ఫాక్షనిజం కన్నా ప్రమాదం!

చాలా చిన్నప్పుడే – ప్రతివిషయం లో బాధా తప్తహృదయాల కోసరం పోరాడే చాలా మంది – వాళ్ళ పర్సనల్ జీవితాల్లో – వాళ్ళకు బాధో అసూయో దుఃఖమో కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు – ” ఎంత గా పరిధి కుంచించుకు ఆలోచిస్తారా ..” అనిపించేది. అలా చాలా గొప్పవాళ్ళలో ‘ చిన్నతనం ‘ చాలా చూశాను నేను.

‘పాజిటివ్ థింకింగ్ ‘ – అనే ఆలోచనా సరళిని రకరకాలుగా ఉపయోగించుకుంటారు. కొందరు constructive thinking  , personality development కు ఉపయోగించుకుంటారు. కానీ చాలామంది – సమస్య నుంచి , బాధ్యత నుంచి, బంధాల నుంచి, భయం నుంచి , గిల్ట్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈ భావజాలాన్ని ఉపయోగించుకుంటారు. అది మంచితనం కింద చలామణి అయిపోయి…రాయేదో రత్నమేదో తెలియని ఒక పరిస్థితిని మనిషి కల్పించుకోగలడు.

అలా – ” మనకెందుకు బాబూ ! అయినా రచ్చ చేయడం వల్ల లాభం ఏమిటి ? ” అని నా భయాన్ని, పలాయన తత్వాన్ని ఆసరాగా చేసుకుని , ‘ మంచి అమ్మాయి ‘ ని  అనిపించుకోవాలన్న చాపల్యం ఉండే ఒక పరిస్థితిలో ఉండేదాన్ని ఒకప్పుడు.

ఎవరైనా గగ్గోలు చేసి పంచాయితీలు పెట్టి రగడలు చేస్తుంటే ‘ అనాగరికం ‘ అనేసే తెలిసీ తెలియని అజ్ఞానపు విజ్ఞానం చాలా ఉండే వయసు ఒకటి ఉంటుంది .

” మనం తప్పులుపట్టి రచ్చ కీడ్చేవాళ్ళలో కొన్ని మంచిగుణాలు ఉండచ్చు కదా ” – ఇది సరిపెట్టుకోవడంతో తప్పించుకోవడం.

కానీ అది అంత తొందరగా తేలిపోయే  పరిష్కారం దొరికే సమస్య కాదు.

ఒక code of conduct ముసుగులో , పబ్లిక్ గా పెద్దమనుషులు, ఉదారులుగా కనబడే వీరి లో అణిగిఉన్న గుణప్రకోపాలు బలహీనుల ఎదురుగా బయట పడతాయి. బాధపెట్టి భయపెడతాయి . ఈ  impact – దీని ముద్ర ఎదుటి మనిషి సైక్ మీద వాత పెడుతుంది. చుట్టూ ఉండే ప్రపంచపు లయ తప్పిస్తుంది …ఇది అసాధారణమైన, అసహ్యకరమైన పరిణామం….వీటి వల్ల కొన్ని జనరేషన్స్ భయపడతాయి. న్యూనతా భావం తో బాధ తో నిర్వీర్యమైపోతాయి .

ఫాక్షనిస్టుల కన్నా భయంకరమైన మానవతా రాహిత్యం వీరిలో కనబడుతుంది.

అది గమనించగల శక్తి ఉన్నవాళ్ళు, అర్థం అయినవాళ్ళు – విరుచుకుపడతారు. అరిచి ఆగం పెడతారు. వారి ఆలోచనల కొరడాలకు అంత శక్తి, విలువ, మెరుపు ఎందుకు ఉంటుందో సామాన్యులకు అర్థం కాదు. అదిరిపోతారు, ఆశ్చర్యపోతారు, పారిపోతారు.

‘ ప్రవక్త ‘ ను చూసినట్లు రెబెల్ ను చూడలేరు. మంది ఆలోచనలలో అపశృతి, దాని పరిణామం ఇద్దరికీ తెలుస్తుంది. మామూలు మనిషికి అర్థం కానిదేమిటంటే ఎవరు ఎందుకు,  ఎక్కడ ఎలా స్తిమితపడతారో అన్నది.

దీనంతటి వెనకాల ఊహ కు అందని నెట్ వర్క్ పనిచేస్తుంది. ..ఈ నెట్ వర్క్ లో అన్ని బిందువుల కనెక్షన్ అర్థమైన వ్యక్తులు – ప్రవచించరు , గోల పెట్టరు.

వాళ్ళ మౌనానికి చాలా శక్తి ఉంటుంది. నిర్వచించలేని అర్థం ఉంటుంది. నిశ్శబ్దపు నీడల్లో కలిసి ఉంటారు వీరు. ఆ నిశ్శబ్దానికి జీవితాల్లో చాలా మార్పు తేగల శక్తి ఉంటుంది. ఇదంతా ఒక హార్మొనీ లో జరుగుతుంది.

వాళ్ళతో కనెక్టివిటీ …ప్రశాంతత ద్వారానే జరుగుతుంది. ఇవన్నీ అర్థమవడానికి అక్షరాల బాటలో చాలా అనుభవ ప్రయాణాలు చెయ్యాల్సివచ్చింది నాకు.

అత్తయ్య లో అట్లాంటి రెబెల్ ను చూసి నేను చాలా భయపడ్డాను….కానీ ఆవిడ లో కనబడే తాత్వికురాలిని చూసి కొన్నాళ్టికి స్తిమితపడ్డాను.

అత్తయ్య నాకేనాడో సేవలు చేసిందని నాకు ఈ ఆత్మీయత పెరగలేదు. ఆవిడ ను నేను ప్రేమించాను …అంతే.

నా ఒళ్ళో పడుకుని , నేను నెయ్యీ కారప్పొడిలో ముంచి ఇడ్లీ లు పెడుతూంటే …

” నీచేత్తో ఇలా పెడితే ఇరవై ఇడ్లీలైనా తినేస్తాను. ఏం నేను అందం గా ఉన్నానన్న అసూయా ?! లావెక్కించేస్తున్నావు…” అని చిలిపిగా నిందాస్తుతి చేసే మాయ వెనకాల ఆత్మీయత…

నేను ఏనాడూ నా కథలు ఆవిడకు చూపించేదాన్ని కాదు…అంత ధైర్యం లేదు…కానీ ఒకరోజు నేను రాస్తున్న కథలో ” ఆమె నవ్వితే మంచిముత్యాలు రాలినట్లు ” అని రాశాను.

గభాలున పేపర్ లు లాక్కుని –

” ఏమిటి లిఖిస్తున్నావు జిజ్జిపిల్లా …నన్ను చూడనీ ..ఊ ! ఈ దేశం లో రైటర్ లు రాయడాన్ని కుటీరపరిశ్రమ కింద మార్చేశారు…ప్రతి ఎమోషన్ కూ అక్షరాలను వాడుకోవడమే …ప్రాసెసింగ్ లేదు పాడూ లేదు ” అని ఏడిపిస్తూ..

” మంచి ముత్యాలు కాదు – రాతి ముత్యాలు ” అని దిద్దింది.

” నీ హీరోయిన్ ది యవ్వనం, సౌందర్యం, జీవిత విభ్రాంతుల మధ్య నవ్వే నవ్వు . రాతి ముత్యం అంటే తెలుసా ? పగడం. ఆ ఒక పదం తో…అరుణవర్ణం, ఋతుదర్శనం, తమకం, ప్రణయం…ఇలా రాతి ముత్యాలు చాలా చెప్తాయి …

శబ్దానికి ఉండే ప్రభావం…చమక్, అయస్కాంతశక్తి..ఇంకా లోతుగా వెళ్ళగలిగితే , మంత్రశక్తి, ఆవాహన, అవగాహన …ఇవన్నీ తెలుసుకోకుండానే మీ అందరూ ప్రఖ్యాత రచయిత్రులు, విఖ్యాత రచైత్రులు అయిపోతూ ఉంటారు…” ( నా ఖర్మ కాలి ఒక మాగజైన్ నా కథ వేస్తూ ‘ ప్రఖ్యాత రచయిత్రి ‘ అని రాశారు. నా పుణ్యం పండిపోయి ఈవిడ కంటపడింది ఆ పత్రిక.

ఇట్లా దొరికిపోతే ఆవిడ పెట్టే ఇబ్బందులు, వేళాకోళాలు అన్నీ ఇన్నీ కావు.

“ బాలసుందర రావు గారు ఒక రకం గా, ఆయన సోదరి లత గారు మరొక రకం గా …వీళ్ళ మాటల్లో ఇరుక్కుంటే పళ్ళ మధ్య పడ్డ నాలుక గతే  ” అనేవారు కొమ్మూరి సాంబశివరావు గారు.

( ఆయన కేవలం డిటెక్టివ్ సాహిత్యం మాత్రమే రాయలేదు…చాలా మంచి రచనలు చేశారు. ఆంధ్రదేశం లో యుగంధర్, రాజు అనే డిటెక్టివ్ లు నిజం గానే ఉన్నారు అన్నంత గొప్పగా – డిటెక్టివ్ సాహిత్యం తో ఉత్సుకతకు, ఆలోచనకు పదును పెట్టేవారు.)

ఒక్నాడు –

22 ఏళ్ళకే వైధవ్యం పొంది, ముట్టుకుంటే మాసిపోయేట్లు ఉండే ఒక సౌందర్యవతి , ఉమ్మడికుటుంబం లో కోడలు , వినయవిధేయతలతో పెద్దత్తగారు, చిన్నత్తగార్ల సేవలో ఉండే ఒక young widow

గర్భవతి అయింది.

ఇది అప్పట్లో ఒక భయంకర సాంఘిక దురాక్రమణ…కానీ అప్పటికీ ఇప్పటికీ అదేం ఖర్మో – బాధితురాలినెప్పుడూ నేరస్థురాల్ని చేసి శిక్షించి అర్థం తెలియని కచ్చ తీర్చుకుంటాయి మర్యాదస్తుల జరీ పంచలు, కాసులపేర్లు సవరించుకునే పట్టు చీరలు.

ఇప్పటికీ అదే స్థితి- Rape victimను వందసార్లు సన్నటి ముసుగు లో చూపించి , మరింత కుంచించుకుపోయేట్లు చేసే టి వి లు…ఒకవేళ ఆ పిల్ల అమానుషానికి చచ్చి శవమైతే – ” మీ అభిప్రాయం ఏమిటి ? ” అని దుఃఖపడే తల్లిదండ్రుల నోటి దగ్గర మైక్ లు పెట్టే జర్నలిజం…

ఒక్కసారి – ఆ నేరానికి కారణమైనవారిని ఇంటర్వ్యూ చేసి , ” ఏ రకమైన ఆలోచన, కచ్చ – ఇలాంటి నేరం చేయించాడానికి ప్రకోపించింది ? ” – అని ప్రశ్నిస్తే ?!

ఆ నేరస్థుల తల్లిదండ్రులను ఫోకస్ లోకి తెచ్చి – ” ఎటువంటి పరిస్థితుల్లో, ఏ భావజాలం లో ఈ అబ్బాయి పెరగడం వలన ఇలా తయారయాడు ?! ” అని ప్రశ్నించి వివరణ తీసుకుంటే ?!

ఎంతోమంది భయపడవచ్చు ( ఇది అమానుషమనే చట్టాలు , అమ్మాయిలను చూపిస్తే ఫరవాలేదు, కానీ అబ్బాయిలు పాపం అనే చట్టాలు ఉన్నాయేమో నాకు తెలియదు )

అటువంటి అపాయాల్లో ధైర్యం గా – ” మీకు నేను ఉన్నాను ” అని చెప్పగల బాలసుందర రావులు చాలా తక్కువమంది.

ఆవిడను మా ఇంటికి తీసుకువచ్చారు. అబార్షన్ అయిన ఆవిడను – చాలా చాదస్తం ఉన్నది అనుకునే మా బామ్మ – కన్నబిడ్డలా కడుపులో పెట్టుకున్నారు.

” ఆవిడను అనారోగ్యం వల్ల ట్రీట్ మెంట్ కోసరం బాలసుందరం దగ్గరకు పంపాము ” అని చెప్పి పరువు నిలుపుకున్నారు ఆవిడ కుటుంబం.

మా నాన్న తన స్నేహితురాలైన డాక్టర్ గులాబీబాయ్ గారి చేత ఆవిడ తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పించి..

” నీకు ఇష్టమైతే, నీకు తప్పు కాదనిపిస్తే ఏదైనా చెయ్యి… కాని నిన్ను దౌర్జన్యం చెయ్యబోతే మాత్రం పరువు తీస్తానని ఆగం చెయ్యి…’ పాపం చేస్తున్నావు ‘ అనే మాట కన్న ‘ పరువు పోతుంది ‘ అనే మాటకు భయపడిపోయేవాళ్ళు మన జనం…నువ్వు భయపడకు. ఎప్పుడు నీకు అక్కడ ఉండలేననిపిస్తే అప్పుడు వచ్చెయ్యి. ఆంధ్రమహిళాసభ లో ఉండి చదువుకుందువుగాని …” అని ధైర్యం చెప్పారు నాన్న.

” మళ్ళీ ఆ ఇంటికే వాళ్ళ వాళ్ళు పంపితే ఊరుకుంటావేమిటిరా అన్నయ్యా ?! నేనూ వస్తాను పద , కడిగేస్తాను అందర్నీ ” అని అరిచి రగడ చేసింది మా అత్తయ్య.

” ముందు ఈవిడ ఉపద్రవం నుంచి ఎట్లా తప్పించుకోవాలా ” అన్నట్లు చూస్తోంది ఆ అమ్మాయి , అత్తయ్యను.

వాళ్ళవాళ్ళు వచ్చి ఏ సలహా సంప్రదింపు వినకుండా ట్రైన్ ఎక్కించి తీసుకుపోయారు.

ఆవిడ అక్కగారు – పెద్ద బొట్టు, కొండె సిగ, కాళ్ళకు పసుపు, జరీచీర…చాలా పెద్దింటి కోడలు , అప్పట్లో అరవై ఎకరాల ఆసామి భార్య –

” ఇదుగో- ఈ చీర పాతదైపోయింది..నువ్వు కట్టుకో….నీకు ఏది కట్టినా బాగానే ఉంటావు …అందుక అలా మీదబడతారు మరి…” అని చెల్లెలి తో శ్లేషగా దీర్ఘం తీస్తూ –

హేమత్తయ్యకు దొరికిపోయింది.

ఆగం ఆగం చేసింది అత్తయ్య. నేను బిక్క చచ్చిపోయి మా బామ్మ కొంగు వెనకాల దాక్కున్నాను. ఆవిడలో భద్రకాళి నిద్రలేవడానికి కారణం నాకు అప్పట్లో అర్థం కాలేదు.

” మీరంతా ఆస్తులకు, నగలకు – సెక్యూరిటీ పేరుతో అమ్ముడుపోయిన ఆడాళ్ళు. …మీ కాళ్ళ కిందకి నీరు వచ్చేదాకా మీ ఇళ్ళలో ఎన్ని అన్యాయాలు జరిగినా ఊరుకుంటారు. సొంత అక్కవు కదా ?! జాలి లేదా నీకు ?! నీ మాటల్లో అంత శ్లేష, వాత పెట్టినట్లు మాట్లాడటం అవసరమా ?  పుణ్యం అంటే పూజలు చేసెయ్యడం కాదు , ఎదుటి వాళ్ళను బాధ పెట్టే పాపాలు చెయ్యకుండా ఉండడం ” – రెచ్చిపోయింది అత్తయ్య.

ఇలా మాటకు మాట పెరిగిపోయి,

” అసలు నేను ఏమన్నానని ఆ రాక్షసి అలా విరుచూ పడింది ?! ” అని ఆ అక్క కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే – ఆవిడ చుట్టూ చేరిన ఆడవాళ్ళు ఓదార్చే సీను జరుగుతోంది.

” వెధవ హిపోక్రసీ…బాధపడ్డ వ్యక్తి గుడ్ల నీరు కుక్కుకుని మనందరికీ కాఫీలు పెట్టాలని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ..ఆ అమ్మాయిని అమర్యాద చేసి ఆరడి పెట్టిన నీకు ఇంత సానుభూతా ?! మీ అందరికీ బుద్ధిలేదూ ?! మీ కూతురైతే …” అని తిట్టిపోసింది అత్తయ్య.

చాలా చిన్నప్పుడే – ప్రతివిషయం లో బాధా తప్తహృదయాల కోసరం పోరాడే చాలా మంది – వాళ్ళ పర్సనల్ జీవితాల్లో – వాళ్ళకు బాధో అసూయో దుఃఖమో కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు – ” ఎంత గా పరిధి కుంచించుకు ఆలోచిస్తారా ..” అనిపించేది. అలా చాలా గొప్పవాళ్ళలో ‘ చిన్నతనం ‘ చాలా చూశాను నేను. మా అత్తయ్య కూడా తనకు ఈర్ష్య కలిగినా అహం దెబ్బ తిన్నా అమానుషం గా ప్రవర్తించడం చూశాను .

ఒక గొప్ప జ్యోతిష్కులు – ” వాళ్ళు మాట్లాడరమ్మా, వాళ్ళ గ్రహాలు మాట్లాడిస్తాయి ” అనడం విన్నాను.

సైకిక్ అనాలిసిస్ చేసే ఒక గొప్ప సైకో థెరపిస్ట్ – ” వాళ్ళను ఆవహించినవి – వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీ ని అణిచేసి అవి డామినేట్ చేసి ప్రవర్తిస్తాయి..” అనేవారు.

కానీ, ఇక్కడ మనిషి పర్సనాలిటీని ఎమోషన్ డామినేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది.

గొప్ప జర్నలిస్ట్, రచయిత, విజయా వాహినీ స్టూడియో ల నిర్మాణం లో నాగిరెడ్డి – చక్రపాణి గార్ల సహచరులు, ‘ చందమామ ‘ మాగజైన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ చందమామ రామారావు గారు –

ఆయన ఇంటిపేరు చాలామందికి తెలియదు…చందమామ ఆయన ఇంటి పేరే అనుకుంటారు. వారు కోడంబాకం లో మొదట ఇల్లు కట్టుకున్నవారిలో ఒకరు. ఆ  ఇంటి పేరు ‘ వెన్నెల ‘ . ఆ తరువాత వారి సహకారం తో , డైరెక్టర్ శ్రీ కె. విశ్వనాథ్ గారు, శ్రీ చంద్రమోహన్ గారు – వారి ఇంటి ఎదురుగా స్థలాలు కొని ఇళ్ళు కట్టుకున్నారు. మా కాలనీకి వారే అప్పట్లో పెద్ద దిక్కు. ఆయన మంచి విమర్శకులు…చాలా నిష్పక్షపాతం గా కరుకుగా ఉండేవి వారి విమర్శలు.

ఆయన సహచరులైన ఒక ప్రఖ్యాత రచయిత గురించి ఒక ఆర్టికల్ రాయమని బలవంతపెడితే …

” ఆయన నాకు దగ్గరకొండ ” అని ఒకే ఒక వాక్యం రాసి చాలా చాలా చెప్పేశారు.

అవును…

మనకు ఫాసినేషన్ కలిగించే చాలా చాలా గొప్ప రచయితలు, కళాకారులు – వారి  కుటుంబాలకు , వారి బలాలకన్నా బలహీనతలు తెలుసుకునే దగ్గరి వ్యక్తులకు – ‘ దగ్గర కొండలే ‘ .

ఇన్ని అద్భుతాలు, బలహీనతల సమాహారమైన వాతావరణం లో వీరందరి దగ్గర నుంచి  దొరికిన ఆప్యాయత – నాకు ‘ జీవించడానికి ‘ , బ్రతికించడానికి చాలా ఉపయోగపడింది.  

మా బామ్మ గారి చివరి రోజుల్లో నేను మడికట్టుకుని వంట చేసి దేవుడి నైవేద్యం పెట్టి – మా చిన్న బామ్మ, పెద్ద బామ్మ లకు అన్నం వేడి వేడి గా ఉండేటట్లు కుంపట్లలో బొగ్గులు వేసి , వారి మంచాల దగ్గర అందేట్లుగా కంచాలు పెట్టేదాన్ని.

మా నాన్నగారిది దొరల పద్ధతి. టేబుల్ మీద గాజు ప్లేటు, స్పూన్స్, ఫోర్క్స్, 4 గిన్నెలు, మూతలలో ఆధరువులు… నెయ్యి కరగందే వేసుకోరు కాట్టి స్పిరిట్ లాంప్, పక్కన అగ్గి పెట్టె – పెట్టి కాలేజీకి పరుగెత్తేదాన్ని.

రాత్రి పనంతా అయిన తర్వాత మా బామ్మ గారికి కాసేపు కాళ్ళు పిసికి , ఆవిడ డొక్కలో దూరి పడుకునేదాన్ని. నల్లగా కమిలిపోయి ఎముకలు తేలిన ఆ చెయ్యి – నా నడుము చుట్టూ వేసి పొదివి పట్టుకున్న మా బామ్మ చెయ్యి ఇచ్చిన సెక్యూరిటీ నాకు జీవితం లో ఎవరూ ఇవ్వలేదు , ఇవ్వలేరు కూడా.

ఆప్యాయతతో అల్లరిపెట్టే అత్తయ్య, నాన్న – గుడ్డి ప్రేమతో ముద్దు చేసే బామ్మ. ..దాశరథీ శతకం, సుమతీ శతకం, కుమారీ శతకం వల్లె వేయించే చిన్న బామ్మ …” అమ్మకు రెండబ్బకు రెండిమ్మహి తిట్టించు ఆ కూతురెందుకు, ఆ దొమ్మరి పుట్టకపోయిన- ” ఇట్లాంటివి చెప్పి భయపెట్టేది ఆవిడ.

తన పిల్లలు పెద్దవాళ్ళయ్యేదాకా నన్ను ఆ ఆప్యాయతతో పెంచిన మా జూలెమ్మ ( మా హాస్పిటల్ లో నర్స్ ) – ఇలా ఎంతోమంది ప్రేమ వెన్నెలలా జీవితమంతా ఆవరిస్తే…

” మీరు ఇలా ఎలా ప్రేమించగలరు మాడం ?! ” అంటే చాలా నవ్వొస్తుంది.

చాలా పొందినవాళ్ళు – కొంచెం అయినా ఇవ్వలేరా ?!

ప్రకృతి ఈ ప్రశ్న అడిగి మనను నోరు మూయించదూ ?

జవాబేముంది మన దగ్గర ?!

 

జలంధర

కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కాలంనాటి ఎందరెందరో పెద్దల ఆప్యాయత పొందిన జలంధరమ్మా,

    ఎందుకో తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఉపిరితీసుకోకుండా చదివి – – “ పెద్దమనుషులు, ఉదారులుగా కనబడే వీరి లో అణిగిఉన్న గుణప్రకోపాలు బలహీనుల ఎదురుగా బయట పడతాయి. బాధపెట్టి భయపెడతాయి “

    శ్రీ చంద్రమోహన్ గారు అని మీరు రాసిన మీ శ్రీవారు – – – అందగాడు, సినిమాల్లో ఎన్నో పాత్రల్ని అద్భుతం గా పండించాడు అని మాత్రమే అనుకునే నా మందబుద్దికి వారితో మాట్లాడే అదృష్టం కలిగినాక తెలిసివచ్చిందేవిటంటే వారెంతో గొప్ప వ్యక్తిత్వం కలిగినవారు, ఏ భేషజాలకూ పోకుండా సాధారణ మానవుడి గా ప్రవర్తిస్తారనే విషయం. ( మీపట్ల ఎంతో అక్కరతో, అభిమానంతో మాట్లాడుతారు అని కూడా రాయాలని ఉంది ).

    మీతో సాహితీ స్నేహమో, సాన్నిహిత్య స్నేహమో చెయ్యమని యువ కవయిత్రులు బండ్లమూడి స్వాతి కుమారి, తిరుపతి రేఖా జ్యోతి, రిషీవ్యాలీ మాస్టారు రాజశేఖర్ పిడూరి, కర్నూలు లోని సాహితీ పెద్దలు ఇంద్రగంటి వెంకటేశ్వర రావు, హైదరాబాదులోని GRK మూర్తి గారు, త్రిపుర గారి ఆప్త మిత్ర పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాధరావు గార్లను పోరుపెట్టి చంపుతున్నాను. అయినా వాళ్లేందుకు తమబిడియాలను వదలలేకపోతున్నారు, మీ సాహితీ ప్రతిభకు అబ్బురపడుతూ

    ~ ఇట్లు, ఓ నేలక్లాసు పాఠకుడు ( కాకా పట్టడానికి ఇట్టా రాశానని అనుకోమాక తల్లా, నేను రాసినవన్నీ నా రాతి రుదయములోనుండి పొంగిపొర్లి వచ్చాయి. సరస్పతి తల్లి మీద ఒట్టు )

  • ఈ ప్రపంచం అంతా బండరాయిగా మారిపోయినట్లు కనిపిస్తూన్నా దాగున్న నీటి సవ్వడులు విని మనసు తడి అవుతూంటుంది ఒక్కోసారి. ప్రేమను పొందినవాళ్ళు కాస్తైనా ఇవ్వగలిగితే…అసలా ఊహే ఎంత బాగా అనిపిస్తుందో. పూర్తిగా స్వార్థంతో నిండిన లోకంలో మీ మాటలు చదవగానే సంతోషంగా అనిపిస్తోంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు