1
కొన్ని విషయాలు అందరికీ అర్థం అయ్యే అవకాశం లేదు.
జీవితంలో పేదరికాన్ని గానీ, న్యూనతను గానీ, అవమానాన్ని గానీ, సుదీర్ఘమైన పరాజయాల పరంపరను గానీ లేదా వీటన్నిటిని కలిపి ఒక్కటిగా గానీ అనుభవించిన వారికే కొన్ని విషయాలు అర్థం అవుతాయి.
2
అతడు బుద్ధుడి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. తన జీవితం తెగిన గాలిపటంలా ఉండేదని, బుద్ధుడి రచనలు చదవడం మొదలుపెట్టాక తనకు శాంతి లభించిందని చెప్పాడు. బౌద్ధ రచనలు చదవమని నాకు చెప్పాడు. నేనూ కొంత బౌద్ధ సాహిత్యం చదివానని చెప్పాను. అతడు ఉత్సాహంగా కొన్ని ప్రశ్నలు వేశాడు- బుద్ధుని గురించి, బౌద్ధం గురించి. అలా మా సంభాషణ కొనసాగింది. ముఖ్యంగా అతడు అహింస ప్రాధాన్యతను వివరించాడు. ఎంతో ఉద్వేగంగా అతడు చెప్పుకుంటూ పోతున్నాడు.
అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న, విశ్రమించే భంగిమలోని బుద్ధుని చూడమని చెప్పాడు. అది బుద్ధుడు పరినిర్వాణం పొందిన చోటని చెప్పాడు. తప్పకుండా చూస్తానని నేను అతనితో చెప్పాను. థాయ్ లాండ్ లోని The Reclining Buddha statue ని చూశానని, అది ప్రపంచంలోనే అతి పెద్ద విశ్రమించే బుద్ధుని విగ్రహమని చెప్పాను. ఈ మాట చెప్పాక అతడు హఠాత్తుగా నాతో మాట్లాడడం ఆపేశాడు. సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
అంత సుదీర్ఘంగా సాగిన మా సంభాషణను మధ్యలో ఆపేసి అతడు ఎందుకు వెళ్లిపోయాడో నాకు అర్థం కాలేదు. అప్పటి నుండి నాకు కనిపించకుండా తప్పించుకునేవాడు. నేను పలకరించినా దూరంగా వెళ్ళిపోయేవాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసే వాడు కాదు.
అతని వయసు 55 ఏళ్ళు ఉంటాయి. అతని వస్త్రధారణ ఎంతో హుందాగా ఉంది. అతడు ఆ గెస్ట్ హౌస్ లో ఎంతో ప్రాముఖ్యత గల స్థానంలో ఉన్నాడని అనిపించింది. బౌద్ధానికి సంబంధించి అతని పరిజ్ఞానం, పదాలను ఉచ్ఛరించే విధానం, భావాలను అనుభూతితో వ్యక్తం చేసే తీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి.
3
ఆ రోజు ఖుషి నగర్ చేరుకునేసరికి అర్థరాత్రి అయ్యింది. ఉత్తర ప్రదేశ్ టూరిజం గెస్ట్ హౌస్ లోకి వెళ్ళగానే ఒక వింత లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ చోటంతా European cathedrals మాదిరిగా గోడల నిండా, పైకప్పు నిండా బుద్ధుని జీవితంలోని కీలకమైన ఘట్టాలకు సంబంధించిన కుడ్య చిత్రాలు కనిపించాయి. అప్పుడే ఆయన పలకరింపుగా నా వంక చూసి నవ్వడం గమనించి నేను కూడా నవ్వాను. మరుసటి రోజు ఉదయం మా నడుమ ఈ సంభాషణ జరిగింది. కాని అది అర్ధాంతరంగా ముగిసిపోయింది. దానికి కారణం ఏమిటో నాకు తెలియలేదు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని సంభాషణను గుర్తుకు తెచ్చుకొని పునఃపరిశీలన చేసుకున్నాను. అటువంటిదేమీ జరిగినట్టుగా అనిపించలేదు.
4
రెండవ రోజు ఉదయం check out చేసి నా బ్యాగ్స్ ని కారు దగ్గరికి తీసుకొస్తూ ఉంటే కొందరు బాయ్స్ సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. “పర్వాలేదు, నేను తీసుకువెళతాను” అని వారికి నవ్వుతూ చెప్పాను.
కారు బయలుదేరే సమయంలో బాయ్స్ ఆత్మీయంగా నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. ముందుకు వెళ్ళిపోతున్న కారును ఆపమని డ్రైవర్ కి చెప్పి 100 రూపాయల నోటు తీసి వారికి ఇవ్వబోయాను. ఆ గుంపులోంచి ఒకాయన పరిగెత్తుకుని ముందుకు వచ్చి నోటు తీసుకుని, వినమ్రంగా నాకు నమస్కరిస్తూ కొన్ని అడుగులు వెనక్కి వేసి నిలబడ్డాడు. కానీ నా కళ్ళలోకి చూసే ధైర్యం చేయలేదు.
అప్పుడు అర్థమయింది, సంభాషణను మధ్యలో ఆపేసి అతడు ఎందుకు వెళ్ళిపోయాడో, ఎందుకు నాకు కనిపించకుండా తప్పించుకునేవాడో, ఎందుకు నేను పలకరించినా బెరుకుగా దూరంగా వెళ్ళిపోయేవాడో, కళ్ళలో కళ్ళు పెట్టి చూసేందుకు ఎందుకు ధైర్యం చేసేవాడు కాదో.
అతడు భయపడ్డాడు. విదేశానికి వెళ్ళాను కాబట్టి నేను ధనవంతుడినని అతడు భావించాడు. అప్పటి నుండి నాతో మాట్లాడడానికి జంకేవాడు. తాను అంత ఆత్మవిశ్వాసంతో నాతో మాట్లాడే చొరవచేసి అపరాధం చేసినట్టుగా తలచాడు. తనలో తాను ముడుచుకుపోయాడు.
డబ్బు ఎంతలా మనుషుల్ని విడగొడుతుంది! మనుషుల్ని మనుషులుగా జీవించనీయదు. ప్రతిస్పందించనీయదు. ధనాన్ని కలిగి ఉండడం ఏ విధంగా గొప్ప? దానిని ఎవరైనా కలిగి ఉండవచ్చు, ఎంతటి మూర్ఖుడైనా. మనం సృష్టించుకున్న హోదాలు, ఆర్థిక అంతరాలు మనుషుల్ని ఎంత క్రూరంగా విడగొడతాయి! సమాజాల్లో ఇవన్నీ పాతుకుపోయి ఉన్నాయి. తమ కంటే ఎక్కువ ధనవంతునితో, పెద్ద హోదాలో ఉన్న వారితో స్వేచ్ఛగా మనసు విప్పి మాట్లాడడానికి ఎవరైనా భయపడతారు. అయితే పేదవారిలో ఆ న్యూనత చాలా బలీయంగా ఉంటుంది. సామాజిక నమూనా ఎంత లోపభూయిష్టంగాను, క్రూరంగాను ఉంటుంది!
ఆర్ధిక అంతరాలు మనుషుల మధ్య అదృశ్య కుడ్యాలను నిర్మిస్తాయి. ఒకరి హృదయంలోని భావాలను మరొకరితో పంచుకోవడానికి అవి అనుమతించవు. అవి అభిజాత్యం, న్యూనతలను సృష్టిస్తాయి. మనిషిని మనిషితో మనిషిగా కలవనివ్వవు.
సాధారణంగా దోస్తోవిస్కీ నవలల్లో ఇటువంటి పాత్రలను మనం చూస్తాం. ఈయన పేద జనం నవలలోని మకార్ దేవుష్కిన్ కాక మరెవరు?
5
కారు బీహార్ మీదుగా వెళుతోంది. ఇక్కడ రోజుకు సుమారు 20 పరువు హత్యలు జరుగుతాయని నేను చదివిన విషయం గుర్తుకు వచ్చింది. ఒక దుఃఖం హృదయంలో నుంచి పెల్లుబికింది. ఎందుకంటే అంతరాలను విస్మరించగల స్వచ్ఛత కేవలం యువ ప్రేమికుల హృదయాల్లో మాత్రమే ఉంటుంది. ఆ గొప్ప గుణాన్ని సమాజం క్రూరంగా అణిచివేస్తుంది.
సమాజం ప్రేమను ద్వేషిస్తుంది. ద్వేషాన్ని ప్రేమిస్తుంది.
6
ఏదేమైనాప్పటికీ, ఈ వ్యాసాన్ని సంతోషంగా ముగించాలనుకుంటున్నాను. నాకు అలా అనిపిస్తోంది.
ఖుషి నగర్ నుండి బయలుదేరడానికి గంట ముందు నేను తోటలో ప్రశాంతంగా తిరుగుతున్నాను. లక్నో నుండి వచ్చిన ఐదేళ్ళ చిన్నారి నన్ను పిలిచి తను ఎక్కిన ఉయ్యాలను ఊపమని ఆదేశించింది. నేను ఉయ్యాలను ఊపడం ప్రారంభించాను. వేగం సరిపోలేదు అని చెప్పింది. వేగం పెంచాను. ఉయ్యాల ఎత్తుకు వెళ్ళడం లేదు అని ఫిర్యాదు చేసింది. కాస్త ఎత్తుకు వెళ్ళేలా ఉయ్యాలను ఊపాను. తన కాళ్ళు చెట్టు కొమ్మలకు తగలాలని చెప్పింది. నాకు ధైర్యం చాలలేదు.
“అంత ఎత్తు వరకు ఉయ్యాలను ఊపితే నువ్వు పడిపోతావు. మీ నాన్నగారు నన్ను తిడతారు” అని చెప్పాను.
“నాన్నగారి సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు ఉయ్యాల ఊపండి. నా కాళ్ళు చెట్టు మీద ఉన్న మామిడి పండ్లకు తగలాలి” అని హెచ్చరించింది.
*
చాలా బాగుంది