ప్రతి పాదం ప్రతి పదం కలిసీ మెలిసీ..

ఈ పదగమనం కేవలం తూర్పు గోదావరి జిల్లా కు మాత్రమే పరిమితమైనది కాదు.

చాంద్రమానం, విళంబి నామసంవత్సరం, దక్షిణాయణం, ‘కృష్ణపక్షం’ మాసం మార్గశిరం. తగులూ మిగులూ వున్న విదియ, తదియల్లో  సాహితీ ప్రియులు ఒక్కొక్కరొక్క పదమై, కథ నుంచి కవిత్వందాకా  వాక్యంలా  సాగనున్నారు. విహారస్థలాలే ఇక విరామ చిహ్నాలు.

అటు పెద్దాపుర సంస్థాన వైభవం, ఇటుపిఠాపుర సంస్థాన ప్రాభవం. మధ్యలో చాళుక్య శిల్పకళాతోరణం.

ఇటీవల కాకినాడలో జరిగిన  ‘యాత్రా సాహిత్య’ సభలో చిన వీర భద్రుడు రగిలించిన వేడి నెమ్మది నెమ్మదిగా రాజుకుని  డాక్టర్ వాడ్రేవు వీర లక్ష్మి దేవి గారి శేఫాలికలో  లేత సీతాకాలపు తొలిచలిమంటయ్యింది. ‘మనం కవులం, రచయితలం, సాహిత్యాభిమానులం ఇంత కాలంగా రాస్తూ చదువుతూ తెలుగు భాషాసాహిత్యాల కోసం చేదోడయ్యాం. కానీ అది చాలడం లేదు. ప్రజల దగ్గరకు మనమే వెళ్లే ఒక రోజు వచ్చింది గతం లో గ్రంధాలయోద్యమం సమయంలో మన సాహితీ వేత్తలు ఊరూరా తిరిగి పుస్తక  పఠనావసరం ప్రజల్లోకి తీసుకువెళ్లారు. పాదయాత్రలు చేశారు, అలా మొదలైన పాదయాత్రను ఇప్పుడు ఎందరు! ఎలా? ముందుకు తీసుకు పోతున్నారో, ఆ పాదయాత్రల శక్తి కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ కడపటి దారిలో ఒకసారి పాదాలకి పని చెప్పుదామన్న’ ఆమె పిలుపుకి ఆహ్లాదకరమైన స్పందన రావడం అద్భుతం.

సాహిత్యం కోసం నడుద్దాం అనగానే ఎందరో గొప్పగా స్పందించారు. కలిసినడుద్దాం అన్నారు. మేము సైతం అంటూ దేశం నలుమూలలనుంచే కాకుండా విదేశాలనుంచికూడా ఒకటే ప్రశంసల వర్షం. ఈ పదయాత్ర గురించి 20 మంది సభ్యులు ఇప్పటి వరకూ  మూడు సమావేశాలు జరిపారు. పదిహేనురోజులక్రితం పొలమూరు నుంచి చంద్రంపాలెం దాకా ఒక రెకీ చేశారు. ఆ సందర్భంగా పొలమూరు, చంద్రంపాలెం గ్రామ పెద్దల ప్రోత్సాహం అద్వితీయం.

‘భాష పరసీమలు చూడాలి. గజం యెత్తు పుస్తకాలు రచించాలని’ సంకల్పించిన కథా కథన చక్రవర్తి పండిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి స్వగ్రామం పొలమూరు నుండి భావకవితా సామ్రాట్ కళాప్రపూర్ణ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి  స్వగ్రామం  చంద్రంపాలెం వరకూ ఆ మహనీయుల అడుగుజాడలని వెదుక్కుంటూ గద్యం పద్యం జంట పాదాలై తూర్పుగోదావరిజిల్లాలో  మూడు పగళ్లు, మూడురాత్రులుగా ఈ పదయాత్ర నడుస్తుంది.

చూరులో పిచ్చుకగూడూ, చెరువులో తామరతూడూ, కోనేట్లో జలకాలాట, గల్లీల్లో గోళీలాట, చెంగున ఎగిరే లేగ దూడ రివ్వున ఎగిరే కొంగల బారు ఇదీ పల్లెటూరు. ఆ పల్లెలవాకిళ్ళల్లోకి ఆకులో ఆకులై  పూవులో పూవులై వెళ్లి మన అస్థిత్వపు మూలాలని శోధించుకోవడానికి ఉధ్ధేశ్యించిందే ఈ మొట్టమొదటి ‘పదయాత్ర ‘.

అనపర్తి మండలం పొలమూరునుంచి సామర్లకోట మండలం చంద్రంపాలెం( రావువారి చంద్రంపాలెం) వరకూ నలభై కిలోమీటర్లదూరం. మూడు రాత్రులు మూడు పగళ్లు గా మొత్తం మూడు రోజుల కార్యక్రమం . పగలు, మూడు విరామాల మధ్య ఐదేసి కిలోమీటర్ల నడక. రాత్రి విశ్రాంతి. పొలమూరు చంద్రంపాలెం గ్రామాల్లో సాహిత్యసభలు. దారిలోఉన్న గ్రామాల ప్రజలు,పాఠకులు, పాఠశాల విద్యార్ధులతో సంభాషణ ఇదీ కార్యక్రమం . ఇది తెలుగు రాష్ట్రాల్లో నలుమూలలా జరగాలన్నది పదయాత్ర ఆశయం.

డిసెంబర్ ఏడవ తేదీ సాయంత్రం కాకినాడ లో బయలుదేరి కవి రచయితాది సాహితీ పదయాత్రికులంతా  పొలమూరు చేరతారు. ఆరు  గంటల నుండి ఎనిమిది  గంటల వరకూ పొలమూరు లో సాహిత్య సభ . ఆ రాత్రి పల్లెనిద్ర పొలమూరు లోనే.

ఉదయం ఆరు గంటలకి పొలమూరు నుంచి తొలిరోజు యాత్ర మొదలవుతుంది. ఐదు కిలోమీటర్లు సాగి రాయవరం లో కాస్సేపు విరామం. పండిత శ్రీపాద వారు తొలి ముద్రణా యంత్రాన్ని చూసింది ఈగ్రామంలోనే. అప్పటి ఆయన అనుభూతి పధికులని గాలిలా పలకరించవచ్చు. అక్కడకి ఐదు కిలోమీటర్లదూరంలో బలభద్రపురంలో భోజన విశ్రాంతి. గ్రామీణ పారిశ్రామికాభివృధ్ధి రైసుమిల్లుల రూపంలో ఇక్కడ అడుగడుగా కనిపిస్తుంది.లోపలకి వె ళ్ళి ‘వడ్లగింజలు’ లెక్కపెట్టడమే తరువాయి. మధ్యాహ్నం మూడు నుంచి మరో ఐదు కిలోమీటర్ల  నడక బిక్కవోలు (ఒకప్పటి ‘బిరుదాంకినవోలు’) చేరుతుంది. రాత్రి బస. ఇక్కడ చాళుక్య శిల్పకళా చాతుర్యం అందరినీ కట్టి పడేస్తుంది.

తొమ్మిదవ తేదీన ‘బిక్కవోలు’ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ‘పెదబ్రహ్మదేవం’ చేరుకుంటారు. ఈ దారిపొడవునా గోదావరి పిల్లకాలువల హొయలు యాత్రికుల మనసునుయ్యాలలూపుతాయి. కాటన్ దొర కష్టాన్ని కళ్లముందుంచుతాయి. నడక ‘పెద బ్రహ్మదేవం’ లో బయలుదేరి ‘మేడపాడు’ చేరుకుంటుంది. తంగిరాల శంకరప్ప పెద్దాపురం దివాణానికి ఈ దారివెంబడే వెళ్లివుంటాడా అని యాత్రికుల కళ్ళు అటూ ఇటూ ఆనవాళ్ళకోసం తిరగకమానవు. ప్రజలతో పరిచయ కార్యక్రమం అయ్యాకా, అక్కడనుంచి పదయాత్ర ‘వేట్లపాలెం’ చేరుతుంది, రాత్రి బస. చందమామ కథల్లో చెట్టెక్కే భేతాళుడికి ఇక్కడో గుడి. రాత్రి సందడంతా ఇక ఆగుడిచుట్టే.

పదిన ‘వేట్లపాలెం’ నుంచి బయలు దేరి ‘సామర్లకోట.’ ఇక్కడకి దగ్గర్లోని పెద్దాపురం నుంచి గాలి ‘ గులాబి అత్తరు ‘ ఏమాత్రం మోసుకొస్తుందో, ఉన్నంత సేపూ అంతా ముక్కుపుటాలని రిక్కించాల్సిందే. అక్కడనుంచి ‘ఉండూరు.’ విజయనగరం మహారాజు ఆనంద గజపతి, పెద్దాపురం మహారాజు రాయజగపతికీ మధ్య 1759 లో హోరాహోరీ యుధ్ధం జరిగిందిక్కడే. ఈ యుధ్ధంలో ఆనందగజపతి తుపాకీ గుండుకి రాయజగపతి కుప్పకూలారు. ‘ఉండూరు’ అయిన ‘గుండూరు’  యాత్రికుల వ్రేళ్ళు పట్టుకొని చరిత్రలోకి తీసుకెళ్లక మానదు. ఉండూరులో జనంతో మాటామంతీ అయ్యాకా  ఆరు కిలోమీటర్లదూరంలోని చంద్రంపాలెం చేరడంతో, అక్కడ బహిరంగ సభతో ‘పదయాత్ర’ సమాప్తమవుతుంది. చంద్రంపాలెం లో మీటింగ్ తర్వాత కాకినాడ కు అరగంట ప్రయాణం.

నడకదారిలో కళ్ళా పుల  జల్లింత, కర్రావుల బెదిరింత, చెక్కిట  సిగ్గుల తళుకూ, వాకిట ముగ్గుల బెళుకూ  , వేకువలో కోడి కూత, పెరుగుకుండలో కవ్వం మోత, వుట్టిలో వెన్నకుండలు, ప్రేమతో గోరుముద్దలు, వంటింట్లో దాలిపొగ, చావిట్లో కుంపటి సెగ, కొట్లో కొసరు బేరం, చద్దన్నంలో పచ్చడి సారం, పెరట్లో చిలక్కొట్టూ, బల్లో కాకెంగిలి, తలంటు స్నానాలూ, సునిపిండి నలుగులూ కనిపిస్తాయో లేదుగానీ పల్లెబాట పొడవునా పచ్చటి పుల్లంపేట జరీ చీరలు సాహితీ ప్రియులలని శిరసూపి స్వాగతిస్తాయి.  పటికబెల్లం పలకరింపులూ, కొసరి కొసరి వడ్డింపులూ గొప్ప అనుభవాన్నిమాత్రం మిగులుస్తాయి.

ఈ పదగమనం కేవలం తూర్పు గోదావరి జిల్లా కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది తెలుగుభాషా యాత్ర కాబట్టి ఇందులో మాతో పాటు మీరందరూ ఈ భాషాసాహిత్యాల ఉత్సవగమనం లో పాల్గొనవచ్చు. ఇదే ఆహ్వానం.

ఇట్లు

మీ తాపీ మేస్త్రి రామదీక్షితులు.బి.ఏ.

 

చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతిరాజు

9 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా వర్ణించారు ఈ అద్భుత యాత్రను.

  • వర్మ గారూ
    చక్కగా వ్రాసారండీ
    నది, భూమి,పంట, శ్రమ, భావం, రచన, కవనం అన్నీ అలా రంగరించిన ఒక సంస్కృతిని హృద్యంగా ఆవిష్కరించిన మీ మనసున్న మేధకు నమస్సులు. ఎంతో మౌనంగా చిరునవ్వు తో కలసి ఉన్నా మీకు మీరు ప్రత్యేకమై ఉండే మీ పటిమను కధలు, వార్తాకధనాలనుండి ఎన్నో విధాల విస్తరించే రచనలుగా చూసేందుకు సంసిధ్ధమౌతున్నాను…

  • ఇదంతా తాపీ మేస్త్రి రామ దీక్షితులు బిఎ చేత చెప్చించాలనే ఊహ అద్భుతం

  • మీ ఈ ప్రయత్నానికి నా మనఃపూర్వక అభినందనలు. ఇటీవలే ఏదోఒక గట్టి ప్రయత్నం అవసరమని భావించి స్కూలు పిల్లలకు సాహిత్యం చదివినందుకు గాను బహుమతి ప్రకటించడం ద్వారా వారిలో జిజ్ఞాస కలిగించ వచ్చని ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను.
    నా యీప్రయత్నాన్ని ఉపయోగకరంగా ముందుకు తీసుకుపోడానికి కొంతమంది సాహితీవేత్తల అభిప్రాయాలతోబాటు , వారితో సమన్వయం కోసం ఎదురు చూస్తున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు