పాడేరు నుంచి అరుకు వెళ్ళే దారిలో ఉంది ఆ గెస్ట్ హౌస్. చూడ్డానికి పాత డాబా ఇల్లులా అనిపించినా లోపల విశాలమైన హాలు, ఒక బెడ్ రూమ్, ఒక వంటగది ఉన్నాయి. అది రాత్రి ఏడు దాటిన సమయం. అక్కడ పార్టీ జరుగుతోంది. పార్టీని నిర్వహించే చక్రవర్తి అందరి మధ్యలో కూర్చున్నాడు. అతడి చుట్టూ నాలుగు కుర్చీల్లో మిత్ర బృందం. అందరి చేతుల్లో గ్లాసులున్నాయి. అతడి చేతిలో గ్లాసు ఉంది, గాని దానిలో ఉన్నది నిమ్మకాయ రసం. అతడు తాగడు. వారి మధ్య టీపాయ్ మీద మంచింగ్ కోసం పెట్టిన తినుబండారాలు.
అది వారాంతపు సెలవు దినం. అందరికీ ఆటవిడుపు. చక్రవర్తి గెస్ట్ హౌస్‌లో ఆ మిత్రులంతా కలుస్తారు. మిత్రులంటే ఈమధ్యే ఆరు నెలల క్రితం వారి స్నేహం కలిసింది, వారి వృత్తి రీత్యా. వారంతా కాంట్రాక్టర్లు. ఎప్పుడూ తమ కాంట్రాక్టరు పనులతో సతమతమవుతూ వారానికి ఒకసారి అలా కలుస్తారు. ఎప్పుడు కలిసినా చక్రవర్తి ఒక కథ అల్లి వారికి వినిపిస్తాడు. కారణం అతను ఒక రచయిత. విరివిగా పత్రికల్లో కథలు రాస్తాడు. సాహిత్య లోకంలో మంచి రచయితగా పేరు వుంది. మిగతా వారంతా శ్రోతలు. ఆరోజు మిగతా మిత్రులు “చక్రీ! కథ చెప్పు” అన్నారు. అతను చిన్నగా నవ్వి, “నేను కాదు, మీలో ఎవరన్నా ఒకరు కథ చెప్పండి” అన్నాడు. అతడి మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు. ఆరు నెలల నుంచి వాళ్ళంతా రోడ్డు, భవనాలు, వంతెనలు వంటి కాంట్రాక్టు పనుల సందర్భంగా సిండికేట్‌గా ఏర్పడ్డారు. చక్రవర్తితో పాటు ఆ పార్టీకి వచ్చిన మురళి మాత్రం అతని బాల్య స్నేహితుడు. ఇద్దరూ ఒకటవ తరగతి నుంచి కలసి చదువుకున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ చేసి కొంత కాలం ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసి ఈ మధ్యనే సంవత్సరం క్రితం కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. మురళి నేను ఒక కథ చెప్తాను అంటూ ప్రారంభించాడు.
“నేను చదివిన ఒక పెద్ద రచయిత కథ చెప్తాను. అది ఒక బంగారపు గొలుసు కథ” అన్నాడు.
“చెప్పు… చెప్పు…” అంటూ చక్రవర్తి మిత్రుడి వంక నవ్వుతూ చూశాడు.
వాతావరణం చల్లగా ఉంది. కారణం అది మన్య ప్రాంతం. చుట్టూ కొండలు, ఎత్తయిన చెట్లు, కాఫీ తోటలు, నిరంతరం పలుచగా కురిసే వర్షం. ఇంతలో ఆ గెస్ట్ హౌస్ వాచ్‌మేన్ వేడిగా వేసిన మిరపకాయ బజ్జీలు తీసుకువచ్చాడు. వాటిని తింటూ అందరూ మురళి వంక ఆసక్తిగా చూశారు. మురళి చెప్పడం మొదలెట్టాడు మళ్లీ.
“అనగనగా ఒక ఇద్దరు స్నేహితురాళ్లు. ఒకావిడ ధనికురాలు, ఇంకో ఆవిడ మధ్యతరగతి మహిళ. ఒకసారి ఆ మధ్యతరగతి మహిళ ఆ ధనికురాలిని పెళ్లికి వెళతానని చెప్పి ఆవిడ గొలుసు అడిగింది. ప్రాణ స్నేహితురాలు కదా అని తను వేసుకునే వజ్రాల హారాన్ని స్నేహితురాలికి ఇచ్చింది”
మురళి చెప్పడం ఆపాడు. చక్రవర్తి కొనసాగించాడు. “ఆ వజ్రాల హారం పెళ్ళిలో పోగొట్టుకుందా ఆవిడ?” అన్నాడు చక్రవర్తి.
“నీకెలా తెలుసు?” అన్నాడు మురళీ.
“ఇది మపాసా రాసిన నెక్లెస్ కథ” మిగతా కథ నేను చెప్పనా?”
“లేదు… లేదు… నేను చెప్తాను” అని కొనసాగించాడు మురళి.
గొలుసు పోగొట్టుకున్న ఆ మధ్యతరగతి ఆవిడ స్నేహితురాలికి మొహం ఎలా చూపించాలో తెలీక బాధపడి తన భర్తతో సంప్రదించి తన ఇల్లు అమ్మేసి ఇంకా అప్పులు చేసి ఆ వజ్రాల హారం వేరే కొని స్నేహితురాలికి ఇచ్చి తన భర్తతో ఆ ఊరు వదిలిపెట్టింది. చాలా కాలం తరువాత మళ్ళీ ఆ ఇద్దరు స్నేహితురాళ్లు కలుసుకున్నారు. ఆ మధ్యతరగతి మహిళ మరింత ధైన్యస్థితిలో పేదరాలిగా మారిపోయింది.
“ఏమైంది? ఇలా అయిపోయావు” అంది ఆ ధనికురాలైన స్నేహితురాలు.
“ఏముంది? నీవిచ్చిన వజ్రాల హారం పోగొట్టుకున్నాను. దాన్ని నీకివ్వడంకోసం ఇలా అప్పులపాలయ్యాం” అంది.
దానికి ఆ స్నేహితురాలు ఆశ్చర్యపోతూ “అయ్యో! ఎంత పని చేశావు. నేను నీకిచ్చింది గిల్టు నగ. తిరిగి అదే ఇచ్చేశావనుకున్నాను” అంది.
ఆ మాటలకు కుప్పలా కూలింది ఆ పేద స్నేహితురాలు.
మురళి కథ చెప్పడం పూర్తి చేశాడు.
“మై గాడ్! గొప్ప కొసమెరుపు” అన్నారు ఆ పార్టీలోని మిత్రులందరూ.
“ఇలాంటి బంగారు గొలుసు కథ మా ఇంట్లోనూ జరిగింది. ఇది వేరే జోనర్. ఇది పోలేరమ్మ కథ” అంటూ చెప్పడం మొదలుపెట్టాడు చక్రవర్తి.
*
ఆ ఊళ్ళో ఇద్దరు పోలేరమ్మలు ఉన్నారు. ఒక పోలేరమ్మ గుళ్ళో వుంటే, ఇంకో పోలేరమ్మ ఒకరి ఇంట్లో పనిమనిషిగా ఉంటోంది. గుళ్ళో పోలేరమ్మను ఆ ఊళ్ళో వాళ్ళు ఏర్పరుచుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం ఆ ఊళ్ళో పిల్లలకు జ్వరాలు రావడంతో “తల్లీ మా బిడ్డలకు జ్వరాలు తగ్గాలి. నీ మొక్కు తీరుస్తాం” అంటూ పోలేరమ్మను వేడుకునేవారు. ఆ మొక్కు, కోడిని కోయడం, మేకను బలి ఇవ్వడం, పేద మహిళలకు చీరల దానం ఇలా – ఇది గుళ్ళోని పోలేరమ్మ అమ్మవారి కథ! ఇక పనమ్మాయి పోలేరమ్మ కథలోకి వెళితే –
పోలేరమ్మ రుక్మిణి, శంకర్రావుల ఇంట్లో పనమ్మాయిగా చేరినవుడు ఆమె వయసు ముప్పయ్యేళ్ళు. ఇపుడు అరవయ్యేళ్ళ వయసులో ఆ ఇంట్లోంచి బైటకు వచ్చేసింది. ఆ ఇంట్లో పనమ్మాయిగా ఎందుకు చేరవలసి వచ్చిందో తెలియాలంటే ముప్పయ్యేళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఇక ఆ ఇంట్లోంచి ఎందుకు బైటకు వచ్చిందో తెలియాలంటే ముప్పయ్ రోజుల క్రితం జరిగిన సంగతి తెలియాలి.
ముందుగా ముప్పయి సంవత్సరాలు వెనక్కి వెళితే… ఆ ఊరు పల్లెటూరు. ఊరి జనాభా ఐదు వేలు. చాలామంది ఆ ఊళ్ళోని షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తారు. అలాంటి కార్మికుడే పోలేరమ్మ భర్త. రోజూ ఉదయమే ఆరు గంటలకు సైకిల్ మీద బయలుదేరతాడు, కేరేజి కట్టుకుని. అలా ఆరోజు డ్యూటీకి బయలుదేరి ఊరు దాటి హైవే మీదుగా ఫ్యాక్టరీకి చేరుతున్న సమయంలో వేగంగా వస్తున్న ఒక లారీ అతడి సైకిల్‌ని గుద్దేసింది. ఫలితంగా అతను రోడ్డు మీద పడ్డాడు. తల పగిలింది. రక్తం ప్రవహించింది. టౌన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళే దారిలోనే అతను చనిపోయాడు. అతని జీవితం అలా రోడ్డు మీద బలయ్యింది. భార్య, ఇద్దరు పిల్లల జీవితాలు రోడ్డు మీద కొచ్చాయి.
ఫ్యాక్టరీ వాళ్ళు పదివేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇక తనూ, తన బిడ్డలు బతకడంకోసం పనిమనిషి అవతారం ఎత్తింది. ఆ ఊరి స్కూల్లో కొత్తగా చేరారు రుక్మిణి, శంకర్రావు దంపతులు. తమ సంవత్సరం వయసున్న కూతురితో – ఆ పిల్లను చూడడంతో పాటూ, ఆ ఇంటిని చక్కబెట్టేందుకు జరిపిన అన్వేషణలో పోలేరమ్మ దొరికింది వారికి. అలా, నాలుగైదు ఇళ్ళల్లో పనికి కుదిరింది. వారు ఆ ఊళ్ళో ఐదేళ్ళు పని చేసిన తర్వాత వేరే ఊరికి బదిలీ అయినా, ఆ ఊళ్లో ఇల్లు కొనుక్కొని అక్కడి నుంచీ వేరే వూళ్ళకు తమ ఉద్యోగం నిమిత్తం తిరిగేవారు. అలా పోలేరమ్మకు తన పని నిలబడిపోయింది ఆ ఇంట్లో.
పోలేరమ్మ ఇద్దరు పిల్లల్లో కొడుక్కు నాలుగేళ్ళు, కూతురికి రెండేళ్ళు. రుక్మిణి, శంకర్రావు గార్ల పిల్ల కళ్యాణిని తన బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమతో సాకేది. అలా కళ్యాణి పెరిగి పెద్దదయింది. ఆ ఊళ్ళో స్కూలు చదువు, పక్క ఊళ్ళో కాలేజీ చదువు పూర్తిచేసి ఇంజనీరింగ్ కాలేజీ చదువుకు హైదరాబాద్ వెళ్ళి, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో కేంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. పోలేరమ్మ కొడుకు ఆమె ఆర్థిక స్థాయికి తగ్గట్టుగా ఐటిఐ చదివి, ఆ ఊరి షుగర్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా ఉద్యోగం సంపాదించుకున్నాడు.
పోలేరమ్మ సంపాదనకు తోడుగా ఆమెకు కోడిపిల్లలు సాయం చేసేవి. వాటిని కొని, పెంచి పోలేరమ్మ గుడ్లు అమ్మేది. అలా కోళ్ళ సహాయంతో పాటూ కొడుకూ అందిరావడంతో కూతురుకు తన తాహతకు తగ్గ సంబంధం తీసుకొచ్చి పెళ్ళి చేసింది. ఆమెకు సంతోషం కలిగించిన మరో విషయం, తన చేతుల్లో పెరిగిన కళ్యాణికి పెళ్ళయింది. ఆమెను అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయితో పెళ్ళి జరిపించారు.
ఇలా ముప్పయ్యేళ్ళు ఒకరింట్లో పనిచేసి రెండో తరాన్నీ చూసిన పోలేరమ్మ అంత హఠాత్తుగా ఆ ఇంట్లోంచి ఎందుకు తప్పుకొంది?! ఇది తెలియాలంటే ముప్పయి రోజులు వెనక్కి వెళ్ళాలి. ఆ ఇంట్లో కళ్యాణికి ఒక సంవత్సరం వయసప్పుడు పోలేరమ్మ పనిమనిషిగా చేరితే, ఇపుడు అంతే వయసున్న కళ్యాణి కూతురు, ఆ ఇంట్లోకి రాగానే పోలేరమ్మకు ఆ ఇంట్లోంచి తాను బైటకు వెళ్ళే పరిస్థితులు కలిగాయి. కళ్యాణికి పుట్టిన కూతురు మొదటి పుట్టినరోజు వేడుక కోసం ఆ ఇంట్లో సందడి మొదలయింది.
ఆ ఇంట్లో పనిమనిషిగా అలవాటయిన పోలేరమ్మ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్న పాపాయికి నూనె రాసి, నలుగు పెట్టి, వేడినీళ్ళతో స్నానం చేయించింది. తనే పౌడరు రాసి కొత్త బట్టలు వేసింది. అలా కళ్యాణి కూతురు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అందరూ ఆ చంటిదాన్ని ఆశీర్వదించి విలువైన బహుమతులు అందచేసారు. పోలేరమ్మ మాత్రం ఒక కోడిపిల్లను ఆ పుట్టినరోజు పాపాయికి కానుకగా తెచ్చింది. ఆరోజు గడిచింది. తెల్లవారింది. అప్పుడు కళ్యాణి అత్తగారికి గుర్తుకొచ్చింది. మనవరాలి మెడలో వేసిన గొలుసు మాయమయ్యిందని. తను ఉదయమే ఆ పిల్ల నిద్రపోతున్న సమయంలో మెడలో గొలుసు వేసింది. మరి సాయంత్రానికల్లా ఎలా మాయమయింది?! ఆ పిల్లకు స్నానం చేయించింది. బట్టలు తొడిగించింది. ఆకలేస్తే పాలు తాగించింది పోలేరమ్మ. ఇపుడు గొలుసు మాయమయ్యిందంటే ఎవరు బాధ్యులు?! అలా వచ్చిన బంధుజనం, అత్తగారు పోలేరమ్మను దొంగగా నిలబెట్టారు, అయితే వారు – ఆమె మీద పడిన నిందను, అపవాదునూ కాదనలేకపోయారు. పోలేరమ్మ గొల్గుమంటూ ఇంట్లోంచి బైటకు నడిచింది. తనకు ఏ పాపమూ తెలియదంటూ ఆక్రోశిస్తూ ఆ ఇంట్లోంచి భారంగా నడిచింది. అలా ఆ ఇంట్లో ఆమె చరిత్ర ముగిసింది.
ఆ ఇంట్లోంచి బైటకు వచ్చిన పోలేరమ్మ అన్నేళ్ళ తన నమ్మకం వమ్ము అయినందుకు దిగులుపడింది. ఆ దిగులు ఆమె గుండెల్లో గుబులు రేపింది. ఆ గుండెకు తగిలిన గాయం ఆమెను ఆస్పత్రి పాలు చేసింది.
రోజులు గడిచాయి. నెలలయ్యాయి. కళ్యాణి కూతురితో పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆమె భర్త అమెరికా వెళ్ళిపోయాడు. కళ్యాణికి, ఆమె సంవత్సరం కూతురికి పాస్‌పోర్ట్, వీసా దొరికిన తర్వాత అతను తీసుకెళతాడు వారిని అమెరికాకు. పుట్టింట్లో ఉన్న కళ్యాణి కూతురికి ఒకరోజు జ్వరం వచ్చింది. దగ్గరలోని పిల్లల డాక్టరుకు చూపించినా తగ్గలేదు. ఈలోగా ఆ ఊళ్ళో గ్రామ దేవత “అమ్మవారు” ఉండడంతో ఆమెకు మొక్కుకుంది కళ్యాణి తల్లి. వారం తర్వాత పిల్లకు ఆరోగ్యం కుదుటబడింది. ఆ ఇంట్లో వారికి బెంగ తీరింది. ఇక అమ్మవారికి చెల్లించవలసిన మొక్కు మిగిలింది. ఆ కుటుంబం అంతా మొక్కు తీర్చుకోవడంకోసం ఆ ఊళ్ళోని “అమ్మవారి” గుడికి బయలుదేరారు. తమలో పోలేరమ్మ మనవరాలికి ఇచ్చిన కోడిని తీసుకువెళ్ళడం మాత్రం మరిచిపోలేదు. కారణం – అమ్మవారి మొక్కు అంటే, కోడిని కోసి అమ్మవారి గుళ్ళో వంట వండి, కొంత మంది పేదలకు భోజనం పెట్టడం.
అపుడు పోలేరమ్మ ఇచ్చిన కోడిపిల్ల ఈ మూడు నెలల్లో పెద్దదయింది. అమ్మవారి మొక్కుకు సిద్ధమయింది. గుళ్ళో పూజలు జరిగాయి. వారి ఇంటి కారు డ్రైవరు కోడిని తీసుకెళ్లి చెట్టు చాటున కోసాడు. అపుడు బైట పడింది చరిత్ర అడుగున దాగిన నిజం. ఆ కోడి కడుపులోకి పోయిన బంగారు గొలుసు బైట పడింది. పిల్లకు స్నానం చేయించినపుడు అది పెరట్లో జారిపోయి వుంటుంది. ఆ మట్టిలో, గడ్డిలో వున్న ఆ గొలుసును ఆ కోడి గుటకాయ స్వాహా చేసి వుంటుంది. ఆ నిజం దాని కడుపులో ఇన్ని రోజులు ఉండిపోయింది. అమ్మవారి మొక్కుతో బైట పడింది – కళ్యాణితో పాటూ ఆమె అమ్మ, నాన్న బాధకు లోనయ్యారు. అన్నేళ్ళుగా నమ్మకంగా ప్రేమగా పని చేసిన పోలేరమ్మ నిష్క్రమిస్తుంటే మౌనంగా ఉండిపోయినందుకు తమను తాము నిందించుకున్నారు. ఆమె మీద పడిన నిందను ఆమోదించినందుకు వారి మనసు విలవిలలాడింది. ఆ సమయంలో పోలేరమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో వుంది. బంధువులంతా ఒక్కొక్కరే చూసి వెళుతున్నారు. కళ్యాణి తన కూతురితో, తల్లితండ్రులతో ఆ ఆస్పత్రికి వచ్చింది.
మెలకువలోనే వున్న పోలేరమ్మ వచ్చిన అందరినీ చూస్తోంది. మాట్లాడలేకపోతోంది. కళ్యాణి కూతురితో పోలేరమ్మ ముందు నిలబడింది. కూతురి మెడలో పోయిన గొలుసు వేసి, దాన్ని చూపిస్తూ రెండు చేతులు జోడిస్తూ దుఃఖపడింది. మెల్లగా పోలేరమ్మ చెవిలో గొలుసు దొరికిన వైనం వివరించింది.
ఆ మాట విన్న పోలేరమ్మ మెల్లగా తనలో తాను గొణుక్కుంది. రెండు చేతులూ తనూ జోడించి పైకి చూసింది. అంతా ఆమె దేవుడికి నమస్కారం చేస్తున్నదనుకున్నారు. ఐతే ఆమె దేవుడికి నమస్కారం చేయలేదు. మరి ఎవరికి?! తన పోషణ కోసం ఆ అమాయకమైన ప్రాణి, ఆ కోడి సాయపడింది. ఒక నిజం బైటకు రావడంకోసం చనిపోయింది. అలా నీతిగా బతికిన పోలేరమ్మ చనిపోతూ దేవుడికి కాదు, తనను నీతిమంతురాలిగా బ్రతికించిన ఆ కోడికి నమస్కారం చేసింది. కోడి తల్లీ నీకు దణ్ణం అని గొణుక్కుంటున్న ఆమె మాటలు వారికీ స్పష్టంగా వినిపించాయి. అలా పోలేరమ్మ అమ్మవారిలో కలిసిపోయింది.
*
చక్రవర్తి కథ చెప్పడం పూర్తి చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. “చాలా బాగుంది. నిజంగా జరిగిన సంఘటనేనా?” అడిగాడు ఎవరో.
“నిజంగా అక్షరం అక్షరం జరిగిందే” అన్నాడు చక్రవర్తి.
మురళీ మిత్రుడి మొహంలో సూటిగా చూసి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. అప్పటికి రాత్రి ఎనిమిది దాటింది. “సెలవు పుచ్చుకుందాం” అన్నారు అందరూ, పార్టీ పూర్తవడంతో.
“అవును. ఘాట్ రోడ్ కదా! ఈ చీకట్లో, వర్షంలో మనం మరీ ఆలస్యం చేయకూడదు. వెళ్ళిపోదాం” అంటూ మురళీ, చక్రవర్తి ఇద్దరూ లేచారు.
పార్టీకి వచ్చిన మిత్రులంతా వారి వారి వాహనాల్లో తమ గమ్యస్థానం వైవు కదిలారు. కారు డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న చక్రవర్తి తన మిత్రుడు మురళి ప్రక్కన కూర్చున్న తరువాత కారు స్టార్ట్ చేశాడు. కారు ముందుకు కదిలింది. వర్షపు చినుకులు వేగంగా పడుతున్నాయి. అంతవరకూ మౌనంగా ఉన్న మురళీ నోరు విప్పాడు.
‘నాన్‌సెన్స్, కోడి గొలుసు మింగడం ఏమిటి? కోడి కడుపులో ఉండడమేమిటి? అది కొన్ని నెలల తరువాత బయట పడడం ఏమిటి? నమ్మశక్యంగా లేదు అన్నాడు.
“అవును. నువ్వు చెప్పింది నిజమే! కోడి గొలుసును మింగడం అబద్ధం. మా డ్రైవరే మా అక్కగారి కూతురి గొలుసు పడిపోతే జేబులో వేసుకున్నాడు. దాన్ని అమ్మడానికి ప్రయత్నించి భయపడ్డాడు. ఆ తరువాత తనే కోడి కడుపులో దొరికిందని అబద్ధం చెప్పాడు. అదీ విషయం” అన్నాడు.
“ఓహ్! అదా సంగతి” అన్నాడు మురళీ చిన్నగా నవ్వి.
కారు ముందుకు సాగింది. లిక్కర్ ప్రభావంతో మురళి మత్తులోకి జారుకున్నాడు. చక్రవర్తి తాగలేదు. కాబట్టి అతడు కారు డ్రైవ్ చేసుకుంటూ సాగుతున్నాడు.
అయితే మనసులో ఆలోచనలు ముసురుకున్నాయి. మిత్రుడికి మళ్ళీ తను అబద్ధం చెప్పాడు. తమకు అప్పట్లో కారు ఉండడం, డ్రైవరు ఉండడం కూడా అబద్ధమే! ఆ విషయం మురళికి తెలీదు. అప్పట్లో చెడు స్నేహాలకి అలవాటుపడిన తనే ఆ గొలుసు కొట్టేశాడు. దాన్ని అమ్మడానికి భయపడి కోడి కడుపులో దొరికిందని ఇంట్లోవాళ్ళకి అబద్ధం చెప్పాడు. అలా తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నాడు. పాపం పోలేరమ్మ పై నింద కొంత కాలం అలా ఉండిపోయింది. మొత్తానికి అంతిమ క్షణాల్లో పోలేరమ్మ ఆత్మకు శాంతి కలిగించాడు. అలాగే అప్పటి తన తాగుడు వ్యసనాన్ని వదిలిపెట్టాడు.
కారు ముందుకు సాగుతోంది. చక్రవర్తి మనసు ప్రశాంతంగా లేదు.
‘తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటే శిక్ష పడవచ్చు, బాధ కలగవచ్చు. మరి ఆ తప్పు ఎప్పటికీ ఒప్పుకోకపోతే అది మరీ ఘోరమైన తప్పు. ఇలా తన తప్పును లోకానికి తెలియనివ్వలేదు. జీవితాంతం మోస్తూనే వున్నాడు. అపరాధ భావనతో’
అశాంతితో చక్రవర్తి తన వాహనాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.
*
పోలేరమ్మ కథ చివరిదాకా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో నడిచింది. చేసిన తప్పును ఒప్పుకోకుంటే ఇంకా జీవితాంతం అపరాధ భావనతో నరకం అనుభవించాల్సిందే, ఆ తప్పును మోస్తూ ఉండాల్సిందే అని చక్రవర్తి పాత్ర ద్వారా చక్కగా తెలిపారు. బహుమతి పొందినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు సుగుణ రావు సర్ 🌹🌹🎊🎊వంజారి రోహిణి
కథనం అద్భుతం సుగుణరావు గారు. కథను పాఠకులతో బలవంతంగా కదివించలేం. కథలోకి తీసుకెళ్లగలిగితే అతనే వదలకుండా చివరి వరకు చదువుతాడు. మీ కథ అటువంటిదే. పాఠకుడికి ఇదెలా సాధ్యం అన్న డౌట్ వచ్చేసరికి దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇటీవల నేను చదివిన కథల్లో మంచి కథ. అభినందనలు.
చాలా చాలా బాగుంది సుగుణరావు గారూ. అభినందనలు💐
కోడి గొలుసు మింగడం అనేది నమ్మే విషయం కాదు.వినే వాళ్ళకి విషయం అర్ధం కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరికి బాగానే ముగించారు.