చెలీ… ప్రేమలేఖ రాద్దామనే మొదలుపెట్టాను ఈ నిశీధి గీతంలో నిను వెన్నెలల్లే అల్లుకుందామని.ఈ వీధి నన్ను చీకటి నీడల బైరాగిని చేసిందని వాపోయాను ఆ అర్థరాత్రి. అంతర్గత ఆర్గానిక్ వేదనల శకలాలు లోపల రివ్వున సుడిగుండంలా తిరుగుతుంటే ఒళ్ళంతా చెక్కుకుపోతున్న ఒంటరితనంలో చీకటంతా నెత్తురులాగే చుట్టూ కమ్ముకున్న భయంకర నిశ్శబ్దంలో… ‘కన్నీరుల యింకిన గురుతులకై/ బూడిదలో నెత్తురు మరకలకై/ నేను వెదుకుతున్నానా”అని ఆరాటపడిన బైరాగి కాక మరెవరు గుర్తుకొస్తారు?
భయంతో, దిగులుతో, కోపంతో నలిగిన పదచిత్రాల intrinsic montage అల్లుకుంటున్నప్పుడు నేను దేహాన్ని ఉన్న చోటే వదిలి వలసపోయాను కదా…. అందుకే, ఇది ఒక ‘నిర్దేహ వలస గీతం’ కూడా.
కరోనావైరస్ సృష్టించిన ప్రాణభయంలో నేనొక్కడినే ఢిల్లీలో నా గదిలో ఒంటరిగా చిక్కుకుపోయాను. 2020 మార్చి 21 నుంచి లాక్ డౌన్. మాస్కులు కట్టుకుని అందరికీ ఎడంగా ఉంటూ… తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదోనని నిత్యావసరాలేవో వారం పది రోజులకు సరిపడా తెచ్చుకుని బిక్కుబిక్కుమంటూ టమాటలూ, ఉల్లిపాయలూ వేడి నీళ్ళలో కడుక్కుని వండుకుని తింటున్న ఒక విచిత్రమైన సందర్భంలో జీవితం నా కళ్ళ ముందు ఆవిష్కరించిన ప్రశ్నలెన్నో. నేనిక్కడ, నా భార్య ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో. ఎప్పుడు చూస్తానో తెలియదు. అంతకన్నా మించి వైరస్ అక్కడి నా ఇంటి గుమ్మం తడుతుందేమోనన్ని ఆందోళన. డ్రైవర్ ను కూడా నమ్మలేక మధ్యలో తెర కట్టుకుని వెనకు సీట్లో ఆఫీసుకు వెళ్తూ వస్తూ పని చేసుకుంటూనే ఉన్నాను.
ఓ రాత్రి ఆఫీసు నుంచి వస్తుంటే, యమునా నది వంతెన మీద వందల మంది కూలీ జనం సామాన్లు నెత్తి మీదో, భుజానో వేసుకుని ఇసక తుపానులా పరుగెత్తిన దృశ్యం. వలసలు… వలసలు… వలసలు… బతకడం కోసం వలసలు, ఎంచుకున్న స్థలంలో చావు కోసం వలసలు… దగా చేసిన వ్యవస్థల నడుమ మనిషి ఒంటరిగా నిలబడి కన్నీళ్ళతో చేతులు సాచి సాయాన్ని అర్థించిన క్షణం. బందీలం మనం.. భయానికీ, వంచనకీ, చివరికి ప్రకృతికీ అనుకుంటో ఆ రాత్రి నా భార్య లతకు, పిల్లలకు ధైర్యం చెబుతామని, లాక్ డౌన్ ఎత్తేయగానే, రైలో, బస్సో పట్టుకుని ఎలాగైనా వచ్చేస్తానని మాట ఇస్తూ ప్రేమలేఖ రాద్దామనే మొదలు పెట్టాను. కానీ, అదొక Interior monologue లా నా జీవితాన్ని వెనక్కీ ముందుకీ గిరగిరా తిప్పి కాగితం మీద పడేసిందని చివరి వాక్యం రాసేదాకా తెలియదు. అది చివరి వాక్యమనీ తెలియదు. అమ్మా నాన్నా ఊరూ దేశం పాపం పుణ్యం ప్రపంచమార్గం అన్నీ కలిసి ఇలా ఒక stream of subconciousness. దీన్ని నేనొక autobiographical poem అని అంటాను.
*
ఇదీ ఆ కవిత:
నిర్దేహ వలసపోత… An Intrinsic Montage
నీకో సంగతి తెలుసా? ఆలోచన… ఊటబావి గూడులో నిమ్మళంగా నిలబడ్డ ఊర పిచ్చుక వంటిదని? జ్ఞాపకం ఆ పిచ్చుక ముక్కున చిక్కిన రెల్లు గడ్డి పువ్వని? ఆకాశాన్ని కప్పుకున్న బావిలో నిర్దేహమై వీస్తున్నది నేనేనని. గదిలో ఒక్కడినే అరవై రోజులుగా. ఆకాశాన్ని పరపరా చింపేస్తూ ముళ్ల పందుల గుంపొకటి ఊళ్లో రెచ్చిపోయి తిరుగుతుందని అంతా తలుపులేసుకుని గొళ్లెం పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు నాతో సహా. మీకు తెలియదు కానీ, అక్కడ మీరున్న ఇంటి తలుపులు భద్రంగా మూసి బయట కాపలా నిల్చున్నదీ నేనే. ఎంత బాగుండేది… నువ్వూ నేనూ పిల్లలమూ కలిసి అలా వీధుల్లో తిరుగుతుంటే హైదరాబాదంతా పూల తోటయ్యేది. ట్రాఫిక్ అని విసుక్కుంటాం కానీ ఆ మరుక్షణమే పచ్చని అడవిలో కొమ్మల్నీ రెమ్మల్నీ పక్కకు వంచుతూ కోనేటి కోసం వెళ్తున్నట్లుండేది కదా. ఇప్పుడీ దిల్లీ నగరంలో నడక ఎంత దుర్భరంగా మారిందో తెలుసా? శూన్యం నుంచి శూన్యానికి చరిత్ర చెప్పిన మోసపు పాఠాలను మూటలుగా మోస్తూ సాగుతోందిక్కడ నడక. యమునా హైవే మీద చీకటి గాలులు చుట్టుముట్టిన భయాల్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వలస పాదాల కింద రక్త దాహార్తుల లాలసను చూశాను. తెగనిదారిలో తెగిపడ్డ దేహాల మీద ఉద్దీపన గీతాలు పాడుతున్న సిగ్గులేని నగ్నదేహాలను చూశాను. జెండాలకు రెపరెపలాడుతున్న దుఃఖాన్ని చూశాను. శవంలా ఊరేగుతున్న ద్వీపకల్పాన్ని చూశాను. ముళ్ల పందులు జాలి పడి అసహ్యించుకున్న జాతిని చూశాను. దేశమెప్పుడూ సామూహిక దేహం కాదనీ… దేశమూ ప్రజలూ వేరు వేరని మళ్ళీ మళ్ళీ తెలుసుకున్నాను.
చెలీ… ప్రేమలేఖ రాద్దామనే మొదలు పెట్టాను ఈ నిశీధి గీతంలో నిను వెన్నెలల్లే అల్లుకుందామని. ఈ వీధి నన్ను చీకటి నీడల బైరాగిని చేసింది. వలస జీవిని కదా? పాదాలు తెగిన వలస జీవిని కదా? ఎటువైపు మోకరిల్లినా నీ చెమ్మగిలిన నయనమే కనిపిస్తోంది. భూమిని అడుగుల్లో కొలుస్తూ ఆకాశాన్ని భుజానేసుకుని వెళ్తున్నవాడి గుండె బలం ముందు సోషల్ డిస్టెన్సుతో ముక్కూ మూతీ మూసుకున్న సిగ్గు మాలిన నిరాత్మ దుర్భర భారతమిది.
ప్రియా… ఆలోచన ఊర పిచ్చుక అనీ, జ్ఞాపకం అది ముక్కున కరచిపట్టిన రెల్లుగడ్డి పువ్వనీ చెప్పాను కదా. నిజానికది ఇనుప డెక్కల కింద నలిగి నలిగి లేచి నిలబడ్డ పువ్వు. దాన్ని తడిమి చూస్తే ఎర్రగా తగులుతుందని నీకూ తెలుసు. అది మా నల్లగొండ గొల్లగూడెం కట్ట మీద చిన్నప్పుడే కాలికి దిగి ఇప్పటికీ రక్తం చిమ్ముతున్న సర్కారు కంప. మగ్గం గుంటలో మా తాత కాళ్ళకింద తప తపా కొట్టుకున్న చిడతల పాట. మా నాయినమ్మ చేతిలోని రాట్నం కింద తిరిగే కొశ్శెటి ఇన్ప ముల్లు. ఇల్లూ ఊరూ కులం పనులూ వదిలి, గడీల నీడల పీడల్ని తెంపుకుని గుడ్డి దీపం వెలుగులో పుస్తకాలతో మెట్లు కట్టుకుని, పదహారూర్లు వలసపోయి మీసం మెలిపెట్టుకుని బతకడానికి మా బాపు చేసిన పోరాటం. ఆరుగురు పిల్లల కోసం మా అమ్మ మాకు గోరు ముద్దలుగా పంచిన తన జీవితం. వారిద్దరూ కలిసి నా గుండెలో నాటిన కన్నీటి కల. ఇంకా ఇంకా ఇంకా… జ్ఞాపకమంటే మన ప్రేమరాహిత్యపు క్షణాల నెత్తుటి చారిక. ప్యారడైజ్ సెంటర్లో అడుక్కోవడానికి చేతులు చాచిన పిల్లలు దానం చేసిన guilt hell. జ్ఞాపకం కొండలానో గుదిబండలానో ఉండదు. అది నా కట్టె మగ్గంలో అటూ ఇటూ కండెలా కొట్టుకునే గుండె.
ఇప్పుడిక్కడ ఆలోచన నల్ల రేగడి నేల అనీ… ఊటబావిని తోడుకొని ఇదే ఆకాశం కింద పత్తి చేనులా పరచుకుని విస్తరించి మిట్ట మధ్యాహ్నం పెరపెర లాడుతున్నదే జ్ఞాపకాల తోట అనీ… పోగులు పోగులుగా పేనుకుని కలనేతలా అల్లుకుపోతున్నా… బట్టలిప్పుకుని బజార్నపడ్డ ముసుగు మనుషులు ఎప్పుడైనా ఓ క్షణమైనా సిగ్గుపడి కప్పుకుంటారేమోనని.
ప్రియా… నన్ను నమ్ము. ప్రేమలేఖ రాద్దామనే మొదలు పెట్టాను ఈ నిశీధి గీతంలో నిను వెన్నెలల్లే అల్లుకుందామని. ఈ వీధి నన్ను చీకటి నీడల బైరాగిని చేసింది.
“కన్నీరుల యింకిన గురుతులకై*
బూడిదలో నెత్తురు మరకలకై
నేను వెదుకుతున్నానా?”
—
(రాత్రి 1.09 గంటలు, మే 24, 2020)
*ఆలూరి బైరాగి ‘జీవితం’ కవిత
Excellent guruvu garu. Very touching description of the disturbing time.
చాల బవుంది. కొవిడ్ రొజులు, బాగా గుర్తు చెసారు