బియాండ్ టెన్ కమాండ్ మెంట్స్

ఈ కథలు కేవలం నాస్టాల్జియా యెంతమాత్రం కాదు. ఇండస్ యీ  తరానికి అందిస్తున్న కొత్త సిలబస్.

పురాతత్వశాస్త్రంలో  Stratigraphy అనే వుపవిభాగం వుంది.  భూమి  పొరల్ని అధ్యయనం చేసి  కాలాన్ని నిర్ధారించే శాఖ అది. ఆ పని మానవ చరిత్రలో కూడా జరగాలి.  సమాజం పొరల్లోకి  తవ్వుకుంటూ పోతే  గానీ కుల మత వర్గ ఆధిపత్యాల కింద నలిగిన జాతుల చరిత్ర అందదు. అణచివేత యెంత లోతుల్లో వుందో తెలియదు. అయితే సూక్ష్మంగా పరిశీలిస్తే చరిత్రలో అణచివేతలే కాదు తిరుగుబాట్లు వున్నాయనీ, ఆధిపత్యమే కాదు ధిక్కారం వుందనీ, అవమానాలే కాదు ఆత్మగౌరవ స్వరాలు వున్నాయనీ అవగతమౌతుంది.

పోయిన శతాబ్దం నాలుగో పాదం వచ్చేసరికి యే పొరలో యే  కంకాళం చెప్పే చరిత్ర వుందో చూడటం దగ్గర ఆగిపోకుండా దానికి ప్రత్యామ్నాయం నిర్మించే తరం సాహిత్యంలోకి వొక విస్ఫోటనంలా ప్రవేశించింది.  ఇతిహాసపు చీకటి కోణాల్లో దాచేస్తే దాగని చారిత్రిక సత్యాల ఆవిష్కరణ అవసరం యింతకు ముందు కన్నా యిప్పుడు మరింత పెరిగింది. ఈ తరం గొంతులో దైన్యం కన్నా క్రోధం యెక్కువ వుంది.   ఆవేదన కన్నా ఆలోచనతో  కూడిన వుద్రేకం మిన్నగా  వుంది. అలవికాని వుద్వేగమే కాదు; తీవ్రమైన వ్యంగ్యం వుంది, దానితో పాటు సున్నితమైన అధిక్షేపం వుంది. ఉదారవాదం పట్ల స్పష్టమైన వ్యతిరేకత వుంది. నిక్కచ్చితనం వుంది. పొగరుమోతుతనంలా కనిపించే ధీమా ఆత్మవిశ్వాసం మెండుగా వున్నాయి. వీటన్నిటి కలయికవల్ల సాహిత్య రూప-సారాల్లో మార్పులు వచ్చాయి. విలక్షణమైన శైలీ శిల్పాలు రూపొందాయి. అంతకుముందు అంటని జీవితం సాహిత్య  వస్తువైంది.   ఆ నూత్న పరంపరలో  ప్రత్యేకంగా పేర్కోదగ్గ రచయిత ఇండస్ మార్టిన్.

కారంచేడు రుధిర క్షేత్రాల నుంచి, చుండూరు ప్రజా కోర్టుల నుంచి మనిషిగా యెదిగొచ్చిన రచయిత. వెలివాడ బతుకుల మీద , తిండి మీద, కట్టుమీద, భాష మీద, యాస మీద, పాట మీద, మాట మీద, నినాదం మీద  … అమలౌతున్న పెత్తనాలపై పేల్చిన మందుపాతర లాంటి కటికపూల ముచ్చట తర్వాత మూడేళ్లకి అంతే బలమైన ‘వాక్యం’తో పాదిరి గారి అబ్బాయి కథలతో మనిషికీ మనిషికీ మధ్య అల్లిన సరికొత్త నిబంధనగా మన ముందుకు వస్తున్నాడు.

***

‘Language is very powerful. Language does not just describe reality. Language creates the reality it describes’ (Desmond Tutu)

ఇండస్ మార్టిన్ ‘కటికపూలు’ చదవక ముందు నుంచీ సోషల్ మాధ్యమంలో అతని రచనలు అడపా తడపా  చదివినా  కటికపూలు  కథనాలన్నీ ఒకచోట  చూసినప్పుడు వాటిలోని పచ్చి జీవన వాస్తవికత నన్ను కట్టిపడేసింది. ఆ వాస్తవికత  అతని  భాషలోని పదును  సృజించినదే.  ఇండస్ వాక్యంలో వాడి  వుంది.  అందులో ధిక్కారం వుంది. తిరుగుబాటు వుంది.  ఆత్మ గౌరవం వుంది. సత్యముంది. నిబద్ధత వుంది. అతని ఆలోచనల్లో స్పష్టత దృక్పథ పటిమ అతని సృజనాత్మకతని తీక్ష్ణం చేశాయి అని బలంగా అనిపించింది.   అప్పటి నుంచీ అతనేం రాసినా చదివాను. అలా దృష్టికి వచ్చినవే పాదిరిగారి అబ్బాయి కథలు. ‘సారంగ’లో (డిసెంబర్ 2018 లో) మొదలైన యీ కాలమ్ తర్వాత యెందుకో కొనసాగలేదు. కవిత్వంలో మద్దూరి నగేష్ బాబు చేసిన పని వచనంలో ఇండస్ మార్టిన్ చేస్తున్నాడు. రచయితగా సామాజిక వ్యాఖ్యాతగా దీని  కొనసాగింపు అవసరాన్ని అతను తీరుస్తున్నాడని కూడా అనిపించింది. అందుకే అనేక జీవన వ్యాపకాల్లో వొకచోట నిలవని మనిషిని సాహిత్య ‘గుడారం’ కిందికి గుంజుకు రావాల్సి వచ్చింది.  దాని ఫలితమే ‘ఇంతపర్యంతం’.

భాష  కేవలం భావ వినిమయం కోసమో సమాచార ప్రసారం కోసమో మాత్రమే వుపయోగపడదు. సంస్కృతికి అది వాహిక కూడా. అంతేకాదు; అసమ సమాజంలో ఆధిపత్య వర్గాల చేతిలో భాష అణచివేత సాధనమైంది. వర్గ స్వభావాన్ని సంతరించుకుంది. దాన్ని ప్రజాస్వామ్యీకరించుకొని   పోరాట పరికరంగా మలచుకోవాల్సిన అవసరం వుంది. ఈ  యెరుకతో మార్టిన్ తన భాషని సానపట్టాడు. మౌఖిక కథన శైలిని ఆశ్రయించి అమ్మ యాసను అద్దాడు. దాంతో  పనిముట్టు ఆయుధమైంది. ఆ విద్య  అతనికి జీవితం నుంచి సహజంగా అలవడింది. అందువల్ల  అతని ప్రతిరచనా పాఠకులతో పేగుబంధం యేర్పరచుకుంది. ఇప్పుడీ కథలు కూడా అందులో భాగమే.

పాదిరీ గారి అబ్బాయి కథలు  కటికపూలుకు సీక్వెల్ రచన.

కటికపూలు “అంగిట్టో వొడ్ల గింజలేసి సంపనన్నా సంపుతా గానీ నా బిడ్డల్ని ఈ బజాట్టో ఇస్తరాకుల ముందు కుక్కపిల్లల్ని మటికి కానియ్యను” అన్న అమ్మ (జయమ్మ @ ఇక్టోరియా రాణి) చాటు బిడ్డ చెప్పిన కతలు.

“ఏసయ్య మనల్ని అన్ని దౌర్భాగ్యాల నుండీ ఎప్పుడో బయట పడేశాడు. మనకు దక్కే జీతం మన కష్టం. ఈ కష్టం చేసే అర్హత మన చదువూ రెక్కల బలం నుండి వచ్చింది.” –  అన్న  రెవరెండ్ గంగోలు మోజెస్; బి టిహెచ్, బి డి; పాదరీ గారి అబ్బాయి చెప్పిన కథలివి. బాల్య కౌమారాలు దాటి యవ్వనంలోకి అడుగుపెట్టేనాటి కథనాలు. అతని భౌతిక మానసిక ప్రపంచం విశాలమైన కాలమది. వీటిలో కౌమారానికి చెందిన అమాయకత్వం వుంది. తొలి యవ్వన వుద్వేగాలున్నాయి. బిడియాలున్నాయి. సంశయాలున్నాయి.  వాటి నుంచి బయటపడే సామాజిక చింతన యేర్పడుతూ వుంది. కొత్తగా యెదురయ్యే జీవితం, సమాజం యెంత నిర్దయగా కటువుగా సంక్లిష్టంగా వున్నాయో యెరుకైన రోజులవి. కొన్ని అనుభవాలు చాచి లెంపకాయ కొట్టినట్టు పాఠాలు నేర్పితే మరికొన్ని కడుపులో బాకుతో కుమ్మినట్టు సత్యాల్ని కర్కశంగా ఆవిష్కరించాయి.  ‘కుడి – ఎడమ’ల తేడాని తెలియజెప్పాయి.

అయితే స్వీయ అనుభవాన్ని కేవలం అనుభవంగా యథాతథంగా వర్ణించడం దగ్గర అతను ఆగిపోలేదు. దాన్ని తనదైన ప్రాపంచిక దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించాడు. అదే  యీ కథల అసలైన బలం (కొందరు సంప్రదాయవాదులు, వారికి తోడుగా మరికొందరు ఆధునికోత్తరవాదులు దృక్పథాన్ని కళ్ళద్దాలని ఎక్కిరిస్తారు, అది మరో ముచ్చట). ఇంట్లో  కమ్యూనిస్టు భావజాలంతో బైబిల్ తో పాటు చే గవేరా పుస్తకం మోసుకు తిరిగే  జోసఫ్ బాబాయి లాంటి వారి బోధనల (‘ఈ లోకం గురిచ్చి తెలుసుకోవాలంటే లోకాన్ని పరిచి దానిమీద నడవాలి’) నుంచి  కాలేజీలో ఎన్ కె బి లాంటి గురువుల  జీవితం నుంచి దళితోద్యమ నేత సెట్టి కన్నమరాజు లాంటి వారి ఆచరణ నుంచి అతని దృక్పథం యేర్పడినప్పటికీ సాహిత్య రచనా వ్యాసంగం తాతతండ్రుల నుంచి (తాత జార్జి కవి తండ్రి రెవరెండ్ మోజెస్, యిద్దరూ క్రైస్తవ కీర్తనలు కట్టినవారే) వారసత్వంగా అబ్బిన కళే. చర్చి వాతావరణం అందుకు మరింతగా దోహదం చేసింది. 

***

వేలూరి శివరామ శాస్త్రి ‘సదాచారుడు’ కథలో ప్రతీకుడు మనవడు అమలాపురంలో ఇంగ్లీషు చదువుకుంటానంటే ‘కిరస్తానుల్లో కలుస్తావట్రా’ అని తిడతాడు. ఆధునిక విద్యల్ని దేశంలోకి బ్రిటిష్ పాలన  స్థిరపడక ముందే మిషనరీలే తెచ్చాయి. దళిత జీవితాల్లో చర్చ్ తీసుకువచ్చిన మార్పులు అనేక అనేకం అని అంగీకరిస్తూనే దాని మత పరిమితుల్ని సైతం గుర్తించాలి.  అణగారిన కులాలకు చర్చి ఆత్మ స్థైర్యం యిచ్చింది. ఆత్మగౌరవం  పెంచింది. చదువు యిచ్చింది. దాంతో కట్టూ బట్టా మారాయి.   వేషభాషలు మారాయి. జీవిత విధానం మారింది. ఉద్యోగాలు లభించాయి. ఏదో వొక మేరకు కొందరికైనా ఆర్థిక  సామాజిక హోదా లభించింది.  క్రైస్తవం యిచ్చిన అవకాశాలు వెసులుబాట్లు వున్నప్పటికీ అక్కడ కూడా కులం వదల లేదు. కుల వివక్షకు మత వివక్ష తోడైంది. అక్కడ కూడా ఆధిపత్యం విధేయత ప్రముఖ స్థానం వహించాయి. అన్ని బ్రాహ్మణీయ హిందూత్వ  అవలక్షణాలు వెంటవచ్చాయి. కొత్తవి రూపొందాయి. తమిళంలో బామ ‘కరకు’ నవల వీటిని చర్చకు పెట్టింది. మనకు పూదోట శౌరీలు రాసిన ‘సిలువ గుడి కథలు’ ఉన్నాయి. అయితే అందులో ఆమె గొంతు చాలా మార్దవంగా పలుకుతుంది. సంస్కృతి అక్కడ ప్రధానంగా ఆవిష్కారం అయ్యింది. డి. గోపి గుడిసె ఏసోబు కథల్లో, వినోదిని, పివి సునీల్ కుమార్, మానస ఎండ్లూరి లాంటివారు   రాసిన కొన్ని కథల్లో మరికొన్ని కోణాలు ఆవిష్కారమైనప్పటికీ  ఇండస్ గొంతు అందుకు భిన్నమైంది. ఇందులో రాజకీయ తాత్వికత ప్రధానాంశం.  ఇతని చూపు చాలా నిశితమైంది.  స్థూలంగా కంటికి కనిపించే ఆహారపు అలవాట్లు అతి సూక్ష్మంగా కనిపించని ఆర్థిక సూత్రాలు యేవీ అతని చూపు నుంచి తప్పిపోవు. అవహేళనకి గురైన కట్టూ బట్టాతో పాటు  శరీర భాష చదువూ సంస్కృతీ  అన్ని విషయాలు అతని కథనాల్లో ప్రస్తావనకు  వస్తాయి.

ఇప్పటిదాకా దళిత క్రిస్టియన్ భాషా సాహిత్యం సంగీతం మొత్తం  జాతి సంస్కృతిలో  భాగం కాలేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు, వాటిని   రచించిన కవులకు సాహిత్య చరిత్రలో స్థానం లేకపోవడమేమో గానీ కనీసం వారి ప్రస్తావన కూడా కనిపించదు. క్రైస్తవ సంగీత ప్రపంచం తెలుగు కళామ’తల్లి’కి అంటరానిదే. అలాగే క్రైస్తవ సంస్కృతి అంతా వొకటి కాదనీ తెలుగు దళిత క్రైస్తవ సంస్కృతి ప్రత్యేకమైన దనీ  అది కమ్మ రెడ్డి క్రైస్తవ సంస్కృతి కంటే మాత్రమే కాదు దళిత సంస్కృతి కంటే కూడా విలక్షణంగా వుంటుందనీ యీ కథలు చదివి తెలుసుకోవచ్చు.

క్రైస్తవ దళిత జీవితం సంస్కృతి అస్తిత్వం (పండగలప్పుడు రాత్రి పూట ఇంటింటికీ తిరిగే కేరల్స్  చర్చి లోపల  క్వాయర్లు మొ.) యీ కథలకు నేపథ్యం యేర్పరిచాయే గానీ యిసమంతైనా మత భావన వాటిలో కనిపించదు. పైపెచ్చు మతతత్వ వాద రాజకీయాలపై తిరస్కారం  వుంది. సమత్వ భావన యీ కథలకు జీవధాతువు. సామాజిక న్యాయం వాటి అంతశ్చేతన.

ఈ కథల్లో రచయితగా ఇండస్ దీన క్రైస్తవాన్ని తిరస్కరించాడు. ప్రలోభాలకు గురిచేసే ప్రాస్పరిటీ గాస్పెల్ నీ మూఢత్వ పునాది మీద పెరిగే కరిస్మాటిక్ గాస్పెల్ నీ  స్వస్థతా కూటముల్నీ అసహ్యించుకున్నాడు. ‘గుడారాల పండగ, దహనబలి యాగం, వోల్ నైట్ ప్రేయర్, ప్రభువుతో ఒకరేత్రి ఇట్టా రకరకాల  ఫోగ్రాములు ప్రేయర్ ఆయిల్, ప్రేయర్ రుమాలు అసుమంటి స్కీములు’ గురించి విని నెమ్మదిగా మత విశ్వాసాలకు దూరమయాడు. అతను అవిశ్వాసే గానీ వొకమేరకు  లిబరేషన్ థియాలజీని ఆహ్వానించాడు (పీడన నుంచి విముక్తి కలిగించేది యేదైనా అతనికి యిష్టమే). దీన క్రైస్తవం  దోపిడీ వర్గాలకు సాయపడి  బానిసత్వానికి దారితీస్తుందని  గ్రహించాడు. క్రైస్తవంలో మాల మాదిగల మధ్య తలెత్తే విభేదాలకూ వైషమ్యాలకూ బెంగటిల్లాడు. ‘అన్య’ రాజకీయాల పట్ల ఆవేదన చెందాడు.  ఆ క్రమంలో చర్చి కేంద్రంగా నడిచే కుల  దుర్గంధాన్ని  బహిర్గతం చేశాడు. మిషనరీ  కాంపౌండ్ అసాంఘిక శక్తులకు నిలయాలుగా ఆకు రౌడీలకు అడ్డాలుగా మారడం  గమనించాడు. ఇప్పుడు చర్చి ఆస్తులపై ( కొన్ని నగరాల్లో  ప్రధానస్థలాల్లో  ‘గజం లచ్చా ముప్పై యేలు’ పలికే మిషన్ కాంపౌండులున్నాయి) రియల్ ఎస్టేటు మాఫియా కన్నుపడింది. మత సామ్రాజ్యవాదులకు చర్చి కార్యక్రమాలపట్ల వాటికి  వచ్చే ఫండ్స్ పట్లా గుర్రుగా వుంది. హింసాత్మకమైన ‘దారాసింగిజం’ ప్రబలింది. ఒకప్పుడు అది పాలకుల కనుసన్నల్లో నడిచేది. ఇప్పుడు  పాలకులే దాన్ని  అందిపుచ్చుకుని అమలు చేస్తున్నారు. గ్రాహం స్టెయిన్స్ నుంచి ఫాదర్ స్టాన్ స్వామి వరకు వచ్చేసరికి అది వ్యవస్థాగతంగా వూడలు దిగింది.

క్రైస్తవ కాలనీలు దళిత అగ్రహారాలుగా మారడం చూసి ఫాదరీ గారి అబ్బాయి విస్తుపోతాడు. హిందూ మనువాద ఆధిపత్య దుర్మార్గం నుంచి తప్పించుకోడానికి బయటికి వచ్చి క్రైస్తవాన్ని స్వీకరించిన దళిత సమాజం అవే అవలక్షణాల్ని కొనసాగించడం పట్ల ఆగ్రహం వెలిబుచ్చాడు. దళిత నిమ్నత్వం నుంచి వొకమేరకు బయటపడ్డ దళిత క్రైస్తవులు తమ మూలాల్ని మర్చిపోవడం పట్ల పీడనకి గురౌతోన్న తోటి దళిత సమాజంపై కనీస సానుభూతి చూపకపోవడం పట్ల ఆవేదన ప్రకటించాడు. అయితే ఎలైట్ రీడర్స్ రచయిత స్వభావంలోని యీ అమాయకత్వం చూసి మురిసిపోవచ్చు.  గొంతులోని దైన్యాన్ని విని ముచ్చటపడవచ్చు. తెరచినిగెను కథలో పోలీసులు తిట్టినప్పుడు అతను  చూపిన బేలతనం వారికి మురిపంగా అనిపించవచ్చు.   కారంచేడు ఘటన సందర్భంలో పోలీసుల నుంచి తప్పించుకోడానికి  నిలువెత్తు గోడలు దూకి పారిపోతున్నవాడూ వారికి నచ్చుతాడు. కానీ లాకప్ లో వున్న మిత్రులకి అన్నం పెట్టడానికి హాస్టల్ నుంచి మాంసం డేగిసా నెత్తి మీద బెట్టుకుని స్టేషన్ కి వెళ్ళి పోలీసు యస్సై వొప్పుకోకపోతే ఫలానా నాయుడు యస్సై డౌన్ డౌన్ అని అరిచి నినాదాలిచ్చిన ధైర్యం  (నాజీరు) నచ్చకపోవచ్చు.

దళితులు క్రైస్తవంలోకి మారినా యస్సీ రిజర్వేషన్ పొందుతున్నారని సవర్ణ హిందువులు శూద్రులతో సహా ఈర్ష్య పడుతూ వుంటారు. క్రిష్టియన్ కాలేజీల్లో స్కూళ్ళల్లో చదువుకొని పైకొచ్చిన దళితుల సవర్ణ (పై?) కులాల పిల్లల లెక్కదీయమంటాడు రచయిత. సగంపైన సీట్లు చౌదర్లూ రెడ్లూ లాంటి సవర్ణులకే చెందుతాయి. అవిగాక పాదరీలని బతిమాలి దొంగ సర్టిఫికెట్లు సృష్టించో నిజం బాప్టిజం తీసుకునో దళిత క్రిస్టియన్ల సీట్లు కాజేసే ద్రోహాన్ని ఎండగడతాడు. అంతేకాదు; మతం మారినంత మాత్రాన దళితుల సామాజిక హోదా పెరిగి సమానత్వం సాధించిన దాఖాలాలేం లేవు.‘పరీక్షల రిజల్ట్ వొచ్చినప్పుడు పిల్లగోళ్ళు కాలవల్లో ఎందుకు దూకుతారో, ఇల్లొదిలి దచ్చాది దిక్కు బ్యార్నీలకూ, మట్టిపనికి పోయే కూలీలు టాట్టర్లు ఎందుకు ఎక్కుతారో’ కారణాలు  చెప్పకుండానే విశదపరచిన విశ్వసనీయ కథనాలివి. కాలేజీలో పై చదువులు చదివే  పిల్లలు సైతం  ఆకలి అవమానం అనాథతనం పరాయితనం భయాల మధ్య ఉక్కిరిబిక్కిరి అవడానికి కారణమైన సామాజిక పరిస్థితుల్ని ఇండస్ యీ కథల్లో దృశ్యమానం చేశాడు.

కారంచేడు దళితమేధానికి  వ్యతిరేకంగా ధర్నా కట్టడానికి ఎ సి కాలేజి విద్యార్థుల్ని  సమాయత్తం చేసిన స్పర్జన్, పిడుగురాళ్ళ శ్యాం,  గోవతోటి పీటరు, చింతల రమేషూ, మంచాల మోహన్ రావూ ఆ పిల్లల్ని అరెస్ట్ చేస్తే స్టేషన్ కి వెళ్లి ఆకలి తీర్చే దళిత నేత సెట్టి కన్నమరాజు (నాజీరు), ‘పరలోకరాజ్జెం’ ద్వారం కాడ లోనికి ప్రవేశం కోసం తాపత్రయ పడే ‘కొజ్జా’ నాంచారయ్య, కొత్త ప్రభు రాజ్య స్థాపన ప్రచారం నమ్మి కట్టుకున్న భార్య సంసారాన్ని వదిలిపోతే పాదిరీ గారి యింటికి వచ్చి బోరున యేడ్చే రాజారత్నం (జరుగుబాటు) తొలి ప్రేమ దేవత హవీలా లతా, ఆమె తండ్రి సందెపోగు జాన్ ప్రసాదరావు (తెర చినిగెను) … వీళ్ళంతా ఇండస్ జీవితమ్మీదే కాదు చదువరుల మనస్సులపై కూడా చెరగని ముద్ర వేస్తారు. మనుషుల్ని వదిలి కోళ్ళ మీదా కుక్కలమీడా ‘కనికరం’ ప్రదర్శించే  బ్యాంబర్ల పిల్లలమఱ్ఱి ప్రసాదు, గొడ్డు మాంసం తింటారని ఈసడించుకునే రిక్షా అబ్బాయి దళిత సంస్కృతిపై చెలామణిలో వున్న సామాజిక ముద్రకీ (ప్రార్ధన)  ‘ఈ  చెర్చీలు పడదెంగి గుళ్ళు కడితే గానీ మీ సోయ్యం అణగదు’  అని మతస్తుల పట్ల అసహనం ప్రదర్శించే పోలీసులు రాజ్య స్వభావానికీ (తెర  చినిగెను) ప్రతీకలుగా కనిపిస్తారు.

బౌద్ధంలో చేరిన దళితులు  సిక్కు మతంలోని దళితులు రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నప్పుడు క్రైస్తవ దళితుల విషయంలో అమలయ్యే వివక్ష గురించి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీ సిఫారసులు అమలుకు నోచుకోక పోవడం వెనక వున్న రాజకీయ కుతంత్రాలు, ఆ విషయమై పార్లమెంట్ అత్యున్నత న్యాయస్థానాల  వైఖరీ వంటి అతిగంభీరమైన విషయాలు యీ కథలు చదువుతున్నంతసేపూ గుర్తుకు వస్తాయి…

ఇండస్ రాసే దళిత రాజకీయ తాత్వికతని తెలిపే ‘మార్క్ బేతాల్’ సిరీస్ నుంచి పులసోపాఖ్యానం తో పాటు అతని సామాజిక దృక్పథానికి నిలువెత్తు నిదర్శనగా నిలిచే మగత, గత్యంతరం, కరేపాకు కథలు కూడా యీ సంపుటిలో చోటు చేసుకున్నాయి.  గత్యంతరం, మగత అలిగరీ కథలు. ‘గత్యంతరం’లో  బట్టల కుక్క సమాజంలో బతుకు తెరువు కోసం పెనుగులాడే దిక్కు లేని స్త్రీకీ, ‘మగత’లో పందెం కోడి ఆసాముల పరువు ప్రతిష్టలు కాపాడటానికి బలయ్యే బడుగు జీవుల పంచమాంగ దళానికీ ప్రతీకలు.

‘కరేపాకు’ ఇండస్ మార్టిన్ కథా రచనా పరిణతికి నిండైన తార్కాణం. అనేక న్యూనతల్ని అధిగమించి జీవితాన్ని గెలుచుకున్న దళిత క్రైస్తవ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పతాకగా నిలబడే కథ యిది. చానాళ్ళ కింద   సతీష్ చందర్ రాసిన ‘సిగ్గు’ కథ గుర్తుకొచ్చింది. ఆ కథ మంచి బట్ట కట్టకోవడం కేంద్రంగా ఆత్మగౌరవాన్ని నిర్వచిస్తే యీ కథ  కరేపాకు నెపంగా యిల్లు, యింటి పెరడు చుట్టూ నడిచింది. అప్ వర్డ్ మొబిలిటీ ద్వారా దొడ్లో కరేపాకు మొక్క పెట్టి తల్లి కోర్కె తీర్చిన కొడుకుని చూస్తే గర్వం కన్నీళ్ళూ వొకేసారి పుట్టుకొస్తాయి.  ఆ యా సందర్భాల్లో ఇండస్  మాట కరుకు – మనసు మెత్తన, భాష చురుకు – మనిషి చల్లన అనీ ప్రేమ – కరుణ అతని జీవన తాత్వికతని నిర్దేశిస్తాయనీ  అర్థమోతుంది. సృజనాత్మక రచన వైపు తక్కువ దృష్టి పెడుతున్నందుకు ఇండస్ మీద కోపం కూడా కలుగుతుంది.

క్రైస్తవుల సంఖ్య చిన్నది … విడిపోయి సాధించేది లేదు ( దయార్దన్ ) అన్న అవగాహన కొందరికైనా వున్నప్పటికీ మాల మాదిగల మధ్య జీవితావసరాల్లో విధానాల్లో తేడాల కారణంగా వైవిధ్యం నుంచి విడి విడి సంఘాలు యేర్పడ్డాయి. రాను రానూ దూరం ఎక్కువై గుంటూరోళ్ళు గోదారోల్లు వంటి ప్రాంత విభేదాలు కూడా పెచ్చరిల్లాయి. వేర్వేరు చర్చిల మధ్య వైరుధ్యాలు పెరిగాయి.  చివరికి  వొకరి పొడ మరొకరికి గిట్టనంతగా పెల్లుబికిన వైషమ్యాలు హింసాత్మక నేర స్వభావాన్ని సంతరించుకున్నాయి (తెర  చినిగెను). ఈ బీభత్స దృశ్యాన్నంతటినీ  యీ కథలు కళ్ళకు గట్టాయి.   అయితే తన యీ  రాతల్ని అడ్వాంటేజ్ గా తీసుకునే సవర్ణ  హిందువుల పట్ల ఇండస్ మార్టిన్ కి అవగాహన వుంది. దాన్ని అధిగమించడానికి యెంతో  అప్రమత్తతతో జాగరూకతతో వ్యవహరించాడని విజ్ఞులు గ్రహించగలరు. అందుకు అనుగుణమైన డిక్షన్ నీ వాక్య వైఖరినీ అతను  వుపయోగించాడు.

***

ఈ కథలు కేవలం నాస్టాల్జియా యెంతమాత్రం కాదు. ఇండస్ యీ  తరానికి అందిస్తున్న కొత్త సిలబస్. ఇందులో కనిపించే  జీవితం సమాజం  సంస్కృతి రాజకీయాలు అన్నీ కొండ పైకి యెక్కి గొంతెత్తి చెబుతున్న  పాఠ్యాంశాలే.  జీసస్ బోధించిన విముక్తి వాదాన్ని అర్థం చేసుకుని అంబెడ్కర్ మార్గంలో భారతీయ దళిత సమాజానికి అన్వయించుకోమని రాసిన అత్యాధునిక నిబంధనలివి. దైవారాధన లేని నయా బౌద్ధంలా మార్టిన్ లూథర్ వంటి వారు ప్రబోధించిన విమోచన కేంద్రితమైన  నూతన క్రైస్తవాన్ని ఆచరించమని ఇండస్ మార్టిన్ ఆక్రోశంతో చెబుతున్న సువార్త యిది.  బియాండ్ టెన్ కమాండ్ మెంట్స్ ఇండస్ మరికొన్ని కొత్త జీవన సూత్రాలు అందిస్తున్నాడు. అయితే యివి ఆజ్ఞా పత్రాలు కావు. ఆవేదన పత్రాలు. అభ్యర్థన వాక్యాలు. పవిత్రతని ఆపాదించి శిరసా ధరించాలనడం లేదు.  అర్థం చేసుకొని ఆచరించాలి.

ప్రజాస్వామ్యం లో మెజారిటీ అభిప్రాయం ‘విలువ’ను సంతరించుకుంటుంది. చాలా సార్లు అది స్థిరీకృతమై ప్రశ్నించరానిదిగా తయారౌతుంది. సంఖ్యా బలం అధిక సంఖ్యాకులకు లాభం చేకూర్చుతుంది. అల్పసంఖ్యాకులు సహజ అన్యాయానికి గురై నష్టపోతారు. ‘మెజారిటీయనిజం’ నియంతృత్వానికో మూకస్వామ్యానికో  దారితీసే అవకాశం ఉంది. మతవాదుల చేతిలో అది ఫాసిస్టు స్వభావం సంతరించుకుంటుంది. ఆ  ప్రమాదాన్ని మనం యివాళ  చూస్తున్నాం , దాని ఫలితాలనీ అనుభవిస్తున్నాం.

ఈ ప్రమాదం పసిగట్టే మైనారిటీల హక్కులకు  సంక్షేమానికి విఘాతం కలగకుండా  రాజ్యాంగంలో సమత్వం, లౌకికత పొందుపరచుకున్నాం. అయితే రాజ్యాంగంలో తమని యిబ్బంది పెడుతున్న ‘సెక్యులర్ – సోషలిస్ట్’ పదాల్ని తొలగించాలని మతతత్వవాద పాలకులు తమ శక్తి యుక్తులన్నీ వుపయోగించి కుట్రలు పన్నుతోన్న యుద్ధ వాతావరణంలో  పాదిరీగారి అబ్బాయి చెప్పే కథల్ని మనసుపెట్టి వినమని  పర్స్పెక్టివ్స్ విజ్ఞప్తి చేస్తుంది.  ఈ దిశలో ఫాసిజానికి వ్యతిరేకంగా నిర్మాణం కావాల్సిన ప్రజా శ్రేణుల ఐక్యతకు అవసరమయ్యే వ్యూహ రచనకు సైనిక చర్యకు దోహదం చేసే రచనని ఆహ్వానిస్తోంది. మనం గుప్పెడు మందిమే అయినా  చేయాల్సిన పనులు చాలా వున్నాయి అని హెచ్చరిస్తోంది.

‘Almost always, the creative dedicated minority has made the world better.’(Martin Luther King)

‘మాదిగోడు’ నాగప్పగారి సుందర్రాజు బతికుంటే ‘పాదిరీగారి అబ్బాయి’ ఇండస్ మార్టిన్ ని బిగియారా గుండెకు హత్తుకునేవాడు. ఆ పని పర్స్పెక్టివ్స్ తరపున మేం  చేస్తున్నాం.

*

 

ఏ.కె. ప్రభాకర్

2 comments

Leave a Reply to Chenna Rama Murthy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు