దేశంలో యెప్పుడు యే సామాజిక ఉపద్రవం సంభవించినా పౌర హక్కులకు విఘాతం కలిగినా మానవ హక్కులకు భంగం వాటిల్లినా .. ప్రతి సందర్భంలోనూ హక్కుల యోధుడు బాలగోపాల్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. సమాజం పెడదారిన నడుస్తున్నప్పుడల్లా పాలకుల నియంతృత్వ ఉక్కుపాదాల కింద ప్రజాస్వామిక విలువలు బలి అవుతున్నప్పుడల్లా బాలగోపాల్ ఉంటే ..? అని అతను లేని లోటును ఫీల్ అవుతూ ఉంటాం.
అతని మాట అతని ఆలోచన అతని ఆచరణ యివాల్టి సమాజానికి ఆదర్శం అని భావిస్తాం. అయితే హక్కుల కార్యకర్తగా ఆయన్ని vanguard గా నిలిపే క్రమంలో సాహిత్యంలో ఆయన చేసిన కృషి బ్యాక్ బెంచ్ కి పరిమితం అయిపోయింది. ‘నాది సాహిత్య క్షేత్రం కాదు’ అని ఆయన ఎన్నిసార్లు ప్రస్తావించినప్పటికీ సాహిత్య విమర్శలో బాలగోపాల్ వేసిన ముద్ర చాలా బలమైంది. సాహిత్య విమర్శలో రూప సారాల గురించి బాలగోపాల్ చేసిన ప్రతిపాదనలు లేవనెత్తిన ప్రశ్నలు యివాళ్టికీ ప్రాసంగికాలు. సాహిత్యంలో సాహిత్య విమర్శలో ఖాళీలను గుర్తించి వాటిని పూరించటానికి పూనుకున్నవాడు బాలగోపాల్.
చాలామంది బాలగోపాల్ సాహిత్య విమర్శ ప్రస్థానాన్ని రెండు దశలుగా చూస్తారు. తొలినాళ్లలో మార్సిజానికి నిబద్ధుడైన విమర్శకుడిగా ఉంటే తర్వాత కాలంలో మార్క్సిస్టు విమర్శలో సైతం పరిమితుల్నీ ఖాళీలనీ ఆయన గుర్తించాడు. సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరపాటనీ సాహిత్యం పాత్ర అంతటితో మాత్రమే ముగిసిపోదని జీవితంలోని ఖాళీలను పూరించడానికి సైతం సాహిత్యం తోడ్పడాలని ఆయన బలంగా వాదించాడు. సాహిత్యంలో సౌందర్యాన్ని తెలుసుకోవటానికి శిల్పాన్ని వ్యాఖ్యానించడానికి మార్క్సిస్టు సాహిత్య విమర్శలో పరికరాలు లేవని ఆయన భావించినంత మాత్రాన ఆయన్ని రూపవాది వాదిగానో మార్క్సిస్టు వ్యతిరేకి అనో ముద్ర వేయలేం.
సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిజం వుపయోగపడినట్లే శిల్పాన్ని అధ్యయనం చేయటానికి సైతం మార్సిస్టు విమర్శ శాస్త్రంగా వుపయోగపడుతుందని కొందరు విమర్శకులు బాలగోపాల్ వాదనలను పూర్వపక్షం చేసినప్పటికీ ఆయన లేవనెత్తిన అంశాల మీద యెక్కడో వొకక్కడ చర్చ కొనసాగుతూనే వుంది. ఆ విధంగా బాలగోపాల్ ఆలోచనలు ప్రగతిశీల సాహిత్య అధ్యయనాల్లో విమర్శకుల చేతికీ బుర్రకీ పనిపెడుతూనే వున్నాయి. ప్రజా పోరాటాలే మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత సమస్యలకు పరిష్కారాన్ని చూపగలవు అని బాలగోపాల్ చేసిన తీర్మానం సాహిత్యాన్నికే కాదు సామాజిక శాస్త్ర అధ్యయనాలకు ఆచరణకు సైతం అన్వయించుకోవచ్చు.
ఒక్కోసారి జీవితాన్ని అన్ని కోణాల్లోంచి చూడ్డానికి మన దృక్పథమే అడ్డుపడవచ్చు అన్న బాల్ గోపాల్ ఆలోచనని కూడా శుద్ధ కళావాదులు వక్రీకరించారు. అసలు దృక్పథమే అక్కర్లేదని, దృక్పథం కళాత్మక అభివ్యక్తిని నాశనం చేస్తుందనీ ఆధునికోత్తరవాదులుగా ప్రకటించుకొన్న అనిబద్ధజీవులు ప్రచారం గావించారు. ఇది బాలగోపాల ఆలోచనలకు పూర్తిగా విరుద్ధమైనది. ఆయన ఆలోచనలు ఆచరణ మనిషి మీద ప్రేమతో చేసినవేగానీ సిద్ధాంతాల పట్ల ద్వేషంతో కాదు.
సామాజిక నేపథ్యంలో సాహిత్యాన్ని పరిశీలించటం అవసరమే గాని అక్కడితో సాహిత్య విమర్శ ఆగిపోదు, ఆగిపోకూడదు అని బాలగోపాల్ వక్కణ జీవితంలోని అన్ని కోణాల్లోకీ విమర్శనాత్మక దృష్టి విస్తృతం కావాలన్న ఆకాంక్షతో చేసినదే. జీవితాన్ని కేవలం వస్తుగతంగా అర్థం చేసుకునే ప్రయత్నంలో మార్క్సిజం చేసిన మౌలిక అవగాహనపై మాత్రమే ఆధారపడి యాంత్రికతకు గురైతే పరిపూర్ణమైన సాహిత్య సిద్ధాంతం రూపొందించడం సాధ్యం కాదని చెబుతూ మార్క్స్ తదనంతర కాలంలో చారిత్రక భౌతికవాదం ప్రాతిపదికపై విస్తరించిన సాహిత్య సిద్ధాంతాలను అధ్యయనం చేయకపోవడం వల్లే తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు యేర్పడ్డాయని ఆయన హెచ్చరించారు. సమాజంలోని విరుద్ధ శక్తుల మధ్య సైద్ధాంతిక భావజాల చట్రాల మధ్య సామాజిక సంబంధాల మధ్య జరిగే ఘర్షణల్ని వ్యాఖ్యానించే క్రమంలో మనిషి కేంద్రంగానే సరైన సాహిత్య సిద్ధాంతాలు నిర్మించుకోవాలని పదే పదే ఉద్ఘోషించాడు.
పీడత వర్గాల నుంచి వెలువడే సాహిత్యం కుల వ్యవస్థ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను ధ్వనింపచేస్తుందనీ రచయితలు ప్రజా జీవితానికి దగ్గర అయినప్పుడే శిల్పరీత్యా మంచి రచనలు వస్తాయనీ 80వ దశకంలోనే బాలగోపాల్ గుర్తించాడు. ప్రజా జీవితానికి దూరమై దృక్పథరాహిత్యంతో కాలక్షేపరచనల చేస్తూ రచయితలు సాహిత్య గోదాలోకి దిగి తామే సాహిత్యోద్ధారకులుగా జబ్బలు చేరుకుంటున్న వేళ బాలగోపాల్ మాటలు సరైన దిగ్దర్శనం చేస్తాయి.
అంతేకాదు; భిన్న అస్తిత్వాలకు చెందిన రచయితలు మేధావులు శిబిరాలుగా విడిపోయి స్వీయ మానసిక ధోరణికి గురైన సాహిత్య సమాజంలో ఘర్షణతో కూడినదైనా వొక సంవాదం లేదా వొక సంభాషణ నిరంతరం జరగాలనే బాలగోపాల్ ఆశించారు. సంభాషణకే చోటులేని హింసాత్మకమైన యేకధ్రువ రాజకీయాలు బలపడి ఫాసిజం సామాజిక ఆమోదం పొందుతున్న అసంబద్ధ సందర్భంలో, కళా సాహిత్య అభివ్యక్తి స్వేచ్ఛకే ప్రకటిత అప్రకటిత ఆంక్షలు విధిస్తున్న సంక్లిష్ట సమయంలో, గౌరవప్రదంగా జీవించే హక్కు సైతం మృగ్యమౌతున్న సంక్షోభ కాలంలో మనిషిని ప్రేమించి మానవీయ విలువల్ని విశ్వసించిన విముక్త మేధావి బాలగోపాల్ ని సాహిత్యకారులు అందరూ అధ్యయనం చేయాల్సి వుంది. ఆయన ఆచరణని అందిపుచ్చుకోవాల్సిన అవసరం వుంది.
*
చిత్రం: నర్సిం
Add comment