ఫారిన్ రిటర్నడ్

  “ఏమి కుచేలక్కా, నీ కొడుకు బాగున్నాడా?” అని అడిగింది సావిత్రక్క.

“బాలేక ఏమి సావిత్రీ … టెంకాయ చెట్టు మాదిరి పొడుగ్గా పెరిగినాడు. ‘నీళ్ళు’ పోయలేక చస్తా ఉండా!” అని ముక్కు చీదింది కుచేలక్క.

“అంత నిష్టూరం ఎందుకక్కా. బిడ్డలుంటే బాధలకు కరువా… అయినా ఏమయ్యిందక్కా?”

“బడి ఎగ్గొట్టి మార్నింగ్ షో, మ్యాట్నీలకు పోతా  ఉంటే యాక్టరో డైరెక్టరో అవుతాడనుకున్నా… ధియేటర్ లలో గేటుమ్యాను ఉద్యోగం కూడా సంపాదించలేక పోయినాడు. మీసాలొచ్చిన మగపిల్లోడిని కూర్చోబెట్టి సాకతా ఉండాను”.

ఊర్లోని తూర్పు  వీధిలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ.

ఇంతలో ఫినెక్స్ రెడ్ మారుతి 800 కారు డుర్రుడుర్రుమని వాళ్ళని దాటుకుని వెళ్ళింది.

దారిన ఉండే ఎర్ర మట్టి లేచి వాళ్ళ ముఖాల మీద పడబోయింది. చీరకొంగులను అడ్డంగా పెట్టుకున్నారు.

దుమ్ము తగ్గినాక తల ఎత్తి చూసింది సావిత్రక్క.

తోడ పుట్టినోడు కనకదాసు చేయి విసురుతూ వెళ్ళినాడు.

బంగారంలాంటి అన్న దొరికినాడని  మురిసిన సావిత్రక్క చేయి చాపకుండానే ప్రసాదం దొరికినంత సంతోషపడింది సావిత్రక్క.

xxxxxx

ఊరూరా తిరిగి బొరుగులు అమ్మే దిండిగల్ దొరస్వామి పరిగెత్తుతూ వచ్చి “స్టాప్ స్టాప్” అని అరుస్తూ కారుకు అడ్డం పడినాడు.

“ఇంట్లో చెప్పి వచ్చినావా లేదా దొరస్వామీ?” అంటూ సడన్ బ్రేకులేసినాడు కనకదాసు.

“అన్నా… మన పంచాయితీలో విమానం ఎక్కినోడు ఒక్కడు కూడా లేడు. అట్టాంటిది నదులు, సముద్రాలు దాటి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళినావు.  కువైట్ లో కొలువు చేసినావు.  అదృష్టమంటే నీదే కదా. చాన్నాళ్ళుగా నిన్ను చూడాలని… వ్యాపారం పనులవల్ల కుదరలేదు. లేకలేక దొరికినావు. నిన్ను విడిచి పెడతానా…” అంటూ కనకదాసును గుచ్చిగుచ్చి చూసినాడు. అభిమానంగా  ఒళ్ళంతా తడిమినాడు. చొక్కా మీద ముక్కు పెట్టి కువైట్ సెంటు వాసన ‘జ్యాంజ్యాం’ అని పీల్చినాడు. ‘సూపర్’ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చినాడు.

“ నాకేందుకబ్బా షేక్ హ్యాండ్?  గొప్ప పని ఏమి చేసినానని?” అని అడిగినాడు కనకదాసు.

“ఎంతైనా ఫారిన్ రిటర్న్ డ్ కదా నువ్వు. అందులోనూ కారున్న మైనరువి. మేము … విదేశాల్ని మ్యాపులలో చూసినాము కానీ, నిజంగా చూడలేదు కదా. ఈ జన్మకి మాకా చ్యాన్సు వస్తుందో రాదో కానీ, కనీసం పాస్ పోర్ట్ చూసే భాగ్యం కల్పించు!” అని ప్రాధేయపడినాడు దొరస్వామి.

పొట్టిమీసాలను చిన్న  దువ్వెనతో దువ్వుకుంటూ కనకదాసు కారులోని పాస్ పోర్ట్ ని బయటికి తీసినాడు.

ఒక్కొక్క పేజీని తడిమి చూసినాడు దొరస్వామి. దానికున్న గుండుసూది బొక్కలను కళ్ళు మూసుకుని తడిమినాడు. “అబ్బ… అబ్బ… ఒళ్ళు పులకిస్తా ఉంది!” అని తియ్యటి గుటకలు మింగినాడు.

పంచె పైకి ఎగగట్టిన దొరస్వామి “ఊర్లో సేద్యం చేసుకోకుండా కువైటుకి ఎందుకు పోవాలనిపించింది నీకు?” అని అడిగినాడు.

హీరో లెక్కన ఫుల్ షర్ట్ చేతి గుండీలు తిప్పుతూ “ముప్ఫై ఏండ్ల ముందు రేణిగుంటలో విమానాశ్రయం కడతా ఉన్నారు. దాన్ని చూపించమని నేను ఒకటే గొడవ చేసేవాన్ని. నా బాధ  తట్టుకోలేక మా నాయన సైకిల్ లో ఎక్కించుకుని తీసుకెళ్ళినాడు. విమానాలు దిగే స్థలమూ, జనాలు ఎక్కే చోటూ చూపినాడు. మన ఊరికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న దాన్ని చూసి నేను అక్కడే డ్యాన్సు చేసినాను”.

“ఉత్తిగా విమానాశ్రయం చూసేది కాదు, ఎప్పుడో ఒకరోజు విమానం ఎక్కేంతగా నువ్వు ఎదగాలని చెప్పినాడు మా నాయన. అందుకే ఊర్లో సేద్యం వదిలిపెట్టి వెళ్ళినాను”.

“మరెందుకు ఆరు నెలలకే వచ్చేసినావు?” అని అడిగినాడు దొరస్వామి

“వెళ్ళడమైతే వెళ్లాను, మనసంతా ఇక్కడే.  నాకు అర్థమయ్యింది ఏమిటంటే… ‘ఊరే నా ఊపిరి’ అని.

అందుకే ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చేసినాను” అన్నాడు.

“కనకదాసన్నా … కూర్చుని కాఫీ తాగుదామా”అని పిలిచినాడు దొరస్వామి.

“లేదులేదు… తిరుపతి-తిరుచానూరు మధ్యలో ఉన్న గణపతి ఎస్టేట్సుకి వెళ్ళాలి. అప్పుడప్పుడూ వెళ్ళి చూసుకోకపోతే భూబకాసురుల కండ్లల్లో పడి అసలుకే మోసం వస్తుంది”

“ఎంత ఎదిగినావు కనకదాసన్నా…” అంటూ పై గుడ్డతో కారు మీది దుమ్ము దులిపినాడు దొరస్వామి.

కారెక్కి తుర్రుమన్నాడు కనకదాసు.

xxxxxx

కండ్లారా తోడపుట్టిన కనకదాసు వైభవాన్ని  చూసిన సావిత్రక్క ‘నా అన్న ఇంత ఎదిగినాడంటే… ఈరోజుకు నాకు తిండీ తీర్థం అక్కరలేదు. కడుపు నిండిపోయింది’ అనుకుంది.

“నీ అన్న  కనకదాసు మాదిరి నీ కొడుకు కేసరి ని కువైట్ కి పంపించకూడదా అక్కా… ‘లెక్కంటే లెక్క’ కాదంట. గోతాలకు తెచ్చుకోవచ్చునంట” అని చెప్పింది కుచేలక్క.

“మా దగ్గర ఎర్ర బస్సు ఎక్కేదానికే డబ్బుల్లేవు. ఆకాశంలో ఎగిరేదానికి ఎక్కడ కుదురుతుంది?”

”వెళ్ళి నీ అన్నని అడుగు. మేనల్లుడి కోసం కిందామీదా పడి ఎట్లనో ఒకట్ల విమానం ఎక్కిస్తాడులే. ఏదో ఒక షావుకారు  సేట్ దగ్గర పనికి పెడతాడులే. మల్ల నీ ఒళ్ళంతా బంగారమే సావిత్రీ…” అని చెప్పి పొగాకు చెక్కలు నముల్తూ వెళ్ళబోయింది కుచేలక్క.

‘నిజమే కదా, పనీపాటా లేకుండా తిరగతా ఉండాడు నా కొడుకు కేసరి. అన్నతో చెప్పి కువైట్ పంపిద్దాము. మంచి సలహా ఇచ్చింది కుచేలక్క’ అనుకుంది.

మంచి సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇంటి ముందర పెంచుతూ ఉన్న దోస తోటలో నుంచి రెండు దోసకాయలు కోసి ఇచ్చింది.

“కువైటులో ఆరు నెలలున్నా… కారు కొన్నాడు, స్థలాలు కొన్నాడు. అట్టాంటిది మేనల్లుడికి దారి చూపివ్వడం ఒక లెక్కా? నువ్వు అడగాల్నే గానీ బంగారంగా చేయడా” అని కూడా చెప్పిన కుచేలక్క దోసకాయల్ని గబుక్కున చేతిలోకి తీసుకుంది.

అవి ఎవ్వరి కంటా  పడకూడదని  దోసకాయల పైన చీరకొంగు కప్ప్పుకుని సరసరా అక్కడినుంచి వెళ్ళిపోయింది కుచేలక్క.

‘దోస తీగ చిన్నది, దోసకాయ పెద్దది కదా… దోస తీగ అంత ప్రయత్నం చేద్దాం. వస్తే పెద్ద దోసకాయ వస్తుంది కదా’ అని అనుకుంది సావిత్రక్క.

ఆ రోజంతా కొడుకు కువైట్ విమానం ఎక్కినట్లు… ఊర్లో వాళ్ళంతా టాటాలు చెప్పినట్లు వచ్చిన ఆలోచనలు సినిమా రీళ్ల మాదిరి గిర్రుగిర్రున  తిరిగాయి.

xxxxxx

సాయంత్రమయ్యింది.

ఇంట్లో దీపం వెలిగించి ఊర్లోనే పడమటి వీధిలో ఉంటున్న అన్న కనకదాసు ఇంటికి వెళ్ళింది సావిత్రక్క.

వాకిట్లో కనకదాసు భార్య  సెంటు మల్లెలతో మాల కడుతోంది. పెరట్లో వేప చెట్టుకి చేంతాడుతో చేసిన ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాడు కనకదాసు . అతడి ఒడిలో చిన్న రేడియో  ఉంది. అందులో నుంచి వస్తున్న తెలుగు వార్తలను కళ్ళు మూసుకుని  వింటూ ఉన్నాడు.

ఎవరో వచ్చిన అలికిడి అయ్యేసరికి తెలుగు వార్తలను ఇంగ్లీషు వార్తల స్టేషన్ కి మార్చినాడు.

వచ్చింది చెల్లెలని తెలుసుకుని రేడియో కట్టేసినాడు.

నేరుగా వచ్చి అన్న ముందర నిలబడింది.

“రా సావిత్రీ ఎట్లా ఉండాడు కేసరిగాడు?” అని అడిగినాడు.

“వాడి విషయమే మాట్లాడదామని వచ్చినాను కనకా!” అని బదులిచ్చింది.

ఇంతలో కనకదాసు భార్య ఇంట్లోని స్టూలు తెచ్చి కూర్చోమని చెప్పింది.

“కనకా… నీకు తెలియనిదేముంది? నాకుండేది ఒక్క నలుసు. వాడిని నీమాదిరిగా కువైట్ కి పంపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడే ఉంటే రవిక గుడ్డల వ్యాపారం మాదిరి ఎప్పటికి ఎగబడి వచ్చేది? అక్కడైతే పట్టు  చీరల వ్యాపారం మాదిరి నాలుగు అణాలు వెనకేసుకోవచ్చు” అని చెప్పింది.

“డబ్బు కోసమైతే అంతదూరం ఎందుకక్కా? తిరుపతి కొండపైన టోపీలు అమ్ముకున్నా బతికిపోవచ్చు కదా!”

“అంతమాట  అంటావేమి కనకా… నా కొడుకు ఫారిన్ పొయ్యేది నీకు ఇష్టం లేకపోతే చెప్పు!” అని దిగ్గున లేచింది.

“కూర్చో సావిత్రీ… “ అని భంగపడినాడు.

మూతి మూడు వంకర్లు తిప్పుతూ ‘మేము ఎగబడి వచ్చేది నీకు ఇష్టం లేదు. అందుకే కువైట్ కి వెళ్లొద్దంటున్నావు. మేమంటే ఊర్లో వాళ్ళకే కుళ్ళు అనుకుంటా ఉన్నాను. మనోళ్ళకి కూడా  కుళ్లేనని ఇప్పుడు అర్థమయ్యింది” అని నిష్టూరపడింది.

“ఒక్క నిమిషం కూర్చో సావిత్రీ… ఎవ్వరికీ చెప్పవని నమ్మి నీకు కొన్ని విషయాలు చెబుతాను” అని బలవంతంగా కూర్చోబెట్టి ఇలా చెప్పినాడు.

“నేను కూడా… ‘కోడిగుడ్డంత బంగారమైనా తేక పోతానా’ అని ఆశపడి విమానం ఎక్కినాను. ఇంటిపని, వంట పని చేయడానికి ఒక సేట్ ఇంట్లో చేరినాను.

వాడు వారానికి వంద కోడి గుడ్లు ఉడకబెట్టుకుని తింటాడు. ఒక్కరోజు కూడా బొప్పికున్న తెలుపు కూడా నాకు పెట్టలేదు. నోరు కట్టుకోలేని నాకు గుడ్డు పై మనసు పడింది.

సేట్ కు తెలియకుండా ‘ఒక్క గుడ్డు తింటే ఏమవుతుందిలే… ఎట్లా తెలుసుకుంటాడులే…’ అని ఒక కోడిగుడ్డు ఉడక బెట్టుకుని తిన్నాను. తృప్తిగా  తిని పడకవేసినాను.

రాత్రి పన్నెండు గంటలప్పుడు   వీపు మీద గుద్దుల వర్షం కురిసింది. లేచి చూస్తే మా సేట్. అరబిక్ భాషలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు.

“ఎందుకు తిడుతున్నావు… ఎందుకు కొడుతున్నావు?” అని తెలుగులో ఎదురు తిరిగినాను.

‘అడిగినోడు నక్సలైటు, అడగనోడు ఆల్ రైటు’ అనుకున్నాడేమో ఎగిరెగిరి కొట్టినాడు.

ఏమి చేసినానని కొడుతున్నావని ప్రజల పక్షపాతి ఆర్.నారాయణ మూర్తిలా ప్రశ్నించినాను. సరసరా హాల్లోకి తోసుకెల్లినాడు.

“గుడ్డు తిన్నావు కదా?” అని కళ్ళు ఎర్ర చేసి అడిగినాడు.

తినలేదని మొండికేసినాను.

సీసీ కెమరాలో నేను కోడి గుడ్డు ఉడకబెట్టుకుని తినేది ‘జూమ్’ చేసి చూపించినాడు.

“నా గుడ్డులే గుటగుటా  మింగతా ఉండావు, రేపు నా సొత్తంతా చప్పరించి పారేయవని  గ్యారంటీ ఏమిటి?”అని అర్థంకాని అరబిక్ భాషలో దుమ్ము దులిపినాడు.

‘సేట్ కొట్టిన కొట్టుడుకి కడుపులోని కోడిగుడ్డు బయటికి వచ్చేస్తుందేమో’నని భయమేసింది. నా బాధని ఎవరికైనా చెప్పదామంటే నా భాష  ఎవ్వరికీ అర్థం కాదు. అర్థమయ్యే మన తెలుగువాళ్ళు దగ్గరిలో లేరు.

‘నేరం నాదికాదు, ఆకలిది!” అని ఎడారిలో నిలబడి గట్టిగట్టిగా అరుద్దామనిపించింది. కాళ్ళూచేతులూ కట్టేసి ఉండటం వల్ల కదలడానికి కుదరలేదు.

పోలీసులకు పట్టించి కేసు పెడతాడేమోనని భయపడినాను. జైల్లో వేసి చిప్పకూడు పెడతారేమోనని వణికినాను.

అట్టాంటిదేమీ చేయలేదు. మూడురోజులు పస్తులు పెట్టినాడు.

నాలుగోరోజు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి పాస్ పోర్టు  తీసుకుని తిరిగి చూడకుండా వచ్చేసినాను. నేను పడిన బాధలు నా మేనల్లుడు పడకూడదనే నీకు ఇవన్నీ  చెబుతున్నాను” అని వివరించినాడు.

“ఆరు నెలలు అక్కడ ఉన్నవాడివి, ఉత్త చేతులతో వచ్చి ఉంటావా? అంతోఇంతో సొత్తు మూట కట్టుకుని వచ్చి ఉంటావు కదా… లేకుంటే కారు కొనేంత డబ్బులు నీకు ఎక్కడివి?” అని నిలదీసింది.

“కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. ఊర్లోకి దిగిందే అందరూ నన్ను సినిమా యాక్టర్ ని చూసినట్లు చూసినారు. ‘ఫారిన్ రిటర్న్ డ్’  అని  పొగిడినారు. పొగడ్తలకి పొంగినాను. వారి ఆశల్ని అడియాసలు చేయలేక బ్యాంకులో ‘నేల కాగితాలు’ కుదువబెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొన్నాను.

అంతేకాకుండా… కారులో షికారు వెళ్తుంటే, నా కూతురికి డబ్బున్న సంబంధాలు దండిగా వస్తాయని ఆలోచించినాను.

ఆరునెలలకే ఇండియా ఎందుకు వచ్చేసినావని అడిగితే ఊరే ఊపిరని గొప్పలు పోయినాను”.

కనకదాసు భార్య తెచ్చి ఇచ్చిన సెంటు మల్లెలు తలలో తురుముకుంటూ సావిత్రక్క-

“మరి తిరుపతి దగ్గర, ఎస్టేట్స్ ఎక్కడినుంచి వచ్చినాయి నీకు?” అని ఎగిరెగిరి అడిగింది.

పడీపడీ  నవ్వుతూ కనకదాసు ‘అయ్యో సావిత్రీ… నేను కొన్నది గణపతి ఎస్టేట్స్ కాదు, రియల్ ఎస్టేట్ వారు వేసిన ‘గణపతి ఎస్టేట్స్’ అనే   లే అవుట్ లో ముప్ఫై అంకణాల ప్లాట్. నేను గొప్పకోసం ఎస్టేట్స్ కి పోతా వుండానని చెప్తాను. అంతే కానీ… నాకంత అంత డబ్బు ఎక్కడిది. ఆ స్థలం కూడా కువైట్ కి పోక ముందు కూతురి పెండ్లికి పనికివస్తుందని కొన్నది” అని చెప్పినాడు.

“మరి నాకొడుకు కథ ఎట్లా?” అని అడిగింది సావిత్రక్క.

“బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ట్రాక్టర్ లోన్ ఇప్పిస్తాను. ఇక్కడే ఉండి నాలుగణాలు సంపాదించుకోమను. పొట్టకూటికోసం దేశం వదలాల్సిన పనిలేదు” అని చెప్పినాడు.

‘చెట్టు నీడ లాంటోడు మేనమామ అని పెద్దోళ్ళు ఊరకే చెప్పలేదు’ అని మనసులో అనుకుంది.

వెళ్ళి వస్తానని బయలుదేరుతూ ఉంటే మారుతీ కారు మిలమిలా మెరుస్తూ పలకరించింది. అభిమానంగా కారును చేత్తో తాకి కారు అద్దాల్లో నుంచి లోపలికి   చూసింది.

స్టీరింగ్ దగ్గర  నేవీ బ్లూ కలర్ పాస్ పోర్ట్ నవ్వుతూ కనిపించింది.

*

ఆర్. సి. కృష్ణ స్వామి రాజు

పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా పుత్తూరు శల్య వైద్య కేంద్రమైన రాసపల్లి. పొట్ట కూటి కోసం తిరుపతిలో నివాసం. ముప్ఫై ఏళ్ల ముందు మూడేళ్ళ పాటు ఈనాడులో విలేఖరి ఉద్యోగం. గత ముప్ఫై ఏళ్లుగా ఎల్ ఐ సి లో డెవలప్ మెంట్ ఆఫీసర్ కొలువు. మూడు వందల పై చిలుకు చిన్నా పెద్దా కథలు ప్రముఖ పత్రికలలో తొంగి చూశాయి.
ఇప్పటి దాకా వెలుగులోకి వచ్చిన పుస్తకాలు ముగ్గురాళ్ళ మిట్ట, సల్లో సల్ల కథా సంపుటిలు. చిత్తూరు జిల్లా మాండలికంలో రాసిన ముగ్గురాళ్ళ మిట్టకు మక్కెన రామసుబ్బయ్య పురస్కారం, సల్లో సల్లకు శివేగారి దేవమ్మ పురస్కారం లభించాయి.ఇవి కాక ప్రస్తుతానికి రాజు గారి కథలు[ముప్పై బాలల బొమ్మల కథలు], పకోడి పొట్లం[అరవై కార్డు కథలు] పుస్తకాలుగా వచ్చి ఉన్నాయి.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దూరపు కొండలు నునుపు అన్నట్లు ఫారెన్ లో ఏదో సంపాదిస్తామని పోతారు. చివరకు అక్కడ మనఃశాంతి లేని గొడ్డు చాకిరే. ఉన్న ఊర్లో, ఇంట్లో కూర్చుని పచ్చడి మెతుకులు తినడం మేలు. ఫారెన్ రిటర్న్డ్ భలే కథ. కృష్ణ స్వామి రాజు గారికి అభినందనలు.

  • కృష్ణ స్వామి కథను భాగా అర్థపూర్వకముగా తీసుకొని వచ్చినారు ఈ రోజుల్లో అవకాశాలు ఎక్కువగా మన స్వంత గడ్డపైనే ఉన్నాయి , ఎక్కడో పోయి అందరినీ వీడిచి కష్టపడి సంపాదించడం లో సంతోషం తృప్తి , ప్రేమ ఆప్యాయత అన్ని కరువే అక్కడ, మన పైన మనకు నమ్మకం , కష్టపడితే ఇక డబ్బులే మరి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు