బాలసుధాకర్ మౌళి కవితలు మూడు

1

రెండు మైళ్ల అవతల

~

రెండు మైళ్ల అవతల
బాలసుధాకర్ మౌళి

ఇక్కడికి
రెండు మైళ్ల అవతల ఒక ఊరుంది
ఊరిని చేరాలంటే నదిని దాటాలి
నదిని దాటాలంటే
తెప్ప వేయాలి
ఇక్కణ్ణుంచి అక్కడికి
ప్రయాణించటం ఎప్పుడూ ఒక లాలన
అక్కడికి చేరాక
అక్కడే వుంటానని లేదు
అక్కణ్ణుంచి యింకో దగ్గరకు వెళ్లాలి
వెళ్లాల్సిన ఊళ్లు
ఒకటి రెండు కాదు అనేకం
ప్రతి రెండు ఊళ్లకు మధ్య నది
ప్రతిసారి నదిని దాటాల్సిందే
దాటాల్సిన నదితో
మునుపెన్నడూ పరిచయం వుండదు
దాని ఉరవళ్లు పరవళ్లు తెలీదు
దాని ఉరుకులూ మలుపులూ తెలీదు
దాటాలి
దాటాల్సిందే
నదిని దాటితేనే
ఊరిని చేరుకోగలం

ఊళ్లను చేరితేనే
మనుషులను కలుసుకోగలం

ఊరికి ఊరికి మధ్య
ఇన్ని నదులుంటే
మనిషికి మనిషికి మధ్య
ఇంకెన్ని నదులున్నాయో
ఒక తెప్ప ఒక తెడ్డు
     అంతే
ఊళ్లను చేరినట్టే
మనుషులనూ చేరాలి

మనుషుల మధ్య
నదులొక్కటే కాదు
మహాసముద్రాలూ వుండొచ్చు
మహాసముద్రాలున్నా
మంచు పర్వతాలున్నా
చేరాల్సిన
ఊరిని చేరాలి
కలవాల్సిన
మనిషిని కలవాలి
కలిసి
ఇంత గోడును
వెళ్లబోసుకుని
బండిడు బరువుని
దించుకోవాలి

2

లో దుఃఖం

~

సన్నని దుఃఖస్వరం
ఇల్లంతా వినిపిస్తుంది
ఎలా చొరబడిందో
ఎవరు వదిలి వెళ్లారో
ఏ గదిలోకి వెళ్లినా
దుఃఖపు గూటిలో
చిక్కుకున్న విషాదానుభవం
నిద్రలోనూ
ఎవరో ఏడుస్తున్నట్టు
సన్నని వొణుకు గొంతు
నా కన్రెప్పలు పైకెత్తి
ఉప్పొంగే దుఃఖపు కెరటం
కెరటం ఉబికిన ఆనవాలు
తెలుస్తూనే వుంది
ఎవరు ఏడుస్తున్నారో
ఎవరో
దుఃఖస్వరం మాత్రం
సన్నగా‌ ఇల్లంతా వినిపిస్తుంది

ఇంతమందిని
లెగనెత్తుకొచ్చిన అమ్మ
ఇంతకు వందరెట్లు దుఃఖాన్ని
చూళ్లేదూ
ఏ ఇంటికైనా
దుఃఖాన్ని వేరే పరిచయం చేయాలా
తల్లులందరిలో
పెంకుగట్టిన దుఃఖాన్ని
తట్టిలేపితే
               ఇళ్లు తాళగలవా
తల్లుల ముందు
ఇదేమంత దుఃఖం
దుఃఖాన్ని
గొయ్యి తీసి ఎప్పుడో పూడ్చిపెట్టారు
               తల్లులు

వెచ్చని దుఃఖం
కళ్ల అగ్నిపర్వతాల గుండా
శరీరం మూలమూలకూ
ప్రవహిస్తుంది
దుఃఖానికి
ఆనకట్ట వేయకపోతే
దుఃఖం వరదలో చిక్కుకుని
               బయటపడలేం
లే
ఇలా కత్తవా పారా
అందుకో
దుఃఖానికి
గట్టు కట్టాలి.

*

3

మిగిలే మనుషులు

~

మాట్లాడాలని వుంది
ఇన్ని యోజనాల దూరం దాటి వచ్చి
ఏం మాట్లాడకుండా
అరిగిన కాళ్లతో
చినిగిన కండువాతో
ఉత్తినే అలా చేతులు వూపుకుంటూ
కదిలివచ్చేయటం
ఏమంత సౌఖ్యంగా
       అనిపించలేదు
మాట్లాడాలి
మాట్లాడాలనుకుంటేనే ఐపోదు
కలిసి కలివిడిగా తలో ఇంత గంజి తాగాలి
కుదిరితే
ఒకరి నోటికి ఒకరు
ఇంత ముద్దని ఆప్యాయంగా
తినిపించుకోవాలి
నీకూ నాకూ మధ్య ఎన్ని గోడలున్నా
దీపం వెలుతురులో
అవి ఇట్టే కరిగిపోతాయి
మాట్లాడాలనుకుని మాట్లాడకుండా
తిరుగుముఖం పట్టడం
తిరుగుముఖంలోని దిగులుని
ఎవరితో చెప్పుకుంటే
       చల్లారుతుంది
దించాల్సిన వద్దే
గుండెబరువుని దించుకోవాలి
మాట్లాడటం
వీలుకాని పనేం కాదు
కలవని మనుషులనూ
మాట
ఇంత మట్టి వంతెన వేసైనా
      కలుపుతుంది
మాట్లాడకుండా వచ్చేయటం
ఏమంత బాలేదు
మాట్లాడితేనే
మనుషులు కలుస్తారు
కలిసిన మనుషులే
మాట్లాడుకోవటానికి మిగుల్తారు.

*

బాలసుధాకర్ మౌళి

జూన్ 22, 1987 లో పోరాం గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో పుట్టాను. ఎనిమిదిన్నరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సమాజం తరగతిగదిలో సకల అంశాలతో ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. కవిత్వమంటే ఇష్టం. 2014 లో 'ఎగరాల్సిన సమయం', 2016 లో 'ఆకు కదలని చోట' కవితా సంపుటాలను తీసుకుని వచ్చాను. కథంటే అభిమానం. మొదటి కథ 'థింసా దారిలో' 2011లో రాశాను. మొత్తం ఐదు కథలు. ఇన్నాళ్ల నా పాఠశాల అనుభవాలను విద్యార్థుల కోణంలోంచి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చిస్తూ కథలుగా రాయాలని ఆకాంక్ష. గొప్ప శిల్పమున్న కథలు రాస్తానో లేదో గాని - ఇవి రాయకపోతే వూపిరాడని స్థితి.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు