ప్రార్ధన

నా గుడ్డలూ, రిక్షా ఎక్కే లెవిలూ, పొర్సులో డబ్బులూ చూసి ఆడు నా తిండిని అంచనా ఏసేడు.

మా ఇంటో అన్నాలు భోంచెయ్యటం అనేది రోజువారీ పెళ్ళి లెక్కన జరిగేది. రోజూ తినే మాసం కూర అయినా, పళ్ళెం ముందు కూకున్నా ప్రతీ తడవా ఆడెవుడో మార్కు వెయిన్స్ గోడి మైగ్రేషనాలజీ లెవిల్లో ఏదో కొత్త దేశంలో సరికొత్త చియ్యల కూర తింటన్నట్టే వుటది. దానికి తోడూ మాది తెల్ల దొరలూ, బెంగాలూ, కేరళా అసుంటి దేశాల నుంచి మా నాయన సావాసగాళ్ళూ, చెర్చీ నాయకులూ వొచ్చీ పోతా వుండే ఇలు కామట్టి సదువుకునే పుస్తకాలకూ, తినే తిండికీ ఏ రకమైన పట్టింపులూ దూరాలూ ల్యాకుండా అన్ని రకాలూ దొరికేయి. ఇద్దరుండా , మొత్తం పిల్లలంతా వుండా మాయింట్లో అన్నాలు మటికి అంతా కలిసే తినటం అలవాటు. ఎవుడికి ఆకలైనప్పుడు ఆడు తినే అలవాటు లేదు. ఒకేళ ఒకళ్ళకి తొందరగా ఆకలైతే మిగతా వోళ్ళు కూడా ఒక గంట ముందే తినటానికి ఎవుడికీ అబ్యంతరకం వుండేది కాదు. మా నాయనతో సహా అంతా కింద సాపలేసుకుని లైన్లో కూకుని తినటం ఎవురూ తప్పుజారి కూడా ఆప్సెంటు అయ్యేవోళ్ళు కాదు.   మా నాయన ఎప్పుడూ మాతో వరసలో కూకునే తినేవోడు. నాయన మజ్జలో కూకున్నా, చివరన కూకున్నా అమ్మ మటికి ముందు నాయన పళ్ళెం తీసుకుని అందులో అన్నం పెళ్ళలు సర్దినాకే మాకు మొదిటి కాడి నుండీ వరసలో పెట్టేది.
మా ఇంట్లో పెంచిన కోళ్ళకు జతగా మానాయనకు పేరీషు జనాలు మొక్కుబళ్ళుగా ఇచ్చిన కోళ్ళు గూడా  ఎస్ ఎఫ్ ఐ, పీడీయెస్ యూ కుర్రోళ్ళు చేసే స్ట్రైకులంత తెరిపి లేకుండగా వచ్చేవి. కాబట్టి మా ఇంట్లో సుట్టం వచ్చినా, జలుబు చేసినా కోడిని కొయ్యటం జెమినీ ఎర్ర పళ్ళపొడి ఏసుకుని పళ్ళు తోవుకున్నంత వీజీ. ఆరుగురు పిల్లల్లొ ఎవుడో ఒకిడికి జలుబు రాకుండా వుండే రోజులు గుంటూర్లో ఎండలు లేనన్ని సార్లు కూడా వుండేయి కాదు.
అట్టా అందరికీ అన్నాలు సర్ది దాని మీద లోతు గంటెతో కోడి పులుసు యలాంగ్ విత్ ఫేవరెట్ పీస్ వడ్డిచ్చినాక నాయన్ని పార్ధన చెయ్యమనేది.మా ఇంటో ఒక్కోడికి ఒక్కో ముక్కంటే పేణం. మా బుజ్జిగోడికి కార్జెం ముక్క కంపల్సరీ. మా ఆన్నయికేవో కందనగాయ, నాకు మటికి రొండు మెడ ముక్కలు ఎయ్యకపోతే పళ్ళానికి పరిశుద్దాత్మ వొచ్చి గాల్లో ఎగరాల్సిందే. నాయనకి మొటికీ ‘డ్డిము ‘ (చానా మది తెనాలి సదవర్లకుమల్లే అట్టా కొన్ని మాటల్ని తిరగేసి మాట్టాడే కళకారుడులే మా నాయన)  అంటే యమా ఇష్టం. కోడిని నరికేటప్పుడే ఆ పార్టును మొటికి కొద్దిగా పెద్దగా కొట్టే ట్రైనింగం మా మొగ పిల్లలు అందరికీ ఇచ్చేడు.
మా నాయన చానా నీతి కలిగిన మడిసి. ఎదురుగా పళ్ళెంలో వుడుకుడుకు వరిపెల్లలూ, ఆటి మీద పల్నాడు బెరస పుంజు ముక్కలూ మాకోసం నిలబడుకుని వుంటే మేం దేముడితో మాట్టాడతా అగమానం చెయ్యకూడదనే గ్యానం వుండా మారాజు. అందుకనే రొండు చేతులూ దండం పొదీషన్లో పెట్టి తలకాయ నూట పది డిగ్రీలు పైకి లేపి కళ్ళు మూసుకుని “ప్రియుడా , పరలోకపు తండ్రీ… ఈ సాయం సమయాన మా శ్రమ అంతటినిబట్టీ నువ్వు మాకు దయచేసిన ఈ ఆహారానికై నీకు వందనాలు. ఈ భోజనాన్ని మాకొరకు సిద్దపరచిన నీ సేవకురాలిని బహుగా ఆశీర్వదించు. ఆహరాన్ని తీసుకునే ఈ నీ బిడ్డలకు మెండైన ఆరోగ్యాన్ని దయచేయి. ఈ ఆహారాం వలన కలిగిన శక్తిని శ్రమకోసం ఖర్చుచేసే నిజాయితీని ఇవ్వు తండ్రీ… ఏసు నామములో అడుగుతున్నాం” అని ఒగిటిన్నర నిమషంలో ముగిచ్చేవోడు.
ఈ వియయంగా మా నాయనకూ అమ్మకూ మజ్జ ఒక రగశ్య కాంపిటీషనింగ్ నడిచేది. అంటే మాయమ్మకు దొబ్బున పార్ధన ముగిచ్చే అలవాటు వుండేది కాదు. మావూలుగా మాటేల బువ్వలు తిన్నాక ముసుగులు తన్నే ముందు చేసుకునే కుటంబ పార్దన అంటే మా మోకాళ్ళ మీద సిరిసాపల అర్రులు తెగేదాకా సాగే శిలువ కారెక్రెమం అని అనుకునేది మాయమ్మ. ‘ఈ సాయం – కాలమునా – ఏసు ప్రభున్- వేడెదము ‘ అనే పాటతో మొదులై, దావీదు మహారాజు రాసిన కీర్తనల గ్రంధం నుండి
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును
ఆయన నీ ప్రాణమును కాపాడును
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
అసుమంటి ఒక ఆదరణ వాక్యాన్ని మా పిల్లల్లో ఎవురో ఒకిరి చేత సదివిపిచ్చేది. మా కుటంబ పార్ధన ఇట్టా భక్తి చేసుకునే అందర్లాంటి టైము అని మీరనుకుంటే మటికి మీరు గోంగోర ఎండుతునకల సట్టిలో కాలేసినట్టే. మా ఇంట్లో కుటంబ పార్ధనా అంటే ప్రెతీ రోజూ వచ్చే యాన్నువల్ ఎగ్జాం అసుంటిది. వాక్యం సదివేటప్పుడు నట్లు పడ్డా, పలకటంలో తడబడ్డా, పార్ధన తరవాత ఆ సదివినోడి తలకాయ మీద తాశామారకా దరువు పడేది. మావూలుగా మాయమ్మ ముగింపు పార్ధన నలభై నిమషాలకు తక్కువ కాకుండగా వుండేది. ముందు ‘మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మ ప్రియ పరలోక తండ్రీ…’ తో మొదలై ఒక పది నిమషాలు ఆపకుండా, ఆశ్చర్య కరుడా, ఆలోచన కర్తా, నిత్యుడగు తండ్రీ, సమాధానమునకు అధిపతీ, మమ్మునుకాచువాడా, ఇమ్మానుయేలూ, వున్నవాడను అనబడినవాడా…. అట్టాంటి అచ్చబైబూలు భాషలో మా ఆఫీసు యాదమ్మ అప్పు అడగాల్సినప్పుడు నన్ను పొగిడినట్టు దేవుడ్ని పొగిడి, అప్పుడు మెల్లిగా మొదులు పెట్టుద్ది ఇరవై నిముషాల కన్నీటి ప్రార్ధన.. ఒక్కొక్క సంతానం పేరెత్తి, ఆళ్ళ సదువూ, ఆరోగ్న్యం, ప్రవర్తనా, ప్రార్ధనా, క్రైస్తవ భక్తీ… ఇట్టా ఏ రంగాన్నీ వదిలి పెట్టకుండగా ప్రభువు ముందు పరిచేస్తుంది. ఇక ఆఖరి పది నిముషాలు… చర్చీ, రాష్ట్ర, దేశ, ప్రపంచ నాయకత్వాల గురించీ, తమతమ విధుల్ని దేవునికి భయపడి నిర్వర్తించడానికి గ్యాణాన్నీ ఇవ్వమనీ, మంచి ఋతువుల కోసం, వానల కోసం, ఎండలు తక్కువగా వుంటానికీ, ఎండల్లో ముసిలోళ్ళు పరలోకానికి టిక్కెట్టు తీసుకోకుండా వుంటానికీ, మా పాడైపోయిన అవిస్కూలు లైబ్రీ బిల్డింగులో వుండే కస్తూరి మాత్తర్లు అమ్ముకునే యానాదుల కుటంబాల కోసం… ఇట్టా అన్ని ఇసియాలనూ మర్చిపోకుండగా దేవుడి టేబుల్ మీద ఫైల్ పెడుతుంది. అయ్యన్నీ అయిపోయాక ఇక ముకతాయింపుగా రేత్రికి మంచి నిద్రను దయచేయమనీ, తెల్లారి పెందలాడే లేపమని ఒక అలారం డ్యూటీ కూడా దేవుడికి అప్పజెపుతుంది. ఇయన్నీ ఇంటా లోపల్లోపలే మాయమ్మ మీద సణుక్కుంటన్నా మా మీద మర్చిపోకుండగా ఒక ఇంటర్ కాంటినెంటాల్ బాలాస్టిక్ స్కడ్ వదులుద్ది. ” నీ చిత్తమైతే ఉదయాన్నే పెందలాడే మమ్మును మంచి ఆరోగ్యంతో మేల్కొలపు, ఒక వేళ ఇదే చివరి రాత్రి అయితే మంచి మరణాన్ని దయచేయి తండ్రీ” అని ముగిచ్చుద్ది. ఇక మేమంతా మంచి మరణం అంటే ఏందో, ఎట్టా వచ్చుద్దో తెలవక మెల్లిగా పక్కల మీదకి ఒరిగిపోతాం. ప్రతీ రేత్రీ ఇక మనం నిద్ర లెగవమేమో అనే అనుమానంతో మగతలోకి జారుకుంటాం.
ఇదంతా జరుగుతున్నంతసేపూ మేవంతా కింద పరిచిన సిరిసాపల మీద మోకరిచ్చి కళ్ళు మూసుకుని పడుండాలి. ఎక్కువగా కదిలిన సప్పుడైతే సగం పార్ధనలోనే ‘ఏయ్ ‘ అని ఒక్క రంకె ఏసేది ఆతల్లి. ఆ కేకంటే మాకు నడి నిద్దర్లో కూడా ఎకరం మడి తడిసిపోయేది. ఇసుమంటి సైబీరియా జైలు పార్ధనలో కూకున్న మొదిటి అయిదు నిముషాలు బాగానే వుంటది. ఆరో నిముషం నుండీ మోకాళ్ళ మీద తోలు మంట పుట్టటం మొదులు పెట్టుది. అది మెల్లి మెల్లిగా పెరిగి బ్లేడుతో ఎవురో కోస్తన్నా నెప్పి లెవిల్ కి పెరుగుద్ది. అట్టా పెరిగీ పెరిగీ ఆ నలభై నిమషాల పార్ధన అయిపోయే తలికి మోకాళ్ళు మొద్దుబారి మనకి మనవే గాల్లో తేలిపోతన్నట్టూ, ఆకాశంలోకి ఎగిరి ప్రభువు ఆత్మలో ఐక్యం అయిపోతున్నట్టూ, వంటికి బాధా, నెప్పీ ఏదీ తెలవని ఒక పరలోక అనుభవంలోకి ఎల్లిపోతాం.
ఇసుమంటి స్టూవార్టు పురం పోలీస్ ట్రీట్మెంట్ తప్పిచ్చుకోటానికి మా అన్నాయిగోడు ఒక ఎత్తు ఎత్తేవోడు. మాయమ్మ బాగా కాన్సంట్రేషన్ తో పార్ధన చేత్తా వున్నా పదో నిమషం లో మెల్లిగా ఎవురూ సూడకుండగా మోకాళ్ళ మీద నుంచి లెగిసి బాసాంపట్టా ఏసుకుని కూకుని, పార్ధన స్తుతి అనే శైశవ దశ దాటి, అవసరాల ఏకరువు అనే యవ్వనాన్ని పూర్తి చేసుకుని, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ యవ్వారాలలో జోక్యం అనే నడిపి వయసుతో కాసేపు ఆడుకుని ఇక మెల్లిగా  మంచి మరణం అనే ముసిలితనపు ముగింపుకి వస్తా వుండగా మళ్ళీ పిల్లిలాగా మోకాళ్ళ పొజీషన్ లోకి వచ్చేవోడు. అయితే… ఒకరోజు పార్ధనలో కన్నీళ్ళు ఎక్కువయ్యో, లేక నిజంగానే మా అన్నాయిగోడి అసుమంటి నడిమింత్రం కొడుకు మీద అనుమానమే వొచ్చిందో … మాయమ్మ ముకాన కప్పుకున్న చెంగు తీసి కళ్ళు ఇప్పి చూసింది. కళ్ళు గెట్టిగా మూసుకుని పళ్ళ బిగుతున ‘మోకాళ్ళ గొల్గతా యాత్ర ‘ అనే నాటకాన్ని ఆడతన్నా మాకు ‘భడేల్ ‘ అనే సప్పుడు వొచ్చింది. ఆ అధాట్టుకి మేవంతా కళ్ళు ఇప్పి సూసేతలికి మాయమ్మ పార్ధనా అవధానాన్ని ఒక్క సెంటెన్సు గూడా ఆపకుండా చేత్తానే ‘శాంచో పాంజా’ పాటం సదువుతానే పిల్లిలాగా వొచ్చి పుస్తకాల్లో షాడో ఇన్ బోర్నియో డిఫెక్టివ్ నవలలు దాసుకుని తలకాయి వంచుకు సదివే నా అసుంటోళ్ళను అరిచేత్తో ముడ్డి మీదనుంచి ముచ్చెల గుంటదాకా ఒకటే తీత తీసే మా స్ట్యాన్లీ ఐజాకు సారుకు మల్లే మా అన్నాయిగోడి జుట్టు పొట్టుకుని నేలకేసి తలకాయని ఇస్సిరి నూకతుంది… నొసటికి తగిలిన గచ్చు దెబ్బను లెక్క చెయ్యకుండా మా అన్నాయిగోడు శిలువ మీది ఏసూ ప్రెభువుకన్నా ఇంకా ఎక్కువగా కిక్కురుమనకుండా తన ఆత్మను ఆ పూట తండ్రికి అప్పగిచ్చేడు.
అందుకని, మాయమ్మ పెతాపం తెలిసి పెద్ద పాద్దిరిగోరైన రెవ. మోజెస్ గంగోలు అనబడే మా నాయన అన్నం ముందు చేసే పార్ధన శాన్సు మటికి మాయమ్మకు ఇచ్చేవోడు కాదు. మాటేల కుటంబ పార్ధన టైములో ఆయన పెద్ద అయ్యోరు కాబట్టి మోకరిచ్చే రూలు ఆయనకు వుండేది కాదు. అందుకని ఆ పార్ధన మాయమ్మకే వొదిలేసేవోడు.
ఇట్టా మా పార్ధనా జీవితాల్ని ఆళ్ళకు అనుకూలవైనట్టు పంచేసుకుని మమ్ముల్ని కట్టుదిట్టమైన క్రైస్తవ జీవితాల్లో పెంచుతా వుండగానే ఒకరోజు మా నాయన మాటేల అన్నానికి రాకుండగా ఆయన కుర్జీలో కూకుని ఏదో బొక్కు సదూంకుంటా వుండి పోయేడు. ఎప్పుడూ రొండో సారి పిలిపిచ్చుకునే అలవాటు లేని ఇల్లు మాది. మాయమ్మ సగంబడా కూర వొండేటప్పుటికే ఆ వాసనకి మా డొక్కల్లో పందికొక్కులు లగెత్తేవి. కూర వుడికీ వుడక్క తలికే మాయమ్మ అమాంతం డబరాని పొయ్యి మీద నుంచి ఏకా ఏకీ మేం తినటానికి కూకునే మజ్జ గై కాడికి తెచ్చి దించేది. అట్టా దించీ దించగానే డబరా మూత తీసి తిరగేసి పక్కన పెట్టేటప్పుడు గుప్పుమని ఆవిర్లు పైకి లెగిచేవి. ఎహోవా దేవుడి మందసం ముందు గొర్రెపెల్లల కొవ్వును దహన బలిగా అర్పించినప్పుడు ఆ వాసన ఆయన ముక్కుపుటాలకు చేరి ఆయన తన ప్రజల పట్ల తన కటాక్షాన్ని చూపటానికి పంపిన ప్రవక్తల్లా మేవంతా లగెత్తుకొచ్చి ఒరుసుకుంటా కూకునే వోళ్ళం.
అసుమంటిది ఆరోజు మా నాయన పంచలో పడక కుర్జీలోనే కూకుని ఏదో బొక్కు సదూకుంటా  మాయమ్మ కేకను పట్టిచ్చుకోలేదు. మాయమ్మ ఒకిటికి రొండు సార్లు పిలిచి డబరానూ, పళ్ళేలనూ ఆడే వొదిలేసి మా నాయన కోసం పంచలోకి పోయింది. కాసేపు తరవాత నాయన అమ్మ ఎనకమాలే లోపలికి వచ్చి పళ్ళెం ముందు కూకున్నాడు. కానీ రోజుకుమల్లే మాతో ఎకసెక్కాలు ఆడలేదు. మాయమ్మ వంటకాన్ని మా జేజి వంటకంతో పోలిక పెట్టి ఒక్క మాటగూడా మాట్టాడలేదు. మాయమ్మ పళ్ళాల్లో అన్నం పెల్లలు సర్ది ఆటి మీద మాసం కూర ఏసి ఇక పార్దన చెయ్యమని మానాయన్ని అడిగింది. అట్టా మాయమ్మ తనకు తానుగా అడగటం మాకైతే జెర్రీ చేతికి టుపాకు ఇచ్చి కాల్చమని టాం అడుగుతున్నట్టు భలే కుశాలగా అనిపిచ్చింది. నాయన మటికీ మాయమ్మనే పార్దన చెయమని కళ్ళు మూసుకుని చేతులు రొండూ జోడిచ్చి ఎప్పుటికిమల్లే మా పెంకుటింటి కప్పుకేసి తలకాయ ఎత్తేడు. మాయమ్మ ఏ కళన వుందో… ఇట్టా పార్దన చేసింది ” మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రీ ఈ సాయం సమయాన మీరు మమ్మును ప్రేమించి దౌర్భాగ్యులమూ, అనర్హులమూ అయిన మాకోసం ఇచ్చిన ఈ ఆహారానికై వందనాలు. మా జీత భత్యాలను ఇచ్చే మా అధికారులనూ, సరుకులు అమ్మే అంగడి వ్యాపారులనూ అందర్నీ ఆశీర్వదించండి. వారి పట్ల మేము కృతజ్ఞులమై వుండే మనసును మాకు ఇవ్వండి. ఆహారం తినుట వలన వచ్చిన శక్తిని నీ సేవకై వాడే భాగ్యాన్ని దయచేయండి. ఏసు అతిపరిశుద్ద నామములో అడిగీ, వేడుకునీ, పొందియున్నాము తండ్రీ” అని రొండు నిమిషాల్లో ముగిచ్చింది.
మాయమ్మ చేసిన చిన్న పార్దనకు మేవంతా యమా నవ్వుకుంటా మెల్లిగా ఉడుకుడుకు బువ్వా కూరల్ని వూదుకుంటా తింటా తింటా వుండగానే మాయమ్మ అడిగేసింది “ఏందీ మళ్ళీ ఆ చెర్చీలో యావన్నా గోల అయ్యిందా అని” . నాయన కాదని తలకాయ అడ్డంగా వూపుతా కూకున్నాడు. ఇక మాయమ్మ తగులుకుంది. “ఎంత చేసినా ఈ ఇంటో ఎవుడికీ నచ్చదు. ఎన్నని చెయ్యను నేనొక్కదాన్నీ, టైవుకి అందరికీ ఆన్నీ చేతికి అందాలి. నేనేవన్నా పనిగత్తెనా మీకు? మాయమ్మ ఎనిమిది ఎకరాల ఆసావి. పోయి పోయి మీ గంగోలోళ్ళ మొకాన నన్ను పెట్టింది. బువ్వా కూరా తప్పితే మీకేవో మరొక సొర్గం లేదు, నావల్లగాదు.. తాలండి” అని రంకెలు మొదులు పెట్టింది.
కాసేపు ఆగమన్నట్టు మా అయ్య సైగ చేసి ఇట్టా చెప్పేడు,” సందకాడ మాసం తెద్దామని పెద్ద మారుకొట్టుకు పోయా. రోడ్డు మీదకి ఎళ్ళి రిక్షా ఒకటి పిలిచి ఎక్కి మార్కొట్టుకు పోనిమ్మని చెప్పాను. ఆ రిక్షా అబ్బాయి ఏ మార్కొట్టుకి అని అడిగేడు. నేను పెద్ద మార్కొట్టు ఎనకమాల వుండా మాసం మార్కొట్టుకి అని చెప్పేను. ఆడు నన్ను సరిజ్జిగా తీసుకెళ్ళి మటన్ దుకాణాల ముందు ఆపేడు. నేను మరి కాత్తి ముందుకు పోనియ్యమని అడిగితే  ‘యాడికీ’ అని అడిగేడు. నేను ముందుండా దున్నమాసం దుకాణాలను చూపిత్తే ఆ అబ్బాయి నన్ను ‘కుక్కకా’ అని అడిగేడు. అర్ధ కాక నేను ‘కుక్కకా ‘ అంటే ఏందని గదమాయిచ్చేను. ఆ పిల్లోడు మళ్ళీ అదేనండే కుక్క కుక్క.. భౌ భౌ అంటదే… అని నాకు యాక్షన్ చేసి చూపిచ్చేడు. నాకు ఇంకా అర్ధం కాక ఈ కుక్కేందీ అని అడిగేను. దానికి ఆ అబ్బాయి ‘అదేనండీ… మాసం మీ కుక్క కోసమా ‘ అని అడిగేడు. అప్పుటికి గానీ నాకు అర్ధం కాలా… అదేందబ్బాయ్ మాసం మాకోసమే… కుక్కా గిక్కా లేదు అన్నాను. అందుకు ఆడు అనుమానంగా ‘మీరు అర్జనులా (హరిజనులా)’ అని అడిగాడు.
నా గుడ్డలూ, రిక్షా ఎక్కే లెవిలూ, పొర్సులో డబ్బులూ చూసి ఆడు నా తిండిని అంచనా ఏసేడు. బాగా బట్టలు కట్టే జనాలూ, దర్పంగా బతికే మనుషులూ గొడ్డు మాసం తినరని ఆడికి నేర్పింది ఎవురో? ఈడ మనిషి తినే అన్నానికీ, ఆడి కులానికీ, ఆడికి ఇచ్చే గవురానికీ లంకె పెట్టింది ఎవుడో అర్ధం కాలా. ఆడు మటికి రిక్షాను ముందుకు పోనియ్యననీ, కావాలంటే నన్నే నడిచి ఆడదాకా పోయి మాసం కొనుక్కుని రమ్మనీ చెప్పేడు.  అట్టా ఆలోచిత్తానే పోయి మాసం కొనుక్కొచ్చేను. వొచ్చి మళ్ళీ రిక్షాలో కూకుంటే ఆడు ఈ సారి ఇదివొరికిటి మర్యాదా మట్టీ ఏం ల్యాకుండా ‘ఇదుగో.. ఆ సంచీ సీటు మీద పెట్టమాకు చేత్తో పొట్టుకునే కూకో’ అని నాకు గ్యాపకం చేసేడు. ఇక నేను ఉండబట్టలేక నీదే కులం అబ్బాయ్ అని అడిగేను. దానికి ఆడు ‘మేం తూర్పు కాపులం. సికాకుళం నుంచి వొచ్చేం’ అని చెప్పేడు” అని మానాయన వలపోతగా చెప్పుకుంటా మా అందరి తలకాయల మీదా చెయ్యేసి తడిమేడు. “మేయ్ జయమ్మా… వుంకోసారి మనం అనర్హులం, దౌర్భాగ్యులం అని అనమాక. ఏసయ్య మనల్ని అన్ని దౌర్భాగ్యాల నుండీ ఎప్పుడో బయట పడేశాడు. మనకు దక్కే జీతం మన కష్టం. ఈ కష్టం చేసే అర్హత మన చదువూ, రెక్కల బలం నుండి వచ్చింది. మనం ఆత్మ విషయమై దీనులమై వుండాలి కానీ ఆహర విషయమై కాదు” అని మాయమ్మ తలకాయ మీద చెయ్యేసి చెప్పేడు. మాయమ్మ భక్తిగా ఆ పెద్ద పాదిరిగోరి ఆసీర్వాదానికి ఆ సందకాడ తలవంచింది.
*

ఇండస్ మార్టిన్

53 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మమ్మల్ని కూడా గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు.
    . . . Good write up అన్నాయ్.

    • meeruu meemuu anee bheedam ikkada undadannaa. paadurluu, pantullu dalita samaajamlo oka gauravamaina avamaanaanni pomdina kutumbaalu

  • మాంసం కూర వండిన రోజు ఎంత సంరంబం వుంటుందో, ఆ వుడుకుడుకు కురా, అన్నమూ ..అబ్బా.. వెనక్కు తీసుకెళ్ళి చాప మిద కూచోబెట్టారు కదా!
    కులం లేదు ఆర్థిక స్థితే అనేవాళ్ళకు చక్కటి వుదాహరణా చూపించారు.

  • మీ రచనలు చదువుతుంటే నామిని గుర్తుకొస్తారు.. చాలా బాగా రాసారు .. బహుజనులు అని అందరినీ కలుపుకోవడం కూడా ఎంత farce అన్నది తెలుస్తుంది ఈ కథలో ..

  • Although it is a painful story, it has excellent slang n narration. And it might be a true incident, than just a story!

  • మీ చిన్ననాటి అనుభవాలు ఎప్పటిలానే చాలా బాగా చెప్పారు…ప్రార్ధన గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. All your posts n stories are very much enlightening .

  • చాలా బావుంది..మీరు పదే పదే ప్రస్తావించే ఆత్మన్యూనత ఉన్న ప్రార్థనల గురించి అర్ధమైంది.మనకు దక్కే జీతం మన కష్టం..ఆ అర్హత మన చదువు…రెక్కల బలము…ఆహారం విషయంలో దీనులం కాకూడదు👌👌

    • You should have been born into my family to know the reality of Christianity in colonial countries.
      Thanks for reading and encouraging .

  • మా రాయలసీమ పదాలు జేజిలాంటివి గుంటూరువరకు,అవీ కొన్ని కులాల్లోనే ఎందుకున్నాయి మార్టిన్.ఫలానా ఆహారం పాపం వగైరా ఎప్పటికైనా పోతాయా??

  • మీరు చెప్పిన అంశము, మీ రచనా సరళి అధ్భుతం సార్, I experienced all these things in my life, bcoz my father also paster.

  • చిన్ననాటి ప్రార్థనా జీవితాన్ని అచ్చమైన మాండలీకంలో గొప్పగా రాసారు… దళితుల ఆహారాన్ని బహుజనులు కూడా నీచంగా చూస్తారన్న వాస్తవాన్ని హృదయం ద్రవించేలా రాసారు …👌

  • ఎప్పట్లానే… అదుర్స్… అన్న… చిన్ననాటి ప్రార్థనా సమయం గుర్తచేసి…. వెన్నులో వణుకు పుటించావ్…. మన స్టాన్లీ సార్ ని తలచుకుని… గురుభక్తినీ చాటావ్…. మనం తినే తిండిని మనపై రుద్ది…. హరిజనుల తిండి అని హేళన చేయటం…. మనం ఆత్మవిషయంలో దీనులమేగానీ…. ఆహార విషయంలో కాదని…. ఫినిషింగ్…. కేక…. అద్భుతంగా చెప్పావన్నా…. లవ్ యూ….

  • మార్టిన్, ఇలా పిలవడం మా పెద్ద తమ్ముడు మార్టిన్ సుధాకర్ని పిలిచినట్లుంది. “పాదిరి గారి అబ్బాయి కథలు” టైటిల్ చూడగానే నన్ను నేను చూసుకున్నట్లుంది. గంగోలు మోజస్ అంకుల్ని, ఆంటీని , కెనడీని చిన్నప్పటి మిమ్మల్ని మళ్ళీ నీ కథలో చూడడం సంతోషంగా ఉంది. అభినందనలు.
    – అబ్రహాం ప్రభాకర్ తాతపూడి

    • Anna, I don’t know you. Perhaps I forgot. Kennedy Anna died in last July . Thanks for reading my humble lay.

  • ఆ రచనా శైలి.. చిన్ననాటి మన వాడుక భాషని గుర్తు చేశి.. గతాన్ని కళ్ల ముందు ఉంచుతుంది.

    లవ్యూ ఫర్ ద నాచురల్ స్టోరీస్..!!

  • హ హ…ఎంటన్న కోళ్లు sfi, pdsu , బంద్ ల ల వస్తాయా… హ హాఆ

  • రచనల్లో , మన వాడుక భాషలో , చిన్నప్పటి కబుర్లు చెబుతూ కళ్ళు తడపటం లో మాంచి పోటుగాడివి అయ్యావబ్బాయ్ . సోడా పింగణంలాంటోడివి. కడాన నీతి వుంటది సూడు…. మెలిపెడతావు అబ్బా .. లవ్యూ

  • కుటుంబ ప్రార్ధన చివర్లో క్యాలెండర్‌ లో ఆరోజు వాక్యం చదివి అప్పచెప్పడం అనే ప్రక్రియ లేదా అన్నా…
    BTW, wonderful writeup Anna… ఆ పదాలు తిరగేసిపలికే విద్య పల్నాడు వాళ్ళకి బాగా అలవాటనుకుంటా. మా అమ్మ కూడా చాలా‌ పదాలు అలాగే అంటుంది…నేను పుట్టకముందు తరంలో నా ఇంట్లో జరిగిన కథ లాగే ఉందన్నా…

  • ” ప్రార్థన ” క్రైస్తవుల జీవితాల్లో ఒక స్వాంతన, ఒక భరోసా. అసహాయులైన దళిత వర్గాలు క్రీస్తు పట్ల ఆరాధనా భావాన్ని వ్యక్త పరిచే మాధ్యమం ప్రార్థన. తమ వేధనల ప్రత్యేక్ష నివేధనే ప్రార్ధన. వేరే ఏ మతస్తుడు గుడి, మసీదు వంటి ప్రార్ధనా మందిరాల్లో కన్నీరు పెట్టుకోడు, ఒక్క క్రైస్తవుడు తప్ప. బహుశా ఇక్కడే వారు మానసిక ప్రశాంతను, స్వాంతనను పొందుతారేమో!
    చాలా హృద్యంగా చెప్పారు మార్టిన్ భయ్యా( అఫ్ కోర్స్ కొంత వ్యంగ్యం జోడించారనుకోండి) నా చిన్నప్పటి రోజులను, మా అమ్మ ప్రార్ధన గుర్తుకొచ్చింది, నేనూ మీ అన్న టైపే కాసేపే మోకాళ్ళు ఎక్కువ టైం బాసిపెట్లు.
    నాన్న గారి గంబీరమైన ఫినిషింగ్ టచ్ చదివాక
    ఇక మాటల్లేవు
    గుడ్. మంచి సజీవ కధనం,

    • బతుకుననుసరించి బాషుంటదనేదానికి తార్కాణం ఈ కథ.
      సిన్నప్పుడు (ఇప్పటికి )తునుకలు వుడికే దాక ఆగేది గాని సల్లారే దాక ఆగక పోయేది.
      ‘బువ్వపెల్ల,గడ్క పెల్ల ‘ పదాలు మా దగ్గెరగూడున్నయి.
      మార్టిన్ భాష కమ్మటి పెద్ద కూర గుబాళింపులు.తియ్యటి మట్టి పెల్లలు.
      ఇంట్లదింట్లనే తినే ‘మా కూరకు’
      బాజాప్తుగా, బైరంగంగా తినే గౌరవాలు ఎప్పుడు వచ్చేనో ఏమో!

      • మీకు నచ్చిందంటే సంబురమే. ప్రేమకు దండాలు.

    • అన్నా కన్నీళ్ళ లో ఓదార్పు దొరుకుతుందో లేదో కానీ, కన్నీళ్లు పెట్టుకోడం ఒక మానసిక రుగ్మ త స్థాయికి చేరుకున్న కుటుంబాలు మనవి. చిన్నప్పటి ఆ ఏడ్పు ప్రార్థనలు ఇప్పటికీ నన్ను వేటాడుతూ భయపెడ తాయి. కథ మీకు నచ్చినందుకు చాలా గొప్పగా ఉంది. దండాలు.

    • అన్నా కన్నీళ్ళ లో ఓదార్పు దొరుకుతుందో లేదో కానీ, కన్నీళ్లు పెట్టుకోడం ఒక మానసిక రుగ్మ త స్థాయికి చేరుకున్న కుటుంబాలు మనవి. చిన్నప్పటి ఆ ఏడ్పు ప్రార్థనలు ఇప్పటికీ నన్ను వేటాడుతూ భయపెడ తాయి. కథ మీకు నచ్చినందుకు చాలా గొప్పగా ఉంది. దండాలు.

  • నా చిన్నప్పటి అమ్మమ్మ ఇంట్లో వేసవి సెలవుల కుటుంబ ప్రార్థన రోజులు గుర్తు చేశావ్ ఆన్నాయ్…

  • భాష కథనం చాలా అద్భుతంగా ఉన్నాయి.
    యథార్థమైన వ్యథార్త వస్తువును అందిస్తున్న తీరు అమోఘం.

  • ప్రార్థనకు క్రైస్తవమెందుకు అంత ప్రాధాన్యం ఇచ్చింది, అందులోనూ తిండిముందు ప్రార్థనకు అన్న ప్రశ్న వస్తూండగానే, అది నేడు ప్రపంచవ్యాప్తంగా బలిసిన దొరల మతమైనప్పట్టికీ దాని ఆరంభం దీనులకొరకు ఒక వ్యక్తి కనీవినీ ఎరుగని తీరులో ఆత్మసమర్పణరూపంలో చేసిన ప్రార్థనేగదా అన్నది మనసులో మెదులుతుంది. దీన్ని బానిసల ధర్మమనీ, ప్రార్థన ఇంకేమీ చేయలేని అసహాయ స్థితిలో ఒక్క ఊరటమాత్రమేననీ అనగలిగినా అది భారతంలో ఒక సముదాయానికి కలిగించిన అపారమైన స్వాతంత్రానికి ప్రతీక అన్నది మరువలేము. కుల రాజకీయంలో తిండి రాజకీయమే కీలకమైనది.
    ఏమైనప్పటికీ ఒక అతి వర్సటైల్ ఐన ప్రపంచ సంస్కృతికి వారసులై దాన్ని లోపలనుండి చూడగలిగినవారు అది భూమ్మీద అవతరించినప్పటినుండి ఈ నేలలో నెలకొని కొత్తతరం తనను చూసే తీరుకు దుఃఖించే కథనాన్ని ఎంతో ఆప్యాయతో విషాదంతో చెయ్యగలిగిన మీకు ఒక వ్యస్థపై బైటినుండి రాళ్ళేసే వాడికన్న లోపలనుండి దాని స్తంభాలను కోసేవాడి ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి సంస్కృతి తన కథను చెప్పేవారిని కోరుకుంటుంది. వారిలో కొందరుమాత్రమే సునాయాసంగ బైటికీ లోపలికీ వెళ్ళగలుగుతారు. అలాంటి కొందరిలో మీరొక్కరు.

    • చదివి స్పందించినందుకు దండాలు..మా కుటుంబాలను, జీవితాలను గ్రంధస్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నిజాయితీగా ఇంటిని కడుక్కుంటున్నాను కూడా.

      • మిమ్మల్ని నేను చాలా ఆశతో చూస్తాను. మీ కలానికుండే శక్తి గొప్పది.

  • ఆధునికులకు పాత ఆంగ్ల ప్రేరణ లేని వాడుక భాష లో అందించిన పేద్ద పాదిరి గారి పుత్రరత్నం మార్టిన్ గారికి వందనాలు.మీకు మంచి మోకాలి ప్రార్థన అనుభవం అందించిన అమ్మ గారికి కృతజ్ఞతలు.

  • ఆధునికులకు పాత ఆంగ్ల ప్రేరణ లేని వాడుక భాష లో అందించిన పేద్ద పాదిరి గారి పుత్రరత్నం మార్టిన్ గారికి వందనాలు.మీకు మంచి మోకాలి ప్రార్థన అనుభవం అందించిన అమ్మ గారికి కృతజ్ఞతలు.

  • కథ అంతా కడుపుబ్బా నవ్వించి,
    చివరలో ఇంతలా ఏడిపిస్తారా?
    అన్యాయం విల్సన్ గారూ.

  • క్రైస్తవ మోకాలి ప్రార్ధన ఉ నాకు ఇంగ్లీషు నేర్పాయి.

    1993 లో మా ఇంగ్లీషు మేడం ఇంట్లో మోకాలి ప్రార్దనల్లో ఒక ఫాదరు ఇంగ్లీషులో చేయించే ప్రార్ధనని ఒక్కో వాక్యం తర్వాత తెలుగులోకి అనువాదం చేసేవారు.

    ఈఅనువాద వాక్యాలను ఊహించటం నా ఇంగ్లీషుని కొంచెం మెరుగు పరచింది.

    మోకాలినొప్పులు తాత్కాలికం, లాభం శాశ్వతం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు