ప్రభో..

బూదరాజు రాధాకృష్ణ సుప్రసిద్ధ భాషావేత్త, జర్నలిజం గురువు, ఆధునిక పత్రికాభాష రూపకర్త. ఆయన 88వ జయంతి సందర్భంగా…..

‘‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన

అంతమాత్రమే నీవు!

అంతరాంతరము లెంచి చూడ

పిండంతే నిప్పటి యన్నట్లు’’

…ఖరారే,

అన్నమయ్యకు దైవత్వం బోధపడే ఉంటుంది!

లేకుంటే,

నిన్ను చూడకుండా అలా ఎలా రాయగలడు?

 

త్యాగయ్యకు నీ పరిచయం ఉండే ఉంటే-

‘చాల సరళమయ హేల, సుగుణ గుణశీల, బుధ శిష్య లోల, విధృత శర

జాల, శుభకర కరుణాల వాల, ఘన  జ్ఞాన భవ్య మన మాలికాభరణ’

అని నుతించకుండా ఎలా ఉండగలడు?

===

 

జ్ఞానాంబుధి ఎదుట ఉంటే

దక్కేదెంత? విడచేదెంత?

మీమాంస ఎంత అసంబద్ధం?

గ్రోలడం-

శక్తి సామర్థ్యాలకు పరీక్ష అయినప్పుడు

దక్కనిది యావత్తూ అశక్తతే!!

 

అనుభవాల గనిలోకి అడుగుపెట్టాక

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత

మోయగలిగినోడికి మోయగలిగినంత!

సంపద కురచైపోయిందనే చింత ఎంత అర్థరహితం?

వెంట తెచ్చుకోలేకపోతే బలహీనతే!

 

భిక్షువుగా-

నీ మేథో వాకిట్లో

జోలె పట్టి నిలుచున్నప్పుడు…

నువ్వు ప్రేమగా విదిలించిన కబళమే

అక్షయమై ఇవాళ్టికీ కడుపు నింపుతోంది!

సుక్షతమై పరాకును దూరం తరుముతోంది!!

 

భాషా సంస్కారాలూ

వ్యవహార జ్ఞాన మర్మాలూ

బతుకు ఎత్తు పల్లాల దెబ్బల్ని తట్టుకోవడంలో…

నీ మాట –

తలపుల్లోంచి, మేం చేదుకుంటున్న ఊటబావి!

నీ పాఠం-

నిత్యానుష్ఠానమై తీర్చిదిద్దుతున్న శిల్పి చేతిఉలి!

 

‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’- న్యూటన్‌లా

నీవు నేర్పిన వృత్తిగత సిద్ధాంతాన్ని

‘ప్రభువు మనసెరిగి నడుచు’కోవడమనే

ఆధునిక రూపానికి ఉన్నతీకరించుకుని…

ఆత్మహననం చేసుకోకుండా

ఏరోజు కొలువు చేస్తున్నాం మేం?

 

నీవొక జ్ఞాపకమా…

ఎపుడైనా మరచి ఉంటే కదా?

నీవొక పాఠమా-

వల్లె వేయకుండానే బుర్రల్లో ఇంకి ఉన్నావు కదా?

 

నీ సముఖంలో నేర్చిన దానికి –

నీ పరోక్షంలోనూ మెరుగులు దిద్దుకున్నాం!

సగం జీవితం చదివాకే

నీ చెంతకు వచ్చి చేరిన వాళ్లమే అంతా…

అయినా గురుస్మరణంలో

నీ ఒక్కడినే ఎందుకు తలచుకుంటున్నాం?

 

నేర్పినది కొంత

నేర్పకనే బోధపరిచినది కొండంత

చివరకు, నీ తుదిశ్వాస కూడా

మాకు బతుకు పాఠమే అయింది!

బహుపార్శ్వాల నిస్సంగత్వమైంది!!

 

=== ==

అక్షర భిక్ష

అక్షరమైన భిక్ష

అక్షరం- ప్రశ్నగా ఎదుట నిలిచిన,

ఏ క్షణం- నీ స్మృతిని తవ్వుకోకుండా ఉన్నాం మేం!

అందుకే,

వినా గురుదేవం ననాథో ననాథః

సదా గురుదేవం స్మరామి స్మరామి

 

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ

ప్రణామేచ్ఛ యాగత్య సేవాం కరోమి

సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం

ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో బూదరాజా

 

(కె.ఎ. మునిసురేష్ పిళ్లె,  1994 బ్యాచ్ విద్యార్థి, ఆదర్శిని, హైదరాబాద్)

 

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

3 comments

Leave a Reply to వి.వి. భరద్వాజ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పిళ్ళై అద్భుతంగా ఉంది. నిజం చెప్పాలంటే ఇందులో నువ్వు ప్రయోగించిన కొన్ని పదాలకు నిఘంటువు చూసి అర్థాలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఇంతటి జ్ఞానం వున్నవాడు నా మిత్రుడు, ఆప్తుడు అయినందుకు గర్వపడుతున్నా. అభినందనలు. – యర్రా శ్రీనివాస్, విశాఖపట్నం.

  • సురేష్ పిళైగారు…గురువుగారిభోధనలుద్వారా తను సముపార్జించి విజ్ఞానాన్ని భావనా పఠిమను అక్షర బద్దం చేసారు…
    మిక్కిలి వినయం తో అకుంఠితదీక్షతో తను సాథించిన జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకున్నారు. యింకా…యింకా …సాథిస్తున్నారు.
    మంచి ఆలోచనా, దూరదృష్టి, అంకితభావం వీరికలానికి గల బలం.
    రాసినది కవితైనా, కథైనా, నవలైనా అందులో ప్రస్పుటిస్తుంది వారి ప్రతిభ. ప్రభు కవితలొ కూడా ఆ బలమే ప్రతిబింబించింది అనుటలొ అతిశయోక్తిలేదు.

  • గురువును తలచుకొనేవారు కరువైన రోజులివి. గురువును కమేడియన్ స్థాయికి దించిన ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే సమాజం కదా ఇప్పుడు. హృద్యంగా రాశారు పిళ్ళైగారు. గురువు నేర్పిన ‘ప్రభువు మనసెరిగి’ వంటివాటినీ చెప్పారు. మొత్తంగా కుడోస్..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు