కవిత్వం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. మనిషి వైపు ప్రవహిస్తూ ఉండాలి. మనిషి లోపలికి ప్రవహిస్తూ ఉండాలి. మనిషికై తపిస్తూ ఉండాలి. మార్పుకై తపిస్తూ ఉండాలి. ఆ మార్పులో మనిషికి అంటిన మకిలి కొట్టుకు పోవాలి. మనిషి చివరకు మల్లెపువ్వులా కనిపించాలి.
భరతదేశంలో కొన్ని లక్షల సాహిత్య కావ్యాలు వచ్చాయి.అందులో సంస్కృత కావ్యాలు ఉన్నాయి. తెలుగు కావ్యాలు ఉన్నాయి. కానీ ఎదుటి మనిషిని అవమానించే దృక్పథంలో కానీ, కుల పట్టింపును వదులు కోవడంలోగాని , రావాల్సిన మార్పు రాలేదు. ఎందుకు? కారణం ఏమై ఉంటుంది అని చాలా రోజుల నుండి నన్ను బాధిస్తున్న ప్రశ్న.
నూకతోటి రవికుమార్ అన్న “కంచె మీది పక్షి పాట”చదివిన తరువాత కొంత సమాధానం దొరికి ఊరట లభించింది. రవికుమార్ కవిత్వంలో ఆత్మ గౌరవం ప్రధానమైన అంశం. తిండి లేకపోయినా, సంపద లేకపోయినా,భూమి లేకపోయినా, ఇండ్లు లేకపోయినా ఓర్చుకుంటాడు కానీ ‘ఆత్మగౌరవం’ లేకపోతే తట్టుకోలేడు. ఆ తట్టుకోలేని తనం కవిత్వం నిండా కనిపిస్తుంది.
భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 70ఏండ్లు పై బడినా ,దళిత సాహిత్య కారుల్లో, వారి కావ్యాల్లో ప్రధానంగా వివక్ష ,కులం, అంటరానితనంలే కావ్య వస్తువులుగా ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి?
దేశంలో వస్తున్న అన్ని మార్పులు వీరి కావ్య వస్తువులుగా ఎందుకు కుదురుకుంటలేవు?. ఎందుకంటే అంటరానితనం ఎదో ఒక రూపాల్లో వీరికి రోజు అనుభవంలోకి వస్తుంది. ఎదో ఒక గాయపడుతూనే అవుతూనేఉన్నారు. కనుకనే దృష్టి మరల్చలేకపోతున్నారు.
భారతదేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొనే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. అంబేద్కర్ విగ్రహాల పట్ల ఉన్న మమకారం, అంబెడ్కర్ ‘ఆలోచనా విధానం’ పట్ల లేకపోవడం కనిపిస్తుంది. అంబెడ్కర్ విగ్రహానికి హాని జరిగితే స్పందించిన వారు. అంబేద్కర్ ఆలోచనకు ప్రభుత్వాలు,పార్టీలు తూట్లు పొడిచిన సందర్భంలో , తీవ్రమైన స్పందన ఉండదు.నిజానికి అంబేద్కర్ కోరుకున్నది తన ఆలోచన అమలు కావాలని కానీ, విగ్రహాలు పెరగాలని కాదు.అందుకే రవి కుమార్ విగ్రహాన్ని ఆలోచనను వేరుగా చూడకుండా మన అందరి తరుపున అంబేద్కర్ విగ్రహమే యుద్ధం చేస్తోంది అంటూ ఇలా తీర్మానం చేస్తున్నారు.
*మౌనాన్ని బద్దలు కొట్టే విగ్రహాలుంటాయి/ఫ్యూడల్ పెత్తనం అంతుచూసే/చూపుడు వేళ్ళు ఉంటాయి/రాజుల్ని కాపాడే ఖాకీలున్న కాలంలో/విగ్రహమే యుద్ధం చేసే సరికొత్త సమయాలుంటాయి*
…..
*విగ్రహం యుద్ధం చేస్తూనే ఉంటుంది”*
‘మట్టి కథ’ కవితలో దళిత బాహుజనుల మీద జరుగుతున్న కుట్ర కథల సుతిమెత్తంగా విప్పారు.పశువులను పవిత్రంగా చూపించి మనుషులను అవమానించడం సర్వ సాధారణంగా జరుగుతున్న విషయాన్ని ఇలా చెపుతున్నారు
అంబేద్కర్ రాజనీతిని ఈ దేశంలో ఒక్క కాన్షిరాంకు తప్ప ఇంకెవరికి అర్థం కాలేదు.కాన్షిరాం వారసులు తెలుగునేల పై ఎవ్వరు లేరు.నడిపించే బలమయిన నాయకుడు లేక ప్రజలు అయోమయంలో ఉన్నారు. నాయకత్వ లేమిని చాలా చక్కగా, చిక్కగా కవిత్వికరించడం జరిగింది .
‘స్పేసుని మిగిల్చుకుందాం/ఒకరినొకరు గుర్తు పెట్టుకోడానికి/ఒకరినొకరం ఎప్పుడయినా కలుసుకోవడానికి/లోపాలు సరిదిద్దుకోవడానికి/అవమానాల ఆగడ్తలు దాటి/వివక్షల కొలమానాలు దాటి/ఒక ఆర్థ గీతం పాడుకోవడానికి స్పేసుని మిగిల్చుకుందాం”
గత ఐదు వేల సంవత్సరాలుగా కాలము , జంబూ ద్వీప ప్రకృతి, ప్రజలను కష్టాలనుండీ బయట పడేయడానికి చాలా మంది మహనీయలను పుట్టిస్తూనే ఉంది.అట్లా ఈ భూమి పైకి వొచ్చిన వారే బుద్ధుడు, అశోకుడు,సంతు రవిదాస్,సంత్ కబీర్,ఫూలే దంపతులు, అంబేద్కర్ ,పెరియార్, నారాయణ గురు,కాన్షిరాంలు.ఈ మహనీయుల స్పూర్తితో ఆర్తీతో రాసిన అద్భుతమైన కవిత “కంచె మీది పక్షి పాట”ఈ కవిత శిల్ప పరంగా చాలా గాఢత కలిగిన కవిత. కవితలో మహనీయుల తాత్విక దృక్పధాన్ని సింబాలికంగా ‘పక్షులు’అనే సంకేతంతో కవిత నడిపిన విధానం గాఢంగా అనిపిస్తుంది.
*ఎగురగల పక్షులుంటాయి/రెక్కలు కత్తిరించినా/కరెంటు తీగల మీద* *స్వేచ్చా సంగీతం పాడుతూ/నడవ గలిగిన పక్షులుంటాయి.*
*బోనుల్ని ధ్వంసం చేసి/బోను రెక్కల మీద/చిరునవ్వుల సంతకాలు చేసే పక్షులుంటాయి/మేఘాలకి రంగులేసి/గాలికి మార్దవం తెచ్చే పక్షులు./కొమ్మలకు పురుడు పోసి/పూల ఋతువుల్లో చెట్లను ఓలలాడే పక్షులు/రెక్కలకు కత్తులు కట్టుకొని/తిరోగామి శక్తులపై యుద్ధానికి సయ్యనే పక్షులు*
మనలో ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న భయాల్ని, అసంతృప్తిని నిర్భయంగా వ్యక్తీకరించిన పద్దతి చూస్తే ఈ కవి గుండె ధైర్యం గొప్పగా ఉంది. దేశ భక్తి నసాలనికి ఎక్కి ఆ ముసుగులో ఉన్మాదాన్ని ,యుద్దాన్ని రెచ్చగొట్టి, అధికారంలోకి వచ్చే శక్తుల పట్ల జాగరుకథతో ఉండాలని “ఒక దేశం కావాలి” కవితలో చెపుతున్నారు.
“కంచెలు లేనిదేశం కావాలి/జానాన్ని విడగొట్టని దేశం/అభివృద్ధి పేరుతో/గ్రామాల్లో నుండి పేదలను గెంటెయ్యని దేశం…..
అంటూ /మెదళ్లకు మతోన్మాదం నింపని / దేశం కావాలని ,కోరుకోవడం ఈ కవి హేతుబద్ధత కనిపిస్తుంది.
Sensibilities ని చక్కగా వాడుకోవడం ,తాను చూసింది,అనుభవించింది గొప్ప నేర్పుతో తనదైన పొలికలతో కొత్తగా వ్యక్తీకరించిన తీరు పాఠకుల్ని అబ్బుర పరుస్తుంది.అట్లాంటి కవితే “వెతుకులాట” కవిత.
“పుటలు పుటలుగా విస్తరించే నిరుద్యోగo/పత్రికలు నిజాలు రాయవు/కోర్టులు నిజాలు చెప్పవు ..అంటూ
అడగడం నేరం
ఏడవడం నేరం
చావడం ధర్మం!! ఆంటు ముగించారు.ఈ కవిత ప్రస్తుత అనిక్షిత పరిస్ధితిని చక్కగా తెలుపుతుంది. అలాగే పాఠకుడి మీద గొప్ప ముద్ర వేసింది.
నూకతోటి రవికుమార్ గారి కవిత్వం దేశ సమగ్రతకు దేశ ఐక్యతకు వెతిరేకమైన కవిత్వం కాదు.ముమ్మాటికి అది దేశ సమస్యల్ని పరిష్కరించి, ప్రజల మధ్య అభిప్రాయ భేదాల్ని, అసమానతల్ని తొలగించి, దేశాన్ని పటిష్టంగా ఉంచాలని కోరుకునే కవిత్వమే.అందుకే
*ఇది మట్టి మనుషుల రక్త మాంసాలతో నిర్మితమైన దేశమని ప్రేమగా చెప్పాలని ఉంది* అంటున్నారు. అంతటితో ఆగకుండా
*తులసిని పూజిస్తూ అడవిని ధ్వంసం చేయాలని చూసే వాడి గుండెల్లో గునపం దింపితే బాగుండు* అనే కసిని కూడా నూరిపోస్తున్నారు.
ఎవరో నొచ్చుకుంటరని, తాను నటించ కుండా ఉన్నది ఉన్నట్లుగా కవిత నడిపించే తత్వం ఈ కవిది.
“నీడను చూసి
మనిషిని ద్వేషించేవాళ్ళ మధ్య
రాయిని చూపి
దైవత్వాన్ని హింసించే వాళ్ల మధ్య
ఎవడో ఒకడు
పూసిన నవ్వులతో భూగోళానికి ప్రేమరంగులద్దుతాడు.”
అంటూనే మళ్ళీ.. *పొక్కిలి లేసిన వాకిలి దుఃఖం పసిగట్టాలి* అంటున్నారు.
రోజుకొక సిద్ధాంతముతో తానూ confusion అవుతూ ఇతరులను confuse చేస్తూ కాలం గడుపుతున్న వాళ్ళను కొరడాతో కొట్టినట్లు “కలుగులో నిద్ర” కవితలో ప్రశ్నించారు.
“నోళ్లు మూసుకుపోయిన బీడు నేలలో
ఏ పంటలు పండిస్తావు?సత్యాన్ని సమాధి చేసే చోట
ఏ నిజాల కోసం నిలబడుతావు”అంటున్నారు.
ఈ సంపుటిలో చాలా గొప్ప గొప్ప కవితలున్నాయి.వాటిలో ‘ఉన్మాది శాంతి గీతం’ మట్టి పులకలు,సముద్రంతో సంభాషణ, మృత్యు శీతల స్పర్శ,ముసుగులు తొలగాల్సిన కాలం’లు చాలా గాఢతతో రాసిన కవితలు.అట్లాంటి కవితలో గాయాల కొలిమి కవిత మరోటి.
ఎన్నో ఏండ్ల నుండి దళిత బహుజనులు భంగపాటు గురిఅవుతున్నారు.మళ్ళీ రాజకీయంగా ఆ శత్రువుకే ఓటు వేస్తున్నారు ఇది పక్కాగా మన అవివేకమే. మన నిస్సహాయతనే అంటున్నారు “గాయాల కొలిమి” కవితలో.
“కోట్ల భంగ పాట్ల తర్వాత కూడా
చేతుల్లోకి గుదపను తీసుకోలేం
మేమింతే
ప్రేమించాల్సిన వాడిని ద్వేషిస్తో..
ద్వేషించాల్సినవాడిని ప్రేమిస్తో..
హృదయాల్ని ఎక్కోడో పారేసుకొని
గొప్ప న్యాయ పోరాటాల్ని కలగంటం.”
అంటే రోజు… సామాజిక ఉద్యమాలే చేస్తారు .రాజకీయ పోరాటాలు చేయరు అని దళితలను పరోక్షంగా ఎత్తిపొడుస్తారు.
అట్లాగే ” మాట్లాడు “కవితలో రాజ్యాంగము తల్లి లాంటిదని ,మనకు సర్వ హక్కులు ఇచ్చిందని,అసలు అంబేద్కర్ ఆత్మ రాజ్యాంగ రూపంలో రోజు మనల్ని ఆవహిస్తున్నదని,రాజ్యాంగమే అంబేద్కర్ కాబట్టీ రాజ్యాంగo కోసం అందరూ మాట్లాడాలి అంటున్నారు.
*రాజ్యాంగము కోసం కలబడే గుంపుకోసం మాట్లాడు*
అంటూ ప్రతి ఒక్కరికి సూచిస్తున్నారు
“గోడకు వేలాడుతున్న తప్పేట మీద
ఒక దరువు వేయాలి
దార్లు ముసుకపోతున్న చోట ఓ కాలి బాట వేయాలి”
ఆ దరువు ఎదో తప్పకుండా రాజ్యాధికారం ‘దరువే ‘వేస్తే బాగుంటుందని నా సూచన.
దళిత బాహుజనుల వేదనలు ఈ కవిత్వం నిండా పరుచుకున్నాయి.ఈ దేశంలోని ఉన్నత కుల శక్తులు తన జాతి మీద , తన జాతి చరిత్ర మీద వేస్తున్న నిందలను చేరిపేస్తూ కవిత్వం ద్వారా చైతన్యం చేస్తున్నారు. భారత దేశానికి ఇతర దేశాలతో యుద్దాలు లేని కాలాన్ని మరియు దళితులకు ఉన్నత వర్గాలకు అంతర్గత కలహాలు లేని కాలాన్ని ,దేశాన్ని కోరుకుంటున్న కవిత్వమిది. బతుకు గాయాల నెమరు కవిత్వం నిండా పరుచుకున్నది.తనకు స్ఫూర్తి నిచ్చిన వాళ్ళను తలుచుకుంటూ రాసిన గొప్ప స్మృతి కవిత్వం కూడా ఉంది. తనకు ఎదురైన అవమానాలను మౌనంగా భరించకుండా అక్షరo ఆసరతో ఎదిరించడం వల్ల నూకతోటి రవి గారు మన అందరికి ఆదర్శంగా నిలిచారు.
నాకైతే ఎలాంటి సందేహం లేదు .దళిత బహుజన రాజకీయ ఉద్యమ చైతన్యానికి ఈ “కంచె మీది పక్షి పాట” కవిత్వం కొత్త ఊపునిస్తుందని నా నమ్మకం.
*
Thanks sir give little bit of stimulate..Or encourage
గుడిపల్లి నిరంజన్ గారు
చాలా లోతైన విశ్లేషణ
దళిత బహుజన రాజకీయ నాయకులు హిందూ మతోన్మాద తీవ్రవాద నాయకత్వా పరిపాలనకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని ఏర్పరచుకొని ఎదిరించి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈమధ్య ప్రొఫెసర్ కాసిం రాసినటువంటి అకాడమిక్ untouchability చాలా ఆధారాలతో వివరణ ఇచ్చారు . ప్రొఫెసర్ కాసిం గారు రాసిన పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం .
భయంకరంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం , ఇప్పుడు ఉన్న మోడీ ద్వయం , తెలంగాణ ముఖ్యమంత్రి అయితే నేమి దళితులకు న్యాయం జరగడం లేదు , అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడో తొలగించినప్పుడు , ధ్వంసం చేసినప్పుడు చూపిస్తున్న కసి ఆవేశాన్ని , వారి హక్కుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన నిరసన తెలుపకపోవటం విచారకరం, నిరంజన్ గారు మీరు రాసిన వ్యాసంలో పేర్కొన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ
9494052775
గుడిపల్లి నిరంజన్ గారు
చాలా లోతైన విశ్లేషణ కు అభినందనలు తెలియజేస్తున్నాను.
దళిత బహుజన రాజకీయ నాయకులు హిందూ మతోన్మాద తీవ్రవాద నాయకత్వా పరిపాలనకి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని ఏర్పరచుకొని ఎదిరించి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈమధ్య ప్రొఫెసర్ కాసిం రాసినటువంటి అకాడమిక్ untouchability చాలా ఆధారాలతో వివరణ ఇచ్చారు . ప్రొఫెసర్ కాసిం గారు రాసిన పుస్తకం అందరూ చదవాల్సిన పుస్తకం .
భయంకరంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం , ఇప్పుడు ఉన్న మోడీ ద్వయం , తెలంగాణ ముఖ్యమంత్రి అయితే నేమి దళితులకు న్యాయం జరగడం లేదు , అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడో తొలగించినప్పుడు , ధ్వంసం చేసినప్పుడు చూపిస్తున్న కసి ఆవేశాన్ని , వారి హక్కుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రమైన నిరసన తెలుపకపోవటం విచారకరం, నిరంజన్ గారు మీరు రాసిన వ్యాసంలో పేర్కొన్న అభిప్రాయంతో ఏకీభవిస్తూ
9494052775
[…] Thanks to Saaranga Magazine and Editor Afsar sir… https://magazine.saarangabooks.com/%e0%b0%ac%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%97%e0%b0%be%… […]