ప్రతి ఇంట్లో ఒక నిర్మలమ్మ…

ల్లెటూరిలో పని పాటలు చేసుకుంటూ, తన వాక్చాతుర్యంతో చుట్టూవున్న వారిని హద్దుల్లో పెట్టే పెద్దావిడ లాంటి వేషాలకు నిర్మలమ్మ ఫేమస్. అచ్చమైన మన జానపదుల తెలుగు ఉచ్చారణ ఆమె నోట పలికినంత బాగా ఇంకెవ్వరి నోటా పలకగా నేను వినలేదు.

పాత్రకు తగిన ఉచ్చారణా, డైలాగ్ మాడ్యులేషనూ, టైమింగూ బాగా తెలిసిన నటి. వదినగా, అమ్మగా, అత్తగారిగా, బామ్మగా, అమ్మమ్మగా ఇలా యే వేషం వేసినా పాత్రలో ఒదిగి పూర్తి న్యాయం చేసే కేరెక్టర్ ఆర్టిస్ట్ నిర్మలమ్మ.  సన్నివేశాన్ని బట్టీ, పాత్ర స్వభావాన్ని బట్టీ సాత్వికతనూ, గయ్యాళితనాన్నీ, హాస్యాన్నీ, కరుణనీ
సమానంగా పండించగల భావప్రకటనాశక్తి ఆమె బలం.

సుమారు అరవైరెండేళ్ల నటజీవితంలో దాదాపు 800 పైచిలుకు చిత్రాలలో నటించిన ఆమె పాత్రలగురించి చెప్పాలంటే చాలా కష్టం . తెలుగు సినిమాలలోఆవిడ చేసినన్ని పాత్రలూ, ఆవిడ చూపినంత వైవిధ్యమూ, ఇంకెవరైనా నటీమణులు చూపారా అంటే అనుమానమే!  యెవరూ వున్నట్టు కనపడదు. బహుశా రమాప్రభ గారు వెయ్యి చిత్రాలు చేసి వుండొచ్చు కానీ ఆవిడవి అన్నీ దాదాపు  కామెడీ కారెక్టర్లే. తమిళంలో మనోరమ గారు వెయ్యికి పైగా చిత్రాలు చేసినట్టున్నారు.

సినిమాని మలుపుతిప్పే  కీలకమైన సన్నివేశాలలో ఆమె నటన తూకంగా వుండి ఆకట్టుకుంటుంది.
ఉదాహరణకి “స్వాతిముత్యం” చిత్రంలో కథానాయకి జీవితం మలుపు తిరగడానికి నిర్మలమ్మ చెప్పే డైలాగే కారణం “లలిత జీవితం బాగుపడాలంటే యెవరైనా పుణ్యాత్ముడు ఆమె మెడలో తాళికట్టి బాగా చూసుకోవాలి” అనే డైలాగ్ తో సినిమా కథ ఊహించని మలుపు తిరుగుతుంది.  అట్లాగే “కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమాలో పాడి సుందరమ్మ పాత్రలో ఆవిడ కోట శ్రీనివాసరావుని ఒక ఆట ఆడిస్తుంది. “గాంగ్ లీడర్ “సినిమాలో చిరంజీవితో పోటాపోటీ గా నటించి హాస్యం పండించింది. “శంకరాభరణం” సినిమాలో చంద్రమోహన్ బామ్మగా బ్రాహ్మణ వితంతువు వేషం కొద్దిగా వేరుగా, ఆమెకు తగనట్టుగా అనిపించినా ఆవిడ పరిథిలో ఆవిడ న్యాయం చేయడానికే ప్రయత్నించింది.

“చలాకీ మొగుడు-చాదస్తపు పెళ్లాం”(తన సొంత బానర్ )లో రాజేంద్రప్రసాద్ ని ఒక ఊపు ఊపింది. మంచి హాస్యచిత్రం ,ఆమే నిర్మాత.  “దేవత” సినిమాలో(హాస్యనటుడు పద్మనాభం సొంత చిత్రం యన్ .టి.ఆర్ ,సావిత్రి హీరో హీరోయిన్లు ) తనకంటే పెద్దదో, సమవయస్కురాలో అయిన సావిత్రికి అత్తగారుగా నటించి రక్తి కట్టించింది.

“మనుషులు మారాలి” లో శోభన్ బాబు తల్లిగా చాలా మంచి వేషం. ఆమె సినీ జీవితం అప్రతిహతంగా సాగిపోవడానికి కారణమైన పాత్ర అది. ఈ చిత్రంలో ఆమె నటన చూసి హిందీ నటుడు ప్రాణ్ కూడా మెచ్చుకున్నాడట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలున్నాయి, అన్నీ చెప్పడం చాలా కష్టం. ఒక నటిగా  ఇంత అభివృధ్ధి సాధించడానికి ఆమె యెంత కష్ట పడిందీ, ఆమె నట ప్రస్థానం యెలా మొదలయిందీ తెలుసుకుందాం.

ఆమె 1920 ప్రాంతాలలో బందరు లో రౌతు కోటయ్య, గంగమ్మ దంపతులకు తొమ్మిదవ సంతానంగా జన్మించింది. పెద్దగా చదువుకోలేదు. ఆమె చదివింది మూడో తరగతి మాత్రమే! ఆమె అసలు పేరు రాజమణి .  నిర్మల అనే పేరు యెలా వచ్చిందీ తెలియదు.  ఆమె కుటుంబంలో యెవరికీ కళల పట్ల ఆసక్తి లేదు. ఈమెకు మాత్రం చిన్నప్పటి నుండీ నాటకాలంటే ఇష్టం. ఇది సహజంగానే ఇంట్లో వాళ్లకి కంటగింపయినా,  పెద్దక్క ప్రోత్సాహం తోడయింది.

మొట్ట మొదట “సతీ సక్కుబాయి నాటకం” సాధన చేసి గన్నవరం లో ప్రదర్శన ఇచ్చారు.  అప్పట్లో ఆమె గొంతు కీచుగా వుండేది, ప్రేక్షకులు గొడవ చేసి ఆటపట్టించే వారు. క్రమంగా సాధన చేసి సంభాషణలు చెప్పడంలో పట్టు సాధించింది.

నటిగా సమయస్ఫూర్తితో సన్నివేశాలను రక్తి కట్టించేది. కాకినాడ కళాపరిషత్తు పోటీలలో “కరువు రోజులు” నాటకం ప్రదర్శించేటప్పుడు ఆమె చూపిన ప్రతిభకు పృథ్వీరాజ్ కపూర్ మెచ్చుకుని ప్రత్యేకంగా ప్రశంసించడం విశేషం. ఆమె ఆలిండియో రేడియో లో కూడా ప్రవేశించి అక్కడ కూడా తెలుగు నాటికలూ, సంస్కృత నాటకాలూ, ఏకపాత్రాభినయాలూ యెన్నో చేసి మంచి పేరు సంపాదించారు. “వేయి పడగలు” రేడియో నాటకంలో గిరిక పాత్రను విన్న మహా కవి విశ్వనాథ సత్యనారాయణ గారు “పిచ్చి మొద్దూ!  నీలో ఇంత ప్రతిభ  దాగుందా!” అని మెచ్చుకున్నారు.

ఇక సినిమా ఫీల్డ్ విషయానికొస్తే, పరిశ్రమలో ప్రవేశించిన తొలి రోజులలో, అందరూ “మగగొంతు” అని వెక్కిరిస్తుంటే సినీనటి అంజలీ దేవి “నీలాగా  సరైన మాడ్యులేషన్ తో డైలాగ్ చెప్పెవారు పరిశ్రమలో లేరు” అని ధైర్యం చెప్పటమే కాక, అప్పట్లో వారి సంస్థ నిర్మిస్తున్న “రుణానుబంధం” లో వేషమిచ్చి ప్రోత్సహించారు .

నాటకాలలో బాగా పేరొచ్చాక నిర్మలమ్మకి సినిమాలలో చేరాలనే ఉత్సాహం కలిగింది. ఆమె మొట్టమొదటి సినిమా “గరుడ గర్వభంగం”(1943) రెండో సినిమా “పాదుకా పట్టాభి షేకం”(1944)   ఈ సినిమాలో ఆమె వేషం ఎడిటర్ కత్తెరకు బలయ్యింది. అందువలన  అంతగా ఉత్సాహంగా అనిపించక విజయవాడ తిరిగి వచ్చి నాటకాలు ఆడుకో సాగింది.

“ఆడపెత్తనం” సినిమాలో అక్కినేని గారి పక్కన హీరోయిన్ గా ఆ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు  అవకాశం ఇచ్చినా సినిమా రంగంలో నిలదొక్కుకోలేమనే అనుమానంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి సినిమాల మీద మళ్లీ గాలిమళ్లి అవకాశాలకోసం ప్రయత్నిస్తే మొదట్లో సన్నగా వున్నావు హీరోయిన్ వేషానికి అన్నవారే,  ఇప్పుడు హీరోయిన్ వేషానికి పెద్దగా వున్నావు అని మధ్యవయసు పాత్రలు ఆఫర్ చేశారు.

1961 లో “కృష్ణ ప్రేమ “లో రుక్మిణి పాత్ర దక్కింది. అలా  నాగయ్య గారి పక్కనా, యస్వీఆర్ పక్కనా, గుమ్మడి గారి పక్కనా నటించసాగింది. తన కంటే పెద్దవాళ్ల దగ్గరనుండీ తనకంటే చిన్నవారికే కాకా   తనకంటే పెద్దవారికి కూడా అమ్మగా, అత్తగా, వదినగా, బామ్మ గా నటించింది. ..”భార్యాభర్తలు ,కులగోత్రాలు,దేవత,పేదరాశి పెద్దమ్మ కథ,”ఇలా చాలా చిత్రాలలో నటించసాగారు.

ముఖ్యంగా “మనుషులు మారాలి” లో శోభన్ బాబు అమ్మ గా ఆమె వేసిన వేషం నిర్మలమ్మకు  చాలా మంచి  పేరు తెచ్చిపెట్టింది. అక్కడ నుండీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక ఎంత బిజీ అయిపోయిందంటే ఒక దశలో సూపర్ స్టార్ కృష్ణ తో సమానంగా యేడాదికి 18 సినిమాలలో నటించిన రోజులు కూడా వున్నాయి. ఆమెకు ఎక్కువగా వేషాలు ఇచ్చి ప్రోత్సహించిన వారిలో తాపీ చాణక్య, బి.ఏ.సుబ్బారావు, దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ , యస్వీకృష్ణారెడ్డి మేదలైన వారు ఉన్నారు.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే . ఆమె 1949 ప్రాంతాలలో గుత్తికొండ వెంకట కృష్ణారావు గారిని తనను   నాటకాలూ సినిమాలలో నటించడానికి అభ్యంతరం పెట్టకూడదనే షరతుతోవివాహం చేసుకున్నారు.  ఆవిడ సినిమాలలో ప్రవేశించాక ఆయన కూడా ప్రొడక్షన్ మేనేజర్ గా చాలా సినిమాలకు పని చేశారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.  ఒక అమ్మాయిని దత్తత చేసుకుని కవిత అని పేరు పెట్టుకుని పెంచుకున్నారు.
ఆమె కొడుకే “పడమటి సంధ్యా రాగం” లో బండబ్బాయి పాత్ర వేసినది అంటే నిర్మలమ్మ మనవడు.

ఆమెకు మన తెలుగు సంస్కృతీ, ఆచారాల పట్ల పట్టు యెక్కువ. సాధారణంగా ఇంట్లో వంటంతా ఆమే చేసేవారు, తన కూతురికీ ,మనవలకీ తెలుగు భాష రావాలని పట్టు పట్టి తానే నేర్పించారు. తనకి కుదరనప్పుడు నటుడు కాకరాలని పిలిపించి చదువు చెప్పించేవారు. తోటి నటీనటులు తెలుగు సరిగా పలకక పోతే నొచ్చుకునే వారు.

చిరంజీవి నటించిన “స్నేహంకోసం” సినిమాతో ఆమె విరమించుకోవాలనుకున్నారు. కానీ యస్వీకృష్ణా రెడ్డి గారు పట్టుబట్టి “ప్రేమా నీకు స్వాగతం” లో నటింప జేశారు (2002). అదే ఆమె ఆఖరి చిత్రం. ఇంటి దగ్గర విశ్రాంత జీవితం గడుపుతున్న ఆమె ఫిబ్రవరి 19-2009 లో తనువు చాలించారు. చక్కటి గుణచిత్రనటి నిర్మలమ్మ ను చిత్రపరిశ్రమ చిరకాలం గుర్తుంచుకుంటుంది.

*

రొంపిచర్ల భార్గవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు