బూడిదరంగు నీడలు

ఒక ఆకునైనా సరే వేళ్ళతో కదిపి, కాలాన్ని కాస్త ముందుకు తోసిన ఊహ చాలు

రణించిన మధ్యాహ్నాల్లో
కాలం చుట్టూ ప్రవహించే నిద్రల పడవలు

1
దేహానికి విశ్రాంతిలేదు
దేహం చుట్టూ విస్తరించిన కాలానికి మెలకువ లేదు
రాలి రాలి పోగైన కలలచెత్తను
ఊడ్చటానికైనా కొంత విశ్రాంతి కావాలి

2
ఒక ఆకునైనా సరే వేళ్ళతో కదిపి
కాలాన్ని కాస్త ముందుకు తోసిన ఊహ చాలు

చరిత్ర నిర్మాణం జరుగుతుంది

ఎప్పటికో ఆకుని మళ్ళీ అదేచోటులో
ఉంచి నన్ను నేను ప్రతీకలా నిలబెడతాను

3
పాదం చుట్టూ విస్తరించిన
దాన్ని రాయకపోతే ఏదీ భర్తీ అవదు
ఖాళీల మీద
విరామచిహ్నమైనా రాయాలి

రాయడం పూర్తయిన తరువాత
ఇట్లా వాకిలి ముందు కూర్చొని
దేన్ని గురించి సంభాషించాలో మర్చిపోవడం
కదా విషాదం !

4
కళ్ల నదిమీద గాలి దుమారానికి
తొణికి కాలం మాయమవుతుంది

కాలం వదిలిన ధూళి కింద
ఒక నీడదేహం కదలాడిన చప్పుడు
మిగిలిపోతుంది

7
బహుశా ఈ మధ్యాహ్నాలు
శవాలు కాలిపోగా మిగిలిన బూడిదరంగు నీడలు

*

పెయింటింగ్: సత్యా బిరుదరాజు

సత్యగోపి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు