బడలిక సమయం

ఇవాళ చిత్రకొండ గంగాధర్ పుట్టిన రోజు

మిత్రులకీ సాహిత్య లోకానికీ తెలియకుండా పదేళ్ళ క్రితం అర్థాంతరంగా జీవితాన్ని ముగించిన కవి, రచయిత చిత్రకొండ గంగాధర్ (25 జనవరి 1974- 25 సెప్టెంబర్ 2011) పుట్టిన రోజు నేడు. కవి ఎం.ఎస్.నాయుడు దగ్గర వున్న గంగాధర్ అముద్రిత కథను ఈ సందర్భంగా ఇస్తున్నాం.

కథలో  కథకుడూ, నేరేటరూ ఒక్కడు కానక్కర్లేదు. కానీ ఇక్కడ నేరేటర్ పెళ్లి విషయంలో చూపిన  తీవ్రమైన రియాక్షన్ ఆ సమూహంలో అతని ఇమడలేనితనాన్ని చూపిస్తోంది. ఏ కారణాల వల్లనో ఈ దారి ఎంచుకున్న అవివాహితుడైన రచయిత ఆత్మ కథాత్మక కథ అని చెప్పకనే చెబుతోంది.

– సారంగ

 

బడలిక సమయం

చిత్రకొండ గంగాధర్

కాలం బాక్సులు ఫిట్ చెయ్యడానికి నాతో ఇద్దరు మరాఠీ వాళ్ళని పంపించాడు మేస్త్రి. వాళ్లకి పని కొత్త. కాలం బాక్సులు ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా, తొందర తొందరగా పని చేసినా పొరపాటున ఆ కాలం బాక్సులు మీద పడితే కాలో చెయ్యో  తలో నుజ్జు నుజ్జు అవుతుంది. చాలా బరువుగా వుంటాయవి. అంతకు ముందురోజు మాలు పోసిన కాలాలకి వున్న బాక్సుల్ని విప్పేసి మాలు పొయ్యాల్సిన కాలాలకి బిగించాలి. మేము పనికి ఎక్కేటప్పటికి అప్పటికే కాలాల్లోకి మాలుపోసే గ్యాంగు రెడీగా వుంది. ఆడోళ్ళొక ఎనమండుగురు మగోళ్ళు నలుగురు పార్లు గంపలతో రడీగా వున్నారు. మేమింకా బాక్సులు ఫిట్ చేయలేదు. మాదే ఆలస్యం. పని తొందరగా చేస్తున్నాము. కనీసం అటువంటి సమయంలో నలుగురన్నా సెంట్రింగ్ పనివాళ్ళు వుండాలి. ముగ్గురమే వున్నాం. ఆడోళ్ళంతా నొచ్చుకుంటున్నారు. పని తొందరగా చేసుకుని వెళ్లిపోవాలని వాళ్ళ  ఉద్దేశ్యం. సిమెంటు కంకర ఇసుకా కలుపుకుని వున్నారు వాళ్ళు. ఎప్పుడు ఫిట్ చేస్తారయ్యా బాబులూ వో సెంట్రింగ్ బాబులూ అని వెంటపడుతున్నారు వాళ్ళు..  వాళ్ళ లేబర్ మేస్త్రి కూడా వచ్చాడు.  సర్వసాధారణంగా ఆ మేస్త్రి వచ్చేవేళకి పని నడుస్తా వుంటుంది. పైకి వస్తూనే కంటికెదురుగా కనబడ్డ ఆడకూలీల్ని చూసి ‘ఏం చేస్తున్నారే’ అని గదిమాడు.  యాభై ఏళ్ళు  వుంటాయతనికి. గొంతు మాత్రం గీరగా, కఠినంగా వుంటుంది. ఓ చెవికి రాగి పోగు కుట్టించుకున్నాడు. నల్లని ముఖం. రాత్రి తాగిన మందుకి మోహంలో ఎక్కడిదక్కడ పట్టి ఉంటుంది. కానీ ఉబ్బినట్టుగా ఏమాత్రం కనిపించదు. ఎప్పుడూ పాన్ నములుతూ వుంటాడు. ముతక పంచె పైకి కట్టుకుని షర్టు దండలకంటా మడచి వుంటాడు. మేస్త్రి వస్తే  పనిలేకపోయినా ఏదో ఒక పని చేస్తున్నట్టు కనిపించాలి. నిలబడినట్టుగా వుండకూడదు. మాలు కలుపుతున్నప్పుడు మగోళ్ళనీ, ఆ మాలుని గంపల్లో నెత్తిన పెట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు ఆడోళ్లనీ అతను అక్కడ వుంటే వురుకులు పరుగులు పెట్టిస్తాడు. అతను వున్నప్పుడు కూడా వాళ్ళు ఉరుకులు పరుగుల్లోనే వుంటారు. ఇంకా ఉషారుగా పని చేస్తారు. లేదంటే ఏమాత్రం పనిలో స్లోగా కనిపించినా నడుము ఎత్తి కాసేపు నిలబడినా అతను మొదటిసారి చూస్తే ఏమీ అనడు. రెండోసారి అలా కంటపడితే అంతమందిలోనూ ‘ఏం మబ్బుగాడివిరా నువ్వు’ అని ‘మబ్బుగాళ్లంతా పనికి తయారయ్యారు’ అని నొచ్చుకుంటాడు. అరుస్తాడు. గదుముతాడు.

ఆడోళ్ళూ  మగాళ్ళూ ఎక్కడి పారలు, గంపలు అక్కడ పడేసి నిదానంగా వుండటం చూసి “ఏం చేస్తున్నారే పొద్దెక్కలేదా మీకింకా” అని గదిమాడు..

“మేమేం చెయ్యాలి. బాక్సులింకా ఫిట్ చెయ్యలేదు” అంది ఒకామె.

మేమింకా విప్పి కిందపెట్టిన బాక్సుల్ని ఫిట్ చెయ్యాల్సిన కాలాల దగ్గరకి ముగ్గురమూ మోసుకెళ్తున్నాం.

“బాక్సులింకా ఫిట్ చెయ్యకపోతే పనిలేదా మీకు? రేపటికి కంకరా ఇసకా పైకి మోసుకోవాలని తెలీదా మీకు” అని వాళ్ళ పని పురమాయించాడు.

దాంతో వాళ్ళు లోలోపలే విసుక్కుంటూ ఇసుకా కంకరా పైకి మొయ్యడానికి పొయ్యారు. కాలాలకి మాలు పొసే పని ఇంకా మొదలుకాకపోవడం వలన తాపీ మేస్త్రి కంకర గుట్ట మీద నింపాదిగా కూర్చుని వున్నాడు. నుదుటి మీద దేవుని బొట్టు పెట్టుకువున్నాడు. స్నానం చేసుకుని చక్కగా దువ్వుకుని వున్నాడు. బట్టలు ఎప్పటిలాగా పని మీద వేసుకునే బట్టలే. పనికెక్కే ముందు ప్రతిరోజు అతను అలాగే వస్తాడు. అతనిది ఉత్తరప్రదేశ్. నలభై ఏళ్ళు వుంటాయి. నల్లని కమిలిన శరీరఛాయ. కొంచెం పీక్కుపోయినట్టువుండే ముఖం. కానీ అతనెప్పుడూ నవ్వుతూ వుషారుగా పని చెబుతూ పని చేస్తూ వుండడం వలన అతని శరీర క్షీణత కనిపించదు. బిల్డర్ అంతకుముందే చెప్పినట్టు బాక్సులో ఎంత ఎత్తువరకు మాలు పొయ్యాలీ, బాక్సులకి బోల్టులు నట్టులు సరిగ్గా టైట్ చేసి వున్నాయా లేదా, మాలు మంచిగా మిక్సింగ్ అవుతుందా, కాలంలో మాలు పోసిన తర్వాత కాలం అటూ ఇటూ పోకుండా గుండు దారానికి చూడ్డం అతని పని. గడంచా వేసుకుని దానిమీద నిలబడి కాలం బాక్సులోని మాలులోకి వైబ్రేటర్ పెట్టించడం అతని పని. అతను తీరిగ్గా కంకర మీద కూర్చుని చేతిలోవున్న తాపీతో ఏదో ఆలోచిస్తూ కంకరమీద చిన్నగా కొడుతున్నాడు. తీరిగ్గా కూర్చుని వున్న తాపీ మేస్త్రిని చూసి లేబర్ మేస్త్రి మాదగ్గరకి వచ్చారు.

“ఎప్పుడు అందిస్తారయ్యా బాక్సులు” అన్నాడు నడుం మీద చేతులు వేసుకుని చూస్తూ. ఒక చేతిలో సెల్ ఫోను పట్టుకుని వున్నాడు.

“చూస్తున్నావుగా మేం ముగ్గురమే వున్నాం. మేమేమి కూర్చోలేదు” అన్నాన్నేను.

“ముగ్గురితో ఏం పని అవుతుందయ్యా ”

“ఇంకొకడ్ని పంపిస్తామన్నాడు మేస్త్రి”

“ఎప్పుడు పంపిస్తాడు. పనంతా అయిపోయినాకా. తొందరగా కానియ్యండి..” అంటూ కిందకి పోయాడు.

రెండుమూడు బాక్సులు తొందరగా ఫిట్ చేసి వాళ్లకి రెడీ చేసాం. వాళ్ళు మాలు పొయ్యడం మొదలుపెట్టారు.

మద్యాహ్నానికల్లా మరో మూడు బాక్సులు రెడీ చేశాం.

ఎండ బాగా కొడుతోంది. కాలం బాక్సులు ఎండకి వేడెక్కి కాలుతున్నాయి. స్లాబ్ మీద క్యూరింగ్ నీళ్లు ఇంకా అలానే వుండటం వలన పాదాలు నీళ్లలో నానుతుండటం వల్ల ఎండదెబ్బ బాగా తగలడం లేదు.

మేం రెండు రెంచీలు పట్టుకుని చకచకా నట్ బోల్టులు టైట్ చేస్తున్నాం. ఆ పక్కన ఇసుకా కంకరా కలుపుతున్న మగోళ్ళ చెమటకి బనియన్లు తడిసిపోయి పేదకండలకి అతుక్కుపోయాయి.

ఆడోళ్ళు  నెత్తిమీద మాలు గంపల్ని ఉరుకుల పరుగులమీద తీసుకెళ్తున్నారు. వాళ్ళ మొహాలు కమిలిపోయి వున్నాయి.  ఎండకి చెమట కారుతోంది. సూర్యుడు నడినెత్తిన భగభగమని మండుతున్నాడు. లేబర్ మేస్త్రి చుట్ట తీసి వెలిగించి కంకర మీద కూర్చున్నాడు. అతను కూడ ఒకప్పుడు ఒళ్ళు హూనం చేసుకున్నాడు. ఇప్పుడు లేబర్ మేస్త్రి.

మేం వేసుకున్న బట్టలు కూడా ఉప్పుచారలు  పట్టున్నాయి. కారిన చెమట ఎండిపోయి బట్టలమీద ఉప్పుచారలుగా మారుతుంది.

* * *

మధ్యాహ్నం ఒంటిగంటకు సెంట్రింగ్ వాళ్ళు  భోజనాలు చేసి పై ఫ్లోరులో వున్న సెంట్రింగ్ కర్రల్లో కూర్చున్నాం. స్లాబ్ పోసి మూడు నాలుగు రోజులవుతుంది. బయటి ఎండలో ఇళ్లన్నీ తెల్లగా మెరుస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు అవీ ఇవీ మాట్లాడుకుని ఆ తర్వాత ఓ అర్థగంట కునుకుతీసి మళ్ళీ రెండుగంటలకు పని ఎక్కడం అలవాటు. తలో సెంట్రింగ్ కట్టెకు చేరబడి కూర్చున్నాం.

“ఏం గంగారాం ఏంటి సంగతులు” అన్నాడు శంకరయ్య.

అతను పన్నెండు గంటలకి వచ్చి మాతో కలిసాడు. దాంతో మేం నలుగురం అయ్యాం. అతనూ నేను కలిసి మరాఠీ మేస్త్రి దగ్గర గత రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాం. ఈ మధ్యలో ఇంటికిపోయి వచ్చాడు. ముసలోడు, అంటే నలభై అయిదు వుంటాయి. నల్లగా వుంటాడు. నల్లగా వుంటాడు. పంచె కట్టుకుంటాడు. నాడా చెప్పులు వేసుకుంటాడు. ఎప్పుడూ నవ్వుతూనే పలకరిస్తాడు.

“ఏముంది మామూలే” అన్నాను.

ఇంకా వేరేవాళ్ళ గురించి వాకబు చేసాడు.  వాళ్ళెక్కడ పని చేస్తున్నారు. ఏ సైటు మీద వుంటున్నారు అని.

“మరి మేస్త్రీ వి ఎప్పుడవుతావు? కూలి పెంచిండా? అని అడిగాడు.

“లేదు అదే కూలి” అన్నాను.

‘’మరి అడక్కలేకపోయావు పెంచమని” అన్నాడు.

ఇక సంభాషణ నా స్వంత విషయాలవైపు మళ్లుతుందని అక్కడే కట్ చేసి పక్కనున్న పాతపేపరు చేతుల్లోకి తీసుకుని తిరగేసాను.

ఈలోగా ఉత్తరప్రదేశ్ మేస్త్రి మా దగ్గరకి వచ్చి కూర్చున్నాడు.

బీడీ వెలిగించాడు.

ఇంకొక బీడీ శంకరయ్యకి అందించాడు.

వాళ్ళు మాటల్లో పడ్డారు. కూలీరేట్ల గురించి బిల్డర్ గురించి, గ్యాంగు పని ఈరు గురించీ ఇలా అనేక విషయాలు మాట్లాడుకుంటూవున్నారు.

సెంట్రింగ్ కట్టెకు వీపు ఆంచి పేపర్ను చూస్తున్నాను. బ్రూనై సుల్తాన్ ప్రత్యేక వ్యక్తిగత విమానం గురించి అందులో ప్రత్యేక కథనం వుంది ఫోటోలతో సహా. ఆ ప్రత్యేక విమానం సకల హంగులతో మహా ఐశ్వర్యంతో ధగధగలాడుతుంది.  ప్రత్యేకంగా  సుల్తాన్ కోసమే ఆ విమానం. ఆ విమానంలోని అన్ని సదుపాయాలూ,అమరికలు బంగారంతో తయారు చేసివున్నాయి.  స్నానాల గదిలో పైపులు, పైనుండి నీళ్లు వేసే షవర్, డోర్ హేండిల్స్  ఇంకా సకల హంగులన్నీ బంగారంతో తయారు చేసి వున్నాయి. బాత్ టబ్, అన్నీ బంగారంతోనే తయారు చేసి వున్నాయి. మరుగుదొడ్డి కూడా బంగారంతో తయారు చేసిందే. దాన్నికూడ  ప్రత్యేకంగా ఫోటో తీసి ప్రచురించారు జర్నలిస్టులు. వాటిని ఫోటోలతో సహా తీసి వేశారు పత్రికలవాళ్ళు. ఎంతో ఖరీదైన విమానం అది. నేను మొదట నమ్మలేదు. ‘ఎంత ధనికుడైతే మాత్రం అతను కూడా సాధారణ మానవుడు కాదా’  అనుకున్నాను. అది దర్పం కోసమా లేక వాటిని వాడుతాడా అన్న అనుమానం నాకేసింది. ఏమైనప్పటికీ ఆ వార్తా కధనం బాగుంది. అతను చాలా అదృష్టవంతుడు అనుకున్నాను. బ్రూనైలో ప్రజలు ఎలా జీవిస్తూ వుంటారో చాలా ప్రశాంతంగా కష్టాలేమీ లేని జీవితాన్ని గడుపుతూ వుండొచ్చు. అక్కడ పేదరికం లేకపోవచ్చు అనుకున్నాను. కానీ ఆ ప్రజలు ఎట్లాంటివాళ్ళో  తెలుసుకోవాలనుకున్నాను.

ఆ వార్తా కధనాన్ని మావాళ్లకు చూపించాను. వాళ్లంతా ఆ ఫోటోల్ని చాలా అబ్బురంగా చూశారు. వీళ్ళ జీవితాల్లో వుండే సంతోషాలు చాలా అల్పమైనవి. చాలా చిన్నవి. బీడీలు, ఖైనీలు, పాన్ పరాగ్ లు నైంటీలు, ఆదివారంపూట  కూలి డబ్బులు దొరికితే చికెన్ లేదా చేపలు. ఇవే వీళ్ళు అనుభవించే భోగభాగ్యాలు. రోజుకి వందరూపాయల నుండి నూటనలభై వరకు కూలి. పొద్దున్న ఆరుగంటలనుండి సాయంత్రం పొద్దుఎక్కేవరకు చేస్తే ఇంకా కొంత గిడుతుంది. ఆ కొంతనీ తాగుడికి వెచ్చిస్తారు. ఎక్కువమంది దుబారా చేస్తుంటారు. పని దిగిన తర్వాత ఒక నైంటీ పడాల్సిందే. లేకపోతె నిద్ర పట్టదు.

ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రి ఆ ఫోటోల్ని చూసి “కిస్మత్ ఉండాలి” అన్నాడు హిందీలో. నుదుట మీదుగా బొటనవేలిని పోనిస్తూ. అతను తన జీవితంలో 25 ఏళ్లుగా ఈ పనే చేస్తున్నాడు. ఆ పేపర్ ని తిరిగి నాకిస్తూ “మన బతుకు అన్నింటికన్నా నీచమైన బతుకు” పెదవుల్ని రోతగా విరుస్తూ అన్నాడు. లోపలున్న గారపట్టిన అరిగిపోయిన పళ్ళూ, పాలిపోయిన పెదవుల లోపలి భాగము కనిపిస్తుండగా.

“బేకారు పని” అని పక్కనున్న శంకరయ్య తలూపాడు.

“కష్టపడింది యాడికాడికే పోతుంది” అన్నాడు మళ్ళీ. మరాఠీవాళ్ళు కూడా అవునన్నట్టు తలలు కదిపారు.

ఆ ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రి హిందీలో ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. అతనికెప్పుడూ నలుగురితో ఉన్నప్పుడు సందర్భానుసారం ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది.

అతను పెళ్ళాం పిల్లలతో సహా ఆ బిల్డింగ్ కిందనే నాలుగు దిక్కులకు నాలుగు కర్రలు పాతి దాని చుట్టూ టార్పాలిన్ ముక్కలు చుట్టుకుని పెళ్ళాం పిల్లలతో వుంటున్నాడు. అటువంటి గుడిసెలే ఐదారు వున్నాయి ఆ బిల్డింగ్ కింద. వాళ్ళ లేబర్ కాంట్రాక్టర్ ఆ గుడిసెల్ని అక్కడ వేయిస్తాడు. అక్కడే పడుకుని అక్కడే పని చెయ్యాలి.

“ఆ పైనున్న భగవంతుడు” చూపుడు వేలు పైకి చూపిస్తూ అందరికేసి చూస్తూ చెబుతున్నాడు హిందీలో.

“ఈ మనుషుల్ని సృష్టించిన భగవంతుడు ఆ మనుషులు తిని బతకడానికి పైనుండి రొట్టె ముక్కలు వేస్తుంటాడు. ఆ రొట్టెముక్కలు అందరికన్నా పైన వుండేవాళ్ళకి ఉన్నపళంగా దొరుకుతాయి. వాళ్లకన్నా కొంచెం కింద వుండే మనుషులకు రొట్టె ముక్కలు ఉన్నపళంగా దొరకవు. పైవాళ్ళు తినగా వదిలేసినవి ముక్కలు దొరుకుతాయి. వీళ్లకన్నా కింద వుండేవాళ్ళకి అంటే మనకి దొరికేవి చిన్నచిన్న తుంపులే. భగవంతుడైతే రొట్టెముక్కలు వేస్తాడు. అవి ఎవరికీ దొరకాలో వాళ్ళకే దొరుకుతాయి. మనకి రాలేవి ఆ తుంపులే. ఆ తుంపుల్తోనే బతకాలి. ఇదీ గరీబ్ వాళ్ళ పరిస్థితి” అని అన్నాడు.

విన్నవాళ్లంతా కరెక్టుగా చెప్పావు అన్నారు. ధనవంతులు, కాంట్రాక్టర్లు, కూలీలు పొద్దస్తమానం బండచాకిరీ చేసే కూలీలకు ఆ తుంపుముక్కలే గతి అవుతున్నాయి.

ఆ ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రి నియమనిష్టలతో శరీరకష్టాన్నే నమ్ముకున్న మనిషిలాగ అంగుపించాడు. ఉన్నదాంతో సంతృప్తిగా వుంటాడు. దొరికిన దాంట్లోనే పెళ్ళాం పిల్లల్ని చక్కగా పోషించుకుంటున్నాడు. అతను ఇరవై సంవత్సరాలుగా ఒకే లేబర్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆ లేబర్ కాంట్రాక్టర్ వద్ద తనలాంటి కుటుంబాలే ముప్పై నలభై వుంటాయి. అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇలా అనేకచోట్ల అక్కడే గుడిసెల్లో వుంటూ పని చేస్తూవుంటారు.   ఒక బిల్డింగ్ పూర్తయ్యేవరకూ అక్కడే వుండి  మళ్ళీ వేరే కొత్త పని మొదలయ్యే బిల్డింగ్ దగ్గరకి పోతారు.

మళ్ళీ అతనే అన్నాడు.

“ఇక సంసారం అంటే అనేక కష్టాలు వుంటాయి. ఆ వచ్చిన కూలి డబ్బుల్లోనే కొంత తిండికి, కొంత జమ చేసుకోడానికి, కొంత రోగాలకి రొష్టులకి సరిపోతాయి”” అన్నాడు శంకరయ్య కేసి చూస్తూ.

శంకరయ్య “ఔ ” అన్నాడు.

సంభాషణ సంసారమూ పెళ్లి వైపు మళ్లుతోందని తెలిసి పేపర్లో తల దూర్చాను. చెవులు టెన్షన్ గా అయిపోయాయి. నాకింకా పెళ్ళికాలేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ ఉత్తర్ ప్రదేశ్ వాడు అడిగినా అడిగేస్తాడు. పెళ్లి కాలేదు అన్నానంటే అక్కడున్న వాళ్ళందరి చూపు నామీద పడుతుంది. ఆ తర్వాత జరిగే సంభాషణకు నేనే కేంద్రమై సమాధానాలు ఇచ్చుకోవాల్సి వుంటుంది. అందుకని నేను సీరియస్ గా పేపర్లో తలదూర్చాను.

ఆ తాపీ మేస్త్రి అడగనే అడిగాడు. తనకి ఎదురుగుండా నేనే వున్నాను కాబట్టి. అయితే ఆటను డైరెక్టుగా అడగలేదు పెళ్లైందా అని. ఎందుకంటే నేను చాలా పెద్దవానిలా కనిపిస్తుంటాను.

‘మీ జోరీ ఏం చేస్తుందని’ అడిగాడు హిందీలో.

“జోరీ ఎక్కడిది? ఇంకా పెళ్లి కాలేదు”  అని నాకు బదులు ఠక్కున పళ్ళికిలించుకుంటూ అన్నాడు శంకరయ్య. నాకింకా పెళ్లి కాలేదని తెలుసు. ఎప్పుడు చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు? అని సరదాగా పోరు పెడుతుంటాడు. మేమిద్దరం సంవత్సరం నుంచీ ఒకే దగ్గర పని చేస్తున్నాం.

“బాప్ రే ఇంత వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదా?” ఆశ్చర్యపోతూ అదొలాగ నావంక చూశాడు ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రి. ఆ మరాఠీవాళ్ళు కూడా నావైపు చూశారు.  వాళ్ళ దగ్గర నా ఇమేజి పోకుండా నేనే మొదట అబద్ధం ఆడి కట్ చెయ్యాలని అనుకున్నాను. ఇంతవయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదని తెలిస్తే వాళ్ళందరి మధ్యా తలెత్తుకుని తిరగడం సాధ్యమా. తెగించి పెళ్లైందని అబద్ధమాడాలనుకున్నాను. ఆలా చెప్పినా ఎంతమంది పిల్లలు? మళ్ళీ దీన్నికూడా ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సమయాల్లో చాలా పేలవంగా వుంటుంది నేను మాట్లాడేది. పెళ్లి కాలేదన్న విషయం వాళ్లకి అర్థమైపోతుంది. ఈలోగా శంకరయ్య పెళ్ళికాలేదని అనేశాడు.   శంకరయ్య వంక  నేను గుర్రుగా చోడలేదు కానీ శంకరయ్య కళ్ళల్లో మాత్రం నన్ను ఆటపట్టిస్తున్న ఆనందం కనిపిస్తుంది. మళ్ళీ ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రీయే అందుకున్నాడు హిందీలో.

“మానవజన్మ ఎత్తినాక పెళ్లి చేసుకోవాలి” అని ఖరాఖండీగా చెప్పాడు నావైపు చూస్తూ.

“ఔ”    అన్నారు అందరూ.

“పెళ్లి చేసుకోకపోతే ఆ మనిషి వేస్టు”  అన్నాడు.

అందరూ ఏకీభవించారు. అతను నా గురించే చెబుతున్నాడని అర్థమైంది. ఆ క్షణాన నేను చాలా అధముడ్ని అయిపోయాను. ముఖకవళికలు మరీ పేలవంగా మారిపోకుండా నిదానుంచుకున్నాను కానీ మనసు మాత్రం పేలవంగా తయారయ్యింది.

అక్కడున్న అందరికీ నేను ఒక జోక్ లాగా తయారవుతాననే భయం పట్టుకుంది. అప్పటివరకు నన్ను మామూలుగానే పలకరించేవాళ్లంతా ఆ తర్వాతనుండి చులకనగా చూస్తారని భయపడ్డాను

అతను హిందీలో చెబుతున్నాడు.

“అసలు మనిషన్నవాడు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకముందు ఒక్కడే. పెళ్లి అయిన తర్వాత పెళ్ళాం వస్తుంది. మనిషి ఆ పెళ్ళాన్ని ఒక భుజం మీద పెట్టుకోవాలి. ఒక భుజం మీద పెళ్ళాన్ని, మరో భుజం మీద సంతానాన్ని పెట్టుకుని సంసారపు బరువు మొయ్యాలి మగవాడు. సంబాళించుకుని నడవాలి” అన్నాడు.

ఈసారి చెప్పింది కూడా బాగుందనిపించింది అందరికీ.

నాక్కూడా బాగానే అనిపించింది.

ఎక్కడినుంచో ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చి యిక్కడ గుడిసెల్లో ఉంటూ పొద్దస్తమానం కష్టపడుతూ సంసారాన్ని నెట్టుకొస్తున్న ఈ మనిషి చెప్పింది బాగానే వుందనిపించింది.

కానీ అంతకు ముందెన్నడూ చూడని విధంగా నావైపు చూశాడా మేస్త్రి.

ఈ చూపు భయంకరంగా వుండింది నాకు.

దాంతో మారాఠీ వాళ్ళు కూడా

“ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు” అన్నారు నాతో.

ఇలాగ సమయం అయిపోయింది. రెండు దాటింది. అప్పటివరకు కింద ఒక కునుకు తీసి ఆడ కూలీలు పనికి ఎక్కడానికి మెట్లెక్కుతూ గుంపుగా పైకి వస్తున్నారు. ఇంకా మేము రెండుమూడు బాక్సులు ఫిట్ చేయాల్సి వుంది.

పని మీదికి పోడానికి అందరూ లేచారు. అంతవరకూ కట్టెలకి చేరబడి వుండటం వలన వొళ్ళు  విరుచుకున్నాను బద్దకంగా.

ముసలాడు ఆవులించాడు.

“ఆయ్ రామా” అంటూ.

నేను కూడా ఒళ్ళు విరుచుకున్నా చేతులు వెనక్కి విరిచి.

అందరమూ పైకి పోయాము.

ఎండ మొహాల మీద కొడుతోంది.

నిలబెట్టిన కాలం బాక్సులపైన సూర్యుడు ధగధగలాడుతున్నాడు.

ఆ ఉత్తర్ ప్రదేశ్ మేస్త్రి గడంచా మీదకెక్కి గంపల్లో ఆడాళ్లందిస్తున్న మాల్ ని కాలం బాక్సుల్లో పోస్తున్నాడు.

మరాఠీవాళ్ళు మేమూ  కలసి రెంచీలు  పట్టుకుని నట్లు, బోల్టులు టైట్ చెయ్యడం మొదలుపెట్టాం.

ఎండ దంచుతుంది

గాలి లేదు.

ఇదే బాగుంది.

*

చిత్రకొండ గంగాధర్

3 comments

Leave a Reply to బి.అజయ్ ప్రసాద్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Yes, among the common people, we, as the intellectual or the one abiding to certain values or with certain kind of life style, we feel suffocation when we are being pointing out. We could feel our inability while the people are mistrusting us to their extent and making us feel alone. This is the rare piece of work in my experience

  • ఆయన బతికుండి ఉంటే ఇలాంటి కథలు ఇంకా రాసి ఉండేవారు. ఇది పెద్దగా explore చెయ్యని జీవితం. రచయితకి ఆ జీవితంతో ప్రత్యక్ష పరిచయం ఉంది కాబట్టి దాన్ని పాఠకులకు సమర్ధవంతంగా చూపించగలరు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు