ఫ్రీవర్స్ ఫ్రంట్ వల్ల కవిత్వానికి వేగం: శీలా వీర్రాజు

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు పొందిన 50 పుస్తకాల లిస్టు ఒకసారి పరిశీలించండి, మీకే అర్థమవుతుంది.  వీటిలో నలభై అయిదు పుస్తకాలు అవార్డుకు అన్ని విధాలా అర్హమైనవని  నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

2021 ఆగస్ట్ నాటికి భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య వేడుక జరుపుకుంటే, ఒక తెలుగు సాహితీ సంస్థ అంతే  దీటుగా తన 50 ఏళ్ల అవార్డును సగర్వంగా ప్రకటించి అందజేస్తుంది. అర్ధ శతాబ్దం ఒక అవార్డు ను నడపడం అంత తేలికైన విషయమేమి కాదు. రోజు రోజుకి పెరిగిపోతున్న కవుల మధ్యలో ఏడాదికొక అత్యుత్తమ కవితా సంపుటిని అంత రాశిలోనుంచి తీయడం కత్తి మీద సాము. వచన కవితలో తనదైన ముద్ర వేసిన కుందుర్తి గారితో కలిసి నడిచి ఆ అవార్డ్ భారాన్ని ఇంత వృద్దాప్యం లో కూడా భారం కాదని అనుకుని నడుపుతున్న తొలి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీత,ప్రముఖ కవి, కథకులు, నవలా కారులు, చిత్రకారులైన శీలా వీర్రాజు గారిని ఈ సభ సందర్భంగా చేసిన  ఇది.

ఇందులో నా ప్రశ్నలు , అభిప్రాయాలు తో పాటుగా కొంత మంది మిత్రుల అభిప్రాయాలున్నాయి. మేం ఎలా అడిగినా వీర్రాజు గారు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎప్పుడు కాల్ చేసినా సన్నని చిరునవ్వుతో పలకరించే సుభద్ర గారూ, ఈ అవార్డ్ పరంపరని కొనసాగిస్తున్న కుందుర్తి గారి కుటుంబ సభ్యులకు, అవార్డు పొందిన సిరికి స్వామి నాయుడు గారికి, ఇబ్రహీం నిర్గుణ్ గారికి  నా హృదయపూర్వక అభినందనలు.

50 ఏళ్ల ఫ్రీవర్స్ ఫ్రంట్  చరిత్రలో వచనకవిత్వ గుర్తింపును ఎలా స్వీకరించాలి….?

ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా పాపులర్ అయ్యింది.కవిత్వం అంటే ఫ్రీవర్స్ కవిత్వం గానే గుర్తింపబడుతుంది. ఈ ప్రక్రియను ఇప్పుడు ఒకరిద్దరు సీనియర్ కవులు” వచన పద్యం” అని అంటున్నారు. వచన కవిత్వాన్నే వర్తమాన కవితా ప్రక్రియగా సాహితీపరులే కాక సామాన్య కవిత పఠితలుగా కూడా భావిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గాని,రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇచ్చే కార్యక్రమంలో చాలా కాలం పద్య కవిత్వానికో, గేయ కవిత్వానికో  అవార్డులు వచ్చాయి. ఆ పద్ధతి మెల్లమెల్లగా తొలగిపోయి వచన కవితా సంపుటాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మొదలు పెట్టాయి. ఈ ప్రక్రియకి ఏటా అవార్డులు ఇచ్చే ప్రైవేటు సాహిత్య సంస్థలు కూడా పుంఖాను పుంఖాలుగా ఏర్పడ్డాయి.

అయితే ఇదంతా కుందుర్తి ఆంజనేయులు గారు ఏర్పాటుచేసిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వలన వచ్చిన పరిణామం అని నేను అనడం లేదు.నిజానికి ఈ అవార్డుకు ముందే హైదరాబాదులో నగ్నముని ,యాదవ రెడ్డి, అరిపిరాల విశ్వం, అడవికొలను మురళీధర్  మరి కొందరు యువకులు ఫ్రీవర్స్ ఫ్రంట్ పేర నెలకు ఒకసారి ఒకచోట సమావేశమై,  తమ తమ వచన కవితలను చదివి చర్చించడం చేస్తుండేవారు. అయితే ఉద్యోగ రీత్యా మురళీధర్ గారు ముంబై వెళ్లిపోవడం వల్ల ఆ సమావేశాలు ఆగిపోయాయి.

ఆ రోజుల్లో హైదరాబాదులో కవిసమ్మేళనాలలో పద్యం, గేయం మాత్రమే వినిపించాయి.  డాక్టర్ సి.నారాయణ రెడ్డి, దాశరథి  కూడా వచన కవిత్వం వైపు తొంగిచూడలేదు. అది గుర్తించిన కుందుర్తిగారికి యువ కవులను వచన కవిత్వం వైపు ఆకర్షించడానికి ఫ్రీవర్స్ ఫ్రంట్  అవార్డు  పేరున ప్రతీఏటా ఒక కొత్త వచన కవితా సంపుటికి బహుమతిని ఏర్పాటు చేశారు. దీనికి తోడు యువకవుల పుస్తకాలకు ముందు మాటలు రాయడం సభలో వచన కవిత్వం గురించి ఉపన్యాసం ఇవ్వడం తను కూడా ఆ ప్రక్రియలో విస్తృతంగా రచనలు చేయడం అంటే కృషి చేశారు.  దీనివల్ల వచన కవితా ప్రక్రియకు ప్రజలలో మంచి గుర్తింపు వచ్చింది.రాసేవాళ్ళు రోజురోజుకు పెరుగుతూ వచ్చారు కాలంతో వచ్చిన మార్పులకు తోడు కుందుర్తి గారు ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉద్యమ ప్రయత్నం. ఒక కెటలిస్టు గా పనిచేసి ఈ ప్రక్రియవిస్తరణను  మరింత వేగం చేసింది.

ఫ్రీవర్స్ ఫ్రంట్ గుర్తించిన 50 పుస్తకాల పైన వచ్చిన సమర్థింపు లు వ్యతిరేకతను గురించి చెప్పండి..?

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు పొందిన 50 పుస్తకాల లిస్టు ఒకసారి పరిశీలించండి, మీకే అర్థమవుతుంది.  వీటిలో నలభై అయిదు పుస్తకాలు అవార్డుకు అన్ని విధాలా అర్హమైనవని  నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఓ నాలుగైదు పుస్తకాల విషయంలో సందేహం ఉంటే ఉండవచ్చు దీనికి కారణాలు వేరే ప్రశ్నకు నా సమాధానంలో దొరుకుతుంది. ఏ అవార్డుకు అయినా నూటికి నూరుపాళ్ళు అంగీకారం ఉంటుందని నేననుకోను. కొందరికి నచ్చుతుంది మరి కొందరికి నచ్చకపోవచ్చు. అది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాల అభిరుచులు స్నేహాలు వంటి కారణాల మీద ఆధారపడి ఉంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం.

గడచిన పాతికేళ్ల లోనూ కవిత్వంలో వచ్చిన మార్పులు మీరు ఎలా విశ్లేషిస్తారు…? 

ఈపాతికేళ్లలోనూ కవిత్వ తీరుతెన్నులలోనూ, వస్తువులోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యక్తి వాదం నుంచి సమిష్టి వాదానికి కవిత్వం ప్రయాణించింది దళిత, బహుజన, స్త్రీవాద ఉద్యమం, రాజకీయ కవిత్వంలోకి అడుగు పెట్టాయి. మత ప్రాంతీయ భావజాలం కవిత్వంలో చోటుచేసుకున్నాయి ఇంకా అందులో కూడా విభజన జరిగి మరింత లోతుగా శాఖోప శాఖలుగా విస్తరించాయి. జండర్ విషయం లోకూడా శ్రామిక కులాల స్త్రీలు,సంపన్న వర్గాల స్త్రీలు  వారి వైరుధ్యంమొదలైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.ఏ వర్గానికి ఆ వర్గం వారు తమ తమ అస్తిత్వాన్ని గురించి కవిత్వీకరించడం ప్రారంభించారు. దీనివల్ల ఏకముఖంగా కాక  బహుముఖంగా విస్తరించింది ఇది తప్పక స్వాగతించాల్సిన సందర్భం.

కుందుర్తి గారు కథనాత్మక కవిత్వ స్పూర్తిని ఎంతగానో ఆశించారు ఆ దిశగా ఫ్రీవర్స్ ఫ్రంట్ పరిమిత శ్రమే  చేసింది అంటే మీరేమంటారు..? 

నిజమే ఆ దిశగా జరిగిన కృషి తక్కువే.  ఇక్కడ గమనించవలసింది అంతగా ఆదరణ లేని రోజుల్లో ఈ ప్రక్రియలో వెలువడిన సంపుటాలకు ఏటా బహుమతులు ఇవ్వడం ద్వారా కొత్త తరం యువ కవులను ఆకర్షించిం, వచన కవిత్వానికి ప్రాచుర్యం కలిగించడమే ఆయన ప్రధాన ఆశయం. ఆ కృషిలో భాగంగానే సాహిత్యం లోని ఇతర రంగాలకు కూడా విస్తరింప చేయాలని భావించారు. అది ఆయన రెండవ ప్రాధాన్యత.తాను  వచన కవితలో దీర్ఘ కావ్యం రాశారు ,సుదీర్ఘమైన ఖండికలు రాశారు ,నాటకం రాశారు.

కుందుర్తి గారు ఆశించినట్టు ఆనాటి కవులు పెద్దగా దాని జోలికి పోలేదు. ఒక్క చేతి వేళ్ళ మీద లెక్క పెట్టదగిన సంఖ్యలోనూ కొందరు ప్రయత్నించారు అది కూడా రెండు ,మూడు ఫ్రీవర్స్ కథలు రాసి ఆగిపోయారు. ఆ దిశగా నేను ప్రయత్నం చేయడం అందుకు కారణం ప్రయోగాలపై నాకున్న ఆసక్తి. అప్పటివరకు నేను కథలు నవలలు మాత్రమే రాస్తున్నారు కవిత్వం జోలికి పోలేదు నా కాలేజీ రోజుల్లోనే రెండు నవలలు సీరియల్ గా వచ్చాయి.రెండు కథల సంపుటాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా కథలు నవలలే రాస్తున్నాను.కాకతాళీయంగా నేను చేసిన ప్రయత్నం కుందుర్తి ఆశించిన కథనాత్మక కవిత్వానికి మార్గం వేసింది . చిత్రకళలో నాకున్న కొద్దిపాటి అనుభవంతో అందులోని ఎక్స్ప్రెషనిజం, ఇంప్రెషనిజం, సర్రియలిజం, నియోరియాలిజం ఇలా ఒకే కథ ఇతివృత్తంని వివిధ ఇజాల ధోరణిలో రాయాలని ముందుగా వచన కవితా పద్ధతిలో రాయడం. అది మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నా కుందుర్తి  దృష్టిలో పడడం ఆయన అమితానందంతో నా భుజం చరచడంతో నేను ఆ  వైపు దృష్టి సారించడానికి కారణమైంది. క్రమక్రమంగా కథలు నవలలు రాయడం తగ్గిపోయి కవిత్వం వైపు ప్రయాణించాను వచన కవితలో ,మరి కొన్ని కథలతో పాటు ఒక దీర్ఘకావ్యం, నా ఆత్మ కథ ,ఒక నవల వెలువడ్డాయి కథలు నవలలు రాయడంలో నాకు కొంత అనుభవం వల్ల ఈ ప్రయత్నాలు చేయగలిగాను. కుందుర్తి ఆశించినట్టు అప్పటికి ఎవరు ఈ ప్రయత్నం చేయక పోవడానికి ముఖ్యమైన కారణం ఒకటుంది. అప్పటికే అరసం  నీరసించి పోవడం అభ్యుదయ భావాలు గల యువకులు కొందరు దిగంబర కవిత్వం పేరున మూడు పుస్తకాలు వెలువరించడం డెబ్భైల తొలి  రోజుల్లో విరసం ఏర్పడటంతో కవిత్వ లక్షమూ, ధోరణి పూర్తిగా మారిపోయింది. దాంతో దిగంబర కవులు ఇద్దరు మినహా మిగిలిన నలుగురు కవులతో సహా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విరసం ప్రభావం లోకి రావడంతో వస్తువు పైన ప్రధాన దృష్టి ఏర్పడి, శైలి-శిల్పం వర్ణనల వంటి ఇతర విషయాలు విస్మరించడంతో కుందుర్తి ఆశించిన కవిత్వ కథా పద్ధతి వెనకబడిపోయింది.

 ఈ అవార్డుకు ఎంపిక ప్రక్రియలో మొదటి నుండి వచ్చిన మార్పులు చెప్పండి…?

తొలి ఐదు అవార్డులు ఎంపిక పూర్తిగా కుందుర్తి స్వీయ నిర్ణయమే .ఆతర్వాతే రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్ కవులు విమర్శకులు చేసేవారు .ఆ ముందున్న మూడేళ్ళ కాల వ్యవధిలో వచ్చిన సంపుటాలు ఆ ముగ్గురికి విడివిడిగా పంపి వాటిలో మూడు పేర్లను ప్రాధాన్యత క్రమంలో తెలుపమని ఇవి కాక ఆ మూడేళ్లలో వచ్చినవి వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోమనే వారు.అలా వచ్చిన తొమ్మిది పేర్లలో  మొదటిదానికి మూడు, రెండవ దానికి రెండు, మూడవా దానికి మూడు మార్కులు వేసి, ఎక్కువ పుస్తకానికి వస్తుందో దానికి బహుమతిని ప్రకటించేవారు. తొలి నాళ్ళలో ఏడాదికో మూడో నాలుగో పుస్తకాలు వచ్చేవి కనుక ఈ అవార్డు విషయంలో ఏ ఇబ్బందీ కలగలేదు రానురాను పుస్తకాల సంఖ్య పెరుగుతూ రావడంతో ముగ్గురు న్యాయనిర్ణేతల సూచనలలో తొమ్మిది పుస్తకాలు విడివిడిగా ఉండేవి. అప్పుడు ఆ ముగ్గురు మొదటి ప్రాధాన్యతగా చెప్పిన పుస్తకాలను, మూడు పుస్తకాల పేర్లను తిరిగి వారికే పంపించి వాటిలో ప్రాధాన్యత క్రమంలో చెప్పనేవారు .ఆ ప్రక్రియలో ఎక్కువ మార్కులు పొందిన పుస్తకం కవికి అవార్డు ఇచ్చేవారు . ఈ విధానం ఇంచుమించు చివరికంటా కొనసాగింది ప్రారంభం 116 రూపాయలను ఆ కవికి మని ఆర్డర్ ద్వారా పంపించి, ఆ అవార్డు వార్తను పత్రికలకు విడుదల చేస్తూ ఉండేవారు అయితే దేవిప్రియకి అవార్డు వచ్చినప్పుడు అలా మనీ ఆర్డర్ ద్వారా కాక సభాముఖంగా ఇస్తే బాగుంటుందని ఆయన సూచన చేయడంతో అదే పద్ధతి 48 వ అవార్డు వరకు కొనసాగుతూ వచ్చింది దేవిప్రియ నాటికి అవార్డు 500 రూపాయలు అయింది. 1982 లో కుందుర్తి మరణానంతరం వారి కుమారుడు సత్య మూర్తి గారు నా సహాయంతో కొనసాగించారు .అప్పట్లోనే ఒక మెమెంటో ని కూడా ప్రత్యేకంగా రూపొందించడం. పాత వారితో సహా బహుమతి మొత్తాన్ని క్రమంగా ఐదు వందల ఎనిమిది రూపాయలు,1116 రూపాయలు, 2500 రూపాయలు 5,000 రూపాయలు నుంచి 10వేల రూపాయల వరకు పెంచడం జరిగింది సత్య మూర్తి గారు కూడా చనిపోవడంతో వారి సతీమణి శ్రీమతి శాంత గారు ఈ బాధ్యతను నాకు అప్పగించారు 1971 ,72, 78 సంవత్సరాలు బహుమతులు ఇవ్వలేదు. అటు తర్వాత ఇప్పటివరకు ఏ ఆటంకం లేకుండా బహుమతి ప్రధానం జరుగుతూ వస్తోంది ఈ బహుమతి మొత్తాన్ని సభ నిర్వహణ ఖర్చు తో సహా కుందుర్తి కుటుంబసభ్యులే ఈనాటి వరకు సొంత వనరులతో సమకూరుస్తూ వస్తున్నారు

ఈ అవార్డు కొనసాగింపుపై ఉన్న సందిగ్ధత తొలగిస్తారా…?

ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఇంతటితో ఆపేయాలని నిర్ణయించాము. సత్యమూర్తి గారికి ఇద్దరు ఆడపిల్లలు. వారికి పెళ్లిళ్లు అయిపోయి ఎవరి సంసారంలో వాళ్ళు స్థిర పడడంతో,  సత్యమూర్తి గారి మరణానంతరం శాంత గారు ఉద్యోగ విరమణ కావించడం, తాను ఒక్కర్తే ఇంట్లో ఉండటం ఇబ్బంది అయి రెండు సంవత్సరాల క్రితం బ్రహ్మకుమారి ఆశ్రమంలో చేరి సేవా కార్యక్రమాలలో స్వస్థత పొందడం. నేను కూడా అనారోగ్య కారణాలతో గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమై పోవడంతో ఈ అవార్డును ఇంతటితో ఆపేయాలని నిర్ణయించాం.

( సభలో మాట్లాడిన వక్తలు శివారెడ్డి గారు, నందిని సిద్దారెడ్డి , మేడిపల్లి రవికుమార్ వంటి కవులు యువరక్తాన్ని నింపి ఈ పనిని కొనసాగిద్దాం అని ఒక భరోసా నివ్వడంతో. ఇప్పట్లో ఆపేయాలనే నిర్ణయం వాయిదా పడిందని చెప్పుకోవచ్చు.. డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంటారు. ఆర్ధికంగా సాయం అందించడానికి మేం సిద్ధం అని కుందుర్తి కుటుంబం ప్రకటించింది.)

ఫలానా వాళ్లకి ఈ అవార్డు రాకపోయినా అని దిగులు పడే వాళ్లకు మీరు ఇచ్చే సమాధానం….?

ఎవరు అవార్డులు ఇస్తున్నా ప్రతిభావంతులు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కనుక రాసేవాళ్ళు అనేకమంది ఉన్నప్పుడు ఏడాదికి ఒకరికే అది లభిస్తుంది. అంతమాత్రం చేత వారిని అలక్ష్యం చేస్తున్నట్లు కాదు. వారి ప్రతిభను కించపరిచినట్టు అంతకంటే కాదు. మూడేళ్ళ కాల వ్యవధి మాత్రమే అంతకుముందు వచ్చినవి పరిశీలనలోకి రావు .ఆ కారణం వల్ల కూడా కొంత మంది ప్రతిభావంతులు అవార్డు మిస్ అవుతున్నారు .పైగా మూడేళ్ల వ్యవధిలో వచ్చిన వాటిలో అత్యుత్తమమైన దానికి అవార్డు వచ్చిందని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఒక మంచి పుస్తకానికి మాత్రమే ఇస్తూన్నాం అంటున్నాం . అవార్డు రాకపోయినంతమాత్రం చేత ఎవరూ నిరుత్సాహ పడాల్సిన పనిలేదు మన శక్తిమేరకు రాస్తూ పోవాల్సిందే రచన ప్రతిభావంతమైనది  అయితే పదికాలాలపాటు నిలుస్తుంది.

*

అనిల్ డ్యాని

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు