా! నాకొక బిడ్డ ఉంది. బిడ్డ బొడ్డు కోయాల్సిన తేదీని కాస్త వాయిదా వేశాను, ఈ రోజు లాగ గడ్డితో కాకుండా, భిన్నంగా పుట్టే ఒక ఉదయానికి వాయిదా వేశాను బిడ్డ జననాన్ని.
మసీదునుంచి వచ్చే నమాజు నన్ను కదిలిస్తుంది, నేను నాస్తికుడినైనా సరే.
వేణువుల శోకగ్రస్త రోదనలు వినపడకుండా చేయడానికే
పిస్తోళ్లను వయొలిన్ల అమర రాగాలుగా మార్చడానికి నేను గట్టిగా అరుస్తున్నాను.
ఆ సైనికురాలు నా వస్తువులను సోదా చెయ్యడానికి
పక్కకి తీసుకెళ్లి సంచీని తెరవమని ఆదేశించింది.
ఆమె చెప్పింది చేశాను!
ఆ సంచీ లోతుల్లోంచి నా గుండె, నా పాట ఉబికి వచ్చాయి,
వాటి అర్థాలన్నీ ధాటిగా మోటుగా బయటకు పొర్లాయి,
వాటిలోనే నా అస్తిత్వమంతా ఉంది.
ఆమె నన్ను అడిగింది: సరే, ఇదేమిటి?
నేను అన్నాను: అది నా నరాల నిచ్చెనలపై ఎగబాకుతున్న సురా అల్-ఇస్రా, తఫ్సిర్ అల్-జలలైన్,
అబు తయ్యెబ్ అల్-ముతన్నబి కవిత్వం, ఒకేసారి ఫొటోగానూ నిజంగానూ ఉన్న నా సోదరి మరాం,
బంధువుల వణికించే నిరాశ్రయత్వం నుంచి నన్ను కప్పి రక్షించే సిల్కు శాలువా,
నా తల తిరిగేలా చేసి చివరికి నా సందేహలన్నీ స్తంభించిపోయేలా చేసిన అరబ్బా బడ్డీకొట్టులోని పొగాకు.
నాలోపలి ఒక దృఢ నిబద్ధత, అది నా దేశపు అడవి వాము,
దానిమ్మ పువ్వుల ఉగ్రత, గలిలీకి చెందినదీ, కాంతివంతమైనదీ.
నా లోపలి గోమేధం, కర్పూరం, ధూపం, ఇంకా, బతికి ఉన్న నా అస్తిత్వం,
హైఫా అనే ముత్యం: ప్రకాశవంతమైనదీ, శాశ్వతమైనదీ, వెలుగులుచిమ్మేదీ.
ఒకే ఒక్క కారణం వల్ల జరగబోయే మా పునరాగమనపు జేబుల్లో సేద తీరుతున్నది: మేము సదాశయాల్ని పూజించాం. మా దురాక్రమిత స్థితిని నా లోని ఒక గతం ముక్కలో కట్టి నాలో నేను దాచుకున్నాను
సైనికురాలు నన్ను ఒక పోలీసుకు అప్పగించింది.
అతడు నా శరీరాన్నంతా తడిమి చూసి ఆశ్చర్యంగా అరిచాడు:
ఏమిటిది?
అది నా దేశపు మగతనం, అన్నాను నేను
నా సంతతి, నా కుటుంబపు మడత, ఫలించబోతున్న రెండు పావురం గుడ్లు, ఒక మగ ఒక ఆడ, నా నుంచీ, నాకోసం.
ప్రమాదకర వస్తువులేమైనా ఉన్నాయా అని అతను నన్ను సోదా చేసాడు.
ఈ అపరిచితుడు గుడ్డోడు
అన్నిటికన్న వినాశకరమై, ముఖ్యమైన బాంబులు నాలో ఉన్నాయని మరచిపోయాడు: నా చైతన్యం, నా ధిక్కారం,
నా ఊపిరిలో, నా దేహంలో దూసుకుపోయే డేగ, నా పుట్టుమచ్చ, నా ధీరత్వం. అదే నేను,
ఈ మూర్ఖుడు ఎన్నటికీ చూడజాలని నా సంపూర్ణత, సర్వత్వం
రెండుగంటల ఈ మానసిక పెనుగులాట తరువాత
ఓ ఐదు నిమిషాల పాటు నా గాయాలను తడిమి చూసుకుని
ఎగిరబోయే విమనమెక్కి కూర్చున్నాను. వెళ్లిపోవడానికో తిరిగి రాకుండా ఉండడానికో కాదు.
నా దిగువన ఉన్న సైనికురాలిని చూడడానికి
నా కింద ఉన్న చెప్పుల జాతీయ గీతంలో ఉన్న పోలీసువాడిని చూడడానికి
ఇంకా,
ఎప్పట్లాగే, ఎప్పట్లాగే,
ఎప్పట్లాగే నాకింద ఉండే బెన్ గురియన్ లాంటి అతి పెద్ద చారిత్రిక అబద్ధాన్ని చూడడానికి.
*
Poem is a powerful indictment of and declaration of genuine anger against the Israel rulers and their backers. Translation of a poem like this, laden with so strong connotations in the original language and deeply rooted in its culture must have been a challenge to the translator. Poem reads very well in Telugu.
We salute to the resolute resistance from Palestinian poets, artists and people in the face cruelties. Every real democrat including the Israeli dissenters in the streets Tel Aviv and New York and elsewhere around the world stand by you, dear Palatine comrades.