ప్రశ్నల పొద్దులోంచి….“కొత్త పండగ”

పొద్దుట్నుంచీ నా చుట్టూతా కమ్మని కధల వాసన!

“కొత్త పండగ” కధలపుస్తకం చదువుతున్నా.

ఏముంది ఈ కొత్త పండగ లో? కధలున్నాయ్ – పదిహేడు కథలు.

మంచివేనా?

ఏమో, నేనెలా చెప్పగలను?ఈ ‘మంచి’ అనేది బోలెడు సాపేక్షం గదా. స్థల కాలాలను బట్టి, చెలామణిలో ఉన్న చలన సూత్రాలను బట్టి, వ్యక్తిని బట్టి వాని వర్గాన్ని బట్టి దాని ప్రయోజనాలను బట్టి..చాలా బోలెడు సాపేక్షమైన దాన్ని సార్వత్రికం చేసి నేను ప్రకటించలేను గానీ,

ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒక పాఠకుడిగా నేను ఏ రసానుభూతికి లోనయ్యాను? ఏ ఉద్వేగాలు నాలో చెలరేగాయి? ఏ ఆలోచనా స్రవంతిలో నేను ఈదులాడాను? నా సంస్కారానికి చైతన్యానికి ఈ పఠనానుభవం చేసిన జోడింపులేమిటి?

ఏ చీకటిని ఏ వెలుతురుని ఈ పుస్తకం సమక్షంలో నేను విన్నాను? ఏ జీవన సంగీతాన్ని ఈ అక్షరాల్లో నేను చూశాను? ఎక్కడ నా జీవితానుభవాలను పోల్చుకుని మురిసిపోయాను..ఎక్కడ మౌనమయ్యాను…ఎక్కడ నాలో నేను మాట్లాడుకున్నాను..? – నాకు నేనే వేసుకున్న ఈ ప్రశ్నల వెలుగులోంచి నా గమనింపులు కొన్ని పంచుకునే ప్రయత్నం చేస్తా మీతో.

వల్లంపాటి కధాశిల్పం ‘మంచి కధ’ అనేదానికి నాలుగు లక్షణాల్ని చెబుతుంది. క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణసౌష్ఠవం.

మనందరికీ తెలుసు. క్లుప్తత అనేది పేజీల సంఖ్యకీ నిడివికీ సంబంధించింది కాక ఎంత అవసరమో అంతే చెప్పడానికి సంబంధించిందని. వంద పేజీలున్న రచనలోనూ క్లుప్తత సాధించబడవచ్చు..ఒక్క పేజీ నే ఉన్న చోటా క్లుప్తత లోపించవచ్చు.

ఈ కధల్లో ఎక్కడా అనవసర వాచాలత కనిపించదు. రచయిత ఉపదేశాలూ ఉపన్యాసాలూ ఉండవు. కధ ఎత్తుగడే వేలు పట్టుకుని నేరుగా కధలోకి తీసుకెళ్లిపోతుంది.

“మీకు ఎంతమంది స్నేహితులున్నారు?ఒకరా ఇద్దరా చాలామందా? మీరు సరదాకోసం పక్షులూ కుక్కపిల్లలూ వగైరాలవంటివేమైనా పెంచుతున్నారా? నాకైతే ఒక్క స్నేహితురాలే ఉంది. తను నాకు పెంపు కూడా. ఐతే తను ఒక దెయ్యం.” –ఇదీ ఒక కధలో ఎత్తుగడ. ఈ రెండు లైన్లు చదివిన సాధారణ పాఠకులెవరైనా “ఈ దెయ్యం తో స్నేహమేంటీ ..దెయ్యాన్ని పెంచుకోవడమేంటీ..కొంచెం తేడాగా ఉందే ఈ వ్యవహారం” అనుకోకుండా, తరువాతి కధలోకి వెళ్లకుండా ఉండగలరా?

“బొడ్లో దోపిన రూపాయలు ఒకసారి తడుముకుని గల్లా పెట్టెకి దణ్ణం పెట్టి బూడిద రాలగా మిగిలిన అగరొత్తి పుల్లలు తీసేసి షాపు తలుపెసేయబోయింది. ఇంతలో సోడాలబండి గలగలమంటా వచ్చింది. వాడితో సోడాలు వద్దని చెప్పింది. ఇవాళ బడ్డీ మూసేస్తున్నానంది. ఎండ పొద్దు. జనాలు దాహంతో ఉన్నారు. సోడాలెక్కువ అమ్ముడుపోతాయ్.” “పీనాసి ముసల్ది. ఓ పూట బేరం వదులుకుని బడ్డీ మూసేస్తుందంటే విషయం పెద్దదే” అనుకున్నాడు సోడాల పిల్లోడు. రమణమ్మ మాత్రం నోరువిప్పి ఏమీ చెప్పలేదు. ఐనా ఎంతసేపు దాస్తుంది. రేపైనా తెలిసిపోతుంది.” – స్త్రీ ధనం అనే కధ ఈ వాక్యాలతో ప్రారంభమవుతుంది. విషయమేంటో చూడాలనే ఉత్సుకత కధలోకి లాక్కుపోకుండా పాఠకులు తమను తాము నియంత్రించుకోవడం ఇక అసంభవం గదూ ఈ వాక్యాల తరువాత. “ఎదవ పంది నా బతుకు..” కుమారి తెల్లమచ్చల నల్లపంది ఈ మాట ఎన్నిసార్లనుకుందో లెక్కే లేదు” – ఇదీ ఓ కధ ప్రారంభ వాక్యం.

దాదాపు అన్ని కధలూ ఇలాగే. అనవసర వర్ణనలూ ఆర్భాటాలూ ఉండవు. సింపిల్ గా ఉన్న శైలితో అలా సంఘటనలను మనసు కళ్లకు కట్టి వాటి మీద ఏ తీర్పూ చెప్పకుండా మనల్ని మనకు వదిలేసి పక్కకు తప్పుకుంటుంది గడుసుగా రచయిత్రి.

అనుభూతి ఐక్యత – యూనిటీ ఆఫ్ ఇంప్రెషన్ – ఈ పుస్తకం లోని దాదాపు అన్ని కధలూ అవి ఉద్దేశించిన అనుభూతిని పఠితల్లో వెలిగించేవే.

“సముద్రపు పిల్లాడు” అని ఒక కధ ఉంది.

“నీ జత పచ్చీ..” సముద్రం కేసి తిరిగి కుడి ఎడమ చేతుల చూపుడువేళ్ళతో పచ్చి కొట్టి చిన్నా వెనక్కు తిరిగాడు.” – అంటూ మొదలవుతుంది కధ. పెదవుల మీదకు చిరునవ్వొస్తుంది. చిన్నా మనలోకొస్తాడు. సముద్రంతో మాట్లాడినట్టే వాడు పుస్తకాల సంచితోనూ మాట్లాడుతుంటే, ఆ సంచికి ఎర్రోడని పేరుపెట్టి “ ఎర్రోడా! ఒక్కసారి నోరు తెరు. లెక్కలు, తెలుగు పుస్తకాలు తీసి మళ్ళీ పెట్టేస్తాను” అని అంటుంటే ఆ బాల్యం మనలోగుండానే ప్రవహిస్తుంది.

సముద్రం మీదికి వేటకెళ్లిన నాన్న చేపలు గుడ్లు పెట్టే కాలాన తిరిగొస్తాడని అమ్మ చెబుతున్నప్పుడు ఆ బంగారు కాలం కోసం ఎదురు చూసేది వాడే కాదు, మనం కూడా.

మొన్నటిసారి చేపలు గుడ్లు పెట్టే కాలాన నాన్నలంతా ఇంటికొచ్చి చిన్నా వాళ్ల నాన్న రానప్పుడు..ఇక రాలేడని తెలిసినప్పుడు..ఆ ఏడుపు అమ్మదేనా?

అప్పటినుంచీ అమ్మ ఏదడిగినా ఏడుస్తది. చెప్పుతెగిపోయినప్పుడు కొత్తది కొనమంటే ఏడ్చింది. “ఎర్రోడు చినిగిపోయాడు..కొత్తోడు కావాల”ని చినిగిపోయిన బ్యాగును చూయించినప్పుడు ఏడ్చింది.

సాయంకాలం జనసంచారం పల్చబడుతున్నప్పుడు చిన్నా సముద్రం దగ్గరకి నడిచాడు. లేతరెక్కల్లోకి బలం తెచ్చుకుని బ్యాగు సముద్రం లోకి చేతనైనంత దూరం విసిరేశాడు. సముద్రంకేసి గట్టిగా కేకేశాడు. “నాన్న ఎక్కడా? తనతో చెప్పాలి, బ్యాగ్ చినిగిపోయిందని”. “చేపలు గుడ్లు పెట్టే కాలాన నాన్నని తిరిగి పంపించకూడదా? – చెప్పులు తెగిపోయాయి, బ్యాగ్ చినిగిపోయింది..అంతా నీవల్లే” . చిన్నాకి దుఃఖం వచ్చింది. “చిన్న సముద్రం పెద్ద సముద్రం లోకి దూకినట్లు చిన్నా గాడి కళ్ళలోంచి నీళ్ళు జల జలా రాలిసముద్రంలో పడ్డాయి” అంటుంది కధ చెప్పేటామె మనతో అక్కడ. మన కళ్లలోనూ అవే నీళ్ళు.

కధ చివరికొచ్చేసరికి మామతో పాటు సముద్రంలోకెళ్తాడు బోటు మీద. మామ వాళ్ళు చేపలు పడుతుంటే తనూ ఒక చిన్న గాలం విసుర్తాడు. ఒక పెద్ద పదికేజీల చేప తగుల్తుంది. దాన్నితను గుంజలేకపోతుంటే మామ సాయమొస్తాడు. చేపని చూసీ చూసీ చిన్నా గాడు ఒక చాకు పుచ్చుకుని చటుక్కున గాలం తెగ్గొట్టేస్తాడు. చేప తప్పించుకుపోతుంది. “ఎందుకురా గాలం తెగ్గొట్టావ్” అని విసుక్కున్న మామతో చెప్తాడు “ దాని పొట్ట లావుగా ఉంది. లోపల గుడ్లున్నాయ్. దాన్ని చంపేస్తే చేపలు గుడ్లు పెట్టే కాలం ఎలా వస్తుంది? అది వస్తేనేగా నాన్నలు తిరిగొచ్చేది..”

– ఒక మౌనం మన చుట్టూరా పరుచుకుంటుంది. బయటా? లోపలా??

“పల్చగా మేఘాలు కమ్మాయి. వర్షం మొదలయింది. సముద్రమే మేఘమై చిన్నా గాడిని ప్రేమగా తడిమి తడిపేస్తోంటే జాలర్లు ఒడ్డు దారి పట్టారు. ‘మనిద్దరం ఎప్పటికీ జతగా ఉందాం’ అంటూ సముద్రం అలలుగా పైకి లేచింది చిన్నాని తాకాలని. మన చేయికూడా లేస్తుంది చిన్నా భుజంపై వాలాలని.

అనుభూతి ఐక్యతను సాధించడానికి అత్యంత అనువైన ఉద్వేగం కరుణనేనేమో!

**

కధలోని సంఘర్షణ రచయిత దృక్పధాన్ని పట్టి ఇస్తుందంటారు. ఏ సంఘర్షణా లేని కధ కేవల కాలక్షేప కధో, వ్యాపారకధో అవుతుందంటారు. అలాంటి ఒట్టి కాలక్షేపాలేమీ ఈ పుస్తకంలో కనబడవు. పాత్రల నడుమ, ఆలోచనాధారల నడుమ, భిన్న పరిస్థితుల – జీవనవిధానాల నడుమ, సాంఘిక ఆర్ధిక అసమానతల నడుమ అనివార్యమైన సంఘర్షణ ని ప్రతి కధలోనూ మనం చూడవచ్చు. మరింత మానవీయమైన సమాజంకోసం మనిషిలో ఉండాల్సిన సెన్సిబిలిటీస్ ని స్పృశించాలనే ప్రయత్నాన్ని ప్రతి సందర్భంలోనూ మనం గమనించవచ్చు.

ఇక నిర్మాణ సౌష్ఠవం. కధ ప్రారంభం – నడక – ముగింపు.. ఆ ముగింపులో ఒక ‘ఎపిఫనీ’ ..ఒక ఎరుక. అన్నిటి పట్లా పెట్టాల్సినంత శ్రద్ధపెట్టడాన్ని మనం చాలా కధల్లో గమనించవచ్చు.

*ఈ కధలు చదువుతున్నప్పుడు భలే ఆకట్టుకున్న మరొక అంశం కధకురాలి కంఠస్వరం. టోన్. ఆ టోన్ లోని వ్యంగ్యం, గడసరితనం, మాటకారితనం.

“కొత్త పండగ” అనే కధ ఉంది. చెక్కబండి లాగుతానే బతుకుబండి నడిపించుకొచ్చిన రామ్మూర్తి సచ్చిపోయాడు. ఇల్లరికం తెచ్చుకున్న అల్లుడు దేశాలుపట్టి పోతే ఇద్దరు పిల్లల్తో అయ్య దగ్గరే ఉంటున్న కూతురు అలివేలుకి పెద్ద ఇబ్బందొచ్చిపడింది. ఇప్పుడు తలకొరివెవరు పెట్టాల?

ఆఖరుకి అంతా కలిసి రామ్మూర్తికి కొడుకు వరసయ్యే బెమ్మయ్యనే వాడ్ని పట్టుకొస్తారు. “ఈ కరమ నీకు తప్పేదిగాదురా బెమ్మా. ఈ పనికి యీలుగల మగాళ్ళు మనలో నువ్వుగాక ఇంగెవరూ లేనట్టే..” అనే సరికి బెమ్మానికి ‘అనుకోకుండా ఈ ప్రపంచాన తను గొప్పోడిగా, తప్పకుండా ఉండదగ్గ మనిషిగా’ మారినట్టు అనిపించిందంట. వాడంటాడూ “నన్ను ఉత్తుత్తి కొడుగ్గా కాకుండా నిజం కొడుకు మల్లే సూడాల” “దాన్దేముంది. అలాగే” అంటారు జనం. అక్కడ రచయిత్రి అంటుందీ “రామ్మూర్తి చచ్చిపోయాడు గానీ లేపోతే అందరూ జేరి రామ్మూర్తితో ‘ఓ సారి బెమ్మం గాణ్ణి దగ్గిరకు తీస్కుని కావిలిచ్చుకోరా’ అని చెప్పుండేవాళ్ళే.

– ఇలాంటి విట్, చమత్కారం, చతుర్లు పోవడం, చురకలంటించడం చాలా చోట్ల చేస్తుంది. ఈ చమత్కార ధోరణి కధకురాలి సహజసిద్ద స్వభావమనిపిస్తుంది. “రచయితెక్కడో చాటునుండాలి..కనపడరాదూ బిగ్గరగా వినపడరాదూ” అని పెద్దలంటారు గానీ, అవన్నీ పట్టించుకునే బుద్ధిమంతురాలి లక్షణాలేమీ కనపడవనిపిస్తుంది ఈ కధకురాలి దగ్గర.

పైగా ‘ఎదురు మాట్లాడినా కూడా ఎదుటివాళ్ళ పెదవులపైకి చిరునవ్వులే తెప్పించగల స్వచ్ఛమైన బాల్యపు గడసరితనం’ సహజసిద్ధంగానే తనలో ఉందనిపిస్తుంది.

కొత్త పండగ కధ ముగింపు ఇది. “నిప్పుకుండతో శవానికి ముందు నడుస్తున్న అలేలు చూడ్డానికి ఊళ్ళో కొత్తగా పుట్టిన అమ్మోరేమో అన్నట్టుంది. అలేలు వెనక బేరం చెడిన బెమ్మం తో పాటు జనాలంతా గుంపుగా నడుస్తున్నారు. రోడ్డెమ్మడి జనాలు ‘పాడె ముందర ఆడది నడుస్తుందేంటిరా’ అని వింతగా చూశారు. అసలు చూడ్డానికది శవం ఊరేగింపుగా కాక రాక్షసుడి మీదికి యుద్ధానికెళ్తున్న అమ్మోరి మందలా ఉంది”

పండితుల్నీ పెద్దల్నీ అడిగితే ‘ఇక్కడాపాలి కధ. ఇక్కడైపోయింది’ అంటారనుకుంటా. కానీ ఈమె ఆపదు. ఇంకో మాట అంటుంది. “మరి ఇట్లాంటి సందర్భాన్ని బట్టి చావు కూడా కొత్త పండగైపోదా ఏంటి?”. వాక్యం చూడండి. “అక్కడ చావు కూడా కొత్తపండగై వెలుగుతోంది వగైరా” కాదు. “మరి ఇట్లాంటి సందర్భాన్ని బట్టి చావు కూడా కొత్త పండగైపోదా ఏంటి?”

– ఆరో తరగతిలోకి కొత్తగా వచ్చిన చిట్టితల్లి వెలిగిపోయే ముఖంతో ఎదురుగ్గా వచ్చి నిలబడి భయమూ భక్తీ లేకుండా “ఏం సార్..అలా అవదా ఏంటీ?” అంటుంటే ఎంత చండశాసన టీచరైనా ఏమంటాడు? ‘అవును తల్లీ!’ అనడూ, డిసిప్లినూ గిసిప్లినూ తీసి అటకమీద పారేసి మనసు మీదకి ముసి ముసినవ్వులు తెచ్చుకోడూ?

పుస్తకమంతటా రచయిత టోన్ లో ఈ బాల్యమూ గడుసుదనమూ వ్యంగ్యమూ కనిపిస్తూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయ్.

– ఎంచుకున్న కధాంశం, పాత్రలు, వాటి సంభాషణలు అలవోకగా అలా సెట్టైపోయినట్టుగా అనిపించేలాంటి నేర్పరితనం కధల అల్లికలో అగుపిస్తుంది.

‘స్త్రీ ధనం’ చదివితే రమణమ్మ మనతోనే అలా ఉండిపోతుంది. మన పల్లెల్లో మన చుట్టూరా ఉన్న రమణమ్మలెందరో బొమ్మగడతారు. సూపర్ మార్కెట్ ల దెబ్బకు తన బేరాలన్నీ పడిపోయి ఇంకా తన బడ్డీ కి వస్తున్న కొద్దిమంది జనాలని చూస్తూ “ఈళ్ళు గనా సచ్చిపోతే తన బడ్డీ గూడా సచ్చిపోద్ది” అనుకునే రమణమ్మ, “పేరు పోతే పోనీ. అదేం అన్నం పెట్టేది కాదూ ఆదుకునేది కాదూ. కష్టపడి పోగేసిన పైసలకి ఎసరొచ్చేలా ఉంది” అని దిగులు పడే రమణమ్మ, “నీ మీదా నీ కోడుకు మీదా నీ కోడలు కేసు పెట్టింది. మీరు స్టేషన్ కి రావాలి” అని పోలీసాయన వస్తే “ఎందుకు రావాలి స్టేషన్ కి? దొంగముండ. దాన్నే ఇక్కడికి రమ్మను. అత్తలా కాదు. అమ్మలా చూశాను. బదులు ఇవాళ నన్ను బజార్లో నిలబెట్టింది” అంటూ శివాలెత్తే రమణమ్మ, ఈ కేసు పెట్టడమనేది తన దగ్గరి డబ్బులు కక్కించడానికి కొడుకు ఆడిన నాటకమనీ, దాంట్లో కోడలొక పాత్ర అనీ తెలిసి డబ్బులు పోయి ఒంటరిగా ఉక్రోషం గా మిగిలిన రమణమ్మ, ఆఖరుకి ఆ కొడుకు తన భార్యనీ మోసం చేసి డబ్బుల్తో ఉడాయిస్తే పిల్లల్నేసుకుని చీకట్లో వానలో వొచ్చి గుమ్మం ముందు నిలబడ్డ కోడల్ని లోనకు రానిచ్చి దగ్గరకు తీసిన రమణమ్మ – ఎందరు అమ్మలకు ప్రతినిధో! ఎలా మరిచిపోతాం ఇలాంటి వెంటాడే పాత్రలని!

ఈ కధలో ఒక దగ్గర కధకురాలంటుందీ.. “మొగవాణ్ణి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న లోకంతో రవణమ్మ గెలవలేకపోయింది” . ఎంత మంది ఎన్ని సందర్భాల్లో ఐడెంటిఫై అయ్యే వాక్యమో ఇది.

ఎక్కడా వాచ్యమవకుండా అద్భుతంగా నిర్మించిన కధ “నేను తోలు మల్లయ్య కొడుకుని”. మాదిగ మారయ్య, బేపన జగ్గయ్య పంతులు-నాలుగో తరగతి తో మారయ్య చదువు ముగిసేదాకా క్లాస్మేట్లు. చిన్నప్పుడు జగ్గయ్య పంతులు లోటాతో నీళ్లు తెచ్చిస్తే తాగినందుకు వాళ్ల నాన్న మారయ్య ని “ఆ చెంబు నువ్వే పట్టుకు పోరా” అన్నాడు.

“యాడిదిరో చెంబు..” పుల్లమ్మ కొడుకునీ చెంబునీ వింతగా మార్చి మార్చి చూస్తా అడిగింది. “జగ్గయ్యోళ్ళ నాన, పెదపంతులిచ్చాడు. నీళ్ళు తాగినా. ఎంబట్నే చెంబిచ్చేశాడు.” గర్వంగా చెప్పాడు మారయ్య. “ఏరే వాళ్ళైతే సంపినంత పని చేద్దురు. పెద్ద పంతులు దేవుడే. బిడ్డో..నీళ్ళకోసరం అట్టా పెద్దోళ్ళ కొంపలమీద పడమాక. కడగొట్టోళ్లం. ఆళ్ళని కళ్ళతో జూసిందే మనకి గొప్ప. అంతగా దప్పికైతే దోసిట్లో పోబిచ్చుకుని తాగు”

ఆ చెంబు తన పుటకని ఎగతాళి చేసేదన్న సంగతి చానా కాలానిగ్గాని బుర్రకెక్కలేదు మారయ్యకి. పక్కనున్న ఇంకో పాలేనికి పోయినా అక్కడా అదే గోడ. చెర్చి కాడ ఉన్న పొత్తు ఇంటి కాడ లేదు. చేయి తుడుచుకుంటే ఆ తువ్వాలు ఇంటికి పట్టుకెళ్ళిపొమ్మందా ఇంటామె.

కధాఖర్న, ముసలి మారయ్య చెప్పులు కుట్టే పన్నుంచి ఇంటికొచ్చి తొమ్మిదో తరగతి సదూతున్న మనవరాలితో మాటలు బెడతాడు.

“ఓమే, ఏంది సదూతున్నావు?” “వర్కు జేస్తన్నా. బొమ్మ కనబళ్ళా?” “ఏమి బొమ్మ?” “ నీకు తెల్వదులే. అదేదో దేశంలో జనాలంతా కల్సి పెద్ద గోడ పగలగొట్టారు..ఆ బొమ్మ”

“మీ బొక్కుల్లో పగల్నూకే సంగతుల గురించి కూడా రాస్తన్నారా? కట్టేది అవుసరం గానీ పగలగొట్టేదేందిమే”

వాన..చలి..పిల్లలంతా కుంపటి కాడ చేరారు. “మట్టి గోడలు, రేకు గోడలు, సిమెంటు గోడలైతే పడిపోతాయి. ఒకేల ఉక్కు గోడలైతే ఎట్టచేస్తావుమే” పిల్లని తికమక చెయ్యాలని అడిగాడు. “ఉక్కు గోడలా? వేడి పెట్టేసి కరగబెట్టేస్తా” పిల్ల కాస్త ఆలోచించి చెప్పి పకపకా నవ్వింది. “ఉక్కుగోడే గనైతే ఎంతేడి పెడితే కరుగుద్దో ఇంత సలిలో..” అనుకుంటా మారయ్య కూడా కుంపటికాడ పిల్లల్తో చేరాడు. సెగ ఎచ్చగా నరాల్లోకి పాకింది.

మిత్రులారా! విడమరిచి చెప్పనక్కర్లేదు గదూ మీకు!

“తెల్ల మచ్చల నల్ల పంది” అని ఓ కధ ఉంది. అద్భుతమైన అధిక్షేపం. ఈకధలోని పందులన్నీమనకు బాగా పరిచయమైనవే. మన లోపలి పందులూ, మన ఇళ్లలోని పందులూ, ఆఫీసుల్లోని పందులూ..చదివి చూడండి. మీకే తెలుస్తుంది.

షరీనా అంటే ‘యువరాణి’ అని ఒక అర్ధమట..‘సిగ్గు పడే పిల్ల’ అని ఒక అర్ధమట..‘స్వేచ్ఛా ఆత్మ’ అని ఇంకో అర్ధమట. ఈ భిన్న అర్ధాలు ప్రతిఫలించే భిన్న సన్నివేశాలమీదుగా మనల్ని ఒక భావోద్వేగశిఖరానికి చేర్చి అక్కడ – “దీర్ఘకాలం ఏ చీకటిలోకాల్లోనో మగ్గిపోతూ చిక్కి సగమైపోయి ఊహలనుంచే ప్రాణం నిలుపుకుని మళ్ళీ మళ్ళీ మనుషుల్ని కలుసుకోడానికి వచ్చే అర్భకప్రాణి షరీనా” అంటూ కధ ముగిస్తుంది.

ఒక్క షరీనా నే కాదు..బాల్యం వచ్చినప్పుడల్లా, పసి పిల్లల పాత్రలు వచ్చినప్పుడల్లా విశ్వరూపం చూపెడుతుందనిపిస్తుంది ఈమె లోని రచయిత్రి. షరీనా, అబ్బులు, చిన్నా-…ఈమె ప్రాతినిధ్య పాత్రలు ఆ పిల్లలేనేమో!

‘దురాయి’ అని ఒక కధ ఉంది. అందులో ‘లచ్చమ్మ’ అని ఒక పట్టపాలెపు తల్లి ఉంది. కూతుర్ని కొట్టిన అల్లుడికి తిరిగి తను కొట్టడమే శిక్షవ్వాలని పట్టు పడుతుంది. “అదేంటమ్మా..రేపు కాపోతే మర్నాడు ఆడికాడికే పంపొద్దా? సర్దుబాటు చెయ్యొద్దా” అనాలనిపిస్తుందా. అనకండి గమ్మునుండండి. అన్నారనుకో, లచ్చమ్మ పోలేరమ్మ పూనిన మాదిరి మీదకొస్తది “మీ మొహం బజ్జి బజ్జి చేస్తా. రేపు ఒక్కాడ ఉండాల్సినోళ్ళమేగా అని సర్దుబాటు చేసుకుంటారా?” అంటది.

అప్పుడు మీరు “ముంజి తిన్నిగు ముంజి తిండాగా కోమి తిన్నిగులయ్యి పిడిసినాగు” అని సణుక్కుంటా పక్కకెళ్ళాల్సొస్తది. అంటే ఏంటి అంటారా? ఇంతకీ లచ్చమ్మ కోరిక తీరిందా అంటారా? –చదివి తెలుసుకోండి మీరే.

అసలే ఇప్పటికే ఎక్కువ వాగేసినట్లున్నా. ఎమ్మెస్కే కృష్ణజ్యోతి కధల్లాంటి వాట్ని గురించి మనం మాట్లాడ్డం వల్ల ఏమీ ప్రయోజనముండదనీ.. ఎవరికి వాళ్ళు చదువుకుని తమతమ జీవితానుభవాల్ని దర్శించుకోవాల్సిందేననీ ఇటీవల నేషనల్ హెరాల్డ్ లో ఆయనెవరూ, -“తల్లీ!కృష్ణజ్యోతి, పేరు గుర్తు రావట్లేదు, ఎవరమ్మా ఆయన”- ఆ.. గుర్తొచ్చింది..ఎడ్వర్డ్ మ్యూనిచ్ మ్యాట్- ఆయన రాశాడు కూడా. అన్నట్టు ఆయన్ని గురించి గూగుల్ చెయ్యకండి. ఆడు మీకు దొరకడు. “అంతేగా తల్లీ..”- (కావాలంటే ఈ పుస్తకంలోనే ‘యుద్ధము – శాంతి’ అని ఒక కధ ఉంది. అందులో చూడండి, ఆయన్ని గురించిన సూచన దొరుకుతుంది)

**

 

రాఘవ

8 comments

Leave a Reply to Manu Gadde Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ పరిచయం చాలా బావుంది, కృష్ణ జ్యోతి గారి కథలు ఎలా ఉన్నాయో చదవాలని ఉంది.
    All the best.

  • తోలు మల్లయ్య కథ తో కృష్ణజ్యోతి గారు నా అభిమాన రచయిత అయ్యారు. నిబద్దతతో రాస్తున్న కథకులు.
    రాఘవ గారి సమీక్ష బాగుంది. అభినందనలు

  • చక్కటి సమీక్ష. మిత్రులు కృష్ణ జ్యోతి కథలలో నాకు బాగా నచ్చే అంశాలు: సున్నితమైన సరళత్వం, నిజ జీవన చిత్రణ, కథనాన్ని ముందుకి నడిపించే పాత్రలు. రచయితగా తన స్వరాన్ని ఏ మేరకు నియంత్రించుకోవాలో ఆమెకు తెలుసు. అభినందనలు!

  • ఇంత మంచి రివ్యూ నిజంగా అదృష్టం. అభినందనలు రచయితకి విమర్శకుడికి కూడా. ఈ పుస్తకం ఇంకా చదవనందుకు నన్ను నేను తిట్టుకొంటున్నా.

  • పుస్తకం కొనేసేవాడిని ఈ సమీక్ష చదివిన తరువాత. కాకపోతే ఇప్పుడు కొనను. ఎందుకంటే ఈ సమీక్ష వెలువడ్డానికి ముందే కొనేసాను కాబట్టి!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు