బెజ్జారపు రవీందర్ ‘నిత్యగాయాల నది’

ప్రతి యేటా కొన్ని వేల కథలు వస్తుంటాయి. కాని కాలానికి ఎదురు నిలిచే కథలు కొన్నే ఉంటాయి.

ఎన్నుకున్న వస్తువుకు ఒకింత నెత్తురు లాంటి శిల్పాన్నద్ది పాఠకుడి మదిలో ఆ కథ చిరకాలం నిలిచిపోయేలా కథను తీర్చి దిద్దే అతి తక్కువ మంది తెలంగాణ కథకుల్లో మొదటి శ్రేణి కథకులు బెజ్జారపు రవీందర్. ఇప్పటి దాకా ఆయన రాసిన పదకొండు కథల్ని 2013లోనే ‘నిత్యగాయాల నది’ పేర సంపుటిగా తీసుకొచ్చారు. అంతకు ముందే ఆంధ్ర భూమి మాస పత్రికలో 2004లో ‘వేయి రాగాల వేణువు’ నవల ప్రచురితమైంది. 2017లో ‘తాటక’ నవల వెలువరించారు. కథ మొత్తం చదివేసిన తరువాత శరీరం నుండి కనిపించని ఆవిర్లేవో బయటకు రావాలని, దేహం సాంతం ప్రకంపనలకు గురి కావాలని అట్లా రాసే ప్రతి అక్షరానికి ఒక విద్యుత్తును తొడిగి మరీ వాడే రచయిత బెజ్జారపు రవీందర్. అందుకు సాక్ష్యమే ‘నిత్య గాయాల నది’ కథ. ఈ కథ మొదటి సారి 2002లో ఆదివారం వార్త పత్రికలో ప్రచురింపబడింది.

కథకుడు (రవి) ప్రతి రోజూ సాయంత్రం పెద్దపల్లి రైల్వే స్టేషన్ లోని సిమెంట్ బెంచీ పైన రిలాక్స్ అవుతుంటాడు. అక్కడికి ప్రతి రోజు ఒక స్త్రీ వచ్చి రచయితలాగే ఒంటరిగా, దూరంగా కూర్చుంటుంది. ఆమె ఎవరోననే కుతూహలం రచయితలో పెరుగుతూంటుంది. ఆమె ఒకసారి వృద్ధురాలిగా, మరో సారి యౌవనంలో ఉన్న స్త్రీలా కనిపిస్తుంది. కుతూహలం ఆపుకోలేక ఓ రోజు ఆమె దగ్గరికి వెళ్ళి “మీరెవరో తెలుసుకోవచ్చా?” అంటాడు వినయంగా. ఆమె గంభీరంగా ఒక నవ్వు నవ్వి “పది తలల మనిషిన్నేను. రావణున్ని కాదు. రావణుడు నా ముఖాల్లో ఒక ముఖం. అడవులకు నెత్తురు పులిమిన సమ్మక్క సారలమ్మను, చారెడు భూమి కోసం పోరు సలిపి గెల్చిన చాకలి ఆయిలమ్మను. సాంస్కృతిక శిలాజాల్లోంచి దేవుళ్ళను వడగట్టిన కోశాంభిని. అలాగని ఎథీయిస్ట్ ను కాను. వేదాల్ని ఆరాదించే దాశరథి రంగాచార్యను. జోడేఘాట్ లో నిద్రిస్తున్న కొమురం భీమును. తెగిన అవయవాల్ని తిరిగి అతికించుకున్న శంబూకుణ్ణి. పెదబొంకూరులో బయటపడిన కుండ పెంకుని. మరీ నన్ను రాతి యుగం మనిషిననుకునేవు. నేను చిప్స్ స్పందనల కంప్యూటర్ని.. హైటెక్ సిటీని.. అయితే మిత్రమా నా ఆధార ముఖం మాత్రం నాకే తెలియదు. అది వట్టి బ్లాంక్ ముఖం. అలాగని ప్రతి దృశ్యాన్ని ప్రతిబింబించే ప్లేయిన్ అద్దం కాదు. అది వట్టి బ్లాంక్ అంతే.” అంది ఆమె ఆయాస పడుతూ.

ఎంత ప్రశ్నించినా ఆమె ఎవరో తెలుసుకోలేక పోతాడు కథకుడు. చాలా సార్లు ఏదో పుస్తకం చదువుతూ కనిపించేది. “ఎవరీమే? నా కన్నా చిన్నదా, పెద్దదా… నా స్నేహితురాలా, బంధువా? ప్రేయసా? తల్లా?” ఇవేవీ కాదనుకుంటాడు. బహుశా అన్నీ కలిపితే ఈమేనేమో! అనుకుంటాడు. ఓ రోజు దాస్ కాపిటల్, పోతన భాగవతం రెండు పుస్తకాలు ఒకేసారి చదువుతూ కనిపిస్తుంది. ఆశ్చర్యపడుతున్న రచయితను చూసి “ఇవి కావాలా నీకు? చదువుతావా?” అని ‘దాస్ కాపిటల్’ ను చేతిలో పెట్టి వెళ్తుంది… దాస్ కాపిటల్ ను చదవడం ప్రారంభించగానే “అందులోని పదాలు, వాక్యాలు అర్థమౌతున్నకొద్దీ అక్షరాలు నేలజారడం ప్రారంభమయ్యాయి. కొద్ది సేపటి తరువాత అవి మనుషులుగా మొలకెత్తడం గమనిస్తాడు. క్రమంగా ఎదిగి.. ఎదిగిన మనుషులు సమూహాలు, సమూహాలుగా గది తలుపులు తెరుచుకొని జనంలో కలవడం మొదలు పెట్టారు.” భయం వేసి పుస్తకం చదవడం ఆపేస్తాడు.  తరువాత పుస్తకాన్ని వాపస్ ఇద్దామని ఆమె కోసం గాలిస్తాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించదు. చివరికి ఒక రోజు కనిపిస్తే పుస్తకం ఇచ్చేస్తాడు. కాని ఆమె ఎవరో ఎంతకూ అర్థం కాదు. మరో రోజు ఎవరో పల్లెటూరి నుంచి వచ్చిన ముసలాయన రైల్వే ప్లాట్ ఫాం మీద కనిపించి “చూడు బాపూ… ఇక్కడో తల్లి ఉండాలే…” అంటూ గొణిగాడు. “మీరెవరి గురించి అడుగుతున్నారు?” అంటూ తిరిగి ప్రశ్నిస్తాడు రచయిత. “నీకు తెలిసినామె గురించే అడుగుతున్నా. తంగేడు పూల చెట్టు లెక్క నిండుగ ఉంటది. తాటి చెట్టు తీరుగ నిటారుగ ఉంటది. గునకపూల లెక్క నవ్వుతది.. అదో.. గా తల్లే ఇయ్యాల కనపడ్డదా?” అని అడుగుతాడు ఆ పల్లెటూరి మనిషి. లేదు. ఇంతకీ ఆమె మీకు ఏమౌతుంది?” అంటాడు రచయిత.

“మట్టికి, మనిషికి ఉండాల్సిన సంబంధమే ఆమెకు, మనకు నడిమిట్ల ఉన్నది.” అంటాడతను. ఏంటో “అంతా కలిసి నన్ను గొప్ప సందిగ్ధంలోకి నెట్టేస్తున్నారు.” అంటూ విసుక్కుంటాడు రచయిత. ఆమెకు ఏమైనా చెప్పాలంటే నాకు చెప్పండి. ఆమె కనిపించినప్పుడు నేను చెప్తానంటాడు రచయిత. ఆ ముసలాడు గొంతు సవరించుకొని ఈ నేల మీద ఇప్పటికీ ఎన్నో పోరాటాలు చేశాం. మనకు అన్యాయం చేసిన ఎంతో మందిని ఇక్కడి నుంచి వెళ్లగొట్టినం. “దోచుకునేటోళ్లను ఎల్లగొట్టుడే సిద్ధాంతం. అంతకు మించి తెల్వదు నాకు. కానీ, గిప్పుడు గూడ దోపిడి జరుగుతాంది. అయితే దోపిడి చేసేటోడెవ్వడో కనిపిస్తలేదు లక్ష్మణుడు, ఇంద్రజిత్తు యుద్ధంల జేసిన మాయల మంత్రాల యుద్ధం లెక్క ఉన్నది. దోపిడి ఉంది. అది చేసేటోడెవ్వడో కంటికి కనిపించదు. ఊరోళ్లందరి ఉమ్మడి శత్రువు దొర ఉండే. ఆళ్ళను ఎల్లగొడితే దీపావళి జరుపుకున్నరు జనం. ఇప్పుడు కూడా శత్రు స్పర్శ తెలుస్తూనే ఉన్నది. కానీ ఎటు వైపు కత్తి విసరాల్నో తెలుస్తలేదు. పోలీసోళ్ల మీదికి బందూకులెత్తుతున్నాం కాని జనం పండుగలు జేసుకుంటలేరు. ఎందుకంటే దొరల జాగల పోలీసోళ్ళు పనికి రారు. అందుకే ఆ తల్లిని అడుగుదామని వచ్చిన. కంటికి కనిపించని దుష్మన్ తోని ఎట్లా కొట్లాడేది?అది సమజైతలేదు నాకు.” అన్నాడా వృద్ధుడు ఆవేదనతో.

రచయితకు ఆ వృద్ధుడి సమస్య అర్థ అయింది. ఒకప్పుడు శత్రువు ఎవరో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు ప్రపంచీకరణ విస్తరించి శత్రువు ఎవరో తెలియకుండానే దోపిడీ కొనసాగుతుంది. దోపిడీ తీరు మారినప్పుడు పోరాట పంథా కూడా మారాలి. అనుకుంటాడు రచయిత. ఇంకో రోజు “మనం ఎవరికి టార్గెట్ అవుతున్నామో తెలియని విచిత్ర యుద్ధభూమిలో ఉన్నాం” అనుకుంటూ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే అకస్మాత్తుగా ఒళ్ళంతా గాయాలతో, రక్తమోడుతున్న దేహంతో ఆమె ప్రత్యక్షమౌతుంది. రచయిత పరుగెత్తి ఆమె రక్తాన్ని తుడువబోతాడు. “వద్దు… వద్దు… నేనో రక్త నదిని. ఈ ప్రవాహం ఆగదు” అంటుంది నిర్వేదంగా. ఈ గాయాలన్నీ ఎలా అయ్యాయి అని ప్రశ్నిస్తాడు రచయిత. “ఇవాళ ఓ ఇద్దరు హైస్కూల్ పిల్లలు కనిపిస్తే వాళ్ళని అడిగిన నా బిడ్డ కొమురం భీము మీకు తెలుసా? అని కాని వాళ్ళు తెలియదన్నరు….. నువ్వే చెప్పు రా తండ్రీ…! అల్లూరి సీతారామరాజు గొప్పవాడే. కాని నా బిడ్డ కొమురం భీముకు ఏం తక్కువ? సీతారామరాజు పేరు తెలిసిన పిల్లగాండ్లకు కొమురం భీము గురించి తెలువకుండా చేసిన వాళ్ళెవరు? మన్నెం వీరునితో నా జోడేఘాట్ పోరడు సాటిరాడా? కొమురం భీము గురించే తెలువనోళ్లకు నా మిగతా పిల్లలు దొడ్డి కొమురయ్య, బందగీ, రాంజీ గోండు, మఖ్దూం, రావి నారాయణరెడ్డి… ఇంకా వందలాది మంది పేర్లు ఎలా తెలుస్తయ్? అవున్లే బాపూ, నా ట్యాంక్ బండ్ గుండెలపైన నా పోరగాండ్ల ఆనవాలు కానరానప్పుడు మీ తరానికి వాళ్ళ గురించి ఏం తెలుస్తుందిలే?…. ఇంకా దొరలు తెలుసా? దేశముఖ్ లు తెలుసా? రజాకార్లు తెలుసా? నిజాం సర్కారు తెలుసా?” అని ఆ హైస్కూల్ పిల్లలను అడుగుతుంది. కాని “ఏ ఒక్కని కండ్లల్ల వాళ్ళ వివరం తెలిసిన జాడల్లేవు. ఈ చదువులు గిట్లెందుకు తగలబడ్డయి బిడ్డా? వాని మట్టి గురించి వానికి తెలియక పోతే ఎట్లా?” అంటూ ఆవేదన చెందుతుంది. ఇదంతా విన్న రచయితకు ఆమె ఎవరో మెల్ల మెల్లగా అర్థమవడం మొదలవుతుంది. “ఇంకా ఏమో పోల్చుకోవాలని చూస్తావు. నేనురా.. తీగెలు తెగిన నీ కోటి రతనాల వీణను. కరువులో వచ్చిన బతుకమ్మ పండుగను… ప్రసవంలోనే బిడ్డల్ని పోగొట్టుకున్న పచ్చి బాలింత రొమ్మును…” అని గర్జిస్తుంది ఆమె.

శతాబ్దాల తెలంగాణ చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్రను పుక్కిట పట్టిన కథ ఇది. తెలంగాణ నెత్తుటి గాయాలను తవ్వి చూపిన కథ కూడా. ఏ వారసత్వం నుండి వచ్చాం మనం? ఏ క్రూరమైన పాలన కింద నలిగిపోయాం? దశాబ్దాల పరాయి పాలనలో ఎంత సాంస్కృతిక విధ్వంసం జరిగింది? తెలంగాణ నిజమైన పోరాట, సాంస్కృతిక వారసత్వం తెలియకుండానే తరాలకు తరాలు ఎలా పెరిగి పెద్దయ్యారు? ఇత్యాది అనేక ప్రశ్నలకు సమాధానం ఈ కథ. “సాయంకాలమైంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆకాశపు కాషాయ వస్త్రం మాసిపోతోంది. నింగి బ్లాటింగ్ పేపర్ పైన జరజరా పాకుతూ వస్తున్న నల్లటి సిరలా ఉంది చీకటి.” అని మొదలవుతుందీ కథ. ఈ ప్రారంభ వాక్యాలు తెలంగాణ పరిస్థితిని చెప్పకనే చెప్తున్నాయి. దశాబ్దాల పాటు ఈ నేల ఎంత చీకట్లో మగ్గి పోయిందో కథకుడు చాలా బలంగా చెప్తాడు. తెలంగాణ ధైన్య స్థితిని చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది. కథా ప్రారంభంలోనే పరిచయమైన స్త్రీ ఎవరో తెలుసుకోవడంతో మొదలైన కథ ముందుకు పోతుంటే తెలంగాణ సామాజిక చరిత్రానంతా మన రక్తంలోకి ఒంపుతాడు కథకుడు. ఒకప్పుడు శత్రువు కండ్ల ముందే ఉండేవాడు ఉద్యమకారులు వాడ్ని తరిమి కొట్టే వారు. కాని ఇప్పుడు శత్రువు గాలిలా మన చుట్టూనే ఉంటాడు. కాని కనబడడు. వాని మూలాలు ఎక్కడో ఉంటాయి. వాడి మీద యుద్ధం ఎలా చేయాలో కూడా అర్థం కాదు. అలాగని యుద్ధం చేయకుండా ఊర్కోనూలేము. ఎందుకంటే “కరుణ గల వాడే కృపాణం ధరించగలడు.” అని కె. శివారెడ్డి కవితనొకదాన్ని ఉదాహరిస్తాడు కథకుడు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక పాఠ్యపుస్తకాలు మారిన తరువాత తెలంగాణ చరిత్ర కొంత ఇప్పటి పిల్లలకు తెలుస్తుందేమో కాని గత ఆరు దశాబ్దాలుగా విద్యార్థులకు నిజమైన తెలంగాణ చరిత్ర తెలియకుండానే పాఠశాల విద్య పూర్తయింది. తమ తండ్రులు, తాతలు ఎంతటి హింసను, పీడనను, వెట్టిచాకిరిని భరించి నిలబడ్డారనే విషయం ఇప్పటి తరం పిల్లలకు తెలియకుండా చేసిన కుట్రదారులు ఎవరు? ఎక్కడో పుట్టి, ఎక్కడి సమాజంలోనో కృషి చేసిన వారినే ఎందుకు చదవాల్సి వచ్చింది? ఇక్కడి నేలకు ప్రత్యేక గుర్తింపు, ఔన్నత్యం లేవా? ఇలా అనేక ప్రశ్నల్ని, సమాధానాల్ని, కుట్రలను, కుతంత్రాలను, ఆధిపత్య వైఖరిని ప్రదర్శించిన పాలకుల నైచ్యాన్ని… ఎన్నిటినో కడుపులో దాచుకున్న మర్రి విత్తనం ఈ కథ. శిల్ప పరంగా కూడా చాలా గొప్ప కథ. ప్రతి వాక్యం తెలంగాణ గుండె చప్పుడుకు అనునాదంగా కనిపిస్తుంది. దశాబ్దాల సామాజిక చరిత్రను వడగట్టి తీసిన ఒక గాఢత గల కథా శకలం ఈ కథ. కథ చదువుతున్నంత సేపు తెలంగాణ మట్టి పొరల్లోకి, తెలంగాణ రక్తపుటేరుల్లోకి, తెలంగాణ ఆత్మ గౌరవ ఆకాశంలోకి ఇంకిపోతాం.

విచిత్రం ఏంటంటే ఇప్పటికీ తెలంగాణ ‘నిత్య గాయాల నది’లానే కొనసాగుతోంది. పసి మొగ్గలపై అత్యాచారాలు, కుల హత్యలు, మత హత్యలు, పరువు హత్యలు, గుట్టుగా సాగుతున్న మనుషుల విక్రయం, రోజు కొన్ని పదుల సంఖ్యలో నమోదవుతున్న వ్యక్తుల అదృశ్యాలు, అక్షరాన్ని జైల్లో బంధించడం, వాక్ స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్న కవులు, రచయితలు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు, అంగడి సరుకుగా మారిన ప్రజాస్వామ్యం… ఇలా నిత్యం ఎన్నో సమస్యలు సగటు తెలంగాణీయుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఒక రక్తపు నదిలో ముంచి తీస్తున్నాయి. ఈ కథ వచ్చి ఇప్పటికి 17 ఏళ్ళు అవుతుంది అయినా ఈ కథ యొక్క ప్రాసంగికత తగ్గకపోవడం గమనార్హం. ప్రతి యేటా కొన్ని వేల కథలు వస్తుంటాయి. కాని కాలానికి ఎదురు నిలిచే కథలు కొన్నే ఉంటాయి. అందులో ఈ కథ ఎప్పటికీ నిలబడే కథ. తెలంగాణ కథా ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలాకు కూడా చూపే కథ.

*

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Probably first story that depicted the the second stage of Telangana Identity movement…good analysis Sridhar..

      • గాయాలనది అనడంలోనే తెలంగాణ యొక్క పరిస్థితి ఎలా ఉందో తేటతెల్లమవుతుంది..
        మంచి కథ..మంచి విశ్లేషణ సర్.

  • అద్భుతమైన కథకు అత్యద్భుతమైన విశ్లేషణ …
    చక్కని ఉపమానాలతో బహు చక్కని ఆద్యంతాలతో అందంగా అమర్చిన తెలంగాణ కథకు సమర్ధవంతమైన విశ్లేషణ ఇది. కథారచయిత, విశ్లేషకులిరువురికీ నమస్సులతో అభినందనలు ….

  • శ్రీధర్ గారూ ,
    బాగా పరిచయం చేశారండి .
    తెలంగాణ నాడి తెలిసిన అతి కొద్దిమంది కథకుల్లో రవిందర్ ఒకరు . అందుకే తెలంగాణ వ్యధను, పరాయి నీడలోని బానిస బతుకును ఆమూలాగ్రం పట్టుకోగలిగారు .
    అదే స్థాయిలో మీ విశ్లేషణ ఉంది .
    అభినందనలు .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు