నెత్తి మీద ఏదో ఎగిరినట్టు అనిపించింది. తలెత్తి చూస్తే అది కాకి. సెంద్రెయ్య కళ్లలోకి చూస్తూ కాకి అరుస్తూ తన మీదే ఎగురుతంది.
కాకి అరుస్తుందంటే సుట్టాలు వొస్తున్నరని ఎవలికైనా అర్థమైతది.
కానీ బెజవాడలో తనకు తెలిసి సుట్టాలెవలూ లేరు. కాకి అరుస్తుంది. ఆ అరుపులో ఏదో కష్టం వుంది. ఎవరికొచ్చి వుంటుంది? అని ఆలోచిస్తూ గబగబా నడుస్తున్నాడు రోడ్డు మీద. ఒక్కసారిగా మల్లంపల్లి యాదికొచ్చింది. యింటికాడ అంతా పైలంగా వున్నారో లేదో అనే ఆలోచన రాగానే తన కాళ్లలో బలం ఏదో జలగ పీల్చేసినట్టు నీరసపడ్డడు.
దూరంగా మసక చీకట్లో యిద్దరు కలెబడుతుండ్లు.
ఒకడు తన ఎదురుగా వున్న రిక్షాను ఎత్తిపడేసిండు. అది పానం లేని మనిషిలెక్క బొక్కాబోర్ల పడ్డది.
‘‘గుద్దల దమ్ముంటే నాతో కలెబడురా లంజొడుకా’’ అని పెద్దగా అరుస్తా ఎదుటోడి మీదికి ఉరికిండు రిక్షానడిపేటాయన.
ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అన్పించింది సెంద్రెయ్యకు. అది తనకు బాగా ఎరుకున్న గొంతు. ఆ కొట్లాట జరుగుతున్న వైపుకు దబదబా వురికిండు సెంద్రెయ్య. తను చేరుకొనే లోపే ఐదారుగురు గుమిగూడిరడ్లు. కానీ, వాళ్ల కొట్లాటను ఎవలూ ఆపుతలేరు.
సెంద్రెయ్య ఆడికి చేరుకోంగనే ఆ రిక్షావోడికి ఎక్కడలేని ధైర్యం వొచ్చింది. ‘‘యిప్పుడు రారా చూసుకుందాం. నీ మొగడొచ్చిండురా చూడు. ఓ సెంద్రన్న, ఈ లంజొడుకు నన్ను కొడుతండే’’ అని వాని మీదికి వురికిండు. తను ఏర్పుల రామసెంద్రు. ఏర్పులోళ్లు, గంగారపోళ్లు, జిలుకరోళ్లు అన్నాదమ్ముల వొరుస. రామసెంద్రాన్ని సూడంగనే ఎక్కడలేని సంబురమైంది తనకు. కాకి నెత్తి మీద ఎందుకు అరుత్తా ఎగిరిందో అప్పుడు ఎర్కయింది తనకు. ‘‘ఆగుతమ్మీ, ఆగు’’ అని రామసెంద్రాన్ని ఆపిండు. అసలేమైందని అడిగిండు.
రామసెంద్రు బెజవాడకొచ్చి రిక్షా తొక్కుతా బతుకుతండు. వొచ్చి మూణ్ణెళ్లు అయ్యింది. అయితే, ఇంతకు ముందట్నే, బెంజి సర్కిల్లో రిక్షా ఎక్కిండు ఒకడు. వాడు రౌడీ అనే సంగతి రామసెంద్రానికి ఎరుకలే. దుర్గమ్మ గుడికి వాణ్ణి రిక్షాలో తొక్కుకుంటా తీసుకొచ్చిండు. ఆ రౌడీకి రిక్షా ఎక్కడమే తెలుసు. డబ్బులిచ్చుడు ఎర్కలే. డబ్బులడిగితే యిష్టమొచ్చినట్టు కొడుతడు. వానిలాంటోళ్లు బెజవాడలో చానా మంది వున్నరు. రౌడీయిజానికి బెజవాడ అడ్డాగా మారిపోయింది అప్పటికే. రామసెంద్రానికి యివ్వేమీ తెల్వదు. రిక్షా దిగి బోరయిరుసుకొని పోతన్న ఆ రౌడీని డబ్బులియ్యమని అడిగిండు. నన్నే డబ్బులడుగుతావారా అని రామసెంద్రం చెంపమీద గట్టిగా కొట్టిండు వాడు. రోషం గల్లోడాయే. ఎందుకూరుకుంటడు. తిరిగి కొట్టిండు. అగో అట్లా యిద్దరూ ఒకలిమీద ఒకలు కలెబడుతనే వున్నరు. ఆ రౌడీగాడికి కొట్లాట ఒడుపులు చానా తెలుసు. అందుకే వాని మీద నెగ్గలేక పోతున్నడు రామసెంద్రు.
‘‘నన్ను డబ్బులడుగుతావారా నువ్వు. నాతో పెట్టుకొని నువ్వెట్ట ఈ బెజవాడలో రిక్షా తిప్పుతావో నేనూ సూత్తా’’ అని రామసెంద్రు రెక్కపట్టి యిరుస్తండు. నొప్పితో రామసెంద్రు మెలిగి తిరుగుతండు. తప్పుడు పనులు సేత్తేనే సయించని సెంద్రెయ్య, యిగ తన తమ్మునిలాంటి రామసెంద్రు మీద ఎవడో సెయ్యేత్తే ఊకుంటడా? ఆ రౌడీగాడి తల మీద ఎవరో సుత్తెతో కొట్టినట్టయింది. వాడు ఎన్కకు తిరిగి సూసిండు. ఎదురుగా సెంద్రెయ్య. కొట్టింది సుత్తెతోకాదు. బువ్వ సేత్తో. ఆ దెబ్బకు పుచ్చె పగిలినంత పనైంది వాడికి. పుర్రసేత్తో యింకో దెబ్బ వాడి సెవు మీద కొట్టిండు. ఆ దెబ్బకు వాడు దభీమని కింద పడ్డడు. మరో అయిదు నిమిషాల దాకా వాడికి అక్కడేం జరిగిందో అర్థం కాలే. వాడి సెవులోంచి, ముక్కులోంచి రక్తం కారుతంది. రోజు వొంద కిలోల బత్తాలను అల్కగా లేపి ఇసిరేసే సెంద్రెయ్యకు వాడొక లెక్కనా? ఆ రౌడీగాని ఎత్తి రిక్షాలోకి యిసిరేసిండు సెంద్రెయ్య.
‘‘తమ్మీ వీణ్ణి బ్యారేజీ మీంచి నదిలో యిసిరేద్దాం. ఏ ముసలో పీక్కతింటది పా’’ అని రిక్షాను ముందుకు లాగిండు. ఆ మాటలు లీలగా ఆ రౌడీకి ఇనపడ్డయి. వాడు ఒంట్లో లేని సత్తువనంతా ఉగ్గపట్టుకొని రిక్షా దున్కి ఒకటే ఉరుకుడు. వాని ఉర్కుడు చూసి యిద్దరూ నవ్వుకున్నరు. అదుకున్నడు లంజాకొడుకు అన్నడు రాంసెంద్రు.
చానా రోజులకు సెంద్రెయ్యను చూసిన రామసెంద్రు కౌగలించుకొని బోరుమన్నడు. సెంద్రెయ్య బెజవాడొచ్చి యాడాది అయితంది. మల్లంపల్లి గురించి యాదికొచ్చినా, తమాయించుకొని నిబ్బరంగా వుండేటోడు. కానీ రామసెంద్రు కనిపించే సరికి తనకు సంతోషంతో దు:ఖమాగుతలేదు. యిద్దరు తమ గుండెల్లోని బరువును కాస్తా దించుకున్నంక తమ్మీ యిగ పా. మందు తాగుతవా. మాంసం తింటవా నీ యిష్టం అన్నడు సెంద్రెయ్య. నువ్వేది పెడితే అది దింటనే. నువ్వు కనపడుడే నాకు పెద్ద పండుగ అన్నడు రామసెంద్రు.
రిక్షాను ఓ దుకాణం కాడ అపిండ్లు. షేరు మాంచి సారా తీస్కున్నడు సెంద్రెయ్య. ఆ పక్కనే వున్న ఒక హోటల్లో పెనం మీద ఏంపిన చాపముక్కలు, కోడి తున్కలు తీసుకున్నడు. రిక్షా ఎక్కి సెంద్రెయ్య వుండే చిట్టీనగర్‌కు బయల్దేరిండ్లు. బాటలో ఒక కిలో గొడ్డు కూర కూడా తీసుకున్నడు. ఒక సందులో సెంద్రెయ్య అద్దెకు వుంటున్న రెండు గదుల యిల్లుంది. కాళ్లు కడుక్కో తమ్మీ అని రామసెంద్రుకు నీళ్లు యివ్వబోయిండు సెంద్రెయ్య. ‘‘ఓన్నా, నువ్వాగు. నువ్వు పెద్దోనివే. నాకు నీళ్లు యిచ్చుడేంది. పాపం తగుల్ది. నేను తీస్కుంటలేవే నీ దండం పెడ్తా’’ చేతిలోంచి చెంబు గుంజుకున్నడు రామసెంద్రు. పెద్దోళ్లకు ఇజ్జతి యిచ్చే తరీఖా అది. కాళ్లు సేతులు కడుక్కొని చాపమీద కూసున్నడు. అరగంటలో కమ్మటి వంట తయారు చేసిండు సెంద్రెయ్య.
ఉడుకుడుకు కూర, ఘాటు వాసనేస్తున్న సారా, కమ్మగా ముక్కులను రెచ్చగొడుతున్న యేపుడు తున్కలు ముందట పెట్టుకొని కూసున్నరు యిద్దరు.
సారా ఒక బుక్క తాగిండ్లు. చాప ముక్కను నోట్లో ఏసుకొని నమిలిండు సెంద్రెయ్య. ఎద్దు కూరను నాలుక మీద ఏసుకొని మంచిగొండినవే. కూర కమ్మగుంది అన్నడు రామసెంద్రు.
కొద్ది సేపయినంక నెమ్మదిగా అడిగిండు సెంద్రెయ్య. ‘‘యేమైందిరా తమ్మీ. నువ్వూరుడిసి వొచ్చుడేందిరా? వూల్లే అంతా మంచిగనే వున్నరా? మా యెంకటయ్య, సోమయ్య యెట్లున్నరు? మా యింటికేలి పోయినవా యెప్పుడన్నా?’’ అన్నడు దిగులు మొహంతో.
మరో బుక్క సారా తాగిండు రామసెంద్రు. కంటనీళ్లు తుడుసుకుంటా చెప్తండు. ‘‘యేం బాగుంటరే? నువ్వూ నీ మాటలు నీ సేతలు. యెవ్వల్కీ అర్థం కావు. నువ్వు సచ్చినవో బతికే వున్నవో తెల్వక ఎంకటన్న యెంత బాధపడుతండో నీకేమెరుక. నీ కోసం ఎతుకతా అన్ని దిక్కులకూ ఉరుకుతనే వున్నడు. సోమన్న నిన్ను తలుసుకొని నా ముందే ఎన్నిసార్లు ఏడ్చిండో నీకేం ఎర్క. యింట్ల ఆడోళ్లంతా మా బావ మల్లోత్తడని ఎదురు సూడబట్టే. ఏది యేమైనా నువ్విట్లా సెప్పకుండా వొచ్చుడు మంచిగలే’’ అన్నడు.
ఆ మాటలకు బాధపడ్డడు సెంద్రెయ్య. తన కోసం తమ్ముడు ఎంకటయ్య ఎతుకతండనే మాట గుండెను పిండేసింది. అందరికంటే తనకు ఎంకటయ్య అంటేనే యిష్టం. తనను జైలులోంచి యిడిపించడానికి ఎంకటయ్య పడ్డ తిప్పలు యాదికొచ్చి మరింత గుబులయ్యింది. యింకో బుక్క సారాను గటుక్కున మింగి, పొంగుకొచ్చే దుఖ్ఖాన్ని ఆపేసిండు సెంద్రెయ్య.
‘‘నాకేమన్న మంచిగనిపిత్తందారా? నన్నేదో మాయ వూళ్లోంచి బయిటికి యిసిరేసింది. అది తొలిగిపోయిన నాడే నేను మల్లా వూళ్లెకు అడుగుపెట్టాలే. సరేగానీ, యింకా ఎట్లున్నరు వూళ్లే?’’ అన్నడు సెంద్రెయ్య.
వీపును గోడకు పొందించిండు రామసెంద్రు. తలొంచుకొని యేదో యాది సేసుకున్నడు. నేలను చూస్తూనే నోరిప్పిండు. ‘‘వూరేం బాలేదే. అంతా సెడిపోయింది. ఎవలికీ పని లేదు. ఎవలికీ తినే తిండిలేదు. పొట్ట సేతపట్టుకొని తలా వో దిక్కుకు పోతండ్లు. అంతా దిక్కులేని పచ్చులయ్యిండ్లు. బాయిలు ఎండిపోయినయి. చెరువులు నెర్రెలు బాసినయి. గొడ్లకు గాదం దొరుకత లేదు. యెగుసాయం ఏట్లె గలిసింది. కాపోళ్లు యగుసాయం చెయ్యలేక పోతండ్లు. మన మాదిగోళ్లను జీతం పెట్టుకుంటలేరు. వాడల యిండ్లన్నీ సగం ఖాళీ అయినయి. వొరంగల్లుకు, హైదరాబాదుకు పనెతుక్కుంటా పోయిండ్లు. గొల్లోల్ల రామసెంద్రన్న కూడా యిల్లొదిలి పట్నం పోయిండు. గౌండ్లోళ్ల సత్తెయ్య వూళ్లనే వుండు. వాళ్లిద్దరు అన్నల్దమ్ములు తాడి చెట్లు ఎక్కుతండ్లు. గడీని వొదిలేసి దొరలు నువ్వీడికి రాకముందే వొరంగల్లు యెల్లిపోయిండ్లు. తండాల వాసునాయకుని తండ్రి సచ్చిపోయిండు. యిప్పుడు ఆడే సర్పంచి అయ్యిండు.
తాళ్లపెల్లి సోమయ్య కొడుకు పెళ్లి చేసిండు. బక్కెయ్య పాణం బాలేదు. ఆయన కొడుకు పాణం కూడా మంచిగ లేదు. దాదాసాహెబ్ యూత్ అని పెట్టిండు. ఒక మైకు తెచ్చి పెట్టిండు. అల్ల ఒకటే పాటలు. ఎవణ్ణీ నిద్రపోనిత్త లేడు. కోళ్ల నారాయణ కారోబారైండు. కోమటోళ్ల కృష్ణమూర్తి కొడుకు వెంకట్రామన్నకు ఓ కొడుకు పుట్టిండు. వొడ్లోళ యిరాటం బిడ్డ పెండ్లి చేసిండు. చాకలి ముత్తయ్య కొడుకు పెళ్లయినంక యేరుబడ్డడు. దొంగరి రామయ్య కొడుకు బతుకుదెరువు కోసం పట్నం పోయిండు. యింకా వూళ్లే గమ్మత్తులు చానే జరిగినయి’’ అని ఆగిండు.
కూరగిన్నెలున్న ముక్కను దవుడకేసి నములుతున్నడు రామసెంద్రు. తను చెప్పే మాటలను వింటూ, వాటిని దృశ్యాలుగా ఊహించుకుంటున్నాడు సెంద్రెయ్య. గమ్మత్తులు జరగుతున్నయి అనంగనే సెంద్రెయ్యకు ఆసక్తి పెరిగింది. ఏందో చెప్పు అని ఉత్సాహంగా అడిగిండు. రామసెంద్రు చెప్తున్నడు.
‘‘ఊళ్లెకు ఈ మధ్య కొత్త కత వొచ్చింది అన్నో. నల్లబట్టలేసుకొని నలభైదినాలు యేందో పూజట. అదేంది? దాని పేరు జప్పున యాదికొత్తలేదు. ఆ అదేనే. అయ్యప్ప మాల. యింతకు ముందెప్పుడూ చూడలే మనూళ్లే. సుట్టుపక్కల కూడా. కోమటోళ్ల పిలగాడు లేడు. ఆడేనే గబ్బెటోళ్ల ఎంకన్న. ఆడు దెచ్చిండు దాన్ని. వూళ్లె సూదరోళ్లు తక్కువనా. ఆనితో జతకలిసిండు. ఆ మాల యేసుకొనే రోజు వూరంతా ఆగమాగం. ఎవరింట్ల నీసు వొండలే. అంత పవిత్రం అన్నరు. అంతా ఓ యిరువై మంది నల్లబట్టలేసుకున్నరు. రుద్రాచ్చ మాలలేసుకున్నరు. పెద్ద గురువు పాలకుర్తి నుండి వొచ్చిండు. ఆ మాలేసుకున్నోళ్లు ఆడోళ్లను ముట్టుకోవద్దట. వాళ్లు వొండింది తినొద్దట. మాంసం తాగొద్దట. మందు తాగొద్దట. సుక్కపొద్దు గొట్టంగా లేచి, సన్నీళ్ల తానం చేయ్యాలే. ఎవలైనా మాలేసుకోవచ్చు అన్నడు ఆ గురువు. కానీ ఆడోళ్లను ముట్టొద్దు. మందు, మాంసం ముట్టొద్దు అంటే కష్టమే గదా. మాలేసుకోవాలని ఆశపడ్డా, ఈ షరతుల వల్ల చానా మంది ఆగిపోయిండ్లు.
అందరూ కలిసి ఒకే దగ్గర వుండాలే. ఒకేతావున వంట చేసుకోవాలే. కోడికూయక ముందే సామియే అయ్యప్పా అని పూజ, భజన చెయ్యాలే అన్నడు. మీతో రెండు రోజులు నేను కూడా వుంటా అన్నడాయన. సరే, మన మాదిగోళ్లు ఆగుతరా. మేము కూడా ఏసుకుంటం అన్నరు. ఆ గురువు వాళ్లకు కూడా ఏసిండు. నేను వొద్దని చెప్తనే వున్న. గబ్బెటోళ్ల ఎంకన్నకు మాదిగోళ్లకు మాలెయ్యడం నచ్చలే. కానీ ఊరి జనమంతా సూత్తండ్లు. ఏమీ అనలేకపోయిండు. ఆ రాత్రి భజన బాగా చేసిండ్లు. మనోళ్లు భాగోతం పాటలను అయ్యప్ప మీదికి మలిపి కైగట్టి పాడిండ్లు. ఆ తెల్లారే అసలు కత మొదలైంది’’ అని ఆగిండు రామసెంద్రు.
చాప ముక్కను చేత్తో తీసుకొని నోట్లో వేసుకున్నడు సెంద్రెయ్య. ముండ్లు గుచ్చుకోకుండా వొడుపుగా నమిలిండు. ఆ తెల్లారి యేమైందిరా అని అడిగిండు. రామసెంద్రు సన్నగా నవ్విండు. సారా గ్లాసు ఎత్తి ఒక్క బుక్కతాగిండు. గ్లాసును సేత్తో పట్టుకొని, యింకోసేత్తో మూతి తుడుసుకున్నడు.
‘‘మాలేసుకున్నోళ్లు ఒక్క కాన్నే పండాల్నంట. పూజ చేసేటప్పుడు ఒకని కాళ్లు ఒకడు మొక్కాలంట. అంతా కలిసి వొండుకోవాలే. కలిసి తినాలే. గదే పరేషాన్. మీరు మాదిగోళ్లు మీరు ఏరే పండాలే అన్నరట. సరే అన్నరు వీళ్లు. తెల్లారి తానాలు చేసిండ్లు. పూజ చేసిండ్లు. ఒకని కాళ్లు ఒకడు మొక్కాలనగానే, మాదిగోళ్లు లేసి శూదరోళ్ల కాళ్లకు దండం పెట్టిండ్లు. మా కాళ్లు మీరు మొక్కాలని మాదిగోళ్లు నిలబడ్డరు. సూదరోళ్లు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యిండ్లు. అదనా మాదిగోళ్ల కాళ్లు మేము మొక్కుతమా అన్నరు. మాదిగలు మాదిగలే మొక్కుకోవాలే. సూదరోళ్ళు మాత్రం మొక్కరు అన్నరట. బువ్వగూడ మాదిగోళ్లు వొండొద్దు అన్నడు గబ్బెటోళ్ల ఎంకన్న. అట్టెట్ల ఉంటది. మాలేసుకున్నంక అందరూ సమానమే అన్నరు గదా అని మాదిగోళ్లు తిరగబడ్డరు. పాపం ఆ గురువు ఏమీ అనలేక పోయిండు. మాదిగలకు మాలేత్తన అని ఆనికి కూడా దెల్వదు. ఆడు గప్పుమనలే. చుప్పుమనలే. తెల్లారక ముందే ఒకన్నొకడు కొట్టుకోబట్టే. వూరందరొచ్చే. మాదిగోళ్లదే తప్పు అన్నరు వాళ్లు. కోమటోళ్లు, సూదరోళ్లు పండుగ చేసుకొంటంటే, మధ్యల మాదిగోళ్లు దూరి సెడగొట్టిండ్లని అన్నరు. మాదిగలు పెగ్గలకు పోతండ్లు అన్నరు. మాదిగ వాడ పెద్దమనుషులు కూడా మనోళ్లదే తప్పు అన్నరు. ఆళ్లు అన్నది తప్పు కూడా కాదులే. మన ఆచారంలనే లేదు. యిట్లాంటివి. సూదరోళ్లతో మనకెందుకురా? మనల్ని తాకితేనే మైలపడుతదని అనుకునే టోళ్లతో పూజలేంది? మాలలేంది అని తిట్టే మీ తమ్ముడు ఎంకటన్న.
ఆఖరికి మనోళ్లే ఆ నల్లగుడ్డలను, ఆ మాలలను తీసేసిండ్లు. యిట్లాంటి అయ్యప్ప మాకొద్దు అని తిట్టుకుంటా పోయి, ఎవని పని వాడు చేసుకున్నడు. అవును గనే, సెంద్రెన్న. మాదిగోళ్లు, మాలోళ్లు ఎవన్నో చూసి వాతలు పెట్టుకునుడెందుకే? సూదరోళ్లయినా, యింకెవరైనా మనతో యియ్యంపెట్టుకునేటోళ్లా? అంతా కయ్యం పెట్టుకొనేటోళ్లే ఆయే. ఆళ్ల దేవుళ్లు మనకెందుకు? ఆల్ల పండుగలు మనకెందుకు? అసలు దేవుడనేటోడున్నాడే సెంద్రెన్నా. వానింట్లనా పెండబొయ్య. మనుషులను యిట్టా విడదీసేటోడు దేవుడెట్టయితడు? నిజంగా దేవుడనేటోడు వుంటే, మనలాంటోళ్ల ఉసురు తప్పకుండ తగుల్తదే’’ అన్నడు రామసెంద్రు.
దేవుని ముచ్చట ఇప్పుడు ఎందుకుగానీ బువ్వ తిందాం పట్టు అని కంచం రామసెంద్రు చేతికిచ్చిండు సెంద్రెయ్య.
యిద్దరు కడుపు నిండా తిన్నరు. కంటి నిండా నిద్రపోయిండ్లు.
అట్లా ఇద్దరూ బెజవాడలో అప్పుడప్పుడూ కలిసుకుంటండ్లు. ఒకరికొకరు ఆసరగా చూసుకుంటండ్లు.
ఒకరోజు యిద్దరు కలిసి చాయ తాగుతండ్లు. అయ్యప్ప మాలేసుకొన్న ఒకరు అందర్నీ నేను శబరి పోతున్నాను. బిచ్చం వేయండి అని అడుక్కుంటున్నడు. అలా అడుగుతున్న వాడిని ఇద్దరూ చూసిండ్లు. ఎక్కడో చూసినట్టుంది. యాది చేసుకోవడానికి యిద్దరు ప్రయత్నం చేస్తండ్లు.
ఆ అయ్యప్ప వాళ్ల దగ్గరికి వొచ్చిండు. బిచ్చం అడగబోయిండు. భయంతో పక్కకు జరిగిండు. సెంద్రెయ్య జాలిపడ్డడు. ‘‘యిటు రా సామి’’ అని చేతిలోకి పైసలు తీసుకున్నడు. అతడు మరింత వొణుకుతూ, ‘‘అన్నా నేను రౌడీగిరీ వొదిలేశాను. యిగో సామి మాలేసుకున్న. నన్ను ఏమనొద్దు’’ అని గొణిగిండు. వాడు సెంద్రెయ్య సేతిల దెబ్బలు తిన్న పాత రౌడీగాడు యాదొచ్చిందా?!
సెంద్రెయ్య నవ్వుకున్నడు. ‘‘చూస్నవా తమ్మీ. దెబ్బకు దేవుడైనా మారుతడు’’ అన్నడు. రామసెంద్రు నిజమే అన్నో అని నవ్వుకుంటా రిక్షా నూక్కపోయిండు.
*
Thank you Afsar sir.
అయ్యప్ప స్వామి మాల వేయడం లో కూడా వివక్ష ఉందన్నమాట. ఇదో కొత్త కోణం. ఇది విడిగా కథగా రాసేంత వస్తువు ఉంది. సెంద్రయ్య ప్రస్థానం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో…?
చాలా ఆసక్తికరంగా రాశారు సార్.
Thanks a lot.
భయపడితే భయపెడుతరు. బలమైన కథ వ్రాసిన జిలుకరకు అభినందనలు!
Thank you sir.
2011 lo same story repeat indi. Sc vallu mala vesaka BC vallu miru saparate undali, vere bavi daggara snanam cheyalani , ma bajana daggaraki ravoddu ani restrictions kuda pettaru. Mana vallu saparate ga unnaru kani ade bavi lo kavalane snanam chesirru.
Thanks for the comment.
శ్రీనివాస్ గారు(సర్)
కథో, నిజమో కానీ భలే ఉంది.
వెబ్ సిరీస్, సినిమా వలే ప్లాన్ చేయండి.
మొదట్లో మా భూమి మెదిలింది.
తర్వాత కులం కాటేసినప్పుడు డైవర్ట్ అయ్యాను.
Baindla sendrayya stories are a series. Pls read rest of the stories.
Kalasi vunte sarvam kalisi ostai.
జై భీం అన్న
కథ బాగానే అల్లింన్లు అన్న, ఈ మలదారణ అన్ని ఊళ్లకు పాకిందన్న మీ కథల మాదిగోళ్ళు ఆత్మగౌరవం ఉన్నోలు వివక్షను ఎదిరించి మాల తీసేసిండ్లు, కానీ నిజాజీవితంలా ఎన్ని అవమానాలు అయిన మంచిదే కానీ మాల తీసేదే లేదంటుండ్లు….
కథ ఒక్కసారి 15 ఏళ్ల ఎనక్కి తీసుకపోయింది అన్న.
Thank you Narendar garu.
దెబ్బకు దేవుడైనా మారుతాడు. ఇదే యీ కథ సారం.
కాకితో ప్రారంభించారు…కాకితో ముగించాల్సింది.బాగుంది శ్రీనివాస్…
Correct point. kani chai kottu kadiki kaki raleka poyindi.
thank you anna.
చాలా మంచిగుంది సర్ మీకథ. చదువుతుంటే కళ్ల ముందు సీన్స్ కనిపించాయ్. మాల వేసుకున్నాక కాళ్లు మొక్కే చోట అసలు రంగులు బయటపడ్డాయి. దేవుడు, భక్తి అనే కాన్సెప్ట్ నుంచే కదా మనుషుల్లో ఎక్కువ తక్కువలు పుట్టుకొచ్చాయని చాలా సింబాలిక్ గా చెప్పారు. అభినందనలు సర్.
thank you Humayun garu.
“అవును గనే, సెంద్రెన్న. మాదిగోళ్లు, మాలోళ్లు ఎవన్నో చూసి వాతలు పెట్టుకునుడెందుకే? సూదరోళ్లయినా, యింకెవరైనా మనతో యియ్యంపెట్టుకునేటోళ్లా? అంతా కయ్యం పెట్టుకొనేటోళ్లే ఆయే. ఆళ్ల దేవుళ్లు మనకెందుకు? ఆల్ల పండుగలు మనకెందుకు? అసలు దేవుడనేటోడున్నాడే సెంద్రెన్నా. వానింట్లనా పెండబొయ్య. మనుషులను యిట్టా విడదీసేటోడు దేవుడెట్టయితడు?”
ఇదే అసలు నిజం. సరైన ఎరుక.
చాలా చోట్ల మాలేసుకుంటే సామాజిక సమానత్వం పొందొచ్చు అన్న అపోహ బహుజన కులాల్లో ఉంది. దాన్ని ఈ కథనం పటాపంచలు చేస్తుంది.
Thank you Prabhakar garu.
“అబ్బా నువ్వు మాలా గీలా వేసుకుని మాతో సమానం అయిపోదామనే..మాల వేసుకున్నా సరే అస్పృశ్యత ఎక్కడికీ పోదనే” కఠిన కుల సత్యాన్ని ఆవిష్కరించారు సార్ కథలో…🤝👌