రథసప్తమి పూర్తై పదిరోజులన్నా కాలేదు. ఎండలు బాగా ముదురుతున్నాయి. సరిగా నిద్రపట్టలేదు. రాత్రి వచ్చిన ఫోన్ కూడా ఒక కారణమే! మునుపటి కంటే ఇంకాస్త త్వరగానే మెలకువొచ్చేసింది. కాసేపు ఇంట్లోనే అటూఇటూ తిరుగుతూ పూజకు పూలు కోసుకొద్దామని బయటకు వచ్చాను.
ఐదు కావస్తోంది. విచ్చీవిచ్చుకోని పూలు తెంపుతుంటే మునివేళ్ళకు అంటుకున్న తేనె భలే రుచిగా అనిపిస్తోంది. కాస్త మంచు, కాస్త తేనె కలిసిన ఆ తియ్యని రుచి కమ్మగా ఉంది. నందివర్ధనాలు కోయడం అయ్యాక పక్కనే ఉన్న ముద్దబంతుల్ని తీద్దామని వంగాను. ఒక్కసారిగా ఆ శబ్దం చెవినపడి కళ్ళు చీకటయ్యాయి.
అదే శబ్దం. ఆ శబ్దంలో ఎన్నో ప్రాణాలు నిశ్శబ్దంగా కలిసిపోయుంటాయి. ఎన్నో రోదనలు ఎవరి చెవినా పడకుండా మిన్నంటి ఉంటాయి. ఎన్నో కన్నీళ్లు తుడిచే సాయం లేకుండా నేలన ఇంకిపోయుంటాయి.
అందరూ విన్న శబ్దమే! కుయ్ కుయ్ మంటూ వినిపించే అంబులెన్స్ ధ్వని.
ఒకరికి పట్టీపట్టనట్టు వినిపిస్తే, మరొకరికి గుండె ఆగిపోయేంత భయం. నాకూ అలానే! నేనున్న ఊరు హైవేకి పక్కనే కావడంతో మరింత గంభీరంగా వినిపిస్తోంది. పాపం! ఉదయం లేవగానే ఎవరి మొహం చూశారో ఏమో? ఎంత పెద్ద గాయమో? ప్రాణం పోయే ప్రమాదమో! ఊపిరి పోసుకునే ప్రహసనమో! ఏమో? ఉన్నపళంగా చేతిలో పూలన్నీ నేలవాలిపోయాయి చిందరవందరగా.
***
మేమంతా ముందే అనుకున్నాం. కొవిడ్ మొదటి వేవ్ విజృంభిస్తున్నపుడు చుట్టూ అన్ని గ్రామాల్లోకి వచ్చి నడిమధ్యన ఉన్న మన మండలంలో రాకపోవడం ఏంటి? పరిసరాల్లో ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి వారో వచ్చి ఉంటున్నారు. అలాంటప్పుడు ముందుగా కేసులు బయటపడక పోయినా ఒకేసారి ముంచుకొస్తాయనుకున్నాం. అనుకున్నట్టుగానే ఆదివారం సాయంత్రం ఒక పాజిటివ్ కేసు బయటపడింది. ఆయన ఒక డాక్టర్. ఈ మధ్య కాలంలో ఆయన దగ్గర ట్రీట్మెంట్ పొందిన వారు ఎందరో.
ఆదివారం ఇంట్లోనే ఉన్నా. ఉండేది ఒక జిల్లా, పనిచేసే చోటు వేరే జిల్లా సరిహద్దు. రెండింటికీ మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం. గంటన్నరపైనే ప్రయాణం. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అంతా ఫోన్‌లోనే సేకరించాం. మరుసటి రోజు ఉదయాన్నే ఆరింటికి యాక్టివాపై మరింత యాక్టివ్‌గా అక్కడికి చేరుకున్నాను. ఆ పరిసరాల్లో దుకాణాల మూయడం, హెచ్చరికలు జారీ చేయటం, మాస్క్ వేసుకోని వారికి ఫైన్ వేయడం, కొవిడ్ నిబంధనలు పాటించని బండ్లని పక్కన పెట్టించడం.. నానా రభసా చేసాం. అంతా వాళ్ళ మంచి కోసమే. రోజంతా రోడ్డు మీదే! పనయ్యేటప్పటికి సాయంత్రం ఆరు దాటింది. కాసేపు అక్కడే ఉండి మరో అరగంటలో యాక్టివా పైనే బయలుదేరా. ఈసారి అంత యాక్టివ్‌గా లేను.
ముందు రోజంతా సరిగ్గా నిద్ర లేకపోవటం, రోజంతా అలసిపోవడం. ఏమో? అలాంటప్పుడే ఆత్మీయులు గుర్తొస్తారు. మనసు అమ్మ వైపు మళ్ళింది. బండి పక్కన ఆపి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడా. ఎప్పటిలాగే నేను చెప్పింది వినకుండా ఇంట్లో ‘పప్పులున్నాయా? కారం పసుపు ఏమైనా పంపాలా? ధాన్యం మిల్లుకు పంపాం, రాగానే బియ్యంలో రాళ్లు తీయించి పంపిస్తా. ఓ మూడు నెలలపాటు సరిపోతాయి’ అని చెప్పాల్సింది చెప్పి ‘సరే ఉంటా మరి’ అని ఫోన్ పెట్టేసింది.
ఏడయ్యింది. చీకటి పడింది. మా వారికి ఫోన్ చేసా. బిజీగా ఉన్నట్టున్నారు. ఫోన్ కట్ చేశారు. మనసెందుకో మళ్ళీ తమ్ముడి వైపు మళ్ళింది. అర్జెంట్ కాకపోతే మళ్లీ మాట్లాడతానంటూ పెట్టేసాడు.
హెల్మెట్ బెల్ట్ సరిచేసుకొని బండి స్టార్ట్ చేశా. రోడ్డు పనులు అప్పుడపుడే పూర్తవుతున్నాయి. విశాలమైన రోడ్డును మరింత విశాలం చేసేందుకు. కుడివైపు సగభాగం రోడ్డు పూర్తయింది. ఎడమ చేతి వైపు ఒక వంద అడుగుల వరకు పూర్తి కావాల్సి ఉంది. రెండింటికీ మధ్య ఎత్తుపల్లాల వ్యత్యాసం అడుగు మేర ఉంది. ఎదురుగా వస్తున్న కారు లైట్ కళ్లపై పడి, పక్కకు జరిగి తోవ ఇద్దామనుకున్నా. తొందరలో అక్కడ రోడ్డు పనవుతోందని మర్చిపోయాను. అంతే!
పూర్తయిన రోడ్‌పై నుంచి పని జరుగుతున్న రోడ్‌పైకి బండి ఒరగడంతో ఎన్ని పల్టీలు వేసిందో, నేనెలా పడ్డానో గుర్తులేదు. రెడ్డీస్ ల్యాబ్‌లో పని ముగించుకుని వస్తున్న కార్ డ్రైవర్ నన్ను చూసి పక్కకు ఆపాడట. అందులో ఉన్న మిగతా ముగ్గురు నన్ను లేపి పక్కకి తీసుకెళ్లి, బాటిల్‌లో నీళ్లు కొన్ని మొహంపై చల్లి, ఇంకొంచెం గొంతులో పోశారు. దూరంలో పడున్న చెప్పులు, ఫోన్, బ్యాగ్, క్లిప్ తెగి ఎగిరిపడిన హెల్మెట్. ఆ చీకట్లో ఒక్కొక్కటి వెతికి మరీ తీసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు.
పక్కనే వెంచర్ డెవలప్ చేస్తున్నవాళ్లు కొందరొచ్చారు. ఈ మూడు రోజుల్లో ఐదో యాక్సిడెంట్ అంట. ఎంతమేర గాయలయ్యాయో తెలీదు. తలపై నుంచి కారుతున్న రక్తంతో అప్పటికే గొంతు తడిసిపోయింది. మా వాళ్లకు కాల్ చేసి చెప్పడానికి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు.
ఇదేంటి? నేను యాక్సిడెంట్‌లో పోయాను కదా! సినిమాల్లో చూపించినట్టు నన్ను తీసుకెళ్లడానికి యమభటులు రావాలి కదా! వీళ్లంతా వస్తున్నారేంటి? పైగా మా వాళ్ళ నెంబర్ అడుగుతున్నారు. నా బంధువులో, చుట్టాలో, స్నేహితులో.. ఎవరూ కారే వీళ్లు? మరెవరూ?
ఈ ఆలోచనల్లో ఉండగానే ఎవరో ఫోన్ ఇచ్చారు. మీ వారేనట, మాట్లాడండి అని.
“బుజ్జీ! ఎలా ఉంది?”
“బావా! నేను సచిపోతున్నా. మీరు భయపడకండి. బాబు జాగ్రత్త. బ్యాంక్ అకౌంట్ నామిని బాబు పేరు పెట్టా. గార్డియన్ నువ్వే. నా కుట్టుమిషన్, పుస్తకాలు కూడా జాగ్రత్త. నేను లేనని అవన్నీ ఎక్కడో పడేయకండి. వందో, రెండొందలకో పాత సామాన్ల వాళ్లకు వేసెయ్యకండి. బెండకాయ కూరంటే నాకు బాగా ఇష్టమని పొద్దున్న వండి టైం లేక వచ్చేసా. అది నువ్వైనా తినేసెయ్..” ఏవేవో చెబుతున్నా ఇంకా. నా చిట్టా పూర్తవకుండానే ఫోన్ తీసుకున్నారు వాళ్ళు.
“మీరు కంగారు పడకండి. మీరొచ్చేవరకు మేము ఇక్కడే ఉంటాం. ఆవిడ స్పృహలో ఉన్నారు. ఏదైనా అర్జంట్ అయితే మేమే దగ్గరలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం” అంటూ ఫోన్ కట్ చేసి నా వంక కోపంగా చూస్తున్నారు. అలా ఎందుకు చూస్తున్నారో తర్వాత అర్థమైంది. ఏడింటికి నా మిస్ కాల్ చూసి మా వారు మరో పది నిమిషాల్లో రిటర్న్ కాల్ చేసారట. అప్పటికే నా ఫోన్‌కి డిస్‌ప్లే పోవడంతో అక్కడున్న వాళ్లు లిఫ్ట్ చేసి, వాళ్ళ నెంబర్ ఇస్తే ఆ ఫోన్‌కి కాల్ చేశారు. ఆయన అంత భయంగా మాట్లాడుతుంటే నేనేమో ఇవన్నీ చెబుతున్నాను. ఆడవాళ్ల పాట్లు వాళ్లకేం తెలుసు? ఒక్క నిమిషంలో ప్రాణం పోతుందంటే అన్నీ ఒకేసారి చెప్పగలరు? ఆయన వచ్చేవరకు బతికుంటానో, లేనోనన్న భయంతో చెబుతుంటే, అయ్యోరామా! నా మాటల్లో వాళ్ళకి భయమే కనపడట్లేదే?
అప్పటికే ఎనిమిది దాటింది. పోగైన జనం కాస్త కాస్త పల్చబడ్డారు. కారులో వచ్చిన నలుగురు, దగ్గరలో ఉన్న నలుగురు అటూఇటూ ఉన్నారు. ‘ఆ నలుగురు’ కాస్తా అవసరమైతే వీరే అయ్యేలా! కారు వైజాగ్ వరకూ వెళ్తుందని, నన్ను కూడా తీసుకెళ్తా రమ్మని వాళ్ళు పిలుస్తున్నారు. అడుగుతున్నారు. బతిమాలుతున్నారు. ‘బండి ఇక్కడే ఉంచేద్దాం! రేపొచ్చి ఎవరైనా తీసుకెల్దురు’ అంటున్నారు. వింటేగా! ఒకవైపు ప్రాణమే పోయేలా ఉంటే, ఇంకో వైపు కరోనా పుణ్యమా అని ఒకరితో ఒకరు మాట్లాడలేని పరిస్థితి. అలాంటపుడు వాళ్లొచ్చి అంత సాయం చేస్తుంటే ఇంకా నా పిచ్చి అనుమానాలు, సందేహాలు. నిజంగానే వీళ్ళు వైజాగ్ వరకూ వెళ్తారా? అమ్మో, వెళ్ళకుంటే? ఇక్కడ నా బండి పరిస్థితో? చాలా పౌరుషంగా నా జీతం డబ్బులతో కొనుక్కున్నా. ఇక్కడ ఉంచేస్తే దానికి ఏమైనా అయితే? అమ్మో! వద్దే వద్దు. వస్తా అన్నారుగా! రానీ. వచ్చాకే వెళ్తా. ప్రాణం ఉంటే నాతో బండి. ప్రాణం పోతే? పోతే పోనీ.
అక్కడే మా వారొస్తే వెళ్తా అని భీష్మించుకు కూచున్నాను. అదేమీ బయటకు కనపడకున్నా “ఈ సమయంలో ఇంత సాయం చేసారు. అదే ఎక్కువ. మీరు ఇంకా ఇబ్బంది పడొద్దు. మా వారు బయలుదేరారుగా! వచ్చేస్తారు. వాళ్ళతో వెళ్తాలెండి. మీరు వెళ్లిపోండి. ఇక్కడ వీళ్లున్నారుగా” అంటూ వెంచర్ వేసిన వాళ్ళను చూపిస్తూ చెప్పాను. సరే అంటూ వాళ్ళ చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌తో పాటు ఇంకో బాటిల్ కూడా నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు.
పరుగుపరుగున వచ్చారు మా వారు, ఆయన స్నేహితురాలు. ‘బుజ్జీ.. బుజ్జీ’ అంటూ చేతులు, మొహం పట్టుకుని, ఇంకా దగ్గరగా అదిమిపట్టుకున్నారు. చేతులకు అంటుకున్న రక్తం చూసుకుని ఏడుస్తున్నారు. “బుజ్జీ! ఎలా ఉందిరా? ఏంటిది, ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఏదో ఒకటి మాట్లాడురా! బంగారం.. ప్లీజ్ రా” అని బుగ్గలపై కొడుతూ ఏడుస్తున్నారు.
“పల్పీ ఆరెంజ్ తీసుకురాలేదా? నోరు ఆరిపోతోంది” అంటూ తల పైకెత్తి చూసా. ఏదో ఒకటి మాట్లాడు అన్నారు. అదే అడగాలి అనిపించింది. అదీ తప్పేనా?
ఇక చాలన్నట్టు అందరూ సాయం అందించి వెయికిల్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి మరో ముప్పై కిలోమీటర్ల పైనే ప్రయాణం. ముప్పై నిమిషాల పైనే పట్టింది కేజీహెచ్ చేరడానికి.
..
“ఇమిడియట్‌గా బ్రెయిన్ స్కాన్ చేయించాలి. తర్వాత ట్రీట్మెంట్ చేయిద్దాం” అన్నారు డాక్టర్.
ఖాళీగా ఉన్న స్ట్రేచర్‌పై పడుకున్నా. రెండు నిమిషాలైనా అవకముందే ముగ్గురు మనుషులొచ్చారు. “తప్పతాగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ కాక ఏమవుతుంది? పోయినోళ్లు పోయినట్టు ఉంటారా! వాళ్ళ కుటుంబం ఏం కావాలి?” అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. తెలుగు భాషలో అన్ని తిట్లు ఉన్నాయని నాకు తెలీనే తెలీదు.
ఎవర్నో తిడితే నాకెందుకంటూ కళ్ళు ముసుకున్నా. నా స్ట్రేచర్‌ను ముందుకు జరుపుతూ తీసుకెళ్లారు. నెమ్మదిగా కళ్ళు తెరిచి, “మా ఆయన ఎక్కడున్నారు, ఓసారి పిలవరా” అంటూ అడిగా.
“అమ్మో” అంటూ కేకలు వేశారు.
అక్కడున్న డాక్టర్, హెడ్ నర్స్, డ్యూటీ నర్సులు అంతా పరుగుపరుగున వచ్చేసారు ఏమైందీ అంటూ.
“సా….ర్….! ఆమె మాట్లాడుతోంది సార్..” అంటూ పెద్దగా అరిచారు.
“ఆమెను తీసుకెళ్లమని మీకెవరు చెప్పారు?”
“మీరే కదండీ స్ట్రేచర్‌పై ఉన్న బాడీని మార్చురీకి తీసుకెళ్లమని చెప్పారు”.
“అబ్బా! చెప్పా కదమ్మా. డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్ అని. ఈమె కాదు. అయినా నువ్వెందుకమ్మా ఇక్కడ పడుకున్నావ్? డెడ్ బాడీ పక్కనే చోటు దొరికిందా?”
అపుడు చూసా పక్కకు తిరిగి. కొద్ది నిమిషాల ముందే ప్రాణం పోయినట్టుంది. మొహంలో అస్సలు చావుకళ లేదు. నాలాగే యాక్సిడెంట్ అయి పడుకున్నాడేమో అనుకున్నా. నాకేం తెలుసు?
నా రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కొన్ని చిన్న సర్జరీలు. మూడు నెలల బెడ్ రెస్ట్‌తో కొంత కోలుకున్నా. రానురానూ పర్లేదు. ఆరునెలల పైనే అయినా ఆ యాక్సిడెంట్ అయినపుడు శబ్దాలు, చుట్టూ జనాలు, హాస్పిటల్‌లో డెడ్ బాడీ పక్కన నేనూ.. ఇవన్నీ నిద్రలో కూడా భయపెట్టేవి. నాలుగు నెలల తర్వాత తిరిగి డ్యూటీలో చేరాక నెమ్మదినెమ్మదిగా ఆ ఆలోచనల నుంచి బయటపడ్డా! ఈసారి డైలీ జర్నీ చేయకుండా డ్యూటీ చేసే ప్రాంతానికి దగ్గరలో ముగ్గురం కొలీగ్స్ కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాం.
**
నిన్న రాత్రి ఒక ఫోన్ వచ్చి మళ్ళీ ఆ భయాన్ని గుర్తు చేసింది.
టైం రాత్రి పదయ్యింది.
ఫోన్ ఛార్జింగ్ పెడదామని వెళ్తుండగా ఒక ఫోన్.
“హెలో! ఎవరూ?”
“అక్కా! నేను. ఆ రోజు యాక్సిడెంట్ అయినపుడు మీ ఆయన వచ్చేంత వరకు మీ దగ్గర ఉన్నా కదక్కా! నేనే”
“హో.. తమ్ముడూ! మీరా? బావున్నారా? ఎలా ఉన్నారు? నిజంగా ఆరోజు మీరు చేసిన సాయం, మీ రుణం తీర్చుకోలేనిది.”
“అక్కా! మీతో మాట్లాడాలి.”
“చెప్పండి తమ్ముడూ..”
“ఇక్కడ కాదక్కా! యాక్సిడెంట్ అయిన చోటికి రేపుదయం వస్తా. మీరూ రండి. పదింటికి.”
“ఏమైంది తమ్ముడూ? చెప్పండి.”
“అక్కా! ప్లీజ్! ఇంకేం అడగొద్దు. మీరొక్కరే రండి. పది గంటలకి వెయిట్ చేస్తుంటా” అంటూ ఫోన్ కట్ చేసేసాడు.
అప్పటి నుంచి పొరలపొరల జ్ఞాపకాలు పోగయ్యాయి. ఒక్కొక్కటి పైపైనే పలకరించుకుంటూ పోతుంటే, కొన్ని గుండె లోతుల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక్కదాన్నే వెళ్లడం మంచిది కాదేమో అనిపించినా ఎందుకో ఆ గొంతులో నిజాయతీ చూసి, మనసు వెళ్ళమనే చెప్పింది.
తొమ్మిదింటికే బయలుదేరి పదిహేను నిమిషాల ముందే చేరుకున్నా. అప్పటికే హైవే పక్కనే ఉన్న సైడ్ వాల్‌కి ఆనుకుని ఒకతను నిల్చొని ఉన్నాడు. చేతికి బ్యాండేజ్‌తో.
“తమ్ముడూ! మీరేనా?”
“వచ్చారా అక్కా?”
“ఎందుకు రమ్మన్నారు?”
“అక్కా.. ఇప్పటికే ఆలస్యం చేశా.”
“ఏమైంది అసలు? ఎందుకలా మాట్లాడుతున్నారు?”
“అక్కా! మీ మెళ్ళో తాళి పోయింది కదా?”
“అవును తమ్ముడూ! ఆరోజు యాక్సిడెంట్ అయినపుడే పడిపోయింది. తర్వాత చూసుకున్నాం. అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ప్రాణం ఉండడమే ఎక్కువ అనుకుని మా వాళ్ళు కూడా ఏమనలేదు.”
“కనీసం మమ్మల్ని అడగాలి అని కూడా అనుకోలేదా మీరు?”
“స్కానింగ్ రూమ్‌కి వెళ్ళేవరకు తెలీదు. తర్వాత చూసుకున్నా దానిపై ఎవరికీ ధ్యాస లేదు. తర్వాత ధ్యాస ఉన్నా రాసిపెట్టిలేదు అనుకున్నాం.”
“మీరు కోలుకున్నాక ఫోన్ చేశారు కదా! థ్యాంక్స్ చెప్పినపుడైనా అడగాలనిపించలేదా?”
“అయ్యో! రోడ్‌పై దిక్కులేక, స్పృహ లేక పడున్న నాకు మీరంతా ధైర్యం చెప్పి ప్రాణం పోశారు. లేదంటే భయంతోనే చచ్చేదాన్నేమో! మా వాళ్ళు వచ్చేవరకు అక్కడే ఉన్నారు. మానవత్వం కాకుండా మరే సంబంధమూ లేదు కదా? అలాంటి మిమ్మల్ని ఏమని అడగాలి..”
నేనేదో చెబుతుండగా కళ్ల నీళ్లు దించుకుంటూ నా చేతిలో చిన్న పొట్లం పెట్టాడు. తెరిచి చూస్తే నా మంగళసూత్రం, గొలుసు. నాకు ఆశ్చర్యం, ఆనందం.
తలపైకెత్తి చూస్తే ఆయన చేతులు జోడించి దండం పెడుతున్నాడు.
“అయ్యయ్యో! ఏంటిది తమ్ముడు?”
“నన్ను క్షమించండక్కా! పడిపోయిన బండిని పక్కకు తీస్తుండగా ఈ చైన్ కనిపించింది. బండి హ్యాండిల్స్‌కి తగిలి తెగి పడినట్టుంది. చుట్టూ చూస్తుంటే ఎవరూ చూడట్లేదనిపించి దీన్ని తీసుకుని, బండి మాత్రమే పక్కన పెట్టా. మీరు వెళ్ళేవరకు ఎవరూ ఈ ప్రస్తావన తీసుకురాలేదు.”
“మరి ఇన్నాళ్ల తర్వాత ఎందుకు ఇవ్వాలనిపించింది?”
“ఆరు నెలలైందక్కా ఇది జరిగి. మా ఇంట్లో వరుసగా మూడు దుర్వార్తలు. ముహూర్తాల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడం మా ఇంట్లో పెద్ద బాధ అనుకుంటే, తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి చెయ్యి విరిగిపోయింది. లక్ష్మీదేవిలా కళలాడుతూ తిరిగే మా అమ్మ రెండు నెలలుగా మంచం పట్టేసింది. చాలా రోజులుగా చూస్తున్నా అక్కా. మీతో మాట్లాడే ధైర్యం సరిపోలేదు. ఏమంటారోనని భయం. చివరికి తెగించి కాల్ చేశా.
“మీరు మనసుని ఇంత కష్టపెట్టుకోవాల్సిన పని ఏముంది? పోయిందన్న బాధ ఎప్పుడూ లేదు. ఇది నా కష్టంతో కొనుక్కున్న చైన్. రాసి పెట్టుంటే దొరుకుతుంది, లేదంటే లేదు. అలానే అనుకున్నా. ప్రాణం ఉంది. బలం ఉంది. ఇంత కన్నా ఏం కావాలి ఏదైనా సంపాదించడానికి?”
“మీరు చాలా గొప్పవారు. అందుకే అర్థం చేసుకున్నారు.”
“గొప్పతనం నాది కాదు. ఈ రోజుల్లో బంగారం దొరికితే ఇచ్చేవాళ్లు ఎవరున్నారు? నీలాంటి బంగారు తమ్ముళ్లు కాకుండా. నాకు డ్యూటీ కి టైం అవుతోంది. బయలుదేరనా?”
ముందు రోజే పడిన జీతం బ్యాగ్‌లో ఉంది. ఆ మొత్తాన్ని తన చేతిలో పెట్టి యాక్టివా స్టార్ట్ చేశా, ఈసారి చాలా యాక్టివ్‌గా!
*
మా ఊరే నాకు ప్రేరణ
* నమస్కారం అమ్మూ గారూ! మీ గురించి చెప్పండి.
నమస్తే! మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పోలవరం. పుట్టింది, పెరిగింది అక్కడే! కొన్నాళ్ళు జర్నలిజంలో ఉండి, ప్రస్తుతం సచివాలయ పోలీసుగా పని చేస్తున్నాను. మా వారు సంపతిరావు మోహన్‌బాబు. మాకు ఒక బాబు.
* సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది?
సాహిత్యంపై ఇష్టం కలగడానికి కారణం మా ఊరు. మా ఊళ్ళో కార్తిక్ మాసంలో వీధి నాటకాలు ఆడతారు. అందులో మా నాన్న ధనుంజయరావు రకరకాల పౌరాణిక పాత్రలు వేసేవారు. వాటికి సంబంధించి పద్యాలు వినడం, ఎవరికైనా కావాలంటే వాటిని రాసివ్వడం చేసేదాన్ని. అలా పురాణాల మీద జ్ఞానం వచ్చింది. నా చేత ‘సన్యాసమ్మ కథ’ పాడించుకుని వింటూ మా నాన్న నిద్రపోయేవారు. అలా చిన్నప్పటి నుంచి సాహిత్యం మీద ఇష్టం కలిగింది.
* రాయడం ఎప్పుడు మొదలుపెట్టారు?
తొమ్మిదో తరగతిలో మా బయాలజీ టీచర్ ఉదయ్‌కుమార్ నన్ను బాగా ప్రోత్సహించారు. అప్పుడే తొలిసారి కవితలు రాయడం మొదలుపెట్టాను. అలా మెల్లగా నాలోని భావాలు నాకు నచ్చినట్టు రాయడం అలవాటైంది. 2014లో ఆంధ్రా యూనివర్సిటీ వారు కవితల పోటీ పెడితే అందులో నేను రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. ఇప్పటికి 400 దాకా కవితలు రాశాను.
* కథల వైపు ఎలా వచ్చారు?
సాక్షి జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు కథా రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు మాకు క్లాస్ చెప్తూ అందర్నీ ఒక అంశంపై కథల రాయమన్నారు. నేను ‘కొత్తిమీర కట్టలు’ అనే కథ రాశాను. అది ఆయనకు నచ్చి తన కథా సంపుటి బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత 2018లో అదే కథను ‘మన శ్రుతి’ అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కి పంపితే వాళ్లు ప్రచురించారు. అది నా తొలి కథ. ఇప్పటికి 36 కథలు రాశాను. అందులో 12 ప్రచురితమయ్యాయి.
* మీకు నచ్చిన రచయితలు? రచనలు?
వ్యక్తిత్వ వికాస నిపుణుడు క్రాంతికార్ రాసిన ‘మనసే ఓ పూలతోట’ నేను తొలిసారి పూర్తిగా చదివిన పుస్తకం. జర్నలిజంలోకి వచ్చిన తర్వాతే పుస్తకాలు ఎక్కువ చదివాను. యద్దనపూడి సులోచనారాణి నవలలు, సినారె గజల్స్, చలం ఉత్తరాలు, పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు, సోమరాజు సుశీల కథలు, కా.రా మాస్టారి కథలు, అలిశెట్టి ప్రభాకర్ కవితలు.. ఇలా చాలా చదివాను. అవన్నీ చాలా నచ్చాయి.
* ఇంకా ఎలాంటి రచనలు చేయాలని ఉంది?
జర్నలిజం ట్రైనింగ్‌లో ఉండగా సెక్స్ వర్కర్స్ జీవితాలపై ఒక రిపోర్టు తయారు చేశాను. ఆ క్రమంలో వారి స్థితిగతుల్ని గమనించాను. అందులో ఒకమ్మాయి జీవితం నన్ను బాగా కదిలించింది. దాన్నే కథగా మలిచి ‘జీవితం ఇంకా మిగిలే ఉంది’ అని నవల రాస్తున్నాను. ఇప్పటికి 12 భాగాలు పూర్తయ్యాయి. అవన్నీ ఫేస్‌బుక్‌లో పెట్టాను. మొత్తం పూర్తయ్యాక పుస్తకంగా తేవాలని ఉంది.
*
నా కథ కి చోటిచ్చి నన్ను ప్రోత్సహించినందుకు సారంగ టీమ్ కి నా ధన్యవాదాలు.. వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..