కవులు చిత్రమైన వాళ్లు. చేతనాచేతనా సుప్తచేతనావస్థలలో వాళ్లు మాట్లాడినవి వాళ్లకే పూర్తిగా అర్థం అవుతాయో కావో తెలియదు.
‘గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్’ అన్నాడొక కవి. ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అన్నాడింకొక కవి. ‘పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవీ’ అన్నాడు మరొక కవి.
కాలం గురించి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడని కవి బహుశా లేరు.
కాని కాలం గురించి (ఆహా, ఏమి మాట? ‘కాని’ అని సందేహంతో కాలం గురించి అనీ అనుకోవచ్చు, ‘కానికాలం’ గురించి అని కాలస్వభావం గురించీ అనుకోవచ్చు!) నిజంగా మనకు తెలుసునా?
విశ్వానికి తెలిసిన కొలతల్లో స్థలంలో అటూ ఇటూ ఎటైనా చలనానికి అవకాశం ఉంది. కాని కాలంలో మాత్రం అది ఏకముఖ చలనం మాత్రమే. కాలంలో వెనక్కి వెళ్లలేం. ముందుకు కూడ మనం అనుకున్నంత వేగంతో వెళ్లలేం. పోగొట్టుకున్న, విడిచివచ్చిన, కొల్లగొట్టిన, కోల్పోయిన స్థలాన్ని తిరిగి పొందవచ్చు, కాని అదే పని కాలానికి జరిగితే మాత్రం దాన్ని తిరిగి పొందలేం.
ఆ కాలాన్ని బద్దకం వల్ల, అలసత్వం వల్ల, ప్రాధాన్యతా క్రమాల అవకతవకల వల్ల, మనమే చేతులారా పోగొట్టుకుంటే స్వయంకృతాపరాధం అనుకోవచ్చు. కాని మన కాలాన్ని మరొకరు లాక్కుంటే, కొల్లగొడితే, మన కాలానికి మనను కర్తల స్థానం నుంచి కర్మల స్థానానికి మారిస్తే, ఆ పోయిన కాలం ఎట్లా తిరిగి వస్తుంది? ఆ కాలం పసిడి రెక్కలు విసిరి పోతుందా, ఇనుప ముక్కుల డేగల మృత్యుదాహపు శూలపుపోట్లు పొడిచి పోతుందా? ఆ పోయిన కాలం క్షణమొక యుగం అన్నట్టుగా ప్రతిక్షణమూ అత్యంత విలువైనదై, కొల్లగొట్టబడకపోయి ఉంటే ఎంత సంభ్రమాశ్చర్య అద్భుత సృజనాత్మక ఆలోచనాచరణల సంరంభమై ఉండేదో ఎవరైనా ఎప్పుడైనా లెక్కించగలరా? ఏ ప్రమాణాలలోనైనా అంచనా కట్టగలరా?
ఒక మనిషి అంత విలువైన కాలం కోల్పోవడం, లేదా ఆ మనిషి నుంచి ఇతరులు కొల్లగొట్టడం అసాధారణ సందర్భం అయి ఉండవలసింది, ఇవాళ్టి తలకిందుల లోకంలో అది అతి సాధారణ సందర్భంగా మారిపోయింది. సృజనాత్మక వికాసానికీ, సుఖసంతోషాల నిర్మాణపు ఆచరణకూ ఉపయోగపడవలసిన కోట్ల దినాల, గంటల, నిమిషాల, క్షణాల కాలం కొల్లగొట్టబడుతున్నది, వ్యర్థమైపోతున్నది,
ఈ అసాధారణమైన, అతి సాధారణమైపోతున్న కాల విధ్వంసానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, అన్నిటిలోకీ బలవత్తరమైన కారణం మాత్రం వ్యవస్థ. ఈ వ్యవస్థ యథాస్థితిలో ఉండడం వల్ల ప్రయోజనం పొందే పాలకవర్గాలు.
ఆ యథాస్థితిని కాపాడడానికే పాలకవర్గాలు నిర్మించి నిర్వహిస్తున్న సమస్త హింసా సాధనాలూ, సకల యంత్రాంగాలూ మిగిలిన మనుషులందరినీ తమ కాళ్ల కింది దుమ్ములా భావిస్తాయి. ఆ దుమ్ముకు ఒక స్థలమూ ఒక కాలమూ లేవనీ ఉండగూడదనీ అహంకరిస్తాయి. ఆ స్థలాన్ని విధ్వంసం చేస్తాయి, ఆ కాలాన్ని కొల్లగొడతాయి.
అలా పోయిన కాలం ఎలా తిరిగి వస్తుంది?
మహా ఘనత వహించిన కలకత్తా ఉన్నత న్యాయస్థానపు ఇద్దరు న్యాయమూర్తుల డివిజన్ బెంచి జూన్ 21న వెలువరించిన ఒక తీర్పు ఈ పోయిన కాలం గురించి ఎన్నెన్నో ఆలోచనలు ప్రేరేపించింది.
“వామపక్ష” పాలనాకాలంలో 2005లో పశ్చిమ బెంగాల్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను నిర్బంధించి, వారు మావోయిస్టు పార్టీ అగ్రనాయకులని, “రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నార”ని నేరారోపణతో, అన్ లా ఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ (యుఎపిఎ) అనే భయంకరమైన చట్టం కింద కేసు నడిపారు. వారిలో పతిత్ పావన్ హల్దర్, సంతోష్ దేవనాథ్ అనే ఇద్దరికి యావజ్జీవ శిక్ష, సుశీల్ రాయ్ కి ఎనిమిది సంవత్సరాల శిక్ష విధిస్తూ 2006లో పశ్చిమ మిడ్నపూర్ అదనపు సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ సెషన్స్ కోర్టు విధించిన శిక్ష చట్టబద్ధమూ న్యాయబద్ధమూ కాదని నిందితులు హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లారు. ఏళ్లూ పూళ్లూ గడిచినా ఆ అప్పీల్ హైకోర్టు విచారణకు రాలేదు. ఈలోగా సుశీల్ రాయ్ కి కాన్సర్ వ్యాధి సోకిందని తెలిసి, శిక్షాకాలం ముగియడానికి ఏడాది ముందు 2013లో విడుదల చేయగా కాన్సర్ చికిత్సలో ఉండగానే 2015లో చనిపోయాడు. ఇప్పుడు విచారణకు వచ్చిన అప్పీల్ పై తీర్పు ఇస్తూ, ఈ ముగ్గురి మీద ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని, వారు నిర్దోషులని, వారికి శిక్ష విధించి సెషన్స్ కోర్టు తప్పు చేసిందని హైకోర్టు న్యాయమూర్తులు భావించారు.
నిర్దోషులుగా ఇప్పుడు విడుదలైన ముగ్గురిలో ఒకరు ఏడున్నర సంవత్సరాల జైలు నిర్బంధం అనుభవించి, కాన్సర్ వ్యాధికి గురై, మరణించారు. ఇప్పుడు నిర్దోషిగా ప్రకటించినా, దోషిగా ప్రకటించినా ఆయనకా పోయిన కాలాన్ని ఎవరూ తెచ్చి ఇవ్వలేరు. ఇక మిగిలిన ఇద్దరు ఏ నేరం చేయకుండానే, ఏ నేరం చేయలేదని ఉన్నత న్యాయస్థానం నిర్ధారించగా కూడ, తమ జీవితంలో అత్యంత విలువైన పద్నాలుగు సంవత్సరాల కాలాన్ని జైలు నిర్బంధంలో గడిపారు. ఈ పోయిన కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?
ఇవాళ దేశంలో అమలవుతున్న, వలసవాదుల నుంచి వారసత్వంగా వచ్చిన న్యాయశాస్త్రంలో రెండు మౌలిక సహజన్యాయ సూత్రాలున్నాయి. ఒకటి, వందమంది అపరాధులు తప్పించుకుపోయినా ఫరవాలేదు గాని, ఒక్క నిరపరాధి కూడ అనవసరంగా శిక్ష అనుభవించగూడదు. రెండు, విచారణలో పాల్గొనరనీ, తప్పించుకుపోతారనీ అనుమానం ఉంటే తప్ప, విచారణ సమయంలో నిందితులు జైలులో ఉండనవసరం లేదు. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్.
ఈ కేసులో ఈ రెండు సహజ న్యాయసూత్రాలూ అమలు కాకపోవడమే అసాధారణ సందర్భం. నిజానికి ఇవాళ దేశంలో ఈ అసాధారణత్వమే అతి సాధారణంగా మారిపోయింది. ప్రస్తుతం లభిస్తున్న తాజా గణాంకాల ప్రకారం 2016 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో నాలుగు లక్షల ముప్పై మూడు వేల మంది ఖైదీలుండగా అందులో 68 శాతం మంది విచారణలో ఉన్న ఖైదీలే. వారికి శిక్ష పడవచ్చు, పడకపోవచ్చు, నిర్దోషిగా విడుదల అయినప్పటికీ, వారు అప్పటికే ఏడాదో, రెండేళ్లో, పదేళ్లో కూడ జైలులో మగ్గిపోయి ఉంటారు.
రాజ్యం కొల్లగొడుతున్న ఈ కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు?
*
Wonderful reflection and very timely Venugopal.
The most attrocious situation is well depicted