పొగరాయుళ్ళ అన్వేషణ!

ప్రింట్ మీడియాలో కథకు, వ్యాసానికి ఎలా ఎత్తుగడ, మిడిల్, క్లోజింగ్ ఉంటాయో.. రేడియోలో ఫీచర్ కు కూడా  ఆ రకమైన ఎత్తుగడ అవసరం.

న్ను ధూమపాన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  ఒక ఫీచర్ చేయమని మా డ్రామా ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ చెప్పారని చెప్పాను కదా. ఆ ప్రోగ్రాం ఎక్సిక్యూటివ్ నల్లూరి బాబూరావుగారు..అప్పటికి నేను చేరి నాలుగైదు నెలలే అయింది.ఇంకా ప్రోగ్రాం ప్రొడక్షన్ మీద అవగాహన లేదు. డ్యూటీరూం వర్క్ మాత్రమే అలవాటు అయింది.

ఇక ఈ ఫీచర్ ఎలా చేయాలా అని మధనపడుతున్న సమయంలో “రేడియో రామం”గా పేరొందిన ఎస్.బి.శ్రీరామ్మూర్తి గారు నా అవస్థ గమనించి విషయం తెలుసుకున్నారు. వారికి నా అవగాహన, ఎదురవుతున్న అవస్థ చెప్పాను.

వారు నన్ను గైడ్ చేశారు. ముందుగా స్మోకింగ్ చేస్తూ ఆ అలవాటు వదల్లేని వారిని కొంతమంది ఎంచుకున్నాను.

ఆ తర్వాత ఆ అలవాటు లోంచి బయటపడినవారిని ఎంచుకున్నాను.ఆ అలవాటు వదుల్చుకోవాలంటే ఏంచేయాలో చెప్పే ఒక డాక్టర్ ను ఎంచుకున్నాను. ఇప్పటిలాగా అప్పట్లో ఫోన్ లో ఎవరినైనా రికార్డు చేసే సదుపాయం లేదు. ఎవరైనా స్టూడియో కి రావాల్సిందే. వీటిని OB Voices అనేవాళ్ళం. ఈ వాయిసెస్ ఎంపిక చేయటానికి, తరువాత రికార్డు చేయటానికి ఆఫీస్ సహచరులు తోడ్పడ్డారు.

కరెక్ట్ గా మరుసటి రోజు ఉదయం 7గం.15ని.లకు ప్రసారం చేయాలి.రేడియో ఫీచర్ లో మనం రికార్డు చేసుకున్న ఈ వాయిసెస్ ని కలుపుతూ ఒక లింక్ స్క్రిప్ట్ రాసుకోవాలి.నా అదృష్టం కొద్దీ ఆరోజు రామం గారు ఈవెనింగ్ ట్రాన్సిమిషన్ లో ఉన్నారు.ఆయన రాత్రి 8గం.45ల నుంచి 9గం.15వరకు నేషనల్ బులెటిన్స్ ఉంటాయి.ఆ సమయంలో నేను రాసిన లింక్ స్క్రిప్ట్ చదివి పెట్టారు.ఆ తర్వాత 9గం.30ని.లనుంచి పదకొండు గంటలవరకు నేషనల్ ప్రోగ్రాం ఆఫ్ మ్యూజిక్ ఢిల్లీ నుంచి రిలే ఉండటంతో నా ఫీచర్ ఎడిట్ చేశారు.రేడియో భాషలో చెప్పాలంటే డబ్బింగ్ చేశారు.దాని వ్యవధి ఇరవై నిమిషాలు.. అలా నేను రామం గారి సహాయంతో రూపొందించిన మొదటి కార్యక్రమం ప్రసారమయింది. కొత్తకుర్రాడు బానే చేశాడన్నారు. నిజానికి నన్నా టెన్షన్ బయటపడేసి నాకో మార్గం చూపింది రామం గారే. 

రేడియో ప్రసారాలలో ఒక అంశం మీద శ్రోతలకు ఒక కార్యక్రమం ప్రసారం చేయాలంటే దానిని వివిధ రూపాల్లో చేయవచ్చు. వాటిని ఫార్మాట్స్ అంటారు.అవి ప్రసంగాలుగాను ,పరిచయాలుగాను, రూపకాలు(వీటినే ఫీచర్ అంటారు), నాటికలు, పాటలు ఇలా వివిధ రూపాల్లో ప్రసారం చేయవచ్చు..

నేను రూపొందించింది రూపకం లేదా ఫీచర్ ఫార్మాట్.

ప్రింట్ మీడియాలో కథకు, వ్యాసానికి ఎలా ఎత్తుగడ, మిడిల్, క్లోజింగ్ ఉంటాయో.. రేడియోలో ఫీచర్ కు కూడా  ఆ రకమైన ఎత్తుగడ అవసరం. ఆ ఎత్తుగడ చాలా సందర్భాల్లో ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. ఆ సంభాషణ ఎంచుకున్న సబ్జెక్టు మీద ఉంటుంది.రెండు, మూడు నిముషాలుగా సాగే ఆ సంభాషణ లోంచి కొంత నేపథ్య సంగీతం వస్తుండగా నేరేటర్ గంభీరమైన గొంతుతో ఆ సబ్జెక్ట్ మూలాల్లోకి వెళుతుంటాడు. ఒక్కసారి ఈ నేరేషన్  ఒక మగ గొంతు, ఒక స్త్రీ గొంతు రూపంలో ఉంటుంది.

మధ్య మధ్యలో ముందు చెప్పుకున్న OB Voices ని చక్కటి లింక్ తో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఆ సబ్జెక్ట్ తగ్గ మూడ్ మ్యూజిక్ కూడా అవసరం.

రేడియోలో ఒక్కసారి ఒక ముఖ్యమైన ఫంక్షన్ కవర్ చేసినప్పుడు రేడియో నివేదికగా ప్రసారం చేస్తారు. విజయవాడలో డ్రామా పెక్స్ గా ఉన్న పి.పాండురంగారావు గారు ఫీచర్లు కూడా చూసేవారు.1990మే లో విజయవాడ లో పెద్ద తుఫాను వచ్చింది. మేం యంగ్ డ్యూటీ ఆఫీసర్లం రాజారెడ్డి,పిజికె మూర్తి, నాగేశ్వరరావు, అబ్దుల్ ఖుద్దూస్, సిహెచ్.మహేష్ ఇలా కొంతమందిమి ఉండేవాళ్ళం. ఆ తుఫాన్ వచ్చినప్పుడు భారతీయ వాయు సేన రిలీఫ్ కార్యక్రమాల్లో పాల్గొంది.హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందచేసేవారు. వారి ఇంటర్వ్యూలు, ఎవరికైతే రిలీఫ్ మెటీరియల్ అందిందో వారి ఇంటర్వ్యూలు ప్రసారం చేశాం.

వాయుదూతల చేయూత అని మేమందరం ఫీచర్స్ చేశాం.

  • అదొక్కటే కాదు కృష్ణాజిల్లా లో ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలున్నాయో వెళ్ళి, అక్కడి వారి సమస్యలు రికార్డు చేసి, వాటి ఆధారంగా అధికారులను వారు చేపట్టిన రిలీఫ్ కార్యక్రమాలను రికార్డు చేసి ప్రసారం చేసేవారం.ఇలా ప్రజల్లోకి వెళ్ళటం, వారి ఇబ్బందులు, సమస్యలు రికార్డు చేయటం మా బాధ్యత కూడా..

ఆరోజుల్లో రేడియో ఒక శక్తివంతమైన ప్రధాన మాధ్యమం.వార్తాపత్రికలతో పోటీ పడుతూ ఉండేది.

నేను చేరిన 1988 తొలి రోజుల్లో మా చుట్టాలింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడిని.వాళ్ళుండేది సత్యనారాయణపురం దాటి ముత్యాలంపాడు.నేను ఉదయం ఆరు గంటలకు రిక్షాలో వస్తుండేవాడిని.ఇక్కడో విషయం చెప్పాలి.విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలను ప్రైమరీ ఛానెల్ గా పేర్కొనేవారు. వివిధభారతిని వాణిజ్య ప్రసార విభాగం గా పేర్కొనేవారు.ఏ కేంద్రం ఉదయం 5గం.55ని.లకు ప్రసారాలు ప్రారంభించేది.. వివిధ భారతి 6గం.55ని.లకు ప్రసారాలు ప్రారంభించేది..

 వివిధభారతి ఛానెల్ ఉదయం ప్రసారం డ్యూటీకని ఆరు గంటలకు బయల్దేరే వాడిని. అలా వస్తుంటే దారి పొడుగునా భక్తిరంజని అనంతరం పొలం కబుర్లు వినిపిస్తూ ఉండేవి..అంటే అప్పటికి దూరదర్శన్ ఒక్కటే టీవీ ఛానల్.. కేబుల్ ప్రసారాలు ఇంకో మూడేళ్ళకు కానీ మొదలవ్వలేదు..అందరిళ్ళలోనూ లేవగానే రేడియో ఆన్ చేసి భక్తిరంజని వింటూ ఇతర పనులు చేసుకుంటూ ఉండేవారు..

విజయవాడ రేడియోకి సంబంధించి స్టూడియో బందర్ రోడ్డు మీద ఉండేది. రేడియో ప్రసారాలు సెట్ లో వినపడాలంటే ట్రాన్సిమిటర్ ఉండాలి.అప్పట్లో ప్రసారాలన్నీ మీడియం వేవ్ రూపంలో ఉండేవి.ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎఫ్.ఎమ్.రేడియో స్టేషన్ రాలేదు.మొదటి ఎఫ్ ఎం రేడియో కేంద్రం కొత్తగూడెం లో ఏర్పాటు చేశారు 1989మార్చి 24న..ఆ కేంద్రం ప్రారంభంలో నన్ను టూర్ మీద కొత్తగూడెం మా స్టేషన్ డెరైక్టర్ పంపించారు..అది మరోసారి చెప్పుకుందాం..

విజయవాడ నగరం గొప్ప రైల్వే కూడలి అని తెలుసు కదా.

ఆ స్టేషన్ అధికారులు మాకు ప్రతిరోజూ రాత్రి వివిధ రైళ్ళలో ఉన్న బర్తు వివరాలను మాకు అందచేస్తూ ఉండేవారు.

అలాగే ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విజయవాడకి వచ్చే రైళ్ళ రాకపోకల వివరాలు అనౌన్స్ చేసేవాళ్ళం.రైళ్ళ సమయాలు ఉదయం జాతీయ వార్తల ముందు, మధ్యాహ్నం ప్రాంతీయ వార్తల ముందు, మళ్ళీ రాత్రి జాతీయ వార్తల ముందు చెప్పేవారం.. ఎప్పుడైనా రైల్వే వారు మర్చిపోతే మేమే రైల్వేస్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం తీసుకునే వారం.ఆరోజుల్లో రేడియోలో వచ్చే వాతావరణ సూచనలు, హెచ్చరికలు ప్రజలు జాగ్రత్తగా వినేవారు. ఇప్పటిలాగ అప్పుడు గూగుల్ లేని కాలం కదా.

అప్పట్లో రేడియో యే గూగుల్.రేడియోలో వచ్చే వాతావరణ సూచనల మీద కార్టూన్లు కూడా వేస్తుండేవారు.. నిజానికి అది రేడియో పాపులారిటీ కి నిదర్శనం..1988డిసెంబర్ చివరి లో విజయవాడ లో కర్ఫ్యూ విధించినప్పుడు ఏమయిందంటే —వచ్చే సంచికలో!

*

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు