ప్రతీక పాత్రల తాత్విక కథనం-జాగరణ

థ నిడివిలో జీవితమంత విశాలమైంది కాకపోవచ్చు. కానీ జీవితం మొత్తాన్ని నిర్వచించొచ్చు. పాత్రల నుంచి వచ్చే ఏ మాటో, ఏ సంభాషణో కథనేకాదు, పాఠకుల జీవనగతినీ మార్చేయొచ్చు. పాతవాటిని తుడిచిపెట్టి మన మనోనేత్రంపై సరికొత్త కలలరంగు అద్దొచ్చు. కథను అర్థం చేసుకోవడం అంటే కథను మొదటి నుంచి చివరిదాకా చదవి వస్తువో, ఇతివృత్తమో తెలుసుకోవడం కాదు. పాత్రలు, వర్ణనలు, సంభాషణల వెనుక దాగున్న అంతరార్థాన్ని తర్కించడం, చర్చించడం. రచనా నేపథ్యం, రచయిత దృక్కోణాల నుంచే కాకుండా ఆయా సమాజ మూలాల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. దాని ద్వారా మానవ చరిత్ర స్వభావ తాత్వికతను శోధించడం కూడా. అందుకే ఏ కథనైనా దానికి తగిన మూల్యాంకనాలతో కొలవాలి. లక్ష్య లక్షణాలతో తూచాలి.

అనుభవాలు అనుభూతుల గాఢతలోంచి, బాధాతప్త తపనలోంచి పుట్టే కథే పదికాలాలపాటు నిలుస్తుంది. అన్నిరకాల కథలు అందరూ రాయలేరు. రాసినా అవి వస్తురూపాల లేమితో కథాసాగరంలో కొట్టుకుపోతాయే తప్ప నిలబడవు. బి. అజయ్ ప్రసాద్ కథకుడిగా ఓ ఒరవడిని, నుడిని, బంధాల్లోని సూక్ష్మరేఖలను విశ్లేషించే సునిశిత దృష్టిని ఏర్పరచుకున్నాడు. వీరు 30కి పైగా కథలు రాశారు. “లోయ” పేరుతో కథల సంపుటీ వెలువరించారు. వీరి కథల నేపథ్యాలు, పాత్రలు, సన్నివేశాత్మక సంఘర్షణలు ఎక్కువగా సంచారజీవితాల తాత్వికతలోంచి పురుడుపోసుకున్నాయి. “జాగరణ” కథ కూడా అలాంటిదే. చంద్రుడి వెన్నెల్లా చల్లగా మొదలై నల్లని బొగ్గుల మధ్య రగులుతున్న నిప్పుకణికలా కాల్చేస్తుంది. గిరికీలు కొడుతూ సాయంత్రానికి గూటికి చేరే పక్షుల్లా ప్రారంభమై అంధకారంతో, అంతుచిక్కని లోయలో దారితప్పిన పక్షిలా మనల్ని వదిలేస్తుంది. మరి ఇంతగా పాఠకుల్ని అతలాకుతలం చేసే “జాగరణ” కథలో ఏముంది? కథా లక్ష్యం ఏమిటి? లక్షణాలు ఏవి? కథలోని మెరుపుల మరకలేంటి? అని ఆలోచిస్తే…

కథ సాయంకాలపు వర్ణనతో చాలా సాధారణంగా మొదలవుతుంది. “నల్లటి పిట్టలు రెక్కలు విప్పుకొని గిరికీలు కొడుతూ గూళ్ళకు చేరుకుంటున్నాయ”నే వర్ణనే మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. సంధ్యా సమయం పిట్టలు నల్లగానే కనిపిస్తాయిగా అనుకుంటే పొరపాటే.! మరి గిరికీలు ఎందుకు కొడుతున్నాయి? చీకటి పడింది కదా, దారి కనపడలేదు అనే సమాధానం చెప్పొచ్చు. కానీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియాలంటే కథంతా చదవాలి. లేకపోతే జవాబు దొరకదు. ఆ తర్వాత బైరాగి బాహ్య స్వరూపం, అతడి యాచక వృత్తి, అతడు నివశించే కూలిపోయిన ఇంటి గురించి చెప్తాడు కథకుడు. బైరాగి నడిచివస్తుంటే “నలుపు తెలుపు కలగలిసిన పొడవాటి గెడ్డం సాయంత్రపు ఎండలో అతడి నీడతో పాటు నడుస్తూ ఉంది.” అని వర్ణిస్తాడు. మరి ‘నలుపు, తెలుపు, నీడతో నడవడాన్ని’ ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వర్ణన చేయడంలో కథకుడి ఉద్దేశ్యం ఏమిటి?… దీనికి సమాధానం కావాలన్నా బైరాగి పాత్రను చివరి వరకు ఫాలో అవ్వాల్సిందే. అతడి మంచిలోని చెడునూ చూడాల్సిందే! ఇక “కూలిపోయిన ఇంటి గోడల నీడపట్టున బాటసారులు పులిజూదం ఆడేవాళ్ల”ని చెప్తాడు రచయిత. ‘పులిజూదం’ పులులు మేకలకు మధ్య జరిగే యుద్ధం లాంటి  ఓ ఆట. మరి దాని గురించి కథకుడు ఎందుకు ప్రస్తావించాడో తెలుసుకోవాలన్నా… దానిని స్త్రీ, పురుష పాత్రలకు ఎలా ప్రతీక చేశాడో అవగతం చేసుకోవాలన్నా కథను ఆసాంతం చదవాల్సిందే!!. ఇలాంటి ఎన్నో చిక్కుముళ్ళను గుర్తిస్తూ, దాటుకుంటూ పోతే తప్ప ముగింపుకు ముందు వచ్చే ట్విస్ట్ ను అర్థం చేసుకోలేం. అజయ్ ప్రసాద్ లోని కథకుడ్ని, కథను పూర్తిగా పట్టుకోలేం.

ప్రతి పదం, వాక్యం, వర్ణన వెనుక అంతర్లీనంగా కథను ఏదో ఒక విధంగా ప్రతీక చేయడం కనిపిస్తుంది రచయిత. ‘మొండిగోడలు నిశ్శబ్దంగా నించుని ఉన్నాయి’. ‘పొయ్యిమీద మూకుడు స్తబ్దంగా కూర్చుని ఉంది’. ‘మొండి గోడల అవతల నుంచి గుండ్రని చంద్రుడు విచారంగా చూస్తున్నాడు’. ‘దీపం కాసేపు నిశ్శబ్దంగా వెలిగి చివరకు చీకట్లో అంతర్థానమైంది’. ‘చీర మడతల కింద కోమలమైన పాదాలు’. ‘చీకటి నీడల మధ్య చెట్ల కొమ్మలు దిగులుగా చూస్తున్నాయి. నేల మీద ఆకుల నీడలు గాలికి కలగాపులగంగా కదులుతూ ఉన్నాయి.’ ‘కుండలో నీళ్ళ కదలిక. భగభగమని చీకటిని పెకలిస్తున్న రెండు దీపాలు. కాటుక కళ్లు.’ ‘ద్వంద్వ యుద్ధం చేస్తున్న ఇద్దరు మనుషుల నీడలను నివ్వెరపోయి చూస్తూ, పున్నమి చంద్రుడు తెల్లటి మబ్బుల చాటు నుంచి ఆతృతగా పైపైకి వస్తున్నాడు’. ‘చెట్ల ఆకుల్లోకి చొచ్చుకు వస్తున్న వెన్నెల చీకటిని విరుచుకు తింటూ ఉంది.’… ఇలాంటి ఎన్నో వర్ణనలను కథకు, పాత్రలకు, వాటి స్వభావాలకు, ఆయా సన్నివేశసందర్భాలకు ప్రతీక చేశాడు రచయిత. ఇవన్నీ కథను లోతుగా అన్వేషించడానికి ఉపకరించే సూచనలు, సూచికలు, దిక్సూచులు. వీటిని పట్టించుకుకోకుండా కథను చదివితే కథకు, కథకుడికి అన్యాయం చేసిననవాళ్లమవుతాం. కథనూ పూర్తిగా అనుభూతి చెందలేం.!?

కథలో ప్రధానంగా కనిపించే పక్షి పావురం. దాన్ని గురిగాడు బైరాగి దగ్గరకు పట్టుకొచ్చి చంపబోతే, బైరాగి వద్దని వారిస్తాడు. గురిగాడు ఎగరకుండా దాని రెక్కలు పీకేశాక బైరాగి పెంచుకుంటూ ఉంటాడు. ఒకరోజు గురిగాడు దాని కనురెప్పల్ని దారంతో కుట్టి, పిట్టల్ని పట్టుకోవాడనికి తీసుకెళ్తానంటాడు. కానీ ఆ పావురం బైరాగి, మణిక్యం కోట్లాటలో గంప తొలిగిపోవడంతో ఎగిరిపోతుంది. గురిగాడు రెప్పలు కుట్టేసిన విషయం బైరాగికి చెప్తూ బాధతో “కుట్టకపోతే ఎట్టా కుదుర్ది సెప్పు. యాటకు ఇడిసిన పిట్ట జతగాడిని చూసుకుని ఎగిరిపోదా. అందుకనే దానికి సూపులేకుండా రెప్పలు సూద్దారంతో కుట్టేసినా సావి…. …. …. దానికి కళ్లు కుట్టకుండా ఉంటే ఎంత బావుండును” అని వాపోతాడు. ఈ పావురాన్ని కథకుడు స్త్రీ పాత్రకు ప్రతీక చేశాడు. ఈ విషయాన్నే రెండు చోట్ల బైరాగి, మాణిక్యం పాత్రలతో చెప్పించాడు. ఆ మాటలను జాగ్రత్తగా పట్టుకోకపోతే కథకుడిలోని కథన నైపుణ్యాన్ని మిస్ అవుతాం. కథలో దాగున్న రహస్యాన్నీ మిస్ అవుతాం.

మాణిక్యం తనతోపాటు ఒక స్త్రీని తీసుకొచ్చి బైరాగితో ‘రాత్రికి ఇక్కడే పడుకుంటాం’ అని అంటాడు. బైరాగి ఆమెను గమనించి ‘వదిలెయ్య’మని చెప్తాడు. అందుకు మాణిక్యం “ఈ పిట్టకోసం నేను పడని యాతన లేదు. ఇప్పుడిడిసి పెట్టడం జరిగే పనికాదు” అంటాడు. బైరాగిని మాణిక్యం కొడుతుంటే గురిగాడు వచ్చి కాపాడతాడు. బైరాగి గొడవకు కారణం చెప్తూ “ఏమీ తెలియని అమాయకప్పక్షి. ఇది మంచి, ఇది చెడు అని ఎట్టా చెప్పేదిరా? ఆడతా పాడతా ఎగిరే పిట్టని కట్టిపడేయటం గాదా? మానిక్కెం అసుమంటోడని ఆయమ్మికెలా చెప్పేది చెప్పు.” అని తను చేయబోయిన తప్పు వెనకున్న మంచిని వివరిస్తాడు. ఈ రెండు చోట్ల ‘పిట్ట, పక్షి’ పదాలు స్త్రీకి సంబంధించినవే. వీటిని పట్టుకోకుంటే కథలో అజయ్ ప్రసాద్ చేసిన ప్రతీక టెక్నిక్ అర్థం కాదు. పావురానికి, స్త్రీకి ఉన్న సంబంధమూ బోధపడదు.

మాణిక్యంతో వచ్చిని స్త్రీని బైరాగి అనుభవించడానికి పూనుకుని “మానిక్కెమే నీ దగ్గరకు పంపాడ”ని అబద్దం చెప్తాడు. ఆమె వణుకుతూ రెండు చేతులూ జోడించి “నేనసుమంటిదాన్ని కాను సావి” అంటుంది. మాణిక్యం వచ్చి బైరాగిని కొట్టడంతో ఆమె గబగబ గుడ్డలు సర్దుకొని ఊడదీసిన కిటికీ గుండా గోడదూకి చీకట్లోకి పారిపోతుంది. “ఆమెను కాపాడటానికే చెడుగా ప్రవర్తించానని, అంతా మంచే జరిగింద”ని బైరాగి గురిగాడితో చెప్తాడు. కనురెప్పలు కుట్టిన పావురం దారికనపడక చీకట్లో ఎక్కడికి పోయిందోనని మధనపడుతున్న గురిగాడికి, చీకట్లో కలిసిపోయిన ఆడమనిషి గుర్తొచ్చి ‘తప్పు జేసినావేమో సావి’ అని బైరాగితో అంటాడు. కళ్లు కనపడక చీకట్లో కలిసిపోయిన పావురానికి, మనుషుల మీద నమ్మకం కోల్పోయి గోడదూకి చీకట్లో కలిసిపోయిన స్త్రీకి తేడా లేదన్నది రచయిత ఉద్దేశం. పావురాన్ని, స్త్రీని పోల్చిచూస్తే కానీ రచయిత చేసిన ఈ ప్రతీకాత్మకత అర్థంకాదు.

కథ ప్రారంభంలో చేసిన ‘చీకట్లో గిరికీలు కొడుతున్న పక్షుల’ వర్ణన చీకట్లో కలిసిపోయిన స్త్రీని తెలిజేస్తుంది. ‘నలుపు తెలుపు కలిసిన బైరాగి గడ్డం నీడ’ వర్ణన అతనిలోని మంచి చెడుల తారతమ్యాన్ని వివరిస్తుంది. ‘పులిజూదం’ ఆట కథలో పాత్రల మధ్య జరిగిన అంతర్ బహిర్ యుద్ధానికి ప్రతీక. ఇలా ప్రతి వర్ణనని, మాటను… కథలోని లోతులను అవగతం చేసుకునేలా రాశాడు అజయ్ ప్రసాద్.

పాత్రలను చెప్పడంలో కథకుడు ఒక క్రమపద్ధతి పాటించాడు. బాహ్యరూపం, వృత్తి, ప్రవర్తనలను వరుసగా చెప్పే ప్రయత్నం చేశాడు. నాలుగు క్యారెక్టర్లే అయినా వాటి మధ్య సంక్లిష్టత ఎక్కువ. ఒక పాత్రతో మరో పాత్ర విబేధిస్తుంది. ఒక పాత్ర మరో పాత్రను సరిగా అంచనా వేయలేదు, అర్థం చేసుకోలేదు. ఇదే విషయాన్ని కథకుడే చెప్తూ “బైరాగి గురిగాడి దగ్గర ఒకరకంగా ఉంటే మాణిక్యం దగ్గర మరోలా ఉండేవాడు. మాణిక్యంతో అతడికి మాటలు తక్కువ. వాళ్ళిద్దరిలో- ఒకరు ఉన్నప్పుడు మరొకరు ఉండేవారు కాదు. ఒక్కోసారి అతిథులిద్దరూ ఒకేసారి రావడం జరిగేది. అలాంటి సమయాల్లో బైరాగి మొహంలో భావాలను చదవడం కష్టం. అతడు తెగ ఇబ్బంది పడేవాడు. వచ్చిన అతిథులిద్దరూ కూడా ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడకుండా ముభావంగా ఉండేవారు. ఇద్దరి మధ్యా పొసిగిన సాంగత్యం ముగ్గురి మధ్యా పోసిగేది కాదు.” బైరాగి మాణిక్యానికి సరైన సాంగత్యం లేదని నేరుగా చెప్పిన కథకుడు గురిగాడు, బైరాగి మధ్య ఉన్న ఆలోచనల అంతరాన్ని సన్నివేశపరంగా చూపించాడు.

గురిగాడు తెచ్చిచ్చిన పావురం లేనిదే పూటగడవదు బైరాగికి. అలాంటి పావురాన్ని గురిగాడు మళ్లీ చేతుల్లోకి తీసుకుంటే “ఎం జేస్తండా?” అని ప్రశ్నిస్తాడు. అందుకు గురిగాడు “దీన్ని తెల్లారి గుళ్ళకమ్మకు తీసుకబోతుండా సావి. ఈ పెంటి ఏ పోతు ఎంటబడిపోకుండా చేస్తన్న. అయినా ఇయ్యన్ని నీకు తెలవవులే. నువ్వు సాములోరివి కదా” అని వికృతంగా నవ్వుతాడు. కానీ ఆడమనిషిని మాణిక్యం వలలో చిక్కుకోకుండా బైరాగి కాపాడతాడు. దీంతో గురిగాడికి బైరాగిపై ఉన్న అభిప్రాయం తప్పని తేలిపోతుంది.

బైరాగి పావురం గురించి గురిగాడికి చెప్తూ “మనుషులు తమకు తెలిసినా తెలియకున్నా మంచీ చేస్తారు. చెడూ చేస్తారు. కార్యం కంటిముందున్నంత వరకే. చేతులు దాటాక అన్నీ మనమనుకున్నట్టే జరగవు. దేని దిశ దానికే ఉంటుంది. రెక్కలిప్పుకున్న పావురం ఎగిరినట్టు దేని దిక్కు అది ఎగిరిపోద్ది. గాలికి పుట్టిన అల సముద్రంలో కనిపించనంత దూరం కొట్టుకుపోయినట్టు అది ఎటో ఎళ్ళిపోద్ది..” అని చెప్తాడు. అంతా విన్న గురిగాడు “నువ్వేం చెబతన్నవో నాకు తెలవదు సావి” అంటాడు. కానీ ఈ మాటల్నే ఆసరా చేసుకుని గురిగాడు మాణిక్యం నుంచి స్త్రీని కాపాడానని చెప్పిన బైరాగిని ప్రశ్నిస్తాడు.

“ఆ యమ్మితో బోతే మానిక్కెమే మారేవోడేమో. నువ్వు జెప్తవు గదయ్యా నిన్నటి మడిసి ఇయ్యాల మడిసిగాడని, మడిసి మారతానే ఉంటాడని… అసలాడు మారినాకే ఈడికి వచ్చినాడేమో ఎవురికి తెలుసు… మానిక్కాన్ని నమ్మనీకుండా జేసినావు సరే… ఆ యమ్మి లోకంలో ఎవుర్నీ నమ్మకుండా జేసినావు గదా… ఎంతపని జేస్తివి సావీ.” అన్నాడు గురిగాడు. ఆ మాటల్లోని లోతులను గ్రహించిన బైరాగి నోటమాట పడిపోయిన వాడిలా అయిపోతాడు. అలాంటి సత్యాన్ని గురిగాడు చెప్పగలడని ఊహించని బైరాగి చేష్టలుడికిన వాడిలా మెరుస్తున్న కళ్ళతో పరిపూర్ణంగా అతడి వైపు చూస్తాడు. ఈ ‘పరిపూర్ణం’ పదం వెనుక అతడికి కలిగిన ఏదో జ్ఞానోదయం కలిగిందని స్పష్టం చేస్తాడు రచయిత. పాత్రల మధ్య ఇంత సంక్లిష్ట సంశ్లిష్టతలను సృష్టించిన అజయ్ ప్రసాద్ ను అభినందించకుండా ఉండలేం.

కథలను అర్థం చేసుకోవడానికి, పరిశోధించి నిగ్గు తేల్చడానికి పద్ధతులు, సూత్రాలు చాలా ఉండొచ్చు. కానీ అన్ని కథలకు అవే సరిపోకపోవచ్చు. ఒక్కోసారి కథను బట్టి కొత్త వ్యూహాలు, నిర్మాణాలు తయారుచేసుకోవాలి. అన్నింటిని మూసధోరణిలో చూస్తే కథా సౌందర్యాన్ని, స్వభావాన్ని, స్వరూపాన్ని అస్వాదించలేం. అర్థం చేసుకోలేం కూడా.

 

*

జాగరణ

  • -అజయ్‌ప్రసాద్‌

 

డమట సూర్యుడు కొండలమాటుకి దిగిపోగానే తూర్పున పౌర్ణమి చంద్రుడు దిగంతం నుంచి పైకి లేచాడు. పగలంతా ఎండకు కాగిన చెట్లు సాయంత్రపు చల్లటి గాలికి తలలూపుతూ ఉన్నాయి. నల్లటి పిట్టలు రెక్కలు విప్పుకుని గిరికీలు కొడుతూ గూళ్ళకు చేరుకుంటు న్నాయి.

చీకట్లు ముసురుకునే వేళ వరకు పగలంతా భిక్షాటనకు ఊరంతా తిరిగి జోలె నింపుకుని ఎప్పటిలానే తార్రోడ్డు నుంచి ఊరి చివరకు దారితీసే కాలిబాట పట్టాడు బైరాగి. అతడి ఒంటి మీద ఉన్న కాషాయవస్త్రాలు నలిగి, మాసి మట్టిరంగులోకి మారిపోయి ఉన్నాయి. నల్లగా, బక్కగా ఎండిపోయిన కొమ్మలా ఉన్నాడతను. చెమటకి నుదుటి మీది విభూతి, కుంకుమ చెరిగిపోయి ఉన్నాయి. నలుపు తెలుపు కల గలిసిన పొడవాటి గెడ్డం సాయంత్రపు ఎండలో అతడి నీడతో పాటు నడుస్తూ ఉంది.

పగలంతా మనుషులు ఒక ఊరి నుంచి మరొక ఊరికి నడుచు కుంటూ వెళ్ళే కాలిబాట పొద్దుగూకే కొద్దీ నిశ్శబ్దమవుతూ ఉంది. బైరాగి కాలిబాట దాటి ఊరి చివర గుబురు చెట్ల మధ్య సగానికి కూలిపోయి ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టేసరికి పూర్తిగా చీకటి పడింది.

ఎప్పుడైనా కొత్తవాళ్ళు, పొరుగూరు వెళ్ళే బాటసారులు కాలిబాట నుంచి నడిచిపోతూ కూలిపోయిన ఆ ఇంటిని వింతగా చూసేవారు. ఒక్కోసారి పనీపాటాలేని సోమరులు మొండిగోడల నీడ పట్టున కూర్చుని పులిజూదం ఆడేవారు. కొత్తవారు ఎవరొచ్చినా బైరాగి పట్టించుకునేవాడు కాదు. వచ్చినవారు ఒకటి రెండు రోజులకే అక్కడి నిశ్శబ్దానికి విసుగొచ్చి వెళ్ళిపోయేవారు.

అతను ఆ పాడుబడ్డ ఇంట్లో ఎంతకాలం నుండి ఉంటున్నాడో ఎవరికీ తెలియదు. రోజుల తరబడి ఒంటరిగానే ఉంటాడు. వీపు గోడకు ఆనించి శూన్యంలోకి చూస్తూ నిశ్శబ్దంగా గడిపేస్తాడు. ఒక్కోసారి తనలో తనే మాట్లాడుకుంటూ అరచేతులు గాలిలోకి చాపి వేళ్ళవంక దృష్టి నిలిపి విచిత్రంగా అరిచి చేతులు వెనక్కి లాక్కుంటాడు. ఆ చేష్టల్ని చూసే అతడొక విచిత్రమైన సాధువని చెప్పుకుంటుంటారు.

బైరాగి ఇంట్లోకి రాగానే దీగుడు లోపల కిరసనాయిలు దీపం ముట్టించి గదిలో ఒకవార గంప కింద ఉన్న పావురాన్ని బయటకు తీసి దాని ముందు నూకలు చల్లాడు. ఆ తరువాత ఆరుబయట చిదుగులతో పొయ్యి ముట్టించి ఎసరుపెట్టి లోపలికి వచ్చి చింకిచాప మీదకి ఒరిగాడు. గది లోపలి వైపుకు సగానికి కుంగిన రెల్లుగడ్డి కప్పు చీకట్లోకి తెరుచుకుని ఉంటే బయట వాకిలి నానుకుని కొమ్మల్ని చాచిన దిరిశనెచెట్టు లోపలికి చూస్తూ ఉంది. ఎవరెవరో బొగ్గుతో రాసిన పిచ్చి గీతలతో మసిబారిన మొండిగోడలు నిశ్శబ్దంగా నుంచుని ఉన్నాయి. గాలికి ఎప్పుడు ఆరిపోయిందో పొయ్యి, కొంతసేపు సన్నటి పొగ వచ్చి తరువాత చల్లబడి పోయింది.

‘‘అప్పుడే పడుకునేసినావా సావి,’’ అన్న పిలుపుతో బైరాగి నిద్ర నుంచి లేచినట్లు ఉలిక్కిపడి లేచి చూశాడు. బయట వరండాలో అరుగు మీద గురిగాడు కూర్చుని ఉన్నాడు. అతడి పక్కనే గుళ్ళకమ్మలో కొట్టిన గూడకొంగలు దాహంతో నోరు తెరిచి ఒగరుస్తూ ఉన్నాయి. వాటి కాళ్ళు మెలిపెట్టి నులక దారంతో  కట్టిపడేసి ఉన్నాయి. వాకిలి ముందు చల్లారిపోయిన పొయ్యి మీద మూకుడు స్తబ్ధంగా కూర్చుని ఉంది.

బైరాగి బయటికొచ్చి పొయ్యి ముందు కూర్చుని ఊదుతూ, ‘‘పడుకోలేదురా… పొయ్యి ముట్టించి నడుం వాల్చినా,’’ అన్నాడు. పొయ్యిలో చిదుగులు చిటపటమని రాజుకుని సన్నటి పొగ మళ్ళీ పైకి లేచింది.

గురిగాడు కూడా బైరాగిలాగే ఇల్లూ, సంసారం లేని మనిషి. అడవి జంతువు లను, పిట్టలను వేటాడటం అతని వృత్తి. గురిచూసి పిట్టలను కొట్టడంలో నేర్పరి. అందుకే ఆ పేరు. మాయామర్మం తెలియని మనిషి. రోజుల తరబడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఈ నిర్మానుష్య ప్రదేశానికి చాలా తరచుగా వచ్చే అతిది¸.

గురిగాడు లోపలికి నడిచి ఒక మూల ముడుచుకుని కూర్చున్న పావురాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చాలారోజుల క్రితం అతడే దాన్నిక్కడికి తీసుకొచ్చాడు. తీసు కొచ్చిన రోజే దానిని కోసి వండుదామని చూశాడు. ఆరోజు బైరాగి అడ్డుపడకపోతే అదీపాటికి ప్రాణాలతో ఉండకపోయేది. అది ఎగిరిపోకుండా రెక్కల్లోని ఈకలు మాత్రం పీకి విడిచిపెట్టాడు.

ఇప్పుడు గురిగాడి చేతిలో పావురాన్ని చూసి, ‘‘అదేందిరా! ఏంజేస్తండా?’’ అన్నాడు. అతడు దూరంగా కూర్చోవడం మూలాన గురిగాడు చేసే పని అతడికి కనబడడం లేదు.

గురిగాడు తన మొలలోంచి సూది దారం తీసుకుంటూ, ‘‘దీన్ని తెల్లారి గుళ్ళకమ్మకు తీసకబోతండా సావి. ఈ పెంటి ఏ పోతు వెంటా బడిపోకుండ చేస్తన్న. అయినా ఇయ్యన్ని నీకు తెలవవులే. నువ్వు సాములోరివి కదా,’’ అని వికృతంగా నవ్వాడు.

‘‘తీసుకెళ్ళి?’’ బైరాగి ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘గుళ్ళకమ్మొడ్డున వలేస్తండా సావి. నూకలు జల్లి వలేస్తండా. దీన్ని వల దగ్గరే కట్టి పడేస్తా. దీన్ని జూసి పిట్టలు దిగాల, వలకి చిక్కాల.’’

అతడి నవ్వు ఆగకుండా తెరలు తెరలుగా వినిపిస్తూ ఉంది. నవ్వుతున్నప్పుడు అతడి పక్కటెముకలు ఎగిరిపడుతూ ఉన్నాయి. మొండిగోడల అవతల నుంచి గుండ్రంటి చంద్రుడు విచారంగా చూస్తున్నాడు.

‘‘ఒరే అది నీకు ఎర పిట్టయితే నాకు పెంచుకున్న పిట్ట. నాకున్న ఒక్కగానొక్క తోడు. తీసుకెళ్ళినోడివి తీసుకెళ్ళినట్టే మళ్ళీ తీసకరా. అది లేకపోతే నాకు పూట గడవదు,’’ అన్నాడు బైరాగి.

బైరాగి మాటలు గురిగాడికి ఆశ్చర్యం కలిగించాయి. అతడికి బైరాగి ఒక్కోసారి ఎంతో దగ్గరగా ఉన్నట్లనిపిస్తాడు. ఒక్కోసారి ఎవరితోనూ సంబంధం లేకుండా ఉన్న ట్లుంటాడు. బైరాగి చెప్పే ప్రతిదీ అతడికి అద్భుతంగా అనిపిస్తుంది. ఎంత విన్నా ఇంకా ఎన్నో సంగతులు మిగిలే ఉంటాయనిపిస్తుంది.

గురిగాడు మాట్లాడకపోవడం చూసి, ‘‘ఏందిరా ఏమైంది గమ్మునుండా?’’ అన్నాడు బైరాగి.

బైరాగి వంక కాసేపు మౌనంగా చూసి, ‘‘చాలాకాలం నుండి నిన్నొకటి అడగాల నుంది సావి,’’ అన్నాడు గురిగాడు.

‘‘ఏందిరా అది?’’ అన్నాడు బైరాగి వెనక్కి వచ్చి గురిగాడికి ఎదురుగా కూర్చుంటూ.

‘‘నేనే కాదు, నీ గురించి అందరూ అనుకునే ఇసయం ఒకటుంది సావి. మానిక్కెం కూడా అంటా ఉండాడు. ఒక్కోసారి నీలో నువ్వే మాట్లాడుకుంటావు. వేళ్ళ మీద లెక్క చేసుకుంటావు. సేతులు చాపుతావు. వెనక్కి లాక్కుంటావు. ఈ పిచ్చిచేష్ట లన్నీ నీకెప్పుడొచ్చినాయి సావీ,’’ అన్నాడు.

గురిగాడి నోటివెంట మాణిక్యం పేరు వింటూనే బైరాగి మొహంలో రంగులు మారాయి.

బైరాగి గురిగాడి దగ్గర ఒకరకంగా ఉంటే మాణిక్యం దగ్గర మరోలా ఉండే వాడు. మాణిక్యంతో అతడికి మాటలు తక్కువ. వాళ్ళిద్దరిలో- ఒకరు ఉన్నప్పుడు మరొకరు ఉండేవారు కాదు. ఒక్కోసారి అతిథులిద్దరూ ఒకేసారి రావడం జరిగేది. అలాంటి సమయాల్లో బైరాగి మొహంలో భావాలను చదవడం కష్టం. అతడు తెగ ఇబ్బంది పడేవాడు. వచ్చిన అతిథులిద్దరూ కూడా ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడ కుండా ముభావంగా ఉండేవారు. ఇద్దరి మధ్య పొసిగిన సాంగత్యం ముగ్గురి మధ్య పొసిగేది కాదు.

‘ఈ పూసలోడితో బైరాగికి స్నేహమేమిటబ్బా,’ అనుకునేవాడు గురిగాడు. మాణిక్యం బైరాగిలది తనకు తెలియని గత పరిచయమని అనుకునేవాడు.

గురిగాడి చేతిలో పావురాన్ని చూస్తూ, ‘‘ఈ పావురాన్ని చూస్తంటే నాకొక స్వామి గుర్తుకొస్తున్నాడురా,’’ అన్నాడు బైరాగి సంభాషణ మారుస్తూ.

‘‘ఎవరు సావి,’’ అన్నాడు గురిగాడు ఒక చేతిలోని సూదిలోకి మరో చేతిలోని దారాన్ని ఎక్కిస్తూ. అతడి తీక్షణమైన చూపు సూదిబెజ్జం మీదుంటే అతడి చెవులు బైరాగి మాటలను శ్రద్ధగా వింటున్నాయి. వాకిలి ముందు పొయ్యిలో నిప్పులు రాజుకుంటూ మూకుడు చుట్టూ మంటలు నాలుకలు చాపుతున్నాయి. పొయ్యి మీద అన్నం కుతకుత ఉడుకుతున్నట్లు శబ్దం రాసాగింది.

‘‘నేను ఇల్లిడిచి దేశాలు పట్టినప్పుడు తలకోనలో ఒక సావి కలిశాడురా. నాకంటే పెద్దమనిషిలే. దాదాపు ఆయనే నా గురువనుకో. ఆయనెప్పుడూ ఒక మాట చెప్పే వాడు. మనుషులు తమకు తెలిసినా తెలియకున్నా మంచీ చేస్తారు, చెడూ చేస్తారు. కార్యం కంటి ముందున్నంత వరకే. చేతులు దాటాక అన్నీ మనమనుకున్నట్టే జరగవు. దేని దిశ దానికే ఉంటుంది. రెక్కలిప్పుకున్న పావురం ఎగిరినట్టు దేని దిక్కు అది ఎగిరి పోద్ది. గాలికి పుట్టిన అల సముద్రంలో కనిపించనంత దూరం కొట్టుకుపోయినట్టు అది ఎటో ఎళ్ళిపోద్ది…’’

బైరాగి మాట్లాడుతున్నంతసేపూ అతడేదో ధ్యానంలో ఉన్నట్లు కళ్ళు శూన్యం లోకి తెరుచుకుని ఉన్నాయి. అతడి చేతులు పక్షవాతం వచ్చినట్టుగా నిశ్చలంగా పడి ఉన్నాయి.

బైరాగి చెప్పిందంతా విన్న తరువాత గురిగాడు నెమ్మదిగా లేచి నుంచుని పావురాన్ని ఎక్కడ నుంచి తెచ్చాడో ఆ గదిలోనే విడిచిపెట్టి బయటకు నడుస్తూ, ‘‘నువ్వేం చెబతన్నవో నాకు తెలవదు సావి. నాకు తెలిసిందల్లా ఎలకల్ని, ఎంటవల్ని, పిట్టల్ని కొట్టి తినడం… తొంగోవడం,’’ అన్నాడు పెద్దగా నవ్వుతా. బైరాగి కొద్దిసేపు మౌనంగా ఉండి, తర్వాత తను కూడా గురిగాడితో కలిసి నవ్వసాగాడు.

చివరికి గురిగాడు కొంగల్ని భుజానేసుకుని ఎక్కడికో పోవడం  చూసి, ‘‘మళ్ళే డికి పోతన్నావురా? వంటజేస్తిని కాస్త తిని పో,’’ అన్నాడు బైరాగి పొయ్యి మీద మూకుడు లో పుల్లపెట్టి తిప్పుతూ.

‘‘నేను తినే వచ్చాను సావి. నువ్వు కానీ. నేను మల్లొస్తా. ఎంత రేత్రికైనా వస్తాను. నువ్వు పొనుకో నా కోసం చూడబాకు,’’ అని వెన్నెల్లో దట్టమైన చెట్ల మధ్య నీడలలో కలిసిపోయాడు. అతడు రాత్రంతా కల్లుపాకలో గడిపి ఏ తెల్లవారుఝామునో తిరి గొస్తాడు.

ఆ తరువాత చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. ప్రతిరోజులాగానే బైరాగి బయట అరుగు మీద చికిలించిన కళ్ళతో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. కొంతసేపటికి లోపలికి వచ్చి కాసేపు గదిలో అటూ ఇటూ తిరిగి చివరికి అన్నం తిని నేలమీద పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడు. దీగుడు దీపం కాసేపు నిశ్శబ్దంగా వెలిగి చివరకు చీకట్లో అంతర్థానమైంది. ఎక్కడో గది మూల నుంచి కీచురాయి ఒకటి పిలుస్తూ ఉంది. బయట కుంటలో కప్పలు బెకబెక మంటున్నాయి.

మధ్యరాత్రి కావచ్చు, ‘‘బిచ్చుపతీ… ఉండావా,’’ అని బయటి నుంచి ఎవరో పిలవడంతో, ‘‘ఎవురది?’’ అంటూ బైరాగి పడుకునే అడిగాడు.

‘‘నేను… మానిక్కాన్ని…’’ అని అవతలి నుంచి సమాధానం వచ్చింది.

‘‘మానిక్కెం… లోపలికి రా…’’ అంటూ బైరాగి పడుకున్నవాడు కాస్తా లేచి బయటకు నడిచాడు.

ఆరుబయట మసకవెన్నెల్లో నుంచుని ఉన్నాడు మాణిక్యం. సన్నటి బక్క పలచటి మనిషి. కనపడీ కనపడని చెవిపోగు, మెడలో పూసలదండ. మాణిక్యం వెనక భుజం చుట్టూ కొంగు కప్పుకున్న ఆడమనిషి. అస్పష్టంగా కనిపించీ కనిపించని మొహం.

‘‘ఈ మనిషెవురు?’’ బైరాగి వెనక్కి తిరిగి నడుస్తూ అన్నాడు.

‘‘మావోళ్ళే,’’ చెప్పాడు మాణిక్యం బైరాగి వెనకే వస్తూ.

మాణిక్యం అప్పుడప్పుడు అక్కడికి ఒక ఆడమనిషిని వెంటపెట్టుకుని వస్తాడు. అయితే అతడితో ఒకసారి కనిపించినవారు మళ్ళీ కనిపించేవారు కాదు.

‘‘ఇయ్యాల గురిగాడు రాలేదా?’’ వెనక నుంచి మాణిక్యం ప్రశ్న.

‘‘ఇప్పుడే బయటకెళ్లాడు. నడిరేత్రికిగాని రానన్నాడు,’’ ముళ్ళకంపలని దాటు కుని ఒకరి తరువాత ఒకరు లోపలికి అడుగుపెట్టారు.

బైరాగి చేరగిలబడుతూ, ‘‘మీరు బువ్వ తిన్నారా. సంచిలో నూకలున్నాయి. కావలిస్తే వండుకోండి,’’ అన్నాడు. వాళ్ళిద్దరూ చిరిగిన చాప మీద కూర్చున్నారు.

మాణిక్యం బీడీ ముట్టించి గుప్పుమని పొగ వదులుతూ, ‘‘తినే వచ్చాం సావి. ఈ రేత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే పోతాం,’’ అన్నాడు.

మాణిక్యం చెప్పేది వింటూ బైరాగి ఆమె వంక చూశాడు. నేలకు ఆనించి కూర్చున్న మట్టిగాజుల చేతులు. పాపిట చెదిరిన ముంగురులు. ఏ భావమూ చెప్పని అమాయకమైన కళ్ళు. కనిపించీ కనిపించని రంగుపూసల దండ. ఏ కాలం నాటిదో తెలియని ముదురు మట్టిరంగు చీర. చీర మడతల కింద కోమలమైన పాదాలు.

బైరాగి ఆ పాదాల నుంచి చటుక్కున చూపు మరల్చి తనలో తాను, ‘ఈ యమ్మి అలసట చేత ఇలా ఉంది కాని ఈ యమ్మి ఈ యమ్మి కాదు,’ అనుకున్నాడు. మెడ వంకరగా పెట్టి ఏదీ ఆలోచించకుండా ఎటో చూస్తూ మళ్ళీ తనలో, ‘ఈ యమ్మి ఇక్కడికి రావాల్సిన మనిషి కాదు,’ అని గొణుక్కుని, ‘ఎందుకిలా?’ అనుకుని మళ్ళీ ఆమె వైపు దృష్టి మరల్చాడు.

ఆమె చాలా దూరం ప్రయాణం చేసివచ్చినట్టుగా చేతిలో ఉన్న ప్లాస్టిక్‌ సంచి రంగు వెలిసి చేతిపట్టుకూ, చెమటకీ ముడతలు పడి ఉంది. ‘సందేహం లేదు. ఈ యమ్మి తలకీ పాదాలకీ సంబంధం లేనట్టుగానే ఈయమ్మి గతానికీ వర్తమానానికీ పొంతన లేదు,’ అనుకున్నాడు బైరాగి మనసులో.

అంతక్రితం మాణిక్యంతో వచ్చిన ఆడవాళ్ళు బైరాగితో పరాచికాలాడబోయే వారు. మాణిక్యం గురించి తమకంతా తెలిసినట్టే ప్రవర్తించేవారు.

‘వాళ్ళకు, ఈ యమ్మికి ఏమిటి తేడా?’ అనుకున్నాడు బైరాగి.

‘వాళ్ళు మానిక్కాన్ని నమ్మలేదు. ఈ యమ్మి పూర్తిగా వాడిని నమ్ముతు న్నట్లుంది. ఇంతకుమునుపు మానిక్కెంతో వచ్చిన ఆడవాళ్ళ మాదిరి కాదీయమ్మి.’

ఆమె కూలిన గోడల నుంచి చొచ్చుకొచ్చిన జిల్లేడు కొమ్మలను, గదిలో చిందర వందరగా పడేసిన వస్తువులను వెన్నెల వెలుగులో వింతగా చూస్తూ కూర్చుంది. నిద్ర ముంచుకు వస్తోంది కాబోలు. వాళ్ళ మధ్య మాటలు తగ్గుతూ మాటల మధ్య ఎడం పెరుగుతూ ఉంది. బైరాగి ఆవులించి కాళ్ళు బార జాపి అక్కడే నేలమీదకు ఒరిగాడు. అతడిలో క్రమక్రమంగా అసహనం పెరుగుతూ ఉంది. తల నిండా ఎడతెరిపి లేని ఆలోచనలు.

కళ్ళ ముందు ఆమె అమాయకమైన రూపమే కనపడుతోంది. అతడు బాధగా నిట్టూర్చాడు. అతడి హృదయం ఆందోళనతో కొట్టుకుంటూ ఉంది.

‘ఈయమ్మి ఒంటరిగా దొరికితే ఈ మానిక్కాన్ని నమ్మొద్దనీ, వాడి నుంచి పారిపొమ్మనీ చెప్పాలి,’ అనుకున్నాడు.

‘చెబితే నమ్మిద్దా…?’

‘నమ్మదు,’ అతడు నిశ్చయంగా తనలో అనుకున్నాడు.

‘మరి నమ్మేట్టు చేయాలంటే ఎలా?’ అతడికేం పాలుపోలేదు. ‘నమ్మి వచ్చిన మడిసి. మాయలో ఉన్న మడిసి. మైకంలో పడ్డ మడిసికి ఏం చెప్పినా తెలవదు.’

బైరాగి ఆలోచనలో ఉండగానే చీకటికి అవతలివైపు నుంచి గుసగుసలు వినిపించాయి. మాణిక్యం ఆమెకు దగ్గరగా జరిగినట్లున్నాడు.

ఆమె చిన్నగా మాట్లాడుతూ ఉంది. ‘‘నీకు తెలవదా. రెండు దినాల నుండి నిద్దర్లేదు. జెరమని కనికరం కూడా లేని మడిసివి నువ్వు.’’

బదులుగా మాణిక్యం నవ్వు.

బైరాగి ఇటు తిరిగి చీకట్లో కళ్ళు తెరిచాడు.

బైరాగి కదలికకి మాణిక్యం లేచి కూర్చుని నిట్టూర్చి, ‘‘పడుకున్నావా బిచ్చపతీ,’’ అన్నాడు.

బైరాగి లేదని సమాధానం చెప్పాడు.

మాణిక్యం బయటకు వెళ్ళి అరుగు మీద కూర్చుని అగ్గిపుల్ల ముట్టించాడు. ఆరు బయట పసుపురంగు వెన్నెల. బైరాగి లేచి తనూ బయటకు నడిచాడు.

మాణిక్యం గుప్పుగుప్పుమని పొగ పీలుస్తూ బీడీ తాగుతున్నాడు. ఉన్నట్టుండి బైరాగి ఏదో చెప్పడానికన్నట్టు గాలిలో చెయ్యి పైకి లేపి ఎందుకనో ఒక్కక్షణం ఆగి తన చేతివేళ్ళ వంక చూస్తుండిపోయాడు.

మాణిక్యంతో బైరాగి ఎప్పుడూ ఎక్కువ మాట్లాడడు. కళ్ళతో చూస్తూ వినేదే ఎక్కువ. తన దగ్గరకు వచ్చే పరిచితులకైనా, అపరిచితులకైనా అతనెప్పుడూ లోబడి ఉండే మనిషి కాడు. ఎప్పుడూ ఎవరికీ దేనికీ లొంగని మనిషి. చివరికి ప్రాధేయపడు తున్నట్టుగా అడిగాడు.

‘‘ఇడిసిపెట్టు మానిక్కెం. ఆ యమ్మి అసుమంటి మడిసి కాదు.’’

బైరాగి చెప్పినదేమిటో ఒక్కక్షణం పాటు మాణిక్యానికి అర్థం కాలేదు. అర్థమ య్యాక బైరాగి వంక విచిత్రంగా చూసాడు.

‘‘ఆ యమ్మి అసుమంటిది కాదని నీకెట్లా తెలుసు, నీవెరుగుదువా?’’ మాణిక్యం నోట్లో బీడీ తాలూకు ఎర్రటి నిప్పు సన్నటి పొగని విడుస్తూ ఉంది.

‘‘నేనెరగను,’’ బైరాగి సమాధానం.

‘‘మరి నీకెట్టా తెలుసు.’’

బైరాగి  తల వంచుకుని  కాసేపు  మౌనంగా  ఉండి  చివరికి, ‘‘ఆ  యమ్మి పాదాలు చూసిన. నువ్వనుకునే మడిసి మాత్రం కాదని చెప్పగలను,’’ అన్నాడు.

మాణిక్యం ఒకసారి బైరాగి వంక సూటిగా చూసి నవ్వి, ‘‘నువ్వు కాళ్ళు చూసి తలెంటికలు లెక్కపెట్టగలవోడివని నాకు తెలుసు. నువ్వన్నది నిజమే సావి. ఈ పిట్ట కోసం నేను పడని యాతన లేదు. ఇప్పుడిడిసి పెట్టడం జరిగేపని కాదు,’’ అన్నాడు.

వాళ్ళు మాటల్లో పడి చెట్ల మధ్య నుంచి చాలా దూరం నడుచుకుంటూ వచ్చి, తిరిగి వెనక్కి మళ్ళి వాకిలి ముందు బయట అరుగు మీద కూర్చున్నారు. మాణిక్యం తనెంత కష్టపడి ఆమెను వలేసి పట్టుకుందీ చెప్పుకుపోతున్నాడు.

బైరాగి ఏదో  నిశ్చయించుకున్నవాడిలా  లేచి,  ‘‘కాసిన్ని నీళ్ళు తాగొస్తా మానిక్కెం. దప్పిగ్గా ఉంది,’’ అన్నాడు లోపలికి నడుస్తూ.

మాణిక్యం ఏం మాట్లాడలేదు. బైరాగి లోపలికి నడుస్తూ గుమ్మం దగ్గరే నుంచుండిపోయాడు. చీకటి నీడల మధ్య చెట్ల కొమ్మలు దిగులుగా చూస్తున్నాయి. నేల మీద ఆకుల నీడలు గాలికి కలగాపులగంగా కదులుతూ ఉన్నాయి. కాసేపు నుంచున్నాక నిట్టూర్చి లోపలికి చిన్నగా శబ్దం లేకుండా అడుగు పెట్టాడు బైరాగి.

అప్పటిదాకా గీమంటున్న కీచురాయి గదిలోపల అలికిడికి ఒక్కసారిగా గమ్మునైపోయింది. గుమ్మంలోంచి గది లోపలికి బారుగా సాగిన నీడను చూసి మెలకువతో ఉన్న ఆమె చటుక్కున లేచి కూర్చుంది.

లోపలికి వచ్చిన బైరాగి మరికొంచెం ముందుకు వచ్చి నీళ్ళు ముంచుకోబోతు న్నట్లు మట్టికుండ మీద మూత తీసి మళ్ళీ పెట్టి ముందుకి కదిలాడు. తరువాత నిశ్శబ్దం. కీచురాయి కూడా ఏం జరగబోతోందో అని తీక్షణంగా ఎదురుచూస్తున్నట్లు నిశ్శబ్దం.

‘‘ఏంది సామి ఇది,’’ వినీవినబడని ఆమె లోగొంతుక. కుండలో నీళ్ళ కదలిక. భగభగమని చీకటిని పెకలిస్తున్న రెండు దీపాలు. కాటుక కళ్ళు.

ఆమె కళ్ళ కెదురుగా బైరాగి మసకమసకగా కనిపించాడు. ఆ క్షణంలో అతడి ఒంటి మీద ఎప్పుడూ ఉండే వస్త్రం లేదు. జుట్టు ముడివీడి భుజాలపై పొడవాటి వెంట్రుకలు వేలాడుతున్నాయి. అతడి కళ్ళు ఎవరో మంత్రించినట్లుగా లోపలి శూన్యం లోకి చూస్తూ అంధభిక్షువులా ఉన్నాడు. అతడేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అతడి పెదాలు పళ్ళ బిగువున తెరుచుకున్నాయి.

‘‘మానిక్కెమే నీ దగ్గరకు వెళ్ళమని చెప్పాడు.’’

ఆమె ఒణుకుతూనే రెండు చేతులూ జోడించింది.

‘‘నేనసుమంటిదాన్ని కాను సావి.’’

‘‘నాకు తె…’’ అనబోయి మరుక్షణం వెనక నుంచి మాణిక్యం కట్టెతో కొట్టడంతో బైరాగి ముందుకు తూలిపడి బాధగా అరిచాడు. అతడలా రెండు చేతులతో తల పట్టుకుని ముందుకు పడిన మరుక్షణం ఆమె లేచి ఒణుకుతున్న చేతులతో గబగబ తన గుడ్డల సంచిని తీసుకుని ఊడ తీసిన కిటికీ గోడ దూకి చీకట్లో చెట్ల మధ్య కలిసిపోయింది.

మాణిక్యం ముందుకు కూలబడిన బైరాగి వీపు మీద కాలేసి అతడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నాడు. అతడు బక్కగా ఉన్నా బలంగా ఉంటాడు. బైరాగి నోటి వెంట నరాలను మెలిపెడుతున్న మూలుగు. ద్వంద్వ యుద్ధం చేస్తున్న ఇద్దరు మనుషుల నీడలను నివ్వెరపోయి చూస్తూ, పున్నమిచంద్రుడు తెల్లటి మబ్బుల చాటు నుంచి ఆతృతగా పైపైకి వస్తున్నాడు.

‘‘ఆ యమ్మికేం జెప్పినావు నువ్వు,’’ బైరాగి చేతుల్ని మెలితిప్పుతూ అడిగాడు మాణిక్యం.

‘‘నాకు తెలవదు,’’ అని భారంగా మూలిగాడు బైరాగి. బైరాగి అర్ధనగ్న దేహం అస్తవ్యస్తంగా నేలమీద పడి ఉంది. పొడవాటి అతడి జుట్టు కొప్పు విడివడి వెంట్రుకలు చెమటతో కలిసి ధారలు కట్టి ఉంది.

‘‘మరెందుకు పారిపోయింది?’’ మాణిక్యం గొంతు కటువుగా ఉంది.

బైరాగి పక్కకు తిరిగి విదిలించుకోవడంతో మాణిక్యం కిందపడ్డాడు. వాళ్ళిద్దరూ దొర్లుకుంటూ పావురం ఉన్న చోటుకి వచ్చిపడ్డారు. అది బెదిరి రెక్కలు టపటపమని కొట్టుకుని ఒక్క ఉదుటున గాలిలోకి లేచింది.

పావురం రెక్కలు టపటపమని కొట్టుకుంటూ  గాలిలోకి ఎగిరిన మరుక్షణం, ‘‘ఎవురా మడిసి?’’ అన్న గురిగాడి గొంతు వినిపించింది. చెట్ల మధ్య నుండి నడిచొ స్తున్న గురిగాడు మాణిక్యాన్ని చూసి నవ్వి, ‘‘మానిక్కెమా… సావిని మరియాదగా ఇడిసి పెట్టు,’’ అన్నాడు.

ఆ సమయంలో మాణిక్యాన్ని చూసి అతడొక్కడే అలా నవ్వగలడు. వారిద్దరి వైరం అలాంటిది. ఇద్దరు మనుషులను అవలీలగా ఎత్తి పారేయగల బలిష్టమైన మనిషి.

గురిగాడి అరుపు వినగానే మాణిక్యం గోడ మీద నుంచి దూకి పారిపోయాడు. గురిగాడు మాణిక్యం వెంటపడబోయి ఆగి వెనక్కొచ్చి బైరాగిని పైకి లేపి, ‘‘ఏంది సావి ఇది,’’ అనడిగాడు.

‘‘అంతా మంచే జరిగిందిరా. అంతా అనుకున్నట్టే జరిగింది,’’ బైరాగికి అలుపు తగ్గడం లేదు. అతడి శరీరం స్వాధీనంలోకి రాక లేచి కూర్చోలేకపోయాడు.

‘‘అసలేం జరిగింది సావి?’’ అంటూ గురిగాడు నేలమీద కూర్చుని బైరాగిని ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆ స్థితిలో బైరాగిని చూసి అతడి గొంతు దుఃఖంతో పూడుకు పోయింది.

రెక్కలు తెగి నేలకొరిగిన జటాయువులా ఒగరుస్తూ కలవరిస్తున్నాడతను.

‘‘ఏమీ తెలియని అమాయకపక్షి… ఇది మంచి, ఇది చెడు అని ఎట్టా చెప్పే దిరా? ఆడతా పాడతా ఎగిరే పిట్టని కట్టిపడేయడం గాదా? మానిక్కెం అసుమంటోడని ఆయమ్మికెలా చెప్పేది చెప్పు. అలా చెప్తే ఆమెకెలా తెలుసుద్ది చెప్పు. చెప్పినా మైకంలో పడ్డ మడిసి నా మాట నమ్మిద్దా… ఆయమ్మికి మానిక్కెం సంగతి తెలవదు. ఆడి నించి కాపాడేందుకు ఆ పని చేసిన…’’

ఏం జరిగిందో గురిగాడికి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంది.

బైరాగి నేలకొరిగే ఉన్నాడు. ఇద్దరి మధ్యా కాస్సేపు నిశ్శబ్దం.

ఉన్నట్టుండి గురిగాడు ఏదో గుర్తుకు వచ్చినట్లు లేచి లోపలికి వెళ్ళాడు.

‘‘ఇక్కడ పావురమేది సావి?’’

‘‘రెక్కల్దీసిన పిట్ట. యాడికి బోద్ది ఇక్కడే ఎక్కడో ఉంటది చూడరా…’’ అన్నాడు బైరాగి పడుకునే.

‘‘ఈకలు మొలుచుంటాయి సావి. నేను చూసుకోలేదు.’’

‘‘ఎటన్నా ఎగిరిపోయిందేమోరా.’’

‘‘ఎల్లిపోయిందని కాదు సావి నా బాధ. దాని కళ్ళు కుట్టేసిన,’’ అతను గొంతు క్కేదో అడ్డం పడినట్లు చెప్పాడు.

‘‘కళ్ళు కుట్టేసినావా?’’ బైరాగి నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు.

‘‘అవును సావి. కుట్టకపోతే ఎట్టా కుదుర్ది చెప్పు. వేటకు ఇడిసిన పిట్ట జతగాడిని చూసుకుని ఎగిరిపోదా. అందుకనే దానికి చూపు లేకుండా రెప్పలు సూద్దారంతో కుట్టేసినా సావి,’’ అతడు పావురం కోసం వెతుకుతూ గదిలోని వస్తువులన్నిటినీ చిందర వందరగా విసిరేయసాగాడు.

బైరాగి నిశ్చలంగా నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. గురిగాడు వెతికి వెతికి ఎటూ పాలుపోక నేలమీద చతికిలబడి ఎగిరిపోయిన పావురం గురించి ఆలోచిస్తూ, ‘దానికి కళ్ళు కుట్టకుండా ఉంటే ఎంత బాగుండును,’ అని కాసేపు తనలో తను మధనపడి చివరికి అది ఎక్కడికి వెళ్తుంది అని చీకట్లోకి చూశాడు. కళ్ళు కుట్టేసినట్లు ఒకటే చీకటి. ఆ చీకటికి అంతులేదు.

అప్పుడతనికి చీకట్లో కలిసిపోయిన ఆడమనిషి గుర్తొచ్చి, ‘‘తప్పు జేసినావేమో సావి,’’ అన్నాడు.

బైరాగి అర్థం కానట్టు చూశాడు.

‘‘ఆ యమ్మితో బోతే మానిక్కెమే మారేవోడేమో. నువ్వు జెప్తవు గదయ్యా నిన్నటి మడిసి ఇయ్యాల మడిసిగాడని, మడిసి మారతానే ఉంటాడని… అసలాడు మారినాకే ఈడికి వచ్చినాడేమో ఎవురికి తెలుసు… మానిక్కాన్ని నమ్మనీకుండా జేసినావు సరే… ఆ యమ్మి లోకంలో ఎవుర్నీ నమ్మకుండా జేసినావు గదా… ఎంత పని జేస్తివి సావీ,’’ అన్నాడు గురిగాడు.

గురిగాడు ఏం చెప్తున్నాడో బైరాగికి మొదట అర్థంకాలేదు. కొంచెం కొంచెంగా అర్థమయ్యాక బైరాగి నోటమాట పడిపోయినవాడిలా చేష్టలుడిగిపోయాడు. ఇది ఇప్పటిదాకా తన అనుభవంలోకిరాని ఆలోచన. ఇలాంటి సత్యాన్ని గురిగాడు చెప్ప గలడని తనిప్పటిదాకా కలలో కూడా ఊహించి ఉండడు. బైరాగికి లోపల ఏదో కరిగి నట్లయింది. మెరుస్తున్న కళ్ళతో అతడు పరిపూర్ణంగా గురిగాడివైపు చూశాడు.

అయితే గురిగాడి ఆలోచన ఇంకెటో ఉంది. ఇలా జరగకుంటే బాగుండును కదా… అనుకుంటూ తనకు తెలియకుండానే తన వేళ్ళ వంక చూసుకుంటూ… చేతులు చాపి… జరిగింది తల్చుకుని… గభాల్న చేతుల్ని వెనక్కి లాక్కుని ఒక్క సారిగా గట్టిగా నవ్వాడు.

బైరాగికి ఆ నవ్వు అంతకుముందులా వికృతంగా అనిపించలేదు. గురిగాడు తనెప్పుడూ చూడని కొత్తమనిషిలా అనిపించాడు.

పైన ఆకాశంలో నల్లటి మబ్బుతరగల మాటున చంద్రుడు కొలిమిలో బొగ్గుల మధ్య నిప్పుకణికలా ఉన్నాడు. చెట్ల ఆకుల్లోకి చొచ్చుకు వస్తున్న వెన్నెల చీకటిని విరుచుకు తింటూ ఉంది.

*

 

ఎ.రవీంద్రబాబు

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా విలువైన సమీక్ష. మంచి కథకు మంచి సమీక్ష కూడా. ఐతే బైరాగి మాణిక్యం తెచ్చిన మనిషిని నిజంగా అనుభవించబోయాడా లేక భయపెట్టడం కోసం అలా పైనపడ్డాడా అనే విషయంలో సంశయం ఉంది.

    • భయపెట్టడం కోసమే, గురిగాడితో ఆ విషయం చెప్తాడు…

      • మాణిక్యం నుంచి కాపాడాలనే ఉద్దేశ్యం తో…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు