‘పేకాట బాగోతం’ వెనక కబుర్లు

థ ఒక కళారూపం. తరచి చూడాలే గానీ కథ అద్దంలో కొండంత విశాలమైన జీవితం ప్రతిబింబిస్తుంది. సామాజిక చరిత్ర అవగతమౌతుంది. అందుకే కథంటే ఇష్టం. నా అధ్యయన కాలంలో తెగ చదివేవాడిని. అంతర్లీనంగా భవిష్యత్‌లో కథారచయిత కావాలని ఉండేది. రాసే ప్రయత్నం చేయలేదు. నిర్దిష్టమైన సామాజిక దృక్పథం నిబద్ధత గల తాత్విక ఆలోచనల్ని అధ్యయనం ద్వారా పొందొచ్చు. నేనే ఉదాహరణ. ఇంట్రావర్ట్‌ను. ఇల్లు, ఉద్యోగం బాధ్యతలు తప్ప మనుషులతో పెద్దగా కలిసేవాడిని కాదు. సాహిత్యం ద్వారానే మనుష్యుల స్వభావం, విభిన్న ప్రాంతాల వ్యక్తులు, యాసలు, సామాజిక జీవనం,  సంప్రదాయాలు, ఆచారాలు  తెలిశాయి. లౌకిక వ్యవహారాలు నెమ్మదిగా అర్థం చేసుకున్నాను. నేనలా ఉండటానికి కారణం నేను పెరిగిన విధానం. కథను చెప్పడంగా గాక దృశ్యమానం చేయాలి. ఆ దృశ్య పరంపర మన మనో యవనికపై ఆవిష్కృతమవ్వాలి. కథలు చదివేవాడిని గానీ కవిత్వం జోలికి పోలేదు.

అయితే 1992లో శివారెడ్డి, అఫ్సర్‌, సీతారాం. యాకూబ్‌ బృందం శిఖామణితో కలిసి యానాం వచ్చిన సందర్భం నన్ను కవిని చేసింది. నా తొలి కవితాసంపుటికి శీర్షికనిచ్చి ముందుమాట రాసిన అఫ్సర్‌ ‘చాలా కొద్ది సమయంలోనే దేవదానం రాజు ఆధునిక భావాభివ్యక్తికి చేరువయ్యారు’ అన్నారు. ఆత్మవిశ్వాసం కలిగింది. ముందుగా సాహిత్యలోకానికి కవిగా తెలిశాను. సాహితీవేత్తల పరిచయంతో పాటు అధ్యయన సౌభ్యాగ్యం వల్లే రచయితను కాగలిగాను. వాస్తవ జీవితంలోని ప్రతి సంఘటన కథగా మారదు. అభిరుచి తోడై అనుభవం లోంచి మాత్రమే ఉత్తమంగా కథారూపం తయారవుతుంది. ఒకానొక సందర్భంలో అసహనం, ఆవేశం, ఆగ్రహం ముప్పిరిగొని నాచే కథ రాయించింది. నా తొలి కథ ‘పేకాట బాగోతం’ ముచ్చట ఆసక్తిదాయకమే. జీవిత కాలం వెంటాడేదే. ఆ కథ 26 ఫిబ్రవరి 1988లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించారు.

పేకాట వ్యసనం కాదు నాకు. సెలవు రోజున కాలక్షేపం కోసం అపుడపుడు చతుర్ముఖపారాయణంలో సరదాగా కూర్చునేవాడిని. ఆంధ్రజ్యోతి వారపత్రికలో మహబూబ్‌ ఆలీ పేకాట గురించి వ్యాసాలు రాశారు. పేకాటలో లబ్ధికి చిట్కాలు చెప్పారు. దాంతో పాటు అధికారులు, పెద్దలతో డబ్బు పెట్టి పేకాట ఆడకూడదని డబ్బు గెలిస్తే ఇబ్బందులు వస్తాయని మొహమాటానికి వాళ్ళ సంతృప్తి కోసం ఓడాల్సి  వస్తుందని చెప్పారు. నేను పాటించలేదు. పెద్దలతోనే ఆడేవాడిని. అందరి కంటే వయసులో చిన్నవాడిని. వారి పిల్లలు నాతో చదువుకున్నవారు.

ఆదివారం. సన్నగా వాన పడుతున్న వేళ.  జట్టు నుంచి పిలుపొచ్చింది. వెళ్ళాను. ఆడాను. ఒక్క ఆట కూడా తిప్పలేదు. పదమూడు ముక్కలు నాతో ఆడుకున్నాయి. ఫలితంగా చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. బుర్ర వేడెక్కింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున లేచి కథ రాసేశాను. బతుకు( లైఫ్‌) పండక ఏడిపించిన పెయిర్స్‌ వివరాలు కూడా కథలో జొప్పించాను. ఆల్‌ కౌంట్‌ ఇచ్చిన సందర్భాల్ని నమోదు చేశాను. పోయిన సొమ్ము బ్యాంకులో దాచుకున్నానని పారేసినచోటే వెతుక్కోవాలని తిరిగి పేకాటలో రాబట్టుకోవాలని ఎలాగైనా పేకాటకు పెద్దల్ని ప్రేరేపించాలని సంకల్పం చెప్పుకున్నాను. అదే ముగింపుతో కథ పూర్తి చేశాను. అయితే ఆ కథలో పాత్రల పేర్లను యథాతథంగా రాశాను. నిజమైన పేర్లు రాస్తే ప్రచురణ జరిగితే వాళ్ళ పేర్లను అచ్చులో చూసుకుని సంతోషిస్తారని భావించాను.  అదెంత తప్పుడు పనో క్షోభకు కారణమైందో అనుభవంలోకి వచ్చింది.

కథను ఆంధ్రజ్యోతి వీక్లీకి పంపాను. అపుడు పురాణం సుబ్రహ్మణ్యం గారు సంపాదకులు. ఎంతమాత్రం ఆలస్యం కాకుండానే ఆయన దగ్గర్నుంచి వీలు వెంబడి ప్రచురిస్తామని స్వహస్తంతో రాసిన పోస్టు కార్డు అందింది. ఆనాటి రోజుల్లో అట్లాంటి సంప్రదాయం ఉండేది. అంతే…సంబరం అంబరం తాకింది. ఎగిరి గెంతేశాను. ఊరూ వాడా ప్రచారం చేశాను. నిర్లిప్తంగా చూసినవాళ్ళూ భుజం తట్టినవాళ్ళూ ఉన్నారు. ఆ రోజు నుంచి వారం వారం ఎదురుచూపులు. కథ రాకపోవడంతో నిరాశ పడ్డాను. కథ అచ్చయ్యేంత వరకు ఏమీ రాయకూడదనుకున్నాను. సంవత్సరం గడిచింది. కథ వెలుగు లోకి రాలేదు. చిరాకు, కోపం, దిగులు ఏకకాలంలో అనుభవించాను. ఏవో కారణాలతో ఇక ప్రచురణ కాదేమోనని సంశయం పీడిరచింది.

ఇక ఆగలేక పోయాను. ‘నాలోని కథకుడ్ని చంపేస్తారా?’ అని పురాణం వారికి ఉత్తరం రాసి తేలిక పడ్డాను. విచిత్రంగా మరో రెండు వారాల్లో నా పేరు పెద్ద అక్షరాలతో ముద్రించి కథ ప్రచురించారు. అపుడు ఫోన్లు అందుబాటులో లేనందున చదివినవారి స్పందన తెలియరాలేదు. కానీ ఒక ఆపద ముంచుకొచ్చింది.

మా బృందంలో వెంకన్నబాబు గారు నాకు అన్నయ్య వరుస. ఆయన కొడుకు నాతో చదువుకున్నాడు. స్నేహశీలి. కుర్రాళ్ళో కుర్రాడిగా సరదాగా ఉంటారు. చనువుగా మాట్లాడుకుంటాం. డబ్బులు పోవడంతో నిమిత్తం లేకుండా పేకను ఇష్టపడతారు. విజయనగరంలో ఉండే ఆయన బంధువు కూతురు కథలో ఆ పాత్ర మీరే కదా అని అడిగిందట. అంతే…ఆయనకు కోపం నషాళానికి అంటింది. అవధులు దాటింది. రుసరుసలాడారు. తిట్టారు. ఇక నాతో మాట్లాడటం మానేశారు. ఎంతో అభిమానించే ఆయన నేను కనిపిస్తే చాలు ముఖం తిప్పుకునేవారు. చూడటానికే ఇష్టపడేవారు కారు. మానసికంగా కలత చెందాను. ప్రసన్నం చేసుకోడానికి పరిపరి విధాల ప్రయత్నించాను. ఆఖరికి యానాంలో ఇల్లు కట్టుకున్నపుడు కూడా చూడటానికి రాలేదు. ‘మనం ఇంట్లో కూచుని ఆడుకుంటున్నాం… సరే…అది లోకానికి చెప్పాలా?’ ఇదీ ఆయన బాధ. నిజానికి కథలో ఆయనను ఎంతమాత్రం అగౌరవపరచలేదు కించపరచలేదు. చనిపోయే పర్యంతం నన్ను ఆయన క్షమించలేదు. పేకాట బాగోతంను ఆయన కథగా చూడలేదు. అందరూ చదివే వార్తగా చూశారు. అదీ సంగతి.

వాస్తవ సంఘటనకు కల్పన జోడిరచి కథ రాయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోకపోతే జీవితకాలపు అపరాధంగా మిగిలిపోతుంది. అయినవాళ్ళతో స్పర్ధలు వస్తాయి. ఈ సంఘటన కథ రాసేటపుడు ఒక మెలకువతో ఉండాలనే గుణపాఠం నేర్పింది. మరెప్పుడూ అలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుని  కథలు రాశాను. సుమారు వంద కథలు రాసినప్పటికీ తొలికథ అనుభవం నన్నెప్పుడూ కుదుపుతుంది.

             *

దాట్ల దేవదానం రాజు

2 comments

Leave a Reply to Koradarambabu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఈ కథ, అందులో పాత్రలు నాకు పరిచయమైనవే.అనంతర కాలంలో రాసిన కథల్లో పాత్ర లు కూడా ఎరిగినవే.ఐతే మొదటి కథలో చేసిన ప్రయోగం మళ్ళీ చేయకపోయినా ఇది నన్ను గురించి రాసారు అని అనుకున్నవారు కూడా ఉన్నారు.
    జ్ఞాపకాలు తడుముకోవడం బాగుంది.
    సారంగ బృందానికి, మీకు అభినందనలు.

  • కధాంశం చాలా బాగుంది. కధ చదినంతసేపు ఇంట్రస్ట్ గా సాగింది. అయితే టైటిల్ మారిస్తే బాగుణ్ణు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు