బిర్యాని

‘బిర్యాని’ కథ సంతోష్ ముఖచిత్రంతో ‘మాతృభూమి’ పత్రికలో వచ్చింది. రావడంతోనే గొప్ప సంచలనానికి తెరతీసింది.

మలయాళ మూలం: సంతోష్ ఏచ్చికానం

మలయాళ వర్ధమాన కథకులలో ఒకరైన సంతోష్ ఏచ్చిక్కానం 1971లో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో జన్మించారు. మలయాళ భాషలో డిగ్రీతో పాటు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఉపాధ్యాయ వృత్తితో మొదలుపెట్టి, అటు కథారచయితగాను, మరోవైపు టీవీషోలకు, సినిమాల రచయితగానూ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు పని చేసి అందులో కొన్నింటికి కథ, మరికొన్నింటికి కథనం, మాటలు రాశారు. కథకుడిగా బిర్యాని, కొమాల(comala) కథలు ఆయనకు పేరు తెచ్చాయి. సినీరచయితగా ‘అన్నాయుమ్ రసూలుమ్, బ్యాచిలర్ పార్టీ’ సినిమాలు గుర్తింపునిచ్చాయి. తన కథలతో పుస్తకాలనూ వెలువరించారు. సాహిత్యరంగంలో ఆయన కృషికి కేరళ సాహిత్య అకాడెమీ పురస్కారంతోపాటు, మరెన్నో పురస్కారాలను అందుకున్నారు.

కథ గురించి..

సామాజిక వర్గ విభజనని చాలా గొప్పగా చిత్రించిన కథ ‘బిర్యాని’. ఒక కిలో బాస్మతీ బియ్యాన్ని కొనుక్కొని, వండుకు తినే స్థోమత లేని మనుషులు ఒక దిక్కు, ఆండాల కొద్దీ బిర్యానీని మట్టిపాలు చేసే మనుషులు మరో దిక్కు. ఇటువంటి రెండు వర్గాల మధ్య మనం బతుకుతున్నాం. బాస్మతీ బియ్యాన్ని కొనలేని ఓ వ్యక్తి తన కూతురికి ‘బాస్మతి’ అని పేరు పెట్టి సరిపుచ్చుకోవడం, ఆకలితో ఆమె కూడా మరణించిన విషయం మనకు తెలియడం ఈ కథలో విషాదం. ఓ శ్రామికుడికి పనికి తగ్గ వేతనం ఇచ్చేందుకు నిరాకరించినవారే, అండా నిండా బిర్యానిని ఉదాసీనంగా పారవేస్తారు. ఉన్నత వర్గాలవారు తమ విలసాలకు ఎంతైనా ఖర్చుపెడతారు కానీ,  నిరుపేదల శ్రమని గుర్తించే విషయంలో మాత్రం సంకుచితంగా వ్యవహరిస్తారని

రచయిత చెప్పకనే చెబుతాడు. ఈ అంశాలను తనదైన కథాశైలితో మనముందు ఉంచుతాడు. ఈ ‘బిర్యాని’ కథ సంతోష్ ముఖచిత్రంతో ‘మాతృభూమి’ పత్రికలో వచ్చింది. రావడంతోనే గొప్ప సంచలనానికి తెరతీసింది. అది ఏర్పరచిన సంచలనం అంత తేలికగా మర్చిపోలేము.

గోపాల్ యాదవ్ సెరుక్కాళ నుండి ఇప్పుడే బస్ ఎక్కాడు. వెంట కదిరేశన్, ముగ్గురు బెంగాలీ కుర్రోళ్ళు వస్తున్నారన్నది నిశ్చయమైంది.
బస్ నిప్పులా ముందుకు దూసుకువెళ్తున్నా, పొయినాచ్చిని చేరేందుకు కనీసం  ఇరవై నిముషాలైనా పడుతుంది.
అప్పటివరకు మనం కలందన్ హాజీయార్ గురించి మాట్లాడుకోవచ్చు.
గత జనవరిలో 86 ఏళ్ల వయసును అధిగమించిన హాజీయార్ ఆ కాలంలో తలంగర(కేరళలోని ఒక గ్రామం) నుండి దుబాయ్‌కి పడవను నడుపుకు వెళ్లిన బలశాలి.అతనికి జ్ఞాపకశక్తి నశించిందని చెప్పలేము. నలుగురు భార్యల్లో ఒకరైన కుంజీబీని మర్చిపోవడం జ్ఞాపకశక్తిని కోల్పోవడం కిందకు రాదు. హాజీయార్‌కి ఇంకా నలభై మంది భార్యలనైనా పోషించే సామర్థ్యం ఉందనేది ఊరివాళ్ల మాట.ఆ మాటల్లో న్యాయముంది.
హాజీయార్‌కి,ఆమీనాకి పుట్టిన బిడ్డ రుకియా. రుకియా కొడుకు రిజ్వాన్. అమెరికాలో కార్డియక్ సర్జన్. పోయిన వారమే బెంగళూరులో అతని పెళ్లి జరిగింది.
సొంతూరికి మనవణ్ని ఆహ్వానించి ఊరువాళ్లకు మంచి బిర్యాని పెట్టించాలన్నది హాజీయార్ ఆశ. అది నెరవేరకపోతే హాజీయార్ చనిపోయిన తరువాత మనసులో అది దిగులుగా మిగిలి పోతుందని ఉమ్మా చెప్పడంతో రిజ్వాన్ అంగీకరించాడు.ఈరోజు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య ఆహ్వానం.
ఇదిగో ఇదే కలందన్ హాజీయారుండే పెద్ద ఇల్లు. ఇల్లు కాదది రాజభవనం.
షామియానా టెంట్‌లను దాటి ఇంటి గుమ్మం దాకా రావడానికి చాలా దూరం నడవాలి.అది నాలుగు వేల మంది రాబోయే వేడుక.తెల్లని కాగితంతో మూసిన మేజాలు, కుర్చీలూ ఆ ప్రదేశాన్ని కొత్తగా చూపిస్తున్నాయి.విదేశాల నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అలంకరించిన సభ.విందు ముగిసి ఎన్ని రోజులు గడిచినా, ఊరి ప్రజలంతా ఆ విందు గురించి చెప్పకోవాలన్నది హాజీయార్‌ ఆశ.
హాజీయార్‌కు నమ్మకపాత్రుడు,రియల్ ఎస్టేట్ రంగంలో భాగస్వామి అయిన హసైనార్చ అమితానందంతో అటుఇటు కలియ తిరుగుతున్నాడు.ఉద్రిక్తతతో కూడిన అతడి నడక ఆ సాయంత్రం జరగబోయే కార్యక్రమాన్ని ముందుగానే సూచిస్తుంది.
హసైనార్చ మధ్యలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు రామచంద్రన్ నంబర్‌కి డయల్ చేస్తున్నాడు.
పొయినాచ్చి అనే ఆ గ్రామంలోని ఓ చిన్న వ్యాపారే రామచంద్రన్ పెరుంబళ.దినపత్రికలతో మొదలుపెట్టి, వార, మాస పత్రికలు,స్టేషనరీ, శరబత్, కిళ్ళీ లభ్యమయ్యే చిల్లర కొట్టు అతనిది. జాతీయ రహదారి అంచున ఉండటంతో వచ్చే పోయే జనాలకు కొదవ లేదు. అందువల్లే అందరూ అతణ్ని బాగా గుర్తుంచుకోగలరు.
ఇంటికి వెళ్లే ముందు తీసుకువెళ్లాల్సిన టార్చి లైటు, నెల చిట్టీ వసూళ్ల డబ్బులు, చేతిలో ఎప్పుడూ కొన్ని తపాలా కవర్లు, రెవెన్యూ స్టాంపులు అతని దగ్గర ఉంటాయి.ఎక్కడికి పోతున్నాం,ఎప్పుడు ఇంటికి తిరిగెళతాం అనే వివరాలు తన భార్యలకు కూడా చెప్పడతను.ఇతరుల రహస్యాలను తనలోనే దాచుకొని, డబ్బు మార్పిడి, వస్తుమార్పిడికిగాను శాఖోపశాఖలుగా తిరగాడే టవరే రామచంద్రన్ పెరుంబళ.
రామచంద్రన్ హసైనార్చ ఫోన్ తీయడం, షుక్రియా బస్ సరైన సమయానికి రావడం, రెండూ ఒకేసారి జరిగాయి.
ముందుగా కదిరేశన్, వెనుక ఆ బెంగాలీ కుర్రోళ్ళు, చివరిగా గోపాల్ యాదవ్ దిగారు.
బెంగాలీలు ముగ్గురూ రోడ్డు దాటొచ్చి నమస్కారం చేయగానే, రామచంద్రన్ వాళ్ల ముందు బాగా నలిపి కట్టిన మూడు గంజాయి పొట్లాలతో చేయి చాచాడు.అందులో ఒక దాన్ని విప్పి కొంత భాగం నాలుకపై పెట్టి,దాని ఘాటును రుచి చూసి, వాళ్లు వేలి చివరను అలాగే వాళ్ల జీన్స్ ప్యాంట్లకు తుడుచుకున్నారు. అప్పుడే వచ్చిన పికప్ వ్యాన్ నుండి ఒక దృఢమైన వ్యక్తి వారిని ఎక్కించుకొని వేగంగా తరలి వెళ్ళాడు.
ప్లంబింగ్ పని ఉందని నిన్న రాత్రి ఫోన్లో పిలిచిన తోమాచన్ కదిరేశన్‌ ముందు జీప్‌ని ఆపి హార్న్ కొట్టాడు. కదిరేశన్ అతనితో పాటు వెళ్లాక గోపాల్ యాదవ్ ఒంటరిగా నుంచున్నాడు. అతడి వీపు మీద చీలికలా పడ్డ పొద్దుటెండ పెద్దదవుతూ ఉంది.
రెండు సంవత్సరాలుగా గోపాల్ యాదవ్ కదిరేశన్ బావమరిదైన అన్నామలైతోనే ఉన్నాడు. అన్నామలైకు పని తగ్గడంతో శారీరక శ్రమ తప్ప వేరే ఏ పని తెలియని గోపాల్ యాదవ్‌కు వేరే ఆసరా లేకుండా పోయింది.ఆ పరిస్థితుల్లో అన్నామలై, కదిరేశన్ గురించి అతనికి చెప్పాడు.
నేరుగా సెరుక్కాళ వైపుగా బయలుదేరాడు గోపాల్. కాంజాడు వైపు వచ్చేటప్పుడు విద్యానగర్ దాటితే వచ్చే టౌనే సెరుక్కాళ. పనీపాటా లేకుండా ఈగలు కొట్టుకుంటూ కూర్చోవద్దు అని కదిరేశన్ గద్ధించాడు.
కదిరేశన్ ఒక గది ఇంటి వెనుక వైపున్న చెక్క బెంచి పైనే గోపాల్ యాదవ్ ఉంటున్నాడు.వర్షాకాలానికి ముందే వేరే ఎక్కడైనా రూమ్ చూసుకెళ్ళాలి. ఒక్క గదికే ఐదు వేలు అడుగుతున్నారు.
ఎవరైనా వచ్చేలోపల ఒక మీఠా పాన్ కొనుక్కొని నమలొచ్చని పక్కనున్న కిళ్ళీ కొట్టుకి వచ్చాడు గోపాల్.
“ఇదర్ నయా హై తుమ్?”
“హా.. భాయ్”
తమలపాకు మొనను గిల్లే లోపే రామచంద్రన్ అతణ్ని విచారించాడు.
“కిదర్ కా హై తుమ్”
“బీహార్”
“ఓ…ఆప్నా లాలూజిక్కా థేసేనా”
గోపాల్ యాదవ్ నవ్వాడు. అప్పుడు అతని కింద దవడలో మూడు పళ్లు  రాలిపోయి ఉండటాన్ని రామచంద్రన్ చూడటం మరువలేదు.
“తుమ్ కిత్నా సాల్ హోగయా ఇదర్?”
“సాత్”
గోపాల్ యాదవ్ మీఠా పాన్‌ను నోట్లో వేసుకొని నమలడం మొదలుపెట్టాడు.
“అభి తుమ్ మలయాళం సీకా?”
అతడు తమలపాకు రసాన్ని మింగుతూ ‘నేర్చుకున్నాను’ అన్నట్టు తలూపాడు.
“ఈ రోజు ఒక పని ఉంది. చేస్తావా?”
“చేస్తాను” అని గట్టిగా తలూపాడు.
ఉన్నఫళంగా కలందన్ హాజీయార్ ఇంట్లో పనికి ఒక మనిషి దొరుకుతాడా అని షుక్రియా బస్ వచ్చి నిలబడ్డప్పుడు హసైనార్చ ఫోన్లో అడిగాడు.
సున్నం అంటుకున్న వేలిని గుడ్డకి తుడుచుకుంటూ రామచంద్రన్ తన మొబైల్ తీసాడు. పనికి మనిషి దొరికాడని హసైనార్చకు చెప్పాడు.
ఎప్పటిలాగే, తన ట్రౌజర్ పాకెట్‌లో చేతిని పెట్టి తొడసందులో గోక్కుంటూనే రామచంద్రన్ కొట్టుకి వచ్చాడు హసైనార్చ. తన ముందు వినయంగా చేతులెత్తి నమస్కరించి నిలబడ్డ ఈ నడి వయస్సు వాణ్ణే రామచంద్రన్ ఏర్పాటు చేసిందని ఒక చూపులోనే అర్థమైంది.
“250 రూపాయలు ఇస్తాను, సరేనా?” అని గోపాల్ యాదవ్ ముఖం చూడకుండా అడిగాడు.
“సాబ్! 350 ఇవ్వండి సాబ్?”
“రేయ్! మలయాళీకి 600, తమిళోడికి 500, బెంగాలీ వాడికి 350, బీహారికి 250. ఇదే ఇక్కడి రేటు. నాలుగైదు గంటల పనే ఉంటుంది. గంటకు 50 రూపాయల పైన ఇవ్వడం కుదరదు. వస్తావా? లేదా? అది చెప్పు” హసైనార్చ ఒక విల్స్ తీసి వెలిగించాడు.
“ఏమిటి హసైనార్చ? విందు ఏర్పాట్లన్నీ భయంకరంగా జరుగుతున్నాయని విన్నాను. బిర్యాని చేసేందుకు హైదరాబాద్, అబుదాబిలో నుండి మనుషుల్ని తీసుకొచ్చారని మాట్లాడుకుంటున్నారు.” పక్కన నుంచున్న రామచంద్రన్ అడిగాడు.
“బిర్యాని మాత్రమే కాదురా! కుళి మండి(అరేబియన్ బిర్యాని) కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్న లోకల్ ఇఖంగా ఇంటి పెళ్లిలో పెట్టే బిర్యాని కాదు.నంబర్ వన్ బాస్మతి రైస్ ఒక లోడు పంజాబ్ నుండి దించాం.”
“ఒక లోడా?” రామచంద్రన్ నమ్మబుద్ది కాక అడిగాడు.
“నిన్న రాత్రే లారీ వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడ్డప్పుడు, రేయ్ రామచంద్రా! నువ్వు నమ్మవు. మల్లెపువ్వు పూసిన వాసన ఊరినే కమ్మేసింది. ఇప్పుడు కూడా ఆ వాసన నా ముక్కు నుండి పోలేదురా! అదే రా పంజాబ్ బాస్మతి”
వంద రూపాయలు ఎక్కువగా అడిగినా, 250కి బేరం తెగొట్టాక హసైనార్చ కారు వెనుక సీట్లో గోపాల్ యాదవ్ కూర్చున్నాడు.
పళ్లికరైకు చెందిన రోడ్డును చేరాక హసైనార్చ గోపాల్‌ని అడిగాడు.
“గోపాలా! నువ్వు బీహార్‌లో ఎక్కడున్నావ్?”
“లాల్‌మాటియా”
“అక్కడ ఏం పని?”
“నేలబొగ్గును ఎత్తడం”
గోపాల్ యాదవ్ లాల్‌మాటియాలోని రాజమహల్ బొగ్గు మైనింగ్ గురించి చెప్పుకుపోయాడు. సొరంగం తవ్వకాలు సగంలోనే వదిలేసి, కంపెనీ ఖాళీ చేసిన చోట్లో రెండో రకం నేలబొగ్గు చాలా మిగిలుంటుంది.చట్ట విరుద్ధమైనా, దాన్ని పట్టించుకోకుండా ఊరివాళ్లంతా దానిని ఎత్తుకు తీసుకెళ్తారు.బొగ్గు ఎత్తుకెళ్లేందుకు ఆడోళ్లే ఎక్కువమంది వెళ్తారు.గోపాల్ యాదవ్ మతాంగిని  అక్కడే కలిసాడు.
లాల్‌మాటియా నుండి 250 కిలోల నేలబొగ్గును ఎక్కించుకుని కొత్తా వరకు దాదాపు నలభై కిలోమీటర్లు సైకిల్ తోసుకుంటూ వెళ్ళాలి. కొన్ని సార్లయితే ఆ ప్రయాణం ఇంకా ఇరవై కిలో మీటర్లు దూరం దాటి పాంగా వరకు వెళ్ళాల్సి వస్తోంది.
“అన్నీ పోనూ రోజుకి 10 రూపాయలు మిగులుతుంది సాహిబ్”
“ఓరి దేవుడా! కేవలం పది రూపాయలా?”
“నూట యాభై దొరుకుతుంది.అందులో పోలీసులకి, రౌడీలకి ఇచ్చింది పోగా, సైకిల్ ట్యూబ్ మార్చి, బాల్ బేరింగ్ సరిచేసి చూస్తే, చేతిలో 10 రూపాయలే మిగులుతుంది సాబ్”
“ఆ నూటయాభైకి మరో వంద చేర్చి నా దగ్గర అడుగుతున్నావ్?” హసైనార్చ తన తలని వెనుకకు తిప్పి గోపాల్ యాదవ్‌ని కోపంగా చూసాడు.
“సరే! నువ్వు ఊరు వదిలొచ్చి ఎన్ని రోజులైంది?”
“15 ఏళ్ళు సాబ్”
“అప్పుడు పదంటే, ఇప్పుడు వంద అయ్యుంటుంది. అంతే! నేను 250 ఇస్తానంటే నీకు చాలటం లేదా?”
బండి నడిపేటప్పుడు మధ్యలో అతను తనలో తను మాట్లాడుకుంటూ వచ్చాడు. తన కష్టాలన్నింటిని ఈ మనిషి దగ్గర చెప్పకుండా ఉండాల్సిందని గోపాల్ యాదవ్ అనుకున్నాడు.
కొత్తా నుండి సగం రాత్రిలో సైకిల్‌ను తొక్కుకుంటూ ఇంటికి చేరే లోపల, తనకోసం ఎదురుచూస్తూ చివరికి మన్నును గుప్పెట తీసుకు తిని పడుకొనే తీగ మొక్క కంటే కూడా చిక్కిన మెడతోను,కొలిమితిత్తిలా పైకి ఉండే పొట్టతోను ఒక కూతురు వీడికి ఉండే అవకాశమే లేదే!
ఒకరి దగ్గర మన బాధ పంచుకునేటప్పుడు, వినేవాడు అదే స్థాయిలో లేకపోయినా, కనీసం కొన్ని బాధలను తన జీవితంలో దాటొచ్చిన వాడై ఉండాలి.అలా లేని వాళ్ల దగ్గర ఇవన్నీ చెప్పి ఏమైపోతుంది గనుక అనుకుని గోపాల్ యాదవ్  మౌనం వహించాడు.
ఇవన్నీ తన జీవితంలో పడి తెలుసుకున్న విషయాలే! మామూళ్లు వాటాలు వేసేటప్పుడు ఎన్నిసార్లు పోలీసోళ్ల కాళ్లపై పడి బ్రతిమాలి ఉండుంటాను.ఒక అల్పమైన పురుగులా  దులుపుకుపోవడం తప్ప ఎప్పుడు నా మీద వాళ్లు కనికరం చూపించలేదు.
ఇంతలో ఫార్చూనర్ కారు కలందన్ హాజీయార్ ఇంటి ముందు ఆగింది.గాలిలో బాస్మతి వాసన అప్పుడు కూడా అలుముకొనుంది.
లాల్‌మాటియాలోని హూక్కూర్ మియా అంగట్లోనే మొట్టమొదటగా గోపాల్ యాదవ్‌కి మతాంగి ఈ బియ్యాన్ని చూపించింది.అప్పుడు ఆమె ఆరు నెలల గర్భిణి.
గోనె సంచి నుండి ఒక గుప్పెడు బియ్యం ముక్కు వైవుకు తీసుకువచ్చినపుడు, దాని వాసనను పీల్చి ఆమె కళ్లు కాస్త మూసుకుంది.అది ఒకరకంగా మైమరిచిపోవడం.తమవంటి వారికి ఆ బియ్యాన్ని డబ్బులిచ్చి కొని తినేందుకు వీలుపడదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు.
అయినా సరే ఆమె నిరాశపడేందుకు అతడు ఒప్పుకోలేదు.
50 గ్రాముల బియ్యాన్ని కొలిచి ఇవ్వమని అడిగాడు.ఇల్లు చేరే వరకు మతాంగి వాటిని నములుకుంటూ వచ్చింది. పశువు పాలలాగా బియ్యపు పిండి ఆమె నోటి అంచుల నుంచి కారినప్పుడు, దానిని తుడవనివ్వకుండా ఆమెను లేగదూడను చూసినట్టు చూడటం గుర్తుకొచ్చింది.
గోపాల్ యాదవ్‌ని వెనుక నుండి ఎవరో తట్టారు. తిరిగి చూస్తే ఒక యువకుడు. అతడు ఎదుట నిలబడితే అత్తరు బాటిల్ కింద పడి పగిలినట్టు తోచింది. వాడు హాజీయార్ మూడో భార్య ఫాతిమా కుమార్తె తాహావి కొడుకు సినాన్.
“అరె భాయ్! తుమ్ మేరా సాత్ ఆవో”
చేతిలో ఉన్న గునపాన్ని, పారను గోపాల్‌కి ఇచ్చి పక్కన ఉన్న కారు అద్దంలో, కొత్త స్టైల్‌లో పైకి దువ్విన తన జుట్టును సరిచేసుకుంటున్నాడు. తృప్తి పొందినవాడిలా తనలో తనే నవ్వుకున్నాడు.
ఆ ప్రదేశం మొత్తం బళ్ళు ఆపేందుకు కేటాయించింది.
కొంచెం దూరం నడిచిన వెంటనే కొబ్బరి తోటలో పచ్చగడ్డి పెరిగిన ఒక చోటును చూపించాడు.
“ఇక్కడే! ఇక్కడ గొయ్యి తవ్వు భాయ్”
ఈ పనికోసమే తనని పిలిచారని గోపాల్ యాదవ్‌కి అర్థమైంది.
“లోతు ఎంత కావాలి భాయ్?”
“నీ లోతు చాలు”
 సినాన్ తన లెక్కలేని ప్రియురాళ్లలో ఒకరైనటువంటి రియారాఫిక్‌కి వాట్సాప్ మెసేజ్ పంపిస్తూనే చెప్పాడు
“వెడల్పు?”
“నీ వెడల్పే చాలు”
గోపాల్ యాదవ్ గునపం మొనతో  భూమిపై గీత గీశాడు.మన్నుకు ఎండ తగలకుండా అడ్డుపడుతున్న కొబ్బరాకులకు నమస్కరించి పని ప్రారంభించాడు. మట్టి బిగువును బట్టి చూస్తే ఒక వ్యక్తి లోతుకు, వెడల్పుకు గొయ్యి తవ్వి పని ముగించేసరికి చీకటి పడుతుంది.
ఈ మధ్యలో తన గురించి కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్న సినాన్ నేరుగా గూగుల్‌లోకి వెళ్లి  లాల్‌మాటియాకు వెళ్ళింది అతనికి తెలియదు.
“బీహార్‌లో లాల్‌మాటియా అని ఒక చోటే లేదే భాయ్?”
“లాల్‌మాటియా బీహార్‌లోనే ఉంది.వో మేరా గావ్ హై” మట్టిలో గుచ్చిన గునపాన్ని బయటకు తీయకుండానే చెప్పాడు గోపాల్ యాదవ్.
“తుమ్ జోక్ మత్ బోలో! అది జార్ఖండ్‌లోనే ఉంది. ఇదిగో చూడు”
ప్రమాదంలో చచ్చిపోయినవాడికి ముఖంపై తెల్ల గుడ్డని తొలగించినట్టు, తన మొబైల్ స్క్రీన్‌ని జరిపి బీహార్ నుండి జార్ఖండ్‌కి జరిగిన లాల్‌మాటియాను సినాన్ గోపాల్‌కి చూపించాడు.తనలాగే తన గ్రామం కూడా రాష్ట్రం దాటి రాష్ట్రం మారిపోయిందని గోపాల్ పెద్ద నిట్టూర్పు విడిచాడు. తనకు ఇష్టమైనవారు చనిపోయినప్పుడల్లా గోపాల్ యాదవ్ ఇలాగే చేస్తాడు.ఇది లాల్‌మాటియా చావు కోసం.
మట్టిలో కూరుకుపోయిన గునపాన్ని బయటకు తీసాడు. దానికి అంటుకున్న తేమ నిండిన మట్టి గడ్డను బీహార్‌లాగా ఊహించుకున్నాడు.ఆవేశంతో గునపం మొననున్న మట్టిగడ్డను గట్టిగా కొట్టాడు. అది ఒక మనిషి పుర్రెలాగా రెండుగా చీలింది.
ఒకటి బీహార్, ఇంకొకటి జార్ఖండ్.
‘ఈ రెంటిలో ఎందులో ఉన్నాను నేను?’ తనలో తనే ప్రశ్నించుకున్నాడు.
తరువాత ఏదీ గుర్తు లేదు.
వాళ్లు వరుసగా బయలుదేరుతున్నారు. యాదవులు,కొయేరులు,ఆదివాసీలు..
పెడల్ తీసేసిన ఒక్కో సైకిల్‌పై 250 కిలోల నేలబొగ్గు మూట.అడవి దారుల్లో ప్రయాణం.
ఆయాసం వస్తుంది.
గాలి మాత్రమే నిండిన ఊపిరితిత్తులు. పక్కటెముకలు పగిలిపోయి బయటకు వచ్చేస్తాయేమోనని గోపాల్ కి అనిపించింది.
బియ్యంతో పాటు కలిపి కూరగాయలు వేసి ఉడికించిన అన్నాన్ని తప్ప ఉదయం నుండి మరేదీ తినలేదు. తల తిరుగుతోంది.
ముందు నడుస్తున్నవాడు వణికాడు.
“ఏమైంది” అని అడిగేలోపు ముడి విడిపోయి పడ్డ నేలబొగ్గు జారడంతో తను కూడా వాలైన కొండచరియల నుండి కింద పడ్డాడు. చుట్టూ చిమ్మ చీకటి. పల్లపు లోతు, వెడల్పు చూసినప్పుడు అతనికి ఆశ్చర్యమేసింది.
పార్కింగ్ నుండి బళ్ళు వెళ్లే చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. విందు దాదాపుగా అయిపోయి ఉండొచ్చు.మాటల శబ్దం తగ్గింది.
అతడు తవ్విన గోతిలో వెల్లకిలా పడుకున్నాడు. కొబ్బరాకుల ఖాళీల నుండి చంద్రుని కాంతి ఒక చిన్న ముక్కలా గోతిలోకి దిగుతోంది.
 పైకి ఎత్తిపోసిన మట్టిపై కాలు నిలిపి సినాన్ అడిగాడు.
“హోగయా ?”
“హాఁ జీ”
గోపాల్‌ పైకి లేచాడు. సినాన్ అతడి చేయి పట్టుకొని పైకి లాగాడు.
ఎక్కడి నుండో వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక నీలం రంగు బారెల్‌ను పట్టుకొని దొర్లిస్తూ గోతిలోకి దించారు.ఎముకలతోటి బిర్యాని చిన్నకొండలాగా అందులోకి కొట్టబడింది.
గోపాల్ గుండె చప్పుడు విపరీతంగా పెరిగింది.
మట్టి కుప్పలో నుండి పైకి లేచి వస్తున్నట్లు అతడు తలఎత్తి చూస్తే మరో బారెల్ వచ్చింది. ఆపై వచ్చిన వాటన్నింటిని అతడు లెక్కలోకి తీసుకోలేదు. చివరిగా అస్సలు విప్పని ఒక అండా బిర్యాని కూడా గోతులోకి వచ్చి పడింది.
ఎంగిలి అన్నంతో గొయ్యి నిండింది.
“ఇప్పుడు దీన్ని తొక్కి లెవెల్ చేసేయ్ భాయ్” సినాన్ చెప్పాడు.
ఏదో ఆలోచిస్తూ గోతినే చూసుకుంటూ నుంచున్నాడు గోపాల్.
“తొక్కి నొక్కు భాయ్, టైం 11 అయ్యింది”
తొక్కాడు. దాని గుండెల్లో తన బలం పూర్తిగా పెట్టి తొక్కాడు. మొదట ఒక ఏడుపు శబ్దం మొదలైంది. ఆపైన అది మూలుగైంది. చివరిలో అదీ శూన్యమైంది.
“ఇప్పుడు మట్టి వేసి మూసేయ్ భాయ్”
చెమటలు కారే కాలి పాదాలలో నెయ్యి, మసాలా తోటి నిలబడ్డ గోపాల్ యాదవ్‌ని చూసి , తనతోపాటు హత్తుకొని నిలబడి ఒక సెల్ఫీ తీసుకుని సినాన్ అడిగాడు.
“భాయ్‌కి ఎంతమంది పిల్లలు?”
“ఒకే కూతురు”
“పేరేంటి?”
“బాస్మతి”
“నిఖాహ్ అయ్యిందా?”
“లేదు”
అది వింటూనే మొబైల్‌ను తన షర్ట్ పాకెట్లో వేసుకొని గోపాల్ యాదవ్‌ వంక చూస్తూ,
“చదువుతుందా?” అన్నాడు.
“లేదు”
“మరి?”
“చచ్చిపోయింది”
“చచ్చిపోయిందా?”
పెద్దగా జాలి కలగకపోయినా సినాన్‌ని ఆ మాట కాస్త కదిలించింది.
“ఎలా?”
“ఆకలితో”
గోపాల్ యాదవ్ ఇంకో పార నిండా మట్టి తీసి బాస్మతి మీద పోశాడు.
ఆపైన పెద్ద నిట్టూర్పు విడిచాడు.

కథారచన కాలం: 2016

 

శ్రీనివాస్ తెప్పల

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్బుతంగా ఉంది..మళయాళ పేర్లు తీసేస్తే…అది అనువాదం అంటే నమ్మలేం…అంత బాగా చేసారు..శ్రీనివాస్ గారూ…

  • ముందుగా శ్రీనివాస్ గారికి నా నమస్సులు. అత్యద్భుతంగా అనువదించారు.

    ఇక సంతోష్ గారు : కడుపు నిండక కళ్ళు నిండిన, ఎందరి వేతనో కళ్ళకి కట్టినట్టు వ్రాసారు.
    మెతుకు దొరక్క బ్రతుకు చాలించిన వారందరి జీవిత వ్యధను చాలా సూటిగా చెప్పారు.

    ఆయన కథలు మరిన్ని చదవాలని కోరికగా ఉంది.
    శ్రీనివాస్ గారు ఆయన కథలు మరిన్నీ అనువదించాలని కోరుతూ….

    – పుబాకా

  • Kadha bagundi. Kaanee chivaralo asalu open cheyyani handa biryani ela padestaro konchem artham kavatledu . Ye aacharam lo undi ala open cheyyani yengili cheyyani annam mattilo paati pettalani. Bengalis ala chestarani eppudu vinaledu. Aakali andarikee okkate kulam matam jaati ledu. Akalito unnavariki annam pettatam maanvatvam. Annanni mattilo paati pette aacharam ekkadidi .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు