ప్రపంచీకరణ తరవాతి నేనూ- మనమూ!

సంక్షోభ సమయంలో  రచయితలు ‘సూది మొనమోపినంత’  స్వేచ్ఛా స్థలం కోసం  తమ గొంతును  తమదైన రీతిలో   నిపిస్తున్నారు. నిరంకుశత్వానికి, కవికీ ఏ స్థల, కాలాల్లోనైనా నిత్య వైరుధ్యమే.  

 1990లలో మొదలైన ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో అసమానతలు  పెరిగి పెరిగి, నల్ల చట్టాలుతో ప్రశ్నించే గొంతులను మత జాతీయవాదం  నొక్కేస్తూ  దేశ రాజ్యాంగ మౌలిక నిర్మాణానికే ఎసరు వచ్చింది. ప్రపంచంలో చిరు దేశాలపై, చిన్న జాతులపై, చిన్న భాషలపై  అగ్రరాజ్య కూటమి దూకుడుకు  తోడుగా ఇక్కడ  బహుజన, మైనారిటీలపై దేశ  పాలక వర్గాల ఆధిపత్య ధోరణి తమకు  వ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించే అప్రజాస్వామిక ధోరణి  పెచ్చరిల్లింది. మన దేశంలో  మతం, జాతీయతలు కలగలిసి మత జాతీయ వాదం, దేశ భక్తిల పేరిట లౌకిక వాదం, ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాల్లోని సమతా వాదం భావనలకు పెను ముప్పు వాటిల్లుతోంది. ప్రశ్నించడమే దేశ  ద్రోహంగా వర్ణించబడి వలస చట్టాలు పేరుకే  మారి సారంలో మరింత నల్ల చట్టాలుగా  మేధావుల భావ స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్నాయి. ఈ సమయంలో  రచయితలు ‘సూది మొనమోపినంత’  స్వేచ్ఛా స్థలం కోసం  తమ గొంతును  తమదైన రీతిలో   నిపిస్తున్నారు. నిరంకుశత్వానికి, కవికీ ఏ స్థల, కాలాల్లోనైనా నిత్య వైరుధ్యమే.  

 ఐతే కవి వినిపించే గొంతు కేవలం   వారిదే కాదు.

“సామాన్య ప్రజల అతృప్త వాంఛలతో విశీర్ణమై ఉన్నారు. వారున్న స్థితిని వారు వివరించలేరు. బాధ చెప్పుకోలేరు. కవి కూడా వాళ్ళ బాధ ఏమిటో చెప్పలేడు. కానీ అతనికి కవితావేశం అనే వరం ఉంది. ఆ సమయాల్లో అతను అభివ్యక్తం చేయగలుగుతాడు. కవి వారికి అభివ్యక్తం చేస్తున్నపుడు  వారు తమ బాధలనే తమకు నివేదిస్తున్నట్లు గుర్తించగలుగుతారు” అని జార్జ్ థామ్సన్   తన మార్క్సిజము, కవిత్వమూ అన్న పుస్తకంలో రాశారు .( సోమసుందర్ ఆవంత్స, పే.38) 

 కవి గాయకులు హోమర్ కాలం నుంచి ప్రజల కోసం పాడారు. గ్రీకు ఇతిహాసాలైనా లేక భారత దేశంలోని రామాయణ, భారతాలైనా కాలక్రమం నే లిఖిత రూపంలో వచ్చాయి. ఫ్యూడల్ యుగంలో పోతన లాంటి వారు మినహా  ఎందరో రాజ భక్త  కవులు. ఆధునిక కాలంలో ఎందరో  పాలక వర్గాల భావ ప్రతినిధి కవులు. అయితే కవి తన కోసం తాను రాయాలా, ప్రజల కోసం రాయాలా అనే ప్రశ్న గతంలో పెద్ద  సైద్ధాంతిక వివాదాలకు దారితీసింది. కానీ  రొమాంటిక్ యుగం తర్వాత, ఆధునిక యుగంలో  , గత ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత వ్యక్తివాదం తరువాత , కవులకి, కొమిసార్లకు  సోషలిస్ట్ రాజ్యాల్లో  సరి పడని రోజుల్లో రచయితల దృక్పథం కొంత మారింది. అన్నా ఆక్మతోవ్ లాంటి రష్యన్ కవయిత్రి నిరంకుశ పాలనకు   నిశ్శబ్ద నిరసన తెలియజేసిన కాలంలోనే చిలీలో   పాబ్లో నెరుడా ప్రజా కవిగా నిలిచాడు. 

 సమాజానికీ , కవికీ విడదీయరాని అనుబంధం ఉంది. ఇద్దరికీ ఒకరి నుంచి మరొకరికి నిజానికి  ‘విముక్తి’ లేదు.  అత్యంత స్వీయ కవిత్వంలో సైతం సమాజం, సమాజం కోసం రాసే కవుల్లో స్వీయగానం ఏదో స్థాయిలో కలగలిసి ఉంటాయి.  కవి హృదయంలో సృజన కోసం ఏకాంతం, జనం కోసం తాపత్రయం సాధారణంగా కలిసే ఉంటాయి. ఇది చాల మంది కవులకు అనుభవేకవేద్యమే.  

సెంట్రల్ యూనివర్సిటీలో ఆంగ్ల ఆచార్యునిగా చేస్తూ మరో ప్రొఫెసర్ అల్లాడి  ఉమ గారితో కలిసి ప్రముఖ రచయితలైన వోల్గా, రావి శాస్త్రి, కళ్యాణరావు,అఫ్సర్ లాంటి వారి రచనలను  ఆంగ్లంలోకి తెచ్చిన  ప్రసిద్ధ అనువాదకునిగా, తెలుగు , ఆంగ్లం లో రాసిన   ద్విభాషా కవిగా, కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి ఫెలోషిప్  పొందిన పరిశోధకుడిగా, ప్రాంతీయ, జాతీయ భాషల్లో పలు అవార్డుల గ్రహీత,ఎందరో  పరిశోధకులకు మార్గదర్శిగా , స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత కూడా విద్యా , సామాజిక, సాహితీ రంగాల్లో  నిత్య కృషీవలునిగా ఉన్న ఎమ్. శ్రీధర్ గారి కవితా సంపుటి నేనెప్పుడూ ఇంతే (2022). గతంలో ఆయన మట్టి కన్ను, Increasing Folds అనే కవిత్వ పుస్తకాలు ప్రచురించారు.  దళిత , ఫెమినిస్టు, విప్లవ ఉద్యమాలలో వచ్చిన  ప్రముఖ రచయితల  రచనల అనువాదం ద్వారా ఆ  సామాజిక ఉద్యమ పాయలతో తమ గాఢమైన అనుబంధం తమ నిజ జీవితంలో,  రచనా జీవితంలో ఆచరణాత్మకంగా  చూపించారు.

శ్రీధర్ గారి నేనెప్పుడూ ఇంతే  (2022) పుస్తకంలో పర్యావరణ పరిరక్షణ, ణగారిన ప్రజానీకం చేసే ఉద్యమాల పట్ల హృదయ స్పందన, బాల్యం, కుటుంబ , మానవ సంబంధాల పట్ల నిశిత పరిశీలనలు స్పష్టంగా గోచరిస్తాయి. ఈయన కవితల్లో అల్ప ప్రాణులకు సైతం   శ్రీశ్రీ , జాషువా గార్లు రాసినట్లు  కవితా గౌరవం లభించింది. పుస్తకం పట్టుకుంటే  ఏక బిగిన చదివించే  గుణం,భావ సుకుమారత, వ్యవస్థలపై నిశ్శబ్ద ఆగ్రహం ఉంది. ఉద్యమాల పట్ల  గాఢాభినివేశాన్ని , నిబద్ధతను శ్రీధర్  చాల మందిలాగా  ఆవేశ , నినాద రీతిలో కాకుండా తన  సూచనామయ, సున్నితంగా ఒప్పించే ధ్వనిలో , హేతుబద్ధ  దృక్పథంతో ఆలోచింపచేసే, సరళమైన శైలిలో  రాశారు.

ఈ నాడు సెల్ ఫోన్ టవర్ల ‘పుణ్యాన’ పిచ్చుకలు, ఆధిపత్య భాషల పాపాన చిరు భాషలు, సంస్కృతులు అంతరించి పోతున్నాయి. సామ్రాజ్య వాద కాంక్షతో  అణు యుద్ధాలకు సైతం సిద్ధమై, విశ్వ విజేత కావాలనే తహతహతో మానవుడు తనపై తానే భస్మాసుర హస్తం పెట్టుకోనున్నాడు. ’పిచ్చుక పద్యం ’లో కవి ఇలా రాస్తారు: “నువ్వు జీవించే హక్కుల్ని గురించి గంభీరంగా మాట్లాడగలవు/ నేను నా పిచ్చుక గూటి గురించి పలుకుతాను/ నువ్వు నెమ్మదిగా నా జాతిని నిర్మూలించగలవు / నీకు చేతనైతే ఓ పుల్లా, నాలుగు   పుడకలు తెచ్చి / ఓ బుల్లి సౌధాన్ని  నిర్మించు” (పే.15)

“నువ్వు జ్ఞాన సముపార్జన గురించి, జ్ఞాన సమాజాన్ని గురించి అందంగా పలకగలవు/ నీకు చేతనైతే జీవికీ, జీవావరణానికి, జ్ఞానానికీ ఉన్న సంబంధం గురించి ఆలోచించు” (పే.15-16)

భాషా సంబంధ భావాల గురించి అనువాదానుభవం కవితలో  తనని  సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు అనలేదని త్రిశంకు స్వర్గమైనా/ అనువాదకులుగా/ భాషాంతర ప్రతిసృష్టి / అరుదైన అనుభవం ” (పే.68) అని రాశారు. పర భాషలో ప్రయోగాలు చేయగలగడం, దాని పట్ల ’అపర ప్రేమ’ చూపించడం. సరిహద్దులు చెరిగి ” వ్వు నన్ను  అండంలో బంధించగలవు / నా బ్రహ్మాండ ప్రేమ నేలా బంధించగలవు “(పే. 71)అని కవి మాటలు.

కవి ఒకవైపు భాషల మధ్య సరిహద్దులు చెరిపేస్తూ మరో వైపు ఆధిపత్య భాషల్ని ‘పిచ్చుక పద్యం’లో ఎదిరిస్తాడు.ఈ నాడు దేశంలో ఇంగ్లీష్,  దేశ భాషల మధ్య, జాతీయ భాష గా ఏది ఉండాలనే వివాదంలో ఈ సమతా వైఖరికి  ప్రాసంగికత ఉంది. ఆధిపత్య భాషను వ్యతిరేకించడం, చుట్టూ గోడలు కట్టుకోవడం వేర్వేరు. అలాగే జాతీయవాదం, అంతర్జాతీయవాదాల మధ్య వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయత అంటే జాతీయత nullification  కాదు.  ప్రతి జాతి తనదైన మార్గంలో సామ్యవాదం చేరుతుందని మార్క్స్, ఎంగెల్స్ తమ కమ్యూనిస్టు మేనిఫెస్టో లోచెప్పడం  జరిగింది. ఏ వర్గానికి, జాతికి, భాషకు ప్రత్యేక సౌకర్యాలు ( ప్రివిలేజెస్) లేకపోవడమే సామ్యవాదమని లెనిన్ రచన ‘స్టేట్ అండ్ రెవల్యూషన్ ’లో చెప్పారు.

’అయినా నాకు తెలీక అడుగుతున్నాను  గానీ…” కవితలో మెజారిటేరియనిజంపై చురక కనిపిస్తుంది. సింహాలు, ఆధిపత్య కులాలు, మతాలు, జాతులు బడుగు ప్రజానీకంతో నిజంగా కలిసి మెలిసి మెలుగుతాయా అని ప్రశ్నిస్తూ యూనిటీ పేరు మీద ఒకే మతం, ఒకే భాష, ఒకే మంత్రం అంటూ ఐక్యత పేరుతో   భిన్నత్వాలను చదును చేసే  ఏకరూపత  రుద్దటాన్ని  సున్నితంగా  ప్రశ్నిస్తూ “కాదంటే / మన సింహాలు/అతి సహజాతి సహజంగానే / 

సింహనాదం చేస్తాయి” ( పే.73) అంటారు.

మౌనంలోని శక్తిని  ‘నివురు గప్పిన నిప్పు’ కవిత వర్ణిస్తూ అది ప్రశాంతతకు, అలజడి నుంచి పలాయనం కాక వ్యవస్థ పై  ధర్మాగ్రహ అసహనం అంటుంది. 

నిజమే . తర తరాల దురాచారాలను సహించిన అణగారిన  ఆర్తుల మనోసాగరంలో బడబానలం కావచ్చు. మరో కవిత ‘ఇది ధర్మ క్షేత్రమే’ లో స్వేచ్ఛకు, నిరంకుశత్వానికి మధ్య నిరంతర ఘర్షణ గురించి రాస్తూ భీమా కోరేగావ్ కేసు గురించి, ఢిల్లీలో రైతులు  ఫామ్ చట్టాల రద్దు కోసం చేసిన గొప్ప పోరాటం గురించి ప్రస్తావిస్తూ ఇలా రాశారు:

“ ఇటు పదహారు మంది/ స్వేచ్ఛను కోరే రాజ్య నేరారోపణ/ మేధావి నిందితులు/ అటు తమ కష్టాల/ పంట ఫలితాలను కోరే / పదహారువేల కర్షక సైన్యం/

 ఊహలకు ఊపాలకు/ సంకెళ్ళకూ కటకటాలకూ/ ఉయ్యాలలకూ ఉరికొయ్యలకూ/ సామ్యం తెలిసి వస్తుందిప్పుడే!” (పే.19)

ఈ కవితా సంపుటి లో imagery బాగుంది. ‘అమృత భారతం’ అనే కవితలో ఓ పొద్దు సూర్య బింబం బలమైన రాయి . “గాజు పలకలో చేసిన రంధ్రం / ముక్కలుగా విస్తరించిన చందాన” ఉంది.  

ఈ క్రమంలో మైనారిటీలపై  దాడులు, ఫలితంగా స్వేచ్ఛా పతంగం తీరు మారి ” తూట్లు పడ్డ/ నా అఖండ  భారత గాలిపటం/ సాయంత్రమైనా / ఇంకా రక్తం స్రవిస్తూనే ఉంది.”(పే.52)

నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుల్ రజాక్   గుర్నా కృషికి గౌరవంగా రాసిన ‘వలస ’ కవితలో కడుపు నింపుకోవడం కోసం వెళ్ళిన indenture శ్రామికులకు, లాభార్జన కోసం , సామ్రాజ్య విస్తరణ కోసం వలసవాదం తెచ్చిన  బహుళ జాతి సంస్థల నయా వలసవాదానికి తేడా చూపిస్తుంది. ఐరోపా దేశాల చేరువ లో నడి సంద్రంలో ప్రాణాలు కోల్పోయే  ’పడవ జనం’. గ్లోబలైజేషన్ ప్రక్రియలో, అమెరికన్  కూటమి మధ్య ప్రాచ్యంలో  తామే   రెచ్చగొట్టిన అంతర్యుద్ధ జ్వాల నుంచి తప్పించుకోడానికి వెళ్ళే శ్రామిక జనాన్ని చూసి ఐరోపా దేశాలు బెంబేలెత్తిన వైనం అందరికీ తెలిసిందే. 

సాలె పురుగు కవితలో సాలీడును చూసి సూరీడు కిరణాలను ప్రసరించడం, సాలె వారు అగ్గిపెట్టెలో పట్టే చీర నేయడం,ఇంజనీర్లు నిర్మాణ కౌశలం నేర్చుకోవడం ఒక అందమైన భావన. సాలీడు ను అసహ్యంతో చీపురుతో చిమ్మేవారిని  “ అన్నట్టు/ మీరు బుద్ధి జీవులైన/ మానవులు కదా!” అన్న పలుకుల్లో  వ్యంగ్యం, నిరసన దాగి ఉన్నాయి.నేడు భువిపై అవతరించిన  నూతన దేవుడు  కృత్రిమ మేధ ఆరాధనలో మానవుడు మరెంత అమానవీయం అవుతాడో?

 విశ్వ వ్యాపారమైన సెల్ ఫోన్ గురించి, ఈ మెయిల్ ఎరా లో  తంతికి  అంత్యక్రియలు గురించి మాత్రమే కాక హఠాత్తుగా వెళ్ళిపోయిన పక్కింటి నరసింహం, మిత్రుడు ప్రభుల గురించి కదిలించే కవితలు ఉన్నాయి.  మనిషిలో ఈవిల్ గురించి “ చేదెక్కడో లేదు/ చేదెక్కడో లేదు/ మనమంతా చేదు/ అందుకే/ జగమంతా చేదు/ జగమంత చేదు” అనే పంక్తులు చిన్న పదాలతో లోతయిన తత్వాన్ని చెబుతాయి. శ్రీ శ్రీ రాసిన చేదు విషం,జీవ ఫలం అనే మాటలు గుర్తు వస్తాయి. శ్రీధర్ కవితలో ఎక్కువ suggestiveness ఉంటుంది.

కుటుంబం గురించిన కవితలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.  ‘జ్ఞాపికలు’ కవితలో అత్యంత  వ్యక్తిగత విషయాల బహిరంగ ప్రదర్శన ఎందుకని , ‘ప్రేమ’ అనే కవితలో ప్రేమని నిరంతరం నిరూపించుకోవాల్సిన (దు)స్థితినీ, కాల గమనంలో  అనుబంధాలు ఎలా మారతాయి, స్వచ్ఛ ప్రేమ సైతం  ఎలా అడుగంటుతుంది అనేది చెబుతూ ” నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికి / పిడికెడు అటుకులు  కూడా కాదు/  ఒక్క తులసి దళం సరిపోలేదా !” అంటాడు కవి. ఇక్కడ  కృష్ణుడు కుచేలుడు మధ్య స్నేహం , రుక్మిణి 

తులసి దళంతో కృష్ణుడిని తులాభారంలో తూచే కథలు పాఠకులకు గుర్తుకు  వస్తాయి. 

 కుటుంబ వ్యవస్థలోని ఈ పరాయీకరణ అనేది కేవలం కుటుంబంలోని వ్యక్తుల బలహీనత కాదు. మనిషికీ , మనిషికీ మధ్య డబ్బు సంబంధం ప్రధానమైన నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రధాన లక్షణం. కార్మికులే కాక దశాబ్దాలుగా మేధోశ్రమ చేసిన ఓ ప్రొఫెసర్ లేదా ఉద్యోగి తాను  ఎంతో మక్కువతో  దశాబ్దాలుగా పనిచేసిన స్థలానికి ఉద్యోగ విరమణ తర్వాత స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం ఉండదు. అది ’భద్రత’ పేరుతో జరిగే నియంత్రణ అనిపించవచ్చు. నిజానికి అది  మేధో శ్రామికునికి కూడా తన మేధో శ్రమశక్తి మార్కెట్లో అమ్మకపు సరుకు గాని మరేదీ కాదు.  ఇక్కడ జరిగినది ఏమిటంటే ఆ ప్రైవేటు యాజమాన్యం ఆ ఉద్యోగి  శ్రమశక్తిని మాత్రం తీసుకుని తన లాభాలకు వాడుకుంది అనేది  మాత్రమే.

కవి దృష్టిలో “బాల్యం అంటే…” సీతాకోక చిలుక కోసం ఆతృతగా నిరీక్షణ, పుట్టిన రోజున తిరిగి వచ్చిన తాత తిరిగి  మళ్ళీ వెళ్ళిపోడు అనేనమ్మకం, ఎంత గోల చేసినా   అమ్మ తిట్టడమే కానీ కొట్టdaనే నమ్మకం, భూమి గుండ్రంగా ఉంటే ఎలా నిలబడి ఉన్నామనే ప్రశ్న తలెత్తడం . ఈ కవిత  చదువుతుంటే పల్లెటూరి పిల్లల  బాల్యంలో తూనీగ రెక్కలు కట్టి స్నానం చేయించడం, అసలు ఎలా ఈ లోకంలోకి వచ్చామని  first cause గురించిన సందేహం మొలకెత్తడం, చింత చెట్టుపై దయ్యం, ఆకాశంలో సాయం సంజె మబ్బుల్ని  అగ్గి కొండలనుకొని పరిగెత్తడం, కొయ్య కత్తులతో అలీబాబా- నలభై దొంగల ఆటలు  ఎన్నో గుర్తుకొస్తాయి. ఇలా పాఠకునిలో కలిగించే  సంబంధిత భావ ప్రసారం ఈ  కవిత సాధించే విజయం.

 ’ఇరుగు పొరుగు’ కవితలో మొక్కలు నిర్మించే  అనుబంధ వారధి , ఆసక్తి కలిగించే   ’మిణుగురుతులు’ పద ప్రయోగం ఉన్నాయి. విరిగిన కొమ్మ,  విడిపోయిన పువ్వు, నలిగిన ఆకు కోసం తపన పడే తల్లి గురించి ” తొంభై ఏళ్ళు నిండినా / బాధల ఒడిలో  బతుకీడుస్తున్నా/ ఎక్కడో రాజుకుంటున్న ఆశతనం చిరునామా అమ్మ.” (పే.39) మనల్ని కదిలిస్తుంది.

మరో కవితలో  మానసిక ఆసుపత్రిలో కలుసుకుని మొహమాటంతో   కనీసం పలకరించుకోలేని  ఒక నాటి   సహచరుల అనుభవం వ్యక్తపరిచారు.

చివరగా ’ఎరుక ’ కవితలో  జరా సంధుడు , రావణుల కన్నా “మృత్యువును జయించడమొక్క/ బురద పామునకే ఎరుక!” (పే.80) అని కవి  చిరు ప్రాణులవైపు నిలబడటం బాగుంది. 

ఆర్థిక వ్యవస్థలోని అసమానతలు, యంత్ర స్వామ్యంలో ప్రకృతి సమతుల్యం నాశనం అవడం,   పల్లెలు క్రమంగా క్షీణించి పట్టణీకరణ పెరగటం, కుటుంబ సంబంధాల్లో పరాయీకరణ , డా.anthropo-centric అభివృద్ధిలో అల్ప ప్రాణులు,  భాషలు , జాతులు, కులాలను తక్కువగా చూడటం ఒక ఎత్తయితే, పర్యావరణ విధ్వంసం,సామూహిక విధ్వంసక ఆయుధాల  వ్యాపారంతో చివరకు సకల  ప్రాణికోటినీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆహుతి చేసేందుకు  వెనుకాడని నయా వలసవాదం స్వీయ సమర్థనను వ్యతిరేకించడం ఈ సంపుటిలో తన సొంత  శైలిలో శ్రీధర్ భావ వ్యక్తీకరణ చేశారు. 

శ్రీధర్ పలు భాషల సాహిత్యం , విమర్శనా పద్ధతులను   అధ్యయనం  చేసి, ఎందరో విద్యార్థులకు బోధించి అనువాద రంగంలో నిర్విరామ కృషి చేస్తూ సమాజ ప్రగతి  గమనంలో శ్రామిక,దళిత, ఫెమినిస్టు దృక్పథాలను  జీర్ణించుకుంటూ తాను  మారుతూ, సమాజ మార్పుకు దేశ సాహితీ రంగంలో తనకంటూ   ఒక ఉన్నత స్థానం సంపాదించి ముందుకు సాగుతున్నారు.

నేనిప్పటికీ ఇంతే అనే  శ్రీధర్ గారి నిరాడంబర  వ్యక్తిత్వం, భావనా లోకం, సామాజిక,రాజకీయ పరిణామాల పట్ల తనదైన స్పందన తెలుసుకోవాలంటే  పాఠకులు జాగరూకతతో ఆ సంపుటిని  చదవాల్సిందే.

*

 

 

 

రవీంద్రనాథ్, జె.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు