“నాలుగు రోజులు గడిచి ఉంటాయి… నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించి… నాలుగు రోజులేనా…? ఏమో…? ఉచ్ఛ్వాస నిశ్శ్వాసల నిండా భరించలేని ఆసుపత్రి వాసన… శరీరం అలవాటు పడినట్టుంది…. శరీరం, మనసు, మెదడు… అన్నీ.. అన్నీ… ఒక పెద్ద మత్తు జాడిలో ముంచి మూతపెట్టినట్టు….”
దేహంలో రక్తం వేడిగా ఉన్నప్పుడు, మకుటంలేని మహారాజులా మనదైన సామ్రాజ్యాన్ని మనం ఏలుతున్నప్పుడు అహంకారంతోనో, గర్వంతోనో కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, కింది ఉద్యోగులను, పరిచయస్తులను మన మాటే శాసనంగా శాసిస్తాం. కరుకైన మాటలతో పీడిస్తాం. అది అలాగే కావాలని పట్టుపడుతాం. మన అభీష్టానికి వ్యతిరేకంగా ఏమి జరిగినా సహించం. ఓర్చుకోలేము. భరించలేము. ఇది తప్పని మన అంతరాత్మ హెచ్చరిస్తున్నా దాన్ని అణగదొక్కి మన మాట నెగ్గించుకుంటాం.
కానీ ఏ కరోనా కాటుకు గురైనపుడో, ఎయిడ్స్ వ్యాధి కబళించినప్పుడో, క్యాన్సర్ దెబ్బకో ఆసుపత్రి పాలై తనువు రోజుక్కొంచెం నశించి పోతుంటే, శరీరం నిండా క్రిములు, పురుగులు పడి దేహాన్ని రోజు కొంచెం తొలుస్తుంటే.. చివరి అంచు మీద నిలబడి మరణశయ్య మీద ఆఖరి ఘడియలు లెక్కబెడుతున్నప్పుడు మన దర్పం, మన అధికారం, అహంకారం అన్నీ మాయమైపోయి పై ముసుగులన్నీ తొలగిపోయి నిజమైన మనిషిలా నగ్నంగా నిలబడుతాము. అయ్యో అప్పుడు అలా చేసి ఉండకుంటే బావుండు. ఇంకొంచెం బాగా చేసి ఉంటే బావుండు. అతడిని ఆశల హిమాలయ పర్వతం ఎక్కించి అక్కడి నుంచి క్రూరంగా కిందికి నూకేశానే అలా చేయకుండా ఉంటే బావుండు అని పశ్చాత్తాప పడుతాం. కానీ అప్పటికే పుణ్య కాలమంతా గడిచి పోతుంది. ఆ చివరి క్షణాల్లో ఎవరికి ఏం చెప్పాలో, ఎవరిని క్షమాపణ అడగాలో, ఎవరి ముందు మోకరిల్లాలో దిక్కు తోచదు. ఇలాంటి మనిషి ఆఖరి క్షణాలల్లోని మానసిక సంఘర్షననంతా అక్షరాల్లోకి అనువాదం చేస్తే ‘ప్రియమైన దెయ్యం’ కథ అవుతుంది.
కథ ప్రియమైన దెయ్యం చదవండి!
కథకుడు ఏదో రోగం బారిన పడి ఐ.సి.యు.లో చేర్చబడుతాడు. నోట్లోంచి, ముక్కులోంచి, మిగిలిన శరీర భాగాల నుంచి ఎన్నో రకాల పైపులు తొడగబడి ఉంటాయి. శరీరంలోని శక్తి అంతా హరించుకుపోతుంది. దృశ్యాలన్నీ మసక మసకగా కనిపిస్తుంటాయి. కథకుని కొడుకు మహీధర్ డాక్టర్ తో ఏదో సీరియస్ గా చర్చించుకుంటూ కథకుడు పడుకున్న బెడ్ వైపు వస్తుంటాడు. ఇంతలో వాళ్ళిద్దర్నీ తోసుకుంటూ తెల్లని దుస్తులు ధరించి, తెల్లని వెలుతురుతో ‘దెయ్యం’ ఒకటి వచ్చి కథకుని పక్కనే స్టూల్ మీద కూర్చుంటుంది. అతనిలాగే చాలా శుష్కించి పోయి ఉంటుంది.
ఈ ‘దెయ్యం’ కథకునికి తన ఆరవ యేట పరిచయం అవుతుంది. అప్పటి నుంచి ప్రతి సందర్భంలో, ప్రతి మూల మలుపులో కథకుడి వెంట ఉండి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తూనే ఉంటుంది. గోళీలాటలో తొండి చేసి సతీష్ గాడిని మోసం చేస్తున్నప్పుడు, సరోజను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసినపుడు, ఆఫీస్ లో కాంట్రాక్టర్ తో చేతులు కలిపి అవినీతికి పాల్పడినపుడు, కొడుకు కులాంతర వివాహం చేసుకున్నపుడు, కన్నతల్లి ఆసుపత్రిలో ప్రాణం పోయే స్థితిలో ఉండి కొడుకును చూడాలని కలవరించినపుడు కథకుడు ఆమె ఆఖరి కోరికను కూడా నెరవేర్చనపుడు… ఈ అన్నీ సందర్భాల్లో ఈ ‘దెయ్యం’ పక్కనే ఉండి ఏది చేయాలో, ఏది చేయకూడదో చెప్తుంది. కొన్ని సార్లు కథకుడు వినక పోతే మొహం మీదే ‘థూ..’ అని ఉమ్మేసి పోతుంది. ఇంతకు ఈ ‘ప్రియమైన దెయ్యం’ ఎవరు? ఆ దెయ్యం చెప్పినట్లు విని వుంటే కథకుని జీవితం ఏ వెలుతురు దారిలో పయనించేది? ఏ సుఖ తీరాలకు చేరేది? ఇదంతా తెలుసుకోవాలంటే మనం కూడా ఆ తెల్ల దెయ్యాన్ని కలుసుకోవాల్సిందే. దానితో ముచ్చటించాల్సిందే.
ఒక వృద్ధుడు చావు బతుకుల్లో బెడ్ మీద ఉండి గడిచిపోయిన తన జీవితాన్ని సమీక్షించుకోవడమే ఈ ‘ప్రియమైన దెయ్యం’ కథలోని వస్తువు. ప్రతి మనిషి తన అవసాన దశలో తప్పనిసరిగా చేరుకోవాల్సిన ఒకానొక దశను కథకుడు కథగా మలిచిన తీరు అద్భుతం. జీవితాన్ని ఎన్ని వేశాలతో, ఎన్ని ఆవేశాలతో, ఎంత మేకపోతు గాంభీర్యంతో గడిపినా ఏదో ఒక దశలో మనకు మనమే రియలైజ్ అయి అలా చేసి ఉండాల్సింది కాదేమో అనే ఒక మీమాంసలో పడిపోతాం. ఈ సంక్లిష్ట మానసిక సంఘర్షణే ఈ కథ. కథా కాలం కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే. అంటే కొన్ని జ్ఞాపకాల దొంతర. తన జీవిత కాలంలో ఆయా సందర్భాలలో తను ఎందుకు అలా ప్రవర్తించాడు. అలా కాకుండా ఇంకోలా ప్రవర్తించి ఉంటే జీవితం మరింత బావుండేదేమో అని పశ్చాత్తాప పడటమే ఈ కథ. కథా వస్తువు అతి సాధారణమైందే కానీ దాన్ని కథగా తీర్చి దిద్దిన తీరుతోనే కథ కొన్నాళ్ళు పాఠకుడి మనసులో ఉండి పోతుంది.
ఎన్నో కోణాల్లో మనిషిని లిట్మస్ పరీక్షకు గురి చేసే కథ ఇది. చివరిసారిగా కనిపించుమని వేడుకున్న కన్నతల్లి ఆఖరి కోరికను కాదన్న స్వార్థ పూరిత కొడకు వారసత్వాన్ని అందుకున్న ఈ తరం కొడుకు కూడా వాళ్ళ నాన్నలాగే మీకు ఫోన్ చేయడం తప్ప నాకు వేరే పని లేదా అనేంతగా నిర్దాక్షిణ్యంగా తయారు కావడం. మనుషుల కన్నా స్థిరాస్తులే మిన్న అనుకోవడం, తల్లి బతికినంత కాలమే తండ్రి కొడుకుల సంబంధం నిలబడేంత బలహీనంగా తయారైన విధానం, బాల్యంలోనే విత్తబడిన కుట్ర, మోసం అనబడే విత్తనాలు పెరిగి పెద్దవుతుంటే మహా వృక్షాలుగా బలపడిపోవడం, ప్రేమించేటపుడు అడ్డురాని కులం పెళ్లి చేసునేటపుడు అడ్డురావడం, ఆస్తి, కులాలను పట్టుకొని వెళ్లాడే కుచ్చితత్వం ఇలా అనేక సందర్భాల్లో మనిషి ప్రవర్తన తీరుని వస్త్రగాలం పట్టిన కథ.
కథలో వస్తువుకన్నా శిల్పానిదే పై చేయి. ఆధునిక కథలో ఏం చెప్పాడన్నదానితో పాటు ఎలా చెప్పాడన్నది కూడా ముఖ్యం. అందుకే ఈ కథ ఒకసారి చదివితే మనల్ని విడిచిపెట్టదు. కథ చెప్తూనే కథకుడు కథలో అనేక ఖాళీలను వదిలిపెట్టాడు. అందులో సంచరించే పాఠకులు ఎవరి అవగాహన తీరుతో వారు ఆ ఖాళీలను పూరించుకుంటారు. ఆసుపత్రిలో బెడ్ దగ్గర మొదలైన కథ అక్కడే ముగిసిపోతుంది. సంక్షిప్తత, గాఢత, ఒక్క వాక్యం కూడా అదనంగా లేకుండా మంచి బిగువుతో రాశాడు కథకుడు. సామాజిక సంఘర్షణలను, మానవీయ సంబంధాలను చెప్పీ చెప్పకుండా చెప్పడమే కథలో బాగా ఆకట్టుకుంటుంది.
తన ‘ప్రియమైన దెయ్యం’ను ఎలాంటి చేతబడి చేయకుండానే మన మనసుకు ఎక్కించిన కథకుడు కోడూరి విజయ కుమార్. కవిగా ప్రసిద్ధులైన కోడూరి ఇప్పటిదాకా ‘వాతావరణం’, అక్వేరియంలో బంగారు చేప’, ‘అనంతరం’, ‘ఒక రాత్రి మరొక రాత్రి’, ‘రేగుపండ్ల చెట్టు’ అనే కవితా సంపుటాలను వెలువరించాడు. రెండు నాటికలు, కొన్ని సాహిత్య వ్యాసాలు, సమీక్షలు రచించాడు. కవిత్వానికి పలు పురస్కారాలను అందుకున్నాడు. 12 కథలు కూడా రాశాడు. అవన్నీ త్వరలో పుస్తక రూపంలో పాఠకుల ముందుకు రానున్నాయి. ఈ కథ మొదటిసారి ‘వార్త’ ఆదివారం అనుబంధంలో 25 డిసెంబర్ 2011లో ప్రచురింపబడింది.
*
సార్ మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈలాంటి పరిస్థితి ఎదుర్కుంటాడు కాని ఈ కరోన వల్ల కొంత తొందరగ మేల్కొవాల్సి వస్తుంది
ఈ కథ వల్ల మీ సమీక్ష వల్ల కొంతలో కొంతైనా
మార్పువస్తుందని ఆశిస్తునాను. చాల బాగ రాసారు శ్రీధర్ గారు.
బాగా వున్నపుడు నా అంతటివాడులేడు అనే మనిషి నైజం…అతడికే బాగులేనపుడు కుచించుకుపోయి..న..మనిషి నైజాన్ని కథకుడు చిక్కగరాసాడు.
అతగాడేనా ఇతడు…అని అన్పిస్తాడు…కవిగానేకాదు కథకుడుగానూ మంచిగరాయగలడు అనేది నిరూపించారు రచయిత…
Thank You శ్రీధర్ గారు …
ThanQ Afsar
కథ పూర్తిగా చదవాలనుకునే మిత్రుల కోసం ఇక్కడ లింక్ ఇస్తున్నాను
http://bangaaruchepa.blogspot.com/2011/12/blog-post_26.html?m=1
చక్కని విశ్లేషణ శ్రీధర్ గారు
శ్రీధర్ గారూ.. చాలా సూటిగా, స్పష్టంగా, కథ పై ఆసక్తి కలిగేలా, కథలోని అంశాన్ని క్లుప్తంగా, క్లూ ఇస్తూ… రాశారు.
సమీక్ష బాగుంది సార్… కథను చదవాలనే ఆసక్తిని కలిగించింది
చక్కని కథ సమీక్ష మనిషి తనను తాను మరిచి పోయి రోగగ్రస్థుడైనప్పుడే గాని తను ఏంటి అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది రచయిత కథను మలిచిన తీరు మరియు మీ యొక్క విశ్లేషణ చాలా బాగుంది Sir
కథ అనేది పాఠకుడిని తనకు తాను విమర్శ చేసుకునేదిగా ఉండాలి. ఈ కథలో ఆ లక్షణాలు ఉన్నాయి . అలాంటి కథను ఈ సంక్షోభ సమయంలో మరొక సారి గుర్తుకు తేవటం బాగుంది అన్నా.
కథాపూలను పూయించడంతో పాటు వేర్వేరు పుష్ఫాల్లోని సుగంధాన్ని నలుగురికి పరివ్యాప్తింపజేయడంలో చేయితిరిగిపోయిన వెల్ధండి మరో సునిశిత విశ్లేషణ ఈ ప్రియమైన దయ్యంపై చేసిన సమీక్ష. కప్పిచెప్పడం చేతనైనట్లే విప్పిచెప్పడంలోనూ.. నిష్ణాతుడీయన. కోడూరివారి కథలన్నీ చదవాలనిపించేంత ఉత్సుకతను రేకెత్తింపజేసిన విశ్లేశకుడికి, కథారచయితకూ… అభినందనచందనాలు.
ప్రతి మనిషికి మంచి, చెడు అనే లక్షణాలపై జీవితం నడుస్తుంది. మతిస్థిమితం, కోమాలో ఉన్న వారికి, పసిపిల్లలకు తప్పితే కొంచెం ఇంగితజ్ఞానం ఏర్పడిన ప్రతి ఒక్కరికి ఏది మంచో, చెడో గ్రహించే మానసికశక్తి ఉంటుంది. మంచి అనేది మనకు జరగాలని, మనకు మాత్రమే జరగాలని కోరుకునేవారే ఎక్కువమంది. చెడు ఏమాత్రం కలుగకూడదని ప్రార్థించేవారే అందరూ. కానీ చెడు అని తెలిసినా చేసే వాళ్ళు కొందరుంటారు. ఈ చెడు చేసే వారికి చెడు చేయాలని ఉద్దేశం లేకున్నా, కొన్ని అవసరాల రీత్యా, స్వార్థం దృష్ట్యా, తప్పదని భావించుకొని చేస్తారు. కొందరు ఓటమి పొందడం ఇష్టం లేక, అహం అడ్డు వచ్చి చెడు చేయడానికి వెనుకాడరు. ఈ చెడు వలన అప్పటికప్పుడు కలిగిన ఆనందం, హోదా జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి డబ్బును సంపాదించవచ్చు. చెడు చేసే వారు మన చుట్టూన్న సమాజం, బంధుమిత్రులు మనల్ని గమనించడం లేదనుకుంటారు. మనం సరైన దారిలోనే వెళుతున్నాం అనుకుంటారు. కానీ ఎవరు చేసే పనులకు వారి అంతరాత్మనేది ఎప్పటికప్పుడు తప్పు చేసినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒప్పని అంతరంగం చెబుతూనే ఉంటుంది. ఈ అంతరాత్మ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. జీవితంలో అన్నీ అనుభవించాక లేదా అనుకోని ఆపద జరిగినప్పుడు ఈ మంచి గురించి ఆలోచించడం సర్వసాధారణం. మనం మంచిగా ఉండాల్సింది. అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని అనుకుంటాం. ఏది కూడా మనకు తెలియకుండా జరగలేదన్నది సత్యం. ఇలా ఎవరికి వారు జీవిత చరమాంకంలో ఎంతో ఆత్మక్షోభకు గురవుతారు. అలా గురైన వ్యక్తే హాస్పిటల్ లో ఉన్న వ్యక్తి. వారి ఆత్మనే ప్రియమైన దెయ్యం రూపంలో ఉన్న ఆత్మ. తన ఆత్మనే ఎన్నిసార్లు మంచిని చెప్పిన, నీ నడవడిక తప్పని, నీవు ఎంచుకున్న మార్గం సరైంది కాదని ఎదిరించి మొఖం మీద ఉమ్మేసి చెప్పిన హాస్పటల్లో ఉన్న వ్యక్తి అహంతో, గర్వంతో, స్వార్థంతో ఉమ్మిని తుడుచుకున్నాడే తప్ప, తప్పును ఒప్పుకొని, అందరూ ఒప్పుకునే, మెచ్చుకునే మెప్పును మాత్రం పొందలేకపోయాడు. రచయిత కోడూరి విజయకుమార్ ప్రతి పాఠకుని, వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని హెచ్చరించిన, మంచిని బోధించే విషయాన్ని ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నాడు. ప్రతి వ్యక్తి నిత్యం జీవన పోరాటంలో బ్రతకడం దుర్భరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అడుగడుగునా ప్రతిరోజూ, ప్రతి చోట తప్పు చేసే అవకాశం లభించవచ్చు. అయినా వాటన్నింటిన్ని ఛేదించుకుని ఎవరైతే తప్పు చెయ్యరో వారి జన్మ సార్థకమయినట్లు లెక్క. ఈ కథ మన జీవితంతో అన్వయించుకొని అందరూ మెచ్చని జీవితాన్ని కాదు. కనీసం మనకు మనం మన ఆత్మ మెచ్చే జీవితాన్ని గడపాలని, అప్పుడే మన జీవితానికి సార్ధకతని చెప్పే ప్రయత్నం ఈ కథ ద్వారా రచయిత చేశాడు. మన జీవితాలను సరిదిద్దుకోవడానికి, ఆలోచించడానికి చేసిన మంచి ప్రయత్నం ఈ కథ. ఇంత మంచి కథను, మన జీవితాంతం వెంటాడే అందించిన రచయిత కోడూరి విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఇంత మంచి కథను ఎన్నుకుని, అద్భుతమైన సమీక్ష రాసి మన ముందుకు తీసుకువచ్చిన డా” వెల్దండి శ్రీధర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
very inspirational, loved it.