ప్రశ్నించే స్వరం-ఝుండ్

మురికివాడల పిల్లల మనోవికాసానికి ఆటల ఆవశ్యకతను సున్నితంగా చెప్పటమేకాదు, అంతరాల పొరలను కళ్ళకు కట్టిస్తుంది ఝుండ్ చిత్రం.

చిత్రం చూసేవరకు విజయ్ బార్సే అనే స్పోర్ట్స్ కోచ్ స్లమ్ సాకర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి మురికివాడల పిల్లలకు ఫుట్ బాల్ ఆటలో శిక్షణ ఇచ్చాడని తెలియదు.అలాంటి జోపడిపట్టి పిల్లల మనోగతాన్ని మనముందుంచే చిత్రమే ఝుండ్.

ఈ చిత్రాన్ని విజయ్ బర్సే బయోపిక్ గా చెప్పుకోవచ్చు.

అమితాబ్ వంటి నటుడు ఆ పాత్రను ఆ పోషించటం తో సినిమా మరో స్థాయికి చేరింది. ‘జోపడ్ పట్టి'(మురికివాడలు) జీవితాలెంత దుర్భరంగా ఉంటాయో దర్శకుడు మొదట్లోనే చూపిస్తాడు.సగంలోనే ఆగిపోయిన చదువులు,చుట్టుముట్టిన చెడు అలవాట్లతో అక్కడి యువత జీవితాలన్నీ కొడిగొడుతున్నా,బకెట్ తో ఫుట్ బాల్ ఆడే నైపుణ్యాన్ని వారిలో గమనిస్తాడు కోచ్ విజయ్.వాళ్ళలోని ఆ నైపుణ్యాన్ని బయటకు తీయాలని తాపత్రయ పడతాడు.అందుకోసం ఫుట్ బాల్  ఆడితే డబ్బులిస్తానని వాళ్ళలో ఓ ఆసక్తిని సృష్టిస్తాడు.వారికి క్రమంగా ఫుట్ బాల్ లోని మెళకువలను నేర్పిస్తాడు.వాళ్ళను తన కాలేజీ టీం తో పోటీపడేలా చేస్తాడు.ప్రిన్సిపాల్ కు ఇష్టం లేకపోయినా కోచ్ విజయ్ ని చూసి ఒప్పుకుంటాడు.జోపడ్ పట్టి టీం గెలిస్తే ఐదువేల క్యాష్ అవార్డిస్తానని మరో టీచర్ పందెమేస్తాడు.ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో జోపడ్ పట్టి(మురికివాడ) టీం గెలుస్తుంది.

విశ్వవిద్యాలయాలు,కాలేజీల బయట అపారమైన టేలెంట్ ఉందని మొదట్నించి నమ్మిన కోచ్ విజయ్ జోపడ్ పట్టి ఫుట్ బాల్ నేషనల్ పోటీలను నిర్వహిస్తాడు.ఇందుకు అనూహ్యమైన స్పందనొస్తుంది. తరవాత అంతర్జాతీయ పోటీలకు ఆహ్వానం రావటం జరుగుతుంది.అక్కడనుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. చిత్రంలో ఓ కోర్ట్ రూం సీనుంటుంది. స్లమ్స్ లో ఉండే యువతకు ఫుట్ బాల్ వంటి  క్రీడల్లో అనూహ్యమైన నైపుణ్యం ఉంటుంది కానీ మనం వారి చుట్టూ గోడలు కట్టి వారిని వెలివేశామంటాడు దర్శకుడు.

ఆ సీన్ లో అమితాబ్ చెప్పిన ఉద్వగపూరిత సంభాషణలు మన గుండె తలుపులు తడతాయి.ఫుట్ బాల్ ఆట ఆ యువతలో తెచ్చిన మార్పును చూడమంటాడు దర్శకుడు.అలా అని ఈ చిత్రం preachy గా ఉండదు. కానీ రియలిస్టిక్ గా ఉంటుంది.

దర్శకుడు నాగరాజ్ మంజులే ఇంతకుముందు ‘సైరాట్’ మరాఠీ సినిమాతో పరిచయమైనవాడే. స్లమ్స్ లో ఉండేవారందరూ దళితకుటుంబాలకు చెందినవారే కావటం ఒక విషాద వాస్తవం.అంతర్జాతీయ మ్యాచ్లో పాల్గొనటానికి  తన కూతురుకి పాస్పోర్ట్ అవసరమైనప్పుడు గోండు తెగకు చెందిన ఓ తండ్రి పడిన కష్టాలు మనలను కదిలిస్తాయి.ఇలాంటి కదిలించే సీన్లు సినిమాలో ఎన్నో. కోచ్ విజయ్ గా అమితాబ్ సినిమాకు వెన్నుముకగా నిలుస్తాడు.మురికివాడ యువతగా పోషించిన వారందరూ అక్కడివారే అనే వేరే చెప్పక్కర్లేదు.

స్పోర్ట్స్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి కానీ క్రీడలనీ, కులాన్ని కలిపి డిబేట్ చేసిన చిత్రాలు లేవు.ఆ పాత్ర ఝుండ్ చిత్రం పోషిస్తుంది.ఝుండ్ అంటే మంద(herd). చిత్రంలో ఏమంటోంది మీ మంద అదే మీ టీం అని వెటకరిస్తాడో టీచర్…అది చాలు మధ్య, ఎగువమధ్య తరగతులు వారు మురికివాడల వారి గురించి ఏమనుకుంటారన్నది.

ఒక్క మాటలో చెప్పాలంటే మురికివాడల జీవనశైలిని పరిచయం చేయటంతో పాటు వారిని జనజీవన స్రవంతిలో ఇమిడేలా చేయటం మనందరి బాధ్యత అంటాడు దర్శకుడు. నిలువెత్తు అంబేద్కర్ చిత్రానికి అమితాబ్ (కోచ్ విజయ్) నమస్కరిస్తాడొకచోట. మెయిన్ స్ట్రీం సినిమాలో అదొక అరుదైన దృశ్యం.

ఇవాళ ఈ సినిమాకి హాజరైన ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా  ఉండటమో విషాదం. మురికివాడల పిల్లల మనోవికాసానికి ఆటల ఆవశ్యకతను సున్నితంగా చెప్పటమేకాదు, భారత దేశంలో అంతరాల పొరలను కళ్ళకు కట్టిస్తుంది కూడా  ఝుండ్ చిత్రం.

*

సి.యస్.రాంబాబు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఝండ్ జైభీం లాంటి సినిమాల కొనసాగింపుగా భారతీయ సినిమా తన కంచు మూస ధోరణిని బద్దలుకొడుతూ వస్తున్న కొత్తదనంగా అర్థమవుతోంది. ప్రేక్షకులాదరించరు. కాని ఇలాంటివి ఇంకా వచ్చి కొంత వరకైనా కుల మత జెండర్ మౌఢ్యాలను తొలగించడంలో తమ వంతు పాత్ర తప్పక పోషిస్తాయి. మంచి పరిచయం. అభినందనలు సర్.

  • The holistic review is a great analytical and enlightening. The inbuilt deficiencies of of caste centric society are objectively projected in the review. It is distressing to see the mainstream society still stuck up steeply in its binary out look of viewing both animate and inanimate things in Purity – pollution dichotomy!! The status, station,stature and services of Babasaheb Ambedkar’s still don’t find a place of dignity and decorum in the mainstream media is a LIVE running commentary on our backward looking, obscurant, mediaeval, preposterous and Inhuman heritage past and present and the future is not optimistic or promising. Thanks to CS Rambabu for an amazing review.

  • చాలా మంచి పరిచయం. తప్పక చూడాలనిపించేలా. ఇలాంటి మంచి సినిమాలు రావాలి. మన మనసుల్లోని అంతరాల పొరలు కరగాలి. ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు