1
ఒకే వాక్యం
నిశ్శబ్దంలో వినిపించిన ఒక మాట,
గుండె తలుపు తట్టకుండానే లోపలికి చేరింది.
కన్నీటి రేఖలా మెల్లగా జారినా,
అగ్ని చుక్కలా గుండెను గుచ్చుకుంది.
అక్షరాల వెనుక దాగిన కత్తి,
మనసు లోతుల్లో గాయాలు గీసింది.
శ్వాస ఒక్కసారిగా ఆగినట్టయింది,
ప్రపంచం కాసేపు మాయమైపోయింది.
ఒకే వాక్యం –
జీవితమంతా ప్రతిధ్వనిస్తోంది.

2
పరలోక పిలుపు
ఏసన్నకి
అవ్వయ్య లేరని
తాత అమ్మలే కన్నబిడ్డోలే సాదిర్రు
ఏసన్న –
జీవితమంతా ఎవుసం చేసి బతికిండు
సదువబ్బలేదని –
పదేండ్లకే పటేన్ల కాడ జీతమున్నడు.
పొద్దంతా గాడిద కష్టం చేసొచ్చి,
రాతిరికి సుక్కా, సుట్టా కలిపి
దుఃఖాన్ని తాగేటోడు.
పానం నిమ్మలం చేసుకొని,
కడుపుకి – ఉన్నప్పుడు చియ్యకూరా,
లేనప్పుడు ఎండుకారం రొట్టె పెట్టి,
ఒంటికి నొప్పి తెలవకుంటా,
అపూటం న్యాలజేసుకునే ఒరిగేటోడు.
పెండ్లైన రెండు దినాలకే,
తొలిచూరి పెళ్ళాం ఉండకపోయింది.
రెండో పెళ్ళాం అచ్చొస్తదని చెప్పి
మళ్లీ చేసిండ్రు – అడివమ్మని తెచ్చి.
యాలకి తిండి పెట్టేది కాదు,
వంట రాదని తప్పించుక తిరిగేది.
ఉన్నన్ని దినాలల్ల ఏసన్నని
“కుయ్యకయ్య” అంటానే ఉండెడ్ది.
పాపం ఏసన్న – ఏం అనకపోవుద్దు.
దినాలు ఏండ్లయినంక,
ముగ్గురు కొడుకులు – ఇద్దరు బిడ్యలు పుట్టిరి.
బిడ్యల లగ్గాలు చేసి తోలిర్రు.
ఇగ కొడుకులు చేతికచ్చి
ఆళ్లు సంపాదించుడు షురూ చేసినంక,
ఏసయ్య చేతులు కుంటుపడ్డయి,
చేత్ల పైసలు తిరగకుంటయినయ్.
కొడుకుల లగ్గాలై,
ఆళ్ల సంసారాలు – ఆళ్ళయయినయి.
అడివమ్మ – ఏసన్నని
ఎడ్ల కాడికి పంపుడు పెట్టింది.
“సద్ది గట్టియ్యకుంటానే తోలితే!”
పొద్దుల పోయి మేపేటోడు.
కడుపుల ఎలుకల తిరుగుతే,
సారా సుక్కలు కుతికెని,
లవుప్రేమతో ముద్దాడేటివి.
కొడుకులు సూసుడు బంద్ చేసిర్రు,
పెళ్ళాం అన్నం పెట్టుడు తక్వ చేసింది.
ఉడిగి ఉడిగి – ఒక పొద్దుపూట,
మాయదారి మందు నోట్లో పడ్డ నిమిషంకే
పిలుపొచ్చినట్టే… పరలోకానికి చేరుకుండు.
*
Add comment