బత్తుల వెంకటరమణమూర్తి
నివాసం : మధురవాడ, విశాఖపట్నం
చదువు : పొస్టుగ్రాడ్యుయేషన్
వృత్తి : సీనియర్ పాత్రికేయుడు
రచనా వ్యాసంగం :
2016 నుంచి కథలు రాయడం మొదలుపెట్టాను. అదే ఏడాది నవ్య వారపత్రిక నిర్వహించిన కథల పోటీల్లొ నా కథలు రెండు ఎంపికయ్యాయి. ఉత్సాహం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగిస్తున్నాను. ‘గోమాలచ్చిమి’ 2018లో నవ్య వారపత్రికలో అచ్చయిన నా తొలి కథ. మరో ఎనిమిది కథలు వివిధ పోటిల్లో ఎంపికయ్యాయి.
*
కొండవాలుపాలెం గ్రామంలో తెల్లవారేసరికి అలజడి.
నిత్యం బతుకు పోరాటం చేసే గ్రామస్థుల్లో భయం, ఆందోళన, ఆనందం కలగలిసిన సందర్భం.
న్యాయాన్యాయాలు, ధర్మాధర్మ విచక్షణ పై వారికి అవగాహన లేదు. కొందరు చెప్పడం, వారు మౌనంగా వినడం… దశాబ్దాలుగా అలవాటుపడిన బడుగు జనం. పెద్దమనుషులు చెప్పారు, తాము పాటించాలి అని మాత్రమే తెలుసు. తమ ఊరి న్యాయం మూడు కొండలు, నది మధ్యన ఉన్న ఊరిలో నిత్యం సమాధి అయిపోతున్నా నోరు మెదపలేని అసహాయత. తమకు అన్యాయం జరిగినా ఊరి పొలిమారలు దాటిన సందర్భం అరుదు. ఇప్పుడా సందర్భం వచ్చిందనుకుంటున్నారు. టీవీల్లో తమ ఊరి పేరు మారుమోగిపోతుండడం, ఒక్క అన్యాయమైనా బయట ప్రపంచానికి తెలిసిందన్న ఆనందం. అదే సమయంలో భవిష్యత్తు పరిస్థితులు ఎలావుంటాయో అన్న ఆందోళన.
సత్తెమ్మ సెల్ ఫోన్ మోగుతూనే ఉంది. ఎవరెవరో ఏవేవో ప్రశ్నలు వేస్తున్నారు. ఆవిడ కంటి నీటిని కనురెప్పల చాటున దాచుకుని తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతోంది. కాసేపటికి సత్తెమ్మ గొంతు కూడా పలు టీవీ చానళ్లలో వినిపించింది. ఎప్పుడూ ఆ ఊరు, ఈ ఊరు గురించి టీవీల్లో చూడడం, వినడమే. ఇప్పుడు తమ ఊరు గురించి టీవీల్లో వస్తుండడంతో ఊరివాళ్లు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. అందరి దృష్టి వీరేసు పైనే. ఊరిలో జరిగే అన్యాయాన్ని పొలిమేరలు దాటించే ధైర్యం, తెగువ ఉన్నది వీరేసు ఒక్కడికే ఉందన్నది వారి నమ్మకం.
బారెడు పొద్దెక్కేసరికి ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టారు. ఓ ఎస్ఏ, ఇద్దరు కాని స్టేబుళ్లు రెండు మోటారు సైకిళ్ల పై దిగారు.
“ఇదేం ఊరురా బాబు. దారితెన్ను లేదు. ఎలా బతుకుతున్నారురా వీళ్లు”… కాని స్టేబుళ్లవైపు చిరాగ్గా చూస్తూ అన్నాడు ఎస్ఐ ఆనందరావు. కానిస్టేబుళ్లు కూడా కొత్తవారే.
“నిజమే సార్, ఊరుందని తెలుసుగాని, ఇటువంటి చోటుందని మాకూ తెలీదు. అందుకే వీరికి బయట ప్రపంచం గురించి అంతగా తెలిసినట్టు లేదు” అంటూ ఇద్దరూ నవ్వేశారు.
“ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి. ఏదైతేనేం ఇప్పుడు మనల్ని ఊర్లోకి రప్పించారుగా”… కోపం, అసహనంతో అన్నాడు ఎస్ఐ ఆనందరావు. ఈ కేసుకోసం ఇంకెన్నిసార్లు ఆ ఊరికి రావాల్సి ఉంటుందో అన్నది అతని భయం.
ఊరి పెద్ద పులిరాజు ఇంటి అడ్రస్ కనుక్కొని ముగ్గురూ అటువైపు అడుగులువేశారు. కొండవాలు దారిలో మోటారు సైకిళ్ల పై ఆపసోపాలుపడి రావడంతో బాగా అలసిపోయారు. పులిరాజు ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టగానే నిస్సత్తువ ఆవరించింది ముగ్గురినీ. వరండాలో కనిపించిన కుర్చీ పై కూలబడిపోయాడు ఎస్ఐ ఆనందరావు. వరండా మెట్ల పైనే ఇద్దరు కాని స్టేబుళ్లు చతికిలపడ్డారు.
ఓ గంట తర్వాత బిలబిలమంటూ మరికొన్ని కొత్త ముఖాలు ఊర్లోకి అడుగు పెట్టాయి. మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఒక్కొక్కటే వస్తుంటే ఊరివాళ్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరి చేతుల్లో కెమెరాలున్నాయి, మరికొందరి చేతుల్లో మైకులున్నాయి. ఇంకొందరు ఏవేవో రాసుకుంటున్నారు. కెమెరాలున్న వాళ్లు వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. అదంతా కొత్తగా ఉంది గ్రామస్థులకు.
కాసేపటికి తమ ఊరు, ఊరివారు టీవీల్లో కనిపిస్తున్నారు. మధ్యమధ్యలో సత్తెమ్మ, ఆమె భర్త, కూతురు ముఖానికి ముసుగులు కట్టుకుని మాట్లాడడం కనిపించింది. వారికి విషయం అప్పుడప్పుడే అవగాహనకు వస్తోంది. వీరేసు కోసం వారి చూపులు వెతుకుతున్నాయి.
పోలీసులను చూడగానే పులిరాజు గుండె జారిపోయింది. ఏదో ఉపద్రవం వచ్చిపడింది అనుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మీడియావాళ్లు కూడా వచ్చేయడం, టీవీలో తమ ఊరి గురించి, తమ తీర్పుల గురించి హెరెత్తిపోతుండడంతో అతని శరీరం చెమటతో తడిసిపోతోంది. పోలీసులతో మాట్లాడాక విషయం పేపర్లలో కూడా వచ్చిందని పులిరాజుకు అర్థమయ్యింది. అతని అనుమానం వీరేసు పైకి మళ్లింది. పళ్లు పటపటా కొరికాడు. కానీ పోలీసుల ముందు అది బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు.
నవ్వుతూ వరండాలోకి వచ్చి ఎస్ఐని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. వెనకే కాని స్టేబుళ్లు అనుసరించారు.
గదిలోకి అడుగు పెట్టగానే ఫ్యాన్ గాలి రివ్వున ఒంటిని తాకిందేమో ఎస్ఐ, కాని స్టేబుళ్లకు సేదదీరినట్టనిపించింది.
వారు చెప్పింది విన్నాక పులిరాజుకు విషయం నిర్థారణ అయ్యింది.
“గాడిద కొడుకు, ఆ పుల్లిరుపు నాయాల వీరేసుగాడు పెద్ద ఫిటింగే పెట్టాడు. ఆ కోటేసుగాడు, ఆడి కొడుకు ఇరుక్కున్నట్టే. ఇక మనమేటీ సేయలేం” అని మనసులోనే అనుకున్నాడు.
”కోటేసును రమ్మను” అంటూ పులిరాజు తన ట్రాక్టర్ డ్రైవర్ ముత్తేలుకు పురమాయించాడు.
*
“ఏట్రా ఈరేసో… ఊరు ఊరంతా అల్లకల్లోలమైపోతుంటే నువ్వంత ధీమాగా కూర్చున్నావంటే ఎవుడికో మూడిందన్నమాటే. మల్లేటి ఫిటింగ్ పెట్టావురా నాయనా? ఊళ్లోకి ఎవులెవులో బిలబిలమని దిగబడిపోతున్నారు” అరుగుమీద కూర్చుని చుట్టతాగుతున్న వీరేసునుద్దేశించి వెటకా రంగా అన్నాడు జోజి. అతని పేరు జోడెద్దుల జియ్యన్న. అందరూ జోజి అని పిలుస్తుంటారు.
“ఎవుడికో ఏటిరా, మూడేది నీకే. రాత్రినువ్వు పెంటమ్మ ఇంటి దడి దాటావుకదా. అది కాస్త దాని మొగుడికి చెప్పాను, ఆడు పోలీసులను రప్పించినట్టున్నాడు. నీమీద రేప్ కేసు ఖాయం. ఇంక నీకు ఇత్తడే, ఎల్లిరా”… అదే ఎటకారంతో సమాధానమిచ్చాడు వీరేసు.
“ఉలిక్కిపడ్డాడు జోజి. అమ్మ నా కొడుకు…ఈడెప్పుడు చూశాడు. దాని మొగుడికి నిజంగా తెలిసిందా, తెలిస్తే ముందు నా మక్కలిరిసేస్తాడు. కొండపదీసి వీరేసుగాడే ఆడి పేరున పోలీసులకు చెప్పాడా, గాడిదకొడుకు అసలే ఈడి నోట్లో నువ్వుగింజ ఇమడదు. అనవసరంగా కెలికినట్టు న్నాను. ఇప్పుడేటి సెయ్యాలి”…తత్తరపాటు పడిపోతున్నాడు.
“ఏటిరా ఎక సెక్కాలుగుందా, ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. పోలీసులొత్తే నాకేటి బయమా. అయినా రాత్రి నేను మా అత్తోరింట్ల ఉంటే ఊరిల జరిగినాటితో నాకేటి సంబంధం. ఎవుడ్ని సూసి ఎవుడనుకున్నావో, ఒల్లు దగ్గరెట్టుకుని మాటాడురోయ్. ఇష్టమొచ్చినట్టు మాటాడేవంటే మక్కలిరిసేస్తాను” లేని గాంభీర్యం ప్రదర్శిస్తూ వార్నింగ్ ఇచ్చాడు జోజి.
“సరిలే…పోలీసులొచ్చారుకదా. ఎవులు దడి దాటారో, ఎవరి మక్కలు ఇరవాలో కొంచెం సేపు ఆగితే ఆలే తేలుస్తారుగాని, నువ్వెళ్లి రా”…. మరింత ఎటకారంతో అన్నాడు వీరేసు.
“జైలుకెల్లాచ్చినా నీ బుర్ర తిరుగుడు తగ్గలేదంటే నీకు పోయేకాలం దగ్గరపడిందిరా మూర్ఖపు గాడిదకొడకా. ఏపనీ పాటో సేసుకోకుండా ఎవుడెలాగుపోతే నీకేలరా, నువ్వేదో ఊరిని ఉద్దరించీసినట్టు నెలతక్కువ నాయాలా. శనినాకొడకా”…జోజి అక్రోశంతో తిట్ల దండకం అందుకున్నాడు.
“నాకెందుకు పనీపాటా లేదురా ఎదవనాకొడకా. ఊరిల నీలాటి ఆంబోతులు ఎక్కువైపోనాయి. ఒక్కదానికైనా ముక్కుతాడేయకుండా ఊరొదిలి ఎల్తానా సూస్తుండు. అదిగో పెంటమ్మ మొగుడు ఇటే వస్తన్నాడు, నీకు బడితె పూజ ఖాయం” అన్నాడు.
“ఓరినాయనా..నీకు దండం పెడతానురా. నీనోట్లో అనవసరంగా నోరు పెట్టాను. ఇంకెప్పుడైనా నీజోలికొస్తే చెప్పుతీసి కొట్టు. నా మానాన నన్ను వదిలీరా నాయనా. ఊరిలో ఇన్ని అన్నేయాలుండగా నేను చేసే ఈ కక్కుర్తిపనే నీకు పెద్ద నేరంలా కనిపిస్తందా సెప్పు. నీ కాళ్లు పట్టుకుంటాను. ఆడి సెవులీముక్క ఏయకుండా నన్నొదిలీరా నాయనా”… జోజి బతిమిలాడుతున్నాడు.
“వీరేసు జోజి వైపు చిరాగ్గా చూశాడు. ఊరుకో లమ్డీకే. ఇప్పుడు వరకు పెద్ద నీతిమంతుడిలాగా పేలావు. మెత్తగ మాట్లాడుతున్నాని రెచ్చిపోయా వు ఎదవ నాయాలా. అందరూ నీతులు చెప్పే సేవోల్లే. మీ చీకటి బాగోతాలు ఎవుడికి తెలీవురా. నువ్వు పిత్త పరిగివేనిరా, ఊర్లో తిమింగలాలు న్నాయి. వాటిని వదిలీసి నీ జోలికెవుడు వస్తాడు, పోరా నాయాలా’ అంటూ కసురుకున్నాడు.
జోజి బతుకు జీవుడా అంటూ సైకిలెక్కి పారిపోయాడు.
*
ఊర్లోకి పోలీసులు రావడం కొత్త కాదు. గతంలోనూ రెండుమూడుసార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా నేరుగా వీరేసు గుడి సెకే వెళ్లేవాళ్లు. కాసేపు ఏవేవో అడిగి ఆ తర్వాత ఆడిని తీసుకు వెళ్లిపోయేవాళ్లు. ఊరి పెద్దమనుషులు మీసం మెలేసేవాళ్లు. ఇప్పుడు పోలీసులతోపాటు ఊర్లోకి పేపరోళ్లు, టీవీ వాళ్లు రావడంతో గ్రామస్థులు అమితాశ్చర్యంతో చూస్తున్నారు. పైగా వచ్చిన వాళ్లు వీరేసు గుడి సెకు కాకుండా పులిరాజు ఇంటికి వెళ్లడం మరింత ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగిందా అని తమలో తాము తర్కించుకుంటున్నారు. కా సేపటికి సత్తెమ్మ కుటుంబం టీవీ లో కనబడింది. మూడు రోజుల క్రితం రచ్చబండ దగ్గర జరిగిన పంచాయతీ విషయం వాళ్లు చెబుతుంటే ఓ అంచనాకు అప్పుడప్పుడే వస్తు న్నారు. ఆ సందర్భంలో అందరి దృష్టి వీరేసు పైకి మళ్లింది. వారు ఊహించుకుంటున్నది వేరు.
మరోవైపు పులిరాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
ఈ “తొత్తు కొడుకు ఊరిల ప్రశాంతంగా ఉండనీయడం లేదు. సమాంతరపాలన నడపాలనుకుంటున్నట్టున్నాడు. ఎందుకు మిడిసిపడుతున్నాడో, ఏం చూసి రాలిపోతున్నాడో అర్థం కావడం లేదు. రెండుసార్లు జైలుకు వెళ్లినా బుద్ధిరాలేదు గాడిదకొడుక్కి. పుల్లిరుపునాయాలా….. అని మండి పోతున్నాడు. ఊరిల తన పెద్దరికానికి తలనొప్పిలా దాపురించాడని పులిరాజు బాధ.
ఊర్లోకి పోలీసులు రావడం, పులిరాజు రమ్మంటున్నాడంటూ ముత్యాలు కబురుమోసుకు రావడంతోనే కోటేసుకు చెమట్లు పటేశాయి. అప్పటికే కొడుకు బాగోతం, ఊరి పెద్దల నిర్వాకం టీవీలో రావడం చూశాడు. అతని కాళ్లు వణుకుతున్నాయి. వెంటనే కోటేసు అనుమానం వీరేసు పైకి వెళ్లింది. తిట్టిన తిట్టు తిట్టకుండా ఆడిని మనసులోనే తిట్టుకుంటున్నాడు.
“ఊరికి శనిలా దాపరించాడు నాకొడుకు. సదువూసామూ లేకపోయినా పెద్ద తెలివైనోడిలాగే, ఊరిని ఉద్ధరించినోడిలా మిడిసిపడిపోతున్నాడు. ఇలాంటి నా కొడుకులను జైలుకుకాదు, ఏకంగా పైకి పంపిస్తే ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోద్ది” అంటూ దుగదుగలాడిపోతున్నాడు.
నిమిషాల్లో పులిరాజు ఇంట్లో వాలిపోయాడు. ఫ్యాను కింద కూర్చున్నా కోటేసుకు ఉక్కపోతగానే ఉంది. ఎదురుగా కూర్చున్న ఎన్ఐ, ఇద్దరు కాని స్టేబుళ్లు యమదూతల్లా కనిపిస్తున్నారతనికి.
*
రెండొందల గడప పంచాయతీ కొండవాలుపాలెం. వంద గడపలు ప్రధాన గ్రామంలోవి. మిగిలిన నివాసాలు చుట్టూ ఉన్న కొండల్ని ఆనుకుని, కొండ పైన ఉన్నా నాలుగైదు శివారు గ్రామాల్లోవి. పంచాయతీ సర్పంచ్ ఉన్నా లేకపోయినా గ్రామంలో పెద్దరికం అంతా పులిరాజుదే. అతని కుటుంబ సభ్యులో, అతని అనుచరులో సర్పంచ్ గా ఉంటారు అంతే.
బాహ్యప్రపంచంతో సంబంధం లేని పల్లెటూరు అది. మూడు వైపులా దోనెలా ఉన్న కొండలు, మరో వైపు నిత్యంపారే జీవనది. ఆ మధ్యలో పచ్చని పంటపొలాల మధ్య ఊరు. ఆధునిక సదుపాయాలన్నీ చాలావరకు అందుబాటులో ఉన్నా ఊరుదాటి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్ప వారికి మరో గత్యంతరం లేదు. కొండవాలు మీదుగా ఓ కచ్చారోడ్డు ఉన్నా ఆరోడ్డులో ప్రయాణం ఓ సాహసం. అష్టకష్టాలుపడి ఆ రోడ్డు దాటి మరో ఐదారు కిలోమీటర్లు వెళితే నది పై వంతెనను కలిపే రోడ్డెక్కుతారు. అందుకే అత్యవసరమైతే తప్ప గ్రామస్థులు ఆ దారిలో వెళ్లేందు కు ఇష్టపడరు. ఎన్నికల సందర్భంలోను, అధికారులు ఎవరైనా వచ్చినప్పుడు, పోలీసులు మాత్రమే ఆ దారి వినియోగిస్తుంటారు. ఊరివాళ్లు మాత్రం నదిలో ప్రవాహం ప్రమాదకరం కాదనిపించేంత వరకు పడవలోనే నది దాటి అవతలి గట్టుకు చేరుకుంటారు. తమ దైనందిన వ్యాపకా లు పూర్తి చేసుకుంటారు. ఊరిలో ఐదో తరగతి వరకే చదువు. ఆ తర్వాత చదవాలంటే వేరే ఊర్లో హాస్టల్ లో ఉండి చదువుకోవాల్సిందే. ఈ కార ణంగా గ్రామంలో చదువరులు కూడా అంతంతమాత్రమే. గ్రామంలో జరిగే మంచైనా, చెడైనా బాహ్య ప్రపంచానికి తెలియదు. తెలిసే అవకాశం ఇవ్వరు అక్కడి పెద్దమనుషులు. అందుకు రెండు కారణాలు. ఒకటి తమ పెద్దరికం. రెండు తమ చీకటి వ్యాపారాలు.
అందరూ సామాన్యులే. వారిలో తాము అసామాన్యులమన్న ధీమా, ధైర్యం కొందరిని అలా నడిపిస్తోంది అంతే.
గ్రామంలో ఆరుగురే మోతుబరులు. అందులో పులిరాజు ఒకడు. మిగిలినవారు కోటేసు, సుందర్రాజు, చిత్తరంజన్, నరసింహనాయుడు,సుందరం. మరికొందరు సన్నకారు రైతులు, మిగిలిన వాళ్లు కూలీలు. ఎక్కువ మంది ఒకే కులపోలైనా డబ్బే అక్కడ తారతమ్యాలకు ప్రాతిపదిక. గంజాయి సాగు, కలప, కొండల పై సేకరించే అటవీ ఉత్పత్తుల అక్రమ వ్యాపారం పులిరాజు, ఆయన అనుచరుల వ్యాపకం. నదికి దిగువన ఓ ఐదారు కిలోమీటర్ల దూరాన విస్తారమైన అటవీ ప్రాంతం వీరి వ్యాపారానికి కలిసి వచ్చే ప్రాంతం. రాత్రిపూట గంజాయి, కలప, ఇతర వస్తువులు పడవల్లో నది దాటించి అటవీ ప్రాంతంలోని స్మగర్లకు చేరుస్తారు. తమకు ముట్టాల్సింది తీసుకుని వచ్చేస్తారు. ఆ తర్వాత వాటి బాధ్యత వారిదే. చేతికి మట్టి అంటకుండా వచ్చిపడుతున్న డబ్బు కావడంతో ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియకూడదంటే ఊరి పరిస్థితి ఇలాగే ఉండాల న్నది వారి ఉద్దేశం. అందుకే కొండవాలు రోడ్డు శాశ్వత నిర్మాణ ప్రతిపాదన ఎన్నోసార్లు వచ్చినా అది ముందుకు వెళ్లకుండా తెలివిగా అడ్డుకుంటున్నది కూడా వీరే.
ఊరి పెద్దలన్నా, వారి పెద్దరికం అన్నా వీరేసుకు అసహ్యం. ఈ రోజుల్లో కూడా ఈల పెద్దరికం, రచ్చబండ తీర్పులేటని అతని కోపం.
” పేరుకే వీరు పెద్దమనుషులు. ఒక్కడికీ న్యాయం, ధర్మం అంటే ఏమిటో తెలీదు. కనీసం అవగాహన కూడా లేదు. మానం, మర్యాద, గౌరవ ప్రతిష్టలకు రేటుకట్టే ఏజెంట్లు. డబ్బుంటే ఎంతటి తప్పయినా ఒప్పు చేయడమే వారి దృష్టిలో న్యాయం. ఒక్కడికీ అక్షర జ్ఞానం లేదు. ప్రస్తుత సమాజం ఎటువైపు అడుగులు వేస్తోందన్న పట్టింపు లేదు. నూతిలో కప్పలు. ఇంకా పాతకాలపు విధానాలు, అటవిక న్యాయమే ధర్మబద్ధం అని నమ్మేవారు. అదే తమ పెద్దరికానికి శ్రీరామరక్షన్న భావన. అన్యాయానికి శిక్ష వేయాల్సిందిపోయి డబ్బుతో దానికి ఖరీదుకట్టే దళారీ పనే వారి వ్యాపకం. కేవలం ఊరికట్టుబాటు అనే ముసుగులో ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్నామన్న ధైర్యం. ఏం జరిగినా ఎవరూ కనరూ, వినరూ అన్న నమ్మకంతో సాగిస్తున్న అటవిక పాలన” ఇది ఊరి పెద్దమనుషులపై వీరేసు అభిప్రాయం.
“మారుమూల గ్రామం కావడంతో వీళ్ల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. న్యాయం గొంతును ఊరిలోనే నొక్కేసి తమ గొంతే న్యాయమైనద ని లోకానికి చాటి చెప్పాలని చూస్తున్నారు” అని వీరేసు ఆగ్రహం. వీరేసుతో గొంతుకలిపే ధైర్యం, చొరవ గ్రామస్థుల్లో మరెవరికీ లేకపోవడంతో అతనిది ఒంటరి పోరాటం .
కులం, కట్టుబాటు, ఊరి విధాయకాన్ని దాటలేని అసహాయత అక్కడి జనం కాళ్లకు బంధనం.
ఊరి పెద్దల ఎదురుగా ధైర్యంగా మాట్లాడేది వీరేసు ఒక్కడే. తాము పంచాయతీ పెడితే ఊరంతా రచ్చబండ వద్దకు వచ్చి తీరాల్సిందే అనుకునే ఊరి పెద్దలు వీరేసు మాత్రం అక్కడికి రాకూడదని కోరుకుంటారు. వాడంటే భయం కాదు. తలనొప్పని. వీరేసుది ధిక్కార స్వభావం. ఊరి పెద్దలంటే అతనికి ఏ మాత్రం గౌరవం లేదు. వారు చేస్తున్నది అన్యాయమని నిలదీసిన సందర్భాలు ఎన్నో. అటువంటి సందర్భాల్లో పలుమార్లు తిట్లు, దెబ్బలు తిన్నాడు. ఊరి పెద్దమనుషులు కొన్నాళ్లు వీరేసును రచ్చబండకు రానీయకుండా అడ్డుకున్నారు. కక్షకట్టి రెండు సార్లు జైలుకు కూడా పంపారు. ఓసారి గంజాయి కేసులో ఇరికిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడింది. మరోసారి ఎర్రదుంగల కేసులో ఇరికిస్తే రెండేళ్ల జైలు శిక్ష పడింది. అయినా వీరేసు తన తీరు మార్చుకోలేదు. నిలదీయడం మానలేదు. వాడి తలబిరుసు అంతేలే. వాడేదో అరుస్తాడు, దాన్ని పట్టించుకో నవసరం లేదని వదిలేశారు. నెలరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన వీరేసు పది రోజుల క్రితమే ఊర్లోకి అడుగు పెట్టాడు.
*
రచ్చబండపై పులిరాజుతోపాటు మరో ఇద్దరు పెద్దమనుషులు కూర్చున్నారు.
తరాలతోపాటు రచ్చబండ పై పెద్దలు మారుతున్నారు. బాధితులు మారుతున్నారు. కానీ తీర్పులో మార్పులేదు. మారదు కూడా అని తెలిసిన వా ళ్లు చాలా కొద్దిమంది మాత్రమే. అందులో వీరేసు ఒకడు.
“ముప్పై ఏళ్ల క్రితం ఇటువంటి అన్యాయమైన తీర్పుకు సాక్ష్యం అతనూ, అతని సోదరి. పెళ్లి పేరుతో తల్లిని లొంగదీసుకున్న ఓ పెద్ద మనిషి ఆమె గర్భవతి అయ్యాక రచ్చబండ వద్ద డబ్బు చెల్లించి తాను చేసిన తప్పును ఒప్పు చేసుకున్నాడు. కానీ వాడి పాపభారాన్ని తన తల్లి మోయాల్సి వచ్చింది. మాతృ ప్రేమను చంపుకోలేని తల్లి దయవల్ల తామీ భూమిమీద ఒకేసారి పడ్డారు. ఈలోకాన్ని చూడగలిగారు” అని వీరేసు కు తెలుసు. ఇప్పుడు తల్లి లేకపోయినా వీరేసుకు మిగిలింది తనకంటే ఓ ఘడియ ముందు పుట్టిన అక్క మాత్రమే. పుట్టుకతోనే అనాథలైన తమను పెద్దమ్మే ఆదరించింది. అక్కకు వయసురాక ముందే ఊరుదాటించి ఓ పనిలో కుదిర్చింది. అక్కడ ఉండగానే పెళ్లి చేశాక పెద్దమ్మ కన్నుమూసింది. ఓ మంచి మనిషి ఆలనలో అక్క జీవితం సాఫీగా సాగిపోతుండడం వీరేసు జీవితంలో ఏకైక ఆనందం. ఊరి సంగతి, వీరేసు తత్వం తెలిసిన అతని అక్క సీతాలు తన వద్దకు వచ్చి పూర్తిగా ఉండిపోవాలని చెప్పినా ఊరి పై మమకారం వదులుకోలేనంటాడు వీరేసు. కానీ ఆ పెద్దమనుషులు ఎప్పుడు ఏం చేస్తారో, ఊరి పెద్దల దాష్టీకానికి తమ్ముడు బలయిపోతాడేమోనని ఆమె భయం, ఆందోళన.
రచ్చబండ వద్దకు ఊరి జనం పోగయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో, పెద్దమనుషులు ఏం చెబుతారో అక్కడందరికీ తెలుసు. అందుకే పెద్దగా ఆసక్తి లేకున్నా పెద్దమనుషుల దృష్టిలో పడకూడదని వస్తారు. వచ్చామా, విన్నామా, వెళ్లిపోయామా అన్న విధానానికి దశాబ్దాల నుంచి అటవాటు పడిపోయారు.
రచ్చబండ వద్ద వాతావరణం గంభీరంగా ఉంది. చాలా సేపటి నుంచి నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.
“నీ ఉద్దేశం ఏటి సత్తెలు. తప్పెలుగూ జరిగిపోయింది. దాన్ని ఎలాగూ సరిద్దుకోలేం. తర్వాత ఏం చేయాలా? అని ఆలోచించడమే పిల్ల తల్లిదం డ్రులుగా మీకు, ఊరి పెద్దమనుషులుగా మాకు మిగిలిన బాధ్యత. ఏటంటావు”….ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ పులిరాజు గొంతు ప్రతిధ్వనించింది.
“సత్తేలు కంటికొలనులో నీరు పోటెత్తుతోంది. అది బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ నోటికి చెంగును అడ్డు పెట్టుకుని కూతురిని గట్టిగా వాటేసుకుంది. తామేం చెప్పినా అక్కడ చెల్లుబాటు కాదని ఆమెకు తెలుసు. అక్కడ న్యాయం పులిరాజు ఇంట్లోనే నిర్ణయమైపోతుంది. అది ఆమెకు అనుభవమే. అక్కడ ప్రశ్నలు, సమాధానాలన్నీ కేవలం ఊరివాళ్లను ఒప్పించడం కోసమే. బాధితులకు న్యాయం చేసేందుకు కాదు.
“నీ ఇష్టం పులిరాజు. నువ్వెలాగ చెబితే అలాగే”…అంది రెప్పలు దాటి బయటకు వస్తున్న కంటినీటిని పైటచెంగుతో తుడుచుకుంటూ.
“ఇక్కడ ఇష్టాయిష్టాలతో పనిలేదు సత్తెమ్మా. న్యాయం చెప్పడం మా ధర్మం. అన్యాయం జరిగిన ఆడ కూతురికి న్యాయం చేయలేనప్పుడు మేమెందుకు, ఊరెందుకు. మా పెద్దరికాలెందుకు. ఊరి పెద్ద మనుషులుగా మీ అందరి బాధ్యత మాది. మా మాటకు విలువిస్తే సమ్మతమైన ఒక పరిష్కారం చెబుతాను. మాకు ఊరితో పనిలేదు, పోలీస్ స్టేషన్ కే వెళ్తామనుకుంటే మీ ఇష్టం. మేము జోక్యం చేసుకున్న తర్వాత మాట తప్పితే మన రచ్చబండకే అవమానం”… అంటూ పులిరాజు గంభీరంగా పెద్ద పెద్ద మాటలు అన్నాడు.
సత్తేలుకు తెలుసు పులిరాజు మాటల్లోని గూడార్థం. రచ్చబండ జరిగేటప్పుడు ప్రతిసారీ అతను చెప్పేమాటే అది. మమ్మల్ని కాదని పోలీస్ స్టేషన్ కి వెళ్లినా మీకు ఒరిగేది ఏమీ ఉండదన్న పరోక్ష హెచ్చరిక అది.
“అయ్యో…ఆ పోలీసులు, టేసన్లూ మాకేటి తెలుసు పులిరాజూ. నువ్వెలాగ సెబితే అలాగే కదా ఇన్నాళ్లు నడుస్తోంది. ఇప్పుడు కొత్తేటి” సత్తెమ్మ బాధను దిగమింగుకుంటూ, కోపం, అకోశ్రం బయటకు కనిపించకుండా అంది.
“అదీ… పెద్దరికం అంటే అలా ఉండాలి. ఊరు, కట్టుబాటు కాదని మనం ఎక్కడికెళ్తే ఏం బావుకుంటాం. ఊరిని నమ్ముకోకుంటే ఒంటరిగా మిగిలిపోవడం తప్ప సాధించేదేముంటుంది. ఊరిని నమ్ముకుంటే మంచైనా, చెడ్డయినా పదిమంది తోడూ, నీడా మనకు ఉంటాది” అన్నాడు పులి రాజు. అతనికి సత్తెలు చెప్పినమాట చాలా నచ్చింది. ఆమెవైపు అభినందనీయంగా చూశాడు.
ఆ సందర్భంలోనే వీరేసు అక్కడికి వచ్చాడు. వీరేసును చూస్తూ జనం గుసగుసలాడుకుంటున్నారు. రచ్చబండ పై ఉన్న పులిరాజుతోపాటు మిగిలిన పెద్దమనుషులు గుర్రుగా అతని వైపు చూస్తున్నారు. కోటేసు వీరేసు వైపు అసహనంగా చూశాడు.
“అసలే పుల్లిరుపునాయాల. ఏం ఫిటింగ్లు పెడతాడో” అని అతని టెన్షన్. రచ్చబండ వద్ద వీరేసు నిలదీస్తే పెద్ద మనుషులకు నచ్చదు. కానీ వాడి మాటలో న్యాయం ఉంటుందని ఊరి జనం నమ్మకం.
*
కోటేసు కొడుకు సోకుల్రాజు. ఆడి అసలు పేరు సోమేసు. కోక కనబడితే తోకూపుతూ తిరిగే చిత్తకార్చి నాయాల. వావివరస, వయసు తారతమ్యాలు పాటించకుండా మాయమాటలతో ఆడదాన్ని లొంగదీసుకుని అనుభవించడం వాడికి వ్యసనం. నోరు మెదపక పోతే అక్కడే డబ్బిస్తాడు, నోరు తెరిస్తే పంచాయతీలో రేటుకట్టించి తప్పించుకుంటాడు. కోటేసు కూడా అదో గొప్పలా ఫీలవుతాడు. ఒక్కడే కొడుకు కావడంతో గారాబం ఒక కారణమైతే వయసులో ఉన్నప్పుడు ఇంతకంటే తాను ఎక్కువే చేసిన విషయం గుర్తుకువచ్చి కాదనలేని మనస్థత్వం. అన్నింటికంటే తన చీకటి వ్యాపారాల సారధి కావడం. సోమేసులాంటి వారు ఊరిలో మరో పది మంది వరకూ ఉన్నా డబ్బు, పలుకుబడి విషయంలో సోమేసుదే పైచేయి. వీడికి వారు అనుచరులైతే, అందరూ కలిసి చేసే పాపాలకు వీడు నాయకుడు.
సత్తెలు కూతురు సుజాతను మాయచేసి కడుపు చేసేసాడు సోమేసు. కూతురికి మూడు నెలల కడుపని తెలిసాక సత్తేలుకు నోటమాట రాలేదు. నిలదీస్తే సోమేసు పేరు చెప్పింది.
“ఆడంత ఎదవని తెలిసి కూడా ఆడిని ఎలా నమ్మావే? అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
నువ్వు నాకు మేనత్త కూతురు వరసవుతావని నమ్మించాడని, పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడని కూతురు చెబుతుంటే సత్తేలుకు నోట మాటరాలేదు.
“ఎదవ లంజాకొడుకు, ఆడికి నేను మేనత్తనేటే. ఆల నాయనకు ముందు పుట్టానా, వెనక పుట్టానా. నేను వయసులున్నప్పుడు ఆడి నాయన నన్ను ఆవురావురుమని సూసేవోడు. అప్పుడు ఆడికి పెళ్లాం వరస, ఇప్పుడు ఆడికొడుక్కి మేనత్త వరసయ్యానా” అంటూ తిట్ల దండకం అందు కుంది సత్తెలు.
“తండ్రీకొడుకులు అచ్చోసిన అంబోతులే. ఆలకు వావివరసలు, పాపపుణ్యాలు తెలీవే. ఆలంత ఎదవలు కాబట్టే ఆల ముకం సూడాలన్నా నాకు అసేయం. ఏనాడైనా ఆల గడప తొక్కడం సూసావా. అలాటోడు మాయమాటలు సెబితే ఎలాగ నమ్మేవే దిక్కుమాలిన దానా” అంటూ సత్తెలు కన్నీటి పర్యంత మయ్యింది.
“ గొర్రె కసాయిని నమ్ముతుంది’ అని అందుకే అనుకున్నారనుకుంది. కూతురి బతుకు బుగ్గిపాలయిపోయిందని కన్నీటి పర్యంతమయ్యింది. పెద్దమనుషుల దగ్గర తగువు పెట్టినా తన కూతురు మానానికి విలువ కడతారు తప్ప న్యాయం జరగదని ఆమెకు తెలుసు. కానీ కనీసం తనకు జరిగిన అన్యాయం లోకానికైనా తెలుస్తే ఏ దేవుడో అడ్డుపడి న్యాయం చేస్తాడన్నది ఆమె ఆశ. అందుకే సత్తేలు తగువు పెట్టించింది. ఇప్పుడు జరుగుతున్న రచ్చబండ దానికోసమే.
పెద్దల పిలుపుతో రచ్చబండకు వచ్చిన కోటేసు పెద్దమనిషిలా ఫోజు కొడుతున్నాడు. పక్కనే నిల్చున్న ఆడి కొడుకులో కూడా ఏ మాత్రం పశ్చా తాపం లేదు. తన కొడుకు చేసింది తప్పేనని, సుజాతకు న్యాయం జరగాల్సిందేనని, పంచాయతీ పెద్దలు ఏది చెబితే అదిపాటించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ముందే ధర్మోపదేశం ఇచ్చేశాడు కోటేసు. ఓ ఆడపిల్ల జీవితం కొడుకు నాశనం చేశాడన్న ఆవేదన కించిత్తు కూడా కోటేసులో కనిపించలేదు. పైగా బడుగు జనం పిల్లల్ని అలా వాడుకోవడం తమలాంటి మోతుబరులు జన్మహక్కన్నట్టు కుర్చీమీద కాళ్లాడించు కుంటూ కూర్చున్నాడు.
వీరేసు కుతకుతలాడిపోతున్నాడు. కోటేసువి పెదాల పై నుంచి వచ్చిన మాటలు తప్ప ముందే పెద్దలతో ఏం చెప్పాలో మమ అనిపించుకునే ఇక్కడకు వచ్చాడని, అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడని తెలుసు.
ఉగ్రనరసింహుని అవతారం ఎత్తి అక్కడికక్కడ కోటేసు, సోమేసుల పేగులు తీసి మెడలో వేసుకోవాలన్న కోపంతో రగిపోతున్నాడు. కానీ ఊరి జనం వారికి భయపడినన్నాళ్లు తన ఒక్కడివల్లా అది సాధ్యం కాదని తెలుసు. జనం అమాయకత్వం, భయం, బాధితులకు తప్ప తమకు జరిగిన నష్టం ఏముందిలే అన్న స్వార్థం కోటేసులాంటి వారి ఆటలు సాగడానికి కారణమని వీరేసు భావన.
“ఇప్పటి వరకు ఆ సోమేసుగాడు ఎంతోమంది ఆడవాళ్ల ఉసురుపోసుకున్నాడు. ఏం చేసినా మా నాయనున్నాడులే అని వాడి దైర్యం. కానీ ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటే ఎంతమందికి డబ్బిచ్చి మానానికి విలువ కడతారు” అదీ వీరేసు కోపం.
“తొలిసారి తప్పుచేస్తేనే ఇలాంటి విషయాల్లో క్షమించకూడదు, అలాంటిది పదేపదే తప్పుచేస్తున్నా ఏమీ జరగనప్పుడు వాడికి భయంఎందుకుం టుంది. మరో ఆడదానివైపు కన్నెత్తి కూడా చూడకూడదన్న ఆలోచన ఎలావస్తుంది. ఊరి పెద్దల అండగా, రచ్చబండ తీర్పువల్లే వాడు బరితెగి స్తున్నాడు” … వీరేసు కోపంతో రగిలిపోతున్నాడు.
కోటేసును, సోమేసును మార్చిమార్చి చూస్తున్నాడు. సోమేసుకు ఏమీ కాకపోవడం చూసి ఊరిలో చాలామంది కుర్రనాయాళ్లు కూడా అలాగే తయారవుతున్నారని వీరేసు బాధపడుతున్నాడు. కాస్త పలుకుబడి ఉన్న కుటుంబాల్లో వారు కూడా అమ్మాయిలను వలవేసి వాడుకోవడం, బయటపడితే తప్పుకట్టే వచ్చునని తెగింపు గమనించాడు. ఈ జాడ్యానికి అడ్డుపడాలి అనుకున్నాడు. అంతలో పులిరాజు నోరు విప్పడంతో ఏం చెబుతాడా అని వీరేసు ఆసక్తిగా వింటున్నాడు.
“సత్తేలు తన కూతురికి న్యాయం చేయాలని ఈ పంచాయతీ పెట్టించింది. ఊరి మంచీ చెడ్డా చూసే మాపై సతేలుకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో కుర్రతనంతో సోమేసులాంటి వాడు ఏదో తప్పుచేశాడని కోటేసులాంటి పెద్దమనిషి పరువు బజారు కీడ్చడం కూడా ధర్మం కాదని మా ఉద్దేశం. అందువల్లే పోలీస్ స్టేషన్లు, ఫిర్యాదులు వద్దని మీ అందరినీ వేడుకుంటున్నాను. మీరేమంటారు”…పులిరాజు ఏకంబిగిన ఉపన్యాసం ఇచ్చి అక్కడి వారేమంటారన్నట్టు వారివైపు చూస్తున్నాడు.
అక్కడి వారెవరూ నోరు మెదపరని పులిరాజుకు తెలుసు. అడగాలని అడిగాడంతే.
అతను అనుకున్నట్టే ఎవరూ నోరు విప్పక పోవడంతో మళ్లీ పులిరాజే మొదలు పెట్టాడు.
“జరిగిన తప్పు ఎలాగూ జరిగిపోయింది. దాన్ని సరిదిద్దుకోలేం. కాబట్టి సోమేసు చేసిన తప్పుకు పరిహారంగా సత్తేలు కుటుంబానికి ఓ లక్ష రూపాయలు ఇవ్వాలని ఆదేశిస్తున్నాను. అలాగే, సత్తెలు కూతురికి జరిగిన అన్యాయం రూపుమాపేందుకు అయ్యే ఆస్పత్రి ఖర్చు కూడా సోమేసే భరించాలని చెబుతున్నాను. పంచాయతీకి అభివృద్ధి నిధులు కింద మరో పాతికవేలు జమకట్టి, రచ్చబండకు పదివేలు ఇచ్చుకోవాలని సూచిస్తున్నాను. ఇంతకంటే నేయమైన తీర్పు నావల్ల కాదని, మీ అందరికీ సమ్మతమేనని భావిస్తున్నాను” అంటూ ఏకబిగిన చెప్పేసి తన సీట్లో కూర్చుండిపోయాడు పులిరాజు. అతని మన సెందుకో కీడును శంకిస్తోంది. కారణం అక్కడ వీరేసు ఉండడం.
పులిరాజు తీర్పు వినగానే కోటేసు ఉలిక్కిపడ్డాడు. కుతకుతలాడిపోతున్నాడు.
“గాడిద కొడుకు ఆవేశంలో చెప్పీసునట్టున్నాడు. లేకపోతే అంత మొత్తం ఇచ్చీమంటాడేటీ. ఎప్పుడూ పాతికేలు దాటకుండా చూసేవాడు, ఇప్పు డేటీ ఏకంగా లచ్చంటున్నాడు. అన్నీ కలిపి ఓ యాభైవేలు దాటవనుకుంటే లచ్చన్నర పైనే అయ్యేట్టు ఉంది” అని తిట్టుకుంటూ పులిరాజు వైపు గుర్రుగా చూశాడు.
కానీ ఆ సమయంలో కోటేసును పట్టించుకోకూడదని పులిరాజు నిర్ణయించుకున్నాడు. వీరేసును చూసీచూడనట్టు వాడినే గమనిస్తున్నాడు. సత్తేలు కుటుంబానికి పెద్దమొత్తం ఇప్పిస్తున్నాను కాబట్టి వీరేసు ఈసారికి మరి మాట్లాడడని పులిరాజు ఉద్దేశం.
వీరేసు నెమ్మదిగా లేచాడు. గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. రచ్చబండ వద్ద ఉన్న వారంతా వాడివైపు ఆసక్తి చూస్తున్నారు. వీరేసు న్యాయమైన మాట ఏదైనా చెపుతాడని వారి నమ్మకం, కానీ ఊరి పెద్దల ముందు భయంతో నోరు మెదపరు. వీరేసు ఏం చెబుతాడా అని అతనివైపు మిటకరించి చూస్తున్నారు.
“పెద్దయ్యా, నువ్వు చెప్పినట్టు ఎలాగూ తప్పు జరిగిపోయింది. శారీరకంగా ఒక్కటైపోయాక మొగుడు పెళ్లాలు అవ్వడానికి అడ్డుగోడ ఇంకా ఏటుంటాది. సత్తెలు కూతురు ఎలాగూ సోమేసుకు వరసవుద్ది. కులగోత్రాల సమస్యా నేదు. దూరపు చుట్టాలు కాబట్టి సోమేసుకి, సుజాతకు పెళ్లి చేసేయండి. ఓ ఆడపిల్లకు నేయం సేసినోలవుతారు. వాడు అచ్చోసిన ఆంబోతులా ఊరిమీద పడి ఇంకా ఎన్నాళ్లు, ఎందరి జీవితాలు నాశనం సేస్తుంటే మీరు తప్పుకట్టి వాడిని వెనకేసుకు వస్తారు. ఈ పెళ్లితోనైనా ఆ సోమేసుగాడి కాళ్లకు బంధం వేసినట్టుంటాది, ఓ ఆడపిల్ల జీవితం బాగుపడినట్టూ ఉంటాది’ అని గట్టిగా చెప్పాడు.
వీరేసు మాటలు వినగానే అక్కడున్న వారంతా అప్రయత్నంగానే చప్పట్లు కొట్టేశారు. సత్తెలు దంపతులు ముఖం వికసించింది. అదే జరిగితే బాగుండును అని వారు కూడా అనుకున్నారు. సుజాత మనసు ఆనందతాండవం చేస్తోంది. కానీ పెద్దమనుషులు దాన్ని జరగనివ్వరని, కోటేసు అందుకు ఒప్పుకోడని వారికి తెలుసు. అందుకే పెద్దమనుషుల స్పందన ఎలా ఉంటాదా అని ఆసక్తిగా చూస్తున్నారు.
వీరేసు మాటలు వినగానే రచ్చబండలో కూర్చున్న కోటేసే కాదు, ఊరి పెద్దలు ఉలిక్కిపడ్డారు.
“ఏటిరా పుల్లిరుపు మాటలు. ఇక్కడ పెద్దలు మాట్లాడుతుంటే నువ్వేటిరా తీర్పులిస్తాన్నావు గాలి నాకొడకా” కోటేసు ఉక్రోషంతో కుర్చీలోంచి లేచాడు. వీరేసు మాటలకంటే ఊరిజనం చప్పట్లు కొట్టి వాడిని అభినందించడం కోటేసుకు మరింత మంటగా ఉంది.
“నువ్వేకదా ఆడకూతురికి అన్నేయం జరిగింది, నేయం చేయాల్సిందే అన్నావు. మానం పోయిన ఆడదానికి నేయం సేయాలంటే పెళ్లి కంటే ఏటుంటాది…ఈరేసు తలపొగరుగానే జవాబిచ్చాడు. అక్కడ ఉన్నవారిలో చాలామంది వీరేసు అభిప్రాయంతో ఏకీభవించేవారే. కానీ ఆ మాట చెప్పలేరు అంతే.
“ఏదో కుర్రతనం….తప్పుచేశాడు. అంతమాత్రాన పెళ్లి చేసేయ్యాలా. ఆల స్థాయేటి, మా స్థాయేటి, బుర్రుండే మాట్లాడతన్నావా” కోటేసు ఆగ్రహం తో వీరేసు పై ఎగిరిపోయాడు.
“ఏదో తప్పుచేశాడా. ఏం సుజాత పక్కన పడుకున్నప్పుడు నీ కొడుక్కి స్థాయి తెలీలేదా. ఇలాంటి పాడుపనులు ఆడు చేయడం ఇది ఎన్నోసారి. నీకొడుకు ఎవరింట్లోనైనా దూరిపోవడం, ప్రతిసారీ పంచాయతీ పెట్టడం, అన్నేయం జరిగిన కుటుంబానికి పదేలో, పాతికేలో ముట్టజెప్పేయడం, పంచాయతీకి ఐదువేలో, పదివేలో తప్పుకట్టేయడం, ఆ రాత్రికి పెద్దలందరికీ ఖుషీ చేసేయడం మీ తండ్రీ కొడుకులకు అలవాటేగా. మారు మూల బతుకుతున్నాం కాబట్టి సెల్లిపోతంది. లేదంటే…’…వీరేసు కోపంగా అన్నాడు.
“ఊరన్నాక విధాయకం ఉంటాది. మద్దెలో సెప్పడానికి నువ్వెవుడివిరా” కోటేసు వీరేసువైపు చూస్తూ పళ్లు పటపటా నూరుతున్నాడు.
“ఇది విధాయకమా. అటవిక న్యాయం. నీ కొడుకును చూసి ఊరిలో మరికొందరు కుర్రనాయాళ్లకు కూడా బయ్యం నేకుండా పోయింది. ప్రతీవోడూ గోకీ సేవోడే. ఆడపిల్లను ఏదైనా అంటే చెమడాలు ఊడుతాయన్న బయ్యం ఎవుడికైనా ఉందా. పెద్దింటోలిని పేదింటోలు అనుసరిస్తున్నారు. భయం, పాపభీతి ఉన్నవాళ్లయితే ఆడపిల్లకు న్యాయం జరుగుతోంది. అన్యాయమైపోయినోల్లు అన్యాయమైపోతున్నారు. ఇదెక్కడి విధాయకం”… మండిపడ్డాడు వీరేసు.
“ఎక్కువ మాట్లాడావంటే రచ్చబండ దగ్గర నుంచి మెడపట్టి గెంటీంచీగలను. జాగ్రత్త”… కోటేసు ఆగ్రహెూదగ్రుడై పోయాడు.
“ఎందుకు మెడపట్టి గెంటించేస్తావు. నేనూ ఈ ఊరోడినే. నాకూ మాట్లాడే హక్కుంది. ధర్మం, నేయం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. పెళ్లి అనేసరికి ఉలిక్కిపడుతున్నావు. ఎన్నాళ్లిలా నాటకాలాడుతారు. అవునే…. నీవీ అవే బుద్ధులు కదా. నువ్వు మాత్రం తక్కువ మందికి అన్నేయం సేసావా. నీకు పుట్టినోడు ఆడికి అంతకంటే మంచి బుద్దిస్తుందా… వీరేసు వ్యంగ్యంగా అన్నాడు.
కోటేసు తలతీ సేసినట్టు ఫీలయ్యాడు. పులిరాజువైపు అదోలా చూశాడు.
“ఏటండీ పులిరాజుగారూ, మీరు పెద్దమనుషులా. ఆడు పెద్దమనిషా. గౌరవం, మర్యాదల్లేకుండా మాట్లాడుతుంటే నోరు విప్పరేం”…వీరేసు మాటలతో ఉడికిపోయిన కోటేసు నిష్టూరంగా అన్నాడు.
“ఆలైనా ఏటి మాట్లాడుతారు. నువ్విచ్చే డబ్బు చూసి, రాత్రికి నువ్వు పోయించే మందుకోసం కలలు గంటున్నారు. నువ్వు సెప్పిందే మాట్లాడుతారు. అయినా ఓ ఆడపిల్ల మానానికి ఖరీదు కట్టి వచ్చిన డబ్బుతో ఖుషీ చేసుకుంటున్నారంటే మీరసలు మనుషులేనా అనిపిస్తోంది. మీకంటే రక్తమాంసాలు తినే అడవిలోని జంతువులు మేలు” అంటూ కోపంలో పెద్దమాటలే అనేశాడు వీరేసు.
“పులిరాజుకీ ఒళ్లు మండిపోయింది. ఏదో తెలిసీ తెలియక ఆడు అలాగే వాగుతుంటాడులే అని ఊరుకుంటూ ఉంటే మరీ పెట్రేగిపోతున్నాడు” అని అనుకున్నాడు. తన మనుషులు వైపు చూసి కన్ను గీటాడు.
ఆళ్లు వీరేసు ఈడ్చుకుంటూ ఊరవతలకు తీసుకువెళ్లిపోయాడు. ఎప్పటిలాగే పంచాయతీ పెద్దలు తప్పుకట్టేశారు. సత్తేలుకు లచ్చ రూపాయలు ఇవ్వడానికి, ఆస్పత్రి ఖర్చులు భరించడానికి కోటేసు ఒప్పుకున్నాడు. పంచాయతీకి, ఊరి పెద్దలకు చెప్పినంత చెల్లించుకుంటానన్నాడు. అప్పటి పరిస్థితి చూసి వేగంగా ఆ తగువు ముగిసిపోవాలని అతను కోరుకుంటున్నాడు. అతనుకున్నట్టే వివాదం సమసిపోయింది.
*
పులిరాజు మనుషులు వీరేసును ఊరవతల ఏటి ఒడ్డుకు తీసుకువెళ్లి అక్కడ చితకబాదారు. మరోసారి రచ్చబండ వద్ద నోరు మెదిపావంటే మక్కలిరిసి నదిలోకి విసిరేస్తామని హెచ్చరించి వెళ్లిపోయారు.
వీరేసుకు వారి పై కోపం రాలేదు. పులిరాజు మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నోళ్లు. ఆడు ఏది సెబితే అదే సేస్తారనుకున్నాడు. ఊరి పెద్దమనుషు లు ఏదో ఒక రోజు తనను చంపేసి శవం కూడా దొరక్కుండా చేస్తారని వీరేసుకు తెలుసు. ఒంటరోడు, పెళ్లామా,పిల్లలా ఉండిమాత్రం ఉద్ధరిం చేదేముంది. కానీ సచ్చే ముందు ఊరోళ్ల కళ్లు తెరిపించాలి, ఊరి పెద్దల అటవిక న్యాయానికి బ్రేకేయాలన్నది వీరేసు ఉద్దేశం. కానీ అందుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఎండమండిపోతోంది. నాలిక పిడచకట్టుకుపోతోంది. పులిరాజు మనుషులు కొట్టిన దెబ్బలకు శరీరం అక్కడక్కడా చిట్లి రక్తం వస్తోంది. కానీ ఆ బాధకంటే ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నానన్న బాధే వీరేసును ఎక్కువ ఆవేదనకు లోను చేస్తోంది.
“రేపో నేడో తన ఇంట్లో మళ్లీ గంజాయి దొరుకుతుంది. లేకపోతే విలువైన కలప దొరుకుతుంది. అదేదీ కాకపోతే కోటేసు, పులిరాజు,నాయుడు… ఇలా ఎవరో ఒకరి ఇంట్లో డబ్బు, బంగారం పోతాయి. పోలీసులు వస్తారు. అవి తన గుడిసె పెనకలోనో, వంటగదిలోనో, అరుగు కింద కప్పేసి ఉండగా దొరుకుతాయి. తనను తీసుకువెళతారు. ఎప్పటిలాగే మళ్లీ రెండేళ్లో, మూడేళ్లో జైలు శిక్ష పడతాది. ఊరికి తన చీడ వదిలిందని పెద్ద మనుషులు పండగ చేసుకుంటారు. సోకులరాయుడు సోమేసు మరికొందరు ఆడవాళ్ల ఉసురుపోసుకుంటాడు. పెద్దమనుషులు తప్పుకట్టి తమ వాటాగా వచ్చిన డబ్బుతో తాగితందనాలాడతారు. ఇలాంటి అవకాశం మరొకసారి ఇవ్వకూడదు. ఆళ్లో, నేనో తేలిపోవాలి” అనుకున్నాడు వీరేసు.
*
ఏటి ఒడ్డున కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్న వీరేసుకు జైల్లో పరిచయం అయిన పెద్దాయన గుర్తుకు వచ్చాడు. రెండోసారి జైలుకు వెళ్లినప్పుడు ఎర్రజెండా పార్టీకి చెందిన ఓ వ్యక్తి మాటలు ఆసక్తిగా వినేవాడు.
“ప్రశ్నించడానికి ధైర్యం కావాలి. మేధావి తనం అక్కర్లేదు. విషయ పరిజ్ఞానం ఉంటే చాలు, గొప్ప చదువరి అయ్యుండక్కర్లేదు. మోతుబరి కానక్కర్లేదు. అన్యాయం అని చెప్పేందుకు నాలుగు మాటలు చెప్పగల టెంపరితనం ఉంటే సరిపోతుంది. అన్యాయంపై ఎలుగెత్తి చాటాలనుకున్నప్పుడు అందుకు ఒంటరి పోరాటానికైనా సిద్ధపడాలి. గొప్పగొప్ప చదువులు, ఉన్నత హెూదాలు, పరపతి పలుకుబడి మనిషి ఉన్నతికి దోహద పడతాయేమోకాని, కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని నిలువరించేందుకు ఉపయోగపడవు. అందుకు సాహసం కావాలి. అది కొందరిలోనే ఉంటుంది…. ఓ సందర్భంలో అతను చెప్పిన మాటలు అక్షర జ్ఞానం లేకపోయినా వీరేసు గుండెల్ని సూటిగా తాకాయి.
భూపోరాటాలు, ఉద్యమాలు జరిగేటప్పుడు అప్పుడూ టీవీల్లో ఆ పెద్దమనిషిని చూసేవాడు. ఏదో ఉద్యమంలో పాల్గొన్నాడని అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇప్పుడు నేరుగా పరిచయం కావడంతో అతనిపట్ల అభిమానం పెంచుకున్నాడు వీరేసు. ఓసారి ఒంటరిగా కూర్చుని అతనేదో రాసుకుంటూ ఉండగా కలిశాడు. తమ ఊరి పరిస్థితి వివరించాడు.
“మా ఆక్రందనలు ఎవరికీ వినిపించవు. జరిగే అన్యాయాలు ఎవరికీ కనిపించవు. ఘోరాలు చూడకు, వినకు, మాట్లాడకు అన్న అటవిక న్యాయం యథేచ్ఛగా సాగుతున్న పల్లెటూరు మాది. నాగరిక ప్రపంచంలోనే బతుకున్న అనాగరిక జీవితాలు మావి. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న భ్రమలో ఉంటూ పెద్దల సంకెళ్ల మధ్య నలిగిపోతున్న బడుగు జీవితాలు మావి. మా జీవితాల్లో ఎప్పటికీ మార్పురాదా సార్’…అని అమాయకంగా తన భాషలో ప్రశ్నించాడు.
అతను కాసేపు “అవునా” అన్నట్లు చూశాడు.
“ఈ రోజుల్లో కూడా ఇంకా మీరు ఏ రోజుల్లో బతుకుతున్నారయ్యా” అని ఆశ్చర్యపోయాడు.
“టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాక కూడా మీలో ఇంకా చైతన్యం రాలేదా” అని ప్రశ్నించాడు.
“ఊరిలో ఎక్కువ మంది బడుగు జనం సార్. మీరు చెప్పిన సదుపాయాలన్నీ కొందరికే పరిమితం. పైగా పెద్దలంటే భయం, తమకెందుకులే అన్న స్వార్థంతో తెలిసినా తెలియనట్టు నటించడానికి అలవాటు పడిపోయారు” అన్నాడు వీరేసు ఆవేదనగా.
“నువ్వూ ఆ ఊరివాడివే కదా” అన్నాడా వ్యక్తి.
సూటిగా వచ్చిన ఆ మాటతో కాస్త తడబాటుకు గురయ్యాడు వీరేసు.
“నువ్వూ ఆ ఊరివాడివే కదా అని అతను మళ్లీ అన్నాడు. మనకీ బాధ్యత ఉందనుకున్న వాడే అన్యాయాన్ని ప్రశ్నించగలడు. తప్పుని తప్పని చెప్పగలిగిన వాడే మొనగాడు. మగాడు. ప్రశ్నించాలన్న ఆవేశం ఉంటే సరిపోదు. అన్యాయమని ఎలుగెత్తి చాటాలన్న కసి, కోపం ప్రతిఒక్కరిలో నూ ఏదో ఒక సందర్భంలో పుడుతుంది. కానీ పరిస్థితులు, సర్దుకుపోయేతత్వం, మనం ఒక్కరం మాట్లాడితే మార్పు జరిగిపోతుందా అన్న మన స్తత్వం మనిషిని నడిపించినన్నాళ్లు ప్రశ్న గొంతుదాటి బయటకు రాదు. న్యాయానికి సమాధి కట్టేవారిని ఆపేవారూ ఉండరు. ఎవరో ప్రశ్నిస్తారని ఎదురు చూడకు. నువ్వే చొరవ తీసుకో” అంటూ ధైర్యం నూరిపోశాడు.
“వీరేసు తాను ప్రశ్నించిన సందర్భాలు, పెద్దమనుషులు వ్యవహరించిన తీరు, గతంలో జైలుకు వెళ్లడానికి, ఇప్పుడు తాను జైల్లో ఉండడానికి కారణం” అన్నీ వివరించి చెప్పాడు.
“ప్రశ్నించడం ఎంత అవసరమో, దాన్ని సరైన మార్గంలో తీసుకు వెళ్లడం కూడా అంతే అవసరం. ఈసారి అటువంటి అన్యాయం జరిగితే ఏం చేయాలో ఆ పెద్దమనిషి చెప్పాడు. కొండవాలుపాలెంకు దగ్గరలో నది ఆవల ఉన్న మరో ఊరిలో ఉన్న తమ పార్టీ నాయకుడి అడ్ర చెప్పి గుర్తుపెట్టుకోమన్నాడు. ఈసారి ఏ అవసరం వచ్చినా అతన్ని కలువు. నేను చెప్పానని చెప్పు. నీకు కావాల్సిన సాయం చేస్తాడు” అంటూ భుజం తట్టి పంపించాడు.
పులిరాజు మనుషులు కొట్టిన దెబ్బల బాధ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు నదిలో దిగి చల్లని నీటిలో సేదదీరుతున్న వీరేసుకు జైలులో పరిచయం అయిన ఆ పెద్దమనిషి మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే ఈదుకుంటూ ఆ ఒడ్డుకు చేరాడు. ఓ గంటపాటు ఇసుక పై దుస్తులు ఆరబెట్టుకు ని సదరు పెద్దమనిషి ఇచ్చిన అడ్రస్ గుర్తుకు తెచ్చుకుని ఆ ఊరెళ్లాడు. నిత్యం ఉద్యమాలు అంటూ తిరిగే ఆ వ్యక్తిని కలిశాడు. ఊరిలో జరుగుతున్న అన్యాయాలు, రచ్చబండ తీర్పులు, మానానికి విలువకట్టి అన్యాయానికి సమాధి కడుతున్న విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లాడు. అతని భృకుటి ముడిపడింది. తమకు సమీపంలో ఉన్న గ్రామంలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా ఇన్నాళ్లు తాము తెలుసుకోలేకపోవడం అతనికి సిగ్గనిపించింది. ఆగ్రహం, ఆవేశం వచ్చాయి. కానీ సంయమనంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నాడు. వీరేసును పలు వివరాలు అడిగి రాసుకున్నాడు.
సత్తెలు, ఆమె మొగుడితో కూడా ఫోన్లో మాట్లాడాడు. తొలుత వారు చెప్పడానికి నిరాకరించారు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వమని, నీ కూతురికి అన్యాయం చేసిన వాడితో పెళ్లి జరిగేలా చేస్తామని సత్తేలుకు వీరేసుతోపాటు ఉద్యమనేత ధైర్యం చెప్పారు. కూతురి జీవితం బాగుపడుతుందన్న ఆశ కలగగానే సత్తెలు నోరు విప్పింది. జరిగిన అన్యాయం దంపతులు వివరించారు. సుజాతతో కూడా మాట్లాడాడు.
*
వీరేసు ఉద్యమ నేతను కలిసి వచ్చి రెండు రోజులు గడిచిపోయాయి. అతను ఏం చేస్తాడో వీరేసుకు తెలియదు. కానీ ఏదో ఒకటి చేస్తాడని మాత్రం అతని మాటలను బట్టి గ్రహించాడు. అదే సమయంలో ఈ వ్యవహారంలో ఏం జరిగినా ఆ తర్వాత తన జీవితం ముగిసిపోయేందుకు ఎక్కువ సమయం పట్టదని వీరేసుకు అనిపించింది. కానీ ఊరిలో జరుగుతున్న అన్యాయాలు బయట ప్రపంచానికి తెలిస్తే చాలు. తనకు ఏమైనా పర్వాలేదనుకున్నాడు. అందుకే ధైర్యంగా ఉన్నాడు.
వీరేసు నమ్మకం నిజమయింది. ఇప్పుడు ఊర్లోకి పోలీసులు, మీడియా వాళ్లు వచ్చారనగానే ఆ పెద్దమనిషి ఏదో చేశాడని అతనికి అర్థమయ్యిం ది. ఊరిలో హడావుడి మొదలైన కాసేపటికి తానూ పులిరాజు ఇంటి ముందుకు వెళ్లాడు.
“మానానికి విలువ కట్టిన పంచాయతీ పెద్దలు” అన్న శీర్షికతో అన్ని పత్రికలు ఆ రోజు అచ్చేశాయని తెలిసింది. వీరేసు మనసు ఉప్పొంగిపో యింది. ఉదయం నుంచి టీవీ చానళ్లలో కూడా ఆ వార్త వస్తోందని, పోలీసులు, మీడియావాళ్లు అందుకే వచ్చారని తెలియగానే వీరేసు మనసు సంతోష సాగరమయ్యింది. ఇక పై పెద్దమనుషుల ఆటకట్టు కావడం ఖాయమని అనుకున్నాడు.
*
పులిరాజు ఇంట్లో హడావుడిగా ఉంది. కోటేసుతోపాటు ఊరి పెద్దమనుషులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వైపు కోటేసు భయంతో చూస్తున్నాడు.
“అనుకున్నంత సేసాడు గాడిద కొడుకు. ఇదెక్కడికి తీసుకెలతాదో, ఇప్పుడేటి సెయ్యాలో అర్థం కావడం లేదు”…కోటేసు, పులిరాజు తర్జనభర్జన పడుతున్నారు.
అప్పటికే రచ్చబండ తీర్పుల పేరుతో పంచాయతీ పెద్దలు చేసిన నిర్వాకాలు తెలుసుకున్న ఎన్ఐ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. అది ఎంతటి నేరమో తెలియజేస్తూ ఇంకా మీరు ఏ కాలంలో బతుకుతున్నారంటూ గడ్డి పెట్టాడు. పులిరాజు, కోటేసు, మిగిలిన పెద్దమనుషులకు తలకొట్టేసినట్టుంది. కానీ ఆ పరిస్థితుల్లో తామేం మాట్లాడినా ఇబ్బందే అని మౌనంగా ఉన్నారు.
“విషయం పత్రికలకు ఎక్కిన తర్వాత క్రిమినల్ కేసు తప్పదు. ఇదేమీ మొదటిసారి జరిగింది కాదని, గతంలో కూడా చాలాసార్లు జరిగాయని ఊరివాళ్లు కూడా చెబుతున్నారు. అంటే పాతకేసులన్నీ తవ్వితీయాల్సి వస్తుంది. కేసు పెడితే తప్పు చేసిన వాడే కాదు, దాన్ని సమర్థించిన మీరు కూడా జైలుపాలవుతారు. తొలితప్పుగా దీనికి కలరింగ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడాలంటే వారిద్దరికీ పెళ్లి చేయడం ఒక్కటే మార్గం. ఆ పనిచేస్తే మీ మీదకు ఏమీరాకుండా ఈసారికి నేను చూస్తాను. ఇక పై ఇటువంటి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ మంచి కోరి చెబుతున్నాను. లేదు కేసులు, కోర్టులు అని అనుకుంటే ముందు అరెస్టు చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ముందు కొన్నాళ్లయినా జైలులో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం’…ఎన్ఐ సుదీర్ఘంగా విడమర్చి చెప్పాడు.
జైలు అనగానే కోటేసు, పులిరాజుతోపాటు రచ్చబండ పెద్దలందరి కాళ్లు వణికాయి. చెమటతో వారి శరీరాలు తడిసిపోతున్నాయి.
“మీరే మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కించండి” అంటూ పులిరాజు వారిని బతిమిలాడుకున్నాడు.
దీంతో ఏం చేయాలి, మీడియాకు ఏం చెప్పాలి, జరిగిన దాన్ని తిమ్మినిబమ్మిని చేసి ఎలా చెప్పాలో వివరించి పోలీసులు వెళ్లిపోయారు. రెండు రోజుల్లో సోమేసు, సుజాతల పెళ్లి రిజిస్ట్రారాఫీసులో జరిగిపోయింది. పెళ్లి ఫొటోలు పేపర్లకు పోలీసులు విడుదల చేయడంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసిపోయింది.
ఆ ఘటన ఊరిలోని ఆడపిల్లల తల్లిదండ్రుల్లో సరికొత్త నవోదయాన్ని తీసుకువచ్చింది. అన్యాయం జరిగినప్పుడు ఏంచేయాలో అర్థమయ్యింది. జీవితాంతం భయపడేకంటే ఒక్కసారైనా తెగిస్తే ఊరు బాగుపడుతుందని ఎవరికి వారే అనుకున్నారు. వీరేసును ఊరివాళ్లంతా అభినందనలతో ముంచెత్తారు.
“నా కూతురి జీవితాన్ని నిలబెట్టిన దేవుడురా నువ్వు” అంటూ సత్తెలు, దాని మొగుడు ఆకాశానికి కెత్తేశారు.
సుజాతకు న్యాయం జరగడంతో తన తమ్ముడు వీరేసు ఊరిలో హీరో అయిపోయాడని సీతాలు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. అదే సమయంలో ఊరి పెద్దలు ఊరుకుంటారా అన్న ఆందోళన ఆమెను భయ పెట్టింది. తమ్ముడిని తన వద్దకు వచ్చేయమని కోరింది. కానీ వీరేసు అంగీకరించ లేదు. భయపడుతూ ఎన్నాళ్లు బతుకుతామని, నా గురించి ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పేశాడు.
అక్కడికి నెల రోజుల తర్వాత నదిలో పడవ బోల్తా పడి వీరేసు చనిపోయాడు. ఈత రాకపోవడంతో వీరేసు చనిపోయాడని, మిగిలిన వాళ్లంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారని ప్రచాం జరిగింది.
ఊరివాళ్లంతా అయ్యో అనుకున్నారు. తమకు ఓ మంచి దారి చూపించి తాను కనుమరుగైపోయాడని బాధపడ్డారు.
ఆ పడవలో ఉన్నది వీరేసు, పులిరాజు మనుషులు మాత్రమేనని ఎవరికీ తెలియదు.
అదేరోజు రాత్రి పులిరాజు, కోటేసు, ఇతర పెద్దమనుషులు ఇంట్లో మందుపార్టీ చేసుకుంటూ చీర్స్ చెప్పుకున్నారు.
“ఊరికి పట్టిన శని విరగడై పోయింది’ అని మద్యం మత్తులో ఖుషీ అయిపోయారు.
కానీ వారికి తెలియనిదల్లా “ఊరి పెద్ద మనుషులను ఎదిరించిన వ్యక్తి నదిలో శవమై తేలాడు” అని మరునాడు పేపర్లలో వస్తున్న విషయం. ఆ వార్త ఎవరిని ఎక్కడికి తీసుకువెళుతుందో కాలమే నిర్ణయిస్తుంది.
*
కధ చాలా బాగుంది రచ్చ బండ తీర్పులు మారు మూల గ్రామాలలో జరిగే అన్యాయాలను దానికి పరిక్షరాలు బాగా వ్రాసారు రచయిత సెల్ నెంబర్ కావాలి