“నా ఇష్టాన్ని నువ్వు ప్రేమంటావో
కామం అంటావో.. మరోటి అంటావో
నాకు ఇవన్నీ ఉత్తుత్త మాటల్లా వినిపిస్తుంటాయి
అర్థాలు కోల్పోయిన పదాల్లా
నిన్ను చూడగానే నాలో ఏవేవో తంత్రులు మీటిన సవ్వడులు
అవి నీలోనూ సంచలిస్తే
మనం తంత్రీ స్వర తరంగాల్లా కలిసి పోదాం..
ఎవరి నమ్మకాల కోసమో
పందిట్లో వేషాలు కట్టి నటించొద్దు
స్వచ్ఛతకు ముళ్లేసి మలినం చెయ్యొద్దు
కుంచించుకుపోయిన జడ పదాల్లోకి
మనల్ని కుదించుకోవడమెందుకు
మన నేలను ఆకాశాన్ని
ఇరుకిరుకు గదుల్లోకి సర్దడం నాకిష్టం లేదు
కాదంటే ఈ లోకం మనల్నేం చెయ్యగలదు చెప్పు
చీకట్లోకి తోయడం తప్ప
చీకటి నాకు కొత్త కాదు
నువ్వు సరేనంటే
ఎంతటి చీకతినైనా ఎదిరించడానికి నేను సిద్ధమే
రా…! నాతో
గోడలు మేడలూ లేని
ఈ నల్లని ఆకాశంలోకి
చూడు! ఎంత చిమ్మని చీకటో..
ఈ చీకట్లో నువ్వూ నేనే
సూర్య చంద్రులం”
–సుల్తాన్
తెలుగులో సీరియస్ కథలకు ఉన్నంత ఆదరణ విలువ ప్రేమ కథలకు లేదు. నిజానికి కలం పట్టిన ప్రతి కథకుడు మొదట ప్రేమ కథలు లేదా దాని చాయలతో కూడిన కథల్నే రాస్తాడు. అందుకే అఫ్సర్ “ప్రేమ కరుణ లాంటివి గొప్ప భావనలు. ఎప్పటికైనా సాంస్కృతిక, సాహిత్య రూపాలు చేరుకోవాల్సిన అంతిమ మజిలీలు. వాటి చుట్టూ ఎంత సాహిత్యం వస్తే అంత మంచిది. అయితే ఆ రెండు భావనలు సామాజికతకు భిన్నంగా నైరూప్యంగా ఎప్పుడూ ఉండవని గుర్తించాలి. పైగా విద్వేషం పెరిగిపోతున్నసామాజిక సందర్భంలో ప్రేమ అవసరమే. అయితే అది కమర్షియల్ సాహిత్యములో ఉండేలాంటి అమ్మాయి-అబ్బాయి ప్రేమ మాత్రమే కాకూడదు” అంటాడు. అసలు ప్రేమ కథల్ని మామూలు కథలుగా కూడా చూడలేని ఒక చూపు ఎందుకు వచ్చింది. ఏ భావ జాలాలు అలాంటి దృష్టిని పెంచాయి అనేది చర్చనీయాంశం.
చలం దగ్గరి నుండి ఇవ్వాల్టి కిరణ్ చర్ల దాకా తెలుగులో అనేకమంది ప్రేమ కథలు రాశారు.
ప్రేమ కథలు అంటే ‘కామపు’ కథలో, ‘సరసమైన కథలో’, టైంపాస్ కథలో కాదు వాటి వెనక కూడా సముద్రమంత హోరు ఉంటుందని, తుఫానంతటి సంఘర్షణ ఉంటుందని నిరూపించి మనల్ని సుడిగుండాల్లో దించిన కథలు చాలా ఉన్నాయి. అలాంటి స్వచ్ఛమైన ప్రేమను, వ్యక్తిత్వాన్ని, పెనుగులాటను, వెలుతురును మన గుండెల నిండా నింపే కథ స్కైబాబా రాసిన లోహం’. ఈ కథ 2005లోనే ఒక చిన్న బుక్ లెట్ గా వచ్చింది. తెలుగులో ముస్లింవాద సాహిత్యానికి ఒక ఐకాన్ గా నిలబడ్డ స్కై బాబా కథల సంపుటి ‘బేచారే’ లోనూ ఇది చోటు చేసుకుంది.
ఇదొక త్రీ డైమెన్షనల్ లవ్ స్టోరీ. పద్మ, సుల్తాన్, కిరణ్ ముగ్గురు ఒకే కళాశాలలో చదువు కుంటుంటారు. సుల్తాన్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. ఏదైనా తనకు నచ్చితేనే చేస్తాడు. జీవితాన్ని తనకు నచ్చినట్లు గానే జీవిస్తాడు. కిరణ్ జీవితంలో తనకు నచ్చింది పొందేదాకా పట్టుదలగా కృషిచేసి దాన్ని సాధించే రకం. ఒకసారి సొంతమయ్యాక దాన్ని చాలా తేలిగ్గా తీసుకునే తత్వం. ఈ ఇద్దరు పద్మను ప్రేమిస్తారు.
ఒకసారి కిరణ్ తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ “ఇంకో విషయం నీకు చెప్పాలి పద్మజా. సుల్తాన్ అంటే నాకు దురభిప్రాయం లేదు. వాడు చాలా మంచి వాడు. కానీ వాడు ఎప్పుడేం చేస్తాడో వాడికే తెలియదు. అసలెప్పుడైనా మనతో వాడి ఏయిమ్ ఏంటో చెప్పాడా? అది వాడికే తెలియదు. ఎప్పుడేది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. అసలు వాడేదైనా జాబ్ చేస్తాడా అనేది కూడా నమ్మకం లేదు. జాబ్ అంటే ఇంట్రెస్టే లేదంటాడు. ఎప్పుడూ కవిత్వం, సాహిత్యం అంటూ తిరుగుతుంటాడు. ఎక్కడ సాహిత్య సభ జరిగితే అక్కడ హాజర్! మంచి కవే కావొచ్చు. కాదనను. కానీ ఇలా కవిత్వం కవిత్వం అని తిరిగే వాళ్ళంతా ఏమైయ్యారు. శ్రీ శ్రీ దగ్గర్నించి అలిశెట్టి దాకా ఎంతో మంది అతి దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. నువ్వు ఆలోచించు పద్మజా! నీకు సుఖమైన, ధనవంతమైన జీవితం కావాలా? అతి పేదరికం కావాలా? పైగా సుల్తాన్ ముస్లిం అన్న సంగతి మరిచిపోతున్నావేమో?!” అంటాడు. పద్మజకు ఏం చేయాలో అర్థం కాదు. తనకు ఎవరంటే ఇష్టమో తేల్చుకోలేక తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోతుంది. సుల్తాన్ ముస్లిం కాకపోయి ఉంటే ఎంత బాగుండు. అనుకుంటుంది. మరో వైపు కిరణ్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటాడు. కొంచెం టైమ్ కావాలని వాయిదా వేస్తుంటుంది పద్మజ.
ఓ రోజు పైన చెప్పిన కవితను చదివిన సుల్తాన్ ను కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తుతుంది పద్మజ. తరువాత ప్రేమకు, పెళ్ళికి, మతానికి మధ్య ఉన్న సన్నని గీతల గురించి ఇద్దరూ చాలా సేపు వాదించుకుంటారు. వాదన ఒక కొలిక్కి రాక ముందే ఔనూ! ఒకసారి మీ ఇంటికి తీసుకెళ్తావా సుల్తాన్? అని అడుగుతుంది పద్మజ. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే పద అంటూ సుల్తాను పద్మజను తన ఇంటికి తీసుకెళ్తాడు. సుల్తాన్ వాళ్లది ఒక్క గది మాత్రమే ఉండే చిన్న ఇల్లు. అందులోనే పాత సామనంతా కుక్కి కుక్కి ఉంటుంది. ఆ చిన్న గదిలోనే వాళ్ళమ్మ చాంద్ బేగం, చెల్లెళ్ళు హసీనా, నస్రీన్ ఉంటారు. చాలా సేపు వాళ్ళ పేదరికాన్ని బలవంతంగా భరించి తిరిగి వెళ్ళేప్పుడు “మీ నాయ్న ఏం చేస్తడు సుల్తాన్?” అని అడుగుతుంది పద్మజ. లారీ డ్రైవర్ అంటాడు సుల్తాన్. మరి ఇల్లు గడవడం, నువ్వు చదువుకోవడం కష్టం కదా! అంటుంది. బస్టాప్ పక్కనే ఉన్న ఒక పాన్ డబ్బాను చూపించి అది మాదేనని రోజూ సాయంత్రం వచ్చి తానే తీస్తానని చెప్పి పద్మజను బస్సెక్కిస్తాడు. పద్మజకు సుల్తాన్ కుటుంబ పరిస్థితి, పేదరికం అన్నీ అర్థం అవుతాయి. చివరాఖరికి తాను ఆ ఇంట్లో ఇమడలేనని అర్థం చేసుకొని కిరణ్ నే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటుంది.
ఒక రోజు పద్మజ ఒంటి నిండా నగలు దిగేసుకొని కారులో ఎటో పోతుంటుంది. దారిలో సుల్తాన్ కనిపిస్తే కారు ఆపి కిందికి దిగుతుంది. సుల్తాన్ చాలా మామూలుగా పద్మజను పలకరిస్తాడు. ప్రస్తుతం తాను చాలా బీజీగా ఉన్నానని తరువాత కలుద్దామంటాడు. తెల్లవారి ఏదో చోట కలుసుకొని తాను ఎగ్జామ్ ఎందుకు రాయని సంగతిని, పెళ్ళికి కనీసం కార్డ్ అయినా ఇస్తావనుకున్నానని సుల్తాన్, నువ్వొక ముస్లింను పెళ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులు ఉరి పెట్టుకొని చస్తామన్నారని, చివరికి ‘భద్రమైన జీవితం’ వైపే మొగ్గు చూపానని, కానీ ఇప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావని పద్మజ ఇలా ఎన్నో విషయాలను, జ్ఞాపకాలను కలబోసుకుంటారు. చివరికి ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తుంది పద్మజ. పెళ్లి చేసుకోలేదు కానీ సలీమా అనే అమ్మాయితో కలిసి సహజీవనం చేస్తున్నానని ఇట్లా ఆ మాటా ఈ మాటా చెప్పి కిరణ్ గురించి అడుగుతాడు. “కిరణ్ కేమైంది బాగానే ఉన్నాడు. ఉద్యోగం, బిజినెస్.. ఇంటికొచ్చినా అదే ఆలోచన. మాకో బాబు. వాడి గురించంతా నేనే పట్టించుకోవాలి. సెలవు దినాల్లో నైనా మాతో గడపమంటే, బీరువాలోంచి నీక్కావాల్సిన డబ్బు తీస్కెళ్ళు, ఎంతైనా ఖర్చు చెయ్యి. కానీ ఇంకొన్నాళ్లు నన్ను వదిలేయ్ పద్మజా. ఇంకా నాలుగైదేళ్లు కష్టపడ్డానంటే తర్వాత కూర్చుని తినొచ్చు అంటాడు. నాకేమో బోరు కొట్టి చస్తున్న. మామూలు మగవాడిలాగే పెత్తనం చలాయిస్తాడు. ఎన్నో సార్లు గొడవ పడ్డాం. ఒక్కో సారి ఎంత అసహనంగా, ఎంత అసంతృప్తిగా ఉంటుందో చెప్పలేను” అంటుంది.
కాలేజీ రోజుల్లో ఎంతో రెబల్ గా ఉండే నువ్వు అందరి ఆడవాళ్లలాగే మారిపోయావని అంటాడు సుల్తాన్. ఓ రోజు సలీమా గదికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వస్తుంది పద్మజ. ఇంటికి వచ్చి ఆమె సింప్లిసిటీ చూసి ఆశ్చర్య పోతుంది. పెట్టుకున్న నగలన్నీ తీసి పారేస్తుంది. క్రమంగా మెదడులో ఏదో అలజడి మొదలౌతుంది. ‘తను బతకాల్సింది ఇట్లా కాదు. ఇట్లా కోళ్ళ ఫారంలో కోడి లాగా బతకడం దారుణం. తనకిష్టమైనట్లుగా జీవించాలి. తన జీవితం ఇలా ముగిసి పోకూడదు. తను జీవించాల్సిన జీవితం వేరే ఉంది. ఏదో ఒకటి చేయాల్సిందే” అని పరిపరి విధాలా ఆలోచిస్తుంది.
ఇదొక ఒరిగామి షేడెడ్ కథ. అంటే ఈ కథకు ఎన్నో ముఖాలున్నాయి. ఓ వైపు ప్రేమించిన వాడ్ని చేసుకోలేక భద్రమైన జీవితాన్ని ఎంచుకోవడం, మరో వైపు ముస్లిం మైనార్టీ యువకుడిని మతం కారణంగా ప్రేమకు దూరంగా ఉంచడం, జీవితాన్ని మనసుకు నచ్చినట్లుగా జీవించడం, లోహ పూరిత సమాజంలో ఒక లోహంగా కాదు చైతన్యమున్న మనిషిగా బతకాలనే ఎరుక, ఆడది ఒకసారి పెళ్లి చేసుకున్న తరువాత ఇంట్లో ఒక పనిముట్టులా పడి ఉండాల్సిందే అనే తీరుగా భర్తల ప్రవర్తన, పేదరికం వల్ల ప్రేమను త్యాగం చేయాల్సి రావడం, సలీమా నిరాడంబరత, చివరాఖరికి రెక్కలు తెగి పంజరంలో ఉన్న ఒక ఆడ పక్షికి మెల్ల మెల్లగా రెక్కలు మొలవడం… ఇలా చాలా లోతైన గాఢత నిండిన కథ ఇది.
కథ ఎత్తుగడ బంతి ఆటతో మొదలౌతుంది. జీవితం కూడా బంతి మాదిరిగానే గమ్యం లేకుండానే మారిపోయిందనే ఒక సూచన కనిపిస్తుంది. గుప్పెడంత ప్రేమ వెనుక జీవితం ఎంతగా నలిగి పోతుందో ప్రతి పుట చెప్తుంది. సుల్తాన్, సలీమ పాత్రలు పాఠకుడి గుండెలో నిల్చిపోతాయి. పద్మజ ఈ వ్యవస్థ నీతి, నియమాలకు, కట్టుబాట్లకు బలై పోతుంది. అయితే ఆఖరులో ఆమెలో ఒక మార్పును, చైతన్యాన్ని నింపడంలోనే కథకుడి విజయం దాగి ఉంది. ఏవో అలంకరణలు దిగేసుకొని అవి లోహపువనే సంగతే మర్చిపోయి తమ స్టేటస్ పెంచేవని భావించడంలోనే మనిషి పతనం దాగి ఉందని గ్రహింపజేస్తుంది ఈ కథ.
కిరణ్ వాళ్ళ కుటుంబం గుంటూర్ నుంచి వచ్చి తెలంగాణాలో స్థిరపడ్డ సెటిలర్ కుటుంబం. సుల్తాన్ తెలంగాణ మూలవాసి. పైగా అందరిలాగా భద్రమైన జీవితాన్ని కాదని పేదలు, పీడితులైన ముస్లింల గురించి పనిచేస్తుంటాడు. అంతే గాక తెలంగాణ కాన్షస్ నెస్ తో ఉంటాడు. ప్రత్యేక తెలంగాణ తప్పక వస్తుందని ఆనాడే చెప్పడం రచయిత ముందు చూపుకు నిదర్శనం.
ఈ కథ ప్రేమ గురించి, స్త్రీ వాదం గురించి, స్వార్ధం గురించి, ముస్లిం మైనార్టీల గురించి, వాళ్ళ పేదరికం గురించి, తెలంగాణ గురించి, లోహ సమానమైన సమాజం గురించి అనేక ప్రశ్నలు సంధించి కొలిమిలో కాల్చుతుంది. వేడి మీద ఉన్నప్పుడే లోహం మనకిష్టమైన ఆకారానికి తిరిగినట్టు కథ పూర్తయ్యేటప్పటికి మనల్ని సమాజంలోని అత్యంత పీడితులైన ముస్లింల పట్ల, స్త్రీల పట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పడేటట్లుగా చేయడంలో ఈ కథ విజయం సాధించింది. ప్రేమ పుష్పం వెనుక దాగిన అనేక లోహపు కంటకాలను గుండె లోతుల్లో గుచ్చే కథ ఇది. ఇది కాస్త పెద్ద కథే అయినా శిల్ప పరమైన బిగింపు వల్ల ఏ మాత్రం గందరగోళం లేకుండా చాలా సాఫీగా మనసుకెక్కుతూ గుండె గట్లను తెంచే కథ. ఇప్పటి ఊహా లోకపు, డిజిటల్ ప్రేమల్ని, కాలిక్యులేటెడ్ ప్రేమల్ని బద్దలు కొట్టే ప్రేమ కథ. సుల్తాన్ ఒక్కడు మన జీవితాల దృక్పథాన్ని సవరించి కాలానికి ఎలా ఎదురు నిలవాలో చెప్పి మన అందరికంటే ఒకింత ఎత్తు మీద నిలబడుతాడు. ఇప్పటి తరానికి ఈ కథ ఒక రీ లోడ్ చేసిన ప్రియావారికర్ హ్యాండ్ గన్.
*
ఈ కథ ఇంకా నేను చదవలేదు…. ఎందుకు చదవలేకపోయానా అనిపించింది ఈ వ్యాసం చదువుతున్నంత సేపూ… పూర్తయ్యాక కథ ఖచ్చితంగా చదవాలి అనిపించింది…
తనక్ యు శ్రీధర్ సాబ్ 🙂
Same! కథ ఎక్కడ దొరుకుతుంది?
ఈ కథ నేను నాలుగేళ్ళ క్రితం చదివాను. మీ విశ్లేషణతో కథను మరొక్కసారి గుర్తుచేసుకునే అవకాశం దొరికింది. ధన్యవాదాలు.
విమర్శ చాలా బాగుంది. కథ చదవాలి ..
అన్యాయం..
ఇంతమంది చదవలేదా !!
ఫేస్బుక్ లోనూ కథ అడుగుతున్నారు..
‘బేచారె’ భగ్నప్రేమ కథల’ పుస్తకంలో ఈ కథ ఉంది.
లేదంటే రేపటిలోగా ఇక్కడ pdf పెట్టే ప్రయత్నం చేస్తాం.
మంచి కథకి అంతే మంచి విశ్లేషణ. రెండూ చాలా స్పష్టంగా సూటిగా ఉన్నాయి. రచయిత స్కైకీ విశ్లేషకుడు శ్రీధర్ కీ ప్రేమపూర్వక అభినందనలు.
Thank you sir…
షుక్రియా సర్!
కథ చదవాలనే ఆసక్తి ఉన్న పాఠకులు వ్యాసంలో “చలం దగ్గరి నుండి ఇవ్వాల్టి కిరణ్ చర్ల దాకా…” అనే పేరాలో (రెండవ పేరా) ‘లోహం’ అని కథ పేరు బ్లూ కలర్ లో ఉంది. దాని మీద టచ్ చేస్తే కథ ఓపెన్ అవుతుంది. అప్పుడు చదువుకోవచ్చు. కథను సేవ్ చేసుకోవచ్చు కూడా.
లోహం పై శ్రీధర్ సమీక్షను ప్రస్తావిస్తూ స్కైబాబ గారు “ఒకింత న్యాయం చేశారు” అని పేర్కొన్నారు. అంటే ఎంతో కొంత అన్యాయం జేసిండ్రు. అనే అర్థం వొస్తుంది. జరిగిన అన్యాయం గురించి చెబితే బాగుంటది.
అన్నా! తెలుగు సాహిత్యంలో ప్రేమ కథలంటే చిన్నచూపు ఉంది. దానికెన్నో కారణాలున్నాయి. ‘లోహం’ కథను ఆంధ్రజ్యోతి వాళ్లు రెండు వారాలు వేయవచ్చు. అలా వేరేవాళ్ల కథలు రెండు వారాలు వేసినవి ఉన్నాయి. కానీ వారు వేయడానికి ఇష్టపడలేదు. అదొక అన్యాయం. తర్వాత కథా సిరీస్ వాళ్లు ఈ కథను వారి వార్షికలోకి తీసుకోవచ్చు. కాని వారు ఆ పని చేయలేదు. ఆ కథే కాదు, 2000లో వచ్చిన ఛోటీ బహెన్ గానీ, 2007లో వచ్చిన వెజిటేరియన్స్ ఓన్లీ గానీ, 2010లో వచ్చిన మజ్బూర్ (ఈ కథనే మొన్న జూలై ఫ్రంట్‌లైన్ పత్రికలో వేశారు) గానీ, 2013లో వచ్చిన మిస్ వహీదా గానీ, 2015లో వచ్చిన అన్‌మోల్ రిష్తే గానీ తీసుకోలేదు. ఆ కథలకు తరువాత ఎంత పేరొచ్చిందో తెలిసిందే. 1999లో షాజహానా రాసిన సిల్‌సిలా గానీ, 2004లో రాసిన సండాస్ గానీ తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు జరిగిన అన్యాయాలు బోలెడన్ని బయల్పడతాయి.
ప్రేమకథల పట్ల నీకు కూడా షానా చిన్నచూపు ఉంది కదా! నువ్వు కూడా ఏక్ నయీ ఖిడికీ (2014) గానీ, అన్‌మోల్ రిష్తే, లవ్ యూ షాహిదా (2015) గానీ మన తెలంగాణ వార్షికలోకి తీసుకోలేదు. ఇది కూడా అన్యాయమే! ప్రేమ కథల వెనుక ఉన్న జీవితాలను, వెతలను, సున్నితత్వాలను, ముస్లిం స్త్రీల గుండె లోతులను, సంస్కృతిని చూసే చూపు మన సాహిత్య విమర్శకులకు కొరవడింది!
ఎనీ హౌ, జరిగిన అన్యాయాలు వల్లె వేయించినందుకు షుక్రియా!
‘లోహం’ కథ నా మొదటి పుస్తకం!
……..
నా ‘అధూరె’ కథలకు ముందుమాట రాస్తూ కె.శ్రీనివాస్ ఇలా అన్నారు:
”ఇప్పటి రచయితల్లో స్కైబాబా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అతని వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలు అందుకు కారణం. ముస్లిమ్ వాదమయినా, తెలంగాణ వాదమయినా అతను దాన్ని లోపలికి తీసుకుని సంచలిస్తాడు. రచయితగా కూడా అతను కార్యకర్తగా, కార్యకర్తగా కూడా అతను రచయితలా అనిపిస్తాడు… అనుభవాన్ని ఆవేశాల్ని పరమ ప్రామాణికంగా తీసుకునే వైఖరి వల్ల అనేక పొరపాట్లు జరుగుతాయి. స్కైబాబా కూడా పొరపాట్లు చేశాడు. కాకపోతే, స్కై పనులు కూడా చేస్తాడు. అభిప్రాయాల తీవ్రత వల్ల, అవి వ్యక్తమయ్యే తీరు వల్ల అతను అపార్థాలను, ఒక్కోసారి వ్యతిరేకతలను మూటగట్టుకుంటాడు. కానీ, ఆ తీవ్రత వెనుక ఉన్నది సున్నితత్వమేనని అతన్ని దగ్గరగా ఎరిగినవారికి తెలుసు. ఇప్పుడు ఈ కథలు చదివినవారికీ అది తెలుస్తుంది. అస్తిత్వ సంక్షోభాన్ని మనసులోకి జీవితంలోకి తీసుకున్న స్కై తనను తానొక సమూహ జీవిగా చూసుకుంటాడు. సమష్టి ప్రయోజనమే అతనికి ప్రాధాన్యం. అందుకే అతను, మొదట ఇతరుల పుస్తకాలు వేసి ఆ తరువాత తన సొంత పుస్తకానికి పూనుకున్నాడు. కవిత్వంలో కూడా అంతే. ఎక్కడన్నా విన్నారా, కవులు తమ సొంత పుస్తకాలు కాక, సంకలనాలు వేయడం? ఇప్పుడీ కథల పుస్తకం కూడా అంతే. ముస్లిం కథల సంకలనం వేసిన తరువాతనే, ఇప్పుడీ సొంత కథల పుస్తకం వేస్తున్నాడు.”
అలా నేను అనేక సంకనాలకు, పత్రికలకు సంపాదకత్వం వహించాను. తరువాత సొంత రచనల పుస్తకాలు కూడా ఎక్కువే వచ్చాయి. కాని నా మొదటి పుస్తకం మాత్రం ‘లోహం’! ఇది వెలువడే నాటికి తెలుగు సాహిత్యంలో ‘భూకంపం పుట్టించిన ముస్లింవాద కవిత్వం’గా (పెన్నా) పేర్కొనబడిన ‘జల్‌జలా’, మైలురాయిగా నిలిచిన ‘వతన్’ ముస్లిం కథా సంకనం, మానవమాత్రుడన్నవాడు ఇంతటి ప్రత్యేక సంచిక వెలువరించగలడా (అసుర) అని ప్రశంసించబడిన ‘ముల్కి’ ముస్లిం స్పెషల్, గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై ముస్లిం కవిత్వం ‘అజా’, ముల్కి తెలంగాణ పత్రిక లకు సంపాదకత్వం వహించాను. సంకనానికి సరిపడా ముస్లింవాద కవిత్వం అచ్చయినా అప్పటికింకా పుస్తకం వేసుకోలేదు!
అట్లాంటి సందర్భంలో 2000 నుంచి అప్పుడప్పుడు కథలు రాస్తూ వస్తున్న నేను 2004లో రాసిన కథ ‘లోహం’. ఆంధ్రజ్యోతి సండే చూస్తున్న వసంతక్ష్మి, కథలు చూసే ఖదీర్‌బాబు కథ పెద్దగున్నదన్న కారణంగా వేయలేమని వెనక్కిచ్చారు. అప్పుడు అక్బర్ బొమ్మతో నా మొదటి పుస్తకం వేసిపారేసాను!
తరువాత ఆ కథకు చాలా రెస్పాన్స్ వచ్చింది. సినిమా కథ చేయవచ్చని అన్నారు. నా కథలు చదువుతుంటే కళ్ల ముందు దృశ్యం కదలాడుతుంటుందని చాలామందే అన్నారు. మీ కథేనా అని కూడా ఎక్కువమంది అడిగారు. కాని ‘లోహం’ కథకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు.
నా ప్రేమకథల్లో నాకు చాలా ఇష్టమైన కథల్లో ‘లోహం’ ఒకటి! అందుకోసమే రాసిన ఆ రెండు కవితలు కూడా ఇష్టం! అందులోని సలీమా పాత్ర అంటే ఇష్టం!
మొత్తానికి ఇన్నాళ్లకు వెల్దండి శ్రీధర్ ఆ కథకు, నా రాతకు, నా తపనకు ఒకింత న్యాయం చేసాడు. సారంగలో తన కాలమ్ ‘కథా కచ్చీరు’లో ‘లోహం’పై మంచి విశ్లేషణ రాసి నాకెంతో సంతోషాన్ని బహుమతిగా ఇచ్చాడు. బహుత్ షుక్రియా శ్రీధర్! ముద్రించిన అఫ్సర్ కు షుక్రియా!
మిత్రులారా! చదివి స్పందించండి!
ఆ కథ ఇంతవరకూ చదవని నా మిత్రవర్గంలోని దుర్మార్గులకు ప్రేమతో…
– మీ ‘స్కై’