“నా వాకిట్లో కల్లాపి నన్నే చల్లుకోనివ్వండి
నా రోడ్డు మీద కంకర నన్నే పోసుకొనివ్వండి
నా పూల దండను నన్నే గుచ్చుకోనివ్వండి
నా కన్నీళ్ల పాళీతో నా చరిత్రని నన్నే రాసుకో నివ్వండి” –
( వరదయ్య- చిక్కనవుతున్న పాట నుంచి) .
ఇది ఆత్మగౌరవ పంథా. మనవి మనకే కావాలనే తెగింపు.నాకు చెందినవి నాకు మాత్రమే దక్కాలనే ఒక చిరకాల స్వప్నం. ఇది దళిత బహుజన తాత్వీకత. ఈ సంక్షోభ సమయానికి అవసరమైన సిద్ధాంతం.
పల్లిపట్టు నాగరాజు “యాలై పూడ్సింది”చదువుతూ ఉన్నంత సేపు ఏదో ఒక పెయిన్ నన్ను వెంబడించి నడుస్తూనే ఉంది.కొత్త కుర్రాళ్లలో చలనం లేదని , చిక్కబడ్డ వాక్యమే రావడం లేదని బాధ పడుతున్న వాళ్ళకి పల్లిపట్టు నాగరాజు వంటి వాళ్ల కవిత్వాన్ని చూపించాలి, ఎంత గొప్ప వాక్యాన్ని పట్టుకున్నాడీ కుర్రాడు. ఎక్కడి భాష ఎక్కడి యాస. ఏళ్ల తరబడి సీనుకు కురవని నేల మీద కుంభ వృష్టి కురిస్తే వచ్చే అనుభూతి పలవరించాలే తప్పా ఇంకో ఆప్షన్ లేదు.ఆ మట్టి వాసన, ఆ దూకుడు, ఆ హోరు గాలి, వాన కి తడిసిన నేల బురద ఒకటా రెండా ఎన్ని అనుభూతులో, పల్లిపట్టు నాగరాజు కవిత్వం మనల్ని అల్లుకుపోతుంది. ఒక పట్టాన విడిచిపెట్టదు.
రాయలసీమ… అందునా చిత్తూరు అందులో మళ్ళీ కన్నడ సీమకి దగ్గర గుభాళించే యాస, అందునా టీచర్ పోస్టు,పిల్లలతో సావాసం, వీటన్నిటికీ మించి దళిత వాడల్లో పెరిగినవాడు, అక్కడి జీవితాన్ని కాచి వడపోసినవాడు. జీవితం అద్దం ముందు అగపడతా ఉంటే లోపల ఘర్షణ జరగకుండా ఎలా ఉంటుంది. తన వయక్తికంగా లోపల జరిగే ఆలోచన ఒకటైతే బయట జరిగే వాస్తవం మరొకటి . ఆ మానసిక సంఘర్షణ లోనుంచి రాసుకున్న పదాలివి. అలాంటి సంఘర్షణ లోనుంచి కవి బయటకి వస్తే తాను ఎటువైపు నిలబడాలో అన్నది తానే నిర్ణయించుకోవాలి . అలాంటి సంవేదనల్లోనుంచి బయటకు తనను తాను మాట్లాడుతున్నాడీ కవి.
పుట్టిన కాడ్నుంచి దుక్కమే కదా ఎట్టా ఉగ్గబట్టుకుని ఉన్నాడోగాని. కవిత్వం లోపలికి రాగానే “కుశాల” అనే కవిత రాసుకున్నాడు. జీవితమంటే చిన్ని చిన్ని సంతోషాలు సమాహారమని గుర్తించాడు. ఇంట్లో కోడి కాడనుంచి, చేలో పంట నుంచి, బఱ్ఱె ఈనితే, కవలపిల్లలు పుడితే అబ్బా ఏమన్నా అలవిగాని సంతోషమా, దాన్నే కాగితం మీద పెట్టాడు నాగరాజు. జీవితాన్ని సాళ్ళు సాళ్ళు గా దున్నుకుంటు కుశాల పడతా తనకున్న బాధల్ని మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నాడు.
పిచ్చుకలు వాలిన కిటికీ లోనుంచి గాలిమిత్రుని భుజాలపై చేతులు వేసుకుని
కనురెప్పలు తాకిన ప్రతీ చోటా కవిత్వం మొలకెత్తినట్టు అతను కవిత్వం లోనికి దూసుకుపోతున్నాడు. ఎందుకు చదవాలి నాగరాజుని. కేవలం వర్తమానాన్ని రాసినందుకేనా, అందుకు చాలా కవిత్వం వీధుల నిండా పారుతుంది.సోషల్ మీడియాలో రోజుకో పద్యం చొప్పున వచ్చి జోబులో పడుతున్న వేళ లో ఇతన్ని మాత్రమే మనం కొత్త తరం నుంచి ఎందుకున పరిగణన లోకి తీసుకోవాలి..?
సమస్యని కేవలం బయటనుంచి చూడడం అలవాటు లేదు ఇతనికి, దాన్ని పది మందికి అర్ధం అయ్యేలా చెప్పాలనే తపన కనబడుతుంది. ఆ సమస్య వల్ల కలిగే అనర్ధాలు విడమరిచి చెప్పాలనే ఆశ ఉంది
దానికి తోడు అతని దగ్గర సమస్యని కవిత్వం చేయగల నేర్పుఉంది ఇంకెలా ఆగగలడు. అందుకే ప్రతీ గాయాన్ని కవిత్వం మాత్రమే చేయాలని రాసాడు.
ముంబై రైతుల పాదయాత్రలో అతను రాసిన మాటలు చూడండి ఎంత పదునుగల్లవో
“ఎడతెగని ప్రవాహమై
చితికి బొబ్బకట్టిన పాదాల దేశమై
పగిలి నెత్తురు కారుతున్న రాజ్య ముఖ చిత్రంమై
వాళ్ళు ప్రవహిస్తున్నారు
వేల వేల సూర్యుళ్లు వాళ్ళ పాదాల కింద మొలుస్తున్నప్పుడు
వాళ్ళు ప్రవహిస్తున్నారు
వాళ్ళు ప్రవహిస్తున్నారు”
ఇక్కడ రైతుల వేదన వాళ్ళు శారీరకంగా పడుతున్న బాధ, కాళ్ళు పగిలి కారుతున్న నెత్తురు మరకలు, రాజ్య ముఖచిత్రం అనడం వెనక ఉండే ఇతని ఆలోచన చాలా బలీయమైన ఆకాక్ష ఉంది రైతుల ఉద్యమం నిలబడాలని.ఈకవితలోనే వ్యవసాయం లో వాడే క్రియా పనిముట్లని వాడుకుంటూ ఇతను చెప్పిన పోలికలు వల్ల ఆ కవిత గొప్పగా ఎలివేట్ కావడానికి ఆస్కారం కలిగింది. ఒక రైతు కూలీగా పనిచేసిన అనుభవం లోనుంచి నాగరాజు తాను అన్ని కాకపోయినా కనీసం కొన్నాయినా అనుభవించి ఉంటాడు ఆ రోజుల్ని తలచుకుంటూ తాను కూడా ఆ కుటుంబానికి చెందినవాడీనే అని చెబుతూ సంఘీభావాన్ని ప్రకటించాడు.
వర్తమానాన్ని వస్తువుగా మలిచి చాలా కవిత్వం రాసుకున్నాడు కానీ, ఇతని వేదిక దళిత కవిత్వం.చాలా భాగం అదే యవనిక మీదనుంచి మాట్లాడాడు.
“ఇళ్ళు” అనే కవితలో అతను ఈ దేశం మా ఇల్లు అని చెప్పే ఉద్దేశం తో మాట్లాడుతున్నాట్టు అనిపించి చాలా గొప్ప మాటల్లో ఆ అభివ్యక్తి ని పలికిస్తాడు.
” మా ఇళ్ళు అద్దాల మేడలు కాకపోవచ్చు
మా ఇళ్ళు బలిసిన బల్బులై వెలగక పోవచ్చు
మా ఇళ్ళనిండా
మా మూలుగులున్నాయి
మా ఆకటి నిప్పులున్నాయి
మా ఏడ్పులున్నాయి
మా వేదనలున్నాయి”
ముందు తరం దళిత కవుల్లాగే మాట్లాడినా ఇక్కడ అంతరాల్లో వస్తున్న మార్పుని గట్టిగా చెప్పడం చూస్తాము. “మా ఇళ్లు బలిసిన బల్బులై వెలగక పోవచ్చు” అనే ఒక్క మాట కవిత మొత్తాన్ని కవి ఏ కోణంలో నుంచి చెప్పదలుచుకున్నది అర్ధం అవుతుంది. ఇక్కడ వాళ్ళని గొప్ప అంటూనే మాకున్నదేదో మాకుంది మీ అంత మెరుపులు లేకపోయినా మాకున్న దాన్లోనే మేం మీకన్నా బాగున్నాం అని చెప్పే ఆత్మ గౌరవ ప్రతీకగా మనం చూడాలి. ఒకప్పటి నగేష్ బాబు, యండ్లూరి, పైడి తెరేష్ , సుందర్రాజు వీళ్లంతా ఈ భావననే చెప్పారు. మాది ఆత్మ గౌరవ సమస్య అని . అలా చెప్పుకుంటూ వచ్చిన ఆ క్రమంలోనే మనం ఈ కొత్తతరం కవి నాగరాజుని కూడా చూడాలి. బహుశా! ఇల్లు కవిత రాసిన కొంత కాలం తర్వాత రాసుకున్న కవిత “ఇంటిని కలగంటున్నాను” ఇందులో “ఇళ్ళు” కవితకి సీక్వెల్ అనదగిన అంశాలున్నాయి.ఇల్లు అంటే ఏ ఇల్లో ఇక్కడ కాస్త స్పష్టంగా చెప్పాడు. అతనికి రాసేప్పుడు ఉద్దేశం లేకపోయినా పాఠకుడికి కనక రాజకీయ పరిజ్ఞానం కాస్త ఉంటే.ఆమధ్య బాగా ఊపందుకున్న ” ఘర్ వాపసీ” కూడా గుర్తుకురావొచ్చు.వచ్చినా కంగారు పడవాల్సిన పనేం లేదు.ఇతను చాలా సాదృశ్య పూర్వకంగానే మాట్లాడాడు అని మన గమనింపు లోకి వస్తుంది.ఇలాంటి కవిత్వం అంశాలు నేటి వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయి. అందుకే లక్ష్మీ నరసయ్య గారు, నాగరాజు ది రాజకీయ కవిత్వం అని అనగలిగారు. అంటే ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేకపోయినా దాని ప్రభావితం వల్ల నష్టపోయిన వర్గాల ప్రజల గురించి మాట్లాడడం అనేది అవసరం కదా అదే ఈ సంపుటికి బలంగా నిలబడ్డ ఒక అంశం. ” దుఃఖం” అనే కవితలో దేహం గురించి దేశం గురించి చాల విపులంగానే చెప్పాడు , దేశం లోపల తన దుఃఖాన్ని చూడమని ముక్తాయింపు నివ్వడం ఇతని వాక్యానికి లోపలి చూపు ఉందని గమనింపు లోకి తెస్తుంది.
“పండగ్గేద్ద” కవితలో పండగ పేరుతో చేసే దౌష్టాన్ని ప్రస్తావన కి తీసుకు వస్తాడు. ఫలానా అనే కవితలో తానెవరో చెప్పేసుకున్నాడు కాబట్టి మనం అతని కుల, మత వివరాలు కోసమేమీ ఆరాలు తీసేపనిలేదు. దర్శనం అనే కవిత పల్లిపట్టు రాసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో అది ఒక ట్రెండీ గా మారింది. తన ఉనికి చెప్పుకోవాలనే ఉబలాటం లోనుంచి రాసింది కాకుండా నా బాధ ఇది అని చెప్పుకునేందుకు మాత్రమే రాసిన కవితగా మాత్రమే కనబడింది. అలాగే దిగులు కొమ్ముల మధ్య అనే కవితలో కూడా బాధని ప్రస్ఫుటంగా చూపిస్తాడు.
దళిత వాదం భుజాన మోస్తూనే పల్లిపట్టు
బహుజన తత్వాన్ని కూడా ఒక భుజం పైన మోసాడు. దుక్ఖ పొగులనేత కవితలో చేనేత ప్రస్తావన తెచ్చినా, ఆవుభయం అంటూ దేశాన్ని, ప్రత్యేకించి ముస్లీమ్ల మీద జరుగుతున్న అమానుషాల్ని కూడా ప్రస్తావన లోకి తెచ్చాడు.కేరళ వరదలు మీద కవిత గురించి చెప్పుకోవాలి.పక్క రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు మనం మనవైపునుంచి సానుభూతి వచనాలు మాట్లాడాలి, అదొక ధైర్యం. ఎక్కడో కేరళలో ని కవి మిత్రుడికి ప్రసాద మూర్తి రాసిన ధైర్య వచన కవిత, అలాగే జగద్ధాత్రి రాసిన మరొక కవిత చప్పున జ్ఞప్తికి వచ్చాయి.
గాయాల సలపరింతల మధ్యలో కూడా తన కవిత్వపు మెరుపుని వదల్లేదు.
” అడవులు” అనే కవితలో
” ప్రకటించని ప్రళయమేదో
విధ్వంస మృదంగాల్ని వాయిస్తున్నప్పుడు” అనే మాట దృశ్యాన్ని శబ్దాన్ని కలిపి కవిత్వం చేయగలిగాడు. ఒక చోట ” నేలంతా చేదు గాయాలు పారుతున్నాయి ” అంటాడు.ఇతనికి అంత ఉక్కపోత వస్తువులో కూడా మెరవగలిగే వాక్యం రాయడం అబ్బడం అనేది స్వతహాగా ఉంటేనే తప్పా తెచ్చిపెట్టుకున్న వాక్యాలు మాత్రం కావు.
ఇతన్ని చదివేప్పుడు చాలా మంది మనుషులు, రాయలసీమ ప్రాంతం మన ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది. “రుక్కత్త” కవిత అలాగే “కరువు ఋతువు” కవితలో సీమ గురించి చెప్పే మాటలు చదువుతుంటేనే కడుపు తరుక్కు పోతుంది.
” చుక్క రాలని ఈ మట్టిలో
దుక్కమే నవాబుతుంటది
దుక్కమే ఏడుస్తుంటది
దుక్కమే ఎక్కిరిస్తుంటది”
తరతరాలా సీమ వేదన కదా ఇది అనిపిస్తుంది.ఇతను ఆవేదన మొత్తం మనిషి తో పాటే ఉంది.ఇతని వస్తువు, ఇతని భాష ఇతని బెరుకు లేనితనం. తన మూలాల పట్ల తనకున్న కమిట్మెంట్. తన సంస్కృతి, తన భాష పట్ల ఉన్న మమకారం లాంటివి ఇతన్ని తెలుగు సాహిత్యంలో కాస్త ముందుకు వెళ్లగలిగేలా చేస్తాయి.పైగా.ఇతనికి తన సొంత గొంతుక ఉంది.ప్రభావాలు ఉన్నా పైకి కనబడనివ్వని నిర్వహణ ఇతని సొంతం. అక్కడక్కడా తన వర్గపు కవిత్వం రాసుకున్నప్పుడు కొన్ని చోట్లా అతని ఊహా అతని ముందు తరాల వారి ఊహా ఒకేలా ఉండొచ్చు కానీ, పోలిక పెట్టగలిగే స్థాయి లో లేవు.కానీ శ్రమ తత్వం, లేమితనం, పళ్ళు కొరుకుతూ రోజుల్ని వెళ్లబుచ్చిన తనం ఉన్నాయి కాబట్టి ఈ సంపుటి నిండా ఒక దళిత జీవన తాత్వికత కనబడుతుంది.
సామాజిక మాధ్యమాలు , కవిసంగమం లోకి వచ్చిన చాన్నాళ్లకి పుస్తకాన్ని బయటకు తెచ్చాడు పల్లిపట్టు.ఈ పుస్తకం వచ్చేనాటికే సాహితీ ప్రపంచం లో బాగా నిలదొక్కుకున్నవాడు. పుస్తకం తెచ్చే క్రమంలో కాస్త ఎడిటింగ్ కూడా మంచి మిత్రులకు ఇస్తే బాగుండేది.
“ఒక బొమ్మ నా గిన్నె గీసుకుంది” లాంటి చోట్ల గిన్నె బొమ్మ గీసుకోవడం ఏంటి అని ప్రశ్న సామాన్య పాఠకుడికి కలుగుతుంది.అలాగే నిషేధ స్వరం అనే కవితలో బాధ ని బాగా వ్యక్తం చేసినప్పటికీ ఆ బాధ వెనక ఉండే పెనుగులాటని స్పష్టంగా చెప్పలేకపోయాడు. సపాయమ్మలు,రుక్కత్త లాంటి కవితల్లో నిడివి సమస్య ఉంది.ఇలాంటి వస్తువుల ని నిర్వహణ చేసేప్పుడు మనకి తెలియకుండానే మనం వస్తువు మాయలో పడిపోతాం అలాంటి సమయాల్లో మన మనసు మన మాట వినదు,కాబట్టి మనమే ఎడిటింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి అనే గమనింపులు రాబోయే రోజుల్లో చూసుకుంటాడు .అలాగే రూపం పట్ల కూడా పెద్దగా ఎక్కడా శ్రద్ధ పెట్టినట్టు కనపడడు. దళిత కవిత్వంలో వస్తువు చాలా సామాన్యంగా ఉన్నా దాని శైలీ నిర్వహణ వల్ల చాలా కవితలు గొప్ప కవితలు గా నిలబడి గలిగాయి. పల్లిపట్టుకి ఆ స్థాయి ఉండి కూడా కేవలం కవితని ముగించాలనే తపన వల్ల కూడా కాస్త నష్టం జరిగి ఉండొచ్చు.ఫేస్బుక్ లో ఒక్క కవితగా చదివితే వచ్చే అనుభూతి వేరు. అలాగే 40- 50 కవితల మధ్యలో ఆ కవిత ఏ టోన్ లో మాట్లాడుతుందో అని బేరీజు వేసుకుని చదివే అనుభూతి వేరు.పుస్తకం తో మనకి చాలా మంది కొత్త పాఠకులు, అన్ని వర్గాల ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉంటారు.
కాబట్టి కొత్త కుర్రవాళ్ళకి ఇది గమనం లోకి వస్తే మంచిది.
నిడివి మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. చిక్కగా రాసిన కవితలు చాలానే ఉన్నాయి కాబట్టి ఇంకొంత ప్రాక్టీసు చేస్తే రెండో సంపుటానికి అదేమీ పెద్ద సమస్య గా ఉండకపోవచ్చు.
ఏ కవిత్వమైనా ఏ కవిత అయినా కేవలం వస్తు నిర్వహణ పరంగా సానుభూతి చూపించినంత మాత్రాన అది కాలానికి నిలబడడం జరగదు.తన దృక్పధంతో మాట్లాడాల్సిన సందర్భం లో కవి టోన్ ఎలావుందీ అన్నది మాత్రమే చూడడం కాదు , కవి ఈ సమస్యని లేదా ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఏమైనా ఒక మార్గాన్ని చూపెడుతున్నాడా అని బేరీజు వేస్తే “యాలై పూడ్సింది” లో కొంత మేరకు అది కనబడిన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కొత్త దళిత కవులు ఎవరి స్వానుభవం లోనుంచి వాళ్ళు రాస్తున్న క్రమంలో వాళ్ళకి కావాల్సినదేదో తెలుస్తుంది కదా.ఆ ఎరుక ఉన్నప్పుడు ఒక కొత్త ప్రతిపాదనలు తయారవడానికి అవకాశం ఉంది.
కొత్త రక్తాన్ని తెలుగు సాహిత్యానికి మరి ముఖ్యంగా కవిత్వానికి పరిచయం చేసిన కవి యాకూబ్ శ్రమ ఈ పుస్తకాన్ని అందంగా తీర్చి దిద్దాడానికి ఉపయోగపడింది.కవిసంగమం ప్రచురణలు ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్త కొత్త సంపుటాలని అందిస్తున్నాయి. ఇది ఇప్పటి తెలుగు కవిత్వానికి చాలా అవసరం.
సీనియర్ కవులు శివారెడ్డి, లక్ష్మీ నరసయ్య గారి ముందు మాటలు ఈ పుస్తకాన్నీ ముందుకి నడిపిస్తాయి.
” ఎంతమంది ఉంటారు.ఎంతమంది పోతారు. ఎంతమంది మిగులుతారు. ఎంతమంది కొనసాగుతారు. అనే పరిచయాలు, సందిగ్దాలు వదలండి. తట్టుకుని నిలబడ్డవాడు.ఖడ్గం ధరించిన వాడు బతుకుతాడు. యుద్ధం చేస్తాడు” అన్న శివారెడ్డి మాటలు వెయ్యేనుగుల బలం ఇస్తాయి.
అతని తప్పొప్పుల్ని పక్కన పెడితే
ఇంతకీ నాగరాజు ఏం మాట్లాడాడు మనతో అన్నది మనం చూస్తే. ఇతని ఉద్దేశం జనహితం.ఇతని వాక్యాల్లో ఉండే తాజాతనం ,భాషలో ఉండే గుభాళింపు, ఎన్నుకునే వస్తువు, ఇవన్నిటి వెనక ఉన్నది నాగరాజు తడి గుండె మాత్రమే. ఇతనికి జ్వలించే గుణం ఉంది.జవజవలాడే ఆర్ద్రత ఉంది. కోపం ఉంది.సామాజిక చైతన్యం ఉంది. బాధని కవిత్వం చేయడము ఉంది.ఇతను గతకాలపు దళితాభ్యుదయ కవుల వారసుడు. ఇతను బహుజనుల పక్షపాతి.రాబోయే తరానికి హుందాగా ఎగురుతూ నిలబడే “నీల్ జండా”. యాలైపూడ్సక ముందే ఇతని కవిత్వాన్ని గుండెలకు హత్తుకుందాం.
“యాలై పూడ్సింది”
పల్లిపట్టు నాగరాజు – కవిత్వం
కవిసంగమం ప్రచురణలు
136 పేజీలు
వెల: 150/-
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభ్యం
*
బావుంది అనిల్…
మంచి విశ్లేషణ sir
పల్లిపట్టు నాగరాజు గారి కవితా సంపుటి “యాలై పూడ్సింది” పై అనిల్ డ్యాని గారి విశ్లేషణ/సమీక్ష బాగుంది. యువకవి పల్లిపట్టు గారినుంచి భవిష్యత్తులో ఇంకెన్నో మంచి కవితా రచనలు రావాలని ఆశిస్తున్నాను. రచయితకూ విశ్లేషకులిరువురకూ అభినందనలు
నాగభూషణం దాసరి
హృదయ పూర్వక ధన్యవాదాలు సర్