బుడి బుడి అడుగుల నుండి పాతికేళ్ళ పండుగ వరకూ…

డీటీఎల్సీ పాతికేళ్ళ పండగ వ్యాస పరంపర-2

నేను అమెరికా వచ్చిన మొదటి పన్నెండేళ్ళూ నాకు తెలుగు సాహిత్యం విషయంలో చాలా ఒంటరితనం ఉండేది.  ఒకవైపు చదువు, వృత్తిలో ఎదగటం, ఇంకో వైపు పరాయిదేశంలో కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకోవడంలో ఉండే బాధ్యతల వల్ల సమయం తక్కువ ఉండేది. సమయం దొరికినప్పుడు, సాహిత్యం గురించి మాట్లాడుకునే మనుషుల కరువు ఉండేది. నేనొచ్చిన కొంతకాలానికే తెలుగు అమెరికా పత్రిక మూతపడింది. తానా పత్రిక వంటి సంస్థాగత పత్రికలు ప్రాథమిక దశలో ఉండేవి. ఇండియానుంచి పత్రికలు, పుస్తకాలు తెచ్చుకోవటం, తెప్పించుకోవటం చాలా కష్టంగా ఉండెది.

1993లో నేను వృత్తిరీత్యా చికాగో నుంచి ఒహాయో రాష్ట్రంలోని డేటన్ నగరానికి మారాను. ఉద్యోగమూ, నివాసమూ మారటం వల్ల తీరిక సమయం కొద్దిగా పెరిగింది. అదే సమయంలో, తానా అధ్యక్షుడు డా. నరసరాజు, తానాపత్రిక సంపాదకుడు డా. రామరాజ భూషణుడు కోరటంతో తానా పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరాను. అప్పుడే ఇంటర్నెట్ అని ఒకటి ఉందని, ప్రపంచం అన్ని మూలల నించీ తెలుగు వారు పాల్గొనే స్కిట్ (SCIT – soc.culture. Indian.telugu) అనే ఒక వేదిక ఉందనీ, ఆ స్కిట్‌లో జరిగే చర్చలన్నీ ప్రతిరోజూ వరల్డ్ తెలుగు డైజెస్ట్ అనే పేర వచ్చే ఒక ఈమెయిల్‌లో చదువుకోవచ్చని తెలిసింది. నేను మొదటిసారి ఆ డైజెస్ట్ చూసినప్పుడు, దొంగల గుహలో ధనరాసులని చూసిన ఆలీబాబాలా అబ్బురపడ్డాను, సంబరపడ్డాను. తెలుగు సాహిత్యపు అనేక కోణాలపై అభిరుచి, ఆసక్తి, పరిజ్ఞానం కలిగిన అనేకమందిని ఆ వేదిక నాకు స్నేహితులను చేసింది. వీరందరినీ బతిమాలి, బుజ్జగించి, పీడించి తానాపత్రికకు కథలు, వ్యాసాలు రాయించుకునేవాణ్ణి.

1995-97ల మధ్య తెలుగు సాహిత్యం మీద ప్రేమ, ఆసక్తి కలిగిన అనేకమంది డెట్రాయిట్ చేరటం జరిగింది. సీనియర్ రచయిత్రి చెరుకూరి రమాదేవిగారు, డా.  ఉషారాజు, డా. హనుమయ్య, డా. కట్టా మూర్తి, డా. కోటంరాజు, డా. మద్దిపాటి కృష్ణారావు వంటి వారు అప్పటికే అక్కడ ఉన్నారు. అజోవిభో ఫౌండేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన విష్ణుభొట్ల రామన్న అక్కడే ఉండేవారు. ఇంటర్నెట్‌లోనూ ఇతరత్రానూ రచయితలుగా గుర్తింపు తెచ్చుకున్న డా. ఆరి సీతారామయ్య గారు, నాసీ అనబడే శంకగిరి నారాయణస్వామి ఫిలడెల్ఫియా నుంచి డెట్రాయిట్ వచ్చారు. న్యూజెర్సీ నుంచి కన్నెగంటి రామారావు కూడా డిట్రాయిట్ చేరారు.

సాహిత్యం గురించి కొంత లోతుగా మాట్లాడుకునే ఒక వాతావరణం డిట్రాయిట్‌లో ఏర్పడింది. వీరిలో చాలామందితో ప్రత్యక్షంగానూ, లేక ఇంటర్నెట్ ద్వారానూ నాకు పరిచయం ఉంది. డేటన్ నుంచి డెట్రాయిట్ కు గంటల కారు ప్రయాణం నాలుగు గంటలపాటే కాబట్టి నేనూ అరుణా చాలా వారాంతాలు డిట్రాయిట్ వెళ్ళి వీరితో కలిసి సాహిత్యమూ, సినిమాలూ, ఇతర కళల గురించి బోల్డు కబుర్లు చెప్పుకునే వారం. 1998 వరకూ ఈ కలయికలు ఎవరో ఒక మిత్రుల ఇంట్లో, ఇన్‌ఫార్మల్‌గా  జరిగేవి. 1998 జులైలో మధురాంతకం నరేంద్ర, ఎండ్లూరి సుధాకర్ వచ్చినప్పుడు ఆరి సీతారామయ్య గారి ఇంట్లో డిన్నర్‌కు కలవటం మంచి జ్ఞాపకం.

1998-99లో డా. చేకూరి రామారావు గారు డెట్రాయిట్ లో ఉన్న వారి పిల్లల దగ్గరకు వచ్చారు. వారితో సమావేశం నిర్వహించిన తర్వాతే డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ (డీటీఎల్సీ) ఆవిర్భవించిందని నా జ్ఞాపకం.  మొదట్లో ఈ సమావేశాలు ఇప్పటిలా ఉండేవి కాదు. సమావేశపు నిర్వహణ పనులు ఎక్కువగా (అన్నీ?) నాసీ చూసేవారు. ఎవరైనా సాహితీ ప్రముఖులు వస్తే వారితో సమావేశాలు ఏర్పాటు చేయటం, లేదా తమకు నచ్చిన విషయాల గురించి సభ్యులు మాట్లాడటం జరిగేది. నెమ్మదిగా ఈ సమావేశాలలో పాల్గొనే సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. ఒక బుక్ క్లబ్‌లాగా నిర్దుష్టమైన ప్రణాళికతో సమావేశాలు నడపటం 2000లో ప్రారంభమైందనుకుంటాను.  నవోదయా రామమోహనరావు గారు పుస్తకాల ఎన్నికలోనూ, సభ్యులందరికీ పుస్తకాలు అందించటంలోనూ సహకరించేవారు.

2003లో డేటన్ వదలి మళ్ళీ చికాగోకు తిరిగివచ్చే వరకూ, నేనూ అరుణా డీటీఎల్సీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారం (ఒక శీతాకాలంలో సమావేశం అయ్యాక డేటన్ వెళుతూ మంచుతుపానులో చిక్కుకుపోవటం గుర్తొస్తే ఇప్పటికీ వొళ్ళు జలదరిస్తుంది). చికాగో వెళ్ళాక మళ్ళీ ప్రత్యేక ఉత్సవాలకు తప్ప డీటీఎల్సీ సమావేశాలకు హాజరు కావటం కుదరలేదు.

స్వచ్ఛంద కార్యకర్తలు నడిపే ఏ సంస్థ ఐనా పాతికేళ్ళు పాటు నడవటం చెప్పుకోదగ్గ విషయమే. డీటీఎల్సీకి ముందూ, తర్వాతా అనేక తెలుగు నగరాలలో ఇలాంటి బుక్ క్లబ్్‌లు నిర్వహించే ప్రయత్నాలు చాలా జరిగాయి. బహు కొద్ది మాత్రమే నిలదొక్కుకున్నాయి. ఇతర కూటములేవీ చేయని చాలా పనులు – పుస్తకాలు ప్రచురించటం, తెలుగు గ్రంథాలయం నడపటం, పెద్ద సాహిత్య సమావేశాలను నిర్వహించి సాహిత్యప్రేమికులను ఒక్కచోట చేర్చటం వంటివి – చేయటంలో డీటీఎల్సీ విజయవంతమయ్యింది.  మిగతా సంస్థలకు ఆదర్శప్రాయమయ్యింది. సాహిత్యం పట్ల డీటీఎల్సీ సభ్యులకు ఉన్న మక్కువ, ఆర్థిక వనరులను అందిస్తున్న దాతల వితరణ ఒకరి తర్వాత ఒకరుగా సంస్థ బాధ్యతలను అందుకుని సంస్థని నడిపిస్తున్న కార్యకర్తల నిబద్ధత ఇందుకు కారణాలు.

బుడిబుడి అడుగులు వేస్తుండగా నేను చూసిన డీటీఎల్సీ ఇప్పుడు పాతికేళ్ళ తరుణ వయస్సుకు వచ్చి రజతోత్సవం చేసుకోవడం అభినందించాల్సిన విషయం. ఇది  నేను ఆనందపడుతున్న సందర్భం.   ఇలాటి వార్షికోత్సవాలు మరిన్ని జరగాలని, అమెరికా అంతటా ఇలాంటి సంస్థలు మరిన్ని ఏర్పడి ఎదగాలని, తెలుగుసాహిత్య ప్రేమికులకు ఒంటరితనం ఇక ఎప్పటికీ ఉండకూడదనీ నా ఆశ.

*

జంపాల చౌదరి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తొలి రోజుల్ని బాగా గుర్తు చేశారు.
    DTLC సమావేశాలలో casual కబుర్ల నించి కొంత ప్రణాళిక తో చర్చ నిర్వహిస్తే ఉపయోగం ఉంటుంది అనే దిశా నిర్దేశం చేరా చేశారు. కానీ అప్పటికే క్రమం తప్పకుండా సమావేశాలు దాదాపు ప్రతి నెలా జరుగుతూ ఉండేవి.
    సంవత్సరానికి ముందే పుస్తకాలు నిర్ణయించడం మొదలయ్యాక ఆ పుస్తకాలను సేకరించి అమెరికా కి అందజేయడం లో నవోదయ రామమోహనరావు గారిది కీలకమైన పాత్ర.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు