చీమలెత్తుకు పోయిన భూమి

చిలకలాంటి ప్రశ్నార్థకం

ముక్కు చివర్న వేలాడే

చుక్క లాంటి గింజ

రైతు గారూ … మరణం చేజార్చిన

మీ పగిలిన భూమి పైన

కోట్ల రూపాయిల కొండ చిగురెత్తింది

చూడగలరా

ఏళ్ళు చూడు ఎరుశనక్కాయల్లాగా

కళ్ళు చూడు కంది కాయల్ నాగా

పెదాలు చూడు పెసరకాయల్ నాగా

కొలసంబరం పొగ మసికట్టిన

కొలకులో వేలాడే నీటిపిట్ట నీడలో

తప్పెటగుళ్ళ బోలుకంపనం

పీకదాకా కప్పెట్టిన యిసక

కదలని తల మీద కాలెత్తిన ఎండ్రకాయ

ఈ మధ్యాహ్నపు సముద్రమ్మీద

నా పెదవి జారిన మౌనం

రైతు గారూ… డబ్బుని కప్పెట్టి

డబ్బుల్ని పండించి మార్కెట్ మీసం

మెలేద్దామనుకుంటే

నేల చిరునామాని వానపామో

ఆరుద్ర పురుగో పారేశాయా

ముడితే ముద్దరగా మారి అంటుకుపోయే

వడ్ల చిలకలా

వడ్లులేని చిలకలా

సత్తెమ్మ తల్లి ముందు గరగలెత్తుకున్న

మడిలోకి కళ్ళు దింపి

మొలుస్తున్న విత్తనం మీద బతుకు

శాసనాన్ని చూస్తున్నా

రైతుగారూ … భూమి ఒక చిన్న నాటి తీపిగుర్తా

చీమలెత్తుకుపోయిన చిత్రలిపి ముగ్గా…..

*

అద్దేపల్లి ప్రభు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు