బుద్ధుడిని చూడాలని ఆశ –
చిన్నప్పుడెప్పుడో మొదలైంది
వయస్సు వెంబడి హెచ్చింది
చాన్నాళ్ళుగా వీలు చిక్కలేదు గానీ
ఒకానొక చాలీచాలని విరామాన్ని
కాస్తంత పొడిగించుకుంటే కుదిరింది
చెయ్యి చాచి పిలిచింది
శాలిహుండం కొండ
ఊహల సైన్యాన్ని వెంటేసుకుని
దమ్మపథాన్ని వెదుకుతూ వెళ్లాను!
ముణకాల కర్ర ఊతంతో
శ్వేతగిరి చిగురుకెక్కిన
సొమ్ముల కాపరొకడు
వేణుగానం లాంటి గొంతుతో
రమ్మని పిలిచాడు
పైకి వెళ్ళి చూద్దును కదా!
పిట్టల చెవిలో పాటల్ని ఊది ఊది
ఆ పిల్లాడు చేజార్చుకున్న పిల్నగర్ర
వంశధార నదిలో వరద నురగల బండెక్కి
జలధి గుహలోకి జారిపోయింది
అందుకేనేమో కళింగతీరంలో
నిత్యం హోరు సంగీతం!
ఒండ నుండి క్రూరంగా లేచివచ్చిన
నామాల పులి
గాండ్రించి పైన పడగానే
పట్టుతప్పి కిందపడిన పిల్లాడు కూడా
అలలరాళ్ల కింద మునిగిపోయాడు
అందుకేనేమో ఇప్పటికీ దేశమంతా
మనువొదిలిన పులి జాడల బీభత్సం!
పిల్నగర్రను చేజార్చుకున్న పిల్లాడు
పిల్లాడిని చేజార్చుకున్న ఆ వరికొండ
పదే పదే గుర్తుకొస్తున్నాయి –
చిగురు వరకూ నానిన గడ్డికుప్పలా
వనిత మండలం మునిగి
బూరవెల్లి మునిగి
ఒడ్లు దాటి వరద లొచ్చినపుడు
పొంగు తీసేంత వరకూ బోరుమని
ఏరూ ఊరూ ఏకమై ఏడ్చినట్టు
కొండమీద కొన్ని గంటలపాటు
కొండ దిగినాక కొన్ని రోజులపాటు
నాలో నేను కురుస్తూనే ఉన్నాను
మీరు కూడా ఓసారటు వెళ్ళండి
గాంధారి కళ్ళతో సూర్యుడు కనిపిస్తాడు
నిరాళంగా బిక్షువులు నడయాడిన జాడల్లో
భైరాగి తత్వాలేవో వినిపిస్తాయి
చిన్న గుడిసంత మన ఆయువు కోసం
పెద్ద ఆరామమంత ఆవాసం
ఈ నేల మీద ఎప్పటినుండో
సిద్ధమై ఉన్నట్టు తెలిసివస్తుంది
ఏమో బుద్ధుడు మీ చెవిలో
ఈ తరం కోసమని కొత్తగా
ఏదైనా తత్వరహస్యం చెప్పొచ్చు
ఇంత విశాలమైన నేలకు
సామరస్యాన్ని కానుక చేస్తూ
జ్ఞానదంతం నుండి చిన్న ధాతువొకటి తీసి
ఇప్పుడు దేశాన్ని గడబిడ చేస్తున్న
గోవురంగు పులి గుండెలు చీల్చే
ఒక ఆయుధాన్ని మీ చేతికివ్వొచ్చు
“బుద్ధం శరణం గచ్ఛామి”
ఎప్పటికీ ప్రాసంగిక శాంతి మంత్రమేనని
జ్ఞానోదయం కలగొచ్చు.
*
Add comment