బడి గోడల్లో ఖైదు కాని చదువు!

చరిత్ర తెలుసుకోవడానికి నెహ్రూ పుస్తకాలు దోహదం చేశాయేమో కాని 20ఏళ్లు పోయాక గాని ఆయన చరిత్ర నిర్మాణం చేసిన ప్రజల పక్షం లేడనే విషయం అర్థం కాలేదు.

పిల్లల చదువులో పాఠశాలల జోక్యం లేకుండా చూసుకోవాలన్నాడు మార్క్‌ ట్వెయిన్‌. ఆయన మనసులో ఉన్నది వ్యవస్థీకృత పాఠశాలే అనుకుంటాను. మా ఊరు (చిన పెండ్యాల) హైదరాబాదు సంస్థానంలోని సాలార్‌జంగ్‌ జాగీరు కావడం వల్ల మా ఊళ్లో 1950 దాకా బడి లేదు. అంటే నాకు పదేళ్ల వయసు వచ్చేదాకా అటువంటి వ్యవస్థీకృత పాఠశాల చదువు బాధ తప్పింది.

ఇంట్లో అక్షరాభ్యాసం ఎవరు చేయించారో నాకు గుర్తు లేదు కాని తప్పకుండా విద్యావంతుడైన మా పెద్ద మామయ్యనో, చిన్నన్నయ్యగా పిలుచుకునే శేషగిరి రావన్నయ్యనో చేయించి ఉంటారు. పలకా బలపం పట్టుకుని బడికి వెళ్లింది మాత్రం ఊళ్లో తొంటి వీరయ్య అని పిలిచే పేరాల వీరయ్య ఇంటి అరుగు మీదికి. ఆ అరుగు మీద హఠం వేసుకుని కూర్చునే ఆజానుబాహు రూపం, ముందర కలవం, అందులో ఓ నల్ల సరపు రాయితో ఆయన ఏవో మందులు రుబ్బుతూ చదువు చెప్పేవాడు. రైతుకు అప్పిచ్చేవాడు. ఊళ్లో ప్రజలకు వైద్యం చేసేవాడు. ఉన్న ఊరు ఎంచుకోమని కదా సుమతి శతకం చెబుతోంది. ఈ వైద్యుడే నాకు మొట్టమొదటి విద్య గరపినవాడు. పెద్దబాలశిక్ష, సుమతి శతకం, వేమన శతకం చెప్పినవాడు. ఆయన అప్పటికే నైజాం వ్యతిరేక జాతీయోద్యమంలో పనిచేస్తున్న పెద్ద మనిషి. చాలా గంభీరంగా ఉండేవాడు. ఎడమ తొంట చెయిలోనే బెత్తం ఇరికించుకుని ఏమాత్రం క్రమశిక్షణ తప్పిన పిల్లలనైనా కొట్టినట్టు బెదిరించేవాడు.

ఆ తర్వాత చదువు మగ్గం దగ్గర అయింది. ఆయన పేరు కూడా పేరాల వీరయ్యనే. ఆయన అటు మగ్గం నేస్తూ ఇటు మాకు చదువు చెబుతూ కొంత చదివేదో, రాసేదో పని ఇస్తూ ఉంటే మాకు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. పెద్ద ఆవరణ, కోడి పిల్లలు వాటి వెంట పరుగెత్తుతూ ఆ పాఠం వల్లెవేయడమో, పద్యాలు చదువుకోవడమో చేసేవాళ్లం.

అయితే శృత పాండిత్యం అని కాదుగానీ శృత వివేకం మా చిన్నన్నయ్య శేషగిరి రావన్నయ్య ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడల్లా తిరుగుతూ గొంతెత్తి చదివే గేయాల నుంచి, పద్యాల నుంచి మొదట అబ్బింది. క్విట్‌ ఇండియా ఉద్యమంనాటికి నాకు రెండేళ్లు. వినగలిగి, నడవగలిగే స్థితి. ఆయన తానే రాసిన ‘బొంబై, పూనా పట్టణాలలో భుగభుగ మంటలు లేచాయి’ అనే చరణం ఎన్ని సార్లు ఆయన నోట విన్నానో ఎన్నటికీ మరిచిపోను. ఐదేళ్లు దాటాక ఆయన స్వయంగా అది అచ్చయిన ‘ఢంకా’ పత్రిక నాకు చూపి అక్షరాలను పోల్చుకోమని చెబుతూ చదివేవాడు. ఆ తర్వాత మొదట ఆయన గొంతు నుంచి తర్వాత ఆయన తెచ్చిన పుస్తకాల నుంచి పరిచయమైనవి జాషువా ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’ కావ్యాలు.

… అప్పు పడ్డది సుమీ భరతావని వీని సేవకున్‌,

….వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భోజనము లేదు,

ఆయభాగ్యుని రక్తంబు నాహరించి

ఇనుపగజ్జెల తల్లి జీవనము సేయు,

గసరి బుసకొట్టు నాతని గాలి సోక

నాలుగు పడగల హైందవనాగరాజు

వంటి చరణాలు, పద్యాలు గల గబ్బిలం మొదటి భాగంలోని తొమ్మిది పద్యాలు మా అన్నయ్య తప్పకుండా నిత్యమూ చదివేవాడు. మా పెద్దన్నయ్యలిద్దరూ నిజాం వ్యతిరేక జాతీయోద్యమంలో పనిచేసినవాళ్లు. నా బాల్యం నాటికే మా పెద్దన్నయ్య ఊళ్లు తిరుగుతోనో, అజ్ఞాత జీవితంలో ఉండటం వల్లనో, చిన్నన్నయ్యగా పిలుచుకునే ఈ శేషగిరి రావు అన్నయ్యే మా చదువు, పోషణ అన్నీ చూసేవాడు.

ఫిరదౌసి కావ్యంలో…

మును గజనీమహమ్మదు డభూతపరాక్రమశాలి, వీరవా

హినులబలంబుతో బదియు నెన్మిదిమాఱులు కత్తిదూసి….

అని ఆయన గొంతెత్తి అందుకుంటే ఎందుకో ఆ పద్యం ఎత్తుగడ తెలిసి కాదు, తూగు వల్లననుకుంటాను మనసుకు హత్తుకున్నది. రాజ్యం, అధికారం దానికి ఆధిపత్యం వహించే రాజు, ప్రజలు, ప్రతిపక్షం, రాజ్య విమర్శచేసే కవి ఆ క్రమంలో ఆధిపత్యాన్ని ధిక్కరించే కవి పడే కష్టాలు అనే సందేశం ‘ఫిరదౌసి’లో ఇవ్వబడిన కాలం దేశంలో జాతీయోద్యమం. అది వాస్తవానికి 1932లో ముస్లిం వ్యతిరేకమైనది కాకూడదు. సామ్రాజ్యవాద, వలసపాలన వ్యతిరేకమై ఉండాలి. కాని ఫిరదౌసి అనే కవి రాసిన ‘షానామా’ గురించిన గాధ గనుక అది గజనీ మహమ్మదు గురించి గనుక కావ్యారంభ ప్రభావం ఇప్పుడు ప్రమాద ఘంటికలే మోగించే అవకాశం ఉంది. 1960లలో కెఎం మున్షి రాసిన ‘జై సోమనాథ్‌’ నవల భండారు సదాశివం అనువాదం చదివాను. ఈ పుస్తకాల పుటలు మాత్రమే కాకుండా ఇప్పుడు చరిత్ర పొరలు విప్పి చదివితే గజనీ మహమ్మదు 18సార్లు దాడి చేసి పెకిలించుకపోయిన సోమనాథ దేవాలయ ద్వారంతోపాటు సొత్తంతా ఇండియా తిరిగి తెచ్చుకున్నది. దేవాలయాలు అప్పుడు ఎన్ని కూలాయో కాని ఇప్పుడు మసీదులు చెట్లవలె కూలిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈస్టిండియా కంపెనీ కాలం నుంచి ఇప్పటి కార్పొరేట్‌ కంపెనీలు దోచుకుపోతున్న మానవ శ్రమ ప్రకృతి సంపద తిరిగి తెచ్చుకోగలమా?

బహుశా ఈ రెండు కావ్యాల్లోని కథావస్తువులో ఉండే బలం వల్ల అవి మొదట శ్రావ్యంగా విని ఉండటం, ఐదు- పది సంవత్సరాల మధ్య వయసులో ఉండే జ్ఞాపక శక్తి వల్ల గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా కావొచ్చు. ఈ రెండు నా మనసు మీద ముద్రవేశాయి. ఫిరదౌసి పట్ల రాజు మాటతప్పడం, సుకవి వాక్యం చిరకాలం నిలుస్తుందనే ఒక సందేశం ఎందుకో చిన్ననాడే మనసు మీద ప్రభావం వేసి ఇట్లా కష్టాలు అనుభవించే కవి కావడం చాలా గొప్ప విషయం అనిపించేది.

చాలా కాలానికి ఇటీవలెనే, బ్రాహ్మణీయ భూస్వామ్య వ్యవస్థ గురించి, రాజ్యవ్యవస్థ గురించి  కాళిదాసు, జాషువాలను పోలుస్తూ రాయడానికి చిన్ననాడే నా మనసు మీద పడిన ఈ ప్రభావమే కారణమనుకుంటాను.

మా ఊరికి, మా ఇంటికి కూడా వాగు అవతల తాటికాయలలో ఉన్న పొట్లపెల్లి రామారావు గారు హనుమకొండ నుంచి కాళోజీగారు తరచూ వచ్చేవాళ్లు. అట్లా నా గొడవ, కాలిబాట లాంటి గేయాలు వచ్చాయి. మా మూడో అన్నయ్య పెండ్యాల చినరాఘవరావు  కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి, సి. నారాయణ రెడ్డిలను మా బాల్య అధ్యయనంలోకి తెచ్చాడు. ఈయనది మా రెండవ అన్నయ్యకన్నా అద్భుతమైన గొంతు. గొంతెత్తి వీళ్ల పద్యాలు, గేయాలు, తాను కృష్ణ శాస్త్రి ప్రభావంలో రాసిన ప్రేమ గీతాలు చదివేవాడు.

కమ్యూనిస్టు నాయకుడు పెండ్యాల రాఘవరావు కొడుకు పెండ్యాల కిషన్‌ వాళ్ల అమ్మమ్మ ఊరికి దత్తత పోయినా ఎక్కువ కాలం మా ఊరిలోనే గడిపేవాడు. నా కన్నా ఒక్క ఏడాదిన్నర పెద్ద. మాకు ఐదారేళ్లు వచ్చి ఇంట్లో కాలు నిలవకుండా తిరిగినపుడు వాగులోకో, వాగు అవతల ఏనె మీదికో లేదా మా ఊరు బర్సనగడ్డ రోడ్డు, రైల్వే లైను మధ్యన ఉండే చేళ్లు, చెలకల్లోకో ఎక్కువగా సాయంకాలాలు వెళ్లే సమయాల్లో మా నడకల పరుగుల పొడగునా చదువుకునే గేయ పంక్తులు మా తొలి అధ్యయనాలయ్యాయి. ఊరికి ఎడమవైపు ఆకేరు వాగు పైవంతెన దాటి రోడ్డుకు, రైల్వే లైనుకు ఏనె మీద బండరాళ్లపై నేను, కిషన్‌ చెక్కిన ‘మహాప్రస్థానం’ కవితాపంక్తులు ఉన్నాయో లేదో చూసుకోవాలనే కోరిక మనసులో నెమలీకలాగ మిగిలిపోయింది. కొంత కాలం క్రితం ఈ వాగు పొంగిపోయి గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదాన్ని మా ఊరు, ఘనపురం దళిత, గిరిజన గ్యాంగ్‌మెన్‌లు తప్పించినపుడు మునిగిపోయిన ఈ ఏనె మీది రాళ్లమీద అక్షరాలు చెరిగిపోయాయేమో తెలియదు. ఏమో మరి సముద్రం అలల మీద కూడా కవి చేసిన సంతకం చెరిగిపోదంటారు.

అందువలన ముఖ్యంగా కాళోజీ ‘వ్యత్యాసాలు’, అందులోను బాగ పరిచయమైన అనుభవం నుంచి ‘కమ్మని చకిలాలొకచోట, గట్టి దవడలింకొక చోట’, పొట్లపెల్లి రామరావు ‘కాలిబాట, కాలిబాట కలకాలం నిలవాలిట’, శ్రీశ్రీ ‘పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి’ మా నోటికి, మా నడకకు చాల కలిసివచ్చిన గేయ పంక్తులుగా ఉండేవి. జీవిత క్రమంలో వీటిని విశ్లేషించుకుని ఓ సాహిత్య తాత్విక దృక్పథం ఏర్పరచుకోవడానికి ఈ బాల్య అధ్యయనమే దోహదం చేసింది.

1947, తిరిగి 1948 సెప్టెంబర్‌ నుంచి 1950 జూన్‌వరకు మా ఊరికి జాతీయోద్యమంలో పనిచేసే విద్యావంతులు అయిన ఉపాధ్యాయులను మా అన్నయ్యలు మాకు చదువు చెప్పడానికి ఏర్పాటు చేశారు. అట్లా మా ఊరి పక్క రాజారం నుంచి యాదగిరి సారు, గరిమెల్ల పల్లి నుంచి లక్ష్మినరసయ్యసారు వచ్చేవాళ్లు. ఎక్కువ కాలం మా ఇంట్లోనే ఉండి మాకు చదువు చెప్పిన రవీందర్‌ సారు గురించి ఆయన మా కోసం నిర్ణయించిన పాఠ్యక్రమం గురించి చెప్పాలి. ఆయన ఎక్కువ కాలం కూడా ఉన్నాడు. దాదాపు రెండేళ్లు. ఆయన నడిపిన బడి జాతీయోద్యమంలోనే ఉన్న నాగభూషణం గారనే ఆయన పెద్ద చావడిలో ఉండేది.

సుమతి శతక పద్యకారుడు చెప్పినట్లు మా ఊళ్లో ఒక ఏరు మాత్రమే కాదు ఊరు చుట్టూ మూడువైపులా వాగు ఉండేది. రెండు వైపుల వాగులు ఒక చోట కలుసుకుంటాయి. కనుక ఉదయమే ఆ వాగుకు తీసుకెళ్లి ఆటలు, వ్యాయామం నేర్పి స్నానాలు చేయించేవాడు. బడికి వచ్చి తకిలీలు వడకాలి. ఆయన రాట్నం వడికేవాడు. ఇంక మాకు పాఠ్యపుస్తకాలు ఏమిటో ఇపుడు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవి గాంధీజీ ‘ఆత్మకథ’, నెహ్రూ ‘భారత దర్శనం’, ఇందిరకు రాసిన లేఖలు. ఒక విధంగా నాకు చరిత్ర తొలి పాఠాలు అవే. అయితే అవి మాకు చదివించేవాడని కాదు అవి ముందు పెట్టుకుని తాను చెబుతూ పోయేవాడు.

గాంధీజీకి సత్యహరిశ్చంద్ర నాటకం చూసి సత్యం యొక్క శక్తి ఏమిటో తెలిసిందట. నాకు మాత్రం హరిశ్చంద్రుడి కాలంలో చక్రవర్తి అంతటివాడు విశ్వామిత్రుని అప్పు తీర్చుకోవడానికి భార్యను కాశీనగరంలో వేలం వేయించాడని తెలిసి ఆశ్చర్యమైంది. ఎందుకంటే కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల సంస్కరణల వల్ల మా ఊళ్లో, మా ఇళ్లల్లో ఎంతో కొంత స్త్రీ, పురుష సమానత్వాన్ని, స్వేచ్ఛను నా బాల్యంలో నేను చూశాను. మా అక్కయ్యతో సహా ముగ్గురి వితంతు వివాహాలు చూశాను. కనుక హరిశ్చంద్రుని కాలం అంత వెనుకబడిన కాలమా? అనిపించేది.

చరిత్ర తెలుసుకోవడానికి నెహ్రూ పుస్తకాలు దోహదం చేశాయేమో కాని 20ఏళ్లు పోయాక గాని ఆయన చరిత్ర నిర్మాణం చేసిన ప్రజల పక్షం లేడనే విషయం అర్థం కాలేదు. నెహ్రూ చనిపోయినపుడు(27మే 1964) దేశం ‘రాముడు లేని అయోధ్య, కృష్ణుడు లేని ద్వారక’ అని నిజంగానే దు:ఖించిన నేను శ్రీకాకుళ ఉద్యమ నాయకుడు పంచాది కృష్ణమూర్తి, పాణిగ్రాహి జముకుల బృందంలో కళాకారుడు తామాట చినబాబు సహా ఆరుగురు పోలీసు ఎన్‌కౌంటర్‌లో అమరులైనపుడు(27 మే 1967) భ్రమలు వీడి, దు:ఖానికి కూడా వర్గ చైతన్యం అవసరమని చరిత్రను చారిత్రక భౌతికవాదంతో, గతితర్కంతో పంక్తుల మధ్యన చదవాలని తెలుసుకున్నాను. హైదరాబాదు సంస్థానంపై ఇండియన్‌ యూనియన్‌ మిలిటరీ చర్యకాలపు నా చదువులకు తెలంగాణ విమోచన ఉద్యమంపై నా పరిశోధనా కాలానికి నా బాల్యపు చదువుల ప్రభావాన్ని ప్రశ్నించే, నిరాకరించే ఒక అవగాహన ఏర్పడింది. బహుశా దీన్నే చరిత్రకారుడు ఇ.హెచ్‌.కార్‌ చరిత్రంటే వర్తమానంలో గతం, భవిష్యత్తుతో చేసే సంభాషణ అని అన్నాడేమో.

రవీందర్‌ సారు మ్యాక్మిలన్‌ తెలుగు వాచకాలు పాఠ్యపుస్తకాలుగా చదివిచెప్పేవాడు. ఇట్లా మా బడి చదువు ఖాన్గీ వీధి బడులుగా కాకుండా, జాతీయోద్యమ పాఠశాలలు అనిపించే వ్యవస్థేతర చదువుగా సాగింది.

రవీందర్‌ సారు చాలా క్రమశిక్షణతో ఉండేవాడు. ఖద్దరు పైజామా, హాఫ్‌షర్టు వేసేవాడు. బహుశా ఆర్యసమాజ్‌లో పనిచేసేవాడు. ఆయనది వరంగల్‌లో స్థిరపడిన విద్యావంతుల కుటుంబం. సైనిక చర్య తర్వాత ఆయన పై చదువులు చదువుకుని ఎంఎ అయి వరంగల్‌ ఆంధ్రవిద్యాభివర్ధిని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడయ్యాడు. ఆ కళాశాలలోనే సాయంకాలం ప్రారంభమైన సికెఎం కాలేజీలో నేను లెక్చరర్‌గా చేరిన తర్వాత అట్లా రోజూ ఆయనను సహ ఉపాధ్యాయుడిగా కలుసుకోవడం ఎప్పుడూ నన్ను బాల్య జ్ఞాపకాల్లోకి తీసుకుపోతుండేది. ఆయన అక్కడ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు. అయితే అప్పటికి నేను కమ్యూనిస్టునయ్యాను. ఆయన అవే భావాలతో కొనసాగాడు. కాని మా బాల్యం అంతా ఒక విద్యార్థిగా మా దామోదర్‌ రావు అన్నయ్య మీద, నా మీద ఆయన ప్రభావం కాదనలేనిది. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించే పరీక్షలకు మా ఊరు కూడా ఒక కేంద్రం చేసి మా అందరితో పరీక్షలు రాయించాడు. నేను ప్రాథమిక పరీక్షలు రాసాను. అప్పుడు మాకు ఆ పరీక్షలు నిర్వహించడానికి పొట్లపల్లి రామారావుగారు వచ్చారు.

1950లో నా పదవ యేట హనుమకొండ మర్కజీలో ఐదో తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసి ఎన్నిక కావడానికి ఈ చదువే నాకు తోడ్పడింది. వీటితోపాటు మా రాఘవులు అన్నయ్య ఇంటికి తెచ్చే దేశోద్ధారక గ్రంథమాల పుస్తకాలు, తెలుగు స్వతంత్ర, భారతి నా మీద తొలి అధ్యయన ప్రభావాలు వేసినవి.

*

 

 

 

వరవర రావు

3 comments

Leave a Reply to Aranya Krishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి విశ్లేషణ…ఎన్నో విషయాలు తెలుసుకున్నాము…గజినీ దండయాత్ర లో హిందూ దేవాలయాలు కూలిపోవడం నాకు తెలియదు కానీ..ఇప్పుడు మసీదులు కూలగొట్టాలన్న ఆలోచన కూడా చేసే ధైర్యం ప్రభుత్వాలకు ఉంటుందని నేను అనుకోను..ఎందుకంటే ఇక్కడి ప్రజలు సర్వమత సౌభాతృత్వాన్ని ప్రేమిస్తారని నా ప్రగాఢ విశ్వాసం…
    పూర్వపుచదువుల గురించి,పెద్ద బాలశిక్ష, వేమన శతకం..ఎన్ని పరిచయాలు…గుర్రం ఝాషువా,పిరదౌసి…ఇంత చక్కటి వ్యాసాన్ని అందించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐

  • ఈ పోరాటవీరుని అక్షరాలు చదవటం ఓ సదవకాసం . సంపాదకులకు చాల ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు