వినోద్ మాట్లాడుతూనే ఉన్నాడు. సుచరితకు బోరు కొడుతోంది. ఎలా చెప్పడం? బాధపడతాడేమో?
ఇక తప్పదనిపించింది.
“వినోద్. కొంచెం పనిలో ఉన్నాను…. తర్వాత మాట్లాడదామా?’
‘తర్వాతా? ఎలా కుదురుతుంది సుచీ… మా ఆవిడ వచ్చేస్తుంది. పిల్లలొచ్చారంటే ఇక చెప్పనక్కర్లేదు… నా ఫోన్ కూడ నా దగ్గరుండదు’ నిస్సహాయంగా అన్నాడు వినోద్.
“ఊష్…. మా అత్తగారు ఊళ్లో ఉన్నారని చెప్పానా? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావంటే ఏం చెప్పాలి?’ ఇంతకాలానికి అత్తగారు కూడ పనికి వచ్చినందుకు ఆనందం కలిగింది సుచరితకు. జందెంపోగుని గిరీశం ఎందుకు మెచ్చుకున్నాడో అర్థమైంది.
“ఓహ్… సరేలే… రేపు మళ్లీ…. ‘పెట్టేశాడు. సుచరిత నుదురు కొట్టుకుని నిట్టూర్చింది.
తను వినోద్‌తో ఇలా మాట్లాడుతుందని ఏడాది కింద ఊహించగలిగేదా? వినోద్ కూడ ఇంత త్వరగా ఫోన్ పెట్టేసేవాడా?
అప్పుడు…ఎంత ఉత్సాహం వినోద్‌తో మరో అరగంటలో మాట్లాడతానంటే? కాస్సేపు ఫేస్‌టైంలో, కాస్సేపు ఉత్తి ఫోన్‌లో ఇద్దరూ ‘జల్‌తే హై జిస్‌కేలియే’లా పాటలు పాడుకుంటూ, విరహం వెళ్లబోసుకుంటూ, స్పర్శించకుండానే స్పర్శను అనుభవిస్తూ……
__
అసలు వినోద్‌ని తను చూసిందే ఒక గజల్ ప్రోగ్రాంలో. అంటే ప్రణయాన్ని సుస్వరాలలో పొదిగించిన వాతావరణంలో. రవికి గజల్ ఇష్టం లేదు. అతనికి అసలు పాటల మీదే పెద్ద ఆసక్తిలేదు. తన ఛార్టర్డ్ అక్కవుంటెన్సీ గోల తప్ప మరేదీ పట్టదు. ఊళ్లోవాళ్ల ఇన్‌కమ్‌టాక్సులు చేసుకుంటూ ఏమానందమో! ఉద్యోగంగా చూస్తే ఫర్వాలేదు; కానీ అదే తన జీవిత లక్ష్యంలా ఉంటాడు. దానిమీద పుస్తకాలు కూడా రాస్తాడు. తను అసలు అతన్ని అడగను కూడ అడగదు ఇలాంటి ప్రోగ్రాంలకు రమ్మని. తను ఒక్కతే వెళ్ళినా రవి ఏ అభ్యంతరమూ చెప్పడు.
“నీకిష్టమైంది నువ్వు చెయ్యి. నాకిష్టమైంది నే చేస్తా’ ఇదే అతని పాటల పల్లవి. అలాగే ఆ రోజు శిల్పకళావేదికలో గులాం అలీ గజల్ కార్యక్రమం ఉందని తెలిసి, ఒక్కతే బయల్దేరింది. ఆ పాటలో తలమునకలౌతూ …
“ఈరోజు ఛుప్‌కే ఛుప్‌కే పాడకుండా ఉంటే బాగుండు’ వెనకనుంచి వినిపించి తెల్లబోయి తలతిప్పి చూసింది. సన్నగా, పొడుగ్గా, చామనచాయలో ఉన్న ఒకతను కనిపించాడు. గులాం అలీ కి గుర్తింపులాంటి పాట అది. దాన్ని పాడకుండా అతను కచ్చేరీ చేస్తాడా? తను వెనక్కి తిరగడంతో అతని చూపు తనపై పడింది. వెంటనే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టుగా అన్నాడు
“ఐ మీన్.. ప్రతిసారీ అది పాడి తీరాలనేం లేదు కదా. ఇంకెన్నో పాటలు బాగా పాడతాడుగా..” ఇంతలో ఎవరో ‘హూష్’ అని ఉరమడంతో సుచరిత వెనక్కి తిరిగేసింది. అతను నోటిమీద వేలుపెట్టుకోవడం చూసి నవ్వొచ్చింది. గులాం అలీ ఏమనుకున్నాడో తెలీదు గానీ, ఎప్పటిలాగే ప్రేక్షకుల నుంచి ‘ఛుప్‌కే ‘ డిమాండ్ మొదలైంది. చిరునవ్వు నవ్వి పాడాడు. అతను ఆ పాట మొదలుపెట్టగానే సుచరిత వెనక్కి తిరిగి అతని కేసి చూడకుండా ఉండలేకపోయింది. కళ్లుకలిశాయి. అతను మందహాసం చేశాడు. అతని చిరునవ్వు సమ్మోహనంగా ఉంది. ఇంటికి బయల్దేరుతూండగా తన కారు పక్కనే పార్కు చేసిన కారు తలుపు తెరుస్తూ అతను కనిపించాడు. ఇద్దరూ పలకరింపుగా నవ్వుకున్నారు.
‘మొత్తానికి ఆ పాట పాడక తప్పలేదు కదా’ అంది సుచరిత.
‘మనవాళ్లంతే లెండి. అయినా అక్కడికొచ్చిన వాళ్లకు నిజంగా గజల్ గురించి పెద్దగా తెలిసుండదు. ఏవో ఒకటి రెండు వింటారు. బాగా తెలిసినట్టు పోజు కొడతారు. ఎవరితో సంభాషిస్తున్నా ఆ ఒకటి, రెండు అలా యథాలాపంగా చెప్పినట్టు చెప్పేసరికి వీళ్లేదో గజల్ పండితులైనట్టు కనిపిస్తుంది. ’ వినోద్ చెప్పింది నిజమేననిపించింది సుచరితకు. ఆరోజు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న వేళావిశేషం. రోజూ పలకరించుకోనిదే ఉండలేని స్థితికి వచ్చారు.
ఓ నెలరోజుల తర్వాత రెండు మూడు రోజులకొకసారైనా చూసుకోకుండా ఉండలేని స్థితికి వచ్చారు. చూపులతో, మాటలతో సరిపెట్టుకోలేని స్థితికి రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఇద్దరికీ ప్రేమంటే తెలుసు; పెళ్లంటే తెలుసు. దాంపత్యజీవితంలోని ఆనందమూ, ఉత్సాహమూ అనుభవిస్తున్నవారే. అందుకే ఈ ఆకర్షణ దేనికి దారితీస్తుందో ఇద్దరికీ తెలుసు. ఇంతకాలం తమ సహచరులతో గడిపిన జీవితమంతా వ్యర్థమన్నంతగా కమ్ముకొస్తున్న ఈ భావోద్వేగం, వాంఛ ఎలాంటివి?
అదొక అద్భుత లోకం; శరీరాన్ని, మనసునూ కూడా నిత్యపారవశ్యంలో ముంచేసే ఉత్సాహం. రహస్యప్రణయంలోని మాధుర్యం. స్వంతవాళ్లు అపరిచితులై, తామిద్దరూ ఒకటయ్యే అపురూప క్షణాలు. ఇంతకాలం ఆనందాన్నిచ్చిన పిల్లల సాంగత్యం, సహచరుల ప్రేమ అర్థరహితమై, అసహజమై, తాము కలుసుకున్న క్షణాలే సహజమైపోయిన మనస్థితి.
నిరంతరం ఫోన్ల కోసం ఎదురుచూపులు. ఏకాంతంలో కలుసుకునే క్షణాల కోసం నిరీక్షణ. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లినా, పెళ్లళ్లల్లో, విందు వినోదాల్లో మునిగితేలుతున్నా, అదంతా తాత్కాలికమైనట్టు, అతనితో మాట్లాడే గంటలే శాశ్వతమైనట్టు……ఆమె ప్రేమనింపుకున్న చూపులే తన భవిష్యత్తయినట్లు……
రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. సంవత్సరం దాటింది. ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చిందా? ఏమో… ఎవరికి పట్టింది కనక? తెలిస్తే ఏమవుతుంది? పదేళ్ల దాంపత్యం కూలిపోతే? ప్రాణంగా ప్రేమించే పిల్లలు దూరమైతే? స్నేహితులు వదిలేస్తే? సమాజం వెలివేస్తే? ఆఫీసులో నవ్వులపాలైతే?
అవన్నీ నిజంగా ఆలోచించాల్సినవా? పట్టించుకోవలసినవా? తామిద్దరూ కలుసుకునే ఆ రెండుగంటల కంటే అవన్నీ ముఖ్యమా? ప్రతిసారీ కొత్త హోటల్ ని వెదుక్కోవడంలో, ఇంట్లో రకరకాల అబద్ధాలు చెప్పడంలో ఉన్న ధ్రిల్. ఒకరి సమక్షంలో ఒకరికి కలిగే అపరిమితమైన ఆనందం…ఒకే అభిరుచులతో ఒకటైన మనసులను మోహంతో మరింత దగ్గర చేసిన అనుభవం… తక్కిన వాస్తవాలన్నీ అబద్ధాలనిపించే భ్రాంతిలో ఏడాదిన్నర గడిచింది.
అప్పుడు మొదలైంది నిస్పృహ… ఇలా ఎంతకాలం? మొదట్లో సరదాగా అనిపించిన అబద్ధాలు ఇప్పుడు చికాగ్గా అనిపిస్తున్నాయి. ఇన్ని అబద్ధాలు చెప్పి, దొంగతనంగా కలుసుకోవడం అవసరమా అనిపిస్తోంది. ఏమీ తెలియక ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉన్న జీవిత భాగస్వాములను కళ్లలో కళ్లు పెట్టి చూడలేని అపరాధభావం ఎప్పుడు మొదలైందో ఇద్దరికీ తెలీదు. వాళ్లిద్దరికీ నిజంగా అనుమానం లేదా? తెలిసిపోలేదా? ఈ సందేహం ఇద్దరి మధ్యా అడ్డుగోడైంది.
పోనీ, తామిద్దరూ నిజంగా ఎప్పటికీ ఇద్దరు కలిసుండే అవకాశం ఉందా? దానికి చెయ్యాల్సిన త్యాగాలు ఎన్ని? అన్ని త్యాగాలవల్ల కలిగే సుఖమెంత? ఇది ఇద్దరికీ ఇష్టం లేని సంభాషణ. అయినా కలుసుకున్న ప్రతిసారీ అనివార్యంగా మొదలవుతున్న సంభాషణ.
__
మరో రెండు నెలలకు…..ఫోన్ మోగింది. సుచరిత భయపడుతూనే తీసింది…. కొంతకాలం క్రితం అత్యుత్సాహంగా తీసిన ఫోను… ముఖంలోకి ఆనందం రాకుండా నియంత్రించుకుంటూ యథాలాపంగా తీసిన ఫోన్…. ఇప్పుడు భయపడుతూ…
‘సుచీ…..నువ్వేమీ అనుకోనంటే…”
“ఫర్వాలేదు.. చెప్పు”
“రేపు జగ్‌జీత్‌సింగ్ ప్రోగ్రాంకి వెళ్దామనుకున్నాం కదా…. రాలేననుకుంటా….’
తన గొంతులో రిలీఫ్ ధ్వనించకుండా జాగ్రత్తగా అంది’ ఏం? వేరే పనివచ్చిందా?’
నవ్వు అటువైపు నుంచి. ‘పనికాదు… శాంతి సినిమా ప్రోగ్రాం పెట్టింది. తనతో కలిసి బయటకు వెళ్లి ఏడాది కావస్తోందని గుర్తు చేసింది…’
సుచరిత నవ్వింది. ‘నేనే చెప్దామనుకున్నాను. రేపు తన కొలీగ్స్ తో డిన్నర్ కు వెళ్లాలన్నాడు రవి. ఏడాదయింది ఇలాంటి బిజినెస్ డిన్నర్లకు వెళ్లి…..’
నిశ్శబ్దం… ఆ నిశ్శబ్దాన్ని ఇద్దరూ ఛేదించలేదు.
__
బావుంది
వో అఫ్సానా జిసే అంజామ్ తక్ లానా న హో ముష్కిల్
ఉసే ఇక్ ఖూబ్‌సూరత్ మో్ డ్ దేకర్ ఛోడ్‌నా అచ్ఛా – అని సాహిర్ లుఢియాన్వీ అన్నందుకు అంత అపురూపంగానూ ఉంది – ముగింపు.
నిజం చెప్పాలంటే – ఇద్దరికీ కలిగిన కనువిప్పూ లేదు, మరోసారి మరో రకంగా మరొకరితో చెయ్యరనీ లేదు.
ఆ సంవత్సరపు ఆనందం నిజం, కాని దాని కాల పరిమితి అంత కంటే
లేదన్నదీ – అంతే నిజం.
ఏ రకంగా చూసినా చెప్పదగ్గ, చదవదగ్గ – అందమైన కథ.
చాలా బావుంది.ఆ ఆకర్షణే వ్యామోహమై,వ్యసనమై ఇంతలోనే దారి తప్పి …వెనక్కి చూసుకుంటే అంతా చీకటి…ముగింపు చక్కగా ఉంది..అటువంటి భ్రమలో ఉన్నవారికి కనువిప్పు కలిగించేలా ఉంది..(ఊబిలో కూరుకోకముందే)