రేడియో స్టేషన్ లో పనిచేయటమంటే అనేకమంది కళాకారులు సాహిత్యం, సంగీతం, నాటకం వంటి అనేక విభాగాల్లో వారిని కలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతకుముందు నేను పనిచేసిన పెయింట్స్ సంస్థకు ఆకాశవాణి కి ఉన్న తేడా అది.
ఈ సందర్భంగా కొన్ని నవ్వు పుట్టించే సంఘటనలు, కొన్ని ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి. మహీధర రామమోహనరావు గారు ఎంత గొప్ప రచయితో మనకు తెలుసు. వారు సాహిత్య అకాడమీ పురస్కారం పొందినప్పుడు ఆ బహుమతి మొత్తాన్ని అప్పుడేదో ఉపద్రవం సంభవిస్తే అందుకోసం ఛారిటీ గా ఇచ్చేశారు. లబ్బీపేటలోని వారింటికి రెండు మూడుసార్లు వెళ్ళాను కూడా.
ఒకసారి వారిని అమరవాణి సంస్కృత కార్యక్రమంలో అభిజ్ఞాన శాకుంతలం లో శకుంతల పాత్ర చిత్రణపై ప్రసంగించటానికి ఆహ్వానించటం జరిగింది. సాధారణంగా అమరవాణి ప్రసంగాలు సంస్కృతంలో ఉంటాయి. ఆయన స్క్రిప్ట్ తెలుగు లో రాసుకొచ్చారు. శకుంతల పాత్ర చిత్రీకరణ ఆయన శైలిలో రాడికల్ గా రాసుకొచ్చారు..ఆ స్క్రిప్ట్ ను కాస్త రేడియో కోడ్ కి అనుగుణంగా మార్పించాల్సివచ్చింది. నిజానికి ఆయనకు ముందే ఆ ప్రసంగం స్కోప్ ఆయనకు చెప్పి ఉండాల్సింది. ఆయన మా సూచన హుందాగా స్వీకరించటం ఆయన పెద్దమనసును సూచిస్తుంది. మేము హమ్మయ్య అనుకునేలా చేసింది
కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు రెగ్యులర్ గా వస్తుండేవారు ఆరోజుల్లో విజయవాడ రేడియో స్టేషన్ కు…ఆయన గొంతు మెటాలిక్ గా ఉండేది.ఆయన బొర్ర మీసాలు బాగా గుర్తుండిపోతాయి.
ఇప్పుడు వారి కథల్లో గొప్పదనం తెలిసింది కానీ, అప్పుడు తెలుసుకోలేకపోయాననిపిస్తుంది.ఎందుకంటే అప్పట్లో ఏమిటీ కథలు అనిపించేది మరి..ఆయన రికార్డింగ్ అవ్వగానే స్టూడియో బయట గోల్డ్ ఫ్లేక్ కింగ్ సిగిరెట్ తాగుతుండేవారు..పక్కనే పన్నాల సుబ్రహ్మణ్య భట్టు,ముంజులూరి కృష్ణకుమారి గార్లతో మాట్లాడుతూ ఉంటే నాలాంటివాళ్ళం వారి కబుర్లు వింటూ ఉండేవాళ్ళం.
కవి వేగుంట మోహన్ ప్రసాద్ గంభీరంగా వచ్చి కవిత్వం చదివి వెళ్ళిపోతుండేవారు.ఆర్టిస్ట్ ల రికార్డింగ్ పూర్తికాగానే డ్యూటీ రూం కి తీసుకొచ్చేవారు.వారికి వెంటనే పారితోషికం చెక్ రూపంలో ఇచ్చేవారు.ఆ చెక్ disbursement డ్యూటీ రూంలో జరిగేది.
కొన్ని రోజులు నేను ఇంగ్లీష్ టాక్స్ సెక్షన్ చూడాల్సి వచ్చింది.
అప్పుడు మోహన్ ప్రసాద్ గారిని ఇంగ్లీష్ పొయిట్రీ రికార్డు చేయమని కోరాను.ఆయనకి నామీదేదో అనుమానం వచ్చినట్లుంది. ఒక్క కండిషన్ అన్నారు.. ఏమిటి సర్ అని అమాయకంగా అడిగాను. చెక్ వెంటనే ఇవ్వాలి..అవుతుందా అన్నారు. తప్పకుండా సర్ అని మాట నిలబెట్టుకున్నాను..
చాలా అద్భుతమైన పొయిట్రీ చదివారు.. అంతే కాకుండా ఆకాశవాణి వార్షిక పోటీలలో ఎంట్రీలు పంపినప్పుడు, వాటిని ఆయన ఇంగ్లీష్ అనువాదం చేసేవారు.అందరికీ ఆయన చేసే అనువాదమే కావాలి..
అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు నండూరి రామమోహనరావు గారిని కుర్రతనంతో అజ్ఞానం కొద్దీ ఇంగ్లీష్ టాక్ రాయమని ఒకసారి కోరాను.నేను రేడియో కాంట్రాక్టు టైప్ చేయించి, డైరెక్ట్ గా ఆయన సంతకం కోసం ఆంధ్రజ్యోతి ఆఫీస్ కు వెళ్ళిపోయాను.ఆయనకు నేనెవరో అర్థం కాలేదు.మీరెవరు అని అడిగి విషయం తెలుసుకుని, నవ్వారు.
నా భుజం తట్టి ఏదైనా తెలుగు లో రికార్డు చేస్తాను లెండి అన్నారు. అది నా సెక్షన్ కాదు కాబట్టి నా కోరిక తీరలేదు.
సుధామ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు కవి అఫ్సర్ క్రమం తప్పకుండా రికార్డింగ్ కు వస్తూ ఉండేవారు. డ్యూటీరూంలో ఉండటం వలన ఆ రికార్డింగ్ చూసే అవకాశం కూడా ఉండేది. అప్పట్లో అఫ్సర్ కవిత్వం కు చాలా ఫాలోయింగ్ ఉండేది.
అలీ అక్బర్ అని ఆంధ్రజ్యోతి లో క్రీడల గురించి రాస్తూ ఉండేవారు. బాగా రాస్తుండేవారు. హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ వారిచేత ఫేమస్ తెలుగు స్పోర్ట్ మెన్ గురించి ఇంగ్లీష్ ప్రసంగం రికార్డు చేసి పంపమన్నారు.అది జాతీయ స్థాయి ప్రసారం కోసం రికార్డు చేశాం..ఆయన అప్పటికే పెద్దవారు.నాకు మంచి మిత్రులయ్యారు. ఆయన రేడియో స్టేషన్ కి వచ్చి కబుర్లు చెప్పి వెళుతుండేవారు.మాకో అగ్రిమెంట్ ఉండేది.
నేనాయన్ని స్కూటర్ మీద దింపాలి.వారిచ్చే మసాలా ఛాయ్ తాగి వెళ్ళాలి.ఇంతాచేస్తే ఆయన బ్యాచిలర్..ఆయన మేనత్త వారి వద్దే ఉండి వంటా వార్పూ చూస్తుండేవారు.
అడపాదడపా బాలమురళీకృష్ణ గారొస్తుండేవారు.వారొస్తే మంచి సందడి స్టేషన్ అంతా. ఎందుకంటే ఆయన మొదటి లైట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఆకాశవాణిలో..అందరూ ఆయన చుట్టూ చేరేవారు.
మా మిత్రుడు డి.వి.మోహనకృష్ణ వారి శిష్యులు కావటంతో తాను తంబూరా మీటుతుండేవాడు.అన్నవరపు రామస్వామి గారు వయొలిన్ సహకారం, కొత్తపల్లి వీరభద్రరావు గారు మృదంగ సహకారం ఉంటుండేది..అదే ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అయితే మా మోహన్ కృష్ణ సహకార గానం అందించే వాడు.ఇంతకీ బాలమురళీకృష్ణ గారికి నన్ను పరిచయం చేసి నాలుగు మంచి మాటలు చెప్పటంతో ఏమోయ్ ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించారాయన.
రచయిత్రి పి.సత్యవతి గారు కూడా కథల రికార్డింగ్ కు రేడియో స్టేషన్ కు వస్తుండేవారు.. ఇలాంటి వారందరికీ చెక్ ఇవ్వటం గర్వం గా ఉండేది.
వ్యవసాయ విభాగం లో ఎక్కడెక్కడి వారో రికార్డింగ్ వస్తుండేవారు. అప్పటి ఫార్మ్ రేడియో ఆఫీసర్ వై.హనుమంతరావు గారు మా డ్యూటీ ఆఫీసర్ అని పరిచయం చేసేవారు.కాసేపు మాటామంతీ అయ్యాక చెక్ ఇప్పించేవారు.. ఒక్కసారి ఆ సెక్షన్ లో ఉండే టి.ఎస్.సి.బోస్ కానీ రత్నాకర్ బాబు,వి.ప్రసాదరావు గారు కానీ ఆ రికార్డింగ్ చేసి అతిథులను డ్యూటీ రూం కు తీసుకొచ్చేవారు.
కర్నాటక సంగీతం విభాగంలో లైవ్ కార్యక్రమాలు ఉండేవి.ఉదయం 8గం30ని.లకు, రాత్రి పదిగంటలకు ఉండేవి ఆ లైవ్ కార్యక్రమాలు.
దండమూడి రామమోహనరావు వంటి పెద్దవారు మృదంగ సహకారం ఇచ్చేవారు.రాత్రి పదిగంటల నుంచి పదకొండు గంటల వరకు సంగీత సభ ఉండేది..
అదే నాటకాలయితే పాండురంగ, కోకా సంజీవరావు, మాడుగుల రామకృష్ణ , జయప్రకాష్ వంటి వారు నాటకాలు నిర్వహించేవారు.మా సీనియర్ మంత్రవాది మహేశ్వర్ నాటక విభాగం ఇన్ ఛార్జ్ గా ఉన్నప్పుడు నాచేత చాలా నాటకాలు ప్రొడ్యూస్ చేయించారు..ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే గంట నాటకానికి చాలా డిమాండ్ ఉండేది
అటు ఆర్టిస్ట్ ల నుంచి, అలాగే నాటక రచయితలనుంచి..
మొదటి సారి నేనొక గంట నాటకం ఆదివారం మధ్యాహ్నం కోసం చేశాను.. రికార్డింగ్ పూర్తి చేశాను.. ఎడిటింగ్ చేస్తున్నాను. స్పూల్ రికార్డర్ పైనే టేపులు ఉంచి మధ్యలో ఇంటికి వెళ్ళి రెండేళ్ల మా అబ్బాయితో తిరిగొచ్చాను..అప్పుడేమయిందంటే …..!
*
Add comment