బురుదగుంట

“వూరన్నంక అన్ని కులాలు వుంటయి. బైండ్లోడు వూరికి అదృష్టం. మీకు మంచి చేసేటోడే గానీ కీడు చేసేటోడు కాదు.”

తెల్లార లేదు. ఆ యింటి కోడి కూడా యింకా లేవలే. ఎవరి బిడ్డో తెల్వదు. ఆ  యింటి ముందు ఓ సిన్నపొల్ల కేరుకేరుమని యేడుస్తుంది.

బైండ్ల సోమయ్యకు ఆ యేడ్పుకు అర్థం యేందో తెలుసు. ఒక్క సోమయ్యకే కాదు. సెంద్రెయ్యకు తెలుసు. అప్పటికే నిద్రలేసి బయిలుకు పోయిన యెంకటయ్యకూ తెలుసు.

చెట్ల మీది పిట్టలు కూడా లేవక ముందే యెవరన్నా యింటికొస్తే ఆపదొచ్చిందని బైండ్లోళ్లకు షానాబాగా తెలుసు.

తలుపు తీసి బయిటికొచ్చిండు సోమయ్య. ఎదురుగా బెస్తోళ్ల కిష్టయ్య. ఆయన భార్య రాజమ్మ వొడిలో సిన్నపిల్ల. ఆ పిల్ల యేడ్పు ఆపుతలేదు. వాళ్లను చూసి చూడనట్టు చేసిండు సోమయ్య. తాను బయిలుకు పోవడానికి చెంబులో నీళ్లు తీస్కొని చెట్లల్లకు పోయిండు. కడుపు ఖాళీ చేసుకొని వొచ్చిండు. కాళ్లు చేతులు సబ్బు పెట్టి శుభ్రంగా కడుక్కున్నడు.

అప్పటికే యెంకటయ్య ఆ పనులన్నీ పూర్తి చేసుకొని తానం చేసి ఉతికిన బట్టలు యేసుకొని యేవో పుస్తకాలు ముందేసుకొని కూసున్నడు.

ఆ పిల్ల యేడ్పుకు సెంద్రెయ్య నిద్రలేసి బయిటికొచ్చిండు. తువ్వాలతో ముఖం తుడుచుకుంటా బయటికొచ్చిండు. సీకట్లో  కూసున్నది యెవరో అర్థం కాలేదు. ‘యెవరుల్లా’ అని అడిగిండు. ‘‘నేనో వాయి. దయ్యాల కిష్టయ్యను’’ అన్నడు. ‘‘యేమయ్యిందో బావా? పిల్ల ఒకటే యేడుత్తంది?’’ అన్నడు. కిష్టయ్య ఏం చెప్తడో వినకుండానే సోమయ్యకు యినపడేలా గట్టిగా అన్నడు. ‘‘సంటిపొల్ల యేడుపు యినపడుత లేదారా? యింట్ల నిద్రపోయిన పొలగాళ్లు లేసేటట్టున్నరు. యింత పసుపో బూడిదో మంత్రించి యియ్యరాదు. యెంత సేపు కూసుండబెడుతవు’’ అని కోపంతో అన్నడు.

అప్పటికే సన్నీళ్ల తానం చేసి, ఉతికిన బట్టలేసుకొన్నడు సోమయ్య. యంత్రాల పుస్తకం, పసుపు, విబూది కండె వున్న సంచితీసుకొని బయటికొచ్చిండు. పీటేసుకొని కూసున్నడు.

సెంద్రెయ్య మాటలకు సోమయ్యకు సిన్నపాటి కోపం వొచ్చింది. ‘‘నువ్వు సెప్తేనే సేత్తం మరి. దయ్యాల కిష్టయ్య నీకు బెల్లమాయే. నాకు అల్లమాయే. దేనికైనా ఓ పద్ధతి వుంటది. తానం సెయ్యకుండా యంత్రం రాయొద్దు. మంత్రం సదువొద్దు. యియ్యన్నీ నీకేం తెలుస్తయి. తన్నుడు, గుద్దుడు దప్పా’’ అని యెటకారం చేసిండు అన్నను.

‘‘ఓపిలగా, తెల్లారక ముందే అన్నాదమ్ములు పంచాతీ పెట్టుకుంటరా యేంది నా మూలంగా?’’ అని దయ్యాల కిష్టయ్య గాబరా పడ్డడు.

సీపురు కట్ట సేతిలక తీసుకొని బయిటికి వొచ్చింది సరోజా. సోమయ్య భార్య ఆమె. ‘‘ఆ యిద్దరి వరుస గట్లనే వుంటది లేవే’’ అనుకుంటా సీపురు పట్టుకొని యింటి సుట్టూ వూడ్వడానికి పోయింది. ఆ యెనుకే యెంకటయ్య భార్య సిలుకమ్మ లేసి పొయ్యి రాజేసే పని మొదలుపెట్టింది. తెల్లారేటప్పటికి వొంటపనులు పూర్తి చేసి, బాయికాడికి పోయి యగుసాయం పనులు చూసుకోవాలే వాళ్లు. యెవరి పనులు వాళ్లు చేసుకుంటరు.

తండ్రి నర్సయ్య నేర్పిన వైదుగాన్ని సోమయ్య వొదులలే. మన మీన నమ్మకంతోటి వొత్తరు బిడ్డా. మంచి మనుషులు చెడ్డ మనుషులున్నట్టే మంచిగాలి చెడ్డగాలి కూడా వుంటది. చెడ్డగాలి వొంట్లో వున్నా మంచిది కాదు. బయటున్నా మంచిది కాదు. ప్రకృతికీ  మనిషి ఒంటికీ తేడా ఏమీ లేదు. రెండూ ఒకటే. మనం మంచి మనుసుతో ఒక మనిషి మీద చెయ్యేస్తే రోగమంతా దెంకపోవాలే. వొంట్లో వున్న మైలంతా బయిటికెళ్లిపోవాలే. యే దేవారో మీదికొచ్చిందనుకో. దాన్ని శాంతింపచేసి యెళ్లగొట్టాలే. యీ విద్య వేలయేండ్లుగా వొత్తంది. అది నిజమా? అబద్దమా అన్నది కాదు ముఖ్యం. మనిషిని బతికియ్యడానికి పనికొత్తనయా లేవా అన్నదే సూడాలే అని ఒక రోజు తన కొడుకులకు బోధించిండు నర్సయ్య. ఆ మాటలు సోమయ్యకు బాగా నచ్చినయి. నాయిన మీద ప్రేమతో కుల యిరితిని వొదులకుండా సేత్తనే వున్నడు.

సోమయ్య ఆ సంటిపిల్ల చెయ్యి పట్టుకొని చూసిండు. యేదో తేడా కొట్టింది. కడుపు మీద చెయ్యి పెట్టి నొక్కిండు. బిర్రుగా వుంది కడుపు. కేరు కేరమని యేడుస్తా వుంది. దబదబా యంత్రాల పుస్తకం తెరిచిండు. అందులోంచి ఒక నెమలీకను తీసిండు. యిష్ట దేవత యెల్లమ్మకు మనుసుల మొక్కిండు. నెమలీకతో ఆ పిల్ల కడుపు మీద సుకుమారంగా పైకీ కిందికీ రాపాడించిండు మంత్రం యెవరికీ యినపడకుంటా. అయిదు సార్లు తల మీంచి కాళ్ల దాకా తాకించిండు. ఆ పిల్ల బొడ్డుకు అటుయిటూ నెమలిక తిప్పిండు. యిబూది కుడిచేతిలోకి దీస్కోని యేదో మంత్రం జపించిండు. ఆ తర్వాత ఆ పిల్ల నొసటి మీద, చాతీల, కడుపు మీద బొట్టు పెట్టిండు. ఆ పిల్ల యెన్ను మీద సిన్నగా సరిచిండు. కిష్టయ్యకు, రాజమ్మకు యిద్దరికీ యిబూది బొట్టు పెట్టిండు. వాళ్లు భయం భక్తితో ఆ యిబూదిని నొసట పూయించుకున్నరు.

యేమైందో యేమోగానీ ఆ పిల్ల ఒక్కసారిగా దొడ్డికి పోయింది. కడుపులో అప్పటిదాకా సుడితిరిగిన చెడ్డగాలి బయిటికి పోయింది. అది గబ్బు వాసన కొట్డుతంది. కడుపునొప్పి తగ్గగానే ఏడుపు ఆపేసింది. ఆ పిల్ల తల్లి ముఖంలో సన్నటి యెలుగు.

యెంకటయ్య సదువుతున్న పుస్తకం అక్కడే వొదిలేసి లేసిండు. సిలుకమ్మ సేతికి పెద్ద గిన్నె ఒకటి ఇచ్చింది. బర్రెకాడికి పోయి దాన్ని అదిలించిండు. అది లేచి నిలబడ్డది. దుడ్డెను ఇడిసిండు. అది ఉరికి తల్లి పొదుగును కుమ్నుతూ పాలిచీకింది. కొద్ది సేపయినంక ఆ దుడ్డెను పక్కకు గుంజి కట్టేసిండు. మంచినీళ్లతో పొదుగును కడిగి గిన్నెల పాలు పిండుతండు.

సోమయ్య యంత్రాల పుస్తకం దీసి తెల్లకాగితం మీద యేదో మంత్రం రాస్తండు.

‘‘నిన్న యేమిదిన్నవు రాజమ్మ. సంటిపిల్ల యెంత తల్లడిల్లింది? తల్లి నోరుకాయక పోతే బిడ్డకు షానా కష్టం వొస్తది. అంతగనం యేందిన్నవేంది?’’ అని అడిగింది సేతికి లోటలో నీళ్లందిస్తూ సిలుకమ్మ.

ఆ పిల్ల ముడ్డి కడుగుతూ ‘‘నేనేం దిన్న వొదినా. బంగారం దింటినా? యెండిదింటినా? మీయన్న దెత్తే’’ అంది రాజమ్మ.

ఆ మాటకు నొచ్చుకున్నడు కిష్టయ్య. ‘‘నీయ్యయ్య పెట్టిండానే బంగారం యెండి నీకు పెట్ట, దున్నపోతు మొకందానా. తినేదంతా తినుడే. తీరా నన్ను బద్నాం చేసుడే. నిన్న ఉప్పలమ్మకు కోడిపుంజును కోసినం సెల్లే. యిద్దరమేనాయే. దీనికి పిల్లికి బిచ్చం పెట్టే అలవాటు లేదాయే. కిలనర కోడిపుంజు. యిద్దరమే దింటిమి. సంటిపోరికి యిట్లా అయితదని నాకు దెల్వదాయే. యిగ దీని కత సూడు యెట్లున్నదో’’ అని గద్దించిండు కిష్టయ్య. ఆ మాటలకు నోరుమూసుకున్నది రాజమ్మ.

సోమయ్య యంత్రానికి పసుపు పూసిండు. యేందో మంత్రం సద్విండు. దేవునికి దండం పెట్టిండు. ఆ యంత్రాన్ని ఆ పిల్ల మెడలో యేసిండు.

యిగ యేంగాదుపోరా. మీ ఆయన మాటలకేంగానీ అని రాజమ్మను ఓదార్చిండు.

ఆమె కళ్లల్లో సన్నటి నీటిపొర కరుగుతుండగా తెల్లారింది.

అదిగో అప్పుడొచ్చిండు కోల్కొండ పర్శరాములు. కోల్కొండ నుండి సైకిలేసుకొని చీకట్లనే బయల్దేరిండు తను. తెల్లారేటప్పటికి మల్లంపల్లి చేరుకున్నడు.

కిష్టయ్య రాజమ్మను తీస్కోని తన యింటికి ఎల్లిపోయిండు బాయికాడ పనుందని.

పర్శరాములుకు చెంబులో మంచినీళ్లిచ్చింది సిలుకమ్మ. అందరూ మంచిగున్నరానే. యెట్లొచ్చినయే నీకు కాళ్లు? నీ బావలను సూడ్డానికి యెన్నేండ్లు పట్టినయే అంది దగ్గరికొచ్చి.

‘అంతా బాగున్నం సెల్లే. బైండ్లిరికం సేత్తే యెట్లుంటదో తెల్వదారా? గడియ రికాం లేదు. గవ్వ రాకడ లేదు’’ అని నీళ్ల చెంబుతీస్కోని మొహం మీద సల్లటి నీళ్లు చల్లుకున్నడు. గొలెంకాడ కాళ్లూ చేతులు కడుక్కున్నడు.

సెంద్రెయ్యకు కోల్కొండ పర్శరాములంటే షానా యిష్టం. తను కూడా అచ్చం తనలాంటోడే. మాటంటే పడని గుణం. నిఖార్సయిన మనిషి. తప్పు చేయాలంటే భయపడే రకం. అలాంటి  పర్శరాములుకు యిప్పుడు పెద్ద కష్టం వచ్చిపడ్డది.

పాలు పిండి గిన్నెను సిలుకమ్మకు యిచ్చిండు యెంకటయ్య. సోమయ్య యంత్రాల పుస్తకం సంచిల పెట్టి పక్కకు పెట్టిండు. అందరూ మంచిచెడ్డలు అడిగిండ్లు.

గడెంచ యేసింది సరోజ. దుప్పటేసింది. కాసేపు పండుకో అన్నా. యెప్పుడు బయల్దేరినవో యేందో అన్నది. మంచంలో కూసున్నడు పర్శరాములు. ‘‘నన్ను నిద్ర పోనిత్తన్నాడురా ఆ కాపోడు. వానవ్వకునా బారేద్దు. అన్యాలంగా నామీద నింద మోపి, నాకు కునుకు లేకుండా సేత్తండు’’ అన్నడు.

యేమైందో పిలగా అనుకుంటా వొచ్చిండు సెంద్రెయ్య. యింకో గడెంచ దెచ్చి యేసింది సరోజా. దాంట్లో యెంకటయ్య, సెంద్రెయ్య కూసున్నరు. సోమయ్య బాయికాడికి పోదామని చెప్పులేసుకున్నడు. కానీ పర్శరాములు బాద యిని పోదామని ఆగిండు.

‘‘యేం చెప్పను బావా నా బాదా’’ అని తన కత చెప్తండు పర్శరాములు. కోల్కొండలో కాపోళ్ల లింగారెడ్డి యాభై యెకరాల ఆసామి. అయిదుగురు జీతగాళ్లు. అన్ని రకాల పంటలు పండిత్తడు. తన మాట కాదన్నా, తన మాట యినకున్నా ఆవేశపడుతడు. మంచి యెండాకాలం. బాయికాడ ఉప్పలమ్మ పండుగ చెయ్యాలె అనుకున్నడు లింగారెడ్డి. పర్శరాములును యింటికి రమ్మనమని చెప్పు అని తన జీతగాన్ని పంపించిండు ఒకరోజు. ఆ సమయానికి పర్శరాములు ఈరెంటిలో మాదిగిండ్లల్ల పెళ్లి చెయ్యాలని బయల్దేరుతున్నడు. పటేలు రమ్మంటండు అని చెప్పి యెళ్లి పోయిండు ఆ జీతగాడు. తర్వాత కలిసి మాట్లాడుదాం. పెళ్లికి పోవాలే. యిప్పటికే ఆలస్యమయితంది అని ఈరెంటికి యెళ్లి పోయిండు పర్శరాములు. రెండు రోజులైనా పటేలును కలువ లేదు తను. నేను యింతగనం చెప్పి పంపినా రాడా. యాభై యెకరాల ఆసామిని. అదనా బైండ్లోడు. నేను రమ్మంటే రాడా అని లోపల కుట్టు పెట్టుకున్నడు లింగారెడ్డి. బాయికాడ జీతగాళ్లను ఎవడూ సరిగా పని చేత్తలేడు. అందరికి కొమ్ములొచ్చినయి. దొంగగొడ్లలెక్క తయారైండ్లని జీతగాళ్లను తిట్టిండు. ఎందుకు తిడుతండో వాళ్లకు అర్థం కాలే. పాపం లింగారెడ్డి మాటలు అర్థం కాని గొడ్లు వాటి పని అవి సేత్తన్నయి. దున్ని దుక్కి వాటి కాళ్లకింద ఎర్రకుంకమ లెక్క వుంది. అది ఎర్రసెక్క.

మూడోరోజు కోమటోళ్ల దుకాణంలో యేదో కొందామని పోయిండు పర్శరాములు. అక్కడ పటేలును చూసిండు. అరరే మర్సిపోయినానే. లింగారెడ్డి రమ్మని చెప్పంపిండు కదా అని మనుసుల అనుకున్నడు. ‘‘ఓ లింగారెడ్డి. నేను జర పని మీద బడి మర్సిపోయినా. యేమనుకోకు. యేందో రమ్మనవటా’’ అన్నడు పర్శరాములు. ఆ మాట కోసమే యెదురు సూత్తండు లింగారెడ్డి. కోపంతో వూగిపోయిండు. ‘‘నా లౌడల పని. నువ్వేంది నీ లెక్కేంది? నేను రమ్మంటే రావా? నీ యింటికి నా జీతగాణ్ని పంపిన. అయినా నువ్వు రాలే. బజాట్ల కనపడితే మందలిత్తనవు. నీ గుద్దల బలుపెక్కింది. బైండ్లోనికి యింత బలుపొద్దు’’ అన్నడు లింగారెడ్డి. ఆ మాటకు పర్శరాములు మనుసు నొచ్చుకున్నది. కలికలి అయ్యింది. మర్యాదగ మాట్లాడు. బలుపుగిలుపు అన్నవంటే మంచిగుండదు అన్నడు పర్శరాములు. యేంచెత్తవురా నువ్వు అని లింగారెడ్డి మీదికి వురుకొచ్చి గల్లా పట్టుకున్నడు. పర్శరాములు మాంచి బలవంతుడు. లింగారెడ్డిని గట్టిగ నూకేసిండు. వాడు పోయి బురుదగుంటలో పడ్డడు. వాళ్లిద్దరి పంచాతీ చూస్తున్న పదిమంది వురుకొచ్చిండ్లు. బురద బట్టలతో లింగారెడ్డి నిలబడి ఆంబోతులాగా రంకెలేసిండు. కానీ వూరి పెద్దమనుషులు ఆపిండ్లు.

మేమంతా సూత్తనే వున్నము. నువ్వే పర్శరాములు గల్లా పట్టుకున్నవు. నీది మొదట తప్పు. తాను నూకేసిండు. నువ్వు బురుదల పడ్డవు. వానిది కూడా తప్పే. యేమన్నా వుంటే కూసోని మాట్లాడుకోవాలే గానీ, సిన్నపిల్లలాగా బజాట్ల కొట్టుకునుడేంది అని అంతా అన్నరు. యిద్దరిదీ తప్పే అని సర్దిచెప్పి పంపించిండ్లు.

ఆ రోజు నుంచి లింగారెడ్డికి నిద్రలేదు. యెట్లాగైనా కసి దీర్చుకోవాలని అనుకుంటండు. నన్ను బురుదల నూకేత్తడా అనేది ఆయన బాధ. లోపల అవమానం తనను కాల్చేత్తంది. బురుద బట్టలతో ఇంటికి వొత్తంటే ఆడోళ్లు, చిన్నపిల్లలు కిసుక్కున నవ్వింది యాదికొచ్చి మనసు ఏడుస్తంది. వాణ్ణి వొదులొద్దని మనసు రెచ్చగొడుతంది. పెరట్లోని కోడిపుంజులు రెండు ఏ కారణం లేకుండానే ఎగిరిఎగిరి తన్నుకుంటున్నయి. వాటి మీకి రాయి ఇసిరేసిండు లింగారెడ్డి. అవి అరుస్తా అక్కణ్ణుంచి వురికినయి.

పది రోజులయింది పంచాతీ అయిపోయి. పర్శరాములు జరిగిన సంగతి మర్చిపోయిండు. తన పని తాను చేసుకుంటండు. కానీ లింగారెడ్డి మర్చిపోలే. ఒకరోజు గౌండ్లాయిన దగ్గర కల్లు తాక్కుంటా నా కోళ్లు అయిదు సచ్చిపోయినయి. ఆ బైండ్లోడు. పర్శరామలుగాడు మంత్రాలు చేసిండు అన్నడు గౌండ్లోల్ల మల్లయ్యతోటి. ఆయన కల్లొంచుకుంటా నవ్విండు. మంత్రాలకు సింతకాయలు రాల్తయా పటేలా? కోళ్లు సచ్చిపోవడానికి పర్శరామలుకు యేమన్న సంబందం వుందా? అన్నడు. మీరు నమ్మర్రా. మీ గుద్దకిందికి నీళ్లొత్తే గానీ నమ్మరు మీరు. నీకాడ వాడు వాడికె పట్టిండు కదా. అందుకే వానికి ఒత్తాసు పలుకుతన్నవు గనీ అన్నడు లింగారెడ్డి.

నీకత బానే వుంది. వాడు తాగితేనే నేను బిల్డింగులు కడుతన్నా. యాభై యెకురాల ఆసామినయినా. వాని మీద నీకు కోపం వున్నది. యేదో వాని మీద బద్నాం నూకుతున్నవు. యిన్నేండ్ల సంది వూళ్లే వాడేమన్నా తప్పు చేసిండా. నీతి న్యాయం వుండాలే లింగారెడ్డి అన్నడు గౌండ్లోల్ల మల్లయ్య.

నాకే నీతులు నేర్పుండ్లి. వాని తెడ్డే బాగున్నది మీ అందరికీ అని తిట్టుకుంటా లేసి ఎల్లిపోయిండు లింగారెడ్డి. యింకో వారానికి నడీబజార్లో నిలబడి పర్శరాములుగాడు నా పెళ్లానికి మంత్రాలు సేత్తండు. దాని కాళ్ల నొప్పులు తగ్గుతలేవు. యే డాక్టరుకు చూపించినా తగ్గుతలేవు అని అందరికీ చెప్పుకుంటా తిరిగిండు. ఆ మాటలిన్న ఆడోళ్లు మొగోళ్లు నిజమేనా అని ఆలోచనల పడ్డరు. పర్శరాములును చూసి నిజానికి వాళ్లు భయపడుతండ్లు. పర్శరాములుకు మంత్రాలొస్తయని వాళ్లకు అనుమానం వొచ్చింది.

మళ్లో వారానికి నా గొడ్లు సచ్చిపోయినయి. పర్శరాములుగాడే మంత్రాలు చేత్తండు. నేను సావాల్నా. వాణ్ని సంపాల్నా మీరే చెప్పుండ్లి అని పెద్దమనుషుల ముందు పంచాతీ పెట్టిండు. వూరువూరంతా అతలాకుతలం అయ్యింది. పర్శరాములు మంత్రాలు చేసిండట. గొడ్లు సచ్చినయటా అని కొందరు. పటేల్లమ్మకు కాళ్లు పడిపోయినయటా అని కొందరు కతలు చెప్పుకుంటండ్లు. పర్శరాములును చూసి యింతకు ముందు అంతా పలుకరించేవాళ్లు. యిప్పుడు ఆయన్ని చూడగానే మొహం తిప్పుకుంటండ్లు. బెదరుతున్నరు.

వూరి పెద్దమనుషులు రెండుగా చీలిపోయిండ్లు. పర్శరాములు అట్లాండోడు కాడని కొంతమంది. నిజంగానే వాడు అట్లాంటోడు కాకపోతే మరి కోళ్లు యెట్లా సచ్చినయి? పటేలమ్మకు కాళ్లెందుకు లేత్తలేవు? గొడ్లెందుకు సచ్చినయి? అని యింకొంత మంది వాదించిండ్లు. నాకే పాపమూ దెల్వదని గట్టిగా వాదించిండు పర్శరాములు. నీకు తెలిసినోళ్లను నువ్వు పిలిపిచ్చుకో. నువ్వు తప్పు చేసినవని తేలితే వూరందరం కలిసి నిన్ను చెట్టుకు కట్టేసి కిరోసిన్‌ పోసి తగులబెడుతం అన్నరు కొంత మంది పెద్దమనుషులు. ఆ మాటలకు గుండెలదరినయి పర్శరాములుకు. రెండు రోజుల్ల తేలిపోవాలే అన్నరు పెద్ద మనుషులు. అందుకే మల్లంపల్లికి వొచ్చిండు పర్శరాములు. తన కష్టమంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నడు.

యేహే వూకో పిలగా. మేము లేమా అన్నడు సోమయ్య. ముగ్గురు బావలున్నరు నీకు పులులెక్క. గాదానికి భయపడుతావే. వాళ్లు చూసుకుంటరు. నీకెందుకే ఫికరు అన్నది సిలుకమ్మ.

యిట్లాంటి పంచాతీలల్ల భయపడొద్దు. మనం భయపడితే వూరంతా కలిసి సంపేత్తరు పిలగా. మేమునీకు తోడున్నం. గుబులు పడకు అన్నడు సెంద్రెయ్య.

నెలకిందట్నే మంత్రాలొస్తయనే పేరుతో అదేదో వూళ్లే బైండోల్లను కొట్టీకొట్టీ సంపేసిండ్లు. మంత్రాలున్నయో లేవో మనకే యెరుక. మనోళ్లను మంత్రాల పేరుతో సంపి బూములు గుంజుకుంటండ్లు. పోలీసులకు చెప్పినా వాళ్లు కూడా మంత్రాలను నమ్ముతండ్లు. మంత్రాలు చేస్తే చంపరా అంటండ్లు పోలీసులు. ఈ సమస్యను మనం షానా జాగ్రత్తగా తెంపాలే అన్నడు యెంకటయ్య.

ముందు నువ్వు బువ్వ దిను అని సిలుకమ్మ కేలి చూసిండు. అప్పటికే కోడి కూర వొండింది. పర్శరామలుకు కంచం నిండా కూరేసింది. నీయవ్వా తిను. మేము లేమానే అన్నది. వాళ్లకేసి ప్రేమగా చూస్తూ అన్నం కలుపుతున్నడు.

యెంకటయ్య గడెంచల నుంచి లేసిండు. సోమయ్యను, సెంద్రెయ్యను పక్కకు పిలిచిండు. వాళ్లకేదో చెప్పిండు. వాళ్లు కూడా యింత తిని హడావుడిగా యెళ్లిపోయిండ్లు.

పర్శరాములుకు పాలకుర్తిలోని బామ్మార్ది ఎల్మకంటిసోమయ్యకు. శాతాపురం యెల్లయ్యకు కూడా పంచాతీకి రమ్మనమని చెప్పి పంపించిండు. తెల్లారి పొద్దున్నే మీ వూళ్లె వుంటము పో అని పంపించిండు. యేదో తెలియని ధైర్నంతో పర్శరాములు యెళ్లిపోయిండు.

అనుకున్నట్టే వూరంతా బొడ్రాయికాడ కూడింలడ్లు. పర్శరాములు, తన భార్యా పిల్లలతో నిలబడి వున్నడు మధ్యల. లింగారెడ్డి మీసాలు తిప్పుకుంటా కాలుమీద కాలేసుకోని కుసున్నడు ఒక బండ మీద.

యేమయ్యా, పర్శరాములు. నీ తరఫున పెద్ద మనుషులు వొచ్చిండ్లా? అని అడిగిండు వూరి సర్పంచి మేదరోళ్ల యాకయ్య.

‘‘మీరంతా కాదా? నాకున్న బలుగమంతా మీరే. మీ మధ్యన బతికేటోన్ని నేను. నాకు వేరే పెద్దమనుషులెందుకు?’’ అన్నడు పర్శరాములు. ఆ మాటలకు అక్కడున్నోళ్ల మనసంతా తేలికైపోయింది. పాపం పర్శరాములుకు ఏం తిప్పలొచ్చింది? అన్నరు ముసలి ఆడోళ్లు.

‘‘మేము ఎవరికీ అనుకూలం కాదు. వ్యతిరేకం కాదు. నీ మీదొక ఫిర్యాదు వొచ్చింది. మీ కులపోళ్లను పిలుచుకున్నవా? లేదా?’’ అన్నడు సర్పంచి యాకయ్య.

అగో అప్పుడే చేరుకున్నడు యెంకటయ్య.

మాజీ పోలీసు పటేలు యెంకటయ్య వొచ్చిండని సర్సంచి యాకయ్య లేచి నమస్తే పెట్టిండు. యెంకటయ్య పోలీసు పటేలుగా తెలుసు. రాజకీయ నాయకుడిగా కొడకండ్ల తాలుకా అంతా తెలుసు. తన వెంట కోళ్ల నారాయణ, గర్వందుల సత్తెయ్య, తాళ్లపెల్లి సోమయ్య, ఏర్పుల రాంచెంద్రం, వంగాల సోమయ్యతో పాటు మరో యాభైమంది మాదిగోళ్లు వొచ్చిండ్లు ఆ పంచాతీకి. అన్ని కులాలోళ్లను తోలుకొచ్చిండు.

సోమయ్య దర్దేపల్లి, వాయిలాల, ఈరెంటి, కొడకండ్ల, ఏనూతుల, రామారం, తమ్మెడపల్లి, నిడిగొండ నుండి యింకో యాభై మందితోటి ఆడికి వొచ్చిండు.

దర్దెపల్లి, కొండాపూర్‌, పర్వతగిరి, తొర్రూర్‌, గంట్లకుంట యింకా చాలా వూళ్ల నుంచి యింకో యాభైకి పైగా మందిని పోగేసిండు సెంద్రెయ్య.

ఒక్కసారిగా పక్కూళ్ల నుండి అంత మంది రావడంతో కోలుకొండ జనాలు బేజారయ్యిండ్లు. యేం జరుగుతదని కంగారు పడ్డరు. పర్శరాములుకు బలగం బానే వుందని వాళ్లకు ఎర్కయింది.

యిది యెంకటయ్య తంత్రం. సుట్టుపక్కల వూళ్ల నుండి జనాలను తీస్కపోయి పర్శరాములుకు ధైర్నం ఇవ్వాలే. పర్శరాములు ఒంటరోడు కాదు. యింతమంది న్యాయం కోసం నిలబడేవాళ్లున్నరని ఆ లింగారెడ్డికి తెలిసేటట్టు చెయ్యాలే అని తమ్ముడు సోమయ్యకు, అన్న సెంద్రెయ్యకు చెప్పిండు. మనం కోలుకొండలో పంచాతీ నెగ్గితే అది నలభై ఆమడలదాకా తెలుస్తది. బైండ్లోళ్లను ముట్టు కోవాలంటే ఎన్కముందు ఆలోచించాలే అంతా.  లేకపోతే, మంత్రాల పేరుమీద బైండ్లోళ్లను బతుకనియ్యరని ఆ యిద్దరికీ అర్థం చేయించిండు. సెంద్రెయ్యకు తమ్ముని మాటల్లోని మర్మం బానే అర్థం అయ్యింది.

అంతమంది తన కోసం రావడంతో పర్శరాములుకు ఎక్కడలేని ధైర్నం వొచ్చింది. సోమయ్య కేలి చూసి నమస్తే పెట్టిండు. సోమయ్య తన గుబురు మీసాలను వొడితిప్పిండు‌.

వాళ్లందరినీ చూసే సరికి లింగారెడ్డికి మతిపోయింది. నిజానికి ఒకరకమైన భయంపట్టుకున్నది. పంచాతీల యేదో జరుగతదని లోపల కొడుతంది తనకు. పర్శరాములుగానికి ఇంతబలం యాడినించి వొచ్చింది అని మనుసుల ఉద్రేకపడ్డడు.

నిడిగొండ నుంచి వొచ్చిన జిలుకర ఎల్లయ్య లేచి సర్పంచిసాబ్‌. లింగారెడ్డిని పంచాతీ యేందో చెప్పమను అన్నడు. . సర్పంచి అడిగిండు. లింగారెడ్డి తనకొచ్చిన కష్టం చెప్పుకున్నడు. ‘ఈ లంజకొడుకు వల్లనే నా పెళ్లాం కాళ్లు పనిచేత్తలేవు. నా గొడ్లు సచ్చిపోయినయి. నా కోళ్లు సచ్చినయి. వీడే మంత్రాలు చేసిండు’ అని తిట్లు అందుకున్నడు.

నీ వరుస చెప్పాలే గానీ, మా ముందే పర్శరాములును తిడుతవా? నువ్వేంది నీ లెక్కేంది? అని లేచిండు యెంకటయ్య. మీసాలు దిప్పుకుంటా రంకెలేసిండు బొట్టు యెల్లయ్య. యే కాపోడా నీ కావురం కారిపోద్ది యేమనుకుంటన్నవో అన్నడు.  ఎవరు ఏం మాట్లాడుతండ్లో తెల్వట్లే. అందరూ మాట్లాడుతండ్లు.

అప్పుడు సెంద్రెయ్య లేచిండు. యెహే అందరూ జర సైసుండ్లి. ఎవలూ మాట్లాడొద్దు. సర్పంచి సాబు, యిటు యినుండ్లి జరా. పర్శరాములు మంత్రాలు చేసిండని లింగారెడ్డి అంటండు. చెయ్యలేదని నిరూపణ అయితే పాబంది యేందో చెప్పాలే అన్నడు. ఏమంటవు పటేలా? అని అడిగిండు సర్పంచి. చేసిండని రుజువైతే యేందో కూడా చెప్పాలే అని లింగారెడ్డి ఉల్టా అడిగిండు. నేను ఈణ్ణే మీ అందరి ముందట్నే నిప్పుల గుండంలో దూకి సత్తా అన్నడు పర్శరాములు. ఇంకా అన్నడు కదా,  మరి చెయ్యలేదని తేలితే యేంజేత్తడో అడుగుండ్లి ఆణ్ణి అన్నడు పర్శరాములు. నేను వూరిడిసి యెళ్లిపోతా అన్నడు లింగారెడ్డి.

వూరిడిసి పోవుడేందయా అన్నడు తమ్మడపల్లి బక్కయ్య. అదొక పాబందా? చెయ్యలేదని తేలితే యాభైయేల జురుమానా కట్టాలే అన్నడు. కట్టుబడితేనే పంచాతీ లేకపోతే యేం చేస్తరో మేమూ సూత్తము అన్నడు.

అప్పుడు కోళ్ల నారాయణ లేచి యిగో యిట్లా అయితే పంచాతీ తేలదు. కాగితం రాద్దాం. ఆ కాగితంలో రాసిందానికి కట్టుబడి వుండాలే. పెద్ద మనుషులు ఎట్లా చెప్తే, అట్లా యిద్దరూ వినాలే అన్నడు. కోళ్ల నారాయణ మల్లంపల్లిలో కారోబారిగా పని చేస్తండు. వూళ్లే పెద్ద మనిషి. జిలుకర యెంకటయ్యకు కాయిష్ దోస్త్. యిద్దరు బావా బావా అని పిలుసుకుంటరు. కోలుకొండ పెద్ద మనుషులు కూడా అట్టనే చేద్దాం అన్నరు. ఒక కాగితం రాసిండు కోళ్ల నారాయణ. యిద్దరి చేత అంగుటీ ముద్రలు వేయించిండ్లు.

చెయ్యలేదని ఎట్లా నిరూపిత్తరో ఎవలికీ అర్థమైతలేదు.

అప్పుడు యెంకటయ్య లేచి ‘‘లింగారెడ్డి, మీ కోళ్లు సచ్చిపోయినయి. పర్శరాములు మంత్రాలు చేసి చంపిండు అంటన్నవా?’’ అన్నడు. అవును అన్నడు లింగారెడ్డి.

‘‘ఎన్ని కోళ్లు సచ్చిపోయినయి?’’

‘‘అయిదు’’

‘‘మీకెంత మంది జీతగాళ్లున్నరు?’’

‘‘అయిదుగురు’’ అనగానే అందరూ నవ్విండ్లు. జీతగాళ్లు అయిదుగురే. సచ్చిన కోళ్లు కూడా అయిదేనా అని యెవరో గట్టిగా నవ్విండ్లు.

వాళ్లలో యిక్కడ యెవరన్నా వున్నరా? అనగానే నేను వున్నా అని ఒక జీతగాడు ముందుకొచ్చిండు. ‘‘యేం పేరు నీది?’’ లచ్చయ్య అన్నడు.

‘‘లచ్చయ్య, మీ పటేలు కోళ్లు సచ్చిపోయినయటా. నువ్వు వాటిని చూసినవా?’’ అని ప్రశ్నించిండు యెంకటయ్య.

‘‘చూడలేదయ్యా’’ అన్నడు అతడు.

‘‘మీ పటేలు కోళ్లను యెవరు గూట్లెకు తోలుతరు?’’

నేనే తోలుతా అన్నడు.

‘‘రోజూ వాటిని లెక్కపెడుతవా?‘‘

‘‘పెడుతానయ్యా’’

‘‘నెలకింద యెన్ని వున్నయి?’’

‘‘పది వున్నయి’’

‘‘యిప్పుడు?’’

‘‘పది వున్నయి’’

‘‘మరి మీ యజమాని అయిదు సచ్చిపోయినయి అంటండు’’

‘‘యేమో నాకు తెల్వదు’’ అన్నడు.

‘‘నిజంగా కోళ్లు యెన్ని వున్నయో లెక్కపెట్టడానికి ఒక ఇద్దరు పెద్ద మనుషులు బిర్రున పటేలు పెరట్లోకి పోండ్లి’’ అని కోళ్ల నారాయణ ఓ ఇద్దరిని పురమాయించిండు. వాళ్లు వొచ్చి పది వున్నయి అన్నరు.

మళ్లీ యెంకటయ్య లింగారెడ్డిని అడిగిండు. ‘‘మీ గొడ్లు చనిపోయినయా?’’

‘‘ఎన్నిసార్లు చెప్పాలే’’ అన్నడు లింగారెడ్డి. ‘‘అవి సచ్చిపోయినప్పుడు యెవరనన్నా పిలిపించి వాటిని చూపించినవా’’ అని ప్రశ్నించిండు. ‘‘నాగొడ్లు సచ్చినేను బాధలుంటే. యెవనికో పిలిచి యెట్లా చూపిత్తరయా? అదేమన్నా పెళ్లా పేరంటమా?’’ తిక్కగా మాట్లాడిండు.

‘‘యిది పంచాతీ. యింతమంది పెద్ద మనుషులున్నరు. సుట్టు నలభై వూళ్ల నుంచి వొచ్చిండ్లు. పనిలేక వొచ్చిండనుకుంటన్నవా? అడిగిందానికి సమాధానం చెప్పు’’ అని గద్దించిండు. లింగారెడ్డి బిక్కమొహం యేషిండు.

‘‘సచ్చిన గొడ్లను యేం చేసినవు? సచ్చిన గొడ్లను మాదిగలకు యియ్యాలే. కోలుకొండ మాదిగోలున్నరా యిక్కడ?’’ అనగానే వున్నం వున్నం అన్నరు. మాకియ్యలేదు. మేము తీస్కపోలే. పటేలు మాత్రం అయిదు గొడ్లు సచ్చినయి అన్నడు. మాకిస్తే మేము అబద్దం చెప్తమా? అన్నరు. అందరూ నిజమే. మేము కూడా చూడలే. సచ్చినయి అంటే అవునా అనుకున్నం గానీ నిజంగా మరి యెవరినన్నా తీస్కపోయి సూపియ్యాలే గా అన్నడు సర్పంచి యాకయ్య.

‘‘నిజంగా మీకెన్ని ఆవులున్నయి? యెన్ని యెద్దులున్నయి?’’ అని అడిగిండు యెంకటయ్య.

లింగారెడ్డి నోరిప్పలే.

మళ్లీ జీతగాణ్ణి అడిగిండు. ‘‘నిజంగా గొడ్లు యెన్ని సచ్చిపోయినయి?’’

‘‘నాకు తెలిసి యేమీ సచ్చిపోలేదు. వున్నయి వున్నట్టే వున్నయి. మొత్తం ఏడు ఆవులు. అయిదు జతల యెద్దులున్నయి. మూడు కోల్యాగలున్నయి’’ అని లెక్క చెప్పిండు జీతగాడు.

సెంద్రెయ్యకు పంచాతీ తెగిపోయిందని అర్థమైంది. సోమయ్య మీసం వొడితిప్పుతనే వున్నడు. తమ్ముడు యెంకటయ్య లాయరు లెక్క యేసే ప్రశ్నలకు లింగారెడ్డి రంగు బయటపడ్డదని సంతోషమేసింది సెంద్రెయ్యకు. తన వెనుక నిలబడ్డ వాళ్లను జరిపి పక్కకు వొచ్చిండు. బొట్టు సోమనాధంను పిలిచిండు. ‘‘తమ్మీ నేను లింగారెడ్డిగాణ్ని యిత్తుపలుగ గొడుతా. నువ్వు బిర్రున పొయి వాని పెళ్లానికి చెప్పాలే. నీ మొగణ్ణి ఎవరో పొట్టుపొట్టు కొడుతండ్లు అని చెప్పు అని అతణ్ణి తరిమిండు.

సరే అన్నా అని బొట్టు సోమనాధం వురికి లింగారెడ్డి పెళ్లానికి చెప్పనే చెప్పిండు. ఆమె గడగడా వొణుకుతా వురుకొచ్చింది.

‘‘మీ తాడు దెంపో. నా మొగణ్ణి కొడుతార్రా లంజకొడుకుల్లారా’’ అని తిట్టుకుంటా పంచాతీలోకి సివంగిలెక్క వురుకొచ్చింది.

సర్పంచి యాకయ్యకు మొత్తం అర్థమైంది. ‘‘యేమయ్యా లింగారెడ్డి. మీ ఆడామెకు కాళ్లు లేత్తలేవు. పడిపోయినయి అన్నవు. యిప్పుడేమో ఆడపులిలెక్క వురుకొచ్చి మీదపడుతంది? యేంది కతా?’’ అన్నడు. తల నేలకేసిండు లింగారెడ్డి.

యిగనైనా అర్థమైందా మీ అందరికీ? తనను యింటికి పిలిస్తే రాలేదని కోపంతోటి, బురుదల నూకేసిండనే కోపంతోటి లింగారెడ్డి చేసిన కత యిది. పర్శరాములు మంత్రాలు చెయ్యలేదని రుజువైంది. అసలు సైన్సు బాగా పెరుగుతన్న ఈ కాలంల యింకా మూఢనమ్మకాలేంది? అన్యాలంగా పర్శరాములును బలితీద్దామనుకున్నడు లింగారెడ్డి. ఆయన చేసిన తప్పుకు గట్టి జురుమానా వేయాలే’’ అన్నడు యెంకటయ్య.

లింగారెడ్డిది తప్పని తేలిపోయింది. వూరి జనాలంతా కాపోడు తాకట్లమారోడు. అబద్దాలు ఆడిండు. ఉత్త పుణ్యానికి పర్శరాములును కష్టపెట్టిండు అని తిట్టుకుండ్లు. పర్శరాములు భార్య సుగుణమ్మ సాడు కండలు అని బూతులతో కడిగేసింది.

సెంద్రెయ్య లేచిండు. లింగారెడ్డి కాడ్కి పోయిండు. ‘‘పర్శరాములు కాబట్టి నిన్ను బురుదల నూకేసిండు. అదే నేనైతేనా, నీకు పులుసు కారేది? మంత్రాల పేరు మీద మనిషిని సంపే కుట్ర సేత్తావురా’’ అని గల్లాపట్టి గుంజిండు.

కోపంతోటీ, దుక్కంతోటి అప్పటిదాకా కుమిలిపోతున్న పర్శరాములు చెప్పుతీస్కోని లింగారెడ్డిని మయ్యమయ్య దంచిండు. లింగారెడ్డి భార్య అడ్డమొచ్చింది. యింకా సూత్తన్న పెద్ద మనుషులు అడ్డమొచ్చిండ్లు. పెద్ద గలాటా జరిగింది. సుట్టూ నలభై వూళ్ల నుంచి వొచ్చినోళ్లు ఆకలితో వున్నరు. వాళ్లు కొట్టలేదు గానీ, పటేలును అమ్మనా బూతులు తిట్టిండ్లు. ఎవరు నూకేసిండ్లో తెల్వదుగానీ మల్లా లింగారెడ్డి బురుద గుంటల పడ్డడు. ఒళ్లంతా రొచ్చురొచ్చు అయ్యింది. మాగయ్యింది నీకు అన్నట్టు చూసిండ్లు ఆడోళ్లు మొగోళ్లు. ఇప్పుడు తనలో అపరాధ భావం తప్పా ఆవేశం లేదు. సత్తువలేని ముసలి యెద్దులా జావగారిపోయిండు లింగారెడ్డి.

అందరి కోపం సల్లారినంక సెంద్రెయ్య వూరి జనాలతోటి అన్నడు. “వూరన్నంక అన్ని కులాలు వుంటయి. బైండ్లోడు వూరికి అదృష్టం. మీకు మంచి చేసేటోడే గానీ కీడు చేసేటోడు కాదు. మంత్రాలు తంత్రాలు యేవీ వుండవు. మీ అనుమానంతోటి మనుషుల సంపకుండ్లి. యింకెప్పుడన్నా మా పర్శరాములు తెరువు వొచ్చినట్టు నాకు తెలిస్తే సాలు, మా తమ్ముని లెక్క మాటలుండవు. పగుల చీరి అటో సప్ప, యిటో సప్పా ఆరేత్తా” అన్నడు. సోమయ్య నవ్వుకుంటా నీ తన్నుడు గుద్దుడు కత మారదానే అన్నడు. నువ్వు సైసురా దున్నపోతా. సల్ల మాటలు సెప్తే ఎక్కుతాదిరా? దెబ్బకు దయ్యమే దెంకపోతదని నువ్వంటవుగా. మరి దాని కతేంది. వీళ్లద్దరి మాటలు చూసి అంతా నవ్వుకుంటండ్లు.

వూరి జనాలంతా తప్పంతా పటేలుదే. కులం పెద్దదైతే చాలా? గుణం పెద్దగుండాలే. యిట్లాంటి గాయిది పనులు సేత్తే యెవడు విలువిత్తడు. నీ వల్లా వూరి ఇజ్జతి పోయింది అని సర్పంచి యాకయ్య తిట్టుకుంటా లేచిపోయిండు. కోళ్ల నారాయణ సర్పంచిని ఎన్కకు పిలిచిండు. యాభై వేలు దండుగను నువ్వే లింగారెడ్డి నుంచి వసూలు చెయ్యాలే అన్నడు. సరే అని ఆయన ఒప్పుకున్నడు.

పర్శరాములు హాయిగా వూపిరి పీల్చుకున్నడు. తన ప్రాణాలు కాపాడ్డానికి అంతమందిని యెంకటయ్య అట్లా తీసుకొత్తడని తను వూహించలేదు. యెంకటయ్యను పట్టుకొని సంతోషంతో కంటనీరు పెట్టుకున్నడు. సెంద్రెయ్యను కావలించుకున్నడు. సోమయ్యను వాటేసుకున్నడు. యియ్యాల యింటికాడ వుండి రేపొద్దున్నే పోండ్లి బావా అన్నడు. యెంకటయ్య లేదు పిలగా. పొద్దున్నే గొల్లోల్ల పొలాలు పంచుకుంటంటా. నేనే కొలిచి పంచాలే. మేము పోతం. మళ్లా యేదన్నా పండుగకు వొత్తములే అని బయల్దేరిండు యెంకటయ్య.

సుట్టూ నలభై వూళ్ల నుంచి వొచ్చినోళ్లందరికీ కోలుకొండ తాళ్లల్ల కల్లు దాపిండు పర్శరాములు. ఆ రాత్రి తన యింటికాడే చాలా మందిని వుంచుకొని కోళ్లను కోసి మంచి బువ్వ పెట్టిండు. సెంద్రెయ్య అన్నల్దమ్ములు మాత్రం రాత్రి గొట్టంగ యింటికి చేరుకున్నరు. యింత తిని అలిసిన పాణాలను నిద్ర పుచ్చిండ్లు.

మళ్లీ తెల్లారక ముందే యెవరో పిలుస్తున్నరు.

‘‘ఓ సోమన్నా, జర లేవే. తేలుకుట్టింది. నా పెళ్లాం గడగడ వొణుకుతందే’’ అని గట్టిగట్టిగా పిలుస్తండు చాకలోళ్ల ఈరయ్య.

*

జిలుకర శ్రీనివాస్

5 comments

Leave a Reply to Jilukara sreenivas Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యాభై ఏళ్ల కిందటి తెలంగాణ పల్లె జీవన చిత్రాన్ని, బైండ్ల కుల కోణంలో చూపిస్తూ…మంచి కథలు రాస్తున్నారు జిలుకర సార్.
    మంత్రగాళ్ళు అనే ఆరోపణతో ఎందరు అమాయకులు బలైపోయారో…?
    వాళ్ళకి సెంద్రయ్య లాంటి చుట్టం ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

  • రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా ‘వైదోనివంపు’ గ్రామం లో మంత్రాల నెపంతో గ్రామ పెద్దరాయుళ్ల పంచాయితీ – 16 లక్షల జరిమానాతో అవమానం భరించలేక ఆ కుటుంబ పెద్ద ఆత్మహత్య .. ఇదీ వార్త. దీనికి కొద్దిరోజుల ముందే శ్రీనివాస్ ‘బురుదగుంట’ కథ ఈ బ్లాక్ మాజిక్ విలనిజాన్ని మనకు చూపించింది. ఈ వ్యవస్థలో దోపిడీ దౌర్జన్యాలు ఆర్థిక కుల పరంగానే జరుగుతాయి.ఈ రెంటినీ ఒకే కథలో సబాల్ట్రన్ దృక్పథంతో శ్రీనివాస్ దృశ్యమానం చేసాడు. బైండ్ల కులవృత్తిగా కొనసాగుతున్న వైద్యం ఒక నమ్మిక. అయితే దాన్ని చేతబడిగా చూపి చేసే దాడులని సెంద్రయ్య సామూహిక చైతన్యం ద్వారా ఎలా బట్టబయలు చేసాడన్నదే ఈ కథ. నిందలతోపాటు వాళ్లకున్న సెంటో కుంటో భూమిని గుంజుకొనే కుట్రలు కూడా కొత్త కాదు. తన ఎరుకలోకి వచ్చిన వీటన్నిటినీ రాస్తున్న శ్రీనివాస్ సాహితీ కృషి ప్రశంసనీయం. చదివించే కథన శిల్పం ఈ కథలకున్న మరో ప్రత్యేకత.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు