ప్రేమ దేవత రీటా హేవర్త్ 

పాతాళభైరవి సినిమాలో నేపాళ మాంత్రికుడు తన మాయలూ మంత్రాలూ చూపి ప్రజలను ఆకట్టుకోవడానికి ఒక రాతిని నాతిగా చేసి “మహాజనానికి మరదలు పిల్లా గలగలలాడవే గజ్జలకోడి”అంటాడు.  అప్పుడా యువతి “వగలోయ్ వగలూ థళుకు బెళుకూ వగలూ” అంటూ పాటందుకుని నాట్యం చేస్తుంది.జనాన్ని చిత్తు చేసే ఆ పాట పాడింది జిక్కి, రాసింది పింగళి, ట్యూన్ చేసింది ఘంటసాల.అయితే ఆ పాట మాతృక 1948లో వచ్చిన “లవ్స్ ఆఫ్ కారమెన్ “అనే ఇంగ్లీషు సినిమాలో రీటాహేవర్త్ నృత్యంచేస్తూ పాడిన లాటిన్ అమెరికన్ ట్యూన్.

ఇదే పాట 1951 లో వచ్చిన “జాదూ” అనే హిందీ సినిమాలో కూడా వినిపిస్తుంది. నౌషాద్ సంగీత దర్శకత్వంలో “జబ్ నయన్ మిలే నయనోంసే లలలూ లలలూ “అంటూ సాగే ఆ పాట పాడింది షంషాద్ బేగం.రచయిత షకీల్ బదాయూని.నృత్యం చేసింది నళినీ జైవంత్. అసలు ఈ సినిమాని “లవ్స్ ఆఫ్ కార్మన్ “ని స్ఫూర్తిగా తీసుకుని హిందీలో తీసింది ఎ.ఆర్ .కర్దార్.

1945లో వచ్చిన “స్వర్గ సీమ “సినిమాలో భానుమతి పాడిన “ఓ పావురమా” పాట సూపర్ హిట్.  ఆ పాట పుట్టుక గురించి అడిగితే రీటా హేవర్త్ “బ్లడ్ అండ్ శాండ్ ” (1941)లొ పాడిన లాటిన్ అమెరికన్ ట్యూన్ ఆధారంగా తానొక రాగం తీశాననీ, సంగీత దర్శకుడు నాగయ్య గారు బాగుందనీ అలాగే పాడెయ్యమన్నారనీ చెబుతారావిడ. కానీ ఆపాట రాసిన బాలాంత్రపు రజనీ కాంత రావు గారు ఆ పాట రాసిందీ, ట్యూన్ చేసిందీ తానే అని చెబుతారు. ఏది యేమైనా అది ఒక లాటిన్ అమెరికన్ ట్యూన్ ఆధారంగా తయారయిందనేది నిజం.

అయితే ఇక్కడొక సంగతి చెప్పుకోవాలి ఆనాడు రీటాహేవర్త్ స్వయంగా పాడినట్టుగా చలామణీ అవుతున్న పాటలు ఆమె పాడలేదు, యెవరెవరో ప్లేబాక్ పాడారు అని  తర్వాత అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.అప్పట్లో పబ్లిసిటీ కోసం అలా చేసేవారట!

ఇంతగా మన తెలుగూ,హిందీ సినిమాలని ప్రభావితం చేసిన రీటా హేవర్త్ యెవరు? ఆమె పుట్టు పూర్వోత్తరాలేమిటీ? ఆమె జీవితం యెలా గడిచిందీ? యెలా ముగిసిందీ? అని వెదుకుతుంటే యెన్నో ఆశ్చర్యకరమైన సంగతులు, విశేషాలూ తెలిశాయి.

రీటా హేవర్త్ మహాసౌందర్యవతి, అత్యంత ప్రతిభావంతురాలైన నర్తకీ,నటీ కూడా. 1940 -నుండీ 1977వరకూ గడచిన ముఫ్ఫయ్యేడు సంవత్సరాలలో అరవై ఒక్క సినిమాలలో నటించింది.ఆమెను 1940 ప్రాంతాలలో అత్యంత ఆదరణ కలిగిన చలన చిత్ర నటిగా భావించేవారు.అప్పట్లో మీడియా ఆమెను “ప్రేమదేవత” అని పిలిచేవారు.రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో ఆర్మీ వారికీ,యువతకీ ఆరాధ్యదైవమామె .ఆమె పోస్టర్లూ ,కేలండర్లూ వారి గోడలపై కొలువుదీరి వుండేవి. పేరెన్నికగన్న డాన్సర్లయిన ఫ్రెడ్ అస్టయిర్ తోనూ,జీన్ కెల్లీ తోనూ,ఫ్రాంక్ సినాత్రాతోనూ ఆమె చేసిన నృత్యాలు ప్రజల మతులు పోగొట్టేవి. ఫ్రెడ్ అస్టయిర్  నాట్యంలో తనకు నచ్చిన జోడీ రీటా హేవర్త్ మాత్రమే అని చెప్పేవాడు.

ఆమె చేసిన నృత్యాలు చూస్తుంటే ఆమె లోని అణువణువూ నాట్యం చేస్తున్నట్టు వుంటుంది.

దానికి కారణం ఆమె తన మూడేళ్ల వయసు నుండీ చేసిన రాక్షస సాధన,ఆమె తండ్రి పట్టుదలతో ఆమెకు శిక్షణనిచ్చి  మంచి నర్తకిగా తీర్చిదిద్దటం. ఆమెను  అద్భుత సౌందర్యవతి అనీ,అత్యంత గ్లామరస్ నటీమణి అనీ పరిగణించే వారు .అప్పటి మీడియా ఆమెకు “ప్రేమదేవత” అనే బిరుదునిచ్చింది అని చెప్పుకున్నాం కదా, ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ చేసిన ఒక సర్వేలో  చలన చిత్ర చరిత్రలో అగ్ర స్థాయికి చెందిన పాతికమందినటీమణులలో ఈమె ఒకటిగా తేలింది.

అయితే ఆమె వ్యక్తిగత జీవితం యేమీ తృప్తికరంగా గడవలేదు. చిన్ననాటినుండీ అణచివేతకు గురయింది.ఆ ప్రభావం ఆమెను అభద్రతా భావానికి గురిచేసింది.ఆమె అయిదు సార్లు పెళ్లి చేసుకుంది. (ఆమె భర్తలలో సినీ మేథావిగా పరిగణించే ఆర్సన్ వెల్స్ ,అత్యంత ధనవంతుడైన ప్రిన్స్ ఆలీఖాన్ కూడా వున్నారు). మద్యానికి బానిస అయింది.జీవిత చరమాంకంలో  ఆల్జీమర్స్ వ్యాథికి గురయి మరణించడం ఒక విషాదం.ఆమె వలననే “ఆల్జీమర్స్”వ్యాథిగురించి ప్రపంచానికి బాగా తెలిసిందీ, అవగాహన పెరిగిందీ అంటారు.

ఆమె జీవితం యెలా మలుపులు తిరిగిందీ, యెలాంటి ఆటుపోట్లకు గురయిందీ తెలుసుకుంటే ఆనాటి సినీ జీవితాలు యెలా వున్నదీ,నటీమణుల మీద యెంత ఒత్తిడి వుండేదీ తెలుస్తుంది.ఆమె జీవితంలో తారసపడిన పురుషులు ఆమె తండ్రితో సహా ఆమె మీద యెంత ఆధిపత్యం చూపించారో కూడా తెలుస్తుంది.ముఖ్యంగా ఆమె తండ్రి చిన్ననాడే ఆమె మీద అత్యాచారం చేయడం దారుణం. అదే ఆమె జీవితం మీద ప్రవర్తన మీద అత్యంత ప్రభావం చూపింది అనిపిస్తుంది.

రీటా హేవర్త్ అసలు పేరు మార్గరీటా కార్మన్ కాన్సినో. ఆమె అక్టోబర్ 17 తేదీన1918లో న్యూయార్క్ బ్రూక్లిన్ లో జన్మించింది.  తండ్రి ఎడ్యురాడో కాన్సినో మంచి డాన్సర్.  స్పానిష్ ,రోమన్ మూలాలున్న వాడు నాట్యకారుల కుటుంబం నుండీ వచ్చినవాడు. అతని తండ్రి ఆంటోనియో కాన్సినో పేరొందిన క్లాసికల్ స్పానిష్ డాన్సర్ .”బోలెరో “అనే నృత్యానికి విశేష ప్రాచుర్యం కలిగించేందుకు కృషి చేసిన వాడు. అతను మాడ్రిడ్ లో నడిపిన డాన్స్ స్కూలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆమె తల్లి వోల్గా హేవర్త్ ఐరిష్ ,ఇంగ్లీషు మూలాలున్నది ,మంచి నటి నటన వారసత్వంగా కలిగిన కుటుంబం. సహజంగానే రీటా తండ్రి ఆమెను మంచి డాన్సర్ గా తీర్చిదిద్దాలనుకుంటే తల్లి మంచి నటిగా ఆమెను చూడాలనుకునేది.

తడ బడే అడుగులతో అప్పుడప్పుడే నడక  నేర్చుకుంటున్న సమయంలోనే ఆమెకు  నృత్య శిక్షణ ఆరంభమయిందిమొదటి పాఠాలు తాత ఆంటోనియా దగ్గర తీసుకుంది.ఆమె తండ్రి ఎడ్యురాడో కాన్సినో ఆమె చేత రోజుకు పధ్ధెనిమిది గంటలు సాధన చేయించేవాడు.అయిదు సంవత్సరాల వయసులోనే కుటుంబ సభ్యులతో కలిసి బ్రాడ్వే లో ఇచ్చిన నృత్య ప్రదర్శనలో పాల్గొంది. ఎనిమిదేళ్ల వయసులో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది.

ఆమెకుతొమ్మిదేళ్ల వయసు వున్నప్పుడు 1927లో ఆమె తండ్రి హాలీవుడ్ కి మకాం మార్చాడు .సినిమాలలో నృత్యావకాశాలు దొరుకుతాయనేదే ఈ మార్పుకి కారణం.అతను హాలీవుడ్ లో ఒక డాన్స్ స్కూలు స్థాపించి శిక్షణ ఇస్తూ వుండేవాడు.అతని దగ్గర శిక్షణ పొందిన వాళ్లలో ప్రఖ్యాత నటులయిన జేమ్స్ కాగ్నీ,జీన్ హార్లో కూడా వున్నారు.

రీటా కి పన్నెండేళ్లొచ్చే సరికి ఆమె తండ్రి ఆమెను తన జోడీగా చేసుకుని “డాన్సింగ్ కాన్సినోస్ ” అనే పేరుతో నృత్య ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. ఆమె తో కలిసి అతను కాలిఫోర్నియా లోని నైట్ క్లబ్బులలో ప్రదర్శనలిస్తూ వుండేవాడు .అయితే ఆమె వయసు సరిపోదని అభ్యంతరాలు వస్తుంటే వయసులో పెద్దదిగా కనపడాలని ఆమె జుట్టుకు నల్లరంగు వేయడం ,ఆమె తన భార్య అని చెప్పడం చేస్తూ వుండేవాడు.అప్పుడప్పుడూ కాలిఫోర్నియా దాటి మెక్సికో లోని నైట్ క్లబ్బులలో కూడా ప్రదర్శనలిస్తూ వుండేవాడు .అక్కడయితే ఆమె వయసుగురించి పెద్దగా అభ్యంతరం వుంఢదనే వుద్దేశం ఒకటీ,సినీ పరిశ్రమ కి చెందిన వాళ్లు వచ్చి చూస్తారనేది ఇంకోటీ.

రీటా  పట్ల తండ్రి ప్రవర్తన చాలా దారుణంగా వుండేది. ఆమెను మానసికంగానూ,శారీరకంగానూ హింసించడమే కాక లైంగికంగా కూడా వేధించే వాడని  ఆమె జీవిత చరిత్ర లోబార్బరా లెమింగ్  రాసింది.ఆమె కు యెంతో ఇష్టమైన రెండవ భర్త ఆర్సన్ వెల్స్ కూడా తన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు. ఆమె తల్లి భర్తనుండీ కూతురును కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేసేదని కూడా  ఆమె జీవిత చరిత్రలో రాశారు.

ఈ నృత్య ప్రదర్శనలతో రీటా చదువు అటకెక్కింది. తొమ్మిదో తరగతితోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టించాడు తండ్రి.ఎంతసేపూ డాన్స్ ప్రాక్టీసూ ప్రదర్శనలతోనే సమయం  గడిచి పోయేది,తన సోదరులిద్దరూ చదువు తోనూ ఆటపాటలతోనూ కాలం గడుపుతుంటే ఆమె నిర్లిప్తంగా చూస్తూ వుండేది.అలా ఆమె తన బాల్యాన్ని కోల్పోయింది.

మెక్సికోలో నైట్ క్లబ్బులలో ఆమె చలాకీగా నృత్యం చేయడం చూసిన ఫాక్స్ ఫిల్మ్స్ కి చెందిన హెడ్ విన్ ఫీల్డ్ షీహాన్ ఆమెను సినిమాలకి పరిచయం చేయాలనుకున్నాడు.స్క్రీన్ టెస్ట్ పాసయ్యాక ఆమె కొన్ని చిత్రాలలో రీటా కాన్సినో పేరుతో చిన్న చిన్న వేషాలు వేసింది.ఆమె మొట్టమొదటి సినిమా “డాంటేస్ ఇన్ఫెర్నో” (1935).అందులో స్పెన్సర్ ట్రేసీ కథానాయకుడు.ఆమె రూపురేఖల వలన ఆమెకు ఎక్కువగా విదేశీ మహిళ పాత్రలు లభించాయి.

ఒక సినిమాలో ఆర్జెంటీన్ గర్ల్ గా,ఇంకో దాంట్లో రష్యన్ డాన్సర్ గా,ఇంకోదాంటో ఈజిప్షియన్ గా ఇలా . ఫాక్స్ ఫిల్మ్ కార్పొరేషన్ తో ఆమె  ఆర్నెల్ల కాంట్రాక్ట్ ముగిసింది.ఫాక్స్ ఫిల్మ్ కార్పొరేషన్ ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్  ఫిల్మ్ కార్పొరేషన్ లో విలీనమయ్యింది. ఆమె కాంట్రాక్ట్ పునరుధ్ధరించ బడలేదు. దీనితో ఆశాభంగం చెందిన ఆమె తండ్రి చలన చిత్రావకాశాలు మెరుగు పడేటందుకు ఎడ్వర్డ్ జడ్సన్ అనే ఒక కార్ల బ్రోకర్ ని ఆమె కు మానేజర్ గా నియమించాడు. అతనికి రీటాకంటే రెట్టింపు వయసుంటుంది. అతనీ వృత్తిలో చాలా గట్టివాడు.రీటా కి సినిమా అవకాశాలు రావడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు. ఆమె నుదురు విశాలంగా కనపడాలని ,ముంగురులను, బాధాకరమైన ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా తొలగించేట్టు చేశాడు.ఆమె పేరు రీటా కాన్సినో అని కాకుండా వాళ్లమ్మ గారింటి పేరుతో కలిపి రీటా హేవర్త్ గా మార్చాడు. జుట్టు రంగు కూడా మార్పించి ఎర్రగా చేశాడు.వీటన్నిటి వల్లా ఆమె ఒక అమెరికన్ లా కనపడసాగింది.

అతికొద్దికాలంలోనే రీటా హేవర్త్  తన తండ్రి వయసున్న ఎడ్వర్డ్ జడ్సన్ ని పుట్టింటి నుండీ పారిపోయి పెళ్లిచేసుకుంది.(1937). అతను ఆమె అభ్యున్నతికి యెంతో కృషిచేశాడు.కొలంబియా పిక్చర్స్ తో కాంట్రాక్ట్ కుదిర్చాడు.కొలంబియా పిక్చర్స్ హెడ్ అయిన హారీ కాన్ యేకంగా యేడు సంవత్సరాలకి ఆమెతో కాంట్రాక్ట్ రాయించుకున్నాడు.

మొదట్లో ఆమెకు చిన్నా చితకా పాత్రలే లభించేవి .క్రమంగా ఆమె ప్రతిభ గమనించి ఆమెకు ముఖ్యమైన పాత్రలు ఇవ్వడం మొదలెట్టింది కొలంబియా కంపెనీ. 1941 లోప్రముఖ డాన్సర్ ఫ్రడ్ అస్టయిర్ తో ఆమె నటించిన “యూ విల్ నెవర్ గెట్ రిచ్ “పెద్ద బడ్జెట్ సినిమా.దానితో ఆమె దశ తిరిగింది. ఆ సినిమా పెద్దహిట్ .కొలంబియా కంపెనీకి బాగా లాభాలు తెచ్చిపెట్టింది. వెంటనే మరుసటి సంవత్సరమే ఇదే జంటతో “యూ వర్ నెవర్ లవ్లియర్ “అనే సినిమా తీసింది కొలంబియా సంస్థ.1941 లో “లైఫ్ “మాగజీన్ కవర్ గా వచ్చిన ఆమె ఫోటో చాలా మంది ఇళ్ల గోడలని అలంకరించింది. రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో  ఆమె కాలెండర్లూ,పోస్టర్లూ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. మీడియా ఆమెను “ప్రేమదేవత”అని పిలవ సాగింది.

ఆ ఫోటో సమయంలో ఆమె ధరించిన డ్రెస్ 2002లో ఇరవై ఆరువేల డాలర్ల పైచిలుకు ధరకు అమ్ముడుపోవడం విశేషం. 1941 లో ఆమె నటించిన “బ్లడ్ అండ్ శాండ్ ” చిత్రం కూడా  పెద్ద హిట్ అయింది. 1942 సంవత్సరంలో ఆమె వ్యక్తిగత జీవితం పెద్ద కుదుపుకు లోనయింది. ఎన్నో ఆశలతో పెళ్లాడిన జడ్సన్ ఆమెను శారీరకంగా మానసికంగా వేధించసాగాడు. అతి కొద్దికాలంలోనే అతని నిజస్వరూపం తెలుసుకుంది రీటా.అతను ఆమెను అనేక రకాలుగా హింసించేవాడు..వేషాలకోసం ఆమెను ఇతరులతో సంబంధాలు పెట్టుకోమనికూడా వత్తిడి చేసేవాడు. ఇవన్నీ భరించలేని రీటా విడాకులు కోరితే ఆమె అందాన్ని నాశనం చేస్తానని బెదిరించేవాడు.ఎట్టకేలకు ఆమె అతనితో విడాకులు పొందింది.(1942) దీనికోసం సుమారు పన్నెండు వేల డాలర్ల మూల్యం చెల్లించ వలసి వచ్చింది. దానితో ఆమె సంపాదించినదంతా పోగొట్టుకుంది

1942సం”లోనే  సినీ ప్రపంచమంతా మేథావిగా పరిగణించే దర్శకుడూ నటుడూ ఆర్సన్ వెల్స్ ఆమె జీవితంలో ప్రవేశించాడు.అదంతా చాలా చిత్రంగా జరిగింది “లైఫ్ “మాగజీన్ కవర్ మీద ఆమె ఫోటోచూసిన వెల్స్ అమాంతం ఆమె ను ప్రేమించేశాడు.ఆమె కు తన ప్రేమను వ్యక్త పరుస్తూ ఉత్తరాలు కూడా రాశాడు.

1943 సెప్టెంబర్ లో ఆర్సన్ వెల్స్ ని పెళ్లాడింది రీటా హేవర్త్ .ఆ సమయంలో ప్రఖ్యాత డాన్సర్ జీన్ కెల్లీ తో “కవర్ గర్ల్ “అనే సినిమాలో నటిస్తోందామె. ఆర్సన్ వెల్స్ ,రీటా ల జంటని చూడముచ్చటైన ఆదర్శమైన జంటగా సినీ ప్రపంచమంతా భావించేది.కొన్నాళ్లు ఇద్దరూ చాలా అన్యోన్యంగా గడిపారు. తాను కోల్పోయిన తండ్రిప్రేమనీ,భద్రతనీ వెల్స్ ద్వారా పొందాలనీ ,చక్కని గృహిణిగా కాలం గడపాలనీ భావించేది రీటా.

1944లో పెళ్లయిన సంవత్సరానికి రెబకా అనే పండంటి కూతురికి  జన్మనిచ్చింది. అయితే మేథావి ఆర్సన్ వెల్స్ మొదట్లో ఆమె తో బాగానే వున్నా క్రమంగా అతనిలో మార్పు వచ్చింది. ఈపెళ్లి పెద్ద ప్రతిబంధకంగా వుందనీ,తన స్వేఛ్ఛకి భంగం వాటిల్లు తోందనీ వాపోయేవాడు.అంతే కాకుండా అతనుఅనేక మంది ఇతరస్త్రీలతో అనుబంధం కలిగి వుండడం ,ముఖ్యంగా నటి జూడీ గార్లండ్ తో సన్నిహితంగా మెలగడం సహించలేకపోయింది రీటా.ఇది ఆమెను తీవ్రంగా బాధించింది , ఆమె ఆల్కహాలును ఆశ్రయించింది.

ఇదే సమయంలో ఆమె వృత్తి జీవితం ఉఛ్ఛస్థితిలో వుంది. 1946లో ఆమె గ్లెన్ ఫోర్డ్ తో కలిసి నటించిన “గిల్డా” సూపర్ హిట్టవ్వడమే కాదు ,నేటికీ అది ఆమె నటించిన చిత్రాలలో మేటి అని పరిగణిస్తారు. ఇందులో ఆమె మగవారిని కవ్విస్తూ వలలో వేసుకునే యువతిగా చేసిన నటన చూసి ,నిజజీవితంలో కూడా ఆమె అలాగే వుంటుందని భావించి దగ్గరయ్యేవారట. నిజానికి ఆమె “తాను చాలా సిగ్గరిననీ,ఆత్మన్యూనతాభావంతో బాధపడే దానననీ”చాలా చోట్ల చెప్పుకుంది.

“గిల్డా “లో ఆమె చేసిన పాత్ర యెంత హిట్ అయ్యిందంటే  ఆమె నొక సెక్స్ బాంబ్ గా పరిగణించేవారు .అంతే కాదు అమెరికా ప్రభుత్వం తయారుచేసిన ఒకానొక అణుబాంబు మీద ఈ సెక్స్ బాంబ్ రీటా హేవర్త్ ఫోటో ముద్రించారనే సమాచారం కూడా ప్రచారం లో వుండేది.ఇంకో నటీమణి యెవరైనా గొప్పగా ఫీలయ్యే వారేమో కానీ రీటా మాత్రం చాలా చిరాకు పడిందని ఆర్సన్ వెల్స్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం  గమనార్హం.

1947 లో రెండో పెళ్లయిన నాలుగేళ్లకి ఆర్సన్ వెల్స్ నుండీ విడాకులు తీసుకుంది.

అదే సంవత్సరం ఆర్సన్ వెల్స్ తీసిన “ది లేడీ ఫ్రమ్ షాంఘై “లో నటించింది. 1948 లో “గిల్డా” టీమ్ తో కలిసి( గ్లెన్ ఫోర్డ్ హీరోగా) మళ్లీ “లవ్స్ ఆఫ్ కారమన్ “లో నటిస్తే అది సూపర్ హిట్ అయింది.

1948 తర్వాత ఆమె నాలుగు సంవత్సరాలు చిత్రపరిశ్రమకు దూరమైంది, కారణం ప్రిన్స్ ఆలీఖాన్ తో ప్రణయమూ, పెళ్లీ. 1948 మే నెలలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రీటా హేవర్త్ ని చూసిన ప్రిన్స్ ఆలీఖాన్ ఆమెను వదిలిపెట్టలేదు.

ఈ ప్రిన్స్ ఆలీఖాన్ యెవరంటే షియా ముస్లిమ్ కమ్యూనిటీకి చెందిన సుల్తాన్ మొహమ్మద్ షా ఆగాఖాన్  కి కొడుకు.అతనికి అనేక వ్యాపారాలు వుండేవి .రేసుగుర్రాల పెంపకం ,రేసుల్లో పాల్గొనడం,పార్టీలూ ,హై సొసైటీకి చెందిన ఆడవాళ్లతో పరిచయాలూ అతనికి సర్వసాధారణం.అతను పాకిస్థాన్ కి అంబాసిడర్ గా యునైటెడ్ నేషన్స్ లో వుండేవాడు.అతని నివాసం ఫ్రాన్స్ .ఆమె కూడా  హాలీవుడ్ వదిలేసి ఫ్రాన్స్ చేరుకుంది.

రీటా హేవర్త్ అతనిని 1949 మే లో పెళ్లాడింది. డిసెంబర్ 1949 లో యాస్మిన్ ఆగాఖాన్ కి తల్లయింది.ఇప్పుడామెకు రెబకా,యాస్మిన్ ఇద్దరుకూతుళ్లు.ఇప్పుడయినా తాను కలలుగన్నట్టుగా ఇద్దరు కూతుళ్లతో ,భర్తతో నటనకు దూరంగా విశ్రాంతిగా గృహజీవితం  గడపాలనిఅనుకుందామె.కానీ భర్తగడిపే విలాసవంతమైన ఆడంబరమైన జీవితంలో ఇమడలేకపోయింది. అంతేకాదు భర్త తన పట్ల విశ్వాసంగా లేడనీ అనేకమంది తో సంబంధాలు నెరపుతూ వున్నాడని తెలిసి ఆమె హతాశురాలయ్యింది.

1953 లో మూడవ భర్తతో విడాకులు.కూతురు యాస్మిన్ ను స్వేఛ్ఛగా అమెరికన్ పౌరురాలిగా ,క్రిస్టియన్ గా పెంచాలనుకుంది.ఆలీఖాన్ తన కూతురు ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం పెరగాలనీ ,తన అధీనంలో వుండాలనీ కోరుకున్నాడు  చాలా డబ్బు ఆశచూపాడు కూడా.అయినా ఆమె లొంగలేదు.కూతురు కస్టడీకోసం ఆమె ఆలీఖాన్ తో కోర్టు లో పోరాడింది.చివరికామే గెలిచింది.

1953లో ఆలీఖాన్ తో విడాకులు తీసుకున్న వెంటనే డిక్ హేమ్స్ అనే ప్రొఫెషనల్ సింగర్ని పెళ్లిచేసుకుంది. అతను అప్పటికే ఇద్దరు భార్యలకి భరణం బాకీ పడి కోర్టు తగాదాలలో తలమునకలుగా వున్నాడు.అతని అప్పులన్నీ ఈమె తీర్చవలసి వచ్చింది.పైగా అప్పటికి తాను కూడా ఆలీఖాన్ తో కూతురి కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ డబ్బుఖర్చు లో వుంది.ఆ విధంగా ఆర్థికంగా చాలా నష్టపోయింది ఈ పెళ్లితో.

పైగా ఈ డిక్ హేమ్స్ ప్రవర్తన ఆమెను బాధించింది.పదిమంది లో పార్టీలో వుండగా అతనామెను చెంపదెబ్బ కొట్టాడు దానితో బయటకు వచ్చిన ఆమె మళ్లీ అతని మొహంచూడలేదు.ఆ నాలుగో వివాహం అలా మూడేళ్లకే( 1955) ముక్కచెక్కలయింది.

అయినా ఇంకా ఆమెకు గృహజీవితం మీద ఆశ చావలేదేమో 1958 లో జేమ్స్ హిల్ అనే చిత్రనిర్మాతని వివాహమాడింది.మళ్లీ అదే కథ అతనామెను పెట్టే శారీరక మానసిక హింసను తట్టుకోలేక 1961లో విడాకులు తీసుకుంది.

ఆమె నటప్రస్థానం విషయానికి వస్తే 1960 నుండీ ఆమె చిత్రాల సంఖ్య తగ్గి పోసాగింది.ఆమె సెట్లో డైలాగ్స్ సరిగా గుర్తు పెట్టుకోలేక పోతోందనీ,అందరితో అనవసరంగా గొడవలు పడుతోందనీ,ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందనీ దానికి ఆమె తీసుకునే ఆల్కహాల్ ప్రభావం కారణమనీ అనుకోసాగారు.అసలు కారణం 1980లో కానీ తెలియరాలేదు.

1970 ప్రాంతాలలో ఆమె సినిమారంగం నుండీ నిష్కృమించాలనుకుంది కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి రెండు సినిమాలలో నటించింది.1972లో వచ్చిన”ది రాత్ ఆఫ్ గాడ్ “ఆమె ఆఖరి సినిమా. అందులో చిన్న చిన్న డైలాగ్స్ కూడా గుర్తు పెట్టుకోలేక పోతుంటే ఆమె సంభాషణలను చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టి ఒక్కొక్క వాక్యమే నేర్పి చిలకపలుకుల్లాగా పలికించి సినిమా పూర్తి చేశారు.

1974లో ఆమె సోదరులిద్దరూ వేర్వేరు కారణాలతో మరణించారు. ఇది ఆమెకు తట్టుకోలేని దెబ్బ.మరింతగా ఆల్కహాల్ కి దాసురాలయింది. 1980లో  ఆమె ఆల్జీమర్స్ వ్యాథితో బాధపడుతోందని నిర్థారించారు.1981లో ఆమె వ్యాథి గురించి ప్రపంచమంతా తెలిసింది.కోర్టుకూడా ఆమె బాధ్యత ఆమె కూతురు యాస్మిన్ ఆగాఖాన్ కి అప్పగించింది. యాస్మిన్ ఆగాఖాన్ తల్లిని న్యూయార్క్ లో తనకు దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంది.

1987సం” మే 14వ తేదీన రీటా హేవర్త్ ఈ లోకం నుండీ శాశ్వతంగా శెలవు తీసుకుంది. అద్భుత సౌందర్యవతి, నర్తకీ, ప్రపంచ సినీ ప్రియుల “ప్రేమ దేవత”  అయిన రీటా హేవర్త్ జీవితం అలా ముగిసింది.

ఆమె సమాథి మీద ఆమె కూతురు  యాస్మిన్ ఇలా రాయించింది “నిన్నటి సహజీవనం కోసం– -రేపటికలయిక కోసం”!

*

రొంపిచర్ల భార్గవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు