“పెద్దక్కో ఉద్దానం సూడు – సిన్నక్కో దాని అందం సూడు
బెండి కొండా నుండి పెద్ద కొండా దాక
వజ్రాలు… కొత్తూరు, బారువా తీరాలు …
ఆ నడుమ ఈ నేలొక ఉద్యానవొనమో…
ఒకనాడు…ఈ నేల సహజ సౌందర్యమై,
పులకించి పొర్లినా సౌగంధ ద్రవ్యాలు…
నావలై ,నువ్వలా రేవంట నడిచెళ్ళినాయంట”
ఆ ఉద్దానం, ఆ ఉద్యానవొనం,ఆ ఉద్యమాల వొనం ఇపుడు స్మశానమయిపోనాది. తితిలీ తుఫాను ఉద్దానం తిత్తి తీసీసింది. తీరమంతా రాకాసి సుడిగాలి సుట్టీసినాది. ఆకుపచ్చ తోటలు మట్టిల కలిసిపోనాయి. కొబ్బరి సెట్ల తలలు తెగిపోనాయి. జీడి సెట్ల మొదుళ్ళూ,కుదుళ్ళూ యెక్కిపోనాయి. అరిటిసెట్ల నడుములిరిగిపోనాయి. పిట్టాపిచుకలు, గొడ్డూగోదాలు, గొర్రెలూ,మేకలూ…సమస్త జీవరాశీ బిక్కమొగాలేసి దిక్కుల్ని సూసేయి…ఆరుగాలపు కష్టమే కాదు భవిష్యత్ బతుకూ నేలపాలయిపోయి … దిగాలుగా, దీనంగా, చీకటిలో శోకిస్తున్నదిపుడు ఉద్దానం జనజీవనం!
నాయినలారా…ఒకనాడు…ఈ నేల సహజ సౌందర్యమై, పులకించి పొర్లినా సౌగంధ ద్రవ్యాలు…నావలై ,నువ్వలా రేవంట నడిచెళ్ళినా ప్రాంతమ్మాత్రమే కాదు… పోరుబాటలేసిన నేల. జమీందారీ సాగడానికి వొళ్ళ గాదని రైతు రక్షణ యాత్ర సేసిన నేల. తరాత రైతాంగ పోరాటానికి నెత్తురు పోసిన నేల.సుబ్బారావు పాణిగ్రాహి జముకు మోగిన నేల. తామాడ గణపతీ, పంచాదీ మొదలుకొని మొనమొన్నటి బెజ్జంగి అమరుల దాకా త్యాగాల దండు కదలిన నేల! నిత్యమూ బతుకొక యుధ్దమయిన నేల! క్షతగాత్ర నేల!
పది రోజులయ్యింది…పడిపోయిన సెట్లలగే మూలగతన్నాయి. కూలిపోయిన ఇళ్ళలగే కుములుతన్నాయి. విరిగిపోయిన విద్యుత్ స్తంభాలలగే ఊగతన్నాయి.యేడుస్తన్న గొంతులలగే యెడస్తన్నాయి. తితిలీ తుఫానెలిపోయింది గానీ … ఇళ్ళల్ల దీపాల్లేవు. పడిపోయిన విద్యుత్ స్తంభాల్ల ఒక్కదాన్నయినా లేపలేదు. రూపాయి కొవ్వొత్తి పది రూపాయిలయ్యింది. అగ్గిపెట్టి అయిదురూపాయిలయ్యింది. మామూళు రోజుల్లోనే మంచి నీళ్ళకి మైల్లుకి మైల్లు పోయే జనాలిపుడు కన్నీళ్ళు తప్ప మంచినీళ్ళు దొరకడం లేదు. కూలిన ఇళ్ళ మధ్య, పడిపోయిన తోటల మధ్య ఒళ్ళంతా కళ్ళు సేసుకొని…ఆదుకొనే సేతుల కోసం పిల్లాదిమొదలు అందరూ ఆర్తిగా సూస్తండ్రు.
ముప్పయి,నలఫయి సమచరాల నించీ సెమటా నెత్తురు పోసినాం…తోటల్ని పెంచినాం. అవిపుడు కళ్ళముందర కూలబడిపోనాయి. మళ్ళా అంతకాలం దాకా మాకు తోటలుండవు. యెలాగ బతకాల? పడిపోయిన కొబ్బరి సెట్టుకి పరిహారమంతన్నారు గాని, మళ్ళా ఆ కొబ్బరి మొక్క నాటాలా? దాన్ని ముప్పయ్యేళ్ళు పెంచాలా? అసలీ తోటల్ని సదును సెయ్యడమెలాగ? కూలిన ఇంటిని మళ్ళా నువ్విచ్చిన పరిహారంతోటి కట్టగలమా? గోడలేనా లెగస్తాయా? తితిలీ మా ప్రేణాలు తీసీసినా బాగున్నని యేడుస్తున్న ఉద్దానాన్ని యెలా ఓదార్చగలం? యెలా మళ్ళా నిలబెట్టగలమ్? తుఫాను ఇలాగెళ్ళింది ముఖ్యమంత్రి అలాగొచ్చీసేడు. అతగాని యెనకాల మందీమార్బలం. ఆ తరాత బిళ్ళబంట్రోతు లేకుండా కార్ల నుంచి కాళ్ళివతలకి పెట్టలేని కలట్రులు, ఆర్డీవోలు,యెవుళెవుళొ వొచ్చీసినారు. యెలాగా ఇక్కడి యెమ్మెల్లేలు,యెంపీలు ఉంతారు. దండుకు దండు దిగిపోనారు. కార్లు,సైరన్లు…ఓటళ్ళు, లాడ్జింగులు…నిండిపోనాయి. దండిగ కర్సులు,కరమ్మత్తులు జరిగిపోతన్నాయి. పేపర్ల నిండా కనబడతండ్రు. టీవీల ఇనబడతండ్రు. తితిలీ తుఫాను సెయ్యగా మిగిలిన ధ్వంసాన్ని ఈళ్ళంతా సెయ్యడానికి కంకణాలు కట్టుకుని కష్టపడతన్నారు.
ప్రక్రుతిని మేనేజ్ చేసేను గానీ రాజకీయాల్ని మేనేజ్ చేయలేక పోతున్నానని మధ్య మధ్యన ముఖ్యమంత్రి పత్రికలోళ్ళ ముందర బాధ పడతాడు. పత్రికలు ముఖ్యమంత్రి బాధను తితిలీ బాధితుల బాధల కంటే అధికంగా రాసి లోకమ్మీదకి వొదిలేస్తారు.
సముద్రాన్నీ కంట్రోల్ చేస్తానంటాడు…ముఖ్యమంత్రి! జనసముద్రం గావోలనుకొని గబగబా ఆయుధాలు ఒట్టుకొని పోలీసు ప్రెభువులు ప్రెజానీకాన్ని కంట్రోలీ సేయిడానికి పూనుకుంతారు.
పడిపోయిన పంటకింతా, కూలిపోయిన సెట్టుకింతా, దానికింతా, దీనికింతా సాయం అని ప్రెబుత్వం ప్రెకటన సెయ్యిడిం ఆలిస్యిం – యెలాటి కండీసన్లెడదామా అని బుర్రలు బాదుకుంటారు అధికార్లు… మచ్చుకి…ఒకటొదుల్తారు- ఆధార్ కార్డు తీసుకు రా నాయినా అంతారు. అంతే…
తితిలీ తుఫానుని వేడుకోవాలి – తల్లీ, నువ్వన్నీ తీసీసుకున్నావు. తీసీసుకో. గానీ నీకు పనికిరాని ఆ ఆధార్ కార్డ్ మాత్రం ఇచ్చీవా అని!
ప్రాణం తప్పా అన్నీ పోయినాయి బావులూ … ఆధార్ కార్డులెలా తేగల్రని అనకండి. నీళ్ళేవు, పాల్లేవు, తిండీతిప్పల్లేవు…. ఇదేనా మీ మందంతా వొచ్చి సేసిన సాయిం అనకండి. పడిపోయిన తోటలలగే ఉన్నాయి, కూలిపోయిన ఇళ్ళలగే ఉన్నాయి. యెన్నాళ్ళిలాగ? యేదీ ప్రభుత్వం అననకండి.
ముఖ్యమంత్రి ఒప్పుకోడు. అధికార్లు ఇన్రు. పోలీసులు వొల్లకోరు! తితిలీ తుఫాను నిన్ను జీవశ్చవం చేసింది, వీళ్ళు శవాన్ని చేస్తారు.
అన్నీ రాజకీయం చేయడం అలవాటయిన నేతల పాలనిది. అధికార పక్షాన్ని ప్రతిపక్షం, వీళ్ళని వాళ్ళు,వాళ్ళని వీళ్ళూ చెరిగి పారీసుకోడానికి సందర్బాలు కావాలి వీళ్ళకు తప్పా విపత్తుల్లోన యెలాగ మనుసుల్ని, దేశాన్ని ఒడ్డెక్కించాలని సూడ్రు. గద్దె మీద ధ్యాస తప్ప గడ్డు బతుకుల మీద కాదు.
ఉద్దానమా…నువ్వు మళ్ళా ఉద్యానవొనమవ్వాలంతే – ఒకనాటి ఈ నేల…సహజ సౌందర్యాల, సౌగంధాల నేల, నావలై సాగిన నేల, పోరాట బాటలేసిన నేల…మళ్ళా నిలబడాలంతే- ఇపుడు ఉన్నదొకటే తోవ! ఉద్యమాల తోవ! ఉద్దానం కాదుర…ఉద్యమాల వొనం రా… అన్న పోరు గీతాన్ని మళ్ళా ఆలపించాల!
ప్రజల సాక్ష్యం
Mana Srikakulam basha lo. Chala baga vivarinchru mee kvitvaniki kalaniki Naa vandanalu guru
Thanq
ఎప్పటినాగే శానా బాగా రాసీసినావ్ బావ్ .
Thanq Bav